రాజీ

0
3

[dropcap]“ఏ[/dropcap]మండీ, అమ్మాయి మార్కులు చూసేరా. చాలా మంచి మార్కులు తెచ్చుకొంది.” పండ్రెడవ తరగతిలో నున్న ఏకైక సంతానం, కూతురు సుగుణను మెచ్చుకొంటూ అనసూయ భర్తతో అన్నది.

“చూసేను. లెక్కలు, సైన్సు, రెండింటిలోనూ తొంభైకి పైనే వచ్చేయి. చిన్నప్పటినుండి బాగా తెలివితేటలుగా చదువుకొంటోంది.” గవర్నమెంటు ఎలిమెంటరీ స్కూలులో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న నారాయణస్వామిగారు భార్య అభిప్రాయానికి మెరుగులు దిద్దేరు.

“అవునండి. మీరన్నట్లు బాగా తెలివైనదండి. పెద్ద చదువుల్లో కూడా బాగా రాణిస్తుందండి. అప్పో సప్పో చేసి పెద్ద చదువులు చదివిస్తే దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది. ఏమంటారు.”

“నీకు తెలియంది ఏముంది అనసూయా. జీతం రాళ్లమీద బ్రతుకుతున్నాం. మనకి ఉన్న ఆస్తల్లా ఈ చిన్న ఎపార్టుమెంటే. పెద్ద చదువులూ.. అంటే, నువ్వు ఇంజినీరింగో ఏదో అనుకొంటున్నావ్. అవునా.”

“అవునండి. అమ్మాయి తోటి పిల్లలు ఇంజినీరింగు పరీక్షలు రాస్తున్నారట. మన ఎదురుగా ఉన్న శాంతమ్మగారి మనవరాలు కూడా రాస్తున్నాదట. మన అమ్మాయికి కూడా రాయాలని ఉందట. ఇంజినీరింగు చదివిస్తే పెద్ద ఉద్యోగం దొరుకుతుందని నా ఆశ.”

“ఇంజినీరింగు చదివించడం చాలా ఖర్చుతో కూడిన పని. మనం ఆ జోలికి పోలేం అనసూయా.”

“మరి శాంతమ్మగారి కుటుంబం సంగతి మనకు తెలుసు. ఆవిడ మనవరాలు రాస్తున్నాది కదా.”

“అనసూయా, వాళ్లకి ఏ ఆధారం ఉందో మనకేమిటి తెలుసు. దగ్గర బంధువులు ఎవరయినా చదివిస్తున్నారో ఏమో. మనం మన పరిస్థితి చూసుకోవాలి. ఒకరు చేస్తున్నారని మనం మన తాహతుకు మించిన పనులు చేయకూడదు.”

“అవునండి. మీరు చెప్పింది నిజమే. నా కోసం మిమ్మలిని ఎప్పుడయినా ఏదయినా అడిగేనా. పెద్ద చదువు చదువుకొంటే, మనలాగ ఒకటో తారీఖు ఎప్పుడొస్తుందా అని ప్రతి నెలా ఎదురు చూసే అవస్థ దానికి ఉండదని నా ఆశ.”

“అనసూయా. నాదీ అదే కోరిక. కాని భగవంతుని దయ ఉండాలిగా.”

 “బ్యాంకుల్లో అప్పులిస్తారని అమ్మాయి చెప్పిందండి. అలా అయితే చదివించగలమేమో. మీరోమాటు బ్యాంకువాళ్ళని కనుక్కోండి.”

“నాకూ అమ్మాయిని ఇంజినీరు చేద్దామని ఉండి, కనుక్కున్నాను. నీకు తెలుసుగా మన కోటేశ్వరరావు గారు. వాళ్ళ అబ్బాయికి M.B.B.S. లో సీటు దొరికింది. ఆయన బ్యాంకు వాళ్లని కలిసేడట, అప్పుకోసం. వాళ్ళు ఇది కావాలి, అది కావాలి అని నానా తిప్పలు పెట్టేరట. ఆయన విసుగెత్తి వాళ్లకో దండం పెట్టేశాడట. అయినా వాళ్ళు చదువుకయ్యే అన్ని ఖర్చులకు అప్పులివ్వరట.”

“అయితే ఈ ఏడాది అయిపోయేక ఏమిటి చేస్తుందండి.”

“అదృష్టానికి ఈ ఊళ్ళో డిగ్రీ కాలేజీ ఉంది. అదీ లేకపోతే ఏమిటి చేసుండేవాళ్ళం అనసూయా. ఉన్నదానితో సంతృప్తి పడాలి. అమ్మాయికి తప్పక డిగ్రీ చేయిస్తాను.” అని ఇంకా ఏదో చెప్పబోతూంటే,

పొయ్యి మీద ఏదో పెట్టినట్లు జ్ఞాపకం వచ్చి అనసూయ త్వరగా అటు వెళ్ళింది.

***

“రండి, రండి. సుభద్రమ్మగారూ. పేరంటాళ్ళు అందరూ వచ్చేసారు. మీరింకా రాలేదేం చెప్మా అని ఇందాకళే మీ ఇంటికి ఫోను చేసేను. మీ అత్తగారు, ‘కోడలు చాలాసేపై మీ ఇంటికి బయలుదేరిందమ్మా. ఇంకా రాలేదా.’ అన్నారు.” అష్టలక్ష్మీ నోము చేసుకొన్న నీలమ్మగారు అతిథికి ఆహ్వానం పలుకుతూ అన్నారు.

“దారిలో పద్మావతి గారింటికి వెళ్ళేనండీ. ఆవిడ నాతో కలసి వస్తారేమో అని. ఆవిడ అప్పుడే వెళ్లి వచ్చేశానన్నారు.”

“అవునండి. వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు ఊరునుండి వస్తున్నాడని చెప్పి తొందరగా వెళిపోయేరు.”

“పద్మావతిగారి అబ్బాయి ఎక్కడో ఉత్తరాదిన ఇంజినీరింగు చదువుతున్నాడు కదూ.” పేరంటానికి వచ్చిన ఒకావిడ మాట కలిపింది.

“అవునండి. రాంచీలో చదువుతున్నాడు.” నీలమ్మగారి వివరణ.

“కుర్రాడు మంచివాడు. శలవుల్లో వచ్చినప్పుడు, తనే పిలిచి మావాడికి లెక్కలు బోధపరుస్తుంటాడు.” అక్కడ సమావేశమయిన మరొకావిడ ఆంజనేయులుకు కితాబు ఇచ్చింది.

“అంత మంచి కుర్రాడికి దేముడే అన్యాయం చేసేడు.” నీలమ్మగారు ఆంజనేయులు మీద జాలి తెలియబరిచేరు.

“ఏమిటయిందండి, ఆ కుర్రాడికి.” ఆరు నెలల క్రితం ఆ ఊరు వచ్చిన సత్యవతిగారి సందేహం.

“చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ వెధవ బంతి నేరుగా ఆ కుర్రాడి కంటికి తగిలిందట. ఆ తాకిడికి వాడి కుడి కన్ను దృష్టి పోయింది. గోవిందరాజుగారు ఢిల్లీలో చాలా పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించేరట. లాభం లేకపోయింది.” నీలమ్మగారు వివరణ ఇచ్చేరు.

“అయ్యో, అలాగా. మంచివాళ్ళకే దేముడు ఎందుకలా చేస్తాడో.” సత్యవతిగారి స్పందన.

మరికొంత లోకాభిరామాయణంతో నీలమ్మగారి ఇంట సమావేశం ముగిసింది.

***

ఆంజనేయులు ఇంజినీరింగు పాసయ్యేడు. బెంగళూరులో ఒక బహుళజాతీయ కంపెనీలో ఉద్యోగంలో చేరేడు. రెండు సంవత్సరాలు గడిచేయి. కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నా, తగిన పెళ్లి సంబంధాలు ఏవీ కుదరడం లేదని, ఏవో లోపాలున్న సంబంధాలే వస్తున్నాయని పద్మావతిగారి మనసులో తీరని బాధ. ఒకరోజు తన ఆవేదన భర్త గోవిందరాజుతో పంచుకొంటూ,

“ఏమండీ, మన అంజన్న ఇంజినీరుగా పెద్ద ఉద్యోగం చేస్తున్నా, తగిన సంబంధం ఏదీ రాడంలేదు. మనం ఏం అన్యాయం చేసేమని భగవంతుడు వాడికా శిక్ష వేస్తున్నాడండి.”

“పద్మా, బెంగపడకు. ఈ రోజుల్లో ఆడపిల్లలు వాళ్ళ పెళ్లిళ్ల విషయంలో వారి అభిప్రాయాలను జంకు లేకుండా తల్లిదండ్రులకు చెబుతున్నారు. అది కూడా మనం ఆలోచించుకోవాలి.”

“అది నిజమేలెండి. కాని మనవాడి పెళ్లి ఆలస్యమవుతోందని నా ఆత్రుత. ఇంకా వయసయిపోతే మరీ సమస్య అయిపోతుందని నా బెంగ.”

“పద్మా, భగవంతుడు ఏదో తగిన సంబంధం తప్పక చూపిస్తాడు. అవధానిగారితో మాట్లాడేను. కుటుంబం మంచిదయితే ఆస్తిపాస్తులతో సంబంధం లేదని చెప్పేను.”

“కట్నకానుకలు ఏవీ అక్కర్లేదని చెప్పేరా. “

“చెప్పేను పద్మా. అవసరమయితే మొత్తం ఖర్చు పెట్టుకొంటానని కూడా చెప్పేను.”

“వాడికి తగిన సంబంధం కుదిరితే, కాలినడకన ఏడు కొండలు ఎక్కి దర్శనం చేసుకొంటానని వెంకటేశ్వరస్వామికి మొక్కుకొన్నానండి.”

“డాక్టరును అడిగి ఫరవాలేదంటే నేను కూడా నీతోబాటు ఏడుకొండలు ఎక్కి స్వామి దర్శనం చేసుకొంటాను పద్మా.”

అంతలో పొలం పనివాడు వచ్చి ఏదో చెప్పడంతో గోవిందరాజుగారు వీధి గుమ్మం వైపు వెళ్ళేరు.

***

సుగుణ B.A. లెక్కలతో పాసయింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాది. ఊరకనే ఉండడం దేనికని, ఇంటివద్ద లెక్కలు ట్యూషన్లు ప్రారంభించింది. త్వరలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంటిఖర్చులకు తండ్రికి సాయం చేయనారంభించింది. నారాయణస్వామిగారు కొద్దిగా స్వీకరించి, మిగిలిన దానిని బ్యాంకులో కూతురు ఖాతాలో జమ చేస్తున్నారు.

ఒక రోజు నారాయణస్వామి దంపతులు కూతురు వివాహ విషయం చర్చించుకొంటూ,

“ఏమండీ, శాస్త్రిగారిని ఓ మారు కదిపి చూడండి. అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏవైనా చూశారేమో.”

“మొన్ననే ఆయనతో మాట్లాడేను అనసూయా. మనకు అందుబాటులో ఉన్నవాటికోసం చూస్తున్నానన్నారు.”

“అదేదో తొందరగా తెలిస్తే బాగుండును. పిల్ల అత్తవారింట్లో ఉండవలసిన వయసు. ఇక్కడ మన ఇంట్లో రోజల్లా పాఠాలు చెబుతూ కష్టబడుతోంది. అది చూసినప్పుడెల్లా నాకు గుండె తరుక్కుపోతోంది. నా కన్నతల్లికి ఆ మూడు ముళ్ళూ ఎప్పుడు పడతాయో.”

“అనసూయా, బెంగ పెట్టుకోకు. నీకు జ్ఞాపకం ఉందా. నిరుడు ఆ కొండదొర, అమ్మాయిని చూడగానే లక్ష్మీ కళ ఉంది, ఈ సంవత్సరం అమ్మవారి జాతర సమయానికి పెళ్లి అవుతుంది, అన్నాడు.”

“అవునండీ, వాడి నోటి మాట నిజమయితే అమ్మవారి జాతర రెండు మూడు నెలలుంది.”

అంతలో తోపుడు బండి మీద కూరలు అమ్ముకొనే వాని కేక విని, అనసూయ అటు వెళ్ళింది.

***

“నమస్కారం శాస్త్రిగారు. రండి కూర్చోండి.” నారాయణస్వామిగారు ఆయనతో వచ్చిన అవధానిగారికి కూడా నమస్కరించి ఆసీనులుకమ్మని వినయపూర్వకంగా చెప్పేరు.

“ఈయన అవధానిగారని బొరిగుమ్మవలస నుండి వచ్చేరు. మీ అమ్మాయికి ఓ సంబంధం తెచ్చేరు.” శాస్త్రిగారు అవధానిగారిని పరిచయం చేసేరు.

“చాలా సంతోషం. మీ ఆశీర్వచనాలు మాకు కావాలి.”

“వాళ్ళ ఊరిలో గోవిందరాజుగారని ఒక పెద్ద భూకామందు ఉన్నారట. ఆయనకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారట. అమ్మాయికి వివాహమయి అత్తవారింట ఉన్నాదట. అబ్బాయి ఇంజినీరింగు పాసయి బెంగళూరులో ఏదో పెద్ద కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడట.” అని చెప్పి,

“అవధానిగారూ మిగిలిన విషయాలు మీరు చెప్పండి.” అని అవధానిగారివైపు చూసేరు, శాస్త్రిగారు.

“అయ్యా, అంత ఆస్తి ఉన్నా, గోవిందరాజుగారు నిగర్వి. మా ఊరిలోని వారే గాక, చుట్టు ప్రక్కల గ్రామాలు వారు కూడా ఆయన్ని గౌరవిస్తారు. అవసరమయినవారికి ఆయన చేయూతనిస్తూ ఉంటారు. ఆయన భార్య పద్మావతిగారు ఉత్తమురాలు. దైవభక్తి గల వ్యక్తి. దానధర్మాలకు వెనుకాడరు. ఇహ అబ్బాయి ఆంజనేయులు మాటంటారా. బుద్ధిమంతుడు. లక్షణంగా కనిపిస్తాడు. గొప్పవారి ఇంటి బిడ్డయినా వినయవిధేయతలు గలవాడు. అంతస్తులుతో ప్రమేయం లేక తోటివారందరితో కలసి మెలసి ఉంటాడు. అయితే.. మీకో.. విషయం చెప్పాలి.” అని సంశయిస్తూ శాస్త్రిగారి వైపు చూసేరు అవధానిగారు.

“చెప్పండి. ఫరవాలేదు.” శాస్త్రిగారి సలహా.

“అబ్బాయి చిన్నప్పుడు క్రికెట్ ఆటలో, బంతి అబ్బాయి కంటిమీదకు వచ్చి గట్టిగా తగిలింది. ఆ తాకిడికి.. అతడి కుడి కన్ను దెబ్బ తిన్నాది. ఆ గాయానికి అతని కుడి కన్ను దృష్టి పోయింది. గోవిందరాజుగారు ఢిల్లీలో పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించేరు. కాని లాభం లేకపోయింది. అది తప్ప పిల్లాడిలో ఎంచడానికి ఏమీ లేదు.” అని అవధానిగారు చెప్పగానే నారాయణస్వామిగారు గతుక్కుమన్నారు.

అది గమనించిన శాస్త్రిగారు, “స్వామిగారూ, సంబంధం నాకు మంచిదనిపిస్తోంది. మీ అమ్మాయితోను ఆవిడతోను బాగా ఆలోచించండి. మీకు అన్నివిధాలా నచ్చితేనే ముందుకువెళదాం.”

“స్వామిగారూ, అదొక్కటి మీరు అట్టే పట్టించుకోకపోతే, ఆ సంబంధం చేసుకొంటే, మీ అమ్మాయి అన్నివిధాలా సుఖపడుతుంది. చెప్పడం మరచేను. కట్నకానుకలు ఏమీ ఉండవు.”

“మీరు చెప్పినట్లు బాగా ఆలోచించుకొని మా నిర్ణయం తెలియబరుస్తాను.” వినయంగా నారాయణస్వామిగారు అతిథులనిద్దరిని ఉద్దేశించి చెప్పేరు.

అవధానిగారు మరికొంత సమయం గోవిందరాజుగారి కుటుంబం గూర్చి మంచి విషయాలు చెప్పేక, అతిథులిద్దరు స్వామిగారి వద్ద శలవు తీసుకొన్నారు.

***

వచ్చిన సంబంధం గూర్చి నారాయణస్వామిగారు, అనసూయ అందులోని బాగోగులు విపులంగా చర్చించుకొంటూ,

“ఏమిటోనండి. ఏమీ తోచడం లేదు. భగవంతుడు మనకు ఎందుకు ఈ పరీక్ష పెట్టేడో తెలియడం లేదు.” అనసూయ మనసులో గందరగోళం.

“అనసూయా, ఏమి చెయ్యాలో నాకూ బోధపడడం లేదు. చదువు విషయంలో మన పరిస్థితి అర్థం చేసుకొని రాజీ పడింది. ఈ సంబంధం అన్ని విధాలా బాగుంది; చేసుకొంటే పిల్ల సుఖపడుతుంది అంటే, అదో లోపం పెట్టేడు భగవంతుడు. చదువుకొన్న పిల్ల. తెలివయినది. ఇది తన జీవితానికి సంబంధించినది కదా. సరైన నిర్ణయం తీసుకొంటుందనుకొంటాను. ‘అమ్మా, ఈ విషయంలో మా అభిప్రాయంతో సంబంధం లేదు. నీకు అన్ని విధాలా నచ్చితేనే ముందుకు వెళదాం. లేకపొతే నిర్మొహమాటంగా, మాకు నచ్చలేదని శాస్త్రిగారికి చెప్పేస్తాను.’ అని అమ్మాయికి చెప్పేను.”

అలా అదే విషయం రాత్రి చాలాసేపటివరకు ఆలోచిస్తూండేవారు ఆ దంపతులు.

సుగుణ రాత్రల్లా ఆలోచించింది. తనకు సంబంధాలు వస్తున్నాయి. కాని గుమస్తా పనులు చేస్తున్నవారు కూడా లక్షలమీద కట్నాలడుగుతున్నారు. తండ్రి ఉన్న కొద్దిపాటి ఆస్తి అమ్మి, తనకు పెళ్లి చేయడం, సుగుణ సుతరాము ఇష్టపడలేదు. కట్నాలు లేకుండా తన పెళ్లి కుదరదు. అయితే తన పెళ్లి సమస్యకు సమాధానమేమిటి. వివిధ ఆలోచనలతో సతమతమవుతోంది.

కట్నాలబారి నుండి తప్పుకోడానికి తను పెళ్లి విషయం మరచిపోయి జీవితాంతం కన్యగా ఉండిపోతే, అని ఓ ఆలోచన.

ఆ చర్య సమస్యను మరీ జటిలం చేస్తుందేమో. తమ అసమర్థత వలన కన్నకూతురు పెళ్లి మానుకోవలసివచ్చిందని తల్లిదండ్రులు జీవితాంతం దుఃఖిస్తూనే ఉండవచ్చు. అట్టి అవస్థలో నున్న తల్లిదండ్రులను నిత్యం చూస్తూ తనూ బాధననుభవించాలి. కుటుంబమంతా క్షోభ ననుభవించే అట్టి చర్య తలపెట్టకూడదనుకొంది. అందుచేత తను పెళ్లి చేసుకోవాలి, అని ఒక నిశ్చయానికి వచ్చింది.

వచ్చిన సంబంధం గూర్చి లోతుగా ఆలోచించింది. కుటుంబం మంచిదని, పెళ్ళికొడుకు మంచివాడని, చెడు అలవాట్లు లేవని చెబుతున్నారు. ఇంజినీరుగా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ముఖ్యంగా కట్నకానుకలు లేవు. సంబంధం తండ్రికి అందుబాటులో ఉంది. తను ఆ సంబంధం చేసుకొంటే కనిపెంచిన తల్లిదండ్రులకు తన బాధ్యత తీరుతుంది. తను కూడా జీవితంలో సమస్యలు లేకుండా గడపవచ్చుననుకొంది. ఇలా సమస్యను అన్ని కోణాలలోను రాత్రల్లా ఆలోచించింది. చదువు విషయంలో ఇంజినీరింగు చదవాలని ఆశ ఉన్నా అవకాశాలు లేక రాజీ పడ్డానని జ్ఞాపకం తెచ్చుకొంది. ఈ విషయంలో కూడా రాజీ పడితే, తనకు, తన తల్లిదండ్రులకు కూడా శ్రేయస్కరమనుకొంది. మధ్యతరగతి వారి జీవితాలు వడ్డించిన విస్తరి కావని గుర్తించింది. వారి జీవితాలు రాజీల బాటలోనే నడుస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించింది సుగుణ.

తెల్లవారేక తల్లిదండ్రులతో ఆ విషయం ప్రస్తావనకు వచ్చింది.

“ఏమిటి తల్లీ, ఆ విషయం ఆలోచించేవా.” తల్లి అనసూయ కూతురి మనోగతం తెలియగోరింది.

“నువ్వు నిస్సంకోచంగా చెప్పమ్మా. నీకు నేను చెప్పేనుగా. నీకు పూర్తిగా నచ్చుతేనే ముందుకు వెళదాం. లేకపోతే శాస్త్రిగారికి నిర్మొహమాటంగా చెప్పీస్తాను; సంబంధం మాకు నచ్చలేదని. చదువుకొన్నావ్. అందమయినదానివి. తగిన సంబంధం తప్పక వస్తుంది.” తండ్రి నారాయణస్వామి హితవు.

“అవును తల్లీ. మీ నాన్నగారు అన్నట్టు, నీకు అన్నివిధాలా నచ్చుతేనే వాళ్ళతో మాట్లాడుతాం.”

“పెద్దవాళ్ళు. మీ అభిప్రాయమేమిటి. అది నాకు ముఖ్యం.” వినయంగా అడిగింది సుగుణ.

“అమ్మా. మేము ఒక్కటే అనుకొన్నాం. నువ్వు తెలివయినదానివి. సంబంధంలోని మంచిచెడ్డలు బాగా ఆలోచించుకోగలవు. అందుచేత నీ నిర్ణయమే మా నిర్ణయం. నీ అభిప్రాయమేమిటో చెప్పమ్మా.”

“నేను బాగా ఆలోచించుకొన్నాను. చదువుకున్నాడు. ఇంజినీరు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం మంచిది; అతనికి చెడు అలవాట్లు లేవంటున్నారు. మంచివాడంటున్నారు. అందుచేత అతనిని చేసుకొంటే బహుశా జీవితంలో నాకు సమస్యలు ఉండకపోవచ్చనుకోంటున్నాను. ఇవన్నీ ఆలోచించి, ఈ సంబంధం చేసుకోవచ్చనుకొంటున్నాను.”

“అమ్మా భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా.” కన్నతండ్రి ఆశీర్వచనాలు.

“అవునమ్మా. ఆ ఏడుకొండలవాడు నీకు అండగా ఉంటాడమ్మా.” కన్నతల్లి దీవెనలు.

కన్నకూతురు పెళ్లి నిశ్చయమయ్యాక ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సంతోషించేరో ఆ పరమేశ్వరునికే ఎరిక.

నారాయణస్వామిగారు శాస్త్రిగారిని కలసేరు. సంబంధం నచ్చిందని తెలియజేసేరు. శాస్త్రిగారు సంతోషించి ఆశీర్వదించేరు. బొరిగుమ్మవలసలోని అవధానిగారికి శుభపరిణామం తెలిసింది. అది విని గోవిందరాజు గారు, పద్మావతి ఏడుకొండలవాడి దయ కలిగిందనుకొన్నారు. కొడుకు పెళ్ళికి పెద్ద ఎత్తున సన్నాహాలు ప్రారంభమయ్యేయి.

ఓ సుముహూర్తాన్న సుగుణ తలవంచి మెడలో మూడు ముళ్ళూ వేయించుకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here