డాక్టర్ సి. మృణాళిని గారితో ఒక సాయంత్రం!

2
3

[dropcap]తె[/dropcap]లంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, లేఖిని రచయిత్రుల వేదిక, సరసిజా థియేటర్ ఫర్ విమెన్ – సంయుక్త ఆధ్వర్యంలో, మే 5వ తేదీ, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో, మృణాళినిగారు కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా నియోగితులైన సందర్భంలో, ఒక చక్కటి సాహితీ సమావేశం జరిగింది!

ఆనాటి కార్యక్రమ విశేషాలు –

వేసవి సాయంకాలం అయినప్పటికీ, అకాల వర్షాలతో ఆహ్లాదంగానే ఉంది. నేను సభలో ప్రవేశించేటప్పటికీ మధుర గాయకులు త్రినాధ్ గారు, ఘంటసాల పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అందులో ‘తలనిండా పూదండ దాల్చిన రాణి’ నన్ను మహా బాగా ఆకట్టుకున్నది. సభంతా సాహితీ స్రష్టలు, లబ్ధప్రతిష్ఠులతో కళకళలాడి పోతోంది.

తరువాత ‘ముగ్గు’ ఇతివృత్తంగా తీసుకుని, మృణాళినిగారి ‘కోమల గాంధారం’ లోని కధా వస్తువు అంశంతో ముగ్గు మీద ఒక చక్కటి లఘునాటికను, లేఖినీ సభ్యులు ప్రదర్శించారు అత్యద్భుతంగా!

జ్యోతి ప్రజ్వలనం కాగానే, శ్రీనాథుడు రచించిన సరస్వతి మీద తెలుగు పద్యంతో నేను ప్రార్థన చేసిన తరువాత సభ ప్రారంభమైంది. ముందుగా మృణాళిని గారి సన్మానకార్యక్రమం జరిగింది. వారి సన్మానపత్రం రాసి, చదివే అవకాశం ఇచ్చిన విజయలక్ష్మిగారికి ధన్యవాదాలు!

ముందుగా అందరిలో పెద్దలు, డాక్టర్ ముక్తేవి భారతిగారు (వారు స్వయంగా మృణాళిని గారికి గురువులు) తమ ఆశీపూర్వక ప్రసంగం ప్రారంభించారు. కేవలం మంచి గురువులు దొరకడం మాత్రమే కాదు, ఒక గురువుకు మంచి శిష్యురాలు దొరకటం కూడాఎంతో ముఖ్యం అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలీ, అందరిలోకి మేధావి, విదుషీమణి, మృణాళిని తన శిష్యురాలు కావటం తనకు చాలా గర్వకారణం అన్నారు. ఆమె స్పృశించని సాహితీ రంగమే లేదు అన్నారు. అంతేకాకుండా empowerment of women, మహిళాసాధికారతకి ఒక చక్కటి ఉదాహరణ మృణాళినిగారు అని అన్నారు. అది తెలుగు మహిళలందరికీ ఈనాడు ఎంతో గర్వకారణం అని చెప్పారు.

తరువాత సంస్థ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి మంథా భానుమతి గారు మాట్లాడుతూ 93లో మృణాళిని గారితో కలిసి వేసిన టీవీ నాటకాన్ని గుర్తు చేశారు. ఆ రకంగా మృణాళిని గారిలోని మరొక కోణాన్ని స్పృశించారు.

ఆ తరువాత ప్రఖ్యాత రచయిత్రి, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిగారు మాట్లాడారు. కాకినాడ women’s college meet లో ముఖ్య అతిథిగా మృణాళినిగారు, కాకినాడ వచ్చినప్పుడు వారిని రిసీవ్ చేసుకుని తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన విషయం గుర్తు చేసుకున్నారు. మరొక సందర్భాన్ని ఉటంకిస్తూ, వారు Jaipur literary Festival గురించి రాసిన విషయం తనని చాలా ప్రభావితం చేసిందని చెబుతూ, తను రాసిన పుస్తకాన్ని అమెజాన్‌లో ప్రచురించి దాన్ని ఆ ఫెస్టివల్‌లో ప్రజెంట్ చేయటం గుర్తుచేసుకున్నారు.

తరువాత డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు మాట్లాడుతూ, ఆనాటి సమావేశం మంగళకరమైన సన్నివేశంగా భావిస్తున్నానంటూ, వైశాఖ మాసంలో శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం పేరంటం జరిగినట్టుగా మహిళామణులతో సభ కళకళలాడిపోతుందని అందంగా వర్ణించారు. అర్ధ శతాబ్దం వెనక్కి నడిస్తే, తన స్నేహయాత్ర మృణాళినిగారితో పంచుకోగలుగుతానని అంటూ చాలా సుదీర్ఘ ప్రయాణం అని అనుకున్నారు. వారితో ఒక చక్కటి మైత్రీ బంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. వారు కాకినాడలో జన్మిస్తే, తన బాల్యం కూడా ఎక్కువ శాతం కాకినాడలో జరగటాన్ని coincidence, గా వివరించారు. 1976 ప్రాంతంలో తండ్రి వియోగం కలిగితే, ఇంటి పెద్దగా బాధ్యత వహించాల్సిన సమయంలో, జీవితాన్వేషణలో భాగంగా ఆకాశవాణిని ఆశ్రయిస్తే, తన చదువుని పోషించుకోవడం కోసం మృణాళిని గారు కూడా ఆకాశవాణిని చేరిన విషయం తెలుపుతూ, వారి పాలిట ఆకాశవాణి ఒక కల్పవృక్షమై నీడనిచ్చిందన్నారు. బ్రాహ్మణ వంశంలో ప్రవర చెప్పుకొని నమస్కారం చెప్తారన్న విషయం గుర్తు చేస్తూ, తనను ఆకాశవాణికి పరిచయంచేసుకోటానికి పితామహులు, మాతామహులు పార్వతీశం కవుల గురించి, కందుకూరి వీరభద్రరావు గారి పౌత్రుడని చెప్పుకోవాల్సి వచ్చిందని చెబుతూ, ప్రత్యేకమైన ప్రవేశపరీక్షలు లేని ఆ రోజుల్లో మృణాళినిగారికి కొన్ని క్లిష్టమైన పదాలను ఉచ్చరించడానికి ఇచ్చినట్టూ, విశ్వక్సేనుడు, ద్యుష్టద్యుమ్నుడు, చివరగా తన పేరుని మృణాళిని ఉచ్చరించమని వారు కోరినట్లు, ఆ రకంగా మృణాళిని ప్రవేశం ఆకాశవాణిలో జరిగిందని చెప్పారు.

అప్పటికే వారి చేతిలో విద్యారంగం నుండి వచ్చిన పసిడి పతకాన్ని పట్టుకొని వచ్చారన్నారు. ఆనాటి మా నిరుద్యోగ బృందానికి మృణాళిని గారు ఒక రోల్ మోడలని వర్ణించారు. తననెప్పుడూ సుధామ గారు, మృణాళిని గారు ప్రభావితం చేస్తూనే ఉంటారని గుర్తు చేసుకున్నారు. లఘు ప్రసంగాలు చేసేటప్పుడు అది నన్నేచోడిని మీద కానీ, నారాయణరెడ్డి గారి మీద గాని, శ్రీశ్రీ, స్వాతంత్ర చరిత్ర గురించి అయినా పరిపూర్ణమైన, సమగ్రమైన సమాచారాన్ని గొప్పగా వారు ఇవ్వటం తనకు చాలా ఆశ్చర్యం వేసేది అన్నారు. ఆ రకంగా వారు తనకి రోల్ మోడల్ అన్నారు.

కరుణిశ్రీ గారు భువన విజయంలో పాల్గొన్న సమయంలో వారికి పృచ్ఛకులిచ్చిన సమస్యని ఉదాహరణగా చెబుతూ, “నీవు నీవు నీవున్ మరియు నీవు నీవు నీవని” సమస్యనిచ్చారనీ, ఆ మహాకవి దాన్ని చాలా అద్భుతంగా పూరించింది సభతో పంచుకున్నారు. ఒకసారి కుమారస్వామికి కోపం వచ్చింది. అమ్మ తనకంటే పెద్దవాడిని ఎక్కువ ప్రేమగా చూస్తుందన్న చాలా సహజమైన లౌకికమైన ఆరోపణ! అప్పుడు పార్వతి షణ్ముఖుడి ఆరు ముఖాలు ముద్దాడిందట. అలాగే మృణాళిని గారు విద్యారంగం, పాత్రికేయరంగం, ప్రసారమాధ్యమం, ఒక సృజన, ఒక విమర్శ, ఒక అనువాదం ఆమె స్పృశించని రంగమే లేదు. మృణాళిని అంటే తామర పువ్వుకి ఉండే తూడు అని అర్థం. ఆ సరస్వతిదేవి మృణాళిని ఆరు ముఖాలను, ముద్దాడి చంకన వేసుకొని పరవశించినట్టు భావిస్తుందని చెప్పారు.

అంతేకాకుండా మృణాళిని అద్భుతమైన ధైర్యానికి ప్రతీక అన్నారు. దూరదర్శన్ ఇంటర్వ్యూ కార్యక్రమాల సందర్భంలో, నటసామ్రాట్ అక్కినేని గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, మృణాళిని ఏమాత్రం తొట్రుపాటు, తడబాటు లేకుండా వారిని సూటిగా ఒక ప్రశ్న అడిగిందని, దాదాపు 40 సంవత్సరాలు కథానాయకుడిగా చేసిన మీరు, కొన్నిమేనరిజమ్స్‌ని ప్రదర్శించటం కృతకంగా అనిపించటం లేదా? అని. వారు అంత సూటిగా అడిగిన ఆ ప్రశ్నకి ఏఎన్ఆర్ గారు ఎలా రియాక్ట్ అవుతారోనని అక్కడ ఉన్న అందరూ భయభ్రాంతులకు లోనయ్యారుట. అయితే నాగేశ్వరావుగారు దాన్ని ఎంతో స్పోర్టివ్‍గా తీసుకొని చాలా మంచి ప్రశ్న వేశావని మెచ్చుకుంటూ, ఒక నటులు వాళ్ళ రంగంలో ఒక స్థితికి వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుందననీ, ఆ చట్రంలో బిగించుకుపోతుంటారని, దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించడం కూడా జరుగుతుందని ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఆ విధంగా చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ఓలేటి పార్వతీశం గారు!

తర్వాత వంశీ రామరాజుగారు మాట్లాడుతూ తన నాలుగు దశాబ్దాల పరిచయం వారితో గుర్తుచేసుకున్నారు. దాసరి నారాయణ గారు ఎడిటర్‌గా ఉన్నప్పుడు, ఉదయం పేపర్లో మృణాళిని గారు పనిచేయటం గురించి గుర్తు చేసుకున్నారు. వాళ్ల దివ్యాంగనల గురించి మృణాళిక గారు మొట్టమొదట చక్కటి ప్రచారాన్ని ఇచ్చినట్టు కూడా చెప్పుకున్నారు. నాగేశ్వరరావు గారు నాస్తికుడు అంటూ వారిని ఆ విషయం మీద ఒకరు ప్రశ్నించగా, భగవంతుడు నాకు ఒక పని ఇచ్చాడు, నేను ఆ పని మానేసి ఆయన దర్శనం కోసం క్యూలో నిలబడితే ఆయన సంతోషిస్తాడా అన్న నాగేశ్వరరావుగారి మాట గుర్తు చేసుకుంటూ, మృణాళినిగారు కూడా చాలా బిజీగా ఉంటారనీ, ఎందుకంటే ప్రపంచంతో పంచుకోటానికి ఆవిడ దగ్గర విజ్ఞానం చాలా ఉంటుంది కాబట్టి, అది వారిని బిజీగా ఉండేట్టు చేస్తుందని చెప్పారు. తర్వాత ఆనాటి తన క్యాబ్ డ్రైవర్ గురించి చెబుతూ, అతను మంచి సాహిత్య అభిమానినంటూ, మృణాళిని గారు తనకు తెలుసని అన్నారని, ఆమె రచనలన్నీచదువుతానని అన్న విషయం సభతో పంచుకున్నారు.

తరువాత ప్రఖ్యాత రచయిత్రి డి. కామేశ్వరిగారు మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేసేవారి అభిప్రాయాన్ని చెప్పటానికి పూర్తి అవకాశం ఇస్తూ, తను మధ్యలో కల్పించుకోకుండా ఉండేవారి ఇంటర్వ్యూ చేసే విధానాన్ని మెచ్చుకున్నారు. చక్కటి భావవ్యక్తీకరణం గల మృణాళినిగారు ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు క్షుణ్ణంగా తెలుసుకొని అద్భుతంగా చేస్తారని చెప్పారు. వారు ఏది చెప్పినా వినసొంపుగా ఉంటుందన్నారు. సాహిత్య రంగంలో ఆడవారికి లభిస్తున్న అవకాశాలు చాలా కొద్ది మాత్రమేనని బాధపడుతూ, ఆ విషయంలో సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా వారు ఆడవాళ్ళకి కొంత సహాయంగా, ప్రోత్సాహకరంగా ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తరువాత మృణాళినిగారి సహ ఉద్యోగి శిఖామణి గారు వారిని గురించి మాట్లాడుతూ, నాయని కృష్ణకుమారి తరువాత అంతటి విదుషీమణి మృణాళిని గారు అన్నారు. పదిమంది వక్తలు మాట్లాడిన తర్వాత, 11వ వక్తగా వచ్చి మాట్లాడి ఒక కొత్త విషయం చెప్పే అంత ప్రతిభ వారికి ఉన్నదని చెప్పారు. స్నేహపాత్రురాలైన మృణాళిని గారు, అంతే కచ్చితంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారని చెప్పి, దాదాపు 25 ఏళ్లు ఒక్క గదిలోనే పనిచేసినా, ఒక చూపు ద్వారా, చేత ద్వారా తనకి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని తనని మృణాళిని గారు మెచ్చుకోవటం గురించి చెబుతూ, ప్రశంసించటంలో వారికి ఉన్న వితరణని గుర్తు చేసుకున్నారు.

తర్వాత ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి వోల్గా గారు మాట్లాడుతూ, తెలుగు సాహిత్య రంగం మొత్తంలో, అందరిలో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తి మృణాళిని అన్నారు. సాహిత్య అకాడమీ కన్వీనర్‍గా అవటం వల్ల మన దృష్టిని ఆకర్షించింది కానీ అంతకుముందే ఆమె అత్యంత ప్రతిభావంతురాలు అని చెప్తూ, విశ్వవిద్యాలయాన్ని పరిపాలన చేసింది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సిలబస్‍ని తయారు చేయటమే కాక వారికి పాఠాలు కూడా చెబుతుందన్నారు. ఆమెను షణ్ముఖి అని వర్ణించారు కానీ నిజానికి సహస్రబాహువులతో పనిచేస్తుందని చెప్పారు. తనకు ఉపయోగపడే పనులు కాకుండా వేరే వాళ్లకి ఉపయోగపడే పనులే ఎక్కువగా చేస్తుందని అన్నారు. అందువల్లనే కేవలం రెండు అంకెల్లో మాత్రమే పుస్తకాలు రాయగలిగారనీ, ఆవిడకున్న ప్రతిభకి మరెన్నో కార్యక్రమాలు చేయగల సత్తా ఉన్న మనిషిని చెప్పారు. సాహిత్య విమర్శలో దిట్ట అన్నారు. అంతకుముందు లేనట్టి మార్గదర్శకంగా ఉండే విమర్శకు వారు ఉదాహరణ అన్నారు.

తెలుగులో హాస్యం రాసే వాళ్ళు తక్కువ అంటూ వారందరిలో మృణాళిని ఒకరు అన్నారు. సామాన్యుల నుంచి మేధావులు దాకా, అందరూ చదివేట్టు చేసే రచనగా వారి పరిశోధనాగ్రంథం ఉదహరించారు. పరిశోధన తీక్షణమైన చూపులతో చేయగలదు, లోతులకు వెళ్లి పరిశీలిస్తుందన్నారు. ప్రపంచ సాహిత్యంలో విశ్వ మహిళా నవల అనే అంశంతో అమెరికా, జపాన్, యూరప్ మొదలగు ప్రపంచంలోనే తొలి మహిళా నవలారచయితలని పరిచయం చేయటం గురించి ఉదహరించారు. తన పరిశోధనా పుస్తకం చదివితే ఒక కాల్పనిక నవల రాసినంతగా ఆ శైలి ఆకట్టు కుంటుందని చెప్పారు. అందరు చేసింది ఆమె చెయ్యదు! అందరూ ఆలోచించినది ఆమె ఆలోచించదు! అందరూ వెళ్లేదారిలో తాను వెళ్ళదు! నిజానికి సాహిత్య అకాడమీ చైర్మన్ పదవికి తనకి అర్హతలు బాగా ఉన్నాయంటూ, ఇంతవరకు ఒక్క మహిళా చైర్మన్ కూడా లేదన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

చాలామందికి ఆసక్తి ఉండదు లేదా శక్తి ఉండదు. తను టీవీ సీరియల్స్ రాసింది. చేపట్టని ప్రక్రియ లేదు. చేపట్టి విజయం పొందని ప్రక్రియ అసలే లేదు. చలం శతజయంతి ఉత్సవాలు జరిగినప్పుడు, ఆరుగురు పాత్రలు తీసుకుని వారు ఒక కార్యక్రమం చేసినట్లు, అందులో మృణాళిని అరుణ పాత్ర వేసినట్టు గుర్తు చేసుకున్నారు. తనకున్న ప్రతిభకి తనని తేరిపారి చూడటానికి కూడా మనకు అవకాశం దొరకనప్పటికీ మృణాళిని మనకందరికీ ఆత్మీయంగా అనిపించటానికి తను స్నేహంగా ఉండటమే కారణమన్నారు. తనకి నచ్చని విషయాలపట్ట పట్ల విముఖత చూపటానికి కూడా ఆలోచించదంటూ, తాను దెబ్బతినదు. ఎవరినీ నొప్పించదు. ప్రేమ, స్నేహంతో ఉంటుందని చెప్పారు. తెలుగు సాహిత్యం మిగతాభాషా సాహిత్యంతో దీటుగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఒక చక్కటి సన్నివేశంగా ఈనాటి సమావేశాన్ని భావిస్తున్నానని ముగించారు.

తరువాత సన్మాన గ్రహీత డాక్టర్ మృణాళిని గారు మాట్లాడుతూ ఏదైనా అవకాశాలువస్తే భయపడను అంటూ తన శక్తి మేరకు అవి వినియోగించడానికి వాడుతానని చెప్పారు. నా ఆనందానికి నా దుఃఖానికి నేను ఎవరి మీద ఆధారపడనని అన్నారు. పనిచేసుకుంటూ పోతాననీ, పని లేకపోతే చాలా బాధపడతానని అన్నారు. తనలోని విజ్ఞానానికి credit విద్యార్థులకు ఇస్తానన్నారు. ఆన్‍లైన్‍లో అమెరికాలో ఉన్న విద్యార్థులకు తాను విద్యాబోధ చేస్తున్న విషయం గుర్తు చేసుకుంటూ, తను నిత్య విద్యార్ధిలా ఉండే కారణం విద్యార్థులు అన్నారు. వాళ్ళ కోసం నేను నిరంతరం చదువుతూనే ఉంటాను. విద్యార్ధుల వల్ల నేర్చుకోవాల్సింది ఎంత ఉందో తెలుస్తుంది. అందుకని వాళ్ళకి ధన్యవాదాలు చెప్తానన్నారు.

తన్ను jack of all trades, master of none గా వర్ణించుకుంటూ, విభిన్నమైన రంగాలతో పరిచయం వలన ఒకదాని మీదే ఫోకస్ చేయడానికి కుదరలేదని అన్నారు. కథలు రాస్తాను. నవలలు రాస్తాను. పరిశోధనలు చేస్తాను. ఒక్కదానిలో ఫోకస్ చేస్తే పైకి వస్తావని తన్ను, మిత్రులు, క్లాస్‍మేటు నందిని సిద్ధారెడ్డి గారు, ఎప్పుడూ కోప్పడే వారని చెప్తూ నేను ఇలాగే ఉంటాను ఇలాగే పోనీండి అన్నానని చెప్పారు. నాకు అన్నిటిలో ఆసక్తి ఉంటుంది. ఉన్నన్నాళ్ళు నాకిష్టమైనట్టు ఉంటాను. పోయిన తర్వాత ఏమన్నా అవ్వాలనే కోరిక నాకు లేదు. ఏమి చేసినా తిట్టే వాళ్ళు ఉంటారు. నాకు వీలైనంత మటుకు మంచి పుస్తకాలు వెలువరించటం, మంచి డాక్యుమెంటరీలు తీయటం, మంచి సమావేశాలు నిర్వహించడం చేస్తానంటూ చెప్పి, తెలుగు భాష గురించి ఇతర భాషల వాళ్లకు చాలాతక్కువ తెలుసని బాధపడ్డారు. చలం గురించి చెబితే ఇంత గొప్ప రచయితలు ఉన్నారా అని ప్రశ్నించిన విషయం గుర్తు చేసుకున్నారు. చాలామందికి ఒక శ్రీశ్రీ మాత్రమే తెలుసనీ, మన తిక్కన తెలీదు చాలామందికి. సుబ్రహ్మణ్య భారతి మనకు తెలుసు, మన గురజాడ ఎవరికీ తెలియదు. గురజాడ ది రీడర్ అనే పుస్తకాన్ని రాశాను. తెలుగు రైటర్స్ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. మనకు చాలా గొప్ప రచయితలు ఉన్నారు. వాళ్ళ గురించి ఇతరులకు తెలిసేట్టు చేస్తాను. నేను పాటలు కూడా రాస్తాననీ, సురేఖామూర్తి గారు పాటలు పాడిన విషయం గుర్తు చేసుకున్నారు. నాకు ఆసక్తులు ఎక్కువ, అన్నీ గొప్పగా చేశానని చెప్పుకోను. ఇంకా ఎన్నో పుస్తకాలు రాయాల్సినవి ఉన్నాయనీ, ఈ 5 సంవత్సరాలు కన్వీనర్ పదవి అయిన తర్వాత వాటి మీద కృషి చేస్తానని తన ప్రసంగాన్ని ముగించారు. చివరగా కల్వకోట ఉమాదేవిగారు వందన సమర్పణతో సభ ముగిసింది! ఇంత చక్కటికార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు సంస్థ కార్యదర్శి అత్తలూరి విజయలక్ష్మిగారికి అభినందనలు! ఒక చక్కటి సాహిత్యకార్యక్రమం లేఖిని తన జేబులో వేసుకుంది.

లేఖిని రచయిత్రుల వేదిక – సరసిజ థియేటర్ ఫర్ విమెన్, సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ మృణాళిని గారికి సమర్పించుకుంటున్న అభినందన సన్మాన పత్రం!

“నడిచే నలువరాణి మృణాళిని!”

కందము:

అందము మేధస్సు కలిసె!

సుందరముగ నొక్క చోట సురుచిర శోభన్!

ఎందును కానము శారద

చందము నీవిధి చదువులు చక్కగ చదువన్!

చదువుల తల్లి సరదాగా భూలోక సంచారం చేద్దామనుకొని సాక్షాత్తూ మృణాళినిగారిలాగా అవతరించింది!

విశ్వవిద్యాలయాలూ, గ్రంథాలయాలూ బ్రహ్మలోకంలాగా చేసుకుని రాయించపై విజ్ఞానవిహారాలు చేసింది, తల్లి వాణి మృణాళిని రూపంలో!

పట్టాలూ, డిగ్రీలు పరిగెత్తుకొని వచ్చి ఆ శర్వాణిని ఆలింగనం చేసుకున్నాయి!

జిహ్వపై సరస్వతి తాండవ మాడుతుంటే సభలూ, సమావేశాలూ, ఇంటర్వ్యూలతో ప్రచారమాధ్యమాలు మృణాళిని గారి మేధస్సుతో పండుగలు చేసుకున్నాయి!

దాశరధి, నటసామ్రాట్, ఓపినయ్యర్, పర్వీన్ సుల్తానా – సరస్వతి తన ప్రియ పుత్రులను మృణాళిని ద్వారా పరామర్శ చేసుకుంది!

ఆ ఇంటర్వ్యూలన్నీ సంచలనాత్మకంగా ప్రజాప్రశంసల నందుకోవటంలో ఆశ్చర్యమేముంది!

వాగ్దేవి తులనాత్మక పరిశీలనా విభాగంలో అధ్యాపకురాలు అయింది!

పత్రికలకు సంపాదకత్వం చేసింది!

బీబీసీ రేడియో, యూట్యూబ్ ఛానల్ యాంకరింగ్, వరల్డ్ స్పేస్ రేడియోలో ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేసింది! అంతేకాదు US, China, Mauritius, Norway, దేశాలన్నీ తిరిగి సాహితీగోష్ఠులు జరిపింది!

పత్రసమర్పణలు చేసింది!

యద్దనపూడి సులోచనా రాణి, వాసిరెడ్డి సీతాదేవి, అబ్బూరి ఛాయాదేవి, తురగా జానకీరాణీల అవార్డులను మృణాళినికి ఇచ్చి, తల్లి గీర్వాణిని అర్చించుకున్నారు ఆ పెద్దలు!

నవలలు, అనువాద గ్రంథాలు, తల్లి భారతి మృణాళినియై రాసింది!

ఇప్పుడు భగవతి సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా నీరాజనాలు అందుకోబోతోంది!

మరి మనందరం మృణాళినిగారిలాగా మనమధ్య తిరిగే ఆ పలుకుంజెలికి అభినందనాంజలి సమర్పించుకోవాలి కదా!

మృణాళినిగారూ! మీ సారస్వత విజ్ఞానయాత్రలో మీరు మరెన్నో పురస్కారాలనూ, పదవులనూ అందుకోవాలనీ, మీ కలలన్నీ సాకారం చేసుకోవాలనీ, సరసిజ ఆర్ట్స్ థియేటర్స్, లేఖినీ సంస్థలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నయ్యి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here