[ఇటీవల అమెరికాలో పర్యటించి, ఆ యాత్రానుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు జె. శ్యామల]
లాంగ్ బీచ్‌లో ఆహ్లాదంగా..
[dropcap]అ[/dropcap]మెరికాలో ‘థ్యాంక్స్ గివింగ్ డే’ వచ్చిందంటే ప్రతివారు తమ కుటుంబీకులనో లేదంటే బంధువులనో లేదంటే ఆత్మీయులనో కలవడం తప్పనిసరి. ఆ సందర్భంగా పరస్పరం బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడమూ మామూలే. ఏటా వచ్చే ఈ ప్రత్యేక దినం కోసం అన్ని విక్రయ సంస్థలు వివిధ వస్తువులపై ధరల తగ్గింపు ప్రకటిస్తాయి. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా షాపింగ్ సందళ్లు.. ప్రజల కోలాహలం.. ఇక కాలు కదపకుండా చేసే ఆన్‌లైన్ కొనుగోళ్లు సరే సరి.
మా దీప ‘థ్యాంక్స్ గివింగ్ డే’ కి తన స్నేహితురాలు సువాసిని దగ్గరకు వెళ్దామంది. ఆ అమ్మాయి గతంలో శాండియేగొలో ఉండేది. కిందటిసారి నా అమెరికా సందర్శనలో మా అమ్మాయి, సువాసిని ఇంటికి నన్ను తీసుకువెళ్లింది. ఆ అమ్మాయి కూడా మా ఇంటికి వచ్చింది. అలా తనతో మంచి పరిచయం ఏర్పడింది. అయితే ఇప్పుడు వాళ్లు లాంగ్ బీచ్ (ఇది ఊరి పేరు) లో ఉన్నారు. శాండియేగొ నుంచి లాంగ్ బీచ్‌కు కార్లో ఒకటిన్నర గంటలో వెళ్లవచ్చు. మూడు రోజులు సెలవులు రావడంతో, ఎక్కువమంది ప్రయాణాలు చేస్తారని, అందువల్ల ట్రాఫిక్ బాగా ఉంటుందని, అందుకే ఉదయాన త్వరగా బయలుదేరడం మంచిదంది దీప. అనుకున్న ప్రకారమే పది గంటలలోపే బయలుదేరాం.
అదృష్టం, ట్రాఫిక్ అంత భయంకరంగా లేదు. దాంతో సకాలంలో లాంగ్ బీచ్ చేరాం. వాళ్లున్న ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఎటు చూసినా పరవశింపజేసే పచ్చదనం. సువాసిని వాళ్లిల్లు వచ్చేసింది. సువాసిని జంట, మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, కారు ఎక్కడ పార్కింగ్ చేయాలో చెప్పారు. వాళ్లకు రెండేళ్ల బాబు. ఆ అమ్మాయి బాబు పనులు చూసుకుంటుంటే, అతనే కాఫీ, లంచ్ ఏర్పాటు పనులన్నీ చేస్తున్నాడు.. అదీ చిరునవ్వు చెదరకుండా. సువాసిని, పిల్లవాడి గదిలో ఉంది, వాడి ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా జవాబులు చెపుతోంది. ఆ గదిలో బాబు కోసం ప్రత్యేకమైన పడక. ఓ వైపు చక్కగా సర్దిన బోలెడన్ని పిల్లల పుస్తకాలు. కథల పుస్తకాలు కొన్ని, చెట్లు, పక్షులు, జంతువులు, వాహనాలు, దిక్కులు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అంకెలు, మంచి అలవాట్లు, శరీర భాగాలు.. ఇలా విషయ పరిజ్ఞానాన్ని పెంచే రంగుల బొమ్మలతో ఎంచక్కని పుస్తకాలు. బాబుకు, రోజు కథల పుస్తకం చదివి వినిపిస్తూ నిద్రపుచ్చుతుందట. అది విని నాకు ఎంతో ముచ్చటగా అనిపించింది. మన దేశంలోనూ పిల్లల కోసం పుస్తకాలు కొంటారు. కానీ అంత పెద్ద సంఖ్యలో కొనరు. కొన్న పుస్తకాలు కూడా ఏ మూలో మూలుగుతుంటాయి. లేదా చిందరవందరగా, ఎక్కడంటే అక్కడ నలిగి, పేజీలు చిరిగి, రూపు మారి కనిపిస్తాయి. సువాసిని దంపతులు ఉద్యోగస్తులు అయినప్పటికీ, ఇద్దరూ కూడా పిల్లవాడి పట్ల చూపే శ్రద్ధ, విసుగన్నదే లేకుండా మంచి అలవాట్లు నేర్పిస్తూ పెంచడం నాకెంతో ఆశ్చర్యానందాలు కలిగించింది.
వాళ్ళింట్లో కబుర్లతో కాలమే తెలియలేదు.
అసలు అంత పెద్ద ఇంటిని ఎలా మెయింటెన్ చేస్తారో అనిపించింది. అదే మాట మా దీపతో అంటే, క్లీనింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయని, వారిని పిలిపించుకొంటారని చెప్పింది. చూడ చక్కని పెద్ద పెరడు. ఎన్నో రకాల మొక్కలు. రంగు రంగుల పూలు. ప్రతి గదిలో గోడలకు చక్కని పెయింటింగులు.. మర్నాడు బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక నులి వెచ్చని ఎండలో అంతా కలిసి వాకింగ్‌కు బయలుదేరాం. కొంత మంది ఇళ్ల ముందు ఒక స్టాండ్, దానిపై ఒక బాక్స్, అందులో పుస్తకాలు కనిపించాయి. అవేమిటని అడిగా. ఇంట్లో ఉన్న పిల్లల పుస్తకాలు, ఇతర పుస్తకాలు (తమకు అవసరం లేవు అనుకున్నవి) అలా ఉంచుతారని, వాటిని ఎవరైనా తీసుకెళ్లి చదువుకోవచ్చని చెప్పారు. తాము చదివేశాక మళ్లీ తెచ్చి ఆ బాక్స్‌లో ఉంచవచ్చు. పదిమందికీ పుస్తకాలు ఉపయోగపడేలా ఉన్న వారి పద్ధతి ఎంత బాగుంది!.. అనుకున్నాను. అదే మన దగ్గర అయితే తూకానికి అమ్మేసేవారు ఎందరో. అలా బయట పెట్టడం కానీ, ఒక వేళ ఎవరైనా ఉంచినా, వాటిని సద్వినియోగపరుచుకోవడం కానీ ఊహించుకోలేం. అదే సమయంలో నాకు మరో విషయం నా స్మృతిపథంలో మెదిలింది. అది గతంలో నేను సిన్సినాటి వెళ్ళినప్పుడు అలా మాల్స్‌లో తిరుగుతున్నప్పుడు ఓ పుస్తకాల షాపు నన్ను ఆకర్షించింది. అక్కడ షాపు ముందు నాలుగు కుర్చీలు, మధ్యలో టేబుల్ పై పిల్లల పుస్తకాలు ఉన్నాయి. అక్కడకు వచ్చిన పిల్లలు ఎవరైనా సరే అక్కడ కూర్చుని పుస్తకాలు చదువుకోవచ్చు. నేను చూస్తుండగానే ఓ తండ్రి, పిల్లవాడితో అక్కడకు వచ్చాడు. పిల్లవాడు పుస్తకాల ముందు కూర్చుని ఆసక్తిగా చూడసాగాడు. పుస్తకాలపై పిల్లలకు ఇష్టం పెంచేందుకు షాపు యాజమాన్యం చేసిన ఏర్పాటు నాకెంతో నచ్చింది. అది వారి వ్యాపారాభివృద్ధి ప్రయత్నంలో భాగం అయితే కావచ్చు. కానీ అందులో పిల్లలలో పుస్తక పఠనాభిలాష పెంచే అంశం ఉండడం ఎంతైనా అభినందనీయం అనిపించింది. ఆలోచిస్తూ అడుగులేస్తున్నాను.
అలా అలా నడిచి తిరిగి ఇల్లు చేరాం. మధ్యాహ్నం భోజనానంతరం దగ్గరలోని సందర్శనా స్థలాలకు వెళ్లాలనుకున్నాం. ఆ సమయానికి బాబు నిద్రపోతుండడంతో, మమ్మల్ని వెళ్ళమని, తాము తర్వాత వచ్చి, ‘బోల్సాచికా’ (ఎకలాజికల్ రిజర్వ్) దగ్గర కలుస్తామన్నారు.
సరేనని దీప, నేను బయలుదేరాం. ముందుగా ‘ఎల్ డొ రాడొ’ రీజనల్ పార్క్‌కు వెళ్లాం. సోమవారం, కొన్ని ప్రత్యేక సెలవు దినాలలో తప్ప, మిగతా రోజులలో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం అయిదు వరకు ఆ పార్కు తెరిచే ఉంటుంది. అయితే నాలుగున్నర దాటుతుండగా అందులో నడక దారులు (ట్రెయిల్స్), చీకటి పడుతుందన్న కారణంతో మూసివేస్తారు. ప్రవేశ రుసుము ఏమీ లేదు. కారు పార్కింగ్‌కు మాత్రం రుసుము ఉంటుంది. మన ఓపికను బట్టి పావు మైలు, మైలు, రెండు మైళ్లు ట్రెయిల్స్‌ను ఎంచుకుని ఆ దారిలో నడవాలి. అక్కడి ప్రకృతిని ఆస్వాదించదానికి వృద్ధులు, దివ్యాంగులు కూడా వీల్ చెయిర్ లలో రావడం చూసి, ‘ఇది కదా జీవితాన్ని ఆనందించడం అంటే’ అనుకున్నాను. వారికి సహాయకులుగా ఉన్న వారిది ఎంత మంచి మనసై ఉంటుంది.. అదే మన దేశంలో అందరూ అని కాదుగానీ చాలా మంది వృద్ధులు, దివ్యాంగుల పట్ల అసహనం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. ‘నడవలేనప్పుడు ఒక మూల కూర్చోవాలి’ అనడం కూడా కద్దు.
పార్కులో ఈ సన్నని బాటల కిరువైపులా అసంఖ్యాక వృక్షాలు, నీటి మడుగులు.. ఇక్కడ ఆరు సరస్సులున్నాయి. అసలు ఈ పార్కు రోడ్డుకు ఇరు వైపులా విస్తరించి ఉంది. ఒక వైపు ప్రవేశించి, మరో వైపు పార్కు నుంచి మరలి రావచ్చు. పార్కులో గోల్ఫ్ కోర్స్, టెన్నిస్ కోర్టు, బేస్ బాల్, వాలీ బాల్, సాకర్ ఫీల్డ్స్, స్కేట్ పార్క్ అనేకానేకం ఉన్నాయి. టెన్నిస్ కోర్టులయితే పదిహేను ఉన్నాయి. 1984లో లాస్ ఆన్జిలిస్ లో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఈ పార్క్ ‘ఆర్చరీ’ విభాగపు పోటీలకు వేదికగా నిలిచింది.
ఈ పార్కులోని నీటి కొలనుల్లో బాతులు, బ్లూ హెరాన్స్, ఉడుతలు, వాటర్ ఫౌల్స్ , సీతాకోక చిలుకలు, డ్రాగన్ ఫ్లైస్, బాస్ ఫిష్ మొదలైనవెన్నో ఉన్నాయి. కప్పలు, తాబేళ్లు సరే సరి.
సైక్లింగ్ ఇష్టపడే వారి కోసం ఇక్కడ నాలుగు మైళ్ల బైక్ ట్రెయిల్ ఉంది. చేపలు పట్టేందుకు రెండు సరస్సుల్లో అనుమతి ఉంది. వీటిలో లార్జ్ మౌత్, బాస్, బ్లూ గిల్, ట్రౌట్ వంటి రకరకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ చేపలు పట్టే వారికి ఫిషింగ్ లైసెన్స్ ఉండి తీరాలి. పదహారు సంవత్సరాల వయసు నిండిన వారే ఫిషింగ్‌కు అర్హులు.
ఓ గంట ఎల్ డొ రాడొ పార్కులో గడిపాం. ఆ తర్వాత ‘విజిటర్స్ సెంటర్’ కు వెళ్లి, అక్కడి ఫోటోలు, మ్యాపులు, మోడల్స్ చూసి, మరింత సమాచారం తెలుసుకుని బ్రోషర్ తీసుకుని బయటకు వచ్చాం. యు.ఎస్. లో ఏ సందర్శన స్థలానికి వెళ్ళినా అక్కడ విజిటర్స్ సెంటర్ ఉంటుంది. సందర్శకులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. పిల్లలకు.. పెద్దలకు కూడా విజ్ఞానం పెంచేలా బ్రోషర్ అందుబాటులో ఉంటుంది. పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించేందుకు, వారు సైతం పర్యావరణ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషించేందుకు అవి తోడ్పడుతాయి.
ఆ తర్వాత మేం ‘నేపుల్స్ కెనాల్’ వెళ్లాం. నేపుల్స్, అలమితోస్ బే మీద మూడు ద్వీపాలపై విస్తరించి ఉంది. కెనాల్ ఒడ్డు పొడవునా అందాల భవనాలు.. కెనాల్‌లో ఆకర్షణీయమైన ఎన్నో పడవలు. ఆ పడవల్లో ఆనంద విహారం చేస్తూ ఎందరెందరో.. వారితో పాటే పడవలపై చక్కగా ముస్తాబై కూర్చున్న శునకాలు.. సొంతంగా పడవ నడుపుకునే వారు కొందరు. సాయం సమయం.. పైకి చూస్తే నీలాల నింగి. కింద సూర్య కిరణాలు పడి చిత్రంగా ప్రకాశిస్తున్న నీళ్లు. చుట్టూ ఎటు చూసినా అందమే.. ఆనందమే. క్రిస్మస్ సమయంలో ఇక్కడ ‘బోట్ పరేడ్’ జరుగుతుందట. అంతే కాదు, అందులో పాల్గొన్న వారికి వివిధ కేటగిరీలలో బహుమతులు ఇస్తారని, 1946 నుంచి బోట్ పరేడ్ జరుగుతోందని తెలిసింది. దీపాల కాంతులలో నయనానందకరంగా జరిగే ఆ బోట్ పరేడ్‌ను వీక్షించడానికి అసంఖ్యాకులు తరలి రావడంలో ఆశ్చర్యమేముంది? నేపుల్స్ కెనాల్ వద్ద కొంత తడవు గడిపి, ‘బోల్సాచికా’ ఎకలాజికల్ రిజర్వ్‌కు వెళ్లాం. అక్కడ కూడా ప్రవేశ రుసుము ఏమీ లేదు. సముద్ర జీవుల నెలవుగా, నీటి పక్షులకు ఆలవాలంగా ఉన్న ‘బోల్సాచికా’ వద్ద ఇసుకలో నడుస్తూ, మధ్య మధ్య నీటిలో కొలువు తీరి, నీటితో ఆటలాడుతున్న పక్షులను తిలకిస్తుంటే, ఎంత చలి అయినా చలించేది లేదు అనిపించింది. ఎన్నెన్నో వలస పక్షులతో అలరారే ప్రాంతమిది. ఏ మాత్రం శబ్దాలకైనా పక్షులు ఇబ్బంది పడతాయి కాబట్టి పెంపుడు కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు. ఈ సువిశాల, ప్రశాంత నీటి ఆవాసంలో నాలుగు వందలకు పైగా పక్షిజాతులున్నాయి.
వన్య ప్రాణులు, కయోటీలు, ఉడుతలు, కుందేళ్ళు, ర్యాటిల్ స్నేక్స్, బాతులు ఎన్నెన్నో ఉన్నాయి. కాలిఫోర్నియా లోని ఉత్తమ పక్షుల నెలవులలో, ‘బోల్సాచికా’ ఒకటి. బైనాక్యులర్స్ వెంట తెచ్చుకుంటే అన్నిటినీ నిశితంగా చూసే వీలుంటుంది. బ్లూ హెరాన్స్, స్నోయి ఎగ్రెట్స్, బ్రౌన్ పెలికాన్స్, కింగ్లెట్స్, లూన్స్, ఔల్స్, స్వాలోస్, టెర్న్స్, హమ్మింగ్ బర్డ్స్.. ఇలా ఇక్కడ ఎన్నెన్నో.. మనం వెళ్లిన సమయాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి మనకు దర్శనమిచ్చే వాటి సంఖ్య ఆధారపడుతుంది.
ఇంతలో సువాసిని కుటుంబం రానే వచ్చింది. వారితో కలిసి మరి కొంత దూరం నడిచాం. సువాసిని, బాబును భుజాల మీదకు ఎక్కించుకుని, వాడికి కబుర్లు చెపుతూ నడుస్తోంది. కొన్ని ఫోటోలు తీసుకున్నాం. అంతలో చీకట్లు చిక్కబడ్డాయి. ఆకాశంలో అందాల అర్ధచంద్రుడి దర్శనం కూడా కావడంతో సంతోషాన్ని మనసులో మూటకట్టుకుంటూ వెనుతిరిగాం.
ఆ మర్నాడు ఉదయమే లాంగ్ బీచ్ నుంచి, శాండియేగొకు తిరిగి ప్రయాణమయ్యాం.
(మళ్ళీ కలుద్దాం)