[dropcap]న[/dropcap]న్ను పలకరిస్తాడా లేదా అని పరీక్షగా చూస్తున్నారు సుందరరామమూర్తి గారు. స్టేషన్‍లోకి వచ్చి ఎ.సి. బోగీలు ఆగుతాయి అన్న చోట కూర్చుని ఉన్నారు. చేతిలో ఓ చిన్న సైజు సంచీ, ఓ వాటర్ బాటిల్ తప్ప ఏమీ లేవు. ఏదైనా సన్మాన సభకో లేక పుస్తకావిష్కరణ సభకో అయి ఉండవచ్చనుకున్నాను. ఒకానొక కాలంలో విపరీతంగా రచనలు చేసి మెప్పు పొందారు. నన్ను అనుమానంగా చూస్తున్నారంటే నన్ను గుర్తు పట్టినట్లు అర్థమైంది. నేను కరెక్టుగా పదిమంది స్కూలు పిల్లలను ఓ నాటక ప్రదర్శనకు తీసుకుని వెళుతున్నాను.
***
సుందరరామమూర్తి గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవారు, ఒకప్పుడు! ఒకప్పుడు అని అనటంలో ఒక చరిత్ర ఉంది. కాలక్రమంలో ఆయన ఓ పెద్ద సెలెబ్రిటీ అయిపోయి ఫోన్ ఎత్తటం ఆయన హోదాకు తక్కువగా భావించటం మొదలుపెట్టారు. ఓ రెండు సంవత్సరాల తరువాత ఏదో మీటింగ్‍కు వెళుతూ కొందరి ప్రక్కన ఉన్న నన్ను క్రీగంట చూసి రెండడుగులు తొందరగా వేసి మరీ దాటేసారు. ఒకప్పుడు కారులో డ్రాప్ చేయించుకున్న వారు కారు డోర్ ఎవరో తీసేవరకు కారు దిగడం మానేసారు.
రచనలు విరివిగా చేస్తూ, స్టేజీల వారిగా ఎదగాలనుకుంటూ అన్ని స్టేజిల మీదా కనిపించాలనుకునే ఆయనకి తెల్లని కుర్తా, ఒక నీలం రంగు పాంట్, ఓ కండువాతో ప్రత్యక్షం అవటం అలవాటు.
“వద్దన్నా కొంత సెంటు రాస్తుందయ్యా మా ఆవిడ” అన్నారు.
“ఉండాలండీ ఆ మాత్రం! రచయిత ముందర రచయితలా కనిపించాలి మరి”
“ఈ కబుర్లకేం గానీ ఒక్క మాట చెప్పవయ్యా”
“ఏంటి సార్?”
“ఇమర్సన్ చెప్పిన ఏవైనా రెండు మంచి మాటలు గుర్తున్నాయా?”
“దేనికి సార్?”
“స్టేజి మీద మాట్లాడాలి”
నాలుక కరుచుకున్నాను. అప్పుడే జాగ్రత్తగా ఆ సమావేశం తాలూకు కాగితం చదివాను. వక్తల జాబితాలో చివర ‘సుందరం’ అని ఉంది. అదీ సంగతి! ఈ శాల్తీ పేరుని చిన్నది చేసుకుని చిన్నగా, సన్నని సందులోంచి దూరిపోతాడన్న మాట! ఆలోచిస్తుండగా చిన్నగా గిల్లాడు.
“కొద్దిగా ఓ కొటేషన్ ఉంటే బాగుంటుంది!”
“బాగుంటుంది”
“చెప్పవయ్యా మరి.. నువ్వు కొద్దిగానే చెప్పు. నేను సర్దేసుకుంటాను”
ఎంత చక్కగా చదివేసాడు వ్యవస్థని? వ్యవస్థనే కాదు, అటుగా పోతున్న ఇద్దరు అమ్మాయిలను కూడా కొద్దిగా శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారు రచయిత గారు.
“ఒక్కసారిగా అడిగితే ఎలా గుర్తుకు రావాలి సార్?”
“నీ శక్తి నీకు తెలియదు..” అన్నారు. “..నువ్వు తలచుకుంటే ఎక్కడి నుంచైనా, దేనినైనా కలిపి చూపించగలవు.”
ఏదో డాబా మీద బట్టలారేసే తీగెలను కలిపి ముడి వేసినట్లు అంటున్నాడు. న్యాయం పట్టి పిండితే నాకు అది కూడా సరిగ్గా చేతకాదు. ఆ చేతకానితనాన్ని నిరూపించేందుకు కాబోలు నా శ్రీమతి ఎక్కువగా అదే పని నాకు చెబుతూ ఉంటుంది!
“ఇమర్సన్ అంటే..”
“తొందరగా.. అదుగో మైకు టెస్టిగ్ చేస్తున్నారు కూడాను..”
ఆలోచించాను. ఇద్దరిద్దరుగా, నలుగురు చేరి జట్టుగా అలా మిత్రులు చాలామంది హాల్లోకి వెళుతున్నారు.
“ఒక గుంపులో ఉంటూ అందరి సిద్ధాంతాల్నీ పాటించటం పెద్ద కష్టం కాదు..” చెప్పాను. “..ఒంటరిగా ఉంటూ కేవలం తన సిద్ధాంతాన్ని పాటించటం కూడా కష్టం కాదు..”
“బాబూ.. ఇమర్సన్..”
“ఇమర్సన్ అన్నదే చెబుతున్నాను”
“ఓ.. చెప్పు.. గుంపు..”
“కానీ గుంపులో ఉంటూ కూడా వ్యక్తిగత స్వాతంత్ర్యాన్నీ, సిద్ధాంతాన్నీ చెక్కుచెదరకుండా కాపాడుకునే వాడు ధన్యుడు”
కళ్ళజోడు సద్దుకున్నారు!
***
సామాన్యంగా వేదిక మీద కూర్చునేవారు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోరు. అలా చేస్తే ఇతర వక్తలు బాధపడిపోతారు. కెమెరా వాడు అదనంగా ఎదురుగా ఉండడంతో, తొడుక్కున దుస్తులను కష్టం మీద సర్దుకుంటూ, చేతకాకపోయినా పంచె కట్టుకుని, ఆ మడతలు నలగకూడదనే బాధలో, ఆ బాధ కనబడకుండా కెమెరాలోకి పళ్లికిలిస్తూ, గొంతులో ఏదో అడ్డం పడితే వింతగా సకిలిస్తూ స్టేజి మీద దిష్టిబొమ్మల్లా దాదాపు ఏడుగురు కూర్చున్నారు. నా పక్కన ఓ కుర్రాడు కూర్చున్నాడు.
“ఈ ముఖ్య అతిథి ఎప్పుడూ ఇలా ఎందుకుంటాడండీ?”
“ఎలా ఉంటాడు?”
“ఆ శాలువా కరెక్టుగా అలానే కప్పుకుంటాడు”
“ఎలా కప్పుకుంటాడు?”
“ఆడవాళ్లు పైట కప్పుకున్నట్లు..”
“స్త్రీవాదాన్ని ఎక్కువగా ఎంచుకుని ఆ మాధ్యమం ద్వారా అంచెలంచెలుగా అందలం ఎక్కేసాడు”
“అందలం అంటే?”
“ఇప్పుడిక్కడ అలా ఎందుకున్నాడు?”
“అర్థమైంది”
మైకు ముందుకు అధ్యక్షుల వారొచ్చారు.
“వేదిక మీద ఈ రోజు ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారు. ఎవరో కాదు, తనదైన శైలిలో రచనలు చేస్తూ సాహితీ రంగంలో సరిక్రొత్త గాలులు వీచేలా చేస్తున్నారు. ఎవరో కాదు, మన సుందర్రామ్మూర్తి గారు!”
సుందర్రామ్మూర్తి గారు లేచారు. అప్పటికి ఆయనకంత పేరు లేదు. నీళ్ళల్లో డైవ్ కొట్టటం నేర్చుకున్నాడు కానీ ఈత అంతగా పోత పోసుకోలేదు. కానీ తెలివిగా ప్రవర్తించాడు. మనిషి సూక్ష్మగ్రాహి!
మైకును ఎడ్జెస్ట్ చేసుకున్నాడు. అందరి వైపు, పెడస్టల్ ఫాన్ తిరిగినట్టు తాటికాయంత తల తిప్పి చూసాడు. వేదిక మీద కూర్చున్న ఓ మహిళకు, ఆవిడ మధ్య వయస్సు మధ్యలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నట్లుంది. ఇలాంటప్పుడు గ్లామరస్‍గా కనిపించాలంటే ఒక టెక్నిక్ ఉంది. కళ్ళు పెద్దవి చేసి కెమెరాలోకి సూటిగా చూడాలి!
కానీ ఆవిడకు వేరెవరో చెప్పిన మరో టెక్నిక్ అడ్డం వస్తోంది.
చెంపల మీద అటూ ఇటూ దువ్వుకోకుండా వదిలేసిన జుట్టును మాటిమాటికీ సద్దుకుంటోంది. ఆమెకు అటు ప్రక్క ఓ పెద్దాయన కూర్చున్నాడు. ఆవిడకు సహాయంగా ఆయనే స్వయంగా సద్దుదామనుకున్నాడు కాబోలు, అది చేసే ధైర్యం లేక నిగ్రహించి తల క్రిందకి దించి ఏదో శ్లోకం చదువుకుంటున్నట్లున్నాడు. కెమెరా వాడు ఆయన్ని తల పైకెత్తమంటున్నాడు. ఏం చేస్తాం? ఒకసారి స్టేజ్ ఎక్కితే వీళ్ళందరూ పెళ్ళికూతుళ్ళూ, పెళ్ళికొడుకులే! ఇలా క్రింద ఎదురుగ్గా కూర్చుని బలైపోయిన మాకు అసలు సిసలు పెళ్ళి!
“సభకు నమస్కారం..!” అన్నారు సుందర్రామ్మూర్తి గారు. “కార్యక్రమ నిర్వాహకులకు ఓ చిన్న మనవి. పెద్దల ముందర పెట్టిన టీపాయ్‍ను కొద్దిగా ముందరికి జరపాల్సిందిగా కోరుతున్నాను”
ఓ కుర్రాడు వచ్చి దానిని ముందుకి జరిపాడు. ఈ కొత్త టెక్నిక్ ఏమిటా అని అందరూ చూస్తున్నారు. ఆ కుర్రాడు జరిపి వెళ్ళిపోయాడు. సుందర్రామ్మూర్తి గారు ఆ సందులోంచి ఒక్కొక్కరికీ పాదాభివందనం చేస్తూ వెళుతున్నారు. అంతే! ఒకరు ఉలిక్కి పడుతున్నారు, ఇంకొకరు ఎందుకో కులుకుతున్నారు! ముఖ్య అతిథి దక్షిణామూర్తి శిలలా మారిపోయాడు. ఇప్పుడు మహిళ వంతైనది! చేతులు అడ్డం పెట్టింది. మరి ఆవిడ సాహితీ రంగంలో ఎంత పెద్దదైనా వయసు పాతిక ఉండటానికి వీలు లేదు. ఈయన పాదాలకు ఎలా నమస్కరిస్తాడు? అంచాత బలాత్కారం చేయబోతున్నట్లు ఆయనని అడ్దుకుంది. ఈయన వదల దలుచుకోలేదు. ఆఖరుకి కాళ్ళు పైకి లాక్కోబోయి దైవాత్ ఆ ఆలోచన మార్చుకుంది! అదృష్టం తన వంతై, ఈయన ఆవిడ పాదాలకు నమస్కరించి తిరిగి మైకు వద్దకు వచ్చారు. ముఖ్య అతిథిని విలక్షణమైన వ్యక్తి అనేసారు. అందరూ దేవుళ్ళన్నారు. ఆ మహాతల్లి సాహితీలోకానికి పరదేవత అన్నారు.
“ఇమర్సన్ మాట చెబుతాను..” అన్నారు. “ఒక గుంపులో ఉంటూ అందరి సిద్ధాంతాల్నీ పాటించటం పెద్ద కష్టం కాదు.. ఒంటరిగా ఉంటూ కేవలం తన సిద్ధాంతాన్ని పాటించటం కూడా కష్టం కాదు..”
ఇద్దరు గడ్డం క్రింద చేతులు పెట్టుకున్నారు.
“అలా ఎందుకు సార్ వాళ్ళూ?” నా ప్రక్కన ఉన్న వ్యక్తి అడిగాడు.
“ఆలోచిస్తున్నట్లు, అర్థమవుతున్నట్లు నటించాలి. దానిని లోడి లాంగ్వేజ్ అంటారు.. సారీ! బాడీ లాంగ్వేజ్!”
“ఈ రెండూ కష్టమైనవి కావు..!” మైకులో చెబుతున్నారు. “..కానీ ఒక గుంపులో ఉంటూ కూడా వ్యక్తిగత స్వాతంత్ర్యాన్నీ, సిద్ధాంతాన్నీ చెక్కుచెదరకుండా కాపాడుకునే వాడు ధన్యుడు!”
చప్పట్లు మారుమ్రోగాయి. ముఖ్య అతిథి పైట (శాలువా) సద్దుకున్నాడు.
***
సుందర్రామ్మూర్తి ఇంతలోనే సభా సమ్రాట్ అయిపోయారు. ఒక జోకుతో మొదలెడతారు, ఒక కొటేషన్ కొడతారు, ఓ శ్రీశ్రీ కవిత వినిపిస్తారు. ఏ సభాభవనం చూసినా, ఓ పెద్ద ఫ్లెక్సీలో కనిపిస్తారు!
ఓ రోజు ఫోన్ మ్రోగింది. ఆయనే!
“చెప్పండి సార్!”
“ఏం లేదూ..”
ఈ మధ్యన టోన్ కూడా మార్చారు. ఎందుకో అక్కడక్కడ స్టైల్‍గా అక్షరాలను నొక్కటం ప్రారంభించారు. తెలుగు భాషకు, సాహిత్యానికీ పట్టిన భూతమే అది. త్యాగరాజ స్వామివారు ఓ కృతిలో –
‘దారసుతులకై ధనములకై యూరు పేరులకై బహు పెద్దతనముకై సారెకు భక్తవేసముకొనువారికి తారకనామ శ్రీ త్యాగరాజార్చిత.. కలి నరులకు మహిమలు..’ అన్నారు. అలాగే ఒక్కో మెట్టు ఎక్కే వీళ్ళు తెలుగులోని ఒక్కో అక్షరాన్నీ బాధ పెడుతూ నొప్పిస్తూ స్టైల్ కొడుతూ ఉంటారు! సరిగ్గా ఉచ్చరిస్తే స్థాయి తగ్గుతుంది.
“చెప్పండి”
“అకాడమీ వాళ్ళు సెలక్షన్ కమిటీలో నా పేరు ప్రకటించారు”
“ఛా”
కొద్దిసేపు ఏమీ వినిపించలేదు. ఆ మాట నచ్చలేదు ‘పెద్దాయన’కు.
“ఊ..!” మెల్లగా అన్నారు. “..పుస్తకాలు చాలా వచ్చాయి.. కొన్ని పంపిస్తాను, మీరు కొద్దిగా విశ్లేషించి..”
అర్థమైంది.
“నేనంత చదువుకోలేదండీ..!” చెప్పాను. “..ఏదో నాటకంలో బిజీగా ఉన్నాను”
“ఏమీ చదవక్కరలేదండీ. కవర్ పేజీ ఒక్కటీ చాలు. తతిమ్మా వ్యవహారాలు మాకు ఉగ్గుపాలతో పెట్టినవి!”
“కవర్ పేజీలు చదవటానికి నేనెందుకు సార్? మీరే చదవవచ్చు కదా?”
“కాదండీ! మీకర్థం కావటం లేదు. మీ పేరు సమీక్షకులలో వేసుకుంటాను”
అంటే ఈయన కమిటీలో పెద్ద అన్నమాట!
“వద్దండీ. దయ చేసి నన్ను వదిలెయ్యండి”
“సరే”
ఫోన్ పెట్టేసారు.
కొన్ని సంవత్సరాలు గడిచాయి. మేము కలుసుకోనూ లేదు, మాట్లాడుకోనూ లేదు. ఈయన పుస్తకాలు పుస్తక ప్రదర్శనలలోనూ, పుస్తకాల షాపుల్లోనూ అద్దాల వెనుక బట్టల షాపులోని ఆడబొమ్మల్లా దర్శనమిచ్చాయి! ఏకంగా 750 పేజీల పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చాయో వచ్చేసాయి. ఓ చోట సముద్రం మీద నిటారుగా నిలుచున్న బొమ్మ కనిపించింది. ‘సుందర్రామ్మూర్తి విరాట్ స్వరూపం’ అని ఉంది. పుస్తకం శీర్షిక ‘నాకు లోతు తెలియదు’ అని ఉంది..
***
ఆ రోజుల్లో ఒకసారి రెలెక్కుతూ ప్రక్క బోగీ దగ్గర అమ్మాయిలతో సెల్ఫీలు దిగుతున్న ఆయన్ని చూసాను. ఇద్దరం ఒకే రైలెక్కాం. ప్రయాణం కూడా ఒక ఊరికే. కాని కలిసి ప్రయాణమైతే చెయ్యలేదు. ఒకసారి రాత్రి ఎందుకో వెస్టిబ్యుల్ మీదుగా వెళ్ళి మాట్లాడుదామనుకున్నాను. మనసొప్పలేదు.
“ఈ పూజలెందుకు..” ఈయన వ్రాసిన మాటలు గుర్తొకొచ్చాయి. “..ఈ పూజలెందుకు? ఇన్ని పూజలెందుకు? కష్టపడి చదివేందుకు సరస్వతి ఎందుకు? సరైన ఆలోచన ఉన్నచోట సరైన ప్రపంచం!”
ఒకరి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే ఒకడు మేధావి. ఒక వర్గాన్ని ఆడిపోసుకుంటే అది స్వర్గాపవర్గమైన పరమ పదవి! పదార్థం ఏదైనా దూషణకు వాడుకుంటే మనిషి సంఘ సంస్కర్త!
తెర మీద, తెర వెనుక, ఎవరైనా సెలబ్రిటీ అయితే అతను ఎంత అనైతికమైన వ్యక్తి అయినా అందరికీ కొత్తదారి చూపించి తరింపజేస్తున్న మహామనీషి..
ఏదో స్టేషన్ దాటి చీకటిలోకి రైలు వెళ్ళిపోతోంది. నా ఎదురుగా ఉన్న బెర్త్ మీద ఓ మహిళ కాళ్ళ మీద చంటి పిల్లాడిని పడుకోబెట్టి ఊపుతూ నిద్రపుచ్చింది. వాడు పడుకున్నాకా లేచి కూర్చుని నన్ను అదోలా చూసింది.
“మీరు నాకు పరిచయమా?” అడిగాను.
“మీరు నాకు తెలుసు. నేను మీకు తెలియదు”
“ఓ”
“మీ కథలు చదువుతాను”
“ఓ”
“బావుంటాయి”
“ధన్యవాదాలు”
“కానీ నాకొకటి అర్థం కాదు”
“ఏంటది?”
“ప్రక్క బోగీలో మహానుభావులు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సుందర్రామ్మూర్తి గారున్నారు. మీరు ఆయన్ని చూసి కూడా పలకరించలేదు. ఎందుకని?”
“నాకిష్టం లేదు”
“ఎవరు? ఆయనా?”
“అలా కలవటం”
“ఈగో ప్రాబ్లమా?”
ఇదేంటి? ఏ జంకూ లేకుండా ఇలా మాట్లాడేస్తోంది? కొద్దిగా కోపం కూడా వచ్చింది.
“మన తెలుగు వాళ్ళు ఇంతే.. కలవరు” అంది.
“సుందర్రామ్మూర్తి గారి గురించి..”
చెప్పబోతుంటే చెయ్యి అడ్డు పెట్టింది. “..అందరూ ఇలాగే మాట్లాడుతారు. చాలా కామన్! ఏదో కథ చెప్పి నాకు అందుకే నచ్చరు అంటారు. చాలా చూసాను”
నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకో నవ్వింది.
“డిన్నర్ చేసారా?” అడిగింది.
“చేసాను”
“మీరు బాగా వ్రాస్తారు..!” చెప్పింది. “..అంతంతై ఎదిగి ఆయనంత అవ్వాలని కోరుకుంటున్నాను”
ఎవరో నన్ను పీక మీద కాలు పెట్టి తొక్కుతున్నట్లనిపించింది.
“చూడమ్మా! నాకు ఆ మోజు లేదు”
“సర్లెండి.. ఇస్తే అవార్డులు వదిలేస్తారా?”
“నన్ను ఎందుకు దెప్పి పొడుస్తారు?
నవ్వింది. గడగడా మంచినీళ్ళు తాగింది.
“మీకు ఆ ఆశ ఉండే ఉంటుంది!”
“నేను మీరు నిద్రపుచ్చిన ఆ చంటి పిల్లాటి లాంటి వాడిని ఈ సాహితీ లోకంలో”
అదోలా చూసింది.
“మరి ఆయన?”
“ఒకప్పుడు తల్లి ఒడిలో పడుకుని అక్షరాలు నేర్చుకుని పెద్దయ్యాకా, పీకల మీద స్వారీ చేస్తున్న మేధావి!”
ఏదో అనబోయి ఆగిపోయింది!
***
కాలచక్రం కదులుతూనే ఉంది. గ్రహగతి, పెద్ద గ్రహాల సంగతి, వక్రించు విధానాలకు తల ఒగ్గుతూనే ఉంది! అలా అని రకరకాల పానీయాలున్నా మంచి నీరు పూర్తిగా మాయమవలేదు! పది రూపాయల టపాకాయైనా పదివేల రంగుల తారాజువ్వైనా వెలిగేది ఆ కొద్ది సేపు చీకటిలోనే!
తెల్లవారదు, ఈ చీకటే నాకు పండుగ అనుకున్నారు సుందర్రామ్మూర్తి గారు! దీపావళి పండుగ రాత్రి తారాజువ్వలు అటూ ఇటీ కొట్టుకున్నట్లు ఎవరో అడ్డం వచ్చారు.
ఓ రోజు పేపర్లో ‘సాహితీ ముసుగులో ప్రముఖ సాహితీవేత్త రాసక్రీడలు’ అని చదివి బాధపడ్డాను. ఆ ఉదంతం అలా సాగిపోయింది. వేదికల మీద కూర్చుని ఒకరికొకరు ప్రాణాలిచ్చుకునే వారిలాగా మైకుల్లో చెప్పి అన్నదమ్ముల అనుబంధాలనీ, గోదారి గట్టు చల్లదనాలనీ కవిత్వ ధోరణులలో వినిపించిన మహనీయులు పాత్రికేయుల ఫోన్‍లు ఎత్తటం కూడా మానేసారు. సుందర్రామ్మూర్తి గారి ఫోన్ ఎప్పుడో బ్లాక్ అయిపోయింది..
పట్టు పంచా, సిల్కు కుర్తా, అత్తరు, గులాబీ రంగు శాలువా, బంగారు రంగు వాచీ.. అన్నీ మాయమైనాయి.
ఎంత గొప్ప ఆటగాడయినా అవుటయ్యాకా కొత్తగా వచ్చి క్రీస్ వద్ద నిలుచున్నవాడే రాజు..
ఈ రోజు ఈ ప్లాట్‍ఫార్మ్ మీద మరల కనిపించి గుర్తుపట్టావా అన్నట్లు చూస్తున్నారు.
“బావున్నారా?” అడిగాను.
బేలగా నవ్వారు.
“వ్రాస్తున్నారా?” అడిగారు.
“ఓ. ఈ పిల్లలని నాటక ప్రదర్శనకి తీసుకుని వెళుతున్నాను”
“బాగుంది”
ఓ పుస్తకం తీసి ఇచ్చాను”
“ఏంటిది?”
“మా సంస్థ.. కొత్త వెలుగులు”
“ఓ”
“ఈ పిల్లలు వ్రాసే కథలు”
“శభాష్”
మెల్లగా రైల్లోకి వెళ్ళాం. ఈ సారి మా బోగీయే ఆయనది. కొద్దిగా ముందర సైడ్ బెర్త్ ఆయనది. పిల్లల చేత ఒకసారి సిట్టింగ్ రిహార్సల్స్ చేయించాను. చక్కగా చెప్పారు అందరూ!
రాత్రి ఏ రెండింటికో అలజడై లేచాను. ఆయన సంచీ సర్దుకుని దిగటానికి సిద్ధమైనట్లుంది. నన్ను తట్టి లేపి అదోలా చూస్తున్నారు.
“అదేంటి సార్, ఇక్కడ దిగిపోతారా?”
“అవును నా స్టేషన్ వచ్చేస్తోంది”
లేచాను. ఇద్దరం డోర్ వరకూ వచ్చాం. డోర్ తెరిచాను. చల్లగాలి వీస్తోంది. రైలు స్పీడ్ తగ్గింది. ఏవో ఇళ్లు కనిపిస్తున్నాయి.
“మీరిచ్చిన పుస్తకం రాత్రి చదివాను..”, అన్నారాయన. “..చక్కని కథలు. ‘పాలపిట్టకెంత పొట్ట’ అనే కథ నన్ను కదిలించింది. ఎవరో కుర్రాడు చి. ప్రశాంత్ ఎంత గొప్పగా వ్రాసాడండీ?”
తల ఊపాను. ఏమీ మాట్లాడలేదు.
స్టేషన్‍లో ఇద్దరం దిగాం.
“మీ గమ్యం ఇంకా ఎంత దూరం?” అడిగారు.
“ఉదయం ఏడవుతుంది”
“ఓ. ఆ అబ్బాయిని ఆశీర్వదించానని చెప్పండి”
“అలాగే. కాకపోతే చిన్న విషయం”
“ఏంటది?”
“ఇలాంటి కథలు నేను కొంత వ్రాసి వాళ్ళ పేరు మీద వ్రాయించి ప్రచురిస్తాను. వాళ్లు అవి చూసి నేర్చుకుంటూ మరల మరల వ్రాస్తూ ఉంటారు”
ఆయన కళ్ళు చెమర్చాయి.
“నా యాత్ర ఎంతో చిన్నదండీ..” అన్నారు. “కేవలం బజారులోని ప్రక్రియలను తోలుబొమ్మల్లా ఆడేసాను. మీ గోల్ మా గోలలో మాకు కనిపించలేదు. సాహితీ యాత్ర ‘పేరు’ అనే ఊరిలో ఆగిపోయింది. మీరు ఇంకా ప్రయాణించాలి. మీరు వెళ్ళాలి. పాల మనసులలోని బాల సరస్వతిని ఈ రంగుల తోలుబొమ్మలాటికి వెళ్ళనీయకుండా జాగ్రత్త పడండి. ఎలాగో అలాగ పొట్ట పోసుకునే ప్రతీ పిట్టా కూస్తుంది, పట్టించుకోకండి! కష్టమైనా ఫరవాలేదు.. ఒక్క గట్టి ప్రయాణం చేయండి. అది చాలు” అంటూనే స్టేషన్ బయటికి నడిచారు.
రైలెక్కి ఆయన వెళ్ళిన వైపే చూస్తూ నిలుచున్నాను.
బండి కదిలింది. వేగం అందుకుంది.