[dropcap]ఆ[/dropcap] రోజు నేను, మా ఫ్రెండుని అబిడ్స్ లోని కేర్ హాస్పిటల్‌లో జాయిన్ చేసారని తెల్సి పలకరించి వద్దామని వెళ్ళినప్పుడు అక్కడ వెయిటింగ్ లౌంజ్‌లో శ్యామల రావు గారిని చూసి పలకరించాను.
“సార్ మీరేమిటి ఇక్కడ”
పలకరింపుగా నవ్వి, వివరంగా చెప్పారు. ఆయన భార్య సావిత్రి గారికి హార్ట్ ఎటాక్ రావడంతో ప్రక్కింటి వాళ్ళ సాయంతో నిన్న రాత్రి తీసుకుని వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ చేశారట.
ఆయన ముఖంలో దైన్యం, బాధ, అలసట క్లియర్‌గా కనిపిస్తున్నాయి.
శ్యామల రావు గారు డిపార్ట్‌మెంట్‍లో నా కంటే 15 సంవత్సరాల సీనియర్. నేను విజయవాడలో ఉద్యోగంలో చేరేటప్పటికే ఆయన సీనియర్ ఆఫీసర్. ఆయన్ని ఆఫీస్‌లో అందరు చాలా గౌరవంగా చూసేవారు. డిపార్ట్‌మెంట్‍లో రూల్స్‌లో ఆయన దిట్ట. ఎవరికి ఏ సందేహం వచ్చినా ఆయన దగ్గరకి వెళ్లడం అలవాటు. ఓ విధంగా, నాకూ ఆయన అలాగే పరిచయం. ఆయనతో స్నేహం ఎవరూ వదులుకోలేరు. అంత మంచి మనస్తత్వం ఆయనది. సర్వీస్‌లో వున్నప్పుడు, అప్పుడప్పుడు ఆయన ఇంటికి వెళ్లి వచ్చేవాడిని. సావిత్రి గారిని పిన్నిగారు అని ఆప్యాయంగా సంబోధించడం అలవాటు.
రిటైర్ అయ్యేక హైదరాబాద్‌లో సెటిల్ అయ్యేరని తెలుసు కానీ, మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు. కొంత కాలం వరకు ఆయన మొబైల్ నెంబర్ నా వద్ద ఉండేది, కానీ మొబైల్ మార్చేక, ఆ నెంబర్ పోవడంతో చాలా ఏళ్ళుగా ఆయనతో మాట్లాడింది లేదు. ఇన్నాళ్ళకి ఆయన్ని ఇలా చూడడంతో ఏదో తెలియని బంధం మళ్ళీ చిగురించింది అనిపించింది.
ఇప్పుడు ఆయనకీ ఓ డెబ్భై ఏళ్ళుంటాయి.
“సార్ ఈ వయసులో మీరు ఇలా ఒక్కరు వున్నారేమిటి, మీ అబ్బాయిలు ఏరి” అన్నాను.
వాళ్ళు రాలేదన్నట్లు తలాడించేరు.. ఆశ్చర్యం వేసింది. అర్థం కాలేదు, వివరంగా చెప్పమన్నట్లు చూసాను. ఇద్దరు కొడుకులు తన వద్ద ఉండడం లేదని చెప్పేరు. పెద్దవాడు నందిగామలో వుంటాడుట, రెండవ వాడు ఖమ్మంలో వుంటాడుట. ఇద్దరి ఫోన్ నంబర్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయట.
ఆ వయసులో ఆయనకి ఏ అండదండలు లేకపోవడం బాధనిపించింది. మా ఫ్రెండుని పలకలరించి వచ్చేక మళ్ళీ కలుసుకుంటానని చెప్పి, లోపలికి వెళ్లి వచ్చాను.
బయటకి వచ్చేటప్పటికి శ్యామల రావుగారు అక్కడే వున్నారు. అంతలో నర్స్ హడావిడిగా వచ్చింది, డాక్టర్ గారు రమ్మంటున్నారని చెప్పింది. ఆయన కంగారుగా వున్నారు, శరీరం వణుకుతోంది. నా మనసు కీడు శంకించింది. ఆయన చెయ్యి పట్టుకుని లోపలి తీసుకుని వెళ్లేను.
డాక్టర్ ఆయన వంక జాలిగా చూస్తూ, “సారీ శ్యామల రావు గారు, మా ప్రయత్నం చేసాం. మాసివ్ హార్ట్ ఎటాక్. మీరు హాస్పిటల్ తీసుకురావడం కొంచెం ఆలస్యం అయింది. భగవంతుడు ఆమెకి యింక ఆయుర్దాయం ఇవ్వలేదు” అన్నాడు.
చతికిలపడి పోయారు శ్యామల రావు గారు. ఆయన ఇచ్చిన నంబర్స్‌కి నేను కూడా చేసెను. స్విచ్ ఆఫ్ వస్తోంది. అప్పుడు ఆయన స్థిరంగా చెప్పేరు.
“సుధాకర్, ఆమెకు అన్నీ నేనే అయ్యి, 7 సంవత్సరాలుగా ఇక్కడ వున్నాను. పిల్లల మీద వాత్సల్యంతో ఆ పిచ్చిది, నా కళ్ళకు గంతలు, కాళ్లకు, చేతులకు బంధనాలు వేసింది. ఇప్పుడు యింక ఏ బంధనాలు నన్ను కట్టి పడేయలేవు. నిన్ను శ్రమ పెడుతున్నానని ఏమీ అనుకోకు. మీ పిన్నిగారి అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేయి చాలు. నేను దాచుకున్న డబ్బులు వున్నాయి, ఆమె చితి మంటకు లోటు రాదు. నాకు పెన్షన్ వస్తూంది కదా. ఈ ఒక్క సాయం చేసి పెట్టి వెళ్ళు, ఆమె చితికి నిప్పు నేను అంటిస్తాను.” అన్నారు దీనంగా.
నాకు గుండెలు పిండేసినట్లయ్యింది. పిల్లల ప్రస్తావనే మరచి పోవాలని అనుకుంటున్న ఆయన మనస్తత్వం ఆ క్షణం అర్థం కాలేదు. ఏదో అగాధం ఏర్పడిందని అర్థం అవుతోంది.
నిజానికి తల్లిదండ్రులు ఈ వయసులో ఒంటరిగా హైదరాబాద్‌లో వుంటుంటే పిల్లలు ఎలా వదిలేసారో చూస్తే, నాకు చాలా బాధ అనిపించింది. ఒక నిశ్చయానికి వచ్చి, బాస్‌కి ఫోన్ చేసి, ఈ రోజు సెలవని చెప్పేసేను.
శ్యామల రావు గారి మాట కాదనలేక పోయాను. “డబ్బు వున్నా కొన్ని సందర్భాలలో యెంత వెలితిగా ఉంటుందో కదా”.. అని అనిపించింది. ప్రక్క వీధిలో వుండే నా ఫ్రెండు, నేను ఇద్దరమే అన్నీ అయ్యి, సావిత్రి గారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఓ పదిహేను రోజుల పాటు నేను నా ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయి వారిని కలవడం కుదరలేదు. ఓ ఆదివారం ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు చెప్పారాయన తన కథ.. కాదు కాదు బ్రతుకు వ్యథ వివరంగా.
శ్యామలరావు గారి పెద్దవాడు చదువులో తెలివయినవాడు. MSC చదివి లెక్చరర్‌గా గవర్నమెంట్ కాలేజీలో నందిగామలో పని చేసేవాడు. కానీ అతనికి లౌకిక జ్ఞానం అస్సలు లేదు. భార్య పరమ గయ్యాళి. మొగుడి చేతకానితనం ఎరిగిందేమో, చెడు తిరుగుళ్ళకి అలవాటు పడింది. ఎవడో ఆమెను చెప్పు చేతల్లో వుంచుకున్నాడు, భర్త డబ్బు కాజేసి ప్రియుడితో వేషాలు వేసేది. ఒకనాడు భర్తని అడ్డు తొలగించు కుందామని, డబ్బిచ్చి అతన్ని చంపించే ప్రయత్నం చేసింది. ఆ చంపుదామనుకున్న వాళ్ళు అతన్నితల మీద బాగా కొట్టి భద్రాచలం వరకు తీసుకుపోయి చనిపోయాడనుకుని, అడవుల్లో వదిలేశారు. మర్నాడు కొంతమంది దారిన పోయే వాళ్ళు కొన ఊపిరితో ఉన్న అతనిని చూసి, దగ్గర్లో వూళ్ళో వాళ్ళకి అప్పగించారు. పోలీసులకు విషయం చేరవేసి, హాస్పిటల్‌లో జాయిన్ చేసేక 15 రోజులకు స్పృహ లోకి వచ్చేడు, కానీ తన వివరాలు మరిచిపోయాడుట. దగ్గర్లోని అనాథాశ్రమంలో చేర్చేరుట పోలీసులు. ఈలోగా శ్యామల రావు గారికి, “మీ అబ్బాయి, నన్ను విడిచి ఎక్కడికో వెళ్లిపోయారు” అని చెప్పి కల్లబొల్లి ఏడ్పులు ఏడిచింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కొడుకు జాడ తెలియక, కొంతకాలం తల్లడిల్లి పోయేరు. ఓ ఆరు నెలలకు నెమ్మదిగా తండ్రి వివరాలు గుర్తుకు వచ్చేయి, చెప్పేడుట.. కానీ ఈనాటికీ తనని అడవుల్లోకి ఎవరు తీసుకెళ్ళేరో చెప్పలేదు. జ్ఞాపక శక్తి పూర్తిగా రాలేదు, అది అతని భార్య పాలిటి వరం అయ్యింది. పోలీసులు తీసుకొచ్చి శ్యామల రావు గారికి కొడుకుని అప్పచెప్పేరుట. ఈలోగా ఉంచుకున్న వాడు పొమ్మనడంతో మళ్ళీ మామగారి దగ్గరకి చేరి, లేని ఆప్యాయతలు ఒలకబోసి, తన భర్తని తన నుండి వేరు చెయ్యకండి అని నిష్ఠూరాలు ఆడిందిట అతని భార్య.
నా భర్తని, నన్ను అన్యాయం చేయకండి అని ఎదురు సాధిస్తోన్న, కోడలి గయ్యాళితనం భరించలేక, శ్యామల రావు గారు, కొంత డబ్బిచ్చి, మళ్ళీ వెళ్లి నందిగామలో తెలిసిన ప్రవేటు కాలేజీలో లెక్చరర్‌గా వుద్యోగం వేయించి, వేరు కాపురం పెట్టించి వచ్చేరు. ఇది జరిగి 7 సంవత్సరాలు అయింది. కొడుకు చదువులో తెలివయినవాడు అవడంతో ఆ కాలేజీలో బాగానే నిలదొక్కుకున్నాడు కానీ, భార్య మాట జవదాటని పరమ మూర్ఖుడుగా తయారయ్యేడు.
శ్యామల రావు గారు రిటైర్మెంట్ ముందు నల్గొండలో ఓ చిన్నపాటి ఇల్లు కట్టుకున్నారు. కానీ రిటైర్ అయ్యేక మెడికల్ ఫెసిలిటీస్ దృష్టిలో పెట్టుకుని పిన్నిగారితో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి, ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసేరుట. అప్పటినుంచి, కొత్త సమస్య వచ్చింది ఆయనకి. పెద్ద కోడలు, ఆ ఇల్లు అమ్మేసి డబ్బిస్తే, వాళ్ళు ఇబ్బందులు లేకుండా నందిగామలో ఉంటామని చెప్తోందిట.
పిన్నిగారు.. పోనీ పిల్లలకే కదా, అమ్మేయమని అన్నారుట. కానీ శ్యామలరావు గారు ఒప్పుకోలేదు.
ఇక రెండవ వాడిది ఇంకో తీరు. వాడు ఎవరో డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని, ఖమ్మంలో కాపురం పెట్టేడు. తల్లిదండ్రులని కూడా పిలవలేదు సరిగదా, పిలిస్తే మీరు ఎలాగూ కులాంతర వివాహం చెయ్యరు కదా అని ఎదురు ప్రశ్నించాడుట. రెండవ కోడలు వీళ్ళ ఇంటికి ఇప్పటిదాకా రాలేదు. ఆమెకి ధన మదం ఎక్కువ. వీళ్ళకే ఆమెని చూడాలి అంటే ఖమ్మం వెళ్ళాలిట. ఆమెని రమ్మని పిలిచేరుట కానీ రాలేదు. సావిత్రి గారి బలవంతం మీద, వృద్ధ దంపతులు పిల్లల మీద ప్రేమతో ఒకటి రెండు సార్లు నందిగామ, ఖమ్మం వెళ్లి చూసి వచ్చేరు. కోడళ్ళు రాక పోయిన, కొడుకులు అప్పుడప్పుడు వస్తున్నారని ఆవిడ సంతోష పడేవారు.
మొదటి కోడలు, ఇల్లు అమ్మి డబ్బు ఇవ్వలేదని ఈ మధ్య భర్తని హైదరాబాద్ రానివ్వలేదు. భార్య చాటు భర్తగా మారిపోయిన పెద్ద కొడుకుని తలుచుకుని సావిత్రి గారు కుమిలి కుమిలి ఏడ్చేరు. పోనీ, ఆ ఇల్లు అమ్మేసి ఇచ్చేయండి అంటే, ముసలాయన ఒప్పుకోలేదు.. ఎందుకంటే ఆ మాత్రం ఆస్తి కూడా లేకపోతే, ఎన్నటికీ మన వైపు చూడరు వాళ్ళు అంటారు ఆయన.
రెండో కొడుకు తనకు డబ్బు అక్కర్లేదు అంటాడుట కానీ, అతన్ని నమ్మలేము అంటారు శ్యామల రావు గారు. వచ్చినప్పుడల్లా, అన్ని రకాల వంటలు చేయించుకుని ఆవురావురని తింటాడు కానీ, అతనికి కోపం ఎక్కువట. చిన్న తేడా వచ్చిన, తల్లిని కూడా కొట్టేస్తాడుట. పైగా ఏ బిజినెస్ చేస్తాడో చెప్పడుట. అందువల్ల అతను అంత నమ్మదగ్గ వ్యక్తి కాదని, అదేదో చీకటి బిజినెస్ అయితే, ఎప్పుడో పాపం పండితే పోలీసులు పట్టుకు పోతారని శ్యామల రావు గారి భావన. ఆయన ఉన్నంత కాలం సావిత్రి గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేరు. కానీ ఆవిడకి ఇంక ఆయుర్దాయం లేదు.
ఆవిడకేం ప్రశాంతంగా వెళ్లిపోయింది. ఇప్పుడు శ్యామల రావు గారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. వీధి చివర హోటల్‌లో తింటున్నారుట. ఆరోగ్యం సహకరించినంత వరకూ పర్వాలేదు. తర్వాత.. తలుచుకుంటేనే భయం వేస్తోంది నాకు.
“ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిల్లల అడ్రస్‌లు ఇస్తే, నేను వెళ్లి వస్తాను” అన్నాను.
ఆయన దీర్ఘాంగా నిట్టూర్చి, “వాళ్ళు డబ్బు మనుషులు సుధాకర్. ఇన్నాళ్లు, నాకు ఏ మూలో వున్న ఆశ కూడా పోయింది. ఆ ఇల్లు అమ్మి డబ్బు ఇస్తే వస్తారు. కానీ అది శాశ్వతం కాదు. ఆ డబ్బు అయిపోయాక, మళ్ళీ నేను బరువు అవుతాను. ఇంత బతుకు బతికి, వాళ్ళని వెతుక్కుని వాళ్ళ పంచన చేరలేను. వాళ్ళ తల్లి ఆరోగ్యం బావుండట్లేదు అని తెలిసీ ఈ మధ్య రాలేదు, వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా మార్చేసుకున్నారేమో, అందుకే స్విచ్ ఆఫ్ వస్తోందేమో.. నేను మరణించేక కర్మకాండలు చెయ్యడానికి మనుషులు ఎవరో ఒకరు వస్తారు. కానీ సంబంధం లేని వాళ్ళలా ఉంటున్న కొడుకుల కోసం ఏడ్చి నా కన్నీళ్ళని వృథా చెయ్యను”.
“ఒక నిశ్చయానికి వచ్చేసాను సుధాకర్.. నువ్వు మాట సాయం చేస్తే చాలు, మీ ఇంటి దగ్గర ఇల్లు చూడు, అద్దెకి వచ్చేస్తాను. ఈ శేష జీవితం ఇలాగే గడిపేస్తాను” అలా అంటున్నప్పుడు ఆయన గొంతు జీర బోయింది.
నా మనసు కకావికలం అయ్యింది. ఆలోచించాను. ఆయన విడిగా ఒక్కరే అద్దె ఇంట్లో ఉన్నా, వంట, బట్టలు ఉతుక్కోవడం.. ఇలా ప్రతి పని ఆయన చేసుకోలేరు. భాగస్వామిని కోల్పోయిన ఆడది బ్రతక గలదేమో గాని, పురుషుడు అలాంటి పరిస్థితిలో జీవించలేడు.
నా శ్రీమతితో కూడా చర్చించాను. ఆయన్ని మా ఇంటి దగ్గర్లో ఉన్న ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించడమే, సరి అయిన నిర్ణయం అని నిశ్చయించుకున్నాను. అదే మాట ఆయనకీ చెప్పేను.. ఒప్పుకున్నారు.
ఆయన ఉంటున్న ఇంటి వాళ్లకు చెల్లించాల్సిన బాకీ చెల్లించి, సామాన్లు లారీ లోకి ఎక్కించి, తిన్నగా తీసుకొచ్చి మా ఇంటి దగ్గర్లో వనస్థలిపురంలో ఓల్డేజ్ హోమ్‌లో జాయిన్ చేసేసాను. వారానికి ఒకసారి నేను వెళ్లి పలకరించి వస్తూ వుంటాను.
మరో రెండు నెలల్లో నల్గొండ లోని ఆయన ఇల్లు అమ్మించే పనిలో వున్నాను. ఆ ఇల్లు అమ్మితే ఓ 40 లక్షలు వస్తాయి. ఆయన పేరు మీద 20 లక్షలు వేసి, 20 లక్షలు హోమ్‌లో డిపాజిట్‌గా వుంచుతానని చెప్పెను. ఇంక ఆ పిల్లలు కాని పిశాచాల మీద ఆయన ఆధార పడనక్కర్లేదు.
నాకు అదే సబబు అనిపించింది. ఆదివారాల్లో నేను కలిసినప్పుడు చాలా ప్రశాంతంగా, వుషారుగా వున్నారు. ఆయనకి హోమ్ కూడా చాలా నచ్చింది.
(సమాప్తం)