[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]
~
రెండడుగులు
[dropcap]బా[/dropcap]గా వేడిగా ఉన్నప్పుడే బాదేవాడు, సరిగ్గా వేడి తగిలిందా లేదా అని చూసి బాదేవాడు. మంచి కమ్మరి ఇతను.
మట్టి ముద్దను బాగా కలిపి, మృదువుగా చేసి, నాది, ఒత్తి, తిప్పి తిప్పి కుండలు చేశాడు. మంచి కుమ్మరి ఇతను.
ఎక్కడ ఎక్కువ చెట్లున్నాయో అక్కడి కాండాలని కత్తిరించి, తోమి, చెక్కి మెరిసే మూర్తిని చేశాడు. ఇతడు మంచి వడ్రంగి.
ఆకారానికి తగినంత, ఎంత కావాలో అంత గుడ్డను కత్తిరించి, కుట్టాడు. మంచి దర్జీ ఇతడు.
ఎక్కడైనా సరే చెత్త కనిపిస్తే, తీసి పారేసేవాడు. వంటిల్లూ, శౌచాలయం రెంటినీ ఒకే రకంగా చూడాలి అనేవాడు. మంచి తోటి పనివాడితడు.
మహాత్ముడు అవునో కాదో, తెలియదు. నాకు తోచిన విధంగా అయితే ఇవన్నీ మోక-భాయి-బాపు ప్రత్యేక గుణాలు. కానీ ఒక విషయం చెప్పాలి. బాపు పూర్తిగా మహాత్ముడయ్యే దారిలో కొన్ని అడుగులు వెనకబడ్డారు. వాటిని ఆయన విరోధులు గుర్తించారు. బాపుకు కూడా తెలుసు.
బాపు యొక్క ’మహాత్మ’ తనం, సాధుత్వం ఆయన వెంట ఉన్నవారికి చాలా ఇబ్బంది కలిగించింది. బాపుతో నాకున్నపెద్ద కష్టమేమిటో తెలుసా? నువ్వు అనుకున్నట్టు నగలు, ధనం, పిల్లల సంరక్షణ, దైహిక సంబంధం లేనే లేకుండడం ఇలాంటివి కావు. మనదే అయిన ఒక వ్యక్తిగత నిమిషం, వ్యక్తిగత విషయం, వ్యక్తిగత వస్తువు లేకుండడం. నాకు చాలా ఇబ్బందనిపించేది. ఆయన మహాత్ముడు, అన్నిటినీ అందరితోనూ చర్చించేవాడు, కాని ఆయనతో చెప్పడానికి నాదే ఒక స్వంత విషయముండేది, ఆలోచన ఉండేది. కానీ దాన్ని చెప్పడానికి అలాంటి ఒక క్షణం కోసం నేను సంవత్సరాల కొలది కాచుకున్నాను. ఆయన ఉన్న చోటికి నేను వెళ్తే అక్కడ ఎవరో ఇతరులు ఉండేవారు. ఎవరూ బయటవారు లేకున్నా, అక్కడే ఉన్నవారిని పిలిచి కూర్చోబెట్టుకునేవారు. బ్రహ్మచారి ఏ ఆడదానితోనైనా ఒంటరిగా ఉండరాదు కదా! కొన్నిసార్లు కన్నీళ్ల పర్యంతమయ్యేదాన్ని. ఒక మాట చెప్పడానికి ఒక సంవత్సరం వేచాను అంటే నమ్మాలి. చెప్పలేనివి మరెన్నో ఉన్నాయి. అలా చెప్పలేకుండా మిగిలిపొయిన మాటలు మనసులోని దుఃఖాన్ని రెట్టింపు చేశాయి అని మళ్ళీ చెప్పాలా? అందుకే నీతో అన్నివిషయాలనూ ఇలా మూటగట్టి విప్పిచెపుతూ ఉన్నానమ్మాయ్!
అందరికంటే బాపును పోగొట్టుకున్నవారు ఆయన పిల్లలు. తరువాత ఆయన భార్య. ఎక్కువ అక్కర్లేదు. ఆశ్రమంలోని ఇతర పిల్లల పట్ల ఎలా ఆసక్తి చూపేవారో అంత చూపించినా కానీ మా పిల్లలు ఎంతో ఆనందించేవారు. పిల్లల మాట ఆయనతో ప్రస్తావించగానే, వాళ్ళకు ఉత్తరం రాశాను/రాస్తాను అని మాట ముగించేవారు. ఉత్తరాలేమో రాశారు చాలా. నిజమే. కాని తండ్రీ పిల్లల నడుమ బాంధవ్యం ఉత్తరాలతో నిలుస్తుందా? హరి స్థితిని చూసినప్పుడల్లా నాకు ఇదే కళ్ళముందు వస్తుంది. మణి, రామదాస్ అయితే వాళ్ల తండ్రిని చూసినదానికంటే ఆయన ఉత్తరాలు చదివే పెద్దవాళ్లయ్యారు. ఉన్నంతలో దేవదాస్ మాత్రమే మాతో పాటు ఉంటూ పెరిగాడు.
ఆశ్రమంలో ఉన్నవారు కాకుండా ఇతర బాపు అనుయాయులు, కాంగ్రెస్ వాళ్లలో సిగరెట్ తాగేవాళ్ళు, మద్యం పుచ్చుకునేవాళ్ళు, బ్రహ్మచర్యం పాటించనివారు, అబద్ధపు దారి పట్టేవాళ్ళు ఇలా అన్నిరకాల వాళ్ళు ఉండేవారు. కాని వారందరినీ క్షమించినంత, ప్రేమించినంత బాపు తన కొడుకును క్షమించనూ లేదు, ప్రేమించనూ లేదు. ఇతరులకు పెట్టిన నీతినియమాల కొలత బద్ద కంటే ఇంకా ఎత్తు, ఇంకా వెడల్పు కొలబద్దను తమ కుటుంబ సభ్యులకు పెట్టేశారు. మేమంతా ప్రపంచం దృష్టిలో కుబ్జులమయ్యేలా, మా కళ్ళల్లోనే మేము మరుగుజ్జులమయ్యేలా చేశారు. ఒకటి లోపలికి రావాలంటే మరొకటి బయటకు వెళ్ళాలి అన్నది ప్రకృతి నియమమయితే అందరి బాపు అయ్యారేమో కాని, ఈయన తమ పిల్లలకు బాపు కాలేకపోయారు.
బాపు తన తప్పులను అందరి ఎదుట ఒప్పుకునేవారు. అది స్వాగతమే. కాని నాకనిపించేది ఏమిటంటే బాపు దౌర్బల్యం అంటే ‘నేను’. ఈ నేనును పూర్తిగా వదిలెయ్యలేక పోయారు. ఆయన అన్నిఉపవాసాలు, పనులు, రాతలు, ఉపన్యాసల మధ్య ‘నేను’ కేంద్రంలో ఉండేది. ఈ నేను ఎంత అతిరేకానికి వెళ్ళిందంటే తమ వీర్యం పతనమైతే, దేశమే నాశనమవుతుంది అని భావించేలా. తనే అందరి బాధను భరించాలి, తనే అందరి పనులు చేయాలి అని అనుకునేంతలా అయ్యింది. మొత్తం కాంగ్రెస్-భారత్ దేశం తమ భుజాల పైన నిలబడింది అనుకునేలా చేసింది. అంత బక్క ప్రాణానికి అంత పని చెయ్యడానికి శక్తినిచ్చింది కూడా ఈ నేను. కానీ వీటన్నిటి తోడుగా అది ఇచ్చిన దుఃఖం ఉందే, దాన్ని ఆపుకోవడానికి చాలా కష్టపడ్డారు.
తన మాట ఎవ్వరూ వినడంలేదు, తను చెప్పినట్లుగా నడవడం లేదు అన్నప్పుడు చాలా బాధపడేవారు. కోపం కాదది, దుఃఖం. నిజం. దుఃఖితులవడం ఆయన మూల స్వభావం. బాధలను అనుభవించడం, ఉపవాసం, బ్రహ్మచర్యం, పశ్చాత్తాపం ఇవన్నీ ఆయన మూలస్వభావం యొక్క బయటి స్వరూపాలు అంతే. నాలాంటి సాధారణ వ్యక్తికి దుఃఖానికి కారణం వ్యక్తిగత సమస్య కావచ్చు, స్వార్థపు సమస్య కావచ్చు. మా ఇల్లు, పిల్లలు, ఆస్తి, ఆరోగ్యం, బంధువుల చుట్టూ ఉండవచ్చు. కానీ బాపుకు అలా కాదు. ఆయన దుఃఖానికి కారణాలు వేరు. దుఃఖమనే బావిలో ఎలా పడేవారు అంటే అక్కడినుండి పైకి రావడానికి అపారమైన ఓపిక, కఠోరమైన సంయమనం, ఉపవాసం వీటన్నిటినీ ఒక్కొక్క మెట్టుగా పెట్టుకునేవారు. ఆయన విశేష స్వభావమే అని పిలవవచ్చు మీరు, నేనైతే ఇలాంటి ఇంకో మహాత్ముడనిపించే వ్యక్తిని చూడలేదు. కొందరు సాధు సన్యాసులు ‘నేను’ వదిలిపెట్టి, దాంతో పాటు మిగిలన వాటన్నిటినీ వదిలేసి అంతర్ముఖులవుతారు. కానీ బాపు అంతర్ మరియు బహి ముఖాల నడుమ ‘నేను’ను నిరంతరం గిల్లుతూ వచ్చారు. నిరంతరం పెంచారు. అందుకే ఆయన స్వభావం ఇలాగ అని వేలెత్తి చూపేంతలోనే ఇలా కాదు అనేలా ఏదో చేసేసేవారు. ఈయన ఎలాంటి మనిషి అని తెలుసుకోవడం చాలా మందికి వీలవలేదు.
ఇలాగని ఆయనతో చెప్పాను కూడా. “తల్లీ! నీ కత్తికి ఎంత పదునుందంటే నేను భరించలేను. కొంచెం మెల్లిగా” అన్నారు.
సముద్రం వైపు
61 సంవత్సరాలు ఇంటా బయటా చూస్తూ గడిపాము కదా? మేమిద్దరం ఒకరిలో ఒకరు చేరిపోయాము. మేము సాధారణ దంపతుల మాదిరిగా ఉండలేదు. బాపు ఎక్కడ ఉండేవారో నేను అక్కడే. ఆయన మాటలనే వింటూ, చూస్తూ కూచునుండేదాన్ని. ప్రార్థన సమయంలోనూ అంతే. నేను మాట్లాడింది తక్కువే. బాపుయే మాట్లాడేవారు. వింటూ ఉండేదాన్ని. బాపు గురువు, నేను శిష్యురాల్ని. ఒక రకంగా రోజులు గడిచినట్లల్లా మాది గురు-శిష్యుల సంబంధమయ్యింది. ధర్మం ప్రకారం భార్యాభర్తలం. కాబట్టి కొంత ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ, నిరంతర సంపర్కం ఉండేది అంతే. మా మధ్యన ఉన్న సంబంధం ఎలా, ఎంత అని కొలవడానికి చూడరాదు. అది కష్టం. బాపుతో నాకున్న సంబంధాన్నికొలవడానికి మొదలుపెడితే కొలబద్ద చాలదు. ఎందుకంటే మా కొలతలే వేరు. ప్రమాణాలే వేరు.
మోక ఒక్కొక్క అడుగే వేస్తూ భాయి, బాపు, మహాత్ముడవుతూ పైకెక్కారు. నేను దశలవారీగా దైనందిన ఆశలను, ఆకాంక్షలను అణచుకుంటూ మౌనినవుతూ ఆయన వెనుక నడిచాను. మా ఇద్దరి నడుమ అతి గౌరవనీయమైన సంబంధం ఉండింది. కానీ స్నేహం ఉండలేదు. చివరికి ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారంటే నా కొలతకు అందనంత. నా పోట్లాట అంతా ఆయన నీడతోనే అన్నట్టు. మా సంబంధం మౌనంలో ఇమిడిపోయింది. పత్నిగా ఒక్కొక్క బాధ్యత తగ్గుతూ వచ్చినట్టల్లా పేరుకు మాత్రమే పత్నిగా ఉన్నాననిపించింది. బా కు బాపు తప్ప మరో ప్రపంచమేలేదు. బాపు లేకుండా తెల్లవారేదే కాదు. కానీ బాపుకు అలా కాదు. ఆయన ఉన్న చోటే ఆయన జగత్తు ఉదయించేది.
బాపు అపరిగ్రహం అంటూ ఒక్కొక్కటినే వదులుతూ పోయారు. నేను కొన్నిటిని వదిలాను. మరి కొన్నిటిని నాతోనే ఉంచుకున్నాను. దేన్నీ బాపులా పూర్తిగా వదలలేక పోయాను. ఆయనంత ఉపవాసాలు చెయ్యలేదు. ఆయనంత దేశవిదేశాలు తిరుగలేదు. ఆయనంత ఆహర ప్రయోగాలు చెయ్యలేదు. ఆయనంత మాట్లాడలేదు. ఆయనంత మోహాన్ని వదిలించుకోలేదు. రుచి వదిలించుకోను చేతకాలేదు. ఆశలనుండి బయటపడలేదు. ఆయన వంద అడుగులు వడివడిగా వేస్తే, నేను ఒక్క అడుగు కూడా సందేహిస్తూ పెట్టాను.
బాపు దేశం కోసం అన్నిటినీ త్యజించారు. నేను బాపునే ఇచ్చాను. అందుకే బాపు బాపునే, బా బానే. కదూ?
అలా ఇలా ఒక ప్రవాహానికి 75 సంవత్సరాలు గడిచాయి. నీళ్ళు ప్రవహించి ప్రవహించి, చివరికి సముద్రం వైపు చివరి ప్రయాణం ప్రారంభించింది. దార్లో దాటిన మిట్టపల్లాలెన్నో, దూకిన అగాధాలెన్నో? ప్రవాహం ఎండిపోయింది, పొంగి విస్తరించింది. చివరికి చేరాల్సిన గురి మాత్రం నిశ్చితమే కదా! ఆ వైపే ప్రవహించింది.
చివరి ప్రవాహ కాలం ఉంది కదా, అది ఆనందాయకమైనది. ఎందుకో తెలుసా? అప్పుడు నా ఇష్టులంతా నా వద్ధనే ఉన్నారు. పుణెలోని ఆగాఖాన్ జైలు. బాపు అక్కడే ఉన్నారు. సుశీల అయితే నా కాళ్ల వైపు కూర్చుని గడియ, గడియకూ నేను ఏం అడుగుతాను, ఎలా శ్వాసిస్తాను అని రాసి పెట్టేది. దేవదాసు ఉన్నాడు. మీరా వచ్చింది. చిన్ని కను వచ్చి చూసి వెళ్ళాడు. మిగిలిన పిల్లలు, మనమలు, బంధువులు అందరు వచ్చి వచ్చి చూశారు. అప్పుడు చలికాలం చివరిదశలో ఉంది. 1944 సంవత్సరం ఫిబ్రవరి నెల. కొన్నిరోజుల నుండి బాపును నాతో పాటే ఉంచారు. పడుకుని పడుకుని వీపు కందిపోయింది. ఒళ్ళంతా పుళ్ళు పడినంత నొప్పి. బాపు నా తలను తమ ఒంటిపైనో, చాతీ పైనో వాల్చుకుని కూర్చునేవారు. నుదురు పట్టడం, వీపు నిమరడం, మెడకు నూనె రాయడం, అరికాళ్ళు రుద్దడం, ఒక్కొక్క బొట్టే వేణ్ణీళ్ళు పొయ్యడం, నచ్చిన మాటలు చెప్పడం, తమకు వచ్చిన కొన్ని భజనలు పాడడం, కను యొక్క గుజరాతి పుస్తకం నుండి ఒకట్రెండు పద్యాలను చదవడం.. కళ్ళు తెరవగలిగుంటే పాఠాలు కూడా నేర్పేవారేమో! ఇలా ఏదో ఒకటి చేస్తూ జతగానే ఉండేవారు. పగటి పూట నిద్ర పట్టేది కాదు, రాత్రి కూడా లేదు. అది ఒక రకమైన జాగృత-స్వప్నసుషుప్తి, ఏదీ కాని గడచిపోయే సమయం..
ఊపిరే అందక నీలవర్ణానికి తిరుతుంటే నిద్ర ఎక్కడిది? దేవదాసు చాల ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఏవేవో చర్చలు జరిగేవి. సుశీల, దేవదాసు నాకు ఇవ్వాల్సిన మందుల గురించి చాల చర్చించారు. ఎక్కడెక్కడినుండో తెప్పిద్దాం అన్నారు. బాపును అడిగారు. ఎప్పుటిలాగే ఆయనది చల్లని మౌనం. బహుశా బాపు ఊరకుండిపోయారు. అదేదో మందు వచ్చింది. దాన్ని గుచ్చి ఇవ్వాలట. దేవదాసు ఇవ్వాలన్నాడు. బాపు వద్దన్నారు. నాకు ఊపిరాడనందుకో లేదా మగతకని ఏదైనా ఇచ్చారో తెలీదు. బాపు “ఇంజెక్షన్ ఇప్పిద్దామా?” అని అడిగినట్టు గుర్తు. కళ్ళు తెరవడానికి కూడా కావడం లేదు. బాపునే వద్దన్నారు. ఆ ఇంజెక్షన్ నొప్పి తట్టుకోగల శక్తికానీ, కండరాలు కానీ తనలో ఇప్పుడు లేవు బాబూ అన్నారు. దేవదాసుకు ఏమనిపించిందో ఏమో? అతడేమో గుసగుసగా అన్నట్టు చప్పుడు, వెక్కిన శబ్దం. అది వాడి చెయ్యే అయ్యుండాలి. నా నుదుటు పైన తారాడుతోంది. బిడ్డను తల్లి నిమిరినట్టు అనిపించే చేతి స్పర్శ..
నన్ను బాపు తన పైన వాల్చుకుని చెపుతూ ఉన్నారు. అది 22వ తేదీ అని. కస్తూర్ అని పిలిచారు. కనురెప్పల పైన మణుగు బరువు. తీయాలన్నా కుదరడం లేదు. చాతీలో వేడిగా, చెవులు కూడా వేడెక్కి, చేతులు కాళ్ళు అదిరినట్టయ్యింది. కష్టపడి కళ్ళు తెరిచాను. కనిపించింది బాపునే. కస్తూర్ అంటూ దబ్బున ముందుకు వంగారు. ఒక చిన్న సందంత మాత్రమే తెరుచుకున్న నా కళ్ళకు బాపు ఒక్కరే కనిపిస్తున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు. ఆయన కళ్ళు నీరోడుతున్నాయి. నీరోడుతున్న కళ్ళు. ఎంత దూరం ఈదుతూ వచ్చాము ఈ కన్నీళ్ళ పైన! ఎంత ఈత కొట్టడం, ఎంత మునగడం, లేవడం, మళ్ళీ మునగడం, లేచి లేచి మునగడం..?! నా నోటికి నాలుగు ఉప్పు బిందువులు పడ్డాయి. ఇది గంగాజలమా? బాపు కన్నీళ్లా? రెంటికీ తేడా ఏముంది? మింగాను. మొత్తం గంగానదిని మింగినట్లనిపించి, లోపల ఏదో సరసరమని చలిస్తూ, వికసిస్తూ వ్యాపించ సాగింది. అంతా కనిపిస్తూనే ఏమీ కనబడలేదు. అంతా వినబడుతూ ఏమీ వినబడలేదు. నోటినిండా మాటలున్నాయి. బయటికి రావడం లేదు.
“మోక, నాకింక సాధ్యం కాదు ప్రభూ, తేలుతున్నాను నేనిప్పుడు. తేలిక, ఇంకా తేలిక. ఆహా! ఏమి ఆనందమో.. ఎన్నేళ్ళు జతగా ఉన్నాం కదా, నాకీ క్షణం చాలా..”
తే..లి పోయాను.
ఒక ఆడదాని కథ
అందరికీ అమ్మకావడం, తన భర్తకూ అమ్మ కావడం, ఒంటరితనం తక్కువ చేసే దారి అనుకునే బా బ్రతికింది. అందుకే చాలా మంది పిల్లల తల్లి ఆమె. కస్తూర్ అంటే ఆడది. బా అంటే తల్లి. కస్తూర్ కస్తూర్ బా కథ అంటే ఒక ఆడపిల్ల అమ్మ అయిన కథ.
అమ్మాయ్! ఇంతవరకూ నువ్వు విన్నది, చదివింది ఒక ఆడదాని కథ. ఎక్కువా లేదు, తక్కువా లేదు.
కాలం ఇంతే అమ్మాయ్! ప్రవహిస్తూ పోతుంది. అప్పుడున్న రాళ్ళు, కొండలు, చెట్లు ఇప్పుడూ ఉండవచ్చు. కానీ వేరే రూపంలో ఉంటాయి. దారిలోపడ్డ రాళ్ళు ఇప్పుడు ఇంటి బునాదులయ్యుండవచ్చు. జైలు గోడలు అయ్యుండవచ్చు. మురికి కాలువలో ఉండవచ్చు. బట్టలుతికే బండగా మారుండవచ్చు. లేదా పగిలిపోయి కంకరగా మారి రోడ్డు, ఇళ్ళు, వంతెనలను పటిష్టం చేసుండవచ్చు. కానీ రాళ్ళు ఉన్నది అబద్ధమా? ఇప్పుడు ఆ రాళ్ళు ఇంకో రూపంలో వాడుకోబడినది అబద్ధమా? అలాగయితే నిజమేది? అప్పటి పేరా, ఇప్పటి రూపమా?
రెండూ నిజాలే. కాలమహిమ అంటే అదే. కష్టం-సుఖం, దుఃఖం-సంతోషం, అవమానం-ప్రశంస అన్నీ అంతే. ఉంటాయి. ఎక్కడికీ పోవు. కానీ అది దానిగానే ఉండదు. ఇంకో రూపంలో ఉంటుందంతే. దాన్ని గుర్తుపట్టాలి. ఇది మనుషులకు కూడా అన్వయిస్తుంది కదూ? వాళ్ళ ఆలోచనలకూ అన్వయిస్తుంది కదూ? దీన్నే నేను జీవితాంతం తెలుసుకున్నది.
ఈ భూమి పైన ఎవరూ ఎక్కువా కాదు, తక్కువా కాదు. నేలపైన వటవృక్షమూ పెరుగుతుంది, అలాగే గరిక కూడా పెరుగుతుంది. వృక్షం విస్తారం వేరు, ఉపయోగం వేరు. గరిక ఉపయోగం, విస్తారం వేరు. వృక్షం పైన ఏదో పక్షి వచ్చి కూర్చుంటుంది. తన గూడు కట్టుకుంటుంది. పాట పాడుతుంది, ఎగిరిపోతుంది. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. చెట్టు కింద జారకుండా, నుంచున్నవాళ్ళకి నీడతో పాటు కాళ్ళకొక చల్లని అనుభవాన్నిస్తూ ఉంటుంది గరిక. చల్లగా వ్యాపిస్తూ పెనుగాలికి, ఎండకు, చలికి బెదరకుండా తనంతకు తను ఉండిపోతుంది.
నేను కూడా ఈ గరిక మాదిరిగా చిన్న సందులోంచి ఆకాశాన్నిచూస్తూ ఉండిపోయినదాన్ని. అన్ని బలవంతాల నుండి ముక్తురాలనయినదాన్ని. ఒక్కోసారి అనిపించేది, బాపు శోభకు నేనున్నానా? బాపును ఎల్లప్పుడూ గెలిపించడానికి, ఓడించడానికి, ప్రయోగాలను పరీక్షించడానికి నేనున్నానా? అకస్మాత్తుగా నేనే ఈ సంసారం-భర్త-పిల్లలు ఇవన్నీ అర్థం లేనివి అంటూ ఆశ్రమవాసానికి పిలిచుంటే? లేదా సత్యాగ్రహంలో మునిగిపోయి పిల్లలు, ఇల్లు చూసుకోకుండా కొడుకులా అలాంటి దారిని వెళ్ళుంటే? బాపు చెప్పింది నాకు నచ్చలేదు అని ఖద్దరు వేసుకోకుండా రంగురంగుల చీర కట్టుకుని, బొబ్బట్లు తింటూ, పిల్లా పీచులతో డబ్బు ఖర్చుచేస్తూ రాణిలా ఉండుంటే? నా ఇష్ట ప్రకారం బాపును మెప్పించడానికి నేను కూడా ఉపవాసం చేసుంటే? నాకై నేనే ప్రయోగం చేసి సత్యాన్ని కనుక్కునుంటే?
అప్పుడు
పోరుబందరులో ప్రళయం జరిగేది
ఆశ్రమంలో ప్రళయం జరిగేది
కస్తూర్ గాంధి కస్తూర్ బా కాకుండా పోయేది
ప్రపంచం బాను చూసే దృష్టే వేరుగా ఉండేది
జంతికలు చేశావా అమ్మాయ్? పోనీ, చేసేది చూశావా? లేదా తినేటప్పుడు ఎలా చేసుంటారో ఊహించుకున్నావా? పిండిని కలిపి, దాన్ని గొట్టంలో నింపి నిదానంగా నిరంతరంగా ఒకే మాదిరిగా నొక్కుతూ పోతే జంతికల చుట్ట బయటికి వస్తుంది. దాని ఒంట పైన ముళ్ళకోసం అది పదునుగా ఉన్న మొనతో గాయపడుతుంది. ఆ చుట్టలను గుండ్రంగా చుట్టి వృత్తంగా చేయాల్సుంటుంది. అ జంతికలో మొదలేది? తుది ఏది? రెంటి నడుమ రుచిలోని తేడా ఏమిటి?
నేను, నా బ్రతుకు, అనుభవం, జ్ఞాపకాలనే పిండిని నొక్కి నొక్కి బయటికి తీసిన జంతికల ఆకారం ఇది. మొదలుకూ తుదికి తేడా లేదు. అవన్నీ ఒకదానికొకటి అంటుకునే ఈ ఇది ఇంతగా మారింది. జ్ఞాపకాల్లో కొన్ని అటూ ఇటూ అయ్యుండవచ్చు. వాటినన్నిటినీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకునేటప్పుడు మొదలు తుదో, తుది మొదలో అర్థం కాని ఒక బిందువులో నేను నుంచున్నాను.
ఇది కస్తూర్, ఇంతే కస్తూర్, నువ్వే తీర్పునివ్వు అమ్మాయ్..
(సమాప్తం)