[dropcap]“పా[/dropcap]వనీ!”
“ఊ..”
“నేను చెప్పిన విషయం గురించి ఏమాలోచించావు బిడ్డా?”
“ఇంకా ఏం ఆలోచించలేదమ్మా!”
“ఏం, ఎందుకు?”
“నేను ఏదో ఒక నిర్ణయానికి వద్దామంటే తోచడం లేదు. నేను ఊ.. అంటే ఇటు నీకు అమ్మమ్మకు సంతోషం; అటు నాన్నకు, నాయనమ్మకు మాత్రం విషాదం. నేను ఉహు అంటే ఇటు నీకు అమ్మమ్మకు విచారం, అటు నాన్నకు, నాయనమ్మకు సంతోషం. ఇలాంటి విషమ పరిస్థితిలో నేనేం చేయాలో బొత్తిగా తోచడం లేదు..” నిస్పృహగా నిట్టూరుస్తూ అంది పావని.
“నీవు తీరిగ్గా బాగా ఆలోచించుకునే ఓ నిర్ణయానికి రా బిడ్డా! తొందర అస్సలు పడకు. మీ నాన్న, నాయనమ్మ మాటలు బాగానే చెప్తారు. కాని చేసేది మాత్రం ఏమీ ఉండదు. మీ నాన్న అనే మాటలన్నిటికీ తాన తందాన అనడమే మీ నాయనమ్మ పని. నా రెక్కల కష్టంతో ఇంతవరకు నిన్ను చదివించాను. ఇక నిన్నో ఇంటి దాన్ని చేస్తే నా బరువు బాధ్యతలు కూడా తొలగిపోతాయి. మా నాన్న అంటే నాకెంతో ప్రాణంమో నీకు తెలుసు కదా! ఇన్నాళ్లుగా పుట్టింటికి దూరమై బ్రతుకుతున్నాను. నీ పెళ్ళితో మళ్ళీ బంధాలు కలిస్తే పైలోకాన ఉన్న మా నాన్న మురుస్తాడు. అందుకని మీ మామను పెళ్ళి చేసుకుంటే అటు మీ తాతయ్య కోరిక తీరుతుంది. ఇటు మన రెండు కుటుంబాలు మళ్ళీ ఒకటైతే, నీకు కూడా దేనికీ లోటు ఉండదు తల్లీ..”
“అవునవును.. మీ అమ్మ చెప్పినట్లుగా ఆ కుంటోడిని పెళ్ళి చేసుకుంటే నీ జీవితం నిండుగా మూడు పూవులు, ఆరు కాయలుగా సంతోషంతో విరాజిల్లుతుందమ్మా.. నిజంగా నీకు దేనికీ లోటు ఉండనే ఉండదు” ఎకసక్కెంగా అంటూ అప్పుడే పావని తండ్రి అంబదాసు లోపలికి వచ్చాడు.
“అవునురా, అబ్బీ! మహా బాగా చెప్పావు..” కొడుక్కి సంతోషంతో వంతపాడుతూ అతని వెనకాలే హుషారుగా లోపలికి వచ్చింది రంగమ్మ.
అత్తని, మొగుడిని ప్రభావతి గుడ్లురిమి కోపంగా చూసిందోమారు. “నా తమ్ముడిని కుంటోడని ఇంకోమారు ఎవరైన అన్నారంటే, వాళ్ళ కాళ్ళు రెండూ విరగ్కోటి పొయ్యిలో పెడ్తాను.” కసిగా అంది.
“ఏందిరా, అబ్బి! నీ పెండ్లాం గట్ల మాట్లాడుతది.. కుంటోడిని కుంటోడని అనక, మరింకేమంటారు?” కయ్యానికి కాలు దువ్వుతుందన్నట్లుగా మరింత గట్టిగా అరిచింది ముసలావిడ.
“ఏయ్, ముసలీ! మళ్ళీ నోరెత్తకు..” అత్తని గదమాయించింది ప్రభావతి.
“అదిగో, చూడరా.. నీ పెళ్ళాం గట్ల మాడాడుద్ది. నన్ను చూస్తేనే దానికి ఒల్లు మండుద్ది..” కోడలి వంక కొరకొరా చూడసాగింది.
“నాయనమ్మా! ఇక చాలు. గమ్మునుండు” మనమరాలు గట్టిగా గదమాయించేసరికి ముసలావిడ నోరు మూసుకుంది.
ఆ ఇంట్లో పావని అంటే కొంచెం అందరికీ భయభక్తులున్నాయి. రాత్రిళ్ళు అంబదాసు తాగింటికి వచ్చి గొడవ పడుతుంటే, వాళ్ళ ముగ్గురిని సమదాయించేసరికి ఆమెకు తల ప్రాణం తోకకొస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ప్రశాంతత అనేది ఉండనే ఉండదా యింటిలో.
***
గుమ్మం ముందున్న మెట్టుపై కూర్చుని చేటలోని బియ్యంలో వడ్లగింజల్ని, మట్టి గడ్డల్ని నెమ్మదిగా ఏరుతూ దమయంతి ఏదో ఆలోచనలో ఉంది.
“హలో, అమ్మమ్మా!”
మనవరాలు పావని పిలుపుతో దమయంతి ఒక్కసారిగా ఉలిక్కిపడి చటుక్కున తలెత్తింది. ఎదురుగుండా నవ్వు ముఖంతో నిల్చున మనమరాలి చూడగానే ఆశ్చర్యపోయింది.
“రావే, ఇంట్లోకి” అంటూ లేచి ప్రేమగా పావనిని ఇంట్లోకి తీసి కెళ్ళిందావిడ.
“మామ ఇంట్లోనే ఉన్నాడా అమ్మమ్మా?” బయట కన్పించిన మూడు చక్రాల స్కూటర్ చూసి సందేహంగా అడిగింది.
“ఉన్నాడు.. గదిలో చదువుకుంటున్నాడేమో.. లేదా పండుకుని ఉన్నాడేమో!”
“ఏం, ఈరోజు పనికెళ్ళలేదా?”
“లేదు.. ఈమధ్య వెళ్ళడం లేదు.”
“ఏం, ఎందుకనీ వెళ్ళడం లేదు?”
“ఏమోనమ్మా! నాకు తెలియడం లేదు.. నీవే వెళ్ళి అడుగు. కొద్ది రోజులు సెలవు పెట్టానని చెప్పాడు నాతో మరి..” అంటూ దమయంతి వంటింటి వైపు వెళ్ళింది.
పావని ఒకమారు ఇల్లంతా కలియ తిరిగింది. ఎక్కడి సామానక్కడ నీట్‌గా సర్ది ఉన్న పెద్దహాలూ, ఒక బెడ్ రూమ్, చిన్న కిచన్ చూడానికి అందంగా ముచ్చటగా ఉందిల్లు.
దమయంతి భర్త రామరాజు లెక్కల మాస్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. వాళ్ళకు కూతురు, కొడుకు. ఇద్దరే పిల్లలు. ప్రభావతికి పనీపాటలు చేయడం తప్పించి, చదువు మీద అంతగా శ్రద్ధాసక్తులు లేకపోవడం వలన భార్య పోరు పడలేక తొందరగానే పెళ్ళి చేసేశాడు, అంబదాసుకిచ్చి. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే వాళ్ళది. అల్లుడికున్న చెడు అలవాట్ల వలన ఆస్తిపాస్తులన్నీ కరిగి పోయి చివరికి ఇల్లు తప్ప ప్రస్తుతం ఏం మిగలలేదు. కూతురు ప్రభావతి కాపురంలో కలిగిన దుస్థితికి ఆ తండ్రి మనస్సు బాధతో నలిగి పోసాగింది. ఆర్థికంగా చితికి పోయిన వాళ్ళ కుటుంబానికి అడపదడపా సహాయ సహకారాలు అందించేవాడు.
కొడుకు అరవింద్‌కు చిన్నతనంలోనే పోలియో వచ్చి మోకాళ్ళ నుంచి కింది భాగం చచ్చు బడిపోయాయి. ఎన్నెన్నో హాస్పిటల్ల చుట్టూ తిరిగారు. డబ్బులు ఖర్చైనాయి కానీ, ఫలితం మాత్రం శూన్యం.
అరవింద్‌కు కాళ్ళు లేవన్న కొరతే కానీ, చదువులో మాత్రం దిట్ట. కొడుకును బాగా చదివించాలను కున్నాడు రామరాజు. తాను రిటైర్ అయ్యాక, వచ్చిన ఆ డబ్బులతో.. ఎప్పుడో కొన్న వంద గజాల స్థలంలో చిన్న ఇల్లు కట్టించాడు. అప్పటికే అరవింద్ ఫీజి చేసి బియీడి కూడా పూర్తై ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. అప్పటికే సగం సంతృప్తుడైన రామరాజుకు మరో దిగులు మొదలైంది. కొడుకు పెళ్ళేలా చేయాలా? అని. కాళ్ళులేని వీడికి పిల్లనెవరిస్తారని.. తెగ బాధ పడేవాడు. ఆయనకు ఓ రోజు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. మనమరాలైన పావనినే అరవింద్‌కు చేసుకుంటే బాగుంటుందని అనుకొని, తన అభిప్రాయాన్ని దమయంతికి తెల్పాడు. ఆవిడ “భేష్‌గా ఉంటుంది కానీ, ప్రభావతి అల్లుడు ఒప్పుకుంటారా?” అంటూ తన సందేహాన్ని భర్తకు తెల్పింది. అవును.. అదీ నిజమే. ముందుగా పావని అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాడు. అరవింద్ ఐదేండ్ల వాడున్నప్పుడు పావని పుట్టింది. కానీ, రామరాజు ఏదైతే మనమరాలిని అడగాలనుకున్నాడో.. అది అడగకుండానే దురదృష్టవశాత్తూ ఆ రోజే రాత్రి నిద్రట్లోనే ఎవరూ ఊహించని విధంగా కన్నుమూశాడు. డాక్టర్లేమో కార్డియారెస్టు అన్నారు.
అరవింద్‌కు కూడా పావని పట్ల మెండుగా ప్రేమానురాగాలున్నాయి. ఆమెకూ మంచి మనస్సున్న మేనమామంటే ఇష్టమే. ఎటోచ్చి తన తండ్రికీ, నాయనమ్మకీ ఇష్టం లేనందుకు పావని కొంచెం వెనకా ముందాడుతుంది. దండేసి ఉన్న తాత ఫోటో ముందు నిల్చుని అదే పనిగా చూస్తున్న మనమరాలిని వంటింట్లోనుంచి ఫలహారం ప్లేట్‌తో హాల్లోకి వచ్చిన దమయంతి చూసి, “ఏమే పావనీ! మీ తాతని చూస్తున్నావా? రా.. ఇవి తిను. ఈలోగా నేను టీ పెట్టుక వస్తాను” అంటూ ఆ ప్లేట్ పావనికిచ్చి పక్కగదిలోకెళ్ళి కొడుకు ఏం చేస్తున్నాడేమోనని ఓమారు తొంగి చూసింది.
అరవింద్ గాఢ నిదురలో పండుకొని ఉన్నాడు. ఆవిడ తలుపు దగ్గరికేసి మళ్ళీ ఇవతలికి మనమరాలి దగ్గరగా వచ్చింది.
“పావనీ, ఏమైందే.. నీ కళ్ళల్లో నీళ్ళేమిటి? ఏడుస్తున్నావా?”
“లేదమ్మమ్మా! తాతయ్య గుర్తుకొచ్చి అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.”
“అవునే, మీ తాత మరణం తల్చుకుంటేనే ఒళ్ళంతా జలదరిస్తుంది నాకు ఇప్పటికీ.. చడీ చప్పుడు లేకుండా హటాత్తుగా నిద్దట్లోనే జారుకున్నాడు మహానుభావుడు..” అంటూ దమయంతి పైట చెంగుతో కళ్ళు తుడుచుకొంది.
“తాత మరణం మనకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. మన రెండు కుటుంబాలు విడిపోయాయి. అయినా కూడా ఇంకా ఎందుకు అమ్మమ్మా, బాధ పడుతావ్? మా నాన్న, నాయనమ్మ ఏనాటికైనా మారక పోతారా, మళ్ళీ మన రెండు కుటుంబాలు ఒకటి అవ్వక పోతాయా? కాలమే జవాబు చెప్తుందిలే!”
“అదే.. ఎంత కాలమో అర్థం కావడం లేదు తల్లీ! మీ అమ్మని చూడక చాలా కాలమైంది. కన్నతల్లిగా ఒకసారి చూడాలని మనస్సు అల్లాడిపోతుంది. కానీ, వీలు కాని పరిస్థితి. అయినా ఏం చేస్తాను.. ఉన్న ఊళ్ళోనే ఉండి ఒకరి ముఖాలొకరు చూడక పోవడమేమిటో, ఈ దుస్థితి రావడానికి కారణమేమిటో ఇప్పటికీ నాకంతు పట్టడం లేదు పావనీ! చిన్న విషయానికి మీ నాన్నకు ఇంత పట్టింపులు పంతాలేమిటో! అంతా నా ఖర్మ!” దమయంతి పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంది.
“బాధపడకు అమ్మమ్మా! త్వరలోనే మన రెండు కుటుంబాలు మళ్ళీ కలవడానికి ఒకటవ్వడానికి నా శాయశక్తులు తప్పకుండా కృషిచేసి తీరుతాను.” అంటూ అమ్మమ్మ ప్రేమతో ఇచ్చిన టీ తాగి ఓమారు మామ గదిలోకి తొంగి చూసింది. అరవింద్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అతని అందమైన వదనాన్ని ఓ క్షణం తదేకంగా వీక్షించి మళ్ళీ తలుపు దగ్గరకు వేసి వస్తున్న మనమరాలు వంక చూస్తూ “లేపవే వాడిని. నిన్ను కల్సినట్లుగ కూడ ఉంటుంది” అందావిడ.
“ఫర్వాలేదు మామని పండుకోనివ్వు అమ్మమ్మా! నేను మామ వారానికి ఒకరోజు ఎక్కడో ఒక చోట కలుస్తూనే ఉంటాం. మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ రోజు అమ్మ నాన్న, నాయనమ్మ ముగ్గురు కల్సి పక్క ఊరికి పెళ్ళికి వెళ్ళారు. నన్నూ రమ్మన్నారు కానీ, ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి రావాలని చెప్పి ఇలా వచ్చాను..” అంటూ ముందుకు వెళ్ళింది పావని.
గుమ్మంలోనే నిల్చున్న దమయంతి మనమరాలు వెళ్తున వైపే అదే పనిగా చూడసాగింది.
***
“రావే పావనీ! ఉదయం రమ్మంటే ఇప్పుడా రావడం? మంచి ఛాన్స్ మిస్ అయినావ్”
“అవునా, నేను మిస్ అయ్యింది ఏమిటో ఇప్పుడు చెప్పవే?” స్నేహితురాలిని నవ్వు చూస్తూ అడిగింది.
“ఈరోజు మా ఇంటిల్లిపాదిని తీసుకొని ‘బలగం’ సినిమాకి వెళ్ళాను. అది అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది. బంధుత్వాలు, బంధాలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అన్నీ చాలా చక్కగా చూపించారు. చివర్లో ఓ పాటను చూసేపుడు మా అమ్మ, అమ్మమ్మ తెగ ఏడ్చారనుకో..”
“అవునా!? అంత బాగుందా ఆ సినిమా?”
“అవునే, పావని! చాలా బాగుంది. ఇంకో విషయం ఏమిటంటే మీ నాన్న, నాయనమ్మ ఆ సినిమా చూస్తే వాళ్ళిద్దరిది ఏమన్నా మనస్సు మారడానికి ఆస్కారం ఉంటుందేమోననీ, మళ్ళీ మీ రెండు కుటుంబాలు ఒకటవుతాయేమోనని నాకో చిన్న ఆశ!”
“నాకు కావాల్సింది కూడా అదేనే. ఇంక ఆలస్యం ఎందుకు, రేపే మా వాళ్ళందరినీ ఆ సినిమాకు తీసుకెళ్తాను.” అని చెప్పి కాసేపు వాళ్ళింట్లోనే గడిపి ఆ తర్వాత నూతనోత్సాహంతో ఇంటికి వెళ్లింది పావని.
***
“అమ్మ, నాన్న, నాయనమ్మ రేపు మనమంతా కలిసి ఒకచోటకి వెళ్ళుతున్నము. కాబట్టి ఎవరూ ఎక్కడికీ వెళ్ళకండీ.”
మనమరాలు చెప్పిన ఆమాట వినగానే “ఎక్కడికో ముందుగానే చెప్పరాదే పిల్లా!” పావని వంకే నవ్వుతూ చూస్తూ మురిపెంగా అడిగింది రంగమ్మ.
“ఇప్పుడు ముందు గానే చెప్తే మజా ఏముంటుంది? వెళ్ళేప్పుడు రేపే చెప్తాను”
ఆ మర్రోజు నలుగురు ఇంటికి తాళం పెట్టి ఆటోలో బయలు దేరారు. సినిమా హాల్ దగ్గర అందరూ దిగారు.
అంబదాస్ అటు ఇటు తిరిగి పోస్టర్స్ చూస్తూ “అమ్మాయ్, పావనీ! ఈ పిక్చర్ చూడాలని నేనూ అనుకుంటూనే ఉన్నాను. చాలా మంది బాగుంది అని అంటున్నారు. ఇంకేం నీవే తీసుకొచ్చావు.” నవ్వుతూ అన్నాడు.
“అంతా బాగుందా?” కొడుకును అడిగిందీమారు రంగమ్మ.
“అవును.. అత్తమ్మా! చాలా బాగుంది అని మనం పక్కింటావిడ కూడా మొన్న అంది నాతో..” ప్రభావతి సమాధానం ఇచ్చింది రంగమ్మకు.
మొత్తం మీద ఆ సినిమా నలుగురికి తెగ నచ్చింది. అందులోని సంఘటనలు, సన్నివేశాలు తమ జీవితాల్లో అన్వయించుకొని బాధపడ్డారు; దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు, ముఖ్యంగా తల్లి కొడుకులు. చివరి పాటను చూసేప్పుడు తెగ ఏడ్చారనుకో. తాము చేసిన తప్పు ఏమిటో వాళ్ళకి అవగతమైంది.. ఇంటికి వచ్చాక కూడా ఆ సినిమాను గురించే తల్లి కొడుకులు చాలా సేపు మాట్లాడుకున్నారు.
***
ఉదయం లేవగానే అందర్నీ తయారు కమ్మని తొందర పెట్టసాగాడు అంబదాస్.
“ఎక్కడికి, ఎందుకు?” ప్రభావతి అడుగుతూనే ఉంది. కానీ, ఆయనేం చెప్పడం లేదు. క్యాబ్ బుక్ చేశాడు. ఇంటికి తాళం పెట్టి అందరూ కూర్చున్నారు.
పావనికి మాత్రం ఏదో శుభ సూచకంగా మనస్సుకు తోచసాగింది.
క్యాబ్ తనకు తెలిసిన పరిసరాల్లోకి రావడంతో ప్రభావతి విస్తుపోయింది.
“నాన్నా! ఎక్కడికెళ్ళుతున్నాం మనం?” పావని ఆత్రంగా అడిగనే అడిగేసింది.
“కాస్త ఆగమ్మా, ఆగు. నీకే తెలుస్తోంది” కూతురితో అంబదాస్ అంటుండగానే క్యాబ్ సర్రున పక్క సందులోకి తిరిగి ఓ ఇంటి ముందు ఆగింది.
ముందు రూమ్ లోనే ఉన్న దమయంతి, అరవింద్, తమ ఇంటి ముందు ఆగిన క్యాబ్‌లో నుంచి దిగుతున్న అక్కా బావలతో పాటు దిగుతున్న పావని రంగమ్మలను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. కలా, నిజమా అన్నట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి.
ముందుగా లోపలికొచ్చిన అంబదాస్ వాళ్ళ అత్తగారి కాళ్ళమీద పడి దండం పెడ్తూ, “నన్ను క్షమించండి అత్తయ్యా! మీకు, మీ అమ్మాయికి మాటలు లేకపోవడానికి ముఖ్య కారకుడిని నేనే!” అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. అరవింద్ దగ్గరకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. రంగమ్మ కూడా దమయంతిని క్షమించమని వేడుకుంది. తల్లి కూతుర్లు ఒకర్ని ఒకరు వాటేసుకుని బిగ్గరగా విలపించారు. వాళ్ళ కళ్ళ నిండా నీళ్ళు! బహుశా, అవి ఆనంద బాష్పాలు కాబోలు!
రంగమ్మ పావని చేయి పట్టుకొని తీసికెళ్ళి అరవింద్ చేతిలో పెట్టి “ఇక నా మనమరాలు నీ సొత్తే!” అని నవ్వుతూ అప్పగించింది.
“ఈ ఆనందానికి ముఖ్య కారకురాలు పావనియే. ‘బలగం’ సినిమా చూపించి మా కళ్ళు తెరిపించింది.”
“ఎడారిలాంటి ఈ ఇంట్లో ఒక్కసారిగా వసంతం వచ్చి.. కోకిల కూసినట్లుగా ఉంది అల్లుడుగారూ!” అంటూ అందర్నీ కలియచూస్తూ దమయంతి పరమానందంతో పరవశించి పోసాగింది.
అమ్మమ్మ అన్ని ఆ మాటకు అనుగుణంగా ‘కుహూ!..’ అంటూ పావని కూడా అచ్చం కోకిల లాగానే రాగయుక్తంగా కూయడంతో అంతా సంతోషంతో ఒక్కసారిగా గొల్లున నవ్వారు.