[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
[dropcap]ఈ[/dropcap] ఎండాకాలం సెలవలలోనే మరోటి ముఖ్యమైనవి.. యాత్రలు.
ఇంట్రెస్ట్ వున్న వాళ్ళు, పిల్లలకి సెలవలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ వుంటారు. అవి తీర్థయాత్రలు కావచ్చు.. విహారయాత్రలు కావచ్చు.. శుభకార్యాల కోసం అవొచ్చు.. ఏదైనా కానీయండి.
ఒకప్పటి రోజుల్లో, ముందుగా ప్రయాణం రిజర్వేషన్లు, అక్కడ హోటల్ గదుల రిజర్వేషన్లు గట్రా పెద్దగా ఉండేవి కాదు. అప్పటికప్పుడు ప్రయాణమై వెళ్లి అక్కడ వసతులు చూసుకోవడమే జరిగేది.
ఇప్పుడు హాయైన ప్రయాణాలు అలవాటై, అప్పుడు ఎలా చేసామో, అనిపిస్తోంది.
నాకైతే బాగా గుర్తు.. తిరుమల వెంకన్న దర్శనం కోసం వెళ్ళినపుడు, కొండ మీదకు టిటిడి బస్సుల్లో వెళ్లి, కాటేజీ బుకింగ్ కోసం గంటల తరబడి, వెయిటింగ్ చేసేవాళ్ళం కదూ!
ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ల బుకింగులే.. ఏ యాత్ర చేయాలన్నా..
వస్తున్న టూర్ల పాకేజీ వాళ్ళతో మాట్లాడుకుని.. మన బడ్జెట్‌కి తగ్గట్టుగా.. ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్లి రావడం ఎక్కువగా జరుగతోంది. ఇలా బానే వుంటుంది. ఇలా అయితే కాస్త ఇబ్బందులు తక్కువే ఎందుకంటే వసతీ, భోజనం, అక్కడ సైట్ సీయింగ్ ఏర్పాట్లు అన్ని వాళ్ళే చూసేస్తారు. విదేశీ యాత్రలు కూడా చాలా సులభం అయిపోతున్నాయి ఇప్పుడు.
అలాంటి పాకేజీలు ఇచ్చేవారి గురించి పూర్వాపరాలు తెలుసుకుని బుక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందీ లేకుండా వుంటుంది. అంతకు ముందు వెళ్ళినవారిని కూడా సమాచారాన్ని సేకరిస్తే, చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
ఇప్పుడు సోషల్ మీడియా, గూగుల్, యూట్యూబ్ లలో మనకి కావలసిన మొత్తం సమాచారం నిమిషాలలో, మన అరచేతిలో వుంటోంది.
ఇలా కాకుండా మనమే, మన కుటుంబం వరకో.. కొంత మంది స్నేహితులతో కలిసో.. ఈ టూర్లు వెడుతూవుంటాము. ఇదీ అన్నీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఫర్వాలేదు.
ఇవే కాకుండా.. సెలవలు గడపడానికి.. కొందరు.. ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్న చుట్టాలింటికో.. ఫ్రెండ్స్ ఇంటికో ప్లాన్ చేసుకుంటారు.
ఒకప్పటి రోజుల్లో, ‘అతిథి దేవో భవ’ అనే నానుడి.. నిజంగా పాటించేవారు. వచ్చే పోయే బంధువులతో, వండే గిన్నె, వడ్డించే గిన్నెకీ రెస్ట్ వుండేది కాదు. ఆప్యాయతలు, అనుబంధాలు కలగలిసి, బంధు బలగం కలిసిమెలిసి వుండేవారు. రాకపోకలు చక్కగా సాగేవి.
ప్రస్తుతం ఆ రోజులూ లేవు. ఆ ప్రేమలు లేవు.
పేరుకే బంధువులు.
ఈ బంధువులలో రకరకాల వారు వుంటారు. మొదటి రకం వారెవరంటే.. తమ ఇంటికి రమ్మని ప్రత్యేకంగా పిలవరు. వస్తున్నామంటే కాదనరు. మనం వెళ్ళాక, తిరిగి మనం వెళ్లి పోయేదాకా కూడా ఒకేలా ట్రీట్ చేస్తారు. ఎక్కువా వుండదు.. తక్కువా వుండదు. మనం వచ్చాం కదా అని ఓ.. స్పెషల్ ఐటమ్స్ ఏవీ చేసేయరు.. వాళ్ళతో పాటే మనమూనూ.. ఊళ్లో మనకి చూపించడానికి, తిప్పడానికి, వాళ్ళకి వీలు, తీరిక, ఓపిక వుంటే మనల్ని తిప్పుతారు. లేకపోతే మనకి వివరాలు అన్ని చెప్పి వెళ్లి చూసి రమ్మంటారు. ఎన్నాళ్లు వున్నా ఏమనుకోరు. వాళ్ళ తో గడపడం హేపీగా వుంటుంది. ఎటువంటి ప్రోబ్లమ్ వుండదు.
మరో రకం వారుంటారే.. వాళ్ళు మనం వాళ్ళింటికి వచ్చేదాకా చంపుతారు. వెళ్ళకపోతే అలుగుతారు. సరే కదా అని.. వాళ్ళింట్లో గడపడానికి వెడతాము. స్టేషన్‌కి కారు తీసుకుని వచ్చేస్తారు. కావలించేసుకుంటారు. ఇంటికి రాగానే విఐపి ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళ ఏసీ రూమ్ మనకి ఇచ్చేస్తారు. మనం దెబ్బకి డంగై పోతాము. సిటీ చూడడానికి మనల్ని కారులో స్వయంగా తీసుకువెడతారు.
తర్వాత ఇక తెలిసిపోతుంది మనకి.. విందైనా, మందైనా మూడు రోజులని.. నెమ్మదిగా మనమిక పెట్టె సర్దుకోవాలని.
కొందరి నైజమంతే..
సరే.. మరో రకం వారుంటారు.. వాళ్ళు మనింటికి వస్తే మాత్రం వాళ్ళకి రాజవైభోగం చేయాలి. మనం వాళ్ళింటికి వస్తున్నామని చెప్పకపోయినా, ఊళ్ళోకి వస్తున్నట్టు కబురు తెలిస్తే చాలు.. ఎక్కడ వాళ్ళింటికి వచ్చేస్తామనుకుంటారే, ఏంటే కానీ.. మేముండడంలేదనో, ఆరోగ్యాలు బావులేదనో.. ఏదో ఒక కారణంతో వాళ్ళింటికి రానీకుండా నెపం చెప్పేస్తారు.
అయినా, ఈ ఎండాకాలం మాత్రం ఎవరింటికీ వెళ్ళకపోవడమే ఉత్తమం. పాపం! అవతలవారి పరిస్థితి కూడా చూడాలి కదా! ఎండాకాలంలో మనకి మనమే చేసుకోలేనంత నిస్సత్తువ వస్తుంది. ఇక విజిటర్స్‌కి కూడా చేయాలంటే.. అమ్మో! ఇప్పుడు అందరూ ఏసీ లకి అలవాటు పడ్డారాయే! వచ్చిన బంధువుల కోసం, ఏసీ రూమ్ త్యాగం చేసేంత విశాలహృదయులు లేరు. ఇలాంటి బోలెడు కారణాలతో.. ఎవరికి వాళ్లు అసలు ఎండాకాలం కదలకపోవడమే ఉత్తమం. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎవరింటికీ వెళ్ళకుండా హొటళ్ళలో బసలు ఏర్పాటు చేసుకుని తిరిగి రావడం సరైన పని. వాళ్ళకీ మంచిది. మనకి మరీ మంచిది. ఏమంటారు?
ఇప్పుడు చాలా మంది ఇదే చేస్తున్నారు లెండి.
ఇవే ఈనాటి కలవల కబుర్లు.