జగన్నాథ పండితరాయలు-32

5
3

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[పాదుషాగా ఆరవ మొగలాయీ చక్రవర్తిగా ఔరంగజేబు పరిపాలన మొదలవుతుంది. విలాసాలకి పోకుండా,  వ్యక్తిగత ఖర్చుకి కూడా ఖురాన్ వ్రాతప్రతుల్ని అమ్మి తన సొంత ఆదాయంతో జీవనం సాగిస్తుంటాడు ఔరంగజేబు. ఇస్లామ్ మత విలువలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. ప్రజలకి షాజహాన్ పాలనకీ, ఔరంగజేబు పాలనకీ మధ్య గల తేడాలు తెలుస్తుంటాయి. ఒకరోజు కవి పండిత విద్వాంసుల్ని తన మందిరానికి పిలిపిస్తాడు పాదుషా. ఔరంగజేబు తన గురువు ముల్లా సలేహ్‍పై చాలా అభియోగాల్ని మోపుతాడు. తనకేమీ సరిగ్గా నేర్పలేదంటాడు. జగన్నాథుడిని ఉద్దేశించి, మీరు దారాకేం నేర్పారు? చివరికేం జరిగిందని అంటాడు. కవులు, పండితులు, గురువులు విస్తుపోతారు. జగన్నాథుడు నిస్సహాయ శ్రోత అవుతాడు. దుఃఖాన్ని బిగపట్టుకుంటాడు. ఖజానా లోని సొమ్ముని ఇకపై దుర్వినియోగం చేయబోనని చెప్తూ వాళ్ళందరికీ జీవనభృతి మాత్రం కల్పిస్తామని, ఇకపై భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యల్ని శిష్యులకి బోధించమని చెప్పి అందరినీ పంపించేస్తాడు ఔరంగజేబు. క్రుంగిపోయిన జగన్నాథుడు, శాస్త్రితో కలిసి ఇంటికి చేరుతాడు. అర్ధరాత్రి దాటాకా శాస్త్రికి మెలకువ వచ్చి చూస్తే, జగన్నాథుడి గది చీకటిగా ఉంటుంది. సుభాషిణి కూడా లేచి వస్తుంది. పాదుషా వారి మాటలు జగన్నాథుడికి శూలాల్లా గుచ్చుకున్నాయని శాస్త్రికి తెలుసు. సుభాషిణి ఏదో అనబోయేంతలో – కన్ను మూసినా తెరిచినా దారాయే గుర్తొస్తున్నాడని జగన్నాథుడు శాస్త్రితో అంటాడు. వాళ్ళని వెళ్ళి పడుకోమంటాడు జగన్నాథుడు. ప్రభువులకి, ప్రజలకి చేసిన సేవనంతా ఒకసారి అవలోకనం చేసుకుంటాడు. ఔరంగజేబు కొలువులా కొనసాగాలో వద్దో తేల్చుకోలేకపోతాడు. ఎప్పటికో నిద్ర పడుతుంది. పొద్దున్నే లేచి దైవకార్యాలు పూర్తి చేసుకుంటాడు జగన్నాథుడు. కాసేపయ్యాకా, మీరిద్దరూ కాశీ వెళ్ళిపొండి అని శాస్త్రితో చెప్తాడు. మరి మీ సంగతో అంటే, స్థాన చలనం తప్పదు అని అంటాడు జగన్నాథుడు. కామరూపం వెడితే బాగానే ఉంటుందనిపిస్తుంది జగన్నాథుడికి. రాత్రి శాస్త్రి దంపతులతో తన ఆలోచన పంచుకుంటాడు, వారిద్దరూ ఏమీ అనరు. రాత్రంతా బాగా ఆలోచించిన జగన్నాథుడికి కర్తవ్యం స్ఫురిస్తుంది. ‘మనం కాశీ వెళ్దాం శాస్త్రీ’ అని శాస్త్రితో చెప్తాడు. ఇక చదవండి.]

అధ్యాయం-55

[dropcap]జ[/dropcap]గన్నాథుడు శాస్త్రి దంపతులతో కాశీ వచ్చేశాడు. రావటం.. రావటం – సరాసరి చక్రపాణి గురుకులంలో దిగారు.

గురువుగారు ఇలా రావటం చక్రపాణి ఆనందం అనిర్వచనీయమైంది. అతని భార్య రమాదేవికి భర్త ఆనందమే తన ఆనందం. ముగ్గురు పిల్లల్నీ పరిచయం చేశాడు. నాలుగు రోజుల్లోనే వారూ వీరూ బాగా కలిసిపోయారు. మనసులు కలిసిపోయాయి.

చక్రపాణికి శాస్త్రి ‘అన్న’ అయిపోయాడు. మొదటిరోజునే రమాదేవి సుభాషిణిని ‘అక్క’ని చేసేసుకున్నది.

గురుకులంలోని తన శిష్యులందరికీ పండితరాయలవారి ప్రతిభా వైదుష్యం గురించి స్ఫూర్తిమంతంగా వివరించాడు చక్రపాణి. “నిజంగా మీ పంట పండింది. గురువుగారి బోధన కొంతైనా మీకు లభించటం మీ అదృష్టం”.

చక్రపాణి భార్యతోనూ చెప్పాడు, “నీవూ సంగీతజ్ఞురాలివి కదా. శాస్త్రి నీకు గురుస్థానీయుడు. పండితరాయలవారు ఎటూ శాస్త్రికి పరమగురువు” అని.

గురుకులం వాతావరణం జగన్నాథుడికి ఎంతగానో నచ్చింది. ఆవరణంతా పుష్ప, ఫల వృక్ష సంపన్నంగా వుంది. పక్షుల కిలకిలారావాలతోనూ, చెట్ల మీద నుంచీ వచ్చే కమ్మని సువాసనతో కూడిన గాలులతోనూ తన మనసు ఆకాంక్షిస్తున్న ప్రశాంతతని సమకూర్చి తనకు అందిస్తున్న భావన కలిగింది.

గ్రంథరచనా పరంగా మిగిలింది ‘మనోరమా ఖండనమ్’నీ, ‘రస గంగాధరం’నీ – పూర్తి చేయటం; భామినీ విలాసంలో చివరి భాగాన్ని సరిచేయటం!

విశ్వనాథ సేవనంలో శేషజీవితాన్ని ఫలప్రదం చేసుకోవటం!

ఆరోజు సాయంత్రం-గంగా తీరం దశాశ్వమేధ ఘాట్‌కి వెళ్లే కార్యక్రమం పెట్టాడు. చక్రపాణి. శిష్యులతో సహా అందరినీ పయనం చేయించాడు.

గంగాతీరం! ఘాట్ అంతా జనసందోహంతో కోలాహలంగా ఉంది. ఎటు చూసినా గంగ సేవా సమితి వారి తోరణాలు. ఘాట్-పైమెట్టు మీద సమితి వారి వేదికలు. వాటిపై కార్యకర్తలూ, నగర ప్రముఖులూ కొలువుతీరి ఉన్నారు.

గంగాహారతికి ప్రత్యేకంగా నిర్దేశించబడిన చెక్కవేదికలు, వాటిపైకి హారతి నివ్వబోయే యువకులు పసుపురంగు ధోవతులతో, ఆకుపచ్చ పై పంచెలతో పంక్తిరథ సారథుల్లా చేరుకుని తమ తమ స్థానాల్లో నిలుస్తున్నారు.

సూర్యాస్తమయ కిరణాలు గంగా స్వాదు తరంగాలపై వింతవింత వర్ణాల్ని ప్రసరిస్తున్నాయి. నదిలో నావలు.. నావల్లో సందర్శకులు.

ఘాట్‌కి కొద్ది దూరం నుంచే బిలబిలమంటూ చేతిలో పూలదండలతో ఎదురొచ్చారు కార్యకర్తలు. ‘పండిత్ రా‍జ్‍ కీ జయహో’ అంటే ‘జయ హో’ అంటూ నినాదాలతో జనం మూగారు. అధ్యక్ష కార్యదర్శులిరువురూ జగన్నాథుని వేదికమీదికి తీసుకు వెళ్లి కూర్చోబెట్టి పుష్పమలాంకృతుల్ని చేశారు.

జగన్నాథుడూ, శిష్య బృందమంతా ఆశ్చర్యానందాలతో సంభ్రమించారు. చక్రపాణి దంపతులు మాత్రం ముసిముసి నవ్వులతో తిలకిస్తున్నారు. కార్యకర్త ఎవరో చక్రపాణి చేతికి పూలమాలని అందించాడు. దాన్ని గురువుగారి మెడలో వేసి పాదాభివందనం చేశాడు.

అధ్యక్షుడు నిలబడి, “మహాజనులారా భక్తులారా.. ఈ రోజు మన అందరికీ ఒక ప్రత్యేక శుభదినం. ప్రతిరోజూ గంగాహారతి సందర్భంలో మనం పాడుతూ పరవశిస్తున్న ‘గంగాలహరి’ శ్లోకాల కర్త పండిట్ జగన్నాథ పండితరాయల వారు ఈ మహానుభావులే! గంగాహారతి చరిత్రలో ఇదొక మహత్తరమైన రోజు” అంటూ అందరికీ పండితరాయల్ని చూపించాడు. అందరూ ఆనందంతో కరతాళధ్వనులు చేశారు.

జగన్నాథుడు లేచి ముకుళిత హస్తాలతో శుభాకాంక్షలూ, ధన్యవాదాలూ చెప్పాడు.

ముందు గంగాస్తోత్రంతో హారతి మొదలైంది. తర్వాత ‘గంగాలహరి’ నుండి ఐదు శ్లోకాలు పఠించారు అపూర్వమైన దృశ్యం. దివ్యమైన అనుభూతి కలిగింది. జగన్నాథుడికి.

(తల్లీ! గంగా మాతా! ‘వీడు ఇంతవరకూ నా వద్దకు రాలేదు’ అనే భావం నీ మనస్సులో చిరకాలం నుండీ ఉండి వుంటుంది. అటువంటి నీ భావాన్ని సఫలం చేయటానికి వచ్చాను- తల్లీ! నన్నుద్ధరించు!)

అర్ధనిమీలిత నేత్రాలతో, భక్తి పారవశ్యంతో తన్మయుడైనాడు జగన్నాథుడు.

అక్కడున్న వారంతా ఏదో తెలియరాని ఆత్మ చేతనత్వంతో పులకరించిపోయారు.

హారతి అయిపోయింది. ప్రసాద వితరణ జరిగింది. ప్రసాదాల్నీ, సేవా సమితి జ్ఞాపికనీ, విశ్వనాథ రూపునీ, ఇతర కానుకల్నీ ఇచ్చి వీరికి వీడ్కోలు పలికారు-సమితి అధ్యక్షుడూ, కార్యదర్శులూ.

గురుకులానికి చేరారు.

“ఇంత చేస్తున్నట్టు మాట మాత్రం చెప్పలేదేమయ్యా” అన్నాడు జగన్నాథుడు చక్రపాణి నుద్దేశించి. “చెప్పేందుకేముంది గురువుగారూ. మీరు వచ్చారని వారితో చెప్పాను. మిగిలిందంతా వారి కర్తవ్య స్పృహ; ఆనందం, ఆచరణ. అంతే!”

అందరూ చక్రపాణిని అభినందించారు.

“గురువుగారు ఢిల్లీ వెళ్లిన తర్వాత జరిగిన అపూర్వ శుభపరిణామం ఇది. చాలా ఏళ్ల నుంచీ జరుగుతున్న నిత్య కార్యక్రమం ఇది. తెలుగువారిగా మన కందరికీ ఇది గర్వకారణం. గురువుగారి పేరు గంగా హారతితో, గంగాలహరితో పుణ్య గంగానదీతీరంలో నిత్యం స్మరింపబడటం కన్నా మహద్భాగ్యం ఏమున్నది మనకు? వారు పుణ్యులు. మనం ధన్యులం” అని కైమోడ్చాడు చక్రపాణి.

అతని భావోద్విగ్నత కళ్లని చెమరింపజేసింది. అందరూ జగన్నాథునికి పాదాభివందనం చేశారు. వారి వరుసలో శిష్యులూ నమస్కరించారు.

అందరినీ ఆశీర్వదిస్తూ, తాను కళ్లు వొత్తుకున్నాడు జగన్నాథ పండిత రాయలు! ఆయన అంతర్ముఖీనతని భౌతిక స్థితికి లాగుతూ, బిలబిలమంటూ చాలా పెద్ద సమూహం గురుకులంలోకి ప్రవేశించింది. వారందరిదీ విద్యార్థుల వాలకం!

ఇక్కడివారు అందరూ ఆశ్చర్యపోయారు. ఆడవారి మనసుల నిండా భోజనపు ఏర్పాట్లే స్ఫురిస్తున్నాయి!

కాళ్లు కడుక్కొని వచ్చి నిలబడి చేతులు మోడ్చారు. వారికి నాయకుని వంటి యువకుడు చెప్పాడు. “గురువుగారూ మేము 60 మందిమి. కన్నడదేశం మైసూరు నుండి వస్తున్నాం. ఋక్ శాఖీయులం. మీ వద్ద వేదాధ్యయనం చేయటానికి వచ్చాము. మా గురువుగారు బాలసుబ్రహ్మణ్య భట్టు గారికి జగత్సింహమహారాజుగారి ఆస్థానంలోని కవిపండితులు – విశ్వనాథ వైద్యాగారు గురువులట. వారు మీ ప్రతిభా విద్వత్తు గురించి చెప్పటం వలన – మీ శిష్యరికానికి పంపారు. మీరు అనుగ్రహించాలి”

జగన్నాథుడు మారుపలికేలోగానే చక్రపాణి “ఇది దైవసంకల్పం. చాలా సంతోషం. గురువుగారి శిక్షణకి మేము నోచుకున్నామన్నమాట” అన్నాడు.

జగన్నాథుడు చిరునవ్వునవ్వాడు. ‘మంచి మనిషి తాను పంచియిచ్చిన దాన్ని పిడికిళ్లతో స్వర్గానికి తీసుకుని వెళ్తాడు’ అన్న జానపద సామెత స్ఫురించింది. ‘తాను ఇంకా కొంత ఇవ్వవలసి ఉన్నదన్నమాట’ అనుకున్నాడు. ఆలోచనాక్రమం అంతర్వీక్షణ నిచ్చింది!

అవును. ఎక్కడి నుండీ ఎక్కడి వరకూ సాగిందీ ప్రస్థానం?

ఎక్కడ ముంగండ? ఎక్కడ కాశీ? మధ్య మజిలీలన్నీ దాటుకుని మళ్లీ కాశీ చేరడం గంగా హారతి – గంగాలహరి! అజరామరమై నిలిచింది.

ఇదీ నిన్న- నేడు! ఎన్ని పరిణామాలు? ఎన్నెన్ని విపరిణామాలు? సరి, మరి-రేపు?

లక్ష్మీస్తోయతరంగభంగచపలావిద్యుచ్చలం జీవితం!

కాలోహ్యయం నిరవధిర్విపులాచ పృథ్వీ!

కానున్నది రానున్నదిఎవరికెఱుక?

ఆ వెంటనే ‘బ్రహ్మ వేదాప్నోతిపరమ్’ (ఆత్మజ్ఞానంతో బ్రహ్మైకత్వం సాధించటమే అమరత్వం) అన్నది మననస్థితి! సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

గంగాతరంగాలపై శరద్రాత్రితో ఆటలాడుకుంటూ వచ్చి తనువుని చల్లగా తాకింది తెమ్మెర!!

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here