మార్పు మన(సు)తోనే మొదలు-17

0
3

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[కరోనా సమయంలో ‘మార్పు మనతోనే మొదలు’ వాలంటీర్లు పూర్ణిమ సాయంతో ఒక హెల్ప్ లైన్ ప్రారంభిస్తారు. సామాజిక మాధ్యమాల్లో దానికి బాగా ప్రాచుర్యం రావడం వల్ల వాళ్ళ హెల్ప్ లైన్‌కి  ఫోన్ కాల్స్ వెల్లువలా వస్తాయి. ఫోన్ చేసినవారికి ధైర్యం చెబుతూ ధ్యానం, యోగా, ప్రాణాయామాల వల్ల మనోధైర్యం పెరుగుతుందని, వాటిని తప్పనిసరిగా ఆచరించమని, గుణం కనిపించకపోతే అప్పుడు సైకియాట్రిస్ట్‌ని కలవచ్చని ప్రోత్సహిస్తుంది పూర్ణిమ. ఏవైనా హాబీలు ఉంటే వాటిని అభివృద్ధి చేసుకోమని సలహా ఇస్తుంది. ఉద్యోగాలు పోగుట్టున్నవాళ్ళకి, మారిన కాలానికి అనుగుణంగా ఏదైనా ఉద్యోగాన్ని వాళ్ళనే ఆలోచించుకోమంటుంది. ఉద్యోగం కోల్పోయిన ఓ ఈకామర్స్ ఉద్యోగికి సొంతంగా ఉపాధి కల్పించుకునే మార్గం చెబుతుంది. నింహాన్స్ వారు కోవిడ్ కోసం తయారు చేసిన వీడియోల తయారీలో గగన్ తన సహాయసహకారాలను అందిస్తాడు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకై కృషి చేయాలని దివిజ్ పట్టుపడతాడు, న్యూట్రిషన్ రంగంలో ఎవరు చేయగలరో అని ఆలోచిస్తున్న గగన్‍కి ఓ సంఘటన గుర్తొస్తొంది. త్రయంబకేశ్వర్ గారి మీటింగ్ తర్వాత తన అపాయింట్‍మెంట్ అడిగిన ప్రమీలని గుర్తు చేసుకుంటాడు. హోం సైన్సులో డిగ్రీ చేసిన, సంపన్న కుటుంబానికి చెందిన ఆమె ఒకప్పుడు తనకి చెప్పిన సమస్యలని, ఆమె కూతురు ఆకస్మిక మరణం గురించి గుర్తు చేసుకుంటాడు గగన్. ప్రమీలని, దివిజ్‍‍కి పరిచయం చేస్తాడు. ప్రమీల, దివిజ్ కలిసి ‘ఇమ్యూనిటీ ఫర్ కమ్యూనిటీ’ అనే య్యూ-ట్యూబ్ చానెల్ పెట్టి, దాని రోగనిరోధక శక్తిని పెంచే వంటకాలు కషాయాల గురించి ప్రచారం చేస్తారు. లాక్‍డౌన్ ఎత్తేసాకా – ఒక రోజు, గగన్ తన ఇంట్లో దివిజ్, జాయ్‌లతో మాట్లాడుతున్నప్పుడు మల్లిక వచ్చి – తిరుచ్చి దగ్గర నదిలో స్నానం చేయించి, అక్కడి విష్ణుమూర్తి ఆశీస్సులు తీసుకుంటే, మానసిక రోగాలు తగ్గుతాయని తమ బంధువు చెప్పారనీ, అందుకని చిన భూపతిని తీసుకుని అక్కడికి వెళ్ళడానికి సెలవు అడుగుతుంది. కాసేపు ఆలోచించి, మందులు ఆపకుండా వేస్తానన్న షరతు మీద ఆమె ఊరు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు గగన్. ఆమె ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుంది. మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తున్నారని దివిజ్ గగన్‍పై మండిపడతాడు. గగన్ మరో ఉదాహరణతో దివిజ్‍ని చల్లబరుస్తాడు. తమ చానల్‌కి రోజూ కోట్లలో హిట్స్ వస్తున్నాయని, ప్రకటనల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్తాడు. వచ్చే రాబడిలో పది శాతం వాటా ప్రమీల గారికి ఇద్దామనుకుంటాడు. గగన్ సరే నంటాడు, కానీ జాయ్ మౌనంగా ఉండిపోతాడు. – ఇక చదవండి.]

[dropcap]ఒ[/dropcap]క రోజున నిరూప్, కామాక్షిలు వచ్చి, తాము పెళ్ళి చేసుకోవడానికి నిశ్చయించుకున్నామని, తన చేతుల మీద జరిపించమని గగన్‌ని కోరారు. జీవితంలో ఓడిపోయిన రెండు మనసులు ఒకరినొకరు అర్థం చేసుకుని, కలిసి పైకెగరాలనుకుంటున్నారు! గగన్ ఈ పరిణామానికి ఉప్పొంగిపోయాడు!

ఇంకా అతిథుల సంఖ్యలో మార్పు లేదు గనుక యథాప్రకారం మరో కోవిడ్ పెళ్ళి చేయించారు గగన్, పూర్ణిమ. హడావుడి కూడా ఎప్పటిలాగా శశి, దివిజ్‌లదే! ఎటొచ్చీ ఈమాటు మల్లిక, చిన భూపతి బదులు నిరూప్ చెల్లి, ఆమెను చేసుకోవాలనుకునే అబ్బాయి వచ్చారు. తరువాతి పెళ్ళి నిరూప్ చెల్లిదేనని, అందరూ రావాలని నిరూప్ వచ్చిన వాళ్ళని ఆహ్వానించాడు.

అదే హడావుడిలో దివిజ్‌ని పక్కకి లాగి, “తప్పుగా అనుకోనంటే ఒక మాట.. మీ విషయాల్లో తలదూర్చానని అనుకోకూడదు ప్లీజ్”, అన్నాడు జాయ్.

“ఎంత మాట! మాకు అక్కరకి వచ్చే చుట్టాల్లో మీదే మొదటి ర్యాంక్. మిమ్మల్ని అపార్థం చేసుకునే స్కోప్ లేనే లేదు సార్!” అన్నాడు దివిజ్.

“ప్రమీల గారు మీరిస్తానన్న షేర్‌కి ఒప్పుకున్నారా?” అడిగాడు జాయ్.

“ఆవిడ ఒప్పుకోరని మీకు నమ్మకమా?” ఎదురుప్రశ్న వేశాడు దివిజ్.

“యెస్. లాజిక్ తరువాత చెప్తాను. ఆవిడేమన్నారో ముందు చెప్పు దివిజ్”, ప్రాధేయపడ్డాడు జాయ్.

“అదృష్టవశాత్తు ఆయుష్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలు మనకి ప్రకటనలిచ్చాయి. అమజోన్, అందులోనూ గిర్నార్ గ్రీన్ టీ లాంటి ఆరోగ్యకరమైన వస్తువుల ప్రకటనలు మన చానెళ్ళలో వచ్చాయి. తద్వారా అమజోన్ వారికి అమ్మకాలు బాగా పెరిగాయట. దాంతో ప్రకటనల వసూళ్ళు బోలెడంత వచ్చాయి..” అని దివిజ్ అంటూండగా, “నన్ను ఊరించకబ్బాయీ, పాయింట్‌కి రా”, అని తొందరపెట్టాడు జాయ్.

“ఆవిడ వద్దన్నారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన జీవితానికి పరోపకారమనే ఆశయం అందించి, సార్థకత చేకూర్చిన వారి నుంచి ఆవిడ డబ్బులు తీసుకోరట. తన పేర్లో డొనేషన్‌గా రాసుకోమన్నారు. పైగా, అడిగినందుకు నొచ్చుకున్నారు కూడా”, అన్నాడు దివిజ్.

“ఆర్థిక స్తోమత ఉన్న ఆవిడ స్వచ్ఛందంగా మనకు సహాయపడడానికి వచ్చారు. నొచ్చుకోరు మరి?” అన్నాడు జాయ్.

“ఫారిన్‌లో స్వచ్ఛంద సంస్థల మధ్య సహాయసహకారాలుంటే ఇలాంటివి కామన్”, అన్నాడు దివిజ్.

“నాయనా, నీ ఫారిన్, గీరిన్ వదిలిపెట్టు. మనం ఉండేది ఇండియాలో. ఆవిడ మనసు నొప్పించావు. ఎన్ని పనులున్నా, ఆవిణ్ణి కలిసి క్షమాపణ వేడుకో. ఓకే?” అన్నాడు జాయ్.

అనుకోని ఈ జ్ఞానోదయానికి ఆలోచనలో పడ్డాడు దివిజ్. ఈ ప్రతిపాదనకి గగన్ అంకుల్ ఎలాగ ఒప్పుకున్నారా, అన్న విషయం అతణ్ణి ఆశ్చర్యపరచింది. ఏది ఏమైనా, వెళ్ళి ఆవిడకి సారీ చెప్పేశాడు.

***

మరో రెండు నెలలు గడిచిపోయాయి. మల్లిక తీర్థయాత్రలు ముగించుకుని భర్తతో సహా తిరిగి వచ్చింది. అతడి పరిస్థితిలో మెరుగుదల ఉందని ఆమె గట్టిగా నమ్ముతోంది. ఘనకార్యాలకి మొదటి మెట్టు నమ్మకమని ఎరిగి ఉన్న గగన్ ఆమె సంతోషాన్ని తగ్గించే ప్రయత్నమేదీ చేయకుండా ఉరుకున్నాడు. చిన భూపతి బాగుపడాలని, అతని జీవితంలో అద్భుతం జరగాలని మనసారా కోరుకున్నాడు.

***

కరోనా పరిస్థితి మరికాస్త మెరుగుపడి, జీవనం సామాన్య స్థాయికి చేరుకుంటున్న తరుణంలో, తన అనుయాయీలందరినీ పిలిచి, భూమి కంపించే వార్త ఒకటి పంచుకున్నాడు గగన్.

“మరో జిల్లాలోని డి‌ఎం‌హెచ్‌పి డాక్టర్ వయసు అరవై అయిదు దాటిపోయి, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన స్థానే మరో డాక్టర్ కావాలని ప్రకటించారు. నేను అప్లయ్ చేసినట్టు పూర్ణిమకి కూడా చెప్పలేదు. తనకి నామీదున్న నమ్మకం అలాంటిది మరి!”

“ఇక్కడకు రాబోయే డాక్టర్ గారి ఎంపిక ఇంకా కాలేదు. ఆయన వస్తూనే, నేను రిలీవ్ అయ్యి, అక్కడికి వెళ్ళాలి. నాకు సహకరించినట్లే, మీరందరూ ఆయనకి కూడా సహకరించాలి. నా దగ్గర మందులు తీసుకున్నట్టే, మీరు ఆయన దగ్గర నుండి కూడా తీసుకోవాలి సరేనా?” అన్నాడు.

జాయ్ వెంటనే, “మీలాంటి డాక్టర్ దొరకరు సార్. మీ కన్నా తెలివితేటలుండే డాక్టర్ వస్తాడేమో గాని, మీలాగా పరుల మంచి కోరడమే కాకుండా, వాళ్ళని తెచ్చి దగ్గరుంచుకుని, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్‌లా వాళ్ళ జీవితాల్ని మంచి బాటలో నడిపించి, అవసరమైతే వాళ్ళ తరఫున పోరాడే మనిషి మాకు దొరకడండీ”, అని, బాధతో అటూ-ఇటూ చకచకా పచార్లు చెయ్యడం మొదలు పెట్టాడు.

“లేని పోని అనుమానాలతో బ్రతికే నాకు నిజం చూపించి పుణ్యం కట్టుకున్నారు. మా నయనిని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ట్రీట్మెంట్ ఇచ్చారు. మా అమ్మాయిని మాతో ఉండేలా చేశారు. ఇప్పుడు మీరు మాతో ఉండరా?” అన్నాడు ప్రభాత్.

“వాళ్ళంతా మీకున్నారు కదండీ. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో మానసిక ఆరోగ్యం పరిస్థితి బొత్తిగా బాగులేదని. నేను టేక్ అప్ చేసిన కేసుల మనుషులు ఒక స్థాయికి చేరుకున్నారు. నేను వాళ్ళని చెయ్యి పట్టి నడిపించనక్కరలేదు.”

“అలాగని నేను ‘కంఫర్ట్ జోన్’ లో ఉండిపోయానంటే, పరోక్షంగా దాని అర్థం, నా సేవలని అందించకుండా కాలయాపన చేస్తున్నాననే కదా!” అన్నాడు గగన్. అందరూ తెల్ల మొహం వేసి, మొహామొహాలని, గగన్ మొహాన్నీ మార్చి, మార్చి చూడడం మొదలు పెట్టారు.

“నిలవుండే నీళ్ళు ఎక్కువ కాలం నిలవవని అందరికీ తెలుసు కదా! నదీ ప్రవాహం ఎన్నో కష్టాలని ఎదుర్కుంటుంది కానీ తన కర్తవ్యాన్ని మరచిపోకుండా సాగరం అనే గమ్యం వైపు ప్రవహిస్తూనే ఉంటుంది కదా! అలాగే, పడవ కూడా ఒక రేవులో ప్రయాణీకులని దించి, మరో రేవు వైపు ప్రయాణం సాగిస్తుంది.”

“ఈ ఊళ్ళో నేను, నా కుటుంబం ఎన్నేళ్ళు గడిపినా, ఇది మా జీవన యానంలో ఒక మజిలీ మాత్రమే. అందరం కుటుంబ సభ్యుల్లా మెలిగాం.. మరి కొందరు వాళ్ళ కుటుంబంలోకి మమ్మల్ని స్వాగతించడానికి వేచి ఉన్నారు. నేను ఎప్పటికీ మీ వాణ్ణే. మీరంతా కూడా నా వాళ్ళే. శశిని సరిగ్గా అర్థం చేసుకున్న తండ్రినే అయితే వాడిక్కడే ఉండడానికి ఇష్టపడతాడు. ఏరా, వస్తావా, ఉంటావా?” అన్నాడు శశికేసి తిరిగి.

శశి వచ్చి, గగన్‌ని కౌగిలించుకుని, “నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్, నాన్నా!” అన్నాడు.

“దివిజ్, ఉదాసీనంగా ఉంటే నువ్వు మా వాడివేనా, అనే డౌట్ వస్తుంది. ఎన్‌జిఓ సేవలు అందించడానికి ఒక కొత్త చోటు నీకు దొరుకుతుంది. అక్కడ ఉండే తోలు బొమ్మలాట కళాకారులకి ఆధరువు ఇస్తూ, కొత్త రోగులకి లైఫ్ స్కిల్స్ శిక్షణని ఇవ్వచ్చు కదా! నీ ఎంబీయే భాషలో చెప్పాలంటే ఈ మోడల్‌ని ఇంకా పెద్ద ఎత్తున అమలు పరిచే అవకాశం ఉంది. చీర్ అప్! మీరంతా ఈ ‘వోట్ ఆఫ్ థాంక్స్’ ని ఆపేసి, మమ్మల్ని నవ్వుతూ సాగనంపితే సంతోషం”, అని ముగించాడు గగన్.

ఓ మూడు నెలల పాటు రిలీవర్ రాలేదు. ఆ సమయంలో అత్యంత తెలివితేటలూ, అమితమైన నటనా కౌశలం గల ఒక ప్రఖ్యాత నటుడికి ముప్ఫై నాలుగేళ్ళకే, నూరేళ్ళు నిండాయి. బలవన్మరణం. సామాజిక మాధ్యమాల్లో మళ్ళీ కలకలం బయలుదేరింది.

మనుషుల మానసిక కష్టాలు పలు విధాలు- మాటలాడే మనిషి లేక, కీళ్ళ వాతంతో వాకింగ్ చెయ్యడానికి వీలు లేక కృంగుబాటుకి లోనయ్యేవాళ్ళు ఉండొచ్చు; మనో ధైర్యం ఉండేవాళ్ళకి ఇవి పెద్ద కారణాలలాగా కనిపించకపోవచ్చు గాని, మానసిక దౌర్బల్యం ఉండే వాళ్ళకివి పెద్ద విషయాలే! మళ్ళీ హెల్ప్ లైన్‌కి ఫోన్ కాల్స్ ఊపందుకున్నాయి.

ఈ మాటు డేటాబేస్‌లో ఉన్న నెంబర్లతో ‘ఆశావాదం’ అనే వాట్సాప్ గ్రూప్ తయారు చేసి, పెద్దలు చెప్పిన ఆశావాదపు మాటలు ‘శుభోదయం, శుభరాత్రి’ అనే పలకరింపులతోబాటు పంపేవారు. ఈ విషయంలో అనామిక భలే కృషి చేసింది,

“వేరే ఊరు వెళ్ళినా, నీకు ఈ కాల్స్ తప్పవోయ్”, అన్నాడు గగన్ పూర్ణిమతో. “అది నా గురుతర బాధ్యతగా భావిస్తాను”, అంది పూర్ణిమ.

***

ఒక రోజున, “మే ఐ కమ్ ఇన్ సర్?” అడిగిందొక ఆడ గొంతుకు. “యెస్”, అని తలెత్తి చూసిన గగన్‌కి ఓ పాతికేళ్ళ యువతి కనిపించింది. ఆమెని చూస్తే ఆరోగ్యవంతురాలిలా ఉంది. సల్వార్ సూట్ సెట్ వేసుకుని సింపుల్‌గా ఉంది.

అతని మొహంలోని ప్రశ్నార్థకం గమనించిన ఆమె, “నమస్కారం సర్. మీ రిలీవర్‌ని”, అంది చేతులు జోడించి. ఇంత చిన్న అమ్మాయా, అని ఆశ్చర్యపోయాడు గగన్. “డి‌ఎం‌హెచ్‌పిలో, ఈ వయసులో?” అని బయటికే అనేశాడు. ఆమె చిరునవ్వుతో, “సర్, మీరే నాకు స్ఫూర్తి. మీ బాటే నా బాట”, అంది. మరింత విస్తుపోయాడు గగన్.

“సర్, గట్టిగా చెప్పాలంటే, నేను ప్లస్ టూ చదువుతున్నప్పుడు పాత్రికేయురాలు గీతా ఇళంగోవన్ గారు నెలసరిలో పాటించవలసిన శుభ్రత మీద తీసిన డాక్యుమెంటరీ, ‘మాదవిడాయ్’, మా స్కూల్లో ప్రదర్శించారు. ఆవిడ ధైర్యానికి నేను ఫిదా అయిపోయి, ఆవిడకి ఈమెయిల్ ఇచ్చాను. అప్పుడు తెలిసింది, ఆవిడ చేసిన మొదటి డాక్యుమెంటరీ మెంటల్ రిటార్డేషన్‌పైన అని. కానీ, ఆవిడ వాడిన మాట ‘స్పెషల్ చిల్డ్రన్’. ఆ ‘లిటిల్ స్పేస్’కి అవార్డు కూడా వచ్చిందట. అందుకని సైకియాట్రీ చదువుదామని నిర్ణయించుకున్నాను”, అంది నిర్విష.

గగన్ ఆలోచనలో పడ్డాడు. సమాజ శ్రేయస్సు, ముఖ్యంగా స్త్రీల మేలు కోరి ఆ గీత గారు తయారు చేసిన ఒక డాక్యుమెంటరీ అటు త్రయంబకేశ్వర్ గారినీ, ఇటు ఈ అమ్మాయినీ ప్రభావితం చేశాయంటే, ఆవిడతో మాట్లాడి ఆవిణ్ణి అభినందించాల్సిందే, అనుకున్నాడు. “మీ దగ్గర గీతా ఇళంగోవన్ గారి నెంబర్ ఉందా?” అడిగాడు గగన్. ఇచ్చింది ఆమె.

“ఇంతకీ, మీరు డి‌ఎం‌హెచ్‌పిలోకి ఎందుకు వచ్చారో చెప్పకుండా మిమ్మల్ని అడ్డుకున్నాను. ప్లీజ్ కంటిన్యూ”, అన్నాడు గగన్.

“‘ప్రజానీకానికి మానసిక ఆరోగ్యం’, అనే అంశం మీద నింహాన్స్‌లో ఒక ప్రత్యేక ప్రసంగం ఇచ్చారు. వచ్చినాయన విశ్వ విఖ్యాతినొందిన సైకియాట్రిస్ట్. ఆయన నింహాన్స్‌లో చదవలేదట. మ్యాగ్సేసే అవార్డు గ్రహీత అయిన మీరు నింహాన్స్‌లో చదవడం ఆ విద్యాసంస్థ అదృష్టమని కొనియాడారు. అప్పుడే డిసైడ్ అయ్యా, పని చేస్తే డి‌ఎం‌హెచ్‌పిలోనే అని”, అని జవాబిచ్చిందా అమ్మాయి.

“సారీ, మీ పేరు అడగలేదు. అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే, జాయినింగ్ రిపోర్ట్ తయారు చేయిస్తాను”, అన్నాడు గగన్. “ఐ ఆమ్ ఆల్సో సారీ సర్, నా పేరు నిర్విష”, అంది.

“నైస్ నేమ్. పైకి తియ్యగా మాట్లాడి మనసు నిండా విషంతో ఉండేవాళ్ళు ఈ లోకంలో కోకొల్లలు. వాళ్ళని నిర్విషులని చేయడమే మీ వృత్తిగా ఎంచుకోవడం ఈ లోకం అదృష్టం”, అన్నాడు గగన్.

“సర్, చిన్న రిక్వెస్ట్- నన్ను మీరనకండి. మీ అమ్మాయి వయసుంటుందేమో నాకు”, అంది నిర్విష.

“మా అబ్బాయి నీకన్నా పెద్ద ఉంటాడు”, నవ్వుతూ జవాబిచ్చాడు గగన్.

“ఆఁ, వచ్చే రోజు చెప్పుంటే, ఉండడానికి ఇల్లు చూడడం, స్టేషన్‌కి కార్ పంపడం లాంటివి చేసుండే వాణ్ణి”, అన్నాడు గగన్.

“మా తాత గారికి ఒంట్లో బాగాలేదు. అందుకనే ఇంత లేట్ అయ్యింది. ఇప్పుడు కులసాగానే ఉన్నారు. మరింక ఆలస్యం చేయకుండా కార్‌లోనే బయలుదేరి వచ్చాను. మీరున్న చోట అందరూ మంచి వాళ్ళే ఉండగలరన్న నమ్మకంతో ధైర్యంగా వచ్చేశాను”, అంది నిర్విష.

“మా ఇంట్లో మా అబ్బాయి ఉంటాడు గనుక, అక్కడ ఉండమని అడగలేను. పైగా, మేమిప్పుడు ఊరు మారాలి కదా! అప్పుడు వాడొక్కడే ఉంటాడు. నా ఫ్రెండ్ ప్రభాత్ వాళ్ళది మా పక్కిల్లే! వాళ్ళింట్లో అతని భార్య, ఎన్‌జి‌ఓలో పని చేసే కూతురు, పెద్ద దిక్కైన మామ గారు ఉంటారు. అక్కడ ఉందువు గాని. మరో విషయం – భార్యాభర్తలిద్దరూ మన క్లయింట్లే! సరే, ఇప్పుడు ఆఫీసు టీమ్‌ని పరిచయం చేస్తాను, మధ్యాహ్నం కేస్ హిస్టరీస్ డిస్కస్ చేద్దాం, ఓకే?” అన్నాడు గగన్.

“మీ ఇష్టం, సౌకర్యమూను”, అంది నిర్విష.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here