మన ‘సు’ కవి ఆచార్య ఆత్రేయ

0
3

[మే 7వ తేదీ ఆచార్య ఆత్రేయ జయంతి సందర్భంగా ఈ రచనని అందిస్తున్నారు కె. హరి మధుసూదన రావు]

[dropcap]కి[/dropcap]ళాంబి వేంకట నరసింహాచార్యులు ఈ పేరు చాలా కొద్ది మందికే పరిచయం ఉంటుంది. కానీ ఆత్రేయ అనగానే మనసు కవి ఆచార్య ఆత్రేయనా అని ఠపీమని అందరికీ గుర్తుకు వస్తుంది. తెలుగు సినీ పాటల ప్రపంచంలో మనసు అనే మాటకు పేటెంట్ అనేది ఉంటే అది ఆత్రేయకే దక్కుతుంది. మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే (ప్రేమ్ నగర్), మనసొక మధు కలశం (నీరాజనం), మౌనమె నీ భాష ఓ మూగ మనసా (గుప్పెడు మనసు), నాలుగు కళ్లు రెండైనాయి – రెండు మనసులు ఒకటైనాయి (ఆత్మబలం), పరుగులు తీసే నీ వయసునకూ పగ్గం వేసెను నా మనసూ (ఆత్మబలం), మనసు లేని బ్రతుకొక నరకం – మరువలేని బ్రతుకొక నరకం (సెక్రటరి) ఇలా ఎన్నో మనసు పాటలను వ్రాశాడు. మనిషి మనసు లోతుల్లోని భావాల్ని వెలికి తీసి విశ్లేషిస్తాడు. మనసుపై ఆయన సునిశిత పరిశీలన, విశ్లేషణ చేసినందుకు మనసు అనే పాఠ్యాంశాన్ని బోధించే ఆచార్యుడయ్యాడు.

జీవిత నేపథ్యం:

నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట వద్దగల మంగళంపాడు అనే గ్రామంలో కృష్ణమాచార్యులు, సీతమ్మ అనే దంపతులకు 1921 మే 7 వ తేదీన ఆత్రేయ జన్మించాడు. ఉచ్చూరు అనే ఊరు వీరి స్వగ్రామం. పది సంవత్సరాల వయస్సులోనే అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ పొందలేక పోవడం చేత అమ్మ మీద పాటలు వ్రాయమంటే ఆత్రేయ మనసు పరితపించి పోయేది. ‘అమ్మంటే అమ్మ – ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ’ (రామ్ రాబర్ట్ రహీమ్), ‘అమ్మా నిను చూడాలి నిన్నూ నాన్నను చూడాలి – నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి’ (పాపం పసివాడు) వంటి పాటలు వ్రాశాడు. మేనమామలు శ్రీనివాస వరదాచార్యులు, జగన్నాధాచార్యుల వద్ద పెరిగాడు. తల్లి లేని పిల్లవాడని గారాబం చేశారు. దీనిని అలుసుగా తీసుకుని ఆత్రేయ బడికి సక్రమంగా వెళ్ళేవాడు కాదు. తన ఆత్మకథలో ఇలా వ్రాసుకున్నాడు. ‘బడి జీవితమునకని పైకమ్ము నివ్వగా, కాపీ హోటళ్ళలో ఖర్చు చేసి, పుస్తకములకని పుచ్చుకున్న ధనమ్ము, సిగరెట్ల బడ్డీకి చెల్లు గట్టి, వెచ్చాల కొట్టుకు ఇచ్చిరమ్మని, పంపు ధనములో ఒక కొంత తస్కరించి, చాలని దానికి చల్లగా చిన మామ జేబులో డబ్బులు చెక్కి వేసి, కప్పి పుచ్చుకొనగ వేయి కల్లలాడి, పట్టు బడితి తిట్లుతిని ఎట్లో పెట్టుకొనుచు, గాలి తిరుగుళ్ళ చదువేమో గంగ కలిసె’ అన్ని సబ్జెక్టులకన్నా తెలుగులోనే తక్కువ మార్కులొచ్చేవి.

కలం పేరు:

ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో చామరాజ పిళ్ళై అనే ఒక స్నేహితుడు వచ్చి తను వ్రాసిన కంద పద్యాలను సరిచూడమన్నాడు. తెలుగే సరిగా రాని తనకు పద్యమెలా తెలుస్తుందని విచారిస్తున్న సమయంలో చిన మేనమామ జగన్నాధాచార్యులు వచ్చి తెలుగు పద్య వ్యాకరణ పుస్తకాన్ని చదువుకోమని ఇచ్చాడు. దానిని క్షుణ్ణంగా చదివి ఆత్రేయ తన మిత్రునికి పద్యంలోని లోటుపాట్లను కంద పద్యంలోనే వ్రాసి ఇచ్చాడు. ఇది చూసి అందరూ మెచ్చు కోవడంతో పద్యం వ్రాయడం తన ప్రవృత్తిగా చేసుకున్నాడు. నరసింహాచార్యులు నుండి ఆచార్య, ఇంటి గోత్రం నుండి ఆత్రేయ కలుపుకొని ఆచార్య ఆత్రేయగా కలం పేరు పెట్టుకున్నాడు. ‘దేవుళ్ళదంతా అన్యాయమే’ అనే కవిత ‘ఢంకా’ అనే పత్రికలో మొదట ప్రచురితమైన రచన.

దేశభక్తి:

చిత్తూరులో టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. గాంధీ ప్రభావంతో దేశభక్తి పాటలు వ్రాశాడు. ‘నాజీ ఫాసిష్టుల నలిపి ద్రుంపగా – భారత ఘనతను భద్ర పరచగా – విజయం మనకే దైవం మనదే’ అనే పాట వ్రాశాడు. గాంధీజీ నివాళిగా ‘వినరాదా వినలేదా విశ్వమంతా ప్రతిధ్వనించే సముద్రఘోష బాపూ భాష.. షికారుకెళ్ళే యువతుల్లారా, పచారు చేసే యువకుల్లారా.. వినలేదా వినరాదా సముద్రఘోష’ అని వ్రాశాడు. మనసంతా దేశభక్తి ఉంది కాబట్టే ‘భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు’ అని బడిపంతులు సినిమాలో వ్రాయగలిగాడు.

భగ్న ప్రేమికుడు:

చిత్తూరులో చదివే రోజుల్లో పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె ముద్దు పేరు బాణం. వీణ బాగా వాయించేది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ సగోత్రం కావడంతో ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాడు. ఆమెకు వేరొకరితో వివాహమయ్యింది. తొలిగాయం అనే పేరుతో ఆమె గురించి ఆత్మకథలో వ్రాసుకున్నాడు. ఆత్రేయకు కూడా మంగళంపాడు గ్రామంలో చక్రవర్తుల గోపాల కృష్ణమాచార్యుల కుమార్తె పద్మావతితో పెద్దలు 1940లో పెళ్లి చేశారు. అయితే ఎక్కువరోజులు ఈమెతో కాపురం చెయ్యలేదు.

నాటకరంగ ప్రవేశం:

చిన మేనమామ జగన్నాధాచార్యులు ‘మాలలు మనుషులే’ అనే ఒక నాటకాన్ని వ్రాశాడు. ఈయన ప్రభావంతో నాటకాలంటే అభిమానం ఏర్పడింది. ఈయన చిత్తూరులో మేజిస్ట్రేట్‌గా పనిచేసేవాడు. చిత్తూరులో ఆర్య వైశ్య సంఘంలోని శ్రీనివాసుల శెట్టి, మిట్టా రంగయ్య శెట్టి అనే మిత్రులతో కలిసి నాటకాలు వేసేవాడు. గౌతమబుద్ధ, పాఠన, శాంతి, డాక్టర్ కొటీఫ్, సామ్రాట్ అశోక, భయం, కప్పలు, ఈనాడు వంటి నాటకాలు వ్రాశాడు. ఎన్.జి.ఓ. అనే నాటకాన్ని అద్దెకొంప అనే పేరుతో మద్రాస్‌లో ప్రదర్శించాడు. ఈనాటకం ఆత్రేయకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మధ్యతరగతి కుటుంబాల్లో ఇరుకు అద్దె ఇళ్ళల్లో పడే అగచాట్లను చాలా బాగా చిత్రీకరించాడు. ఈ నాటకంలో ‘గోపీ మరిది’ పాత్రలో ఆత్రేయ అద్భుతంగా నటించాడు. ఆత్రేయ అరణ్య రోదన, సుప్రభాతం అనే ఖండ కావ్యాలను వ్రాశాడు.

సినీ రంగ ప్రవేశం:

ఆత్రేయ నెల్లూరులో కొన్నాళ్ళు మున్సిఫ్ కోర్టులో గుమాస్తా గాను, తిరుత్తణిలో కొన్నాళ్ళు పనిచేశాడు. ‘జెమీన్ రైతు’ అనే పత్రికకు సంపాదకుడైన నెల్లూరు వెంకట రామానాయుడు సహకారంతో సహాయ సంపాదకుడిగా చేరాడు. కొన్ని రోజులు ఆంధ్ర నాటక కళా పరిషత్ వేతన కార్యదర్శిగా చేశాడు. ఆత్రేయ ఎక్కడా కుదురుగా ఉద్యోగం చేయక పోవడంతో మేనమామ సినిమాలకు పంపుదామని అనుకున్నాడు. జగన్నాధాచార్యులకు చిత్తూరు నాగయ్య దగ్గరి బంధువు. ఆత్రేయ ఆయన సిఫారసుతో నాగిరెడ్డి తీస్తున్న ‘షావుకారు’ అనే సినిమాకు మాటలు వ్రాయడానికి వెళ్ళాడు. అది ఎందుకో కుదరలేదు. రామారావు, నాగేశ్వరరావు కలిసి చేస్తున్న ‘సంసారం’ అనే సినిమాకు మాటలు వ్రాసే అవకాశం తృటిలో తప్పింది. ఈ సినిమా ఆడిషన్స్ కోసం వచ్చిన ఒక అమ్మాయిని సినిమాలకు పనికి రావని త్రిప్పి పంపారు. ఆ అమ్మాయే సావిత్రి.

1951లో ప్రముఖ దర్శకుడు కె.యస్. ప్రకాశ రావు ‘దీక్ష’ అనే సినిమాకు పాటలు వ్రాసే అవకాశం కల్పించాడు. ఇదే సినిమాలో తాపీ ధర్మారావుతో కలిసి ఆత్రేయ మాటలు వ్రాశాడు. ఎమ్.ఎస్. రామారావు పాడిన ‘పోరా బాబూపో పోయి చూడు ఈలోకం పోకడ – ఆవేశాలను ఆశయాలను వదినకోసమే వదులు కొంటివా’ అనే పాట ఆత్రేయ మొదటి పాట. మాటలు అందించిన చివరి చిత్రం 1989లో వచ్చిన ‘లైలా’. చివరి పాట ఆత్రేయ మరణించిన తరువాత 1990లో నాగార్జున నటించిన ‘ప్రేమ యుద్ధం’ లోని ‘ఈ మువ్వల గానం మన ప్రేమకు ప్రాణం’ అనే పాట.

వీణ పాటలు:

ఆత్రేయ ప్రేయసి బాణం వీణ బాగా మీటేదట. అందుకే కాబోలు ఆత్రేయ వీణ పాటలు అంత చక్కగా వ్రాసేవాడు. ‘నీవు లేక వీణా పలుకలేనన్నదీ’ (డా.చక్రవర్తి), ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి – నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి (ప్రేమ నగర్), మోగునా ఈ వీణ మూగవోయిన రాగ హీనా అనురాగ హీనా (మురళీకృష్ణ), వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము – అది ఎలాగయినది రాగము (చక్రవాకం), వీణ లేని తీగను నీవులేని బ్రతుకును – మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను (చక్రవాకం). ఇలా వీణ పాటలకు ప్రసిద్ధి ఆత్రేయ. ‘మామూలు మాటలతో పాటలను పొదగవచ్చు అని చూపింది ఆత్రేయ’ అని ఆత్రేయ సాహిత్యాన్ని సంపుటాలగా విడుదల చేసిన ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య అన్నాడు.

వాన పాటలు:

జగపతి పిక్చర్స్ వారి నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఆత్మబలం అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకి, బి.సరోజకు ఒక వానలో పాట చిత్రీకరించాలనుకొని ఆత్రేయను పాట వ్రాయమని అడిగాడట. ‘వానలో పాటేమిటండి ఇంతకుముందు ఎవరూ తీయలేదే’ అని ఆత్రేయ అంటే ‘మీరు వ్రాయండి మేము తీస్తాము’ అన్నాడట. ఎన్ని రోజులైనా పాట వ్రాయక పోవడంతో విసిగి పోయిన రాజేంద్ర ప్రసాద్ ఆత్రేయ దగ్గరికి వెళ్ళాడట. ఆరోజు ఆత్రేయ మద్రాస్ లోని కదన్ పార్క్‌లో ఉన్నాడట. ‘మీవల్ల కాదంటే చెప్పండి. వేరే వాళ్ళతో వ్రాయిస్తాము’ అని రాజేంద్ర ప్రసాద్ అంటుండగా చిన్నగా వాన మొదలయ్యింది. ప్రేమికులు ఆ వానలో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వాన ఇంకొంచం పెద్దదయ్యే సరికి ఆ ప్రేమ జంటలు అన్నీ చెట్టుచాటుకు వచ్చి చేరడం చూసిన ఆత్రేయకు పాట మదిలో తట్టింది. అదే ‘చిట పట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే – చెట్టాపట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగిడుతుంటే’ అనే పాట. చిటా పటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ (అక్కా చెల్లెలు), చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే (ఇద్దరూ అసాధ్యులే), ఉరిమి ఉరిమి తరిమిందమ్మ కురిసి కురిసి తడిపిందమ్మ ఎట్టాగొ ఉందమ్మ(సింహ స్వప్నం) మొదలగు వాన పాటలతో మనల్ని తడిపేశాడు.

పిల్లల పాటలు:

టెలిఫోన్ గురించి వివరిస్తూ ఒక పాప పాడే పాట ఇది. ‘బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు – కళ్ళకెపుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు’ బడి పంతులు సినిమాలోని ఈ పాటలో శ్రీదేవి బాల నటిగా అద్భుతంగా హావభావాలు ప్రదర్శించింది. చిట్టి పొట్టి పాపలు చిరు చిరు నవ్వుల పువ్వులు (సిరి సంపదలు), బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి – నీ బోసినవ్వులలో పూచే పున్నమి వెన్నెల లోయి (ఆడ బ్రతుకు), చిట్టి తల్లి రావే చెపుతా చిట్టి తల్లి రావే ఒక చిన్నమాట (ఒక తల్లి పిల్లలు), చిట్టి తల్లీ నవ్వవే చిన్నారి నవ్వవే (దాసి) ఇలా పాపాయిలను ఓదారుస్తూ ఎన్నో పాటలు వ్రాశాడు.

నిర్మాతల గోడు:

ఆత్రేయ వ్రాయకుండా నిర్మాతలను, వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తుంటాడని కాగడా శర్మ అనే ఒక విమర్శకుడు అన్నాడు. దీనిపై ఆత్రేయ స్పందిస్తూ వ్రాయడానికి నేనెంత ఏడుస్తానో ఎందరికి తెలుసు అని అన్నాడట. ‘నిర్మాతలను, ప్రేక్షకులను ఏడిపిస్తేనే కదా డబ్బులు వచ్చేది’ అని హాస్యంగా అనేవాడు. తెలుగు సినిమా రచయిత మోదుకూరి జాన్సన్ ‘ఆచార్య గారూ నేనూ మీ అడుగు జాడల్లోనే నడుస్తున్నాను. నిర్మాత ముందుగా డబ్బులిస్తే గానీ రాయడం లేదు’ అని అంటే, ‘పిచ్చివాడా! ఈమధ్య నేను డబ్బిచ్చినా రాయడం లేదు’ అని ఆత్రేయ అన్నాడట. యువ చిత్ర ఆర్ట్స్ అధినేత కాట్రగడ్డ మురారి ‘త్రిశూలం’ అనే సినిమాకు పాటలు వ్రాయమని ఆత్రేయను అడిగాడు. ఎన్ని రోజులైనా ఆత్రేయ పాట రాసివ్వలేదు. పాట రికార్డింగ్ చేయడానికి సిద్ధ పడి ఆత్రేయ కోసం ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తలేదు. ఆ రోజు రాత్రి మురారి స్వయంగా కారు వేసుకొని ఆత్రేయ ఇంటి గేటు ఎదురుగా కారు పెట్టి రాత్రి ఆ కారులోని నిద్ర పోయాడు. ఉదయాన్నే ఆత్రేయ గేటుతీస్తున్న ఆత్రేయను కారులో ఎక్కించుకొని తన గదికి తీసుకెళ్ళి తాళం వేసి మరీ పాట వ్రాయించుకున్నాడట. ఆ పాటే ‘రాయిని ఆడది చేసిన రాముడివా’.

మూడ్ రానంతవరకే ఆలస్యం, ఆలోచన తట్టిందా! క్షణాల్లో పాట పుడుతుంది. మేధో మథనం చేస్తాడు. పాట కోసం పరితపిస్తాడు. ఆత్మబలంలో పాట కోసం వి.బి.రాజేంద్రప్రసాద్ ఆత్రేయ ఎన్ని రోజులైనా పాట రాయకపోయే సరికి నేరుగా ఇంటికే వెళ్ళాడు. రాజేంద్రప్రసాద్ వచ్చేది గమనించిన ఆత్రేయ నౌకరుతో ఇంట్లో లేనని చెప్పించాడు. ఆత్రేయ ఇంట్లోనే ఉన్నట్లు గమనించిన రాజేంద్రప్రసాద్ నౌకరుతో ‘రేపు ప్రొద్దున్నే పాట పూర్తి కాకపొతే మనుషుల్తో వస్తా’ అని బెదిరించి పోయాడు. ఆ రాత్రి కారు వేసుకుని మహాబలిపురం వెళ్ళాడు. పాట రాలేదు. ఇంటికి తిరిగి వచ్చాడు. ‘ఈ రోజు తెలవారకుండా ఉంటే మేలు సార్!’ అని అసిస్టెంట్ అనగానే ఆత్రేయ ‘పాట వచ్చేసింది’ అన్నాడట. ఆ పాటే ‘తెలవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయనిహాయిని’. మద్రాస్‌లో వాతావరణం వేడిగా ఉండి పాటలు వ్రాయలేను అంటే వి.బి.రాజేంద్రప్రసాద్ ఆత్రేయను కాశ్మీర్‌కు పంపించాడు. కాశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయన వ్రాసిన పుస్తకం వి.బి.రాజేంద్రప్రసాద్ తెరిచి చూస్తే ‘శ్రీ’ అనే ఒకే అక్షరం వ్రాశాడట.

ఆత్రేయ వైరాగ్యం:

ఆత్రేయ వ్రాయడానికి ఆలస్యం చేసి నిర్మాతలను ఇబ్బంది పెట్టినా ఆయన పాట సినిమాలో ఉందంటే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది. అందుకే ఆరుద్ర అన్నట్లు ఆత్రేయ వైరాగ్యంతో మళ్ళీ మళ్ళీ ఆ నిర్మాతలు పట్టుబట్టి పాటలు వ్రాయించుకొనే వారు. ‘మంచి మనసులు’ సినిమాకు పాటలు వ్రాయమని ఆత్రేయని అడిగితే, ‘నాకు సమయం కుదరడం లేదు. మీరు వేరే వాళ్ళతో వ్రాయించుకోండి’ అన్నాడట. జగపతి ఆర్ట్స్ క్రియేషన్స్‌లో అత్రేయతోనే పాటలు వ్రాయించుకుంటాం అని వి.బి.రాజేంద్రప్రసాద్ నొక్కి వక్కాణించాడట. ఆ సందర్భంలో వ్రాసిన పాటే ‘నీవు లేక నేను లేను – నేను లేక నీవు లేవు – నేనే నీవు నీవే నేను’. ‘ఆత్రేయ ఆలస్యంగా రాయకపోతే మాదగ్గరికి నిర్మాతలు రారుగా!’ అని ఆరుద్ర అనేవాడు.

ఆంధ్ర కన్నదాసన్:

మనసు మీద పాటలు వ్రాయడంలో తమిళంలో కన్నదాసన్ ప్రసిద్ధుడు. ఒకరు తెలుగు సినిమాలో ఉంటే మరొకరు తమిళ సినిమాలో ఉండేవారు. మద్రాసులో కొన్ని సినిమాలు ఒకే కథను రెండు భాషలలో తెలుగు, తమిళంలో తీసేవారు. తెలుగులో ఆత్రేయ వ్రాస్తే, తమిళంలో కన్నదాసన్ వ్రాసేవాడు. ప్రేమనగర్ లో ఆత్రేయ ‘మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే – మనసున్న మనిషికి సుఖము లేదంతే’ అని వ్రాస్తే దానికి కన్నదాసన్ తమిళంలో శివాజీగణేశన్‌కి ‘ఇరండు మనం వేండుం’ అని వ్రాశాడు. అంటే ఒక మనసు ప్రేమించడానికి మరో మనసు మర్చిపోవడానికి కావాలి. కానీ నాకు ఒకే మనసు ఇచ్చావు’ అని కన్నదాసన్ వ్రాశాడు. ఇంకొక సినిమాలో కన్నదాసన్ ‘వీడు వారి ఉరవు వీధి వరై మనైవి – కాడు వరై పిళ్ళై కడైసివరయ్ యారో’ అని వ్రాశాడు. అంటే ‘నీవు చనిపోయినపుడు వీధి చివరిదాకా నీ భార్య వస్తుంది. కొడుకు శ్మశానం దాకా వస్తాడు. ఆ తరువాత ఎవరూ రారు’ అని అర్థం. జీవన తరంగాలలో అనే పాటలో ఆత్రేయ ‘కాటికి నిన్ను మోసేదొకరు, కడుపు చించుకు పుట్టిందొకరు – తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు’ అని వ్రాశాడు. ఎవరి స్టైల్లో వాళ్ళు పాటలు వ్రాశారు. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

భక్తి పాటలు:

శ్రీవెంకటేశ్వర మహాత్యం సినిమాలో ఘంటసాల స్వయంగా ఆలపించిన ‘శేషశైలావాస శ్రీవేంకటేశా శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా’ అనే భక్తి పాటలో కూడా ఆత్రేయ తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ – అలమేలు మంగకు అలుక రానీయకూ’ అని వ్రాశాడు. శ్రీ షిర్డీసాయి మహత్యంలో ‘సాయీ శరణం బాబా శరణం శరణం’, ‘మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా’, ‘నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదనీ’, ‘నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం’, ‘దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో’, ఇలా అన్ని పాటల్లో భక్తి భావం కనపడుతుంది.

దేవుడు ఉన్నాడా?

కొన్ని సార్లు ఆత్రేయకు దేవుడు ఉన్నాడా! అనే సందేహం కలిగేది. అందుకే భక్త తుకారంలో ‘ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు ముసుకున్నావా’ అని ప్రశ్నించాడు. ‘మేమూ మీలాంటి మనుషులమే’ అనే సినిమాలో ‘దేవుడు ఉన్నాడో లేడో మానవుడున్నాడురా – వాడే దేవుడు కలడు లేడని తికమక పడుతున్నాడురా’ అనే పాటలో ‘మనిషి కోసం బ్రతికే మనిషే దేవుడు’ అని అన్నాడు. దేవుళ్లలో లోపాలు కూడా వెదికి పట్టుకున్నాడు. ‘డైవర్ రాముడు’ సినిమాలో ‘రాముడు కాడమ్మా నిందలు నమ్మడు – కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు’ అని కళ్ళు లేని తన చెల్లెలుకు కాబోయే భర్త గురించి అన్న వివరిస్తాడు. ‘స్వాతిముత్యం’ లో ‘యశోదను కాదురా నిను దండించ – సత్యను కాదురా నిను సాధించ’ అంటూ అమాయకపు భర్తను గురించి పాడే పాట అద్భుతం.

వేదాంతి:

ఆత్రేయ పాటలు జీవిత సత్యాలను కాచి వడపోచినట్లు ఉంటాయి. గొప్ప తాత్విక ధోరణి కనబడుతుంది. మురళీకృష్ణ లో ‘ఎక్కడ ఉన్నా ఏమైనా, మనమెవరికి వారే వేరైనా – నీసుఖమే నే కోరుకున్నా, నినువీడి అందుకే వెళుతున్నా’ అనే పాటలో ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని – జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’ అంటాడు. మరో చరణంలో ‘వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా – మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువుకదా!’ అని నేటి ప్రేమికులకు మార్గనిర్దేశం చేశాడు. ఇది బాగా అర్థం చేసుకుంటే చంపడం, ఆత్మహత్య చేసుకోవడం లేదా కక్ష సాధింపు వంటి అకృత్యాలు ఉండవు. ‘అంతులేని కథ’లో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి’ ‘నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా’ అని రాశాడు. గుప్పెడు మనసులో ‘ఊహల ఉయ్యాలవే మనసా మాటల దయ్యానివే – లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు వగచేవు’ అని చెప్పాడు. అందుకే ఆత్రేయను ‘ఆంధ్రా వేమన’ అన్నారు.

రాత్రేయ:

ఆత్రేయ రాత్రిళ్ళు ఎక్కువ సేపు మేల్కొని ఆలోచిస్తూ అలసిపోయి పగలు పడుకొనేవాడు. ఆత్ర్రేయ శిష్యుడు జె.కె. భారవి ‘గురువుగారు తెల్లారింది నిద్రపోదామా’ అనే వాడట. ఆత్రేయ డిక్టేటర్. అంటే అయన చెబుతూ ఉంటే వ్రాసుకొనే రైటర్స్‌గా శివరామ కృష్ణుడు, రంగస్వామి, మాలాపురం రాజేద్రపసాద్ మొదలగు శిష్యులు ఉండేవారు. ఒకరోజు శ్రీశ్రీ ఆత్రేయ ఇంటికి వచ్చి ‘రాత్రేయ’ ఉన్నాడా? అని శిష్యులని అడిగాడట. ఆత్రేయను అర్ధరాత్రేయ అని కూడా అనేవారు.

సెన్సార్:

సినిమా పాటల్లో అశ్లీలాన్ని ప్రోత్సహించకుండా సెన్సార్ వాళ్ళు కొన్ని పదాల్ని తొలగించేవారు. అయితే ఆత్రేయ సినిమా పాటల్లో పదాల్ని తొలగించాలంటే సెన్సార్ వాళ్లకు కష్టమయ్యేది. దాగుడుమూతలు సినిమాలో అడగక ఇచ్చిన మనసే ముద్దు అనే పాటలో నువ్వు నేను ముద్దుకు ముద్దు అన్న పదం అభ్యంతరం తెలిపారు. ఆత్రేయ కోసం ఆదుర్తి సుబ్బారావు వెతికారు. కానీ ఆత్రేయ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ముద్దుకు ముద్దు అన్నచోట ఉహూ హూహూ అని ఘంటసాల సుశీల చేత హమ్ చేయించారు. సినిమా రిలీజ్ అయ్యింది. సినిమాలో ఈ పాటను చూసి ఆత్రేయ ‘ముద్దుకు ముద్దు తీసేసి రకరకాలుగా ఆలోచించేటట్లు చేశారే! నేనే బూతు అనుకుంటే సెన్సార్ వాళ్ళు నాకంటే బూతు అయిపోయారే!’ అన్నాడట. రామారావు నటించిన ‘డైవర్ రాముడు’లో ‘గు గు గుడిసుందీ మ మ మంచముంది’ అనే పాటలో మంచమనే పదాన్ని సెన్సార్ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో మంచం బదులు మనసుంది అని ఆత్రేయ సినిమాలో మార్చాడట. అప్పటికే పాట రికార్డింగ్ అయిపోవడం, పాటల క్యాసెట్లు బయటికి వచ్చేయడం జరిగింది. అందుకే సినిమాలో మనసు ఉంటుంది. క్యాసెట్లలో మంచమే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమాలో అదే పాటను ఉంచితే నేటి సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పలేదు. పదం విడగొట్టడం ద్వారా ఆత్రేయ బూత్రేయగా మారతాడని తనకు తానే ఒప్పుకున్నాడు.

ప్రాసల పస:

ఎన్టీర్ నటించిన ‘మంచీ చెడూ’ సినిమాలో ట కారంతో అంత్య ప్రాసలో వ్రాశాడు. ‘రేపంటి రూపం కంటి పూవింటి చూపులవంటి – నీ కంటి చూపులవెంట నా పరుగంటి’, ఆకలి రాజ్యంలో ‘కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి – చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ’ అని వ్రాశాడు. అందమైన అనుభవంలో ‘కుర్రాళ్ళోయ్ కురాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు – కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు’ అని అన్నాడు.

పాటలరేడు:

గ్రాంథిక భాషను దించి పామరులకు సైతం అర్థమయ్యేటట్లు వాడుక భాషలో పాటల దారి మరల్చాడు. పెళ్లి గురించి త్రిశూలం సినిమాలో ‘పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు – మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు’. ఇంత తేలికైన పదాలతో పెళ్లి గురించి ఎవరూ చెప్పగలరు? మూగమనసులు సినిమాలోని పాటలు పాడుతా తీయగా చల్లగా, ముద్దబంతి పువ్వులో మూగ బాసలు, గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది అన్నీ సూపర్ హిట్. ప్రేమ్ నగర్ లోని ‘తేటతేట తెలుగులా తెల్లవారి వెలుగులా’ పాట పాడని తెలుగు వాడుండడు. శిలలపై శిల్పాలు చెక్కినారు (మంచి మనసులు), ‘నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి’ (ఇంద్రధనస్సు), ‘మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా’ (దాగుడు మూతలు), కొమ్మకొమ్మకో సన్నాయి (గోరింటాకు), పచ్చగడ్డి కోసేటి (దసరా బుల్లోడు), ప్రేమ లేదని ప్రేమించరాదని (అభినందన) ఇలా ఎన్నో పాటలు వ్రాశాడు. 477 సినిమాలలో మొత్తం 1636 పాటలు వ్రాశాడని ఆత్రేయపై పరిశోధన చేసిన పైడిపాల సూర్యనారాయణ రెడ్డి తేల్చాడు.

మాటల మాంత్రికుడు:

ఆత్రేయ సమయానికి తగినట్లు హాస్య ఛలోక్తులు విసిరేవాడు. ప్రేమ్ నగర్ ఒక్క సినిమాలో జీవితానికి సరిపడే బరువైన మాటలు వ్రాశాడు. ‘మనిషి తాను అనుకున్నట్లు బ్రతకనూ లేడు ఇతరులు అనుకున్నట్లు చావనూ లేడు’. హీరో తన భూములను చూపిస్తూ ‘ఇక్కడ నుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది.’ అని అంటాడు. చక్రవాకంలో ‘ప్రేమ పైరు లాంటిది, పెళ్లి పంట లాంటిది. వేసిన పైరంతా పండాలని లేదు. పండింది వేసిన వాళ్లకు దక్కాలని లేదు.’ పొట్టి మాటలను వ్రాసే ఆత్రేయ అంటే అక్కినేనికి, సావిత్రికి వల్లమాలిన అభిమానం. ‘అ’త్రయం అంటే ఆదుర్తి, అక్కినేని, ఆత్రేయ. వీరి సూపర్ హిట్ కాంబినేషన్‌లో డా.చక్రవర్తి, తోడికోడళ్ళు, మాంగల్య బలం, మూగమనసులు, మంచిమనసులు, వెలుగు నీడలు ఇలా చాలా సినిమాలు వచ్చాయి.

బహుముఖ ప్రజ్ఞాశాలి:

మాటలు, పాటలు వ్రాయడమే కాదు. మంచి నటుడు కూడా. నాటకాల అనుభవం చేత కోడెనాగు సినిమాలో రామశర్మ మాస్టారు పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆదర్శం, భామాకలాపం సినిమాలలో నటించాడు. వాగ్దానం అనే సినిమా తీసి దర్శక నిర్మాత అయ్యాడు. అక్కినేని నటించిన ఈ సినిమాలో ‘నీకంటి పాపలో నిలిచిపోరా – నీవెంట లోకాల గెలవనీరా’ అనే పాట ద్వారా దాశరథిని సినీ పాటల రచయితగా పరిచయం చేశాడు. అయితే సినిమా విజయం సాధించలేదు.

అపర శ్రీనాథుడు:

జీవితంలో ఆత్రేయ ఎన్నో ఆటుపోట్లకు గురయ్యాడు. విలాసాలకు, దాన, ధర్మాలకు సంపాదించినదంతా ఖర్చు పెట్టేశాడు. డబ్బు ఏనాడు దాచుకోలేదు. ఒకసారి 1500 రూపాయలు బ్యాంక్‌లో వేయమని శిష్యునికి ఇచ్చాడట. ‘ఇదేమిటి గురువుగారూ! మీరు సేవింగ్స్ చేస్తున్నారు?’ అని ఆశ్చర్యంగా చూసే సరికి ‘నేను పోయాననుకో ఖర్చులకు కావాలి కదా!’ అన్నాడట. పదిరోజుల తరువాత డబ్బు విత్‌డ్రా చేసున్న ఆత్రేయను అదే ఆశ్యర్యంతో చూసే సరికి ‘ఆ ఈ చావనేది చచ్చిందా! వచ్చిందా! ఎప్పుడొస్తుందో? దానికోసం ఇప్పుడెందుకు డబ్బులు దాయటం?’ అని అంటున్న ఆత్రేయను చూసి ఆ శిష్యుడు అవాక్కయ్యాడట. తన ఆత్మకథలో ‘లక్షలార్జించి ధనమునలక్ష్య పరచి, ఖర్చు చేసితి స్వపర సుఖాల కొరకు, ప్రొద్దు గుంకెడు వయసున బొక్కసాన, లేదు చిల్లి గవ్వైన నన్నాదు కొనగ’ అని అంటూ ‘సరసులను మాట నల్ల పూసాయె నేడు, చిత్ర జగతిని పట్టె చెదపురుగులు, అపర శ్రీనాథుడాత్రేయుడన్న మాట, సార్థకంబాయే నా అగచాట్ల వలన’ తన దీన స్థితిని తానే తెలిపాడు. ‘నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా అంటూ’ 1989 సెప్టెంబర్ 13న అమరపురిని చేరుకున్నాడు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అంటూ మనకు తీపి గురుతులు నిలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here