మలిసంజ కెంజాయ! -6

10
4

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[మర్నాడు ఆదివారం, ఏదో పనుందని వెంకట్రావు పొద్దున్నే బయటికి వెళ్తాడు. వాతావరణం బాగుండడంతో పెరటి గట్టు మీద తీరిగ్గా కూర్చుంటుంది పార్వతమ్మ. అక్కటో తోట పని చేసుకుంటున్న వసంత ఆవిడని మాటల్లో పెడుతుంది. ఎప్పుడూ పనేనా కాసేపు టీవీ చూడచ్చుగా అని పార్వతమ్మ అంటే, సీరియల్స్ మీద మోజు లేదని, పని లేకపోతే పుస్తకాలు చదువుకోవడమే అలవాటని చెప్తుంది వసంత. కాసేపు కబుర్లు చెప్పుకున్నాకా తన అక్క ప్రమీల గురించి చూచాయగా చెప్తుంది వసంత. ఇలాంటి కూతుళ్ళు కూడా ఉంటారా అని పార్వతమ్మ ఆశ్చర్యపోతుంది. కాసేపు మాట్లాడుకుని ఎవరి పోర్షన్‍లోకి వాళ్ళు వెళ్లిపోతారు. మర్నాడు ఉదయం పార్వతమ్మ చిన్న కోడలు రాణి కారులో వస్తుంది. గేటు తీసిన వసంతని పలకరిస్తుంది. కోడలు వచ్చినందుకు సంబరపడుతుంది పార్వతమ్మ. అత్తగారి కాళ్ళకి దండం పెట్టి, కౌగిలించుకుంటుంది రాణి. అది చూసిన వసంత ‘పండగ రోజు ఉదయాన్నే ఫోన్ చేస్తే విసుక్కున్న రాణీయేనా ఈమె? రకరకాల మూడ్స్‌లో ఉంటుందన్న మాట’ అని అనుకుని తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తనకి ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయనీ, అందుకే వచ్చాననీ, ఫంక్షన్‍లు అయి తిరిగి వెళ్ళేటప్పుడు అత్తగారిని తమ ఇంటికి తీసుకువెళ్తాననీ, సిద్ధంగా ఉండమని చెప్తుంది రాణి. చెప్పినట్టుగానే మొదటి ఫంక్షన్‍కి బయల్దేరుతుంది రాణి. రాణి తెచ్చిన స్వీట్స్, కారప్పూస – వసంతకి కూడా ఇస్తుంది పార్వతమ్మ. రెండు రోజుల తర్వాత వచ్చిన రాణి, బట్టలవీ సర్దుకున్నారా అని అత్తగారిని అడిగి, మళ్ళీ రెడీ అయి రెండో ఫంక్షన్‍కి వెళ్ళిపోతుంది. మూడోనాడు వచ్చి అత్తగారిని తీసుకుని వైజాగ్ బయల్దేరుతుంది రాణి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండమని వసంతని అడుగుతుంది రాణి. ఆ రోజు విశాల గొంతు విని ఉద్వేగంతో ఏం మాట్లాడాలో తెలీక ఫోన్ పెట్టేసిన మాధవ రెండు రోజులు బాగా ఆలోచించి, ధైర్యం తెచ్చుకుని విశాలకి ఫోన్ చేస్తాడు. ‘హలో’ అంటాడు కానీ గొంతు పెగలదు. ‘చెప్పు మాధవా’ అని విశాల అనేసరికి తనని గుర్తు పట్టినందుకు ఆశ్చర్యపోతాడు. కాసేపు మాట్లాడుకున్నాకా, సంభాషణ ముగించి ఫోన్ పెట్టేసాకా, అతని మనసుకి ఊరట కలుగుతుంది. పార్వతమ్మ ఊరు వెళ్ళాకా, వసంతకి ఏమీ తోచదు. వారం రోజుల్లో కూతురి పుట్టినరోజు ఉందన్న విషయం గుర్తొచ్చి ఉన్న బట్టలషాప్‌కి వెళ్లి డ్రెస్ మెటీరియల్ తీసుకుని, హ్యాండ్ బాగ్‌లో తెచ్చిన నిర్మల ఆది డ్రెస్సు, సైజు కోసం బట్టలు కుట్టే షాప్‌లో ఇచ్చేసి వస్తుంది. నాలుగు రోజుల తర్వాత డ్రస్సు తెచ్చి ఇస్త్రీ చేసి దాచిపెడుతుంది. తర్వాత నిర్మలకి ఫోన్ చేసి, పుట్టినరోజుకి భర్త తోనూ, పిల్లలతోనూ తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. అప్పుడు – ‘మా అత్తగారు నా పుట్టిన రోజుకి ఆవిడ బంధుమిత్రుల్లో ఉన్న ఓ పదిమంది ఆడవాళ్ళని పిలిచి ఒక హోటల్‌లో లంచ్ ఏర్పాటు చేస్తున్నారు, మిమ్మల్ని కూడా రమ్మన్నారు’ అని చెప్తుంది నిర్మల. కూతురు రాననగానే చిన్నబోతుంది వసంత మనసు. హోటల్‍కి ఎందుకులే అని వసంత అనగానే నిర్మల నిష్ఠూరంగా మాట్లాడుతుంది. కూతురి మాటలకి నొచ్చుకుంటుంది వసంత. తల్లి మాట్లాడకపోయేసరికి నిర్మలకి ఉడుకుమోత్తనం వచ్చి ఫోన్ పెట్టేస్తుంది. ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] రాత్రి వసంతకి నిద్ర పట్టలేదు. ‘ఏమిటీ పిల్ల! డబ్బుంటే కన్నతల్లి కూడా కనబడదా? ఈ ఇంట్లో పెరిగిన పిల్లే కదా! నా చేతుల్తో పెంచిన పిల్లే కదా! అలా పరాయిదానిలా మాట్లాడుతుందేమిటి? అమ్మా రావే! నువ్వే కదమ్మా నాకు ముందుగా అక్షింతలు వెయ్యాల్సింది అని ప్రేమగా అనొచ్చు కదా! అసలు ఒకసారి ఇంటికొచ్చి నా బర్త్ డే ఇలా చేసుకుంటున్నాం. నువ్వూ, నాన్నా రండి అని పిలిచి, నేను కొన్న డ్రెస్సు తీసుకుని స్నానం చేసి, ఇది కట్టుకుని పూజ చేసుకుంటానమ్మా! అంటే తనకెంత తృప్తిగా ఉండేది?’ అని మథన పడిందామె మనసు.

మన చేతుల్లో పెరిగిన పిల్లకే మన మనసు అర్థం కాకపొతే ఎక్కడో పెరిగి వచ్చిన కోడళ్ళకి మనం ఏం అర్థం అవుతాం? ఈ తరమే అలా ఉందేమో! అనుకుంటూ నిద్ర పట్టక పుస్తకం చదువుకుంటూ చాలా సేపు కూర్చుంది వసంత.

తెల్లారి కాఫీ తాగుతూ ఉండగా భర్తకీ సంగతి చెప్పింది వసంత. ఆమె మనసులో బాధకానీ, ఆమె గొంతులోని ఉదాసీనత గానీ గమనించని వెంకట్రావు ఆనందంగా “అప్పుడే నా బంగారు తల్లి పుట్టినరోజు వచ్చేసిందా! సూపర్!నువ్వెళ్లు భోజనానికి. ఆ రోజు నేను బైట తింటానులే. ఓ రెండువేలిస్తాను దాని చేతిలో పెట్టు” అంటూ స్నానానికి వెళ్లిపోయాడాయన. ‘ఈ మగాళ్ళెంత సులభజీవులో! సంసారంలో చీకులూ, చింతలూ అన్నీ ఆడవాళ్లవే. వీళ్ళు మాత్రం చిదానంద మూర్తులు’ అనుకుంటూ మనసులో విసుక్కుంది వసంత.

మర్నాడు పొద్దున్నే నిర్మల అత్తగారు నుంచి వసంతకి ఫోనొచ్చింది. “వదినా! ఏం చేస్తున్నారు? రేపు నిర్మల పుట్టినరోజు కదా! మన బంధువులొకరు కొత్తగా హోటల్ పెట్టారంట. అక్కడికి అందరమూ వెళ్లి నిర్మల చేత కేక్ కట్ చేయించి, మన ఆడవాళ్ళం ఓ పది పదిహేనుమంది కలిసి అక్కడ లంచ్ చేద్దాం అనుకున్నాం”

“అవునట నిర్మల చెప్పింది వదినా!”

“అన్నయ్య గారూ, మీరూ ఉదయమే టిఫిన్‌కి వచ్చెయ్యాలి. ఇక్కడి నుంచే అందరం భోజనానికి హోటల్ కెళదాం”

“ఈయన షాప్‌కి వెళ్ళిపోతానన్నారు. నేనొస్తాను పదకొండు గంటలకి. ఈయన్ని పంపేసి టిఫిన్ చేసి వస్తాను”

“మీకంతా మొహమాటం వదినా! ఈ ఇల్లు మీ ఇల్లే. మీరు నా ఆడపడుచు. మీకిక్కడ హక్కుంది” అందామె నవ్వుతూ.

ఆ మాటకి వసంతకి కళ్ళ నీళ్లు తిరిగాయి.

“అంత మాటన్నారు అదే చాలు వదినా! నేను రేపు వస్తాను కదా కలుద్దాం”

“సరేనమ్మా! కారు పంపుతాను.”

“అలాగే” అంది వసంత.

అన్నట్టుగానే వసంత బయలుదేరి వెళ్ళింది. అప్పటికే రెడీగా ఉన్న కూతురి తలమీద అక్షింతలు వేసి, మనవల దగ్గర చేరి “ఈ రోజు స్కూల్ ఎగ్గొట్టేసారా?” అంటూ వాళ్ళను దగ్గరికి తీసుకుని కబుర్లు చెబుతూ కూర్చుంది.

మరో గంటలో అంతా హోటల్‍కి చేరుకున్నారు. అప్పటికి నిర్మల అత్తగారి బంధు మిత్రులు పది మంది వచ్చి ఉన్నారు. వెళ్లి అందరినీ పలకరించేలోపే కేక్ వచ్చింది. నిర్మల కట్ చేసింది. వచ్చిన వాళ్లంతా తలో గిఫ్ట్ ఇచ్చారు పుట్టినరోజు పాపాయికి. సరదా కబుర్లతో అందరూ భోజనాలు చేశారు.

వచ్చిన బంధువుల్లో వసంతతో టీచర్‍గా పని చేసినావిడ ఒకావిడ ఉండడంతో, వసంత మనసు తెరిపిన పడింది. ఆవిడతో కబుర్లు చెబుతూ ఉండగా సమయం ఇట్టే గడిచిపోయినట్టయ్యింది. అటునుంచి అటే ఇంటికి వెళ్ళిపోయింది వసంత ఆటో మాట్లాడుకుని.

ఇంటికొచ్చాక అలమరలో కూతురు డ్రస్సు చూస్తూ ‘ఎప్పుడో ఇంటికి వచ్చినప్పుడు ఇస్తే సరి’ అనుకుంది అసంతృప్తిగా. ‘ఎంకి పెళ్లి సామెత లాగా కూతురింట్లో శుభకార్యాలు నాకు తలనొప్పవుతున్నాయి. ఏదో మరీ ఇబ్బంది కాకుండా వియ్యపురాలు స్వయంగా పిలిచి కాస్త పరిస్థితిని చక్కదిద్దింది. ఆ కొలీగ్ ఎవరో వచ్చి కూతురి వెనక తిరిగే ఇబ్బందిని తప్పించింది గనక బతికిపోయాను!’ అనుకుంది బట్టలు మార్చుకుని సోఫాలో విశ్రమిస్తూ.

‘ఇక ఈ కూతురిమీద ఆశ పెట్టుకోకూడదు! పెట్టుకుంటే వియ్యపురాలి మీద పెట్టుకోవడం తగినపని. ఆవిడ మంచిది. నిరాడంబరమైన వ్యక్తి. ధనవంతురాలైనా సంస్కారం గల స్త్రీ. బంధువుల పట్ల ప్రేమ చూపించే తత్త్వం. అందుకే కట్నకానుకలకి ఆశ పడకుండా చదువుకున్న మధ్యతరగతి పిల్లని ఏరి కోరి కొడుక్కి చేసుకుంది. భేషజం లేకుండా ‘నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూసే ఈ సంబంధానికి వచ్చాము. మీలాంటి టీచర్ కూతురికి మంచి లక్షణాలు వచ్చి తీరతాయి కాబట్టి మీ అమ్మాయిని ఎన్నుకున్నాం. మావాడికి కూడా మీ అమ్మాయి నచ్చింది అంది’ అనుకుంటూ నిర్మల అత్తగారిని తలుచుకుంది వసంత.

‘చాలామంది చాలా ఆదర్శాలు ‘డబ్బుదేముంది? గుణం కావాలి కానీ!’ అంటూ మాటల్లో చెబుతారు. తీరా చేతల్లోకి వచ్చేసరికి కట్నాలు ముందుగా మాట్లాడుకున్నట్టు ఇచ్చినా, లాంఛనాలు కోసం కూడా ఏడ్చి, ఏడ్చి మంచం పట్టిన వాళ్ళుంటారు. నేనెంత మందిని చూడలేదు! నిర్మల అత్తగారు నిజంగా కడిగిన ముత్యం! నిర్మలకేమో ఆవిడని చూసి నేర్చుకోవాలన్న ధ్యాసే ఉండదు. అతి తెలివి తేటలు తప్ప’ అనుకుంటూ నిట్టూర్చింది వసంత.

అదే రోజు సాయంత్రం వసంత పెదనాన్న కొడుకు రామచంద్రం ఫోన్ చేశాడు. పలకరింపులయ్యాక “వసంతా నువ్వు చెప్పిన ఉపాయం పాటించానే. పరిస్థితి చక్కబడింది” అన్నాడు.

“ఎలాగెలాగ చెప్పు?” అంది వసంత ఉత్సాహంగా కుర్చీలో కూర్చుంటూ. రామచంద్రం మొదలు పెట్టాడు. “ఎప్పుడూ మా అల్లుడు భార్యనీ, పిల్లలనీ తీసుకుని వచ్చి కాస్త ఫలహారం ఏమైనా చేసి వెళ్ళిపోతాడంతే. భోజనానికి ఎంత బతిమాలినా ఉండడు. పిల్లలతో అమ్మాయే ఉంటుంది. ఒకోసారి రాత్రి కూడా ఉండి మర్నాడు సాయంత్రం వెళ్ళిపోతుంది. అందుకే దాని నస అతనికి తెలిసే అవకాశం లేదు.

ఒకసారి ఆ అబ్బాయికి నేరుగా ఫోన్ చేసి బలవంతంగా భోజనానికి రావడానికి ఒప్పించాను. రోజంతా ఉండాలని చెప్పాను. ఒప్పుకుని భార్యా పిల్లల్ని తీసుకుని వచ్చాడు. భోజనాలయ్యి అందరమూ కూర్చున్నప్పుడు అల్లుడికి నా ఆర్థిక పరిస్థితంతా వివరించాను. ఉన్న పొలం చిన్నకూతురికీ ఇవ్వవలసి రావడం మొదలుకొని ఉన్న ఒక్క స్థలమూ కొడుకు పేర పెట్టవలసి రావడం వరకూ చెప్పాను. ప్రస్తుతం నేను ఏ పనీ చెయ్యట్లేదనీ, నిత్య జీవనం నడపుకునేంత మాత్రమే ఆదాయం ఉందనీ, ఈ కారణాల వల్ల పెద్ద కూతురైనా, నీ భార్యకి ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాననీ చెప్పుకున్నాను.

మేము, మీకు ఎప్పుడొచ్చినా నాలుగు రోజులుంచుకుని ప్రేమను అందించగలం గానీ ఆస్తిపాస్తులు ఇవ్వలేమని నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసాను. ఆఖర్న క్షమించమని కూడా అడిగేసాను. నా మాటలకి అల్లుడు నొచ్చుకున్నాడు. ‘అయ్యో! ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు? మేము మీ నుంచి అలా ఏమీ ఆశించలేదు. మమ్మల్ని మీతో కలుపుకున్నారు. మీ ఇంటికి వచ్చి వెళ్తున్నాము అదే మాకు సంతోషం. మేమిద్దరం ఒకరి కొకరు నచ్చి మీ ఇంట్లోనూ, మా ఇంట్లోనూ చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నప్పుడే ఇవన్నీ ఆలోచించుకున్నాం. పెద్దల సపోర్ట్ లేకపోయినా బతకగల ధైర్యం ఉండడం వల్లే బైటికొచ్చాం. ఇప్పుడు మళ్ళీ మీరు కలిశారు కాబట్టి అవన్నీ అడిగేంత కుసంస్కారులం కాము నేను కానీ, నా భార్య కానీ’ అన్నాడతను గర్వంగా.

‘లేదు నాన్నా! నువ్వూ, అమ్మాయీ మమ్మల్ని ఎన్నడూ ఏదీ అడగలేదు. అసలు మీరిద్దరూ అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు ఎంత మాత్రమూ కాదు. మీకు ఏమీ ఇవ్వలేకపోతున్నామన్న బాధకొద్దీ నా స్థితి చెప్పాను తప్ప మరో ఉద్దేశంతో కాదు బాబూ’ అని కూడా అన్నాను.

‘ఇంక ఆ విషయం గురించి మీరసలు ఆలోచించనే వద్దు. ప్రేమ పెళ్ళికి కట్నాలేమిటి మావయ్యా! మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం. చక్కని ఇద్దరు పిల్లలు నాకు మీరిచ్చిన దీవెనే కదా మావయ్యా!’ అంటూ నా కాళ్ళకీ, మీ వదిన కాళ్ళకీ భార్యతో కలిసి దణ్ణం పెట్టాడు. పిల్లల చేత కూడా పెట్టించాడు. మీ ఆశీర్వచనం మాకు కావాలి అంతే!’ అన్నాడు.

మనసులో ఏమనుకుందో ఏమో గానీ, మా అమ్మాయి కూడా ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత కూడా మీ వదినతో ఆ ప్రసక్తి ఇప్పటివరకు మళ్ళీ ఎప్పుడూ తీసుకు రాలేదంట. ఎప్పుడైనా వచ్చి వెళుతోంది మునుపట్లాగానే. ఇప్పుడు మీ వదిన కాస్త ధైర్యం తెచ్చుకుంది. మొత్తానికి నువ్వు ఇచ్చిన సలహాతో ఈ విషయాన్ని ఎక్కువ కాలం నాన్చకుండా తేల్చేసి తెరిపిన పడ్డాం. చాలా థాంక్స్ చెల్లాయ్! చక్కని పరిష్కారం చెప్పావు. మీ వదిన నీకు తన కృతజ్ఞతలు చెప్పమంది. నా సమస్య ఇప్పటివరకూ ఎవరికీ చెప్పుకోలేదు. అవమానంగా ఉంటుందని. నువ్వు చదువుకున్నదానివీ తెలివైనదానివీ ఎవరికీ చెప్పవు అని చెప్పుకోవడం ఎంతో మంచిదయ్యింది సుమా!” అని చెప్పాడు రామచంద్రం.

“చాలా సంతోషం అన్నయ్యా! సమస్యలు పూర్తయిపోవడం అంటూ ఉండదు. మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. వాటిని పరిష్కరించుకుంటూ పోవడమే మార్గం తప్ప కృంగిపోయి ఆరోగ్యం పాడు చేసుకోవడం కాదు. అందుకే నాకు తోచిన ఆ సలహా చెప్పాను. ఏమిటో అన్నయ్యా! చుట్టు పక్కల అందరినీ చూస్తున్నాం కదా! ఈ పిల్లలకి ముప్ఫయ్ ఏళ్ళు దాటినా వాళ్లకు జీవితం పట్ల సరైన అవగాహన ఉండడం లేదు. కొందరు పిల్లలు మరీ పిచ్చిపిచ్చిగా, తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు”

“ముప్ఫయ్ ఏళ్ళు అంటే చిన్న పిల్లలే కదా!” అన్నాడు రామచంద్రం

“చిన్న పిల్లలంటావా?”

“కాదా మరి? అరవైలో పడ్డాం గనక మనకి జీవితం విలువ దాని వివరం తెలిసింది. వాళ్ళకింకా ఆ జ్ఞానం రావలసి ఉందిలే! వాళ్ళకి మరో పదేళ్లు పోతే మరి కొంత సౌమ్యత వస్తుందని ఆశించాలి” అన్నాడు రామచంద్రం.

“ఉంటానన్నయ్యా! వదిన్ని అడిగానని చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత్త” అంటూ ముగించింది.

“సరేనమ్మా! మళ్ళీ ఎప్పుడైనా చేస్తాను” అన్నాడతను.

వసంతని ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆమెకి కూతురు విషయం ఎప్పుడూ ఒక పుండులా తోస్తుంది. అప్పుడప్పుడూ కాస్త ఉపశమించినట్టున్నా మళ్ళీ రేగుతుందేమో! అని భయం ఉంటూనే ఉంటుంది. అది నిజంగా అలా రేగుతూనే ఉంటుంది. అన్నయ్యకి నేను చెప్పినట్టు, నాక్కూడా ఎవరైనా ఉపాయం చెబితే బావుండును అనుకుంది వసంత మనసులో.

ఎవరు చెబుతారు? భర్తకే తన మనస్థితి వివరించలేక పోతోంది. అతని అవగాహన ప్రకారం అతనికి అర్థమే కాదు. తన సమస్య అలాగే ఉంటోంది. అమ్మాయి పురుళ్ళకి వచ్చినప్పుడూ వాళ్ళ చిన్నపిల్లలప్పుడూ కూతురు బాగానే ఉండేది అమ్మా అమ్మా అంటూ వెనకే తిరిగేది. ఇప్పుడు నాతో అవసరం తీరింది అనుకుందో, డబ్బు గర్వం తలకెక్కిందో తెలీదు. కన్నతల్లనే గౌరవం వదిలేసి చులకనగా చూస్తోంది. తన మనసులో ఒక కుంపటి ఎప్పుడూ రగులుతూనే ఉంటోంది. పోన్లే, అని తానూ తేలిగ్గా తీసుకోలేకపోతోంది. ఉద్యోగం చేసేటప్పుడు ఒక్కరితో ఒక్క మాట అనిపించుకోకుండా పని చేస్తూ, అనేక సార్లు ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డులు కూడా అందుకుంది.

ఒకోసారి తాను అనవసరంగా అతిగా ఆలోచిస్తోందేమో అనిపిస్తూ ఉంటుంది. కొడుక్కు చెబితే లైట్ తీసుకోమ్మా అని నవ్విస్తాడు. కోడలి పిల్ల బైటి పిల్ల. తనతో కూతురిలా మాటలంటోందని నేరం చెబితే అసహ్యంగా ఉంటుంది. అంతే కాక, అది తనకీ తన కూతురికీ కూడా అమర్యాద అవుతుంది. అలా కోడలికి లోకువ అవడం తప్ప లాభం ఏముంటుంది?

ఇలా ఆలోచించి, ఆలోచించి తలనొప్పి తెచ్చుకుని టాబ్లెట్ వేసుకుని పడుకుంటూ ‘ఈ పార్వతమ్మ గారు ఉంటే ఆవిడతో కాలక్షేపం చేస్తూ ఉంటే తనకి బాగుండేది. ఈవిడ ఎప్పుడొస్తుందో!’ అనుకుంటూ నిద్రపోయింది వసంత.

***

అది ప్రశాంతమైన వెంకటలక్ష్మీ ఆశ్రమం. అక్కడున్న పాతికమంది స్త్రీలూ సాత్వికులే. బతికి చెడ్డవాళ్ళు. ఒక క్రమశిక్షణతో సంసారం నడుపుకునే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి మహిళలే. పని దొంగలెవరూ కారు. ఎక్కడా ఉన్న జాడ ఉండకుండా ఒద్దికగా సంసారం చేసుకున్నవారే కావటాన వాళ్ళు మరింత అణకువ నేర్చుకున్నారిక్కడికొచ్చాక.

చేరిన కొత్తలో అందరితో కలిసి ఉండడం కొంత అసహనంగా అనిపించినా, క్రమంగా అలవాటు పడ్డారంతా. ఆశ్రమం ప్రారంభించిన కొత్తలో ముగ్గురు మాత్రమే ఉండేవారు, క్రమంగా పాతిక మంది అయ్యారు. అక్కడ ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటూ ఉండడంతో వారికి అది కాలక్షేపంగా కూడా ఉంటుంది. అక్కడ టీవీ రోజంతా ఉంచరు. ఉదయం భక్తి కార్యక్రమాలున్నప్పుడు ఒక గంట ఉంచి, మధ్యాహ్నం సీరియల్స్ చూసుకోవడానికి ఓ రెండు గంటలూ, తిరిగి రాత్రి మరో రెండు గంటలూ పెడతారు. ఎవరికి నచ్చినవి వారు చూసుకుంటూ వారి సమయాన్ని సరిపెట్టుకుంటారు. అయితే వీరిలో తూర్పూ పడమరలుగా ఉండే స్త్రీలిద్దరున్నారు. ఒకరు దుర్గమ్మ. మరొకరు జానకమ్మ.

దుర్గమ్మ చాలా నిష్ఠా, నియమాలు పాటించే ఇంట్లో పుట్టిన అమ్మాయి. పెద్ద వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి ఆమె చక్కగా పాటలు పాడేది. కమ్మని వంటలు చేసేది. ఏ పని చేసినా దానిలో ప్రతిభ కనబడేది. పెళ్లయి అత్తగారింటికి వెళ్ళింది. భర్త పౌరోహిత్యం చేసి సంసారం నడిపేవాడు. ఆమె కడుపు పండింది. పండంటి పిల్లాడిని కన్న ఆరునెలలకు భర్త గుడి నుంచి తన లూనాపై వస్తూ ఉండగా ఒక ట్రాక్టర్ గుద్దెయ్యడంతో అక్కడికక్కడే మరణించాడు. దుర్గమ్మ దిక్కులేని పక్షయ్యింది. తల్లిదండ్రులే అన్నగారింట ఉండడంతో, ఆమెకి పుట్టింటికి చేరే అదృష్టం కూడా లేకపోయింది. ఆమె బంధుమిత్రులంతా ఆమెకి ధైర్యం చెప్పారు. దాంతో ఆమె ఆత్మస్థైర్యం పుంజుకుని, ఆమె కొచ్చిన విద్య వంటలే కనుక ఆ ఊరిలో అందరిళ్ళలో పండగలకీ, ఇతర శుభకార్యాలకీ, పిండివంటలు చెయ్యడం మొదలు పెట్టింది.

ఇంకా పెళ్ళిళ్ళకీ పేరంటాలకీ ఆడవాళ్లందరికీ పూజసామాగ్రి తానే కొని తెచ్చిపెట్టి చక్కగా దగ్గరుండి పూజలు జరిపించేది. అలా అందరికీ తలలో నాలుకలా ఉంటూ ఎవరి చేతా మాటపడకుండా నెగ్గుకొచ్చింది. జనం మంచి సంభావనలతో ఆమెను గౌరవించేవారు.

కొడుకు కూడా మెరిక లాంటి కుర్రాడు. బ్యాంకు పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాడు. కొడుక్కి ఉద్యోగం వచ్చినా ఆమె తన పని మానకుండా చేస్తూనే ఉండేది. కొడుకు మానెయ్యమని చెప్పినా “నీ ఉద్యోగం నీది నా ఉద్యోగం నాది తప్పు పని కాదు. ఇదే నిన్ను ఇంతవాడిని చేసింది” అనడంతో నిజమే కదా! అనుకుని అతను ఊరుకున్నాడు. కానీ కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాక, ఆమె కొడుకు అభ్యర్ధనతో తన వంటా, పూజ పనులు మానెయ్యవలసి వచ్చింది. కొడుక్కి పెళ్లయింది. కోడలు ఇంట అడుగు పెట్టింది. ముగ్గురూ చక్కగా కలిసి మెలిసి బ్రతకాలని కలలు కన్న దుర్గమ్మ ఆశలు వమ్మయ్యాయి.

కోడలికి అత్తగారూ, భర్తా ఒకరంటే మరొకరు ప్రాణంలా ఉండడం అస్సలు నచ్చలేదు. ప్రతీదానికీ అమ్మా, అమ్మా అంటూ భర్తా, నాన్నా, నాన్నా అంటూ ఆవిడా కొట్టుకుపోవడం కోడలికి కంటగింపయింది. నెమ్మదిగా, ఆ నిప్పు రాజుకుంది. చిలికి చిలికి గాలివానయ్యింది. ఎంతో పౌరుషంగా ఒకరి ముందు చెయ్యి చాపకుండా పిల్లాడిని ఒంటిచేత్తో పెంచి పెద్ద చేసుకున్న దుర్గమ్మ బైట గెలిచి ఇంట్లో ఓడిపోయింది. కోడలు గెలిచింది. ఫలితంగా కొడుకు కోడలూ వేరు కాపురం పెట్టారు. రెండు గదుల ఇంట్లో తల్లిని విడిగా ఉంచాడు కొడుకు. తల్లి తిరిగి వంటలు చేసే పనికి వెళ్ళడానికి వీల్లేదని ఒట్టేయించుకుని తానే పోషిస్తానని అన్నాడు.

అయితే కొడుకుపై కోపంతో,ఆ ఇల్లు కట్టుబట్టలతో ఖాళీ చేసి తాళం కొడుక్కి పంపి స్వయంగా వచ్చి వెంకటేశ్వరరావు గారిని కలిసి తన పరిస్థితి చెప్పి ఈ ఆశ్రమంలో చేరిపోయింది. ఇది తెలిసి కొడుకు వచ్చి కాళ్ళా వేళ్ళాపడి బతిమాలినా వెళ్ళలేదు. తర్వాత కొడుక్కి మరో బ్రాంచికి పక్క జిల్లాకి ట్రాన్స్‌ఫర్ అవడంతో వెళ్ళిపోయాడు. అతనికి ఒక కూతురు పుట్టింది. ఎప్పుడైనా కూతుర్ని తీసుకుని తల్లిని చూద్దామని వచ్చినా, దుర్గమ్మ కొడుకు మొహం చూడలేదు. మనవరాలిని కూడా చూడడానికి ఇష్టపడలేదు.

ఇప్పుడు దుర్గమ్మ కొడుకు మళ్ళీ ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వచ్చాడన్న వార్త ఆశ్రమంలో అందరికీ తెలిసింది. ఆశ్రమవాసులు సాయంత్రం మొక్కల్లో కలుపు తీసేటప్పుడు ఓ నలుగురు “నీ కొడుకు ఈ ఊరికే వచ్చేసాడు, నిన్ను తీసుకుపోతాడులే” అన్నారు. ఏదో ఆలోచిస్తూన్న దుర్గమ్మ సర్రున వెనక్కితిరిగి “ఇన్నిరోజులూ పొరుగూరులో ఉన్నాడని నన్ను తీసుకుపోలేదు అనుకుంటున్నారా మీరంతా?” అని అంది.

అవునుకదా! అన్నట్టు చూశారంతా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here