చిరుజల్లు-69

1
3

ఎడారి దారి

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి ఒంటి గంట అయింది.

ఉయ్యాలలోని పసిపిల్లాడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. అమృతవల్లి లేచి లైటు వేసి భర్త వంక చూసింది. ఆయన ఇటు నుంచి అటు తిరిగి పడుకున్నాడు. పిల్లాడి ఏడుపుతో తనకేమీ సంబంధం లేనట్లు నిశ్చింతగా నిద్రపోతున్నాడు.

అమృతవల్లి పిల్లాడ్ని భుజం మీద వేసుకుని బయటకొచ్చి పచార్లు చేస్తూ చిచ్చుకొడుడూ ఊరడించే ప్రయత్నం చేస్తోంది. వాడు ఏడుపు ఆపటం లేదు. అమృతకు కోపం, విసుగూ మంచుకొచ్చి, వాడి మీద విసుక్కోబోయింది.

పక్కింటి స్నేహలత తలుపు తీసుకొని వచ్చింది. “ఏంటి, పిల్లాడు అలా ఏడుస్తున్నాడు? కడుపులో ఏదన్నా బాధగా ఉందేమో” అన్నది.

“ఈ మగ వెధవల కడుపులో ఏముందో మనకి చెప్పి చావరు గదా. మనల్ని నిశ్చింతగా నిద్రపోనివ్వరు. చంపుకు తింటారు” అన్నది అమృత. ఆమె మాట్లాడితే ఆరడజను మంది భుజాలు తడుముకోవాల్సిందే.

స్నేహలత అమృత దగ్గర నుంచి పిల్లాడిని తీసుకుంది. వాడిని ఆడిస్తూ లైటు వెలుతురులోకి తీసుకెళ్లింది. “వీడిని ఏదో కుట్టింది వదినా. ఇక్కడ చూడు ఎంత కందిపోయిందో? ఊరికే ఏడవడు పాపం..” అంటూ పిల్లాడ్ని భజం మీద వేసుకొని ఊరడించింది.

అయిదు నిముషాల తరువాత వాడు ఏడుపు ఆపి, స్నేహలత భుజం మీద పడుకొని నిద్రపోయాడు.

“సారీ, నాతో పాటు నీకూ నిద్రాభంగం అయింది” అన్నది అమృత.

“నా సంగతి సరే, మీ ఆయన ఇంట్లో గురక పెట్టి నిద్రపోకపోతే, ఇలాంటప్పుడు, కొంచెం సాయం చేయవచ్చుగదా..” అన్నది స్నేహలత.

“ఆయన పగలంతా ఆఫీసులో చాలా మంది ఆడాళ్లకు సాయం చేసీ, చేసీ, చేసీ, అలసిపోయి పడుతూ లేస్తూ ఇంటికొస్తారాయే. ఇంక పిల్లాడ్ని ఆడించే ఓపిక ఎక్కడుంటుంది?” అన్నది అమృత కోపంగా.

“నువ్వలా రాత్రింబగళ్లూ చాకిరీ చేస్తున్నంత కాలం, ఆయనలా నిశ్చింతగా నిద్రపోతూనే ఉంటాడు. రేపు స్పష్టంగా చెప్పెయ్. పగలు నీకు ఎలాగూ తప్పదు గనుక, రాత్రి పూట పిల్లాడ్ని చూసే డ్యూటీ ఆయనదేనని చెప్పు..” అని సలహా ఇచ్చింది స్నేహలత.

“రాత్రి పూట పిల్లాడ్ని చూసే డ్యూటీ అయితే ఎందుకు ఒప్పుకుంటారు? ‘పిల్ల’ను చూసే డ్యూటీ అయితే ఒప్పుకుంటారు” అంటూ అమృత మనసులోని అక్కసు అంతా వెళ్లబోసుకుంది.

అమృతవల్లి భర్త మీద ఆగ్రహావేశాలు వెలిబుచ్చటానికి, మాటలు తూటాల్లా వదలటానికి కారణం లేకపోలేదు.

పెళ్లి అయిన కొత్తలో భర్త శ్రీనివాస్ ఆమె గీసిన గీటు దాటేవాడు కాదు.

“నువ్వు గీటు గీయనక్కర్లేదు. క్రీగంట చూపులతో నన్ను ఆకట్టుకొని కట్టిపడేస్తున్నావు. కనిపించని ఈ కట్లు విడిపించుకోవటం నాకు చేతకావటం లేదు. ఇవాళ ఆపీసుకు వెళ్లలేను..” అనేవాడు.

“ఆఫీసు ఎగ్గొట్టేందుకు ఇంత నాటకం ఆడక్కర్లేదు..” అనేది అమృత నవ్వుతూ.

భర్త మీద ఏమంత ప్రేమ లేనట్లు పైకి ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఆంతర్యంలో మాత్రం కించిత్ గర్వంగానే ఉండేదామెకి. ‘మీరజాల గలడా నా యానతి’ అంటూ కూనిరాగాలు తీసేది. చిన్న పిల్లాడిని బడికి పంపినంత హైరానా పడితేగాని, శ్రీనివాస్ ఆఫీసుకు వెళ్లేవాడు కాదు. పదకొండు గంటలకు నిక్కీనీలిగీ, ఆఫీసుకు బయల్దేరినవాడు, ఒంటిగంటకల్లా మళ్లా వచ్చి ఆమె ముందు వాలేవాడు.

“అప్పుడే వచ్చేశారేంటి?” అని అడిగితే, అతను నవ్వేసేవాడు.

“లంచ్ బ్రేక్. మూడింటిదాకా. అక్కడ ఆఫీసులో కూర్చుంటే, ఆ ఏడుపుగొట్టు వెధవల మొహాలు చూస్తూ కూర్చోవాలి. అందుకని ఇంట్లో ఈ నిండు జాబిల్లిని చూడాలని వచ్చాను. నిండు సూర్యగ్రహణం నాడు పగలే చీకటి కమ్ముకుంటుందని అంటారు. మా ఇంట్లో ఏ గ్రహమూ ఏ గ్రహాన్నీ పట్టనక్కర్లేదు. పట్టపగలే నిండు చందమామ ఈ గదలో నుంచి ఆ గదిలోకి తిరుగుతూ ఉంటుంది” అనేవాడు.

“భార్య మీద ప్రేమ ఉండొచ్చుగానీ, మరీ ఇంత ఇదిగా పనికిరాదు” అనేది అమృత.

“నాకేమన్నా శ్రీకృష్ణడిలాగా ఎనిమిది మంది ఉన్నరా? ఉన్నది ఒక్కగానొక్క భార్య. కష్టాలు ‘సుఖాలు’ కల్సి పంచుకుటామని పెళ్లినాడు ప్రమాణం చేశాం గదా? మరి నేను వెళ్లి ఆఫీసులో కూర్చుంటే ఎలా? నీ దగ్గర ఉండి కష్టసుఖాలు పంచుకోవాలని లంచ్ టైంలో ఇంటికొచ్చాను” అనేవాడు.

శ్రీనివాస్‍కు భార్య అంటే వల్ల మాలిన ప్రేమ – అని ఆ చుట్టుపక్కల చెట్టునీ, పుట్టనీ అడిగినా చెబుతాయి. ఎందుకంటే అవన్నీ వీళ్ల ప్రేమకు ప్రత్యక్షసాక్షులు మరి.

ఒక రోజు ఒకే సోఫాలో ఇద్దరూ కూర్చున్నారు. “మనకి కొంత కాలం ఎడబుటు తప్పదేమో నండీ” అన్నది అమృత.

“అదేం కుదరదు. మనకు ఎడబాటు ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదు.” అంటూ సోఫాలో ఆమెకు మరింత దగ్గరకు జరిగాడు.

“కొన్ని నెలల పాటు నేను పుట్టింటికి వెళ్లక తప్పదేమో మరి” అన్నది అమృత.

“అయితే నేను అత్తారింటికి వెళ్లక తప్పదేమో మరి” అన్నాడు శ్రీనివాస్.

ఆమె నవ్వింది. అసలు విషయం చెప్పింది. “మీకు తండ్రిగా ప్రమోషన్ రాబోతోంది. పిల్లల నుంచి నేర్చుకోవల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా వాళ్లు మీ సహనాన్ని పరీక్షిస్తారు..” అన్నది.

“ముందు నీ సహనాన్ని పరీక్షించాకనే నా సహనాన్ని పరీక్షిస్తారు. ఇప్పుడు నువ్వు పసిపాపలా హాయిగా నిద్రపోతున్నావు. పసిపాప వచ్చాక నీకా అదృష్టం ఉండదు.”

“నా బాధల్లా ఒకటే. మనం ఎదిగిన పిల్లలం. ఇంకా పెద్ద వాళ్లం కాక ముందే మనకు పిల్లలా?” అన్నాడు భార్యను కౌగిట్లోకి తీసుకుని.

ఆమె పుట్టింటికి వెళ్లే మందు రోజు ఎన్నో అప్పగింతలు చెప్పింది. ఆరోగ్య సూత్రాలు వల్లించింది.

“ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. మీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. దాన్ని ఎప్పుడూ వమ్ము చేయరు కదూ..” అని లీలగా అడిగింది.

“అసలు నమ్మకం అంటే ఏమిటి?” అని భార్యను అడిగాడు.

“మనకు ఏది కనిపించదో అది ఉన్నదని భావించటాన్నే నమ్మకం అంటాం. భగవంతుడు కనిపించడు. కానీ ఉన్నాడని నమ్ముతాం. భూమి గుండ్రంగా ఉందని మనం చూడలేదు. కానీ నమ్ముతాం. కంటికి కనిపించనివి ఉన్నట్లు భమించటమే నమ్మకం. నేను దూరాన ఉన్నా మీరు నాకు అన్యాయం చేయరని భ్రమ పడుతుంటాను. అంటే ఆ నమ్మకంతో జీవిస్తుంటాను..” అన్నది అమృత.

“అది భ్రమ కాదు. నిజమే. నీకు తప్ప నా మనసులో మరొకరికి చోటు లేదు” అన్నాడు భార్యను హృదయానికి హత్తుకొని.

ఆమె మర్నాడే పుట్టింటికి వెళ్లిపోయింది. కొండంత ధీమాగా.

కాలం చాలా చిత్రమైనది. కాలం నిశ్చంతగా ఉన్నట్లే ఉంటుంది గానీ, అది క్షణం కాలం కూడా కదలకుండా ఉండదు. నదిలో నీరు నిశ్చలంగా ఉన్నట్లే ఉంటుంది గానీ, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. మన అభిప్రాయాలూ, ఆలోచనలూ స్థిరంగా ఉన్నట్లే అనిపిస్తుందిగానీ, అవి అనుక్షణం మారిపోతూనే ఉంటయి.

శ్రీనివాస్‌ను మరో బ్రాంచ్‍కి మార్చారు. అక్కడ అనుపమ పరిచయం అయింది. పక్కనే కూర్చుంటుంది.

“నాకు కొన్ని విషయాలు తెల్సు. కొన్ని విషయాలు తెలియవు. నాకు తెల్సినవి మీకు చెబుతాను. నాకు తెలియనివి మిమ్మల్ని అడుగుతాను. మీరు చెప్పండి. అలా మన ఊహాలు కలబోసుకుందాం. నాకు తెల్సినంత వరకూ ఈ ఆఫీసులో అందరికీ తలా ఒకరకమైన పిచ్చి ఉంది. ఒకడికి ప్రమోషన్ పిచ్చి. ఒకడికి పైరవీల పిచ్చి. ఒకడికి లంచాల పిచ్చి. ఒకడికి పని ఎగ్గొట్టి తిరిగే పిచ్చి, ఒకడికి పితూరీలు చెప్పే పిచ్చి. ఒకడికి ఇతరుల విషయాలు కూపీ లాగే పిచ్చి. ఇంత మంది పిచ్చివాళ్లతోనున్న పిచ్చాసుపత్రి ఇది” అన్నది అనుపమ.

“ఇంత మందిలో నేనే రకం పిచ్చి వాడ్ని” అని అడిగాడు శ్రీనివాస్.

“ఏమో.. మీ గురించి తెలియదు గానీ, మీరంటే నాకు పిచ్చి.. అభిమానం..” అన్నది అనుపమ. రెండు రోజుల తర్వాత ఆమె కుర్చీ అతనికి కొంచెం దగ్గరికి లాక్కుంటూ “మనం మరింత దగ్గరైపోతున్నాం గదా..” అన్నది.

శ్రీనివాస్ అనుపమ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడల్లా.. భార్య అమృత కళ్ల ముందు కదిలేది. ఆమె గురించి ఒకటికి రెండుసార్లు చెబుతుంటే, అనుపమ, “మీకు పెళ్లాం పిచ్చి అనుకుంటా” అంటూ సమ్మోహనంగా నవ్వింది. “ప్రపంచంలో చాలా మంది జంటల్ని చూస్తుంటాను, పొడుగ్గా ఉండే ఆమెకు పొట్టిగా ఉండే భర్త. లావుగా ఉండే ఆమెకు సన్నగా ఉండే భర్త. ఎర్రగా ఉండే ఆమెకు నల్లగా ఉండే భర్త. తెలివిగల వాడికి తెలివి తక్కువ భార్య. అయోమయం శాల్తీకి ఇండియాను అమ్మేసే తెలివిగల భార్య. ఎంత అస్తవ్యస్తమైన సంసార జీవితాలో గదా అని అనిపిస్తుంది. కానీ పిటీ ఏమిటంటే ఏ మాత్రం పొసగని వ్యక్తిని ప్రేమిస్తూ, జీవితాంతం భరించటం. సహించటం.. వాట్ హరిబుల్ పనిష్‌మెంట్?” అన్నది అనుపమ.

ఆమె ఆ విమర్శలు చేసిన తరువాత శ్రీనివాస్ ఇంకెప్పుడూ ఆమె ముందు తన భార్య ప్రస్తావన తీసుకరాలేదు. పైగా అనుపమ చాలా తెలివిగలది అన్న విషయం అతనికి అర్థమైంది. ఆమెకు అందం, తెలివి, చొరవ, అన్నీ ఉన్నయని తెల్సాక, అతనికి తెలియకుండానే ఆమె ఆకర్షణలో పడిపోయాడు. నగరంలో అతనికి తెలియని ఎన్నో చోట్లకు తనతో తీసుకవెళ్లి అతను అంతకు ముందు చూడని ఎన్నో అందాలు చూపించింది. దానితో ఆమె తనకన్నా ఎంతో ఎత్తున ఉన్నదన్న విషయం అవగాహనలోకి వచ్చింది.

“మనిషి నిత్యం సౌందర్యోపాసకుడు. బ్రతికిన నాలుగు రోజులూ సుఖసంతోషాల మీద తేలిపోవాలని అనుకుంటాడు. అతను చేస్తున్నది తప్పా. ఒప్పా అన్నది కాదు ముఖ్యం. ఆ తప్పు చేయటంలో అతను ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడన్నది ముఖ్యం..” అన్నది అనుపమ శ్రీనివాస్ పక్కన నిలబడి చేతిలో చేయి కలిపి.. వేళ్ల సందుల్లో వేళ్లు దూరుస్తూ.. తెలియని అనుభంధంతో బంధిస్తూ..

“జీవితం ఒక ఆట. ప్రతి ఆటకీ కొన్ని రూల్స్ ఉంటయి. కానీ చిత్రం ఏమిటంటే, ప్రతి ఆటగాడూ రూల్స్ పాటిస్తున్నట్లు కనిపిస్తూనే, రూల్సును అధిగమించి గెలుపు సాధించాలని ప్రయత్నిస్తుంటాడు. అది సరే, నాకు తెల్సిన విషయాలు మీకు చెబుతుంటాను, మీకు తెల్సిన విషయాలు నాకు చెప్పాలి అని మొదటే చెప్పాను. కానీ ఎప్పుడూ నేనే చెబుతున్నాను. మీరేమీ చెప్పటం లేదు. బహుశా మీరంటే నాకు పిచ్చి.. అందుకే ఇలా తెలిసీ తెలియనవన్నీ వాగుతున్నాను..” అన్నది అనుపమ.

నిజానికి అతను ఆమె ముందు మంత్ర ముగ్ధుడులా అయిపోతున్నాడు. ఆమెను కాదని ఏం చెప్పాటానికీ అతనికి నోరు పెగలటం లేదు. మాటలు రాని మూగవాడు అయిపోతున్నాడు.

“మన గురించి ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారని, ఎవరో నాతో అన్నారు” అన్నాడు ఒక రోజు.

“మన గురించి నలుగురూ ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు. మనం మన గురించి ఏమనుకుంటున్నాం అన్నది ముఖ్యం” అని చెప్పింది అనుపమ.

“నాకిప్పుడు సొంత అభిప్రాయాలంటూ ఏమీ లేవు. రిమోట్ కంట్రోలు నీ చేతులో ఉంది” అన్నాడు శ్రీనివాస్.

అనుపమ ఏదంటే, అతను అదే సరైనదంటున్నాడు. కాదనే స్థితిలో లేడు.

వీళ్ల ప్రేమ ముదిరిపోయాకగానీ, అమృత పిల్లాడిని ఎత్తుకొని ఇంటికి రాలేదు.

వచ్చిన కొద్ది రోజులకు నెమ్మదిగా అన్ని విషయాలూ తెల్సివచ్చాయి. ఒకప్పుడు  ‘మీరజాల గలడా నా యానతి’ అని అనుకున్న వాడే ఇప్పుడు ఆమెకు అసలు విలువే ఇవ్వటం లేదు. ఇంట్లో ఉండే సమయమే తగ్గిపోయింది. ఆమె చేతికి ఇచ్చే డబ్బూ తక్కువే. ఆమె చేతి మీదిగా వండి పెడితే తినేది తక్కువే.

“దాని దగ్గర తిని, దాని దగ్గరే ఉంటున్నారు” అంటూ కన్నీరు తుడుచుకుంటోంది అమృతవల్లి.

ఇదంతా చూసి సహించలేకపోతోంది పక్కింటి స్నేహలత. ఈ అన్యాయాన్ని ఎదిరించాలని అనుకుని, స్నేహలత, అనుపమకు ఒక లేఖ రాసింది. అందులో అనుపమను తిట్టలేదు. దూషించలేదు. దుమ్మెత్త పోయ్యలేదు.

“నేనెవరో మీకు తెలియదు. అయినా ఫర్వాలేదు. ఒక సోదరిగా భావించి, ఈ చిన్న సలహా పాటించండి. జీవితంలో ఎప్పుడూ ఎవరు ఎవరికి ఎక్కడ ఎలా తారసపడతారో, అనుబంధాలతో బందీ అవుతారో తెలియదు. ప్రేమించటం తప్పు కాకపోయినా, ప్రేమ ఎప్పుడూ పన్నీరు గానో, కన్నీరు గానో మిగిలి పోతుందన్నది కాదనలేని సత్యం. కనిపించిన ప్రతి స్త్రీ సౌందర్యాన్ని ప్రేమించటం పురుషుడి నైజం. శ్రీనివాస్‌కు అమృతవల్లితో వివాహం అయింది. అంటే మీకన్నా ముందే ఆమెతో బంధం ఏర్పడింది. ఒకరి కంటి వెలుగు మరొకరు అన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ల మధ్యలో వచ్చి ఇద్దర్నీ విడదీస్తే, మిగిలేది చీకటి. జీవిత పర్యంతం అనుభవించాల్సినది దుఃఖమే. ఇందులో న్యాయాన్యాయాల మాట ఎలా ఉన్నా, ఎంతో కొంత నిజాయితీ లేని ప్రేమ అవినీతి కిందకి వస్తుంది. నేరస్థులుగా ముద్రపడకముందే, మీ నిజాయితీ నిరూపించుకోండి.”

ఆ ఉత్తరం అందుకున్నాక అనుపమ ఆలోచనలో పడింది. భార్యకు విడాకులు ఇవ్వమని శ్రీనివాస్‌ని పోరటం మొదలు పెట్టింది.

అమృత పిల్లాడిని తన పుట్టింట్లో తల్లి దగ్గర దించి వచ్చింది. రోజూ బయటకు వెళ్లి వస్తోంది. ఉద్యోగాన్వేషణలో.

“ఎక్కడికి వెడుతున్నావు?” అని అడిగాడు శ్రనీవాస్.

“నాకు తెలియదు. నాది ఎడారి దారి” అన్నది అమృత.

అతను భార్యను దగ్గరకు తీసుకోబోయినా ఆమె మృదువుగానే తిరస్కరించింది.

“నేను మీ మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశారు. నా మీద మీకున్న హక్కు మీరే పొగొట్టుకున్నారు. చట్టరీత్యా ఇంకా నేను మీ భార్యను గనుక నన్ను పోషించాల్సిన బాధ్యత మీకు ఉన్నది. నాకు ఉద్యోగం వచ్చే వరకూ ఈ ఇంట్లో ఉండక తప్పటం లేదు” అన్నది అమృత.

ఆ సాయంత్రం శ్రీనివాస్ అనుపమతో అన్నాడు “నా బాధను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు.”

“నా బాధను మాత్రం ఎవరు అర్థం చేసుకున్నారు? విడాకులు తీసుకున్నాకే నా దగ్గరకు, రండి” అన్నది అనుపమ.

వాళ్లిద్దరూ విడిపోలేదు. అలా అని అన్యోన్యంగా ఉండటం లేదు.

వీళ్లద్దరూ కల్సి ఉంటం లేదు. అలా అని మర్చిపోయి ఎవరి దోవన వాళ్లు బ్రతకటం లేదు.

ముగ్గురిదీ – ఎడారి దారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here