ఉత్తమ సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనానికి కథాత్మక దర్శని ‘రామకథాసుధ’

1
3

[dropcap]‘రా[/dropcap]మకథా సుధ ఎంత మధురమూ..’ అని పల్లవిని ఎత్తుకున్నాడు సినీకవి. ఇదిగో – ‘ఇంత మధురమూ’ అంటూ మన ముందు కొచ్చింది – ఈ రామకథాసుధ’ కథా సంకలనం. ‘సంచిక’ అంతర్జాల పత్రిక ఆధ్వర్యం, నిర్వహణ. సంపాదకులు – కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్, కొల్లూరి సోమ శంకర్.

ఎందుకూ ఈ సంకలనం? ‘రాముడిని, రామాయణాన్ని సక్రమమైన రీతిలో ప్రదర్శించిన తెలుగు కథలను సంకలనం చేస్తే, తెలుగు పాఠకులకు రాముడిని, రామాయణాన్ని మరో కోణంలో, కూడా దర్శించే వీలున్నట్లవుతుందన్న ఆలోచన’.. అంటే ‘ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని, అలోచనా విధానాన్ని ప్రదర్శించే కథల సంకలనం ‘రామకథాసుధ’ అని సంకలన ప్రయోజనాన్ని అత్యంత నిబద్ధతతో రూఢి చేశారు సంపాదకులు. ఇదే అసలు – ప్రయోగాత్మకత!

మూసలో పడి కొట్టుకుపోకుండా, అపప్రధల్నీ, విషపూరిత భావజాలాన్నీ తెగనాడుతూ కరవాలం ఝుళిపించకుండా- కలంతో వాంఛనీయ భావజాలాన్నీ, సాహిత్యావసరాన్నీ, సామాజికావశ్యకతనూ మనదైన సృజనతో, సాహితీ లోకానికి సమర్పించటం. ఇదీ ప్రయోజనాత్మకత! ఈ ఆలోచన, పూనిక, నిర్వహణ, విజయసాఫల్యం – సర్వమూ సంపాదకుల సదాశయాన్నీ, దార్శనికతనూ, మంచి సాహిత్యాన్ని పఠితల కందించాలనే సద్భావనను – అక్షరలక్షలుగా ఋజువు చేస్తున్నది. అందుకు ముందుగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

ఈ సంకలనం ప్రచురణకు ముందు చాలా ‘హోమ్ వర్క్’ జరిగింది. కథల ఎన్నికలో ప్రామాణికాల్ని నిర్దేశించుకున్నారు. రచనల్లో మౌలిక భారతీయత, సంస్కృతి, ధర్మం, దేశీయత, జాతీయత, వాల్మీకి నిర్ణయ ఫణితిని ఉల్లంఘించకుండా వుండటం వంటి ప్రధాన నిబంధనల్ని పెట్టుకున్నారు. అలాగే, సామాజిక జీవనంలో ప్రజల నాలుకలపై నాని, స్థిరపడిన – కల్పనాత్మక ఘటనల ఆధారంగానూ కొన్ని కథల్ని ఎంపిక చేశారు. వీటిలో ప్రధాన ద్రవ్యం, పదార్థం – నైతిక విలువలు, ధార్మిక భావనలు, ఉత్తమ ప్రవర్తనల ఉన్నతీకరణం. ఇలా ఎంపిక చేసిన కథలు 28.

ఇవి- (1) రామాయణ పాత్రల ఆధారిత కథలుగా (2) సామాజిక రామాయణ కథలుగా సంకలనానికి రెండు పరిచ్ఛేదాలనిచ్చాయి. మొదటి విభాగంలో 19 కథలు, రెండవ విభాగంలో 9 కథలు ఉన్నాయి.

ఈ సంకలనంలో మరో ప్రత్యేకత – కథల్ని రామాయణం జరిగిన వరుసలోనే పొందుపరచటం. ‘రామాయణ కథాసుధ’గా రచనలు చేయాలంటే – కథకులు శ్రీరామతత్త్వాన్ని గుండెలో నిలుపుకోవాలి. నిరంతరం ‘శ్రీరామత్వం’ని మననం చేస్తూ జీవనపథంలో గమించాలి. అంతేకాదు, రామాయణం ఎందుకు చదవాలి అని ప్రశ్నించేవారికి ‘రామునిలా బతికేందుకు, రావణునిలా కాదు’- అని తెలుసుకునేందుకురా – అని బల్లగుద్ది మరీ చెప్పే ధైర్యం వుండాలి.

ఇన్నిటినీ సాధించుకున్న అక్షరజీవులు ఈ కథలు రాసినవారు. వారంతా పుణ్యులు. మరియు ధన్యులు. అందుకు మూర్ధన్యులు!

రామకథాసుధ’లో ముందుగా చెప్పుకోవలసింది ‘వస్తు నవ్యత’ గురించీ ఉదాత్త కల్పనల గురించీ.

సీతాపాదాభివందనం’ట! ఎంత నూతనమైన ఊహ. ముచ్చటగా ఉంది చదువుతుంటే! ఒక పఠిత దీన్ని ‘మరీ కల్పన, ఊహ, అసహజం సార్’ అన్నాడు. ‘సహజం’ అనిపించే అసహజం కథ’ అని మల్లాది రామకృష్ణశాస్త్రిగారు చెప్పనే చెప్పారు కదా! కొంచెం ఆలోచిస్తే, కథకు ఆరో ప్రాణం వినూత్న భావన కదూ!

ఊర్మిళ’: సరే. జనపదం, ఆమె నిద్రకు కారణం సమస్యకు కారణం చూపనే చూపారు. అది జనపథం.

మాండవి: నిష్కామ సేవామూర్తి. సౌజన్య కీర్తి. సరస్వతిని వరం అడిగిందట- ‘నిరపరాధియైన భార్యను భరతుడు దుఃఖపెట్టినాడన్న అపఖ్యాతి భర్తకు కలుగరాదు’ అని! (‘మాండవి’ చిన్న పద్యకావ్యంతో కవిగా అమరులైన గుదిమెట్ల రామానుజాచార్యులు గారు నాకు గుర్తుకువచ్చి ఆ పద్యాల కలకండ ముక్కలు చప్పరించాను మళ్లీ. ఎన్నడో 1955లో కంఠస్థం)!

లక్ష్మణగడ్డ: రెండు పేజీలు! ఎంత చరిత్ర, ఎంత నేపథ్యం, ఎంత పాత్రచిత్రణ, ఎంత సంభాషణ! ఇది కదా నా తెలుగు కథ! జయ, జయహో!

రేగుపళ్ళ రుచి: శబరి ఎంగిలి మహిమగదా దాని రుచే రుచి. చక్కని కథాత్మకత కలిగిన రచన.

భ్రాతృప్రేమ: ఇది పక్షిరాజద్వయం – సోదరప్రేమ. రామాయణంలో మూడు సోదరద్వయాలు, శతాధిక వ్యాఖ్యానాలకు ఆధారాలు.

లోహజంగుడు: ప్రాచుర్యంలోని (ప్రక్షిప్త) గాథ!

సీత చెప్పిన సత్యం: ఒక ఘటనలోని ఆంతర్యాన్నీ, పరమార్థాన్నీ చక్కటి కథగా మలచిన రచన.

ప్రేమాగ్ని పరీక్ష: సీతాపరిత్యాగంలో కథని బాగా ‘లో-నారసి’ రచించిన రచయిత భావం, జీవన వ్యాఖ్యానం ఇది. ‘రాముడు సీత శీలాన్ని ఎందుకు శంకించాడు?’ దీనికి సమాధానంగా ప్రేమంటే ఏమిటో చెప్పింది సీత. రాజుగా రాముడు, ప్రజల ప్రతినిధిగా దోషాన్ని తనపై ఆరోపించుకుని, ప్రజల మనస్సుల్ని ఎలా శుభ్రపరచాడో విశ్లేషించి అసలైన ‘రామతత్వం’ అనుశీలన వివరించింది.

న్యాసము: భరతుడు శ్రీరామునికి రాజ్యాన్ని తిరిగి అందించి ధన్యుడు కావటం కథా కథనం చాలా గాఢతతో వెలువడింది.

కరుణించవా శివా!’లో చిన్న మెరుపు; ‘యశోధర్మస్తతోజయః’ ‘రామమాడ’ ‘ఘటన’ ‘రాముడు కట్టిన వంతెన’ వంటి కథా వస్తువులన్నిటా రచయితల ఊహా శాలీనత, సృజనాత్మకత దీప్తిమంతమైనాయి. కాగా ‘వారాది రాముడు’ కథ ఒక అద్భుతమైన దృశ్య చిత్రీకరణగా వెలువడింది. ఒక ప్రాంతం, గ్రామం- చరిత్ర, నైసర్గికం, ప్రజలు, సంస్కృతి, సంప్రదాయ ఆచారవ్యవహారాలు.. ‘కథానిక’ పట్టనంత విస్తృత కేన్వాస్‌ని చూపింది. చివరికి కేంద్రబిందువు కనిపిస్తుంది! అదే సంతృప్తి!

రామాయణం ఒక రత్నసాగరం. కనుక ఆ రత్నరాశిని పరిపూర్ణంగా ఎందరు రచయితలైనా బయటికి చూపి ప్రకాశింపజేయవచ్చు. అయినా, అది తరగని గని. ‘రామకథాసుధ’ రచయితలు, తమ వైయక్తిక ప్రతిభ, ఉపజ్ఞ, పాండిత్యాలతో వీటన్నిటికీ మించిన ‘చింతన’తో, ఆశయ నిబద్దతతో తమతమ కథావస్తువుల్ని స్వీకరించి సానబెట్టారు. ఆ మెరుగు పెట్టటంలో భిన్నత్వం తప్పదు. ఎవరి చేయితీరు వారిది, ఎవరి పనితనం వారిది కదా! విశ్వనాథ వారు అన్నారు, ‘ఎదకు పురాంధ్ర కవీశ్వర భారతిదీప్తి’ కలిగినా, ‘మదికి ఉదాత్త కల్పనల మక్కువ’ కలిగినా రామాయణ కావ్యం నుండి కథలు పంక్తులు పంక్తులుగా వచ్చి ఈ గ్రంథం వంటి గ్రంథాల సంకలనీకరణంలో కుదురుకుంటాయి. ఆ ఆదికావ్య వస్తువు అలాంటి ‘గగనం గగనాకారం’ వంటిది!

వస్తువు విషయంలో ఒక వాస్తవాన్ని ప్రస్తావించాలి. తెలుగు కథా సాహిత్యంలో 1990ల తర్వాత – ఒక పరిణామం వచ్చింది. కథ అంటే – వస్తువే – అనే భావాన్నీ, భావననీ స్థిరపరుస్తూ, చాలామంది రచయితలు కథల్ని చిన్న నవలల్ని చేసేసి, తమతమ కూటమి ప్రాపకం ద్వారా – అవే ఉత్తమ కథలు అన్న ప్రచారాన్ని ఘంటాపథం చేసేశారు, అవకాశం వున్నవారు అవార్డుల్నీ సాధించుకున్నారు. వీరందరూ – కథలో వస్తువు అంటే కథాబీజం. అది కేంద్రం. దాన్నుండి ఇతివృత్తం నిర్మితమవ్వాలి. ఆ వలయంలోని 360 డిగ్రీల్లో ఏ డిగ్రీ నుండి చూసినా కేంద్రబిందువు ద్యోతితం కావాలి. అంటే వస్తు కేంద్రీకరణం, ‘ఫోకస్’ అనే- ప్రాథమిక రచనావశ్యకతని తీసి గట్టున పెట్టారు.

బుచ్చిబాబు కథ వెనుక ఒక సమాజం, దాని హోరు వినపడాలంటాడు. నేపథ్యంగా రావాలి అవి. అంతేగానీ, వాటి సోదే చర్వితచర్వణం, పిష్టపేషణం కాకూడదు. వస్తు కేంద్రం మీది ‘ఫోకస్’ని- ‘అక్కర్లేని’ పక్కనున్న పాత్రలమీద, పరిసరాల మీద, చరిత్రమీద ప్రసరింపజేయకూడదు.

అయితే, ఈ సంకలనంలోని చాలామంది కథకులు ఈ రచనావశ్యకతని తెలిసినవారు. అందువలన కథని కథగా సృజించగలిగారు. ఉదాహరణకి ఈ సంకలనంలోని చాలా కథల్ని చూపవచ్చు. ‘రామకథాసుధ’ కథనే తీసుకోండి. ‘వాల్మీకి గిరి సంభూతా రామసాగర గామినీ/పునాతు భువనం యత్వా పుణ్యా శ్రీరామాయణ మహానదీ’ అన్న శ్లోకభావాన్ని వస్తు కేంద్రంగా స్వీకరించారు శ్రీపతి. అదొక సందేశం. అదొక సత్యం. ఆ సత్యాన్ని పాఠకునికి చేరవేసేందుకు – ‘అల్లిక’- ఇతివృత్తం. ఎంతో చక్కగా ఈనాటి సమాజంలోని పాత్రల ప్రమేయంతో, తన సంవిధాన నైపుణ్యంతో కథాకథనాన్ని సాగించారు శ్రీపతి. (ఇంకా చెప్పాలంటే – కించిత్తు ‘మేజికల్ రియలిజం’ ఛాయ కూడా సిల్హౌటీలో ఉన్నది!)

ఇలా ఇతివృత్త పరిధి నుండి, వస్తు కేంద్రానికి కథనం సాగిన రచనలు ఈ సంకలనంలో నిక్కమైన నీలాలుగా నిలుస్తున్నాయి.

‘రామకథాసుధ’లో ఎంతో ఔచితీమంతంగా చేర్చిన ‘సీతా కల్యాణం’ (ముళ్ళపూడి వెంకటరమణ), ‘ఔనౌను’ (మల్లాది రామకృష్ణశాస్త్రి) ‘రామలీల’ (టెంపోరావ్) కథలు – ‘కథలు రాయడం ఎలా?’ అన్నదానికి నమూనా కథలు. రచయితలు ఇలాంటి కథల్ని ‘విశ్లేషణాత్మకం’గా చదివి, కథకు ప్రాణసమానమైన – క్లుప్తత, వస్వైక్యత, నిర్మాణం, కథనం, శిల్పం, శైలి – వంటి అంశాల్ని నేర్చుకోవచ్చు! ఇలా అన్నానని ఏ మహానుభావుడూ నొచ్చుకోనఖ్ఖర్లేదు! మంచి పాఠకుడు కాలేని రచయిత మంచి కథకుడు కాలేడు!

‘రామకథాసుధ’లోని ప్రతి కథా ఒక పాఠం చెబుతుంది. ఆ పాఠంలో సందేశం వుంది. మానవాళికి అనుసరణీయమైన ప్రబోధం వుంది. మనిషి సంస్కారాన్ని ఉన్నతీకరించుకొనే మార్గదర్శనం ఉంది. ఆధునిక జీవనశైలిలో ‘మనిషి’ కోల్పోతున్న సార్వకాలీనమైన, సార్వజనీనమైన శాశ్వత విలువల ప్రాధాన్యం ఏమిటో చెబుతున్న వాంఛనీయత ఉన్నది. రామాయణంలోని బహుళత్వంలో, అనేకత్వంలో, భిన్నత్వంలో ఉన్న ఏకత్వ ఆదర్శాన్ని కథాత్మకం చేసి – ఈ తరం, రేపటితరం పాఠకులకు సమర్పిస్తున్న మంచితనం, మనీషితనం, సామాజిక బాధ్యతానిర్వహణం ఉన్నాయి. అందుకు ఈ సంపాదకులూ, కథకులందరూ బహుధా అభినందనీయులు.

ఇన్ని ఘనతల్ని పొందుపరచుకున్న ‘రామకథాసుధ’ విస్తృత పరిధిలో పాఠకులకు చేరాలి! అప్పుడే సంపాదకుల అసిధారవ్రతానికి సాఫల్యం!

మునిపల్లెరాజు గారు అన్నట్టు ‘ఉన్నతక్షక్ష్యలో ప్రసరించే సాహిత్యాభిరుచి కలిగిన రచయితలు, సంపాదకులు మనముందుంచిన ‘రామకథాసుధ’ పుస్తకాన్ని ‘కొని’ చదవండి. అది మీకు తప్పకుండా ఒక జీవితకాలపు ఉన్నత సాహిత్య పఠనానందాన్ని అందిస్తుంది! తథాస్తు!!

***

రామకథాసుధ (కథా సంకలనం)
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్, కొల్లూరి సోమ శంకర్
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 215
వెల: 175/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here