ఆమె అంతరంగం

0
3

[dropcap]“వి[/dropcap]శాలా,.. విశాలా..” అంటూ దగ్గరగా వేసివున్న తలుపును తోసి, లోపలికి వచ్చింది రుక్మిణి. ముందు గది దాటి మధ్య గదిలోకి వచ్చేటప్పటికి, విశాల మంచం మీద పడుకుని ఉంది.

“విశాలా, ఒంట్లో బాగా లేదా? ఈ సమయంలో పడుకున్నావేమిటి?” అంది

విశాల లేచి కూర్చుంటూ, “బాగా లేకపోవటమేం లేదు. అలసటగా ఉంది. పూజ చేసుకుని కాసేపు నడుం వాల్చాను. అంతే. రా. కూర్చో” అంది విశాల.

“టిఫిన్ తిన్నావా”, రుక్మిణి అడిగింది.

“ఆ.. ఇడ్లీ వేసుకుని తిన్నాను” అంది విశాల.

“తొమ్మిదింటికే ఎండ మండిపోతోంది చూడు. శనివారం కదా, వేంకటేశ్వరస్వామి గుడికి వస్తావేమో, తొందరగా వెళ్లి వచ్చేయచ్చు, ఇంకా ఎండ పెరిగితే వెళ్ళలేమని వచ్చాను. సరే, విశ్రాంతి తీసుకో. నేను వెళ్లి వస్తాను” అంటూ రుక్మిణి మంచానికి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ మీద రెండు డజన్ల అరటిపళ్ళు, చాలా కమలాలు, ఓ పట్టుచీర చూసింది.

“ఓ, నిన్నటి మదర్స్ డే హడావిడా ఇదంతా, అందుకేనా ఇంత అలసటా, సరే, విశాలా, నేను గుడికి వెళతాను. సాయంత్రం వస్తాను. కాసేపు పడుకో. భోజనం నేను తెస్తానులే ఇవాల్టికి” అంది రుక్మిణి.

“వద్దోద్దు, అంత లేవలేకపోతే నేనే అడుగుతాగా. కొంచెం సేపు పడుకుని లేచి వండుకుంటా. ఈ ఎండలో నువ్వు మళ్ళీ రావద్దు. సాయంత్రం వీలైతే రా” అంటూ విశాల ఓ డజను అరటిపళ్లు, కమలాలు ఇచ్చింది.

“ఇన్నా? నేను మాత్రం ఏం చేసుకుంటాను ఇవన్నీ!” అంది రుక్మిణి.

“నీ కొడుకు, మనవలు పక్కనే వుంటారుగా, నీకు కావలసినవి ఉంచుకుని మిగతావి పంపు, పాడవకుండా వినియోగం కావటం కావాలి మనకు” అంది విశాల.

రుక్మిణి అవి తీసుకుని వెళ్ళిపోయింది.

విశాల మంచం మీద పడుకుని ఆ పళ్ళ వంక చూసింది. ‘తల్లికి ఏం కొనివ్వాలో తెలియదు. మదర్స్ డే అని చెప్పి ఏవో ఒకటి తెచ్చేయటం, రోజంతా హడావిడి చేసేయటం, వాళ్ళ కిష్టమైనవన్నీ చేయించుకుని తినటం, తనకు ముద్దులు పెడుతూ, కాళ్లకు దణ్ణం పెడుతూ, తినిపిస్తూ రక రకాల ఫోటోలు తీసుకోవటం వాటన్నింటీనీ వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో పెట్టటం, వాటి కొచ్చిన లైకులు కామెంట్లు చూసి మురిసిపోవటం, ఇదేనా మదర్స్ డే అంటే! ఇదేనా తల్లిని గౌరవించటం అంటే! ఏమిటో, ఈ పిల్లలు. ఎప్పుడైనా అమ్మా! నువ్వు కూర్చో. ఇవాళ మేం చేసిపెడతాం, అని అన్నారా!’ అనుకుంటూ పట్టుచీర చేతిలోకి తీసుకుని చూసింది. ఇది మూడు వేలట. ముగ్గురు కూతుళ్లు కలిసి కొన్నారుట. ఈ కాళ్ళ నొప్పులతో, నడుం నొప్పితో తను ఏ పెళ్లి, పేరంటాలకు వెళుతుంది? అయినా, బీరువాలో చాలా పట్టుచీరలే ఉన్నాయి. అవే తను కట్టలేకపోతోంది. చక్కగా నాలుగు కాటన్ చీరలు తెస్తే ఈ వేసవి గడిచిపోయేది. తన వయసువాళ్ళు పెళ్లిళ్లకు నేత చీరలే కడుతున్నారు. అలాగా తేలేదు వీళ్ళు. అన్నేసి అరటిపళ్ళు తెచ్చుకుంటారా? తనేం తింటుంది వాటిని! మర్నాటికే నల్లగా అయిపోతాయి. ఏ బాదం పప్పులో తెస్తే రోజూ నాలుగు నానబెట్టుకుని తినేది కదా! వాళ్ళకి ఆలోచన ఉండదు. కన్న కూతుళ్ళయినా తనకి ఇవి తెండి, అవి వద్దు అని చెప్పటం తనకు ఇష్టం ఉండదు. అయినా, అన్యాపదేశంగా చెప్పింది కూడా. వద్దన్నదే చేస్తారు. విశాల మనసులో ఆలోచనలు ఎడతెగకుండా సాగుతున్నాయి.

విశాలకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు విశాల ఉండే విజయవాడ లోనే వుంటున్నారు. మూడో అమ్మాయి గుంటూరులో ఉంటుంది. ప్రతి ఏడాది మదర్స్ డే కి ముగ్గురు కలిసే వస్తారు. ఆ వంట చేయి, అది తినాలనుంది అంటూ అడిగి చేయించుకుంటారు. చక్కగా కబుర్లు చెప్పుకుంటారు. సాయంత్రం ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక ఆ చివర నుంచి ఈ చివర వరకూ బండెడు గిన్నెలుంటాయి. విశాలకు నీరసం మిగులుతుంది.

విశాల భర్త పోయి అయిదేళ్లవుతోంది. అయనదీ పెన్షన్ వచ్చే ఉద్యోగం కాదు. ఆ కాలంలో మామగారినుంచి భర్తకు వచ్చిన పాత ఇల్లు ఒకటి ఉండటం వల్ల ఆమె బతుకు జరిగిపోతోంది. గవర్నమెంట్ ఇచ్చే వృద్ధాప్యపు పెన్షన్‌తో, అప్పుడప్పుడు భర్త దాచిన డబ్బుల మీద వచ్చే వడ్డీతో పొదుపుగా గడుపుకుంటోంది. విశాలకి ముగ్గురు కూతుళ్లు. ముగ్గురు అల్లుళ్ళు మంచివాళ్ళు. ఏమీ ఆశించరు. మొదటి ఇద్దరికీ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కాలేజీ చదువులకొచ్చారు. మూడో అమ్మాయికి ఒక ఆడపిల్ల. అయిదవ తరగతిలో ఉంది. వాళ్ళింటికి వచ్చి ఉండమంటారు కానీ, విశాలే వెళ్ళదు. వాళ్ళు పొద్దున్న ఆఫీసులకు వెళితే చీకటి పడ్డాక వస్తారు. అక్కడా రోజంతా ఒంటరిగానే ఉండాలి. వచ్చాక వాళ్ళ పనులు వాళ్ళవి. తనతో మాట్లాడటానికే కుదరదు. అమ్మ వచ్చిందంటే ఎక్కడవక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడా ఆమెకు పనే. తన ఇంట్లోనే తనకు బాగుంటుంది.

రుక్మిణితో ముప్ఫయి ఏళ్ల అనుబంధం. రెండిళ్ల అవతలే ఉంటుంది. ఆమె కొడుకు, కోడలు అదే వీధిలో విడిగా ఉంటారు.

రుక్మిణి, విశాల కలిసి ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళుతుంటారు. విశాలకు కాళ్ళు నొప్పులు, నడుం నొప్పి వంటి చిన్న బాధలే కానీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇలాగే, ఎవరి మీదా ఆధారపడకుండా తన జీవితం ముగిసి పోవాలని విశాల రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది.

విశాలకు పెళ్లి కాక ముందు నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంది. తండ్రి నవలలు, కథల పుస్తకాలు కొని తెచ్చేవారు. వార పత్రికలలో సీరియల్స్ ఆసక్తిగా చదివేది. అవి పూర్తయ్యాక వాటిని బైండ్ చేయించేది. పెళ్లయ్యాక ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, తర్వాత పిల్లలు ముగ్గురు పుట్టటం, వాళ్ళ పెంపకం, వాళ్ళ పెళ్లిళ్లు పురుళ్ళు తీరిక లేని పనుల్లో కూడా పుస్తకం కనిపిస్తే వదిలేది కాదు. భర్త కూడా విశాల ఆసక్తిని గుర్తించి లైబ్రరీ నుంచి నవలలు తెచ్చేవాడు. ఒక నవల చదవటానికి నెలలు పట్టేసేది. పెళ్ళికి ముందు చదవటమే ప్రపంచం. వేగంగా చదివేస్తుందని పేరు ఆమెకు. పెళ్లయ్యాక, టేబుల్ మీద పుస్తకం రా రమ్మని పిలుస్తుంటే, వంటింట్లో తెమలని పని వెళ్ళనిచ్చేది కాదు.

ఇప్పుడు ఒంటరిగా ఉందని పేరే గాని, పిల్లలు ఎవరో ఒకరు రావటం, లేదా ఫోన్లో పచ్చళ్ళు, పొడులు చేసిమ్మని చెప్పటం, వడియాలు పెట్టివ్వటం, ఇక ఊరగాయల కాలం వచ్చిందంటే ఆవకాయ, మాగాయ, మెంతికాయ ఒకటేమిటి ఎన్ని రకాలున్నాయో అన్నీ వేయాల్సిందే ముగ్గురికీ.

విశాల పద్యం బాగా పాడుతుంది. చదివింది ఇంటరు వరకే. స్కూల్లో, కాలేజీలో పద్యాల పోటీల్లో బహుమతులు గెల్చుకుంది. భర్త పోయాక, ఈ మధ్య సాయంత్రాలు రుక్మిణి, ఎదురింటి జానకి, రాజ్యం వస్తున్నారు. విశాల భాగవతం శ్రావ్యంగా చదువుతుంటే వింటుంటారు. అది విశాలకెంతో తృప్తిగా ఉంటుంది. కానీ, రోజూ ఆ కార్యక్రమం సాగదు. పిల్లలు అప్పజేప్పే పనులతో తనకి కుదరదని చెప్పాల్సొస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడల్లా తనకు పని, ఖర్చు ఎక్కువైపోతోంది. ఈ మధ్య విశాలకు పని చేయబుద్ధి కావట్లేదు. ఏమైనా మంచి పుస్తకాలు చదువుకోవాలనిపిస్తోంది. ఎదురింటి రాజ్యం గారబ్బాయి లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చిస్తాడు. అవీ చదవలేకపోతోంది. ఒకరోజు పనెక్కువైతే రెండు రోజుల దాకా నీరసం తగ్గట్లేదు. నిన్న మూడో కూతురు చెప్పిన మాటకు విశాలకు మరింత నీరసం వచ్చేసింది. తన కూతుర్ని ఇక్కడ ఆరవ తరగతిలో చేరుస్తుందిట. భార్యాభర్తలిద్దరు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తే రాత్రయిపోతోంది వచ్చేటప్పటికి. పిల్లని స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లో ఒంటరిగా ఉంచాలంటే భయంగా ఉంది. అదీగాక, అమ్మాయి చదువు పట్టించుకోవటం కూడా తమకు కుదరట్లేదు. ఇక్కడ అయితే అన్ని విధాలుగా బాగుంటుంది అంది. తను ఈ బాధ్యత తీసుకోగలదా లేదా అని అడగట్లేదు.

ప్రతి అమ్మ తన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు చేయటం తోనే ఆమె జీవితం గడిచిపోతోంది. మరి, ఆమె తన కోసం, తన కిష్టమైనట్లు ఎప్పుడు జీవిస్తుంది? ఆమెకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి ఎప్పుడు? అనుకుంటూ, విశాల, ఏమైనా చిన్న కూతురితో నీ కూతురి బాధ్యత తీసుకోలేనని చెప్పేయాలనుకుంది. మొదట కోపం వచ్చినా, నెమ్మదిగా తనే అర్థం చేసుకుంటుంది. మిగతా పనులు కూడా తగ్గించుకోవాలి. ఈ శేష జీవితాన్నైనా తన కోసం తను బతకాలి. సాయంత్రం పుస్తకపఠనం రోజూ కొనసాగించాలి. రుక్మిణితో రోజూ గుడికి వెళ్ళాలి, అనుకుని తన ఈ నిర్ణయాన్నిరుక్మిణితో పంచుకోవటానికి ఆనందంగా ఫోన్ చేతిలోకి తీసుకుంది విశాల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here