[వర్తమాన ఆఫ్రికన్ కవయిత్రుల కవితలను పాఠకులకు పరిచయం చేసే క్రమంలో Lebogang Mashile రచించిన ‘Tell Your Story!’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి]
*
[dropcap]వా[/dropcap]ళ్ళు.,నీ మెదడు నుంచి నీ స్మృతులను చెరిపేసాక..
నీ కళ్ళ నుంచి కలలను గుంజుకున్నాక..
నీ మానసిక సంతులనపు గీతను విరిగగొట్టేశాక..
మిగిలిన అబధ్ధాలతో నిజాల్ని అవకతవకగా అతక బెట్టాక..
చివరికి.. అవకాశాలు.,ఆర్తనాదాలుగా మిగిలిపోయిన
గొంతులు నిన్ను ఒంటరిగా వదిలేసాక.,
నీ ఎముకలకు మాంసం గట్టిగా అంటుకుపోయినట్లు
నిశ్శబ్దం ఘనీభవించినాక., అప్పుడిక వాళ్ళు నీ అంతరాత్మ
అసలు నివాసం ఎక్కడుందో పసిగట్టేస్తారు.
నువ్వు నీ కోసం ఎంచుకున్న సున్నితమైన
దారులని.. వెలిగించడాన్ని అడ్డగిస్తారు.
పాత మకిలి పట్టిన అధ్ధాలు.. నకిలీ మత ప్రవక్తలు..
నీ నుంచే నిన్ను.. తీసేయడానికో లేదా.,
దొంగలించడానికో ఎప్పుడూ దారి కాచి ఉండనే ఉంటారు .
నీవి కాని ఏడు పేర్లతో బతికే నిన్ను..
వాళ్ళిచ్చిన ఏడు మొఖాలతో నడిచే నిన్ను.. ఎప్పుడూ
..నీ నుంచి నిన్నే తొలగించడానికి సిద్ధంగా ఉంటారు.
వాళ్ళు నిన్ను ఇలా చేసినప్పుడు.. ఒంటరిగా..
నీకు నువ్వే ఒక అపరిచితురాలుగా నిన్ను మార్చేసినప్పుడు
ఇక ఈ లోకంలో ఎవరూ కూడా.. నీనొప్పిని.. బాధను పోగొట్టలేరు.
అందుకే.. ఇక వాళ్లు చేసినట్లు.. చెప్పినట్లు ఉండకు!
నీ అసలైన కథ చెప్పడం మొదలు పెట్టు!!
నువ్వు చెప్పే ఆ కథ నిన్ను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది!
నీ సమస్తాన్నీ భరిస్తుంది!
అంతేనా., నీ హక్కుల్ని కాపాడుతుంది!
అందుకే.. నీ కథ చెప్పడం మొదలుపెట్టు..!
ఇక చూడు నీ కథ ఎలాంటి అద్భుతం చేస్తుందో..?
నీకు ఆహారమై నిన్ను పోషిస్తుంది.
నీ మనోదేహాల బాధలకు చికిత్స చేస్తుంది!
ఇక చివరగా నువ్వు చెప్పుకునే నీ కథ ఏం చేస్తుందో తెలుసా..
నీకు విముక్తి నిస్తుంది!
అవును నీ సమస్త బాధల నుంచి..
నిన్ను ఎవరో తయారు చేయడం నుంచి.,
నీకు విముక్తి నిస్తుంది
నిన్ను విడుదల చేస్తుంది.
అందుకే.. వాళ్ళకి నీ కథ చెప్పు..
అసలైన కథ!
ఎందుకంటే నీ కథ.,
ముక్కలైపోయిన నీ హృదయ శకలాల్ని తిరిగి అతికిస్తుంది.
అందుకే నీ కథ చెప్పు.. చెబుతూనే ఉండు..!
ఎప్పటిదాకా అంటే.. నీ గతం..
నీ సుందరమైన వర్తమానాన్ని
పాడు చేయడాన్ని పూర్తిగా ఆపేదాకా..!!
చెప్పడం ఆపకు! నీ కథ..
చెబుతూనే ఉండు..
నువ్వెంటో.. నీకేం కావాలో.. నువ్వెలా ఉండాలనుకుంటున్నావో..
నీ కథ ద్వారా చెబుతూనే ఉండు!
~
మూలం: లెబోగాంగ్ మెషీల్
అనువాదం: గీతాంజలి
Lebogang Mashile.. నటి, కవయిత్రి, ప్రచురణకర్త,. ఉపన్యాసాకురాలు, దర్శకురాలు. దేశం నుంచి బహిష్కరించబడిన సౌత్ ఆఫ్రికన్ దంపతులకు అమెరికాలో 1979లో జన్మించింది. 1994కి తిరిగి తన మాతృదేశానికి తిరిగి వచ్చేదాకా మెషీల్ అమెరికాలో పెరిగింది.. విట్స్ యూనివర్సిటీ లో Law & international relations కోర్స్ చదువు కోనసాగించింది.
సౌత్ ఆఫ్రికాలో చాలా ప్రసిద్ధ రచయిత్రి మెషీల్. కవిత్వానికి సంగీత లయబద్దతను సాధించిన కవయిత్రి. ఆమె కవిత్వం పాటలుగా పాడడం కోసం ఒక సంగీత బ్యాండ్ లేబొ మెషీల్ లైవ్ సీడీ లుగా ఏర్పడ్డాయి. ప్రఖ్యాత నోమా లాంటి అనేక అవార్డులు అందుకున్నారు.హోటల్ రువాండా ఫిలింలో నటిగా మారారు. సౌత్ ఆఫ్రికన్ స్త్రీల సమస్యలను ఆధారంగా అనేక టీవీ సీరియల్స్ కి దర్శకత్వం వహించారు.
మెషీల్ కవిత్వంలో స్త్రీల అణిచివేతని ప్రశ్నించే స్త్రీవాద తత్వం.. serious రాజకీయ చర్చలు ఉంటాయి.
ఆమె ప్రసిద్ధ రచనలు – In a ribbon of rythm-poetry-2005. Flying above the sky-poetry.