[బాలబాలికల కోసం ‘అడవి తల్లి ఒడిలో’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]చె[/dropcap]న్నా యూనిఫాంలో ఉన్నాడు. జీపు దిగి వాళ్ల దగ్గరకు వెళ్లి ఏదో చెప్పాడు. ఒకతను శాంతిస్వరూప్ దగ్గరకి వచ్చి సెల్యూట్ చేశాడు.
“మీ గురించి విన్నాము గాని, ఇదే చూడడం సార్! దయ ఉంచండి!” అన్నాడు వినయంగా.
“గాడ్ బ్లెస్ యు యంగ్ మ్యాన్!” అన్నాడాయన.
“సార్, మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా?”
“వై నాట్, విత్ ప్లెజర్!”
తన సహచరున్ని కూడ రమ్మని పిలిచాడతను. సార్‌తో సెల్ఫీ తీసుకున్నారు. వారిని భుజం తట్టి “బీ అలర్ట్, బాయిస్” అన్నాడాయన.
రెండో అతను అన్నాడు “సార్ మీరు ఆదిలాబాద్ దగ్గర చర్ల డివిజన్‌లో పని చేసినపుడు నక్సలైట్లను హ్యండిల్ చేసిన విధానం ఇప్పటికీ డిపార్టుమెంటులో చెప్పుకుంటారు సర్.”
“అబ్బాయ్! ఒక మాట చెబుతాను వినండి! మన డ్యూటీ మనం నిజాయితీగా చేస్తే ఎవరికీ భయపడనవసరం లేదు. చర్ల రీజియన్ నుండి మహారాష్ట్రకు టేకు, రోజ్‌వుడ్ కలప స్మగ్లింగ్ జరిగేది అప్పుడు. దాన్ని కర్బ్ చేయాడంలో నక్సలైట్లు కూడా నాకు పరోక్షంగా సహాయం చేశారు. రాజకీయ నాయకులే నా మీద కోపంతో సి.సి.ఓ.ఎఫ్. గారి మీద ఒత్తిడి తెచ్చి నన్ను రంపచోడవరం డివిజన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించారు. అక్కడే మీ డి.ఎఫ్.ఓ నవీన్ నాకు సబార్డినేట్. హీ ఈజ్ యాన్ ఎఫిసియంట్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్” అన్నాడాయన.
“లైక్ యు! అంకుల్!” అన్నాడు నచికేత.
అప్రయత్నంగా ఆయనకు సెల్యూట్ చేశాడు చెన్నా!
జీపు ముందుకు సాగిపోయింది.
ఒక నలభై నిమిషాల ప్రయాణం తర్వాత ‘బైర్లూటి’ వచ్చింది. ప్రభుత్వ పర్యాటక శాఖ (టూరిజం డిపార్టుమెంటు) వారి పెద్ద పెద్ద సైన్ బోర్డులు రోడ్ కిరువైపులా కనిపించాయి. Community based eco-tourism initiative 2017లో భాగంగా అక్కడ అక్కడ ఫారెస్ట్ డిపార్టుమెంట్‌లో పని చేసే స్టాఫ్‌కు క్వార్టర్స్ చాలా ఉన్నాయి. చిన్న township ఉందక్కడ. హోటళ్లు, కూల్ డ్రింక్స్ షాపులు, రోడ్డు కిరువైపులా ఉన్నాయి.
“పిల్లోండ్లకు బైర్లూటి ఫారెస్ట్ క్యాంప్ చూపించరా సార్!” అనడిగాడు చెన్నా, జీపు అక్కడ ఆపకుండా ఆయన ముందుకుపోతుంటే.
“వాళ్లకు కావలసింది టూరిజం ఎక్స్‌పీరియన్స్ కాదు చెన్నా, అసలైన అడవిని చూపించడం. బైర్లూటి క్యాంప్‌లో ఏముంటాయి? అందమైన ఎ.సి. కాటేజెస్, ఎసి రెస్టారెంట్ల, సఫారీ, ఫారెస్ట్ డ్రైవ్, నైట్ క్యాంప్స్, ఇవే కదా! అక్కడ ఫారెస్ట్ ప్లెజర్ దొరుకుతుంది గాని నిజమైన అడవిని గురించిన విజ్ఞానం దొరకదు. దొరికినా ఏవో ఫోటోల రూపంలో, మ్యూజియంల రూపంలో ఉంటుంది. అందుకే బైర్లూటి క్యాంప్ స్కిప్ చేశాను” అన్నాడాయన.
“అయితే భవనాశివనం చూస్కొని, పిల్లోండ్లను ‘తుమ్మల బయలు’ తీస్కపోదాము సార్! అసలైన అడవంటే, మీరంటున్నట్లు అదీ!” అన్నాడు చెన్నా.
“హి గాట్ మై పాయింట్. హావ్ యు? ” అనడిగాడు పిల్లలను.
“యస్ అంకుల్. టూరిజం రిసార్ట్స్ కొన్ని మా పేరెంట్స్‌తో వెళ్లాము. మీతో ఈ అడవిలో తిరుగుతూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము” అన్నాడు ఖలీల్.
“ఏది ఏమైనా ఈ బైర్లూటి ఫారెస్ట్ క్యాంప్ గురించి క్లుప్తంగా చెబుతాను వినండి. నోట్ చేసుకోనక్కరలేదు. జస్ట్ వినండి చాలు!”
“చెప్పండి అంకుల్!” అన్నారు పిల్లలు ఆసక్తిగా.
“ఇది నాగలూటికి వెళ్లే దారిలో వస్తుంది. ఆత్మకూరు మండలంలోనే ఉంటుంది. ఇక్కడ ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యే ఖరీదైన కాటేజెస్ ఉంటాయి. వాటి అద్దె రోజుకు ఐదువేల రూపాయల వరకు ఉంటుంది.”
“బాప్ రే! అంత కాస్ట్లీనా?” అని అరిచారు పిల్లలు.
“నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వులోని ఎకోటూరిజం ప్రోగ్రాములో మూడు ప్రాంతాలున్నాయి. ఒకటి బైర్లూటి, రెండవది తుమ్మల బయలు, మూడవది పాచెర్ల. ఇక్కడ ట్రెక్కింగ్ సౌకర్యం కూడ ఉంది. తూర్పుకనుమల అందాలు టూరిస్టులకు కనువిందు చేస్తాయి. నాగలూటి దగ్గర పురాతన వీరభద్రస్వామి వారి ఆలయాన్ని కూడ జీప్ సఫారీలో వెళ్లేటప్పుడు చూడవచ్చు.”
“కానీ ఇలాంటివి నాకు పర్సనల్‌గా ఇష్టం ఉండదు. కానీ ప్రభుత్వానికి టూరిజం ద్వారా ఆదాయం రావాలంటే ఇవన్నీ అవసరమే. మిమ్మలన్ని నేను తీసుకొచ్చిన కారణం, అడవుల గురించి మీకు సైంటిఫిక్‌గా అవేర్‌నెస్ కలిగించాలని.”
“వుయ్ నో అంకుల్. లెట్ అజ్ ప్రోసీడ్ టు భవనాశివనం.”
పదింబావుకు మెయిన్ రోడ్ లోంచి అడవిలోకి తిరిగి, పది యాభైకి ఒక చోటికి చేరుకున్నారు నల్లమల అడవి విశ్వరూపం అక్కడ వారికి దర్శనమిచ్చింది.
“పిల్లలూ, అడవులను ‘గ్రీన్ లంగ్స్’ అని అంటారు ఎందుకో తెలుసా? నోట్ చేసుకోండి.”
“వృక్షాలు ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తాయి. జంతువుల, మనుషుల శ్వాసక్రియకు (respiration) అవసరమైన ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ లను బ్యాలెన్స్ చేస్తాయి. కాని, అవి గ్రహించే కార్బన్ డయాక్సైడ్ పరిమాణం, వదిలే ఆక్సిజన్ పరిమాణం, వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి, సంవత్సరానికీ సంవత్సరానికీ మారుతుంటుంది తెలుసా పిల్లలూ!”
“అడవులు నరికి వెయ్యడం (డిఫారెస్టేషన్) వల్ల, పాజిల్ ప్యూయల్స్‌ను తగులబెట్టడం వల్ల, కార్బన్ డయాక్సైడ్ పరిమాణం వాతావరణంలో పెరుగుతుంది. భూమి అనే ప్లానెట్ ఒక శరీరం ఐతే, అడవులు దానికి ఊపిరితిత్తులు, ధ్రువప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్ వేడిమి పెరిగినా, 50 బిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ రిలీజవుతుంది. ‘పీటర్ కాక్స్’ అనే శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం, కార్బన్ డయాక్సైడ్ ఫర్టిలైజేషన్, వృక్షాలను పెద్ద ఎత్తున పెంచి సంరక్షించడం (afforestation) వల్ల, పాజిటివ్ ఫలితాలను చూపుతుంది.”
“బ్రెజిల్ దేశంలోని అమెజాన్ అడవులను ‘భూమికి ఊపిరితిత్తుల’ని పిలుస్తారు. ప్లీజ్ నోట్. ఇంకో విషయం తెలుసా? యాభై నుంచి ఎనభై శాతం ఆక్సిజన్ ఉత్పత్తి సముద్రాల నుంచి వస్తుంది. దాన్ని ‘ఓషనిక్ ప్లాంక్‌టన్’ అంటారు”.
పిల్లలు శ్రద్ధగా రాసుకుంటున్నారు. “ఇది ఫోటోసింథటిక్ స్వభావాన్ని కలిగి, సముద్ర ఉపరితల పొరలలో ఉంటుంది. అది మన కళ్ళకు కనబడదు.”
“ప్రోక్లోరోకాకస్ (Prochlorococcus) అనేది భూమి మీద, ఉన్న అతి చిన్న ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్. మన మొత్తం బయోస్ఫియర్ (biosphere) లో 20 శాతం ఆక్సిజన్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది.”
“కాని సముద్రం ఉత్పత్తి చేసే ఆక్సిజన్ అంతటినీ ‘మెరైన్ లైఫ్’ అంటే సముద్రంలోని జీవరాశులే వాడుకుంటాయి.”
“కాబట్టి అడవులు ఇచ్చే ఆక్సిజనే మానవులకు జంతువులకు ముఖ్యం. కదా అంకుల్? ” అన్నది నిఖిల.
“బంగారు తల్లీ! యు ఆర్ కరెక్ట్!” అన్నాడాయన.
“వేప చెట్టు ఉంది చూశారా, అది 24 గంటలూ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. రాత్ర పూట కూడా అది కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోగలదు.”
“మన ఆంధ్రకేసరినగర్ మూడు రోడ్లలో, వేప చెట్లు చాలా ఉన్నాయి” అన్నాడు నచికేత.
“దటీజ్ ఆసమ్” అన్నాడు అంకుల్.
“మొక్కలు పెంచడం వల్ల మూడు లాభాలున్నాయి చిల్డ్రన్! అవి మూడ్ లిఫ్టర్స్‌గా పనిచేస్తాయి. అంటే మనం డల్‌గా ఉంటే మనసును ఉత్తేజపరుస్తాయి. మన ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని, పెంచుతాయి. మనలో కలిగే శారీరిక మానసిక ఒత్తిడిని, నిస్త్రాణను (stress and fatigue) తగ్గిస్తాయి. మొక్కలు ఇంట్లో పెంచుకున్నా ఈ లాభాలన్నీ ఉంటాయి. ఇక అడవుల్లో తిరిగితే ఎంత లాభమో ఊహించండి.”
“అవునంకుల్. ఈ మూడు రోజుల నుంచి మేం చాలా ఉత్సాహంగా ఉన్నాము, అంతెందుకు, మన HMDA పార్కులో ఆడుకుని వస్తే ఎంత బాగుటుంది?” అన్నాడు ఖలీల్.
నిఖిల అన్నది “మా తెలుగు సార్ చెప్పారు సీతమ్మవారు గర్భవతిగా ఉన్నప్పుడు నాకు అడవులు చూడాలని ఉందని రాముల వారిని అడిగారట.”
“ప్రపంచానికే ‘గ్రీన్ లంగ్స్’ అనదగిన అడవులు ఐదు ఉన్నాయి. నోట్ చేసుకోండి. పెరూ దేశంలోని లోరెటో ప్రాంతంలో ఉన్న ‘అమెజాన్ రెయిన్ ఫారెస్ట్’ ఒకటి. భూమ్మిద ఉన్న మొక్కలు, జీవరాశుల్లో 10 శాతం దీంట్లోనే ఉన్నాయి. రెండవది ‘టైగా ఫారెస్ట్’. దీన్ని ‘బోరియల్ ఫారెస్ట్’ అని కూడ అంటారు. ఇది శీతల ప్రాంతాల్లో, అంటే రష్యా, ఐరోపా, కెనడా లేదా అలాస్కాలలో ఉంటుంది. ప్రపంచంలోని అడవి వనరుల్లో (forest resources) 30% ఈ అడవుల నుంచే వస్తాయి.”
“ఇక్కడ ఉష్టోగ్రతలు -40c (మైనస్ నలభై డిగ్రీల సెంటిగ్రేడ్) చేరుకుంటాయి. ఇవి 186 మిలియన్ల టన్నుల కార్బన్ ను నిల్వ చేయగలవు(బోరియల్ ఫారెస్ట్, కెనడా)”
“ఇక మూడవది జియూఝూయిగే వ్యాలీ ఫారెస్ట్ (Jiuzhaigou valley forest). ఇది చైనాలో ఉంది. దీనిని 1922లో UNESCO వారు ప్రపంచ హెరిటేజ్ సైట్‌గా, ప్రకటించారు. ఇక్కడ మిన్షాన్ పర్వత శ్రేణి (MINSHAAN) సముద్ర మట్టం నుండి రెండు వేల నుండి నాలుగు వేల ఏడు వందల మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.”
“ఇక నాలుగోది ‘డెయింట్రీ రెయిన్ ఫారెస్ట్’ (Daintree Rain Forest). ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ ప్రాంతంలో ఉంది. ఆస్టేలియాలోని 90 శాతం సీతాకోకచిలుకలు, ఇతర కీటకాలు, ఆ అడవిలోనే ఉన్నాయి. ఆ కీటకాలు 12000 రకాలు ఉండవచ్చు.”
“ఇక చివరిది ‘ది జయంట్ సీక్వోయిమస్ ఫారెస్ట్’ (forest of giant sequoias). ఇక్కడ మూడు వేల సంవత్సరాల వయసు వరకు పెరిగే అతి పురాతన వృక్ష జాతులున్నాయి. అవి మహా వృక్షాలు. ఇంచుమించు 26 అంతస్తుల భవనాలంత ఎత్తు ఉంటాయి. ఇవి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నాయి. ఈ అడవులు 1789 చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి.”
“పిల్లలూ, విన్నారా? అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నారా? మొత్తం భూ భాగ ఉపరితలంలో 31 శాతం అడవులు ఆక్రమిస్తాయి. కోవిడ్-19 పరిస్థితుల తర్వాత, ఆర్ధికంగా ప్రపంచం కోలుకోవడానికి, అభివృద్ధి లక్ష్యాలను చేరుకోడానికి అటవీ సంపదే ముఖ్యమని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.”
“మరి, అంకుల్, మన నల్లమల అడవులు, ఇంకా మన దేశంలోని అడవులు ఇప్పుడు మీరు చెప్పినంత పెద్దవి కావా?” నచికేత అడిగాడు.
“రైట్ క్వశ్చన్ మై బాయ్!” అన్నాడు శాంతిస్వరూప్. “ప్రపంచ స్థాయిలో ఎప్పుడైనా తక్కువే ఉంటాయి. అంత మాత్రాన మన దేశంలోని అడవులను తక్కువ చేసి చూడకూడదు. మన దేశంలోని కొన్ని పెద్ద, ప్రముఖ అడవులు గురించి చెబుతాను నోట్ చేసుకోండి.”
“వెస్ట్ బెంగాల్ లోని సుందర్‌బన్స్, గుజరాత్ లోని గిర్ అడవులు, మేఘాలయలోని సేక్రెడ్ గ్రోవ్, ఖాసీ హీల్స్, అరుణాచల్ ప్రదేశ్ లోని నందఫ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, కర్నాటకలోని బందిపూర్ ఫారెస్ట్, తమిళనాడులోని నీలగిరి బయోస్ఫియర్ రిజర్వు, ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల ఫారెస్ట్.”
నల్లమల ఫారెస్ట్ పేరు అంకుల్ నోట విని పిల్లలు కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టారు. వాళ్లు అడవిని ఎంతగా ఓన్ చేసుకున్నారో శాంతిస్వరూప్‌కు అర్ధమై, ఆయనకు కళ్లు చెమర్చాయి. అయన కొనసాగించారు.
“కెన్నెత్ అందర్సన్ (Kenneth Anderson) అనే wild life writer, పులుల సంఖ్య అతి ఎక్కువగా ఉన్న మహారణ్యం నల్లమల అని ప్రశంసించాడు. ఇక తిరుపతి దగ్గర ఉన్న శేషాచలం అడవులు చందనపు చెట్లకు (sandal wood) పేరేన్నిక గన్నవి. తెలంగాణా ప్రాంతం 1,12077 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. భారతదేశంలోని భౌగోళిక ప్రాంతంలో ఇది 3.41%. దక్కను పీఠభూమిలో ఉంది. కాబట్టి, తెలంగాణా ఒక subtropical climateను కలిగి ఉంటుంది.ఇందులో, 2015 ఉపగ్రహ సమాచారం (satellite data) ప్రకారం 26,419 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో, అడవులు వ్యాపించి ఉన్నాయి. ఇందులో 1,596 చదరపు కిలోమీటర్లు అతి దట్టమైనవి. నల్లమల అడవి తెలంగాణా ప్రాంతంలో కూడా వ్యాపించి ఉంది.”
చెన్నా కూడా జాగ్రత్తగా సారు చెప్పింది వింటున్నాడు. ఇలా అన్నాడు.
“సారు, పెపంచంలోని అడవులను గురించి ఇవరంగా సెప్పబడ్తివి. కాని మన నల్లమల గురించి ఇంటుంటే శానా సంతోశంగా ఉండాది. గుండె పొంగుతుండాది అనుకో.”
“శభాష్ చెన్నా” అన్నాడు సార్.
“హమ్ కిసీసే కమ్ నహీ, అంకుల్” అన్నాడు ఖలీల్.
“ఆ పిల్లోడు తురకం భాషలో ఏమన్నాడు సారూ.”
“మనం ఎవరికంటే తక్కువ కాదు” అన్నాడు.
“అదీ! అదీ! మోగోని మాట!” అన్నాడు చెన్నా.
నిఖిల అన్నది. “ప్రపంచంలో గొప్పవి ఎన్నున్నా, మనవే గొప్పవి అనిపిస్తూంది ఎందుకు అంకుల్.”
“అలా అనిపిస్తేనే తల్లీ, మన దేశం మీద మన ప్రాతం మీద మనకు ప్రేమ ఉన్నట్లు! సాక్షాత్తు శ్రీరామ చంద్రుడేమన్నాడు? ‘జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి!’ అని కదా”
“ఈ పాటే యన్టీవోడు ‘బొబ్బిలిపులి’ సినిమాలో పాడుతుంటే రోమాలు నిక్కబడ్సుకున్నాయంటే నమ్ము సారు!” అన్నాడు చెన్నా.
“ఆయన మన జాతికే గర్వకారణమైన మహానటుడు చెన్నా.”
“చెన్నా అంకుల్, నాకు నీ మీద కోపం వచ్చింది!” అన్నది నిఖిల బుంగమూతి పెట్టి.
“ఎందుకు తల్లీ!” అన్నాడు అయోమయంగా చెన్నా.
“ఖలీల్ అన్న దాన్ని నీవు ‘అదీ! మోగోని మాట!’ అని మెచ్చుకొన్నావు. మగపిల్లలేనా బాగా మాట్లాడేది? ఆడపిల్లలు కాదా? అందుకే నాకు కోపం!”
శాంతిస్వరూప్ ఆ పిల్ల వైపు అబ్బురంగా చూస్తూన్నాడు. చెన్నా అన్నాడు “తప్పే తల్లీ, తప్పే! మా కర్నూలు జిల్లాలో అట్ల అంటారు, ఎవరైనా బాగా ఏదైనా అంటే, మోగోలేమి, ఆడోల్లేమి అంతా ఒకటే. నాకూ నీ అంత బిడ్డ ఉండదమ్మా. ఏమనుకోగాకు. మగపిల్లలతో బాటు వచ్చి అడవంతా తిరుగుతుండావు సూడు, అదీ ఆడపిల్లంటే! అట్లుండాల!”
చెన్నా మాటలకు నిఖిల ముఖం పొద్దు తిరుగుడు పువ్వులా విచ్చుకుంది.
భవనాశివనంలోకి నడుచుకుంటూ కిలోమీటరు దూరం వెళ్లారు. అక్కడ వారికి కొందరు భిల్లజాతి వారు, (చెంచులు) కనబడ్డారు. వారు అడవిలో ఎండు పుల్లలు ఏరుకుంటున్నారు. కొందరు పెద్ద పెద్ద ఎండుటాకులను గోనెసంచుల్లో వేసుకుంటున్నారు. కొందరు చెట్టు బెరడుల వెనుక పేరుకున్న జిగురును సేకరిస్తున్నారు. మరి కొందరు మహా వృక్షాలుగా పెరిగిన చింత చెట్ల నుండి రాలిన చింత బొట్లను (పండు) ఏరుకుంటున్నారు. మరి కొందరు నేల మీద ఉన్న చిన్న మొక్కలను పరీక్షగా చూస్తూ, వాటి ఆకులు తుంచి సంచుల్లో వేసుకుంటున్నారు.
యూనిఫాంలో ఉన్న చెన్నాను చూసి వారు బెదిరి, వెళ్లిపోసాగారు. అప్పుడతడు “చెంచుల్లారా, బయపడవాకండి. నేను మిమ్మల్నేమీ అనను. ఇదిగో ఈ సారు మన అడవికే పెద్ద ఆఫీసరు. అయిదరాబాదు నుంచి ఈ పిల్లలకు మన నల్లమలను సూపించనీకె తీస్కవచ్చినాడు” అన్నారు.
వాళ్లందరూ వచ్చి శాంతిస్వరూప్‌కు నమస్కరించారు. ఇంతలో నచికేత “అమ్మా” అని కేకవేశాడు. ఒక చెట్టు కొమ్మ అతని మోచేతికి తగిలి, మోచేయి చీరుకపోయి రక్తం రాసాగింది. నిఖిల చటుక్కున తన బ్యాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి, గాయాన్ని శుభ్రంగా కర్చీఫ్‌తో తుడిచింది.
చెంచుల్లో ఒకామె గబగబ ఒక చెట్టు కింద పెరిగిన ఒక మొక్క దగ్గరికి వెళ్లి, ఏడెనిమిది ఆకులను తుంచుకొని వచ్చింది. అవి కొంచెం మందంగా, మెత్తగా ఉన్నాయి. వాటిని ముద్ద చేసి రెండు చేతులతో నలపసాగింది ఆమె. పచ్చని పసరు రాసాగింది. దానిని నచికేత గాయం మీద ఆ పసరును దట్టంగా పూసి, నెమ్మదిగా ‘రబ్’ చేసింది. గాయం అసలు మండలేదు. చల్లగా అనిపించింది నచికేతకు. తన దగ్గర ఉన్న ఒక పాత గుడ్డను చింపి మోచేతిగాయం మీద ఆ ఆకు పిప్పిని ఉంచి కట్టుకట్టింది. మరో రెండు మూడు ఆకులు నమలమని ఇచ్చింది.
“రణపాల ఆకు సారు! చేతి మీద తగిలిన దెబ్బను ఛనంలో మానిపిస్తాది” అన్నదామె.
“నాకు తెలుసమ్మా!” అన్నాడు శాంతిస్వరూప్. జేబులోంచి ఇరవై రూపాయలు తీసి ఆమె కివ్వబోయాడాయన.
“శ! శ! దుడ్డు ఇస్తావేంది సారు! దుడ్ల కోసరం కాదు నేను చేసింది. సన్నపిల్లోనికి దెబ్బ తగిలింది గదా పాపమని..” అన్నదామె నొచ్చుకుంటూ.
చెంచులు సెలవు తీసుకొని వెళ్లిపోయారు. శాంతిస్వరూప్ అన్నారు “చూశారా చెంచుల సంస్కారం? వారిలో నైతిక విలువలు ఇంకా సజీవంగా ఉన్నాయి. దానికి కారణం పరోపకారశీలమైన స్వచ్ఛమైన ప్రకృతిలో వాళ్లు బ్రతకడమే. అడవిలో వాళ్లు ఇలా అవీ ఇవీ సేకరించుకోవడం చట్టరీత్యా నేరం. అందుకే వాళ్లు మన చెన్నాను చూసి బెదిరారు. కానీ మా అటవీ శాఖ అధికారులు వారిని ఏమీ అనరు. చూసీ చూడనట్లుంటారు. కారణం వారు బీదవారు. వారేమీ స్మగ్లర్స్ కాదు. చూశారా వారికి అడవిలోని ఔషధమొక్కల మీద ఎంత అవగాహన ఉందో! అడవి అంటే చెట్లకు జుంతువులకే కాదు ఎంతో మంది గిరిజనులకు, ఆదిమ తెగల వారికి, జీవనాధారం. అడవులు వారికి ఆహారం,నీరు, ఆశ్రయం ఇస్తాయి. పదండి ముందుకు వెళదాం.”
కొంత దూరం వెళ్లాక వారికి ఏవో జంతువులు వేసిన పేడ గుర్తులు కనిపించాయి. కొన్ని ఇంకా తడిగాను, మరి కొన్ని సగం ఎండి, కొన్నేమో పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. కొన్నింటిని ఫోటోలు తీశాడు శాంతి స్వరూప్. పిల్లలను భూతద్దాల ద్వారా ఆ పేడ కళ్లలోని కీటకాలను, సూక్ష్మ జీవులను చూడమన్నాడు.
(ముగింపు వచ్చే వారం)