అడవి తల్లి ఒడిలో-6

0
5

[బాలబాలికల కోసం ‘అడవి తల్లి ఒడిలో’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]ఎం[/dropcap]డిపోయిన వాటిల్లో నుంచి చిన్న చిన్న మొలకలు వస్తూండడం పిల్లలు గమనించారు. అంకుల్ వారికి ఇలా వివరించాడు.

“చిల్డ్రన్, జంతువులు, ముఖ్యంగా హెర్బివోర్స్, తిన్న ఆహారం జీర్ణం అయిం తర్వాత పేడ వేసినప్పుడు అందులో కొన్ని విత్తనాలు కూడా వస్తాయి. పేడ ఎండిన తర్వాత అవి మొలకెత్తుతాయి. ఆ పేడలో చూడండి ఎన్ని రకాల పురుగులు ఉన్నాయో? అవన్నీ అక్కడ ఆహారాన్ని పొందుతున్నాయి. అలా జంతువులు, forest regeneration (అడవుల పునరుత్పత్తి)కి తోడ్పడుతున్నాయి.”

చెన్నా అన్నాడు “సారూ, నేను ఒక్క మాట అనొచ్చా?”

“చెప్పు చెన్నా, దాందేముంది?”

“పేడను బట్టి అది ఏ జంతువు వేసిందో అర్తమయితాది. అది పచ్చిగా ఉంటే ఆ జంతువు ఈ సుట్టు పక్కలే యాడో వుందని తెలుస్తాది. అది క్రూర జంతువా, సాధు జంతువా అనేది కూడా చెంచులు గ్రయిస్తారు. ఒకేల పులి దనుకోండి, అది పచ్చిగా ఉందనుకోండి, ఎంటనే తమ పసువులను మల్లంచుకొని యేరే సోటికి బోతారు, తొందరగా. ఈడ సూడండి. ఈ పేడ దుమ్మలగొండ (తోడేలు జాతి)ది. బాగా ఎండిపోయినాది అంటే రెండు మూడు రోజుల క్రిందట అది ఈడ, తిరుగులాడినాది అనమాట.”

“వెరీ గుడ్ చెన్నా, చాలా బాగా చెప్పావు. పిల్లలూ, విన్నారు కదా!”

లోపలికి వెళ్లే కొద్దీ వాళ్లు అంత వరకు చూడని మహావృక్షాలు కనబడసాగాయి. విభిన్నంగా కనిపించిన చెట్లను ఫోటోలు తీశాడు. ఇలా చెప్పాడు.

“మై చిల్డ్రన్, అడవుల్లో దాదాపు 60,000 రకాల వృక్ష జాతులు ఉంటాయి. అన్ని రకాల సైజుల్లో. వాటిని ముడు రకాలు చేశారు. మెజెస్టిక్ సెడార్స్ (majestic cedars), fruit trees, (పళ్లు ఇచ్చే చెట్లు), గుబురు పొదలు (shrubs). వాటి ఆకులు, బెరడును బట్టి వాటిని నిర్ణయించవచ్చు. మళ్లీ వాటిలో రెండు రకాలున్నాయి. డెసిడ్యుయస్, ఎవర్‌గ్రీన్ అని.

మొదటి రకంవి, సంవత్సరంలోని ఒక ప్రత్యేక ఋతువు (శిశిరం)లో ఆకులు రాలుస్తాయి. రెండవ రకంవి సంవత్సరం పొడుగునా పచ్చని ఆకులను కలిగి ఉంటాయి. ఆకులను రాల్చవు. డెసిడ్యుయస్ చెట్లకు ఉదాహరణ వాల్నట్, ఓక్, బిర్చ్ లాంటవి. వాటి ఆకులు రాలే ముందు ఆరెంజ్, బ్రౌన్, ఎల్లో కలర్స్ లోకి మారతాయి.

చెట్ల ఆకులు రకరకాల షేపుల్లో ఉంటాయి. వాటిని బ్రాడ్ లీఫ్, నీడిల్స్, స్కేల్స్ గా వర్గీకరించారు.

పిల్లలూ, ఇప్పుడు మనం కొన్ని చెట్లను గుర్తించగలమో లేదో చూద్దాం పదండి. ఇదిగో ఈ చెట్టు చూడండి. ఇది టేకు చెట్టు. దాదాపు నలభై మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు చాలా పెద్దవి. దీని కలపను సంగీత వాయిద్యాలు, మేలైన ఫర్నిచర్, పడవులు చేయడానికి ఉపయోగిస్తారు. ప్లీజ్ నోట్.”

“అంకుల్, ఈ చెట్టు చూడండి ఎంత విశాలంగా పరుచుకొని ఉందో?” అన్నది నిఖిల.

“దాన్ని ‘దేవదారు చెట్టు’ అంటారు తల్లీ” అన్నాడు చెన్నా.

“అవును. అది సెడ్రస్ జాతికి చెందింది. దాని కలప కూడా చాలా బలమైంది.”

ఖలీల్ అన్నాడు “ఇవేంటి అంకుల్, గొడుగుల్లాగా ఉన్నాయి? ”

“ఇవి ఎల్మ్ చెట్లు నాన్నా! వీధి చెట్లు అంటారు వీటిని. చక్కని నీడను ఇస్తాయి. వీటిని రహదారులకు ఇరువైపుల పెంచుతారు.”

ఒక చోట పెద్ద వృక్షం చూశారు. దాని కింద బోలెడు కాయలు రాలి ఉన్నాయి.

“ఇవి భోగి రోజు చిన్న పిల్లల నెత్తి మీద పోస్తారు. అంకుల్, నాకు తెలుసు” అన్నాడు నచికేత.

“అవును. దీన్ని రేగు చెట్టు (plum tree) అంటారు.”

“ఈ పళ్లు మేం కొన్ని తిన వచ్చా?”

“లక్షణంగా తినండి.”

ఒక చోట గుమ్మటంలా ఎదిగిన చెట్టు కనబడింది. చెన్నా చెప్పాడు “పిల్లోండ్లూ! దీన్ని దిరిసెన చెట్టు అంటారు. దీని పూలు చూడండి ఎంత మొత్తగా ఉన్నాయో?”

సార్ అన్నాడు “దీనినే సంస్కృతంలో ‘శిరీషం’ అంటారు. దీని పేరును చాలా మంది ఆడపిల్లలకు పెడతారు. కవులు తమ వర్ణనలలో సుకుమారంగా ఉండే కథానాయకులను ‘శిరీషకుసుమపేశల’ అని వ్రాస్తారు. ”

“మా క్లాసులో ఇద్దరు ‘శిరీషలు’ ఉన్నారంకుల్!” అన్నది నిఖిల.

“ఇది గుల్ మొహర్ చెట్టు. ఇది చూశారా జీడిమామిడి చెట్టు. ఇవి ఉత్తరాంధ్రలో విరివిగా పెరుగుతాయి. మనం తినే జీడిపప్పు వీటి నుండే వస్తుంది. కాని దానికి చాలా process ఉంది.”

“అంకుల్ ఇది చూడండి. అరటి చెట్టులా ఉంది. బాబోయ్! ఇంత పెద్ద అరటి చెట్టును ఎన్నడూ చూడలేదు” అన్నాడు ఖలీల్.

“దాన్ని కొండరటి చెట్టు అంటారు పిల్లలూ. దాని పండ్లు శానా పెద్దగా, ఎర్రగా ఉంటాయి.” అన్నాడు చెన్నా.

ఒక చోట ఇంకో మహావృక్షం కనబడింది. “పిల్లలూ! ఈ చెట్టేమిటో తెలుసా?” అడిగాడు శాంతిస్వరూప్.

తెలియదన్నారు.

“ఇది మహాగని చెట్టు. ఇది స్వీటీనియా జాతికి చెందిన రెడ్ వుడ్ చెట్టు. దాని కలప చాలా మంచిది. ద్వారబంధాలు, కిటికీలు, సోఫాలు తయారు చేస్తారు దానితో.”

ఒక చోట పెద్ద తాటి తోపు కనిపించింది. చాలా ఎత్తుగా ఉన్నాయి తాటి చెట్లు. పైన గుత్తులు గుత్తులుగా తాటి పండ్లు వేలాడుతున్నాయి. వాటిని చూసి నిఖిల అరచింది.

“అంకుల్! కమలానగర్ బస్టాపు దగ్గర ఒకాయన వాటిని గుట్టగా పొసుకొని, కత్తితో జాగ్రత్తగా వాటిని తీసి, ముంజెలు అమ్ముతుంటాడు. అవంటే నా కిష్టం!”

తర్వాత పిల్లలు మామిడి, వేప, చెట్లను గుర్తు పట్టారు. ఊర్లో పెరిగే వాటి కంటే రెండింతలు పెద్దగా ఉన్నాయి. నిమ్మ, కొబ్బరి చెట్లను గుర్తించారు.

ఒక చోట పనస చెట్టును (jack tree) ని చూపాడు శాంతిస్వరూప్. “మీరు ఎప్పుడైనా పనస తొనలు తిన్నారా?” అనడిగాడు. “ఈ కాయలు చూడండి, ఎంత పెద్దవో. ఈ కాయలు పచ్చిగా ఉన్నపుడు పై చెక్కు తీసి, సన్నగా క్యాబేజిలా తరిగి కూర చేస్తారు కోస్తా జిల్లాల్లో. పనసపొట్టు కూర అంటారు దాన్ని. చాలా రుచిగా ఉంటుంది.”

“ఒకసారి మన చింతల్‌కుంట లోని ‘కాకినాడ సుబ్బయ్యగారి హోటల్’కు మా నాన్నగారు తీసుకు వెళ్లారంకుల్. అక్కడ కూర చాలా స్పెషలని, తినమని, చాలా బాగుంటుందని, వడ్డించే అంకుల్ చెప్పారు” అన్నాడు నచికేత.

“తిన్నావా మరి, నచ్చిందా?” అనడిగింది నిఖిల.

“ఏమో మరి? బోలెడు రకాలు అరిటాకు నిండా వడ్డిస్తూనే ఉన్నారు ఆ హోటల్లో. ఏ కూర ఎలా వుందో మర్చిపోయా.”

అందరూ నవ్వారు ఆ అబ్బాయి మాటలకు.

ఒక చోట గంధం చెట్లు కనబడ్డాయి. వాటి బెరడు కూడ సువాసన వస్తూంది.

ఖలీల్ అన్నాడు “పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఈ చెట్లనే స్మగ్లింగ్ చేశాడు అంకుల్, తగ్గేదేలే!”

మళ్లీ నవ్వులు!

“అలాంటి పనులు చేసే వాడిని హీరో అనాలా, విలన్ అనాలా చెప్పండి పిల్లలూ?” అనడిగాడు శాంతిస్వరూప్.

పిల్లలు జవాబు చెప్పలేదు! కారణం అల్లు అర్జున్ అంటే వారికి చాలా ఇష్టం!

చెన్నా అన్నాడు “కచ్చితంగా అలాంటి దొంగ నా కొడుకులను ఇలన్లనే అనాల సారు. నిజమైన ఈరో అంటే సిరంజీవే!”

శాంతిస్వరూప్ నవ్వాడతని మాటలకు.

మధ్యాహ్నమయింది. పిల్లలకు ఆకలి కరకరలాడసాగింది. “లెటజ్ హావ్ ది లంచ్, మై చిల్డ్రన్” అన్నాడు శాంతిస్వరూప్.

చెన్నా ఒక వేప చెట్టు కింద ఆకులు, పుల్లలు అన్నీ తీసేసి కొంత మేర శుభ్రం చేశాడు. వెజిటెబుల్ బీర్యానీ ఉన్న హాట్ కేస్, రైతా ఉన్న క్యాన్ వాళ్లతో పాటే తెచ్చాకున్నారు.

“అయ్యో! మనం తినడానికి ప్లేట్లు లేవే?” అన్నది నిఖిల.

“అడవిలో పిలేట్ల కేం కొదవ చినతల్లీ! ఉండండి. ఇప్పుడే వస్తా” అని ఎక్కడికో వెళ్లాడు. అతని చేతుల్లో వెడల్పుగా ఉన్న మర్రి ఆకులతో తిరిగి వచ్చాడు. ఒక మొక్క కొమ్మను విరిచి దాని నుండి పొడవైన నారను తీసాడు. ఏడెనిమిది మర్రి ఆకులను కలిపి, ఆ నారను చిన్న చిన్న తుంటలుగా చేసి, పదే పది నిమిషాల్లో ఐదు విస్తళ్లు తయారు చేశాడు చెన్నా! అవి ఆకు పచ్చగా, అందంగా ఉన్నాయి.

ఆ విస్తర్లలోనే బిర్యానీ వడ్డించుకున్నారు. వడ్డనకు వెడల్పుగా ఉన్న ఒక ఎండిన చెక్కను ఉపయోగించాడు చెన్నా. బిర్యాని వేడిగా ఉంది. రైతాతో, దాన్ని, పచ్చని ఆకుల్లో, వేప చెట్టు క్రింద తింటూంటే, దాని రూచి నాలుగు రెట్లు పెరిగినట్లు అనిపించింది పిల్లలకు. అదే అంకుల్ తో అంటే –

“అవును., కార్తీక మాసంలో వన భోజనాలకు వెళతాం కదా! అప్పుడు కూడా, మనం తినే ఫుడ్ ఇంటిలో కంటే టేస్టీగా ఉంటుంది. మనం ఈ రోజు నిజమైన అడవిలో భోం చేస్తున్నాము. ఇటీజ్ రియల్లీ ఎ మోమెరబుల్ ఎక్స్‌పీరియన్స్” అన్నాడు ఆయన. పిల్లలు భోం చేస్తూండగా ఫోటోలు తీశాడు.

అక్కడకు దగ్గరలో ఉన్న కొండ రాళ్ల మధ్య సన్నగా జల ధార పారుతూంది. అందులో చేతులు కడుక్కొని, నీరు తాగారు. పావు గంటసేపు విశ్రాంతిగా కూర్చున్నారు. అప్పుడు టయం రెండయింది. చెన్నా అన్నాడు.

“సారూ, పోదాం పాండి. ‘తుమ్మల బయలు’ ఈడ నుంచి నాలుగు మైల్లుంటాది. మనం జీపు కాడికి బోయి బయలుకు చేరుకునే తాలికి మూడు దాటతుంది. ఆడ తొందరగా ఎలుగు తగ్గిపోతాది.”

అందరూ బయలుదేరారు. ‘తుమ్మల బయలు’ అనే ఊరు ప్రకాశం జిల్లాలోని దోర్ణాల మండలంలో ఉంటుందని చెప్పాడు చెన్నా. కర్నూలు – ప్రకాశం జిల్లా సరిహద్దు అది. దోర్ణాల అక్కడకి 22 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఆ పేర ఒక చిన్న ఊరు కూడా ఉంది. కాని వీళ్లు వెళుతున్నది అక్కడికి కాదు. దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన తుమ్మ చెట్ల సమూహం అది. ఒక జాతి వృక్షాలు ఒకే ప్రాంతంలో ఏర్పడటం అక్కడి విశేషం.

దాదాపు యాభై నిమిషాలు పట్టింది అక్కడకు చేరుకోవటానికి. జీపు ఒక చోట ఆపి, పదిహేను నిమిషాలు నడిచారు. ‘కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి’ అనే దానికి సరిగ్గా సరిపోతుంది. ‘బయలు’ అంటే open place అని అర్థమని శాంతిస్వరూప్ వారికి చెప్పాడు.

తుమ్మ చెట్లు దట్టంగా అల్లుకొని ఉన్నాయి. అవి బలమైన, దగ్గర దగ్గరగా ఉన్న ముళ్లతో కూడుకొని ఉన్నాయి. అంకుల్ ఇలా చెప్పారు “పిల్లలూ, నోట్ బుక్స్ తీయండి. తుమ్మ చెట్టు ఫాబెసి (Fabaceae) కుటుంబంలోని అకేసియా (Acacia) జాతికి చెందినది. కొమ్మల నిండా ముళ్లే. బెరడు నల్లగా, పసుపు రంగులోని పువ్వులతో ఉంటాయి ఈ చెట్లు.

వాటిలో నల్లతుమ్మ, తెల్ల తుమ్మ, నాగ తుమ్మ, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఈ బయలులో అవన్నీ ఉన్నాయి. ఇవి మన దేశంలో విరివిగా పెరిగే చెట్లు.”

“ఈ చెట్టు వల్ల మనకు ఉపయోగం ఏమటి అంకుల్?”

“దీని ఆకులు, బెరడులో ఔషధ గుణాలున్నాయి. దీని ఆకులను జీరకర్ర, వాము కలిపి కాచిన కషాయం తాగితే విరోచనాలు తగ్గిపోతాయి.”

చెన్నా అన్నాడు “దీని బెరడును రోజూ నములుతే పళ్లనుండి రక్తం కారడం, చిగుళ్లవాపు, పంటి నొప్పులు తగ్గిపోతాయి సార్. ఈ బెరడును దంచి, కొంచెం సైంధవలవణం కలిపి కషాయం చేసుకొని తాగితే గవదవాపు (tonsils) తగ్గుతుంది.”

“అవును. ఈ చెట్టు నుంచి వచ్చినంత జిగురు ఏ చెట్టు నుంచి రాదు. దానిలో కొన్ని కెమికల్స్ కలిపి క్విక్‍ఫిక్స్, ఫెవికాల్ వంటి Adhesives ను తయారు చేస్తారు. దీని ఎండిన కొమ్మలను పొలాలకు కంచెగా నాటుకుంటారు. ముళ్ల వల్ల పశువులు వచ్చి, పంటలను తినేయకుండా.”

బయలులో పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. “పుట్టల్లో పాములుంటాయా అంకుల్?” అనడిగాడు నచికేత.

“తప్పకుండా ఉంటాయి. దీన్ని సంస్కృతంలో తీక్ష్ణకంటకమని, దృఢబీజమని  అంటారు.”

“కొంచెం లోపలికి వెళ్లి చూద్దామా?”

“వద్ద” అన్నాడు చెన్నా. “ముళ్లు కుచ్చుకుంటాయి. మనం నడిచేంత సందు కూడా లేదు. పైగా పాములు తిరుగుతుంటా. తుమ్మ మాన్లు వేడిని ఎక్కువ వదుల్తాయి. లోపలున్న బయలంతా ఉంబరంగా (ఉక్క) ఉంటుంది. కావాలంటే చుట్టూ తిరిగి చూద్దాము.”

చుట్టూ తిరిగారు. పిల్లలు బయట పక్కకు వాలిన కొమ్మలకున్న జిగురు ఉండలను సేకరించుకొని ఒక కవర్లో వేసుకున్నారు. ‘తుమ్మల బయలు’ ని రకరకాల యాంగిల్స్‌లో ఫోటోలు తీశాడు శాంతిస్వరూప్. ఇలా చెప్పాడు.

“అడవిలో పనికిరాని చెట్టు అనేది ఉండదు పిల్లలూ! చెట్లే కాదు మొక్కలు, పొదలు అన్నీ ఉపయోగపడేవే. అందుకే అడవులు బాగా అభివృద్ధి చెందాలి అనేది. అటవీ శాఖలోని అత్యున్నత అధికారిని ‘చీఫ్ కన్సర్పేటర్ ఆఫ్ ఫారెస్ట్స్’ అంటారు. అంటే ప్రధాన రక్షకుడన్నమాట. ఇక బయలుదేరదాం. బయలుదేరే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. అడవిని ‘DYNAMIC LIVING ENTITY’ అని ఎందుకంటారో మీకు అర్థమైంది కదా. అది ఒక ‘నిత్య చైతన్యం గల సజీవమైన ఒక అద్భుత అస్తిత్వం’. దానిలో హెర్బివోర్స్‌కి ఎంతో ఆహారం దొరుకుతుంది. హెర్బివోర్స్, కార్నివోర్స్‌కు ఆహారం. వివిధ జంతువులు అడవిని regenerate చేసి, growth కు కారణం అవుతాయి. డీకంపోజర్స్, చెట్లకు న్యూట్రియంట్స్‌ని అందిస్తాయి. అడవిని నిండా జీవం తొణికిసలాడుతూ ఉంటుంది.”

పిల్లలు శ్రద్ధగా విన్నారాయన మాటలను. “నిజమే అంకుల్” అన్నారు మనస్ఫూర్తిగా.

తిరుగు ముఖం పట్టారు. వేరే రూట్‌లో నడుస్తున్నారు. ఇంతలో వర్షం! అడవిలో వర్షం ఎంత మనోహరంగా ఉంటుందో తెలిసింది వారికి. వర్షపు చినుకులు డైరెక్ట్‌గా నేల మీద పడుటం లేదు. Forest canopy వాటిని ఆపుతుంది. వర్షపు నీరంతా కొమ్మలు, కాండాల వెంట క్రిందికి జారుతూ ఉంది. ఆకుల నుండి క్రింద గుబురు పొదల్లోకి పడుతూంది. వర్షం అరగంట పాటు కురిసింది. నేల, ఎండుటాకులు తడిశాయి. ఎక్కడా వర్షపు నీరు నిలువలేదు.

“అదే టౌన్స్, సిటీస్‍లో ఐతే డ్రయిన్స్/రోడ్స్ గూండా పారి వరదగా మారుతుంది. ఎక్కడకక్కడ ట్రాఫిక్ నిల్చిపోతుంది” అన్నాడు శాంతిస్వరూప్. ఇంకా చెప్పసాగాడు –

“పిల్లలూ! ఆడవి ఒక natural absorber. అంటే సహజంగా వర్షపు నీటిని ఇంకించుకుంటుంది. వరదలు రాకుండా ఆపుతుంది. అడవులే లేకపోతే వర్షపు నీరు డైరెక్ట్‌గా నేలను తాకి, వరదలు ముంచెత్తుతాయి. చెట్ల వేర్లు భూమిని గట్టిగా పట్టుకొని నీటిని పారిపోనివ్వవు. అంతే కాదు. భూగర్భజలాలు క్రిందికి వెళ్లిపోకుండా అడవులు చేస్తాయి.

కాని మానవుడి అత్యాశ వల్ల, స్వార్థం వల్ల, అడవి మీద ఒత్తిడి పెరుగుతూంది. క్రమంగా అడవులు తగ్గిపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవులను విచక్షణ లేకుండా నరికి వేయడం వలన గ్లోబల్ వార్మింగ్, అకాల వర్షాలు, తుపాన్లు, ఋతువులు upset కావడం లాంటి అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్పు వస్తోంది. అవగాహన పెరుగుతూంది. రియలైజ్ అవుతున్నారు. గ్రీన్ ఛాలెంజ్ లాంటి ఉద్యమాలకు స్పందిస్తున్నారు. లెటజ్ హోప్ దట్ ఫారెస్ట్స్ ఆర్ కన్‌సర్వ్‌డ్, గ్రోన్ అండ్ వర్షిప్‌డ్.”

పిల్లలు ముఖాల్లో ఒక వెలుగు!

జీప్ దగ్గరికి వెళ్లే సరికి పూర్తిగా తడిసిపోయారు అందరూ. అయినా అడవిలో వర్షంలో తడవడాన్ని పిల్లలు ఎంజాయ్ చేశారు బాగా.

వారు గెస్ట్ హౌస్ చేరుకునే సరికి ఆరున్నర అయింది. వేడి వేడి గుంట పొంగడాలు ఈవెనింగ్ స్నాక్స్‌గా పంపించారు. డి.ఎఫ్.వో గారు రాత్రి డిన్నర్‌కు ఆయన కూడ వారితో కలిశారు.

మర్నాడుదయమే వారి తిరుగు ప్రయాణం. డి.ఎఫ్.వో, ఆయన స్టాఫ్ శాంతిస్వరూప్ గారికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించుకున్నారు. పిల్లలకు వెదురుతో చేసిన, లతలు, పువ్వలు పెయింట్ చేసిన మగ్స్ బహుమతిగా ఇచ్చారు. చెన్నా ఉద్వేగంతో వారికి వీడ్కోలు చెప్పాడు.

పిల్లల మనస్సులు దూదిపింజెల్లాగా తేలిగ్గా ఉన్నాయి. అంకుల్ శాంతిస్వరూప్ వైపు అపురూపంగా చూసుకుంటున్నారు. నిఖిల, డ్రైవ్ చేస్తున్న ఆయన చెంప మీద ముద్దు పెట్టింది.

“థాంక్యూ, బంగారు తల్లీ!” అన్నాడాయన ఆనందంగా.

వారు హైదరాబాద్ చేరుకునే సరికి నాలుగయింది. నందికొట్కూరులోని ఒక పాక హోటల్లో కర్నూలు జిల్లా స్పెషల్ ఐన ఉగ్గాని, బజ్జీ తిన్నారు బ్రేక్‌ఫాస్ట్‌గా. జడ్చర్ల లోని ఒక ధాబాలో భోజనం చేశారు.

పిల్లలను వారి యిళ్ల వద్ద దింపాడు శాంతిస్వరూప్. పేరెంట్స్ ఆయనకు తమ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలను అక్కున చేర్చుకున్నారు. అడవి అక్కున ఉన్నపుడు కూడా వారికి అంతే హాయిగా ఉండింది. ఎందుకంటే అడవి అంటే ప్రకృతి. ప్రకృతి మనిషికి అమ్మ కదా!

వెళ్లే ముందు శాంతిస్వరూప్ పిల్లలతో ఇలా చెప్పాడు. “మై డియర్ చిల్డ్రన్, మీరు అడవిలో నోట్ చేసుకున్న దాన్ని వివరంగా రాయండి. నేను అవసరమైన కరెక్షన్ చేసిస్తాను. దాన్ని డి.టి.పి చేయించి, స్పైరల్ బైండింగ్ చేయిద్దాము. ఒక కాపీ మీ స్కూలు హెడ్ మిస్ట్రెస్ గారికి, ఒక కాపీ మన ఆటవీ శాఖ మంత్రి గారికీ, మరో కాఫీ ప్రెస్ వారికీ ఇద్దాము. ఒక పది కాపీలు జిరాక్స్ తీయిద్దాం. అది చదివిన వారికి అడవులకు వెళ్లాలని, వాటిని పరిశీలించాలని అనిపించాలి. అడవులను కాపాడాలని, పెంచి పోషించాలని ఆలోచన కలగాలి. అప్పుడే మన ‘ఫారెస్ట్ ట్రిప్’ కు సార్థకత. బై చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు. లెటజ్ మీట్ ఇన్ అవర్ పార్క్ దిస్ సండే.”

పిల్లలు ముగ్గురూ ఆయనను మూడు వైపులా కౌగిలించుకున్నారు ప్రేమగా!

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here