కవి కరీముల్లా కవిత్వం

4
5

[అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా.. ‘కవి కరీముల్లా’ కవిత్వం పై ప్రత్యేక రచన]

[dropcap]‘అ[/dropcap]మ్మ’ అన్నది ఒక కమ్మని మాట. పెదవే పలికే తీయని మాట ‘అమ్మ’. ఇంకా అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. నవమాసాలు మోసి, తన ప్రాణం పణంగా పెట్టి, బిడ్డకు జన్మనిచ్చి, తాను పునర్జన్మ పొందుతుంది మాతృమూర్తి.

మే రెండవ ఆదివారం అంతర్జాతీయ మాతృదినోత్సవం జరుపుకుంటున్నాం. కొన్ని దేశాల్లో మొదటి ఆదివారం జరుపుకుంటారు.

అన్ని దేశాల్లో, అన్ని మతాల్లో అమ్మ మీద ఎంతో కవిత్వం వచ్చినా, మాతృమూర్తిని మనసారా ఎంతగా కీర్తించినా, ఆమె ఋణం తీరేది కాదు.

తెలుగు కవిత్వంలో ముస్లిం అస్థిత్వం మైనారిటీ వాదంగా వచ్చిన తర్వాత, ఒక విశిష్టమైన భావధారతో ఆవిష్కృతమైంది ‘ఇస్లాం వాదం’. దాని ప్రవర్తకుడు, ఆవిష్కర్త ‘షేక్ కరీముల్లా’.

షేక్ షంషున్నిసా

కరీముల్లా తండ్రి ప్రభుత్వంలో సర్వేయర్. చిన్న ఉద్యోగం. కొద్ది మొత్తం జీతం. పై ఆదాయం ఆశించని నిజాయితీపరుడు. తల్లి షేక్ షంషున్నీసా ఐదుగురు బిడ్డలతో గుట్టుగా సంసారాన్ని లాక్కుని వచ్చేది. అరబ్బీ మాత్రమే చదువుకున్నది కాబట్టి ఖురాన్‌ను చదువుతూ చుట్టుపక్కల వారికి వివరించి చెప్పేది. బిడ్డలు చదువుకుంటుంటే తెలుగు, ఇంగ్లీష్ పాఠాలు తనకేం తెలియక పోయినా పక్కనే కూర్చుని, వాళ్ళు చదువుకునేలా చేసేది. పిల్లలు వేమన పద్యాలు చదువుతుంటే చాలా ఆనందించేది.

పిల్లలు పెడదారి పట్టకుండా నైతికత, మానవత్వం ప్రాథాన్యత గురించి బోధించేది.

భర్తకు ప్రాణస్నేహితుడైన ఒక చౌదరి గారి భార్య అనారోగ్యంతో బిడ్డకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు తాను ఒక నెల రోజులు పాలిచ్చిన తన మాతృమూర్తి అంటే ప్రాణం కరీముల్లాకి. తల్లి పట్ల తన గుండెల్లోంచి పొంగుకొచ్చిన గౌరవాభిమానాలను కవిత రూపంలో వెల్లడించారు –

అమ్మీజాన్

“పొద్దు పొడిచిందో లేదో/ఇల్లంతా ఖుష్ బూ చల్లి/ఊద్ కడ్డీలా కాలుతున్న అమ్మీజాన్ పొగచూరై మసిబారుతుంది/తర్కారీకి వెళ్ళేందుకు వేసుకున్న బురఖా/కుర్తా కంతల్ని కప్పేసినా/పగుళ్ళిచ్చిన చెప్పుల్లేని కాళ్ళు గరీబుతనాన్ని వెక్కిరిస్తూనే వుంటాయి/పావలా కోసం చిన్నప్పుడు నేనేడిస్తే/ ‘దలిందర్ మర్యా’ తిట్టు లంకించి/తలుపేసి కన్నీరవ్వడం గుర్తుంది/అబ్బజాన్ కాయగట్టిన చేతులకు/ పసీవాతో వెలిసిన సుర్మాకళ్ళకు/అత్తరు మాటల్ని పెంచడం షరా యే/ చెల్లి ఎదిగే కొద్దీ అమ్మి తరగడం తెల్సు/ పుస్తకం కోసం మారాం చేస్తే/పేగుల్నే మడిచి వెలుతురయ్యేది/అల్లాను తప్ప ఎవ్వరినీ దేబిరించని/అభిమానం చంద్రహారమై/మెరుస్తుంది/ఇన్నేళ్ళొచ్చాక ఇంకా ఎందుకే కష్టం అంటే/తను చెప్పే జవాబొక్కటే/నేను అమ్మను బేటా!”

ఇస్లాం వాదం

అనేక రూపాల్లోంచి, తనదైన కోణం నుండి విశ్లేషించే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక స్వభావాలకు, సమస్యలకు సంబంధించిన నిర్దిష్టమైన సిద్ధాంతం ‘ఇస్లాం వాదం’. సమాజంలోని భిన్న వర్గాల మధ్య నెలకొన్న అపోహలను తొలగించి, ఒక స్నేహ వారధిని నిర్మించే విశ్వజనీన సూత్రం ఉన్నది దీనిలో. మార్క్సిజాన్ని నమ్మని వాడు కమ్యూనిస్టు కానట్టే, అంబేద్కరిజాన్ని నమ్మని వాడు బహుజన వాది కానట్టే – ఇస్లామును విశ్వసించని వాడు ముస్లిం కాదు, అలాంటి వాళ్ళు మాట్లాడేది ముస్లిం వాదం కాదు అంటారు కరీముల్లా. నిజానికి ఏ అస్తిత్వమైనా అదే అంతిమం కాదు. అన్యాయంగా ఏ వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేసినా అతడు సమస్త మానవాళిని ఖననం చేసినట్టే. మరీ ముఖ్యంగా ఆ నేరం ముస్లిం వైపు నుండి జరిగితే దాన్ని ఖండించాలని, భిన్న కులాలు, మతాలు, సంస్కృతులున్న ఈ దేశంలో ఘర్షణకు తావివ్వరాదని, భారత రాజ్యాంగ విలువలకు కట్టుబడి లౌకిక సామ్యవాద సర్వసత్తాక శ్రేయో రాజ్యమే ఇస్లాం వాదం కోరుతుందని కరీముల్లా ప్రగాఢ విశ్వాసం.

భర్తను కోల్పోయి, పేదరికంతో బాధ పడుతూ, కుటుంబ పోషణార్ధం, వార్ధక్యభారంలో, ఆత్మగౌరవంతో, వీధులలో తనకు చేతనైన పని – అత్తరు సీసాలు అమ్ముకుంటున్న ‘అత్తరు బూబు’ లోని అమ్మతనాన్ని గుర్తించిన కరీముల్లా కవిత –

అత్తరు బూబు

“ఆమె/నదిలా ప్రవహిస్తూ ముళ్ళనీ, మొనదేలిన కళ్ళనీ/దాటుకుంటూ పోతుంది/ఆత్మీయతను అస్త్రంగా చేసి/అగరువత్తీలా కొద్ది కొద్దిగా/కాలుతూ ఆఖరి అంకం కేసి/సాగిపోతుంది/అగ్గిలాంటి బూబు/అవనిపై విరిసిన సౌశీల్యాల/అత్తరు పుష్పం/బూబు/పేగుబంధం కోసం/రెక్కల్ని ఊడల్ని చేసి/తనో మర్రిచెట్టు నీడయ్యింది/లేలేత క్షణాన/సూర్యమ్మ పొదుగు నుండి/వెలుతురు పాలు జుర్రుకుంటున్న/లేగదూడ భూమిలా/ఫజర్ నమాజ్ చదివాక/నమాజీ మోముపై మెరిసే చిద్విలాసంలా/విప్పారిన నెమలీకౌతుంది/విశ్వాస కాంతుల్ని కాజేసుకుని/కళేబరాల కాష్టంలా మిగిలిన/గల్లీలన్నీ ఆ పాదస్పర్శతో/సంస్కృతీ పరిమళాలై/విచ్చుకుంటాయి/ఎవరైనా ఎకసెక్కంగా/అత్తరు సీసాలమ్మే బూబుకు/ఆ పర్దా ఎందుకో అంటే/బేటా.. నువ్వు మేం కప్పుకున్న/దేహతెరల్ని చూస్తున్నావు/జారిపోతున్న నీ విలువల అంగీని/వెదుక్కోవడం లేదంటుంది/కొలబద్ద కాని కాలానికి/సూత్రబద్ధత లేని జీవితానికి/కసువుకీ, అసువుకీ వ్యత్యాసాన్ని చెబుతోంది బూబు ఒక సూఫీ/బూబు ఒక ఫోరాటం/బూబులంతా కట్టుబానిసలంటూ/కనికట్టు చేస్తున్న కచ్చా/ నాలుకలకు/బూబు ఒక సమాధానం/శిరమెత్తిన శౌర్యానికి/బూబు ఒక శిఖరాగ్ర శిరస్సు!”

ఏపి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సత్కారం

అబాబీలు

భాష లోని సంక్లిష్టతను దూరం చేస్తూ, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా, రచయితా తన భావాలను తేలిక పద్ధతిలో చెప్పేలా ‘అబాబీ’ అనే నూతన సాహిత్య రూపాన్ని ఆవిష్కరించారు కవి కరీముల్లా.

ఇస్లామియా చరిత్రలో ‘అబాబిల్’ అనే ఒక చిన్న పక్షికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సామూహిక తత్వం, ధైర్యం ప్రతీకగా తీసుకొని ‘అబాబి’ అనే ప్రక్రియా రూపాన్ని రూపొందించారు. పీడిత పక్షాలు, బలహీన వర్గాల భావాన్ని అతి చిన్న ఛందో లక్షణాలతో, ఐదు పంక్తుల్లో ఉంటుంది. మొదటి పంక్తిలో సమస్య, రెండో పంక్తిలో విషయ విశ్లేషణ, మూడవ పంక్తిలో సందేశం లేదా చమత్కారం ఉండాలి. నూతనంగా కలం పట్టిన వారు ఇవన్నీ పాటించకపోయినా, కనీసం ఐదు పంక్తులు అనే నియమాన్ని పాటించాలి.

ఒక ఉదా:

“కుర్తా పై అత్తరు వాసన

కుక్షిలో కాలిన కమురు వాసన

ఆకలిని మించిన దోస్తు లేదు

కరీము!

రాత్రెందుకో పగలబడినవ్వుతోంది”

కరీముల్లా రూపొందించిన ఈ అబాబీ కవితా ప్రక్రియను తెలుగు, కన్నడ భాషలలో ఇప్పటివరకు 70 మందికి పైగా అనుసరిస్తున్నారు.

కవిత్వానికి పరమార్థం సామాజిక ప్రయోజనమే అని మనసారా నమ్మి దాదాపు 35 పైగా సత్కారాలు సన్మానాలు పొంది శ్రీ నాగ భైరవ కోటేశ్వరరావు స్ఫూర్తి అవార్డు (నెల్లూరు), గుర్రం జాషువా కళాసాహితి అవార్డు (వినుకొండ), జాతీయ కళాలయ అవార్డు (పాలకొల్లు), బెస్ట్ పొయిట్ అవార్డు (వైజాగ్), అభినవ జాషువా అవార్డు (బొల్లాపల్లి), ఆదర్శ సాహిత్య రత్న అవార్డు (గుంటూరు), కవిసంధ్య పురస్కారం (యానాం), రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం వంటివి పొందిన కరీముల్లా ఆధునిక సాహిత్య తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు.

జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉగాది పురస్కారం 2023

ఎంత విస్తృతంగా సాహిత్యాన్ని రచిస్తున్నా, పాలకవర్గాలను పొగుడుతూ ఒక్క కవిత కూడా రాయక, పీడిత వర్గాల పక్షాన నిలబడి సమాజ హితం కోసం తన కవిత్వ రచనను కొనసాగిస్తున్నారు.

ఏప్రిల్ 30 న నవ్యాంధ్ర రచయితల వేదిక గుంటూరు లో కవి కరీముల్లా కి సన్మానం. శిష్యుడు నుండి ‘అబాబీలు’ కవిత్వం అందుకుంటున్న రచయిత్రి.

డిగ్రీలో నాకు స్టూడెంట్ అయినందువల్ల అధికంగా పొగడకుండా, ఆశీస్సులను అందజేస్తూ, ‘శాంతి తన విశ్వాసంగా, భారతీయత తన ఆత్మగా పరిపూర్ణంగా భావించే’ కవి కరీముల్లా సామాజిక హితం కోరుతూ మరింత బలంగా తన గళం వినిపించాలని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here