[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]“మాం[/dropcap]క్టన్ బృందం విఫలమైనా, నా బృందం విజయం సాధిస్తుందనేందుకు నా కారణాలు నాకు ఉన్నాయి” స్పందించాడు రజ్వీ.
“ఏమిటా కారణాలు?” అడిగాడు సర్ సుల్తాన్.
“అలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు నన్ను అడగకండి” అని నిజామ్ వైపు తిరిగి – “మా చర్చ బృందం తప్పనిసరిగా విజయం సాధిస్తుందన్న విశ్వాసం నాకుంది” అన్నాడు రజ్వీ.
“కనీసం ఒక్క కారణమనా చెప్పాలి” అడిగాడు సర్ సుల్తాన్.
“ఉత్తరాదిన సంభవిస్తున్న సమస్యలతో తలమునకలుగా ఉంది భారత ప్రభుత్వం. మనం గట్టిగా పట్టుపడితే, వాళ్ళేం చేయలేరు. మన కోరికలను తిరస్కరించలేరు” అని నిజామ్ వైపు తిరిగి “చర్చలు కొనసాగించేందుకు నాకు ఒక్క అవకాశమైనా ఇవ్వండి” అన్నాడు.
మాంక్టన్‍తో సహా ఇతర సభ్యులంతా ఖచ్చితంగా ఉన్నారు. “ఘనత వహించిన ప్రభువు ప్రతిపాదనలను ఎలాంటి చర్చ బృందమైనా సాధించలేదు. ఈ విషయంపై సర్దార్ పటేల్ పట్టుదలగా ఉన్నాడు. మనకు లాభం కలిగించే ఎలాంటి వాదననయినా మేము ప్రయోగించి చూడకుండా వదలలేదు” అన్నాడు సర్ సుల్తాన్.
రజ్వీ తన పట్టు వదలలేదు. మొయిన్ నవాబ్ జంగ్, అబ్దుల్ రహీమ్ వంటి పాలనా మండలి సభ్యులను కొత్త చర్చ బృందంలో చేర్చాలని రజ్వీ పట్టుపట్టాడు.
రజ్వీ వైపు మొగ్గుతున్నట్టు కనిపించాడు నిజామ్. దాంతో చర్చ బృందానికి చెందిన నలుగురు సభ్యులు రాజీనామా చేశారు. కాసిమ్ రజ్వీ నిజామ్ వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు.
అతడు వెళ్ళగానే, “ఈ పనికిరాని దుష్టుడు పిచ్చివాడయినట్టున్నాడు” అని అన్నాడు నిజామ్.
సర్ సుల్తాన్ నిరసన ప్రదర్శించాడు. “ఈయన చర్చల్లో పాల్గొన్నప్పుడే మాకు చిరాకు కలిగింది. ఘనత వహించిన ప్రభువును ఇతని సమక్షంలో కలిసేందుకు మేము నిరాకరించాము”.
ఆ తరువాత సభ్యులు వెళ్ళిపోయారు. నిజామ్ వారి రాజీనామాలను ఆమోదించాడు.
రజ్వీ ప్రవర్తనకు ఒక ప్రత్యేక రకమైన ఆలోచనా విధానం కారణం. అంతర్గత విభేదాలు, బాహ్య సమస్యల వల్ల భారత ప్రభుత్వం అస్థిరంగా ఉన్నదనీ, ఎక్కువ కాలం నిలబడలేదన్నది ఇతర ఇత్తెహాద్ నాయకుల లాగే రజ్వీ నమ్మకం కూడా. ఢిల్లీలో త్వరలో ప్రభుత్వం మారుతుందన్నది వీరందరి ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఈ సమయంలో చర్చలను భంగం చేస్తే, భారత ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుంది. హైదరాబాద్ పై ఎలాంటి చర్య తీసుకోలేదు. హైదరాబాద్ తన స్థితిని శక్తివంతం చేసుకోవచ్చు. అలా కాక, యథాతథ ఒప్పందాన్ని స్వీకరించి, భారత్‍లో విలీనం సమస్యను మరో సంవత్సరం పాటు వాయిదా వేస్తే, ఈ లోగా భారత ప్రభుత్వం శక్తి పుంజుకోవచ్చు. హైదరాబాద్ చర్యలను అడ్డుకోవచ్చు.
లాయక్ అలీ మంత్రివర్గం:
అక్టోబర్ 31న ఓ లేఖ ద్వారా నిజామ్ భారత ప్రభుత్వాన్ని బెదిరించాడు. చర్చలు ముందుకు సాగకపోతే, తాను పాకిస్తాన్ కోరికను ఆమోదిస్తానని రాశాడు. అంతా ఇత్తెహాద్ చెప్పిన ప్రకారం సాగుతోంది.
రజ్వీ చెప్పిన ప్రకారం ఓ కొత్త చర్చ బృందం ఏర్పాటయింది. రాజ్యంగ వ్యవహారాల శాఖకు నియమితుడయిన అలీ యావర్ జంగ్, ఇత్తెహాద్ నాయకుడు అబ్దుల్ రహీమ్, పింగళి వెంకట రామిరెడ్దిలతో కొత్త బృందం ఏర్పడింది.
హైదరాబాద్ రాష్ట్రంలోని జాగీర్దార్ లలో పింగళి వెంకట రామిరెడ్డి ఒకరు. ఆయన తెలివైన వాడు. చక్కటి వ్యాపారి. ఆయనకు అధికారం పైన కానీ, రాజకీయాలపై కానీ ఆసక్తి లేదు. ఆయన అబ్దుల్ రహీమ్‍కు సన్నిహితుడు. విశ్వాసపాత్రుడయిన మిత్రుడు. కాబట్టి అతని మాటను మన్నించి బృందంలో సభ్యుడయ్యేందుకు మొగ్గు చూపాడు. అయితే, ఫలితం ఏదైనా తాను సురక్షితంగా ఉండేందుకు, కొత్త బృందం కూడా గొప్పగా సాధించిదేమీ లేదు అని ఓ పత్రాన్ని నిజామ్‍కు సమర్పించాడు. పింగళి రెడ్డితో నాకు చక్కటి స్నేహ సంబంధాలున్నాయి. 1937లో నేను బొంబాయి జీవిత బీమా సంస్థ చైర్మన్‍గా ఉన్నప్పుడు ఆయన దాని డైరక్టర్‍గా ఉండేవారు. అయితే, హైదరాబాదులో ఆయన ఇత్తెహాద్ సంస్థ పరమత సహనానికి హిందూ ప్రతీక కాబట్టి ఆయన నేనెవరో తెలియనట్టు ప్రవర్తించేవాడు. అదే న్యూ ఢిల్లీలో, బొంబాయిలో నాకు చాలా సన్నిహితుడు. హైదరాబాద్ విశేషాలు హాయిగా చెప్తుండేవాడు. అయితే మొదటి నుంచీ ఆయన హైదరాబాద్‌కి ఓటమి తప్పదని కొంటె నవ్వుతో అంటూండేవాడు.
నవంబర్ 2న హైదరాబాద్‍కు చెందిన నూతన చర్చా బృందం మౌంట్‍బాటెన్‍ను కలిసింది. మొయిన్ నవాబ్ ఎంతగా వాదించినా లాభం లేకపోయింది. మౌంట్‍బాటెన్ దృఢంగా ఉన్నాడు. కొన్ని సందర్భాలలో కఠినంగా కూడా వ్యవహరించాడు. చర్చలను కొనసాగించేందుకు ఆయన నిరాకరించాడు. యథాతథ ఒప్పందం, దానికి సంబంధించిన ఇతర పత్రాలను రెండు పక్షాలూ ఆమోదించాలి, దానికి కట్టుబడి ఉండాలి అని గట్టిగా పట్టుబట్టాడు. నిజామ్ కనుక ఈ ఒప్పందాన్ని ఆమోదించకపోతే, తిరుగులేని నష్టం కలుగుతుందన్నాడు. భారతదేశం శక్తి గురించి ఉన్న అపోహలు, దురూహలను చర్చ బృందం మెదళ్ళ లోంచి తొలగించుకోమన్నాడు. భారతదేశం అత్యంత శక్తివంతమైనదనీ, ప్రపంచంలోని అతి పెద్ద సైన్యం ఉన్న దేశాలలో భారత్ ఒకటని గుర్తు చేశాడు.
చివరికి రెడ్డి వైపు తిరిగి, అతడి అభిప్రాయాన్ని అడిగాడు మౌంట్‍బాటెన్. “నా పాలకుడి అభిప్రాయమే నా అభిప్రాయం” అన్నాడు రెడ్డి. ఈ విషయం ఆయనే స్వయంగా నాతో చెప్పాడు.
చర్చ బృందం ద్వారా జరిగిన సంగతులు తెలుసుకున్న నిజామ్ కంగారుపడ్డాడు. మౌంట్‍బాటెన్ ఇంగ్లండ్ ప్రయాణం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేవరకూ చర్చలను వాయిదా వేయమని అభ్యర్థించాడు.
కాస్త సమయం లభించగానే నిజామ్ ఆలోచించాడు. ఇంగ్లండ్ వెళ్తున్న మాంక్టన్‍తో సంబంధాలను మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు. చర్చలు సాగుతున్న విధానల పట్ల విరక్తితో మాంక్టన్ ఇంగ్లండ్ ప్రయాణమయ్యాడు. నిజామ్, మాంక్టన్‍ల నడుమ ఉత్తరాలు, టెలిగ్రామ్‍లు జోరుగా సాగాయి.
రాజ్యాంగ సలహాదారు అయిన మాంక్టన్ ఇంగ్లండ్ పర్యటనను వాయిదా వేసుకోవాలని, లండన్‍కు వెళ్ళే దారిలో ఓ సారి కరాచీలో జిన్నాని కలవాలని నిజామ్ కోరాడు. తాను జిన్నాని కలవనని మాంక్టన్ నొక్కి చెప్పాడు. తన సలహాను నిజామ్ త్రోసిరాజన్నాడు, తాను సభ్యుడిగా ఉన్న చర్చా బృందం రద్దయింది కాబట్టి తాను జిన్నాను కలవనని, జిన్నాను కలవటం అంటే అంత అమోదకరమైన చర్య కాదని చెప్పాడు. ఎందుకంటే, మాంక్టన్‍కు వ్యతిరేకంగా ఇత్తెహాద్ అప్పటికే జిన్నాకు ఎంతో చేరవేసి ఉంటుంది కాబట్టి. అయితే భారత్‍తో యథాతథ ఒప్పందం చేసుకోమని మాంక్టన్, నిజామ్‍ను ఒత్తిడి చేయటం మానలేదు. ఈ ఒప్పందం వల్ల కొంతకాలం అయినా హైదరాబాదులో శాంతి నెలకొంటుంది కాబట్టి, ఈ సమయంలో భారత ప్రభుత్వం ఎలా సాగుతుందో చూడవచ్చు, హైదరాబాద్‍ను శక్తివంతం చేయవచ్చన్నది మాంక్టన్ అభిప్రాయం.
నవంబరులో మాంక్టన్ జిన్నాను కలిశాడు. అప్పటికి జిన్నా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మాంక్టన్‍కు ఎక్కువ సమయం కేటాయించే స్థితిలో లేడు. కాబట్టి వారి చర్చల వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదు. లండన్‍లో మౌంట్‍బాటెన్‍ను కూడా కలిశాడు మాంక్టన్. తన అభిప్రాయం మారదని మౌంట్‍బాటెన్ స్పష్టం చేశాడు. చర్చల వల్ల ఎలాంటి లాభం లేదని నిర్మొహమాటంగా చెప్పాడు.
ఈ సమయంలో, హైదరాబాదులో కాసిమ్ రజ్వీ, అతని అనుచరులు అవకాశం దొరికినప్పుడల్లా సర్దార్‍ను, భారత ప్రభుత్వాన్ని తమ బహిరంగ సభలలో కరువు తీరా విమర్శిస్తూ వచ్చారు. నిజామ్ ప్రభుత్వంలోని సభ్యుల పట్ల ప్రజలకు విశ్వాసం లేదని రజ్వీ అన్నాడు. దక్కన్ ముస్లింలకూ, పాకిస్తాన్ ఖైద్-ఎ-ఆజామ్‍కు, పాకిస్తాన్ లోని ముస్లింలకు – హైదరబాదును రక్షించాలని బహిరంగంగా పిలుపునిచ్చాడు.
నవంబర్ 24న, మొయిన్ నవాజ్ నేతృత్వంలో చర్చ బృందం ఢిల్లీ ప్రయాణమయింది. మరుసటి రోజు వారు మౌంట్‍బాటెన్‍ను కలిశారు. ఒప్పందంలో ఎలాంటి మార్పులను చర్చించేందుకు కూడా మౌంట్‍బాటెన్ ఇష్టపడలేదు. 29న బృందం హైదరాబాద్ తిరిగి వచ్చింది. కొన్ని అంతగా ప్రాధాన్యం లేని మార్పులతో నిజామ్ యథాతథ ఒప్పందంపై సంతకం చేశాడు. అనుషంగిక పత్రాలకు కూడా ఆమోదం తెలిపాడు నిజామ్.
అదే రోజు, నిజామ్ యథాతథ ఒప్పందాన్ని ఆమోదించాడని, రాజ్యాంగ సభలో ప్రకటించారు సర్దార్. సర్దార్ ప్రకటనకు హర్షధ్వానాలు చేసినా, ఒప్పందం వల్ల లాభం ఉండదన్న అనుమానం కలిగింది. భారత్‍లో విలీనాన్ని తప్పించుకోవటంలో నిజామ్ విజయం సాధించాడన్న అభిప్రాయం ప్రజలలో కలిగింది.
సర్ వాల్టర్ మాంక్టన్‌ను మళ్ళీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ఆరంభించాడు నిజామ్. నిజామ్ ఆస్థానానికి తమ ప్రతినిధులను పంపేట్టు ఇంగ్లండ్‍ను ఒప్పించగలడా? ఇంగ్లండ్, హైదరాబాద్‍తో సంబంధాలు పెట్టుకుంటుందా? అంటూ ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని మాంక్టన్‍ను కోరాడు నిజామ్.
నవాబ్ ఛత్తారీ రాజీనామా తరువాత తాత్కాలికంగా ప్రధానమంత్రి పదవి చేపట్టాడు సర్ మెహ్దీ యార్ జంగ్. ఆయనను తొలగించి ఆ స్థానంలో మీర్ లాయక్ అలీని ప్రధానిగా నియమించాలని రజ్వీ ప్రతిపాదించాడు. నిజామ్‍కి ఈ ఆలోచన అంతగా నచ్చలేదు. ఎందుకంటే లాయక్ అలీ, రజ్వీ సమర్థకుడు. రజ్వీ తనకు నచ్చలేదని వాల్టర్ మాంక్టన్‍కు ఫిర్యాదు చేశాడు నిజామ్.
లాయక్ అలీని ప్రధానిగా నియమించవచ్చునా అని నిజామ్ జిన్నా సలహాను కోరాడు. పాకిస్తాన్ నిర్మాణ కార్యక్రమాలకు లాయక్ అలీ అవసరం కాబట్టి ఈ ఆలోచన పట్ల జిన్నా సుముఖత వ్యక్తం చేయలేదు. లాయక్ అలీ ప్రధాని అవటం చర్చలపై దుష్ప్రభావం చూపిస్తుందన్నాడు.
ఈ సలహాను స్వీకరించేందుకు నిజామ్ సిద్ధంగానే ఉన్నాడు. ఇత్తెహాద్‍కు చెందిన వ్యక్తి ప్రధాని అవటం నిజామ్‍కు ఇష్టం లేదు. అబ్దుల్ రహీమ్ సూచన ప్రకారం పింగళి వెంకట రామిరెడ్డి ప్రధాని అవటం ప్రయోజనకరం కాదు అని భావించాడు నిజామ్. కానీ నిజామ్ పై ఒత్తిడి పెరిగింది. 24 నవంబర్ 1947న లాయక్ అలీకి ప్రధాని పదవి కట్టబెట్టే విషయంలో నిజామ్ మళ్ళీ జిన్నాను సంప్రదించాడు.
ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తాను, రజ్వీకీ, భారత ప్రభుత్వానికి నడుమ ఇరుక్కున్నానని గ్రహించాడు నిజామ్. చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. పాకిస్తాన్‍కు సేవ చేయటంలో మునిగి ఉన్న లాయక్ అలీని వాగ్దాన విముక్తుడిని చేసేందుకు జిన్నా సిద్ధపడ్డాడు. లాయక్ అలీ హైదరాబాద్ ప్రధానమంత్రి అయ్యాడు.
ఈ విజయంతో పవిత్ర యుద్ధ వీరుడిలా ఎదిగాడు రజ్వీ. బహిరంగ సభలలో రజ్వీకు పవిత్ర ఖురాన్‍ను, ఖడ్గాన్ని బహుకరించారు. పవిత్ర మత యుద్ధానికి నాయకుడిగా, రజ్వీ తన బాధ్యతను స్వీకరించాడు. పలు ప్రాంతాలకు సైన్యాధికారులను నియమించాడు. సరిహద్దుల రక్షణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.
రజ్వీ సూచనలను అనుసరించి ప్రధానిని నియమించటమే కాదు, మొత్తం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటంలో రజ్వీ సూచనలను ఆమోదించటంతో రజ్వీకి నిజామ్ లొంగి పోవటం సంపూర్ణమయింది.
అబ్దుల్ రహీమ్ నమ్మకస్తుడు పింగళి వెంకట రామిరెడ్డి ఉప ప్రధానిగా నియుక్తుడయ్యాడు. ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా మొయిన్ నవాజ్ జంగ్‍ను నియమించాడు. అబ్దుల్ రహీమ్ తో సహా, రజ్వీ సన్నిహితులు మరో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం లభించింది.
మంత్రివర్గంలో ఇద్దరు హిందూ మంత్రులకే రజ్వీతో సంబంధం లేనిది. రామానంద తీర్థను వ్యతిరేకించే రాష్ట్ర కాంగ్రెస్‍కు చెందిన రామాచార్‍కు మంత్రివర్గంలో స్థానం లభించింది. అతి త్వరలో రాజ్యంగ సంస్కరణలు అమలు పరుస్తామన్న వాగ్దానాల వల్ల అతను మంత్రివర్గంలో చేరాడు. లింగాయత్ హిందువుల ప్రతినిధిగా శ్రీ మల్లికార్జునప్పకు మంత్రివర్గంలో స్థానం లభించింది.
ఇత్తెహాద్ హరిజనులుగా గుర్తింపుపొంది , ఇత్తెహాద్ సమర్థకులయిన హరిజన నాయకుడు వెంకటరావుకు అణగారిన వర్గాల ప్రతినిధిగా మంత్రి పదవినిచ్చారు. అవకాశాన్ని వదులుకోని తెలివైన రాజకీయ నాయకుడు వెంకటరావు. హరిజనులు భారత్‍లో భాగం కాదని, వారు ప్రత్యేకమైన దేశం అని ప్రకటించి బహదూర్ యార్ జంగ్‍తో చేతులు కలిపి రాజకీయ మెట్లు ఎక్కాడు వెంకటరావు. అయితే, హరిజనుల మత మార్పిళ్లు తీవ్రమైనప్పుడు, ప్రజలలో ఆందోళనలు పెచ్చరిల్లగానే, ఈయన కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు, బలవంతపు మత మార్పిళ్ళను ఖండించాడు. హరిజనులు ప్రథమంగా హిందువులు అని ప్రకటించాడు. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ బలహీన పడగానే మళ్ళీ మాట మార్చేశాడు. హరిజనులు హిందువులు కాదని ప్రకటించి, కాసిమ్ రజ్వీ గౌరవం పొందాడు. అలా ప్రకటించినందుకు తగిన బహుమతి పొందాడు. నిజామ్ మంత్రివర్గంలో స్థానం లభించింది.
జాల్నాలో ఓ ఇంజనీరింగ్ కంపెనీ అధికారి, గుజరాతీ వ్యాపారి జోషీకి కూడా మంత్రి పదవి లభించింది.
ఓ పార్టీలో ఈయన నన్ను కలిశాడు. ఎంతో సన్నిహితుడిలా సంభాషించాడు. నా భార్య ఆరోగ్యం, నా ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు నేను ఆతిథ్యం ఇస్తున్న వ్యక్తి వైపు తిరిగి ఈయనను నాకు పరిచయం చేయమని అడిగాను. చుట్టూ ఉన్న వారంతా పెద్దగా నవ్వారు. అతడు ఇబ్బంది పడ్డాడు.
“మీరు నన్ను మరిచిపోయారు. నేను జోషీని” అన్నాడు.
“అతను కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో మంత్రి” పరిచయం చేశారు.
మరుసటి రోజు జోషి, అతని భార్య మా ఇంటికి వచ్చారు.
“మున్షీజీ, నన్ను ఇబ్బంది పాలు చేశారు. నేను మీ శిష్యుడినని అందరికీ చెప్పాను”
“కానీ నాకేం తెలుసు, మీకు విద్యాబుద్ధులు నేర్పిన అదృష్టం నాకు కలిగిందని” అన్నాను. నవ్వు ఆపుకోలేకపోయాను.
(ఇంకా ఉంది)