నిద్రలేమి

0
3

[dropcap]ఎం[/dropcap]త ప్రయత్నించినా, నాకు నిద్ర పట్టటం లేదు. పక్క మీద అటు, ఇటు దొర్లుతున్నాను. ఉన్నట్టుండి పక్క మీద నుంచి లేచి కూర్చున్నాను. సుమతి వేపు చూశాను. మంచి గాఢ నిద్రలో ఉంది. చాలా అదృష్టవంతురాలు అనుకున్నాను. రోజంతా కష్టపడి ఏ టూ జెడ్ ఇంటి పనులన్ని చేస్తుంది. తను పడిన శ్రమకి ఫలితమే ఈ గాఢమైన నిద్ర.

ఉదయాన్నే లేస్తుంది. అప్పటి నుండి సుమతి మనస్సు, శరీరం రెండూ పని చేయవల్సిందే. ఊపిరి తీసుకోడానికి కూడా సమయం ఉండదు. కర్మ కాలి ఒక వేళ పనమ్మాయి రాకపోతే ఆ పాచి పని కూడా సుమతిదే. ఉద్యోగస్థులకి , మిగతా చిన్నా చితక పని చేసిన వాళ్ళకి వారానికొ రోజు సెలవు దొరుకుతుంది, కాని సుమతికి ఆ అదృష్టం కూడా లేదు. రోజంతా కష్టపడవల్సిందే.

ఆ ఇంటికి ఆమె యజమానురాలు. ఆమె సర్వస్వం. పిల్లల బాగోగులు చూసుకునే అమ్మ స్ధానం కూడా ఆమెది అష్టావదానం, శతావదానంలా.

ఈ మధ్య కొడుక్కి పెళ్ళయి కోడలు సుగుణ వచ్చినప్పటి నుండి అత్తగారికి చేదోడు వాదోడుగా నిలవబట్టి సుమతికి కొద్దిగా వెసులుబాటు కలుగుతోంది. చెప్పాలంటే సుగుణ పేరుకు తగ్గట్టు సుగుణవంతురాలు. మంచి పిల్ల. అత్తగార్ని, మామగార్ని డస్ట్ బిన్‌లా భావించే నేటి తరం అమ్మాయి లాంటిది కాదు సుగుణ. సుమతి ఒక విధంగా చూస్తే శ్రమజీవి అయినా కోడలు సుగుణ రాకతో కొద్దిగా శ్రమ తగ్గింది ఆమెకి. అంత శ్రమజీవి కాబట్టే అంత మంచి నిద్రకు నోచుకుంది అని అనుకుంటున్నాను నేను.

నేటి మనిషికి జీవితంలో ప్రత్యేకమైన గదులున్నా పడుకోడానికి మొత్తని పరుపులున్నా, మెత్తని దుప్పట్లు, దిండ్లు ఉన్నా, ఖరీదైయిన ఎయిర్ కండీషనర్లు ఉన్నా సరియైన కంటినిండా నిద్ర ఉండటం లేదు. చీకటి రాకాసిలా తరుముకొస్తున్నా, నిశ్శబ్దం కర్ణకఠోరంగా శాపాలు పెడ్తున్నా మన అంతూ పొంతూ లేని ఆలోచన్లు కొరివి దెయ్యాల్లా వెకిలిగా నవ్వుతున్నట్లు ఉన్నా ప్రయత్నం చేసినా నిద్రపట్టం లేదు.

వయ్ససుతో పాటు నిద్రలేమి వస్తుందని సైకియాట్రిస్టులు చెప్పినా ఆ నిద్రలేమి మనిషి జీవితంలో తీవ్రమైన సమస్యగా తయారయింది. అంతే కాదు చెప్పనలవి కానంత మానసిక హింస. ఆ రెప్పబాటు సంక్షోభం నుండి మనిషి బయటపడాలి.

మనిషి జీవన ప్రమాణం పెరిగింది. వయస్సే కాదు సంపదలు పెరిగాయి. అయితే ఉరుకులు పరుగుల యాంత్రిక జీవితంలో పరుగు పెట్టి పరుగు పెట్టి మనిషి అలసిపోతున్నాడు. శ్రమకి తగ్గ విశ్రాంతి, ఫలితం దక్కటం లేదు. పడిన శ్రమకి కంటి నిండా చక్కని నిద్ర ఉండాలి. నిద్ర వలన శరీరం మనస్సు తేలికపడ్తాయి. సాంత్వన లబిస్తుంది. అయితే వయసు మళ్ళిన వాళ్ళనే కాదు, మంచి నడివయ్సుసలో ఉన్న వాళ్ళకి కూడా నిద్ర కరువయింది. చాలా మందికి కంటినిండా నిద్ర పట్టటం లేదు. దానికి కారణం కళ్ళు మూసుకుంటే వృత్తి ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి వల్ల ఒక ప్రక్కయితే, మరో ప్రక్క తాను చేసిన అప్పులు, వాటికి తోడు అభద్రతా భావం, క్షణక్షణం వెంటాడుతూనే ఉంటుంది. అంతే కాదు నూన్యతా భావంతో పాటు ప్రేమ రాహిత్యం కలవర పెడ్తాయి మనిషిని.

ఇవన్నీ మనిషి బంగారం లాంటి నిద్రను బలితీసుకుంటున్నాయి. ఈ నిద్రలేమి వీళ్ళూ, వాళ్ళూ ఏంటి – కార్పోరేటు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల్ని కూడా విడిచి పెట్టటం లేదు. దానికి కారణం ఈ విద్యా సంస్థలు. విద్యార్థుల్ని ప్రాణం ఉన్న యంత్రాల్లా, మరబొమ్మల్లా మార్చేసాయి. ఇలా తలాతోకా లేని ఆలోచన్లు నా మది నిండా.

తిరిగి సుమతి వేపు చూశాను, ఆలోచనా ప్రపంచం నుండి బయటపడి. సుమతిది అదే ప్రశాంతమైన నిద్ర హాల్లో ఉన్న దివాను మీద. ఆ హాల్లోనే ఉన్న మరో దీవాను మీద నా పడక. నాలో అనేక సందేహాలు. సుమతిలా నేను ఎందుకు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను? ఇది వయస్సు ప్రభావం అనుకోవాలా? లేకపోతే నా మానసిక పరిస్థితి సరిగా లేదని అనుకోవాలా?

నా మంచి మిత్రుడు సుధాకర్ గొప్ప సైకియాట్రిస్టు. వాడి దగ్గర నా నిద్రలేమి ప్రస్తావన తెచ్చాను ఓసారి. వాడి జవాబు ఏంటంటే కొంత మంది నిద్ర అవసరాన్ని గుర్తించరు. దాని అవసరం నిద్ర లేనప్పుడు తెలుస్తుంది. అప్పుడు పరిసరాలు, పరిస్థితులు గమనించకుండా, ముందూ వెనకా ఆలోచించకుండా కనురెప్పలు వాటంతట అవే మూతలు పడిపోతాయి.

వాడి మాటలు మధ్యలోనే ఆపు చేసి “అలాంటి నిద్రనాకు కావాలి” అన్నాను. ఎందుకంటే మనిషి జీవితంలో ప్రకృతిలో పగలూ రాత్రిలా, నిద్రా మేలుకోలుపూ రెండూ ఉండాలి. ఇదే నా ఆలోచన. సుధాకర్ కూడా నా భావాల్తో ఏకీభవించాడు. వాడి మాటల్లో మనిషి నిద్రలోకి జారుకున్న, ఆ కొద్ది గంటల వ్యవధిలో మన శరీరం ముఖ్యమైన బాధ్యతల్ని పూర్తి చేసుకుంటుంది. మెదడు తాజా సంఘటనల్ని వడబోసి మనకి ఉపయోగపడే విషయాల్ని మాత్రమే జాగ్రత్త పరుస్తుంది. జీర్ణవ్యవస్థ తిన్న దాన్ని అరగించే పనిని వేగవంతం చేస్తుంది. నిద్ర సమయంలోనే ప్రోటీన్లు అదనపు ఉత్పత్తి జరుగుతుంది. రోగాల్ని తట్టుకునే శక్తి వాటి ద్వారా వస్తుంది.

సుధాకర్ మాటలు విన్న తరవాత వాడు సైకియాట్రిస్టా లేక సైన్సు టీచరా అని అనిపించింది. ఆ సమయంలో, బాహ్యప్రపంచంలోకి వచ్చిన నేను ఆలోచన్లకి స్వస్తి పలికి పరిసరాలను చూశాను. మూడువ బెడ్ రూమ్ నుండి వెలుతురు, తలుపు వోరగా వేయడం వల్ల హాల్లోకి ఆగుపిస్తోంది. వాళ్ళెవరూ ఇంకా నిద్ర పోలేదన్న మాట అనుకున్నాను.

రిటైర్‌మెంట్ ఆయిన తరువాత పైసా పైసా పొదుపు చేసిన డబ్బుతో విశాలమైన మూడు బెడ్ రూమ్‌లు, హాలు, కిచెన్, డైనింగ్ హాలు ఉన్న ఇల్లు కట్టుకుని నా కలల్ని సాకారం చేసుకున్నాను. దానిలో సుమతి సహకారం ఎంతో ఉంది. పొదుపుగా ఇంటి బాధ్యతల్ని తను నెరవేర్చింది. కాబట్టే నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకోగలిగాను అని నేను పదే పదిసార్లు అనుకుంటాను.

మా పిల్లలకి వయ్ససులో నాలుగు అయిదు సంవత్సరాల తేడా ఉండటం వల్ల రిటైర్‌మెంట్ అయ్యేసరికి కేవలం మా పెద్ద అబ్బాయి సురేష్‌కి మాత్రమే పెళ్ళి చేయగలిగాను. మరోసారి చెప్తున్నాను వచ్చిన కోడలు సుగుణ పేరుకు తగ్గట్టు సుగుణాల రాశి. చాలా మంచి అమ్మాయి. పెళ్ళయి మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఎటువంటి అరమరికలు లేకుండా మా ఉమ్మడి కుటుంబంలో తనూ ఓ సభ్యురాలిగా చక్కగా ఇమిడిపోయింది.

ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. పెళ్ళయిన మరుసటి రోజే వేరే కాపురం కోసం వెంపర్లాడే నేటి తరం అమ్మాయిల్లా కాకుండా మా ఉమ్మడి కుటుంబంలో సుగుణ బాగా కలిసిపోయిందని నేను అనుకుంటాను.

రిటైర్ అయిన కొంతమంది మనస్సులో ఓ దురభిప్రాయం ఉంది. రిటైర్ అయిన తరువాత వాళ్ళకి ఇంటిలో అంత విలువ, ప్రాముఖ్యత ఇయ్యరని; తమ మాటల్ని, సలహాలు ఎవ్వరూ పట్టించుకోరని; తమ సంప్రదింపులు ఎవ్వరికీ అక్కర్లేదని; తమ పెద్దరికాన్ని కుటుంబ సభ్యులు ఖాతరు చెయ్యరని; తమని కూరలో కరివేపాకులా తీసిపారేస్తారని.

అయితే నాకు మాత్రం మా ఇంట్లో అటువంటి సమస్య ఎదుపడలేదు. ఒకవేళ ఎదురయినా దానిని లెక్కలోకి తీసుకునేటంతటిది కాదు. మా కుటుంబ సభ్యులకు నా మాటలూ, సలహాలు, వాళ్ళకి నచ్చకపోయినా ఎదురు మాత్రం చెప్పరు. వాళ్ళకి ఇష్టమయితే వాటిని పాటిస్తారు. ఇష్టం లేకపోతే మౌనంగా ఉండిపోతారే తప్ప ఎదురు చెప్పరు. అందుకే మా ఇంట్లో నాకు కాస్తో కూస్తో విలువ ఉందని నేను అనుకుంటాను.

మనకి విలువ ఇస్తారని కుటుంబ సభ్యుల మీద మన పెత్తనం చెలాయించకూడదు. అలా చేస్తే మనకున్న విలువపోతుంది. అందుకే ఎవరి ఆలోచన్లు వాళ్లవి, ఎవరి భావాలు వాళ్ళవి. అని సరిపెట్టుకుంటాను.

అందుకే మా పెద్దబ్బాయి సురేష్ అర్ధరాత్రి వరకు ఆఫీసు వర్క్ చేస్తుంటే ‘ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుంది’ అని చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయాను. ఎందుకంటే వాడికీ తెలుసు మనిషికి నిద్ర అవసరం గురించి. అయితే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఇలా, ఆఫీసు వర్కు చేయవల్సి వస్తోంది సురేష్‍కి.

వాడు పడుకునే వరకు సుగుణ కూడా మెలుకువగా ఉంటుంది. ఓ పర్యాయం నేను మా కోడలితో “సుగుణా! ఉదయాన్నే పిల్లల్ని స్కూలుకి తయారు చేసి పంపాలి, మీ అత్తగారికి పని పాట్లలో సహాయపడాలి. అందుకే నీవు తొందరగా నిద్రపో. మావాడు పడునే వరకు చూడకు” అని చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను. ఎందుకంటే అది వాళ్ళ జీవితం. వాళ్ళ జీవితాన్ని శాసించే అధికారం మనకి లేదు.

మరి మా అమ్మాయి సరస్వతి నిజంగా పేరుకు తగ్గట్టు చదువుల సరస్వతే. పట్టుదలకి మారు పేరు. పట్టుదలకి తన శ్రమని తెలివితేటల్ని జోడించి పి.జి. చేసింది. దాని ఆలోచనలే వేరు. పెళ్ళయ్యాక పైసా పైసాకి మొగుడు మీద ఆధారపడకుండా తనకో సంపాదన ఉండాలి. తన చుదువును సార్థకం చేసుకోవాలి అనేదే సరస్వతి ఆలోచన, అందుకే సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. అందుకే అర్ధరాత్రి అయినా సరస్వతి గదిలో నుండి లైటు వెలుతురు హాల్లో పడుతోంది.

‘పాతికేళ్ళు వచ్చినా మీ అమ్మాయికి పెళ్ళి చెయ్యరా’ అని బంధువులు పదే పదే అడుగుతారు. వారి మాటలకి నాకు వాళ్ళ మీద నాకు కోపం వచ్చేది. అది దాని జీవితం. ఆ జీవితాన్ని ఎంత తల్లిదండ్రులమయినా శాసించే అధికారం మనకి లేదు అని నా భావన. బంధువులు సరస్వతి పెళ్ళి గురించి అడుగుతున్నా ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయేవాడిని.

ఇకపోతే మా రెండో అబ్బాయి సుధీర్ విషయం తీసుకుంటే వాడు నేడు, రేపటి మనిషి. ఇంజనీరింగు చదువుతున్నాడు. అర్ధరాత్రి వరకూ టి.వి. లోను, లేకపోతే స్మార్ట్‌ఫోన్లలో క్రికెట్ మ్యాచ్‍లు చూడ్డం, స్నేహితులతో అర్ధరాత్రి వరకూ మాటలు, చాటింగ్లు, మెసేజ్‌లు పంపుకోడాలు ఇదీ వాడి వరస, హాబీ. ఈ మధ్య వాడికి చదువులో శ్రద్ధ తగ్గి తక్కువ మార్కులు కూడా వచ్చాయి. మందలించాను కూడా ఓ పర్యాయము.

అదే గట్టిగా మందలిస్తే ఇప్పటి కాలం పిల్లలు తీరే వేరు. ఆ వయస్సు వాళ్ళకి ఉద్రేకం ఎక్కువ, ఆలోచన తక్కువ. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. జరగకూడని అనర్థాలు కూడా దాని వల్ల జరుగుతాయి. పెద్దవాళ్ళను ఎదురించి మాట్లాడడం ఈ వయస్సు వాళ్ళ లక్షణం. వాళ్ళకి ఆత్మాభిమానం పాలు కూడా ఎక్కువే. ఓ పర్యాయం నేను సుధీర్‌ని మందలించినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర సన్నగా గొణుక్కున్నాడు. అంతే కాని నాకు ఎదురు చెప్పలేదు. గొణుగుడు నా చెవిలో కూడా పడింది.

“ఏంటమ్మా! రిటైర్ అయ్యాక నాన్నగారికి మరీ చాదస్తం ఎక్కువయిపోయింది. ఆయనంటే నిన్నటి తరం మనిషి. ఆయన ఆలోచనలు, ప్రవర్తన భావాలు, ఆ తరానికి తగ్గట్టే ఉంటాయి. నేను నేటి, రేపటి తరం మనిషిని. అందుకే మా ఇద్దరి ఆలోచన్లలో, మాటల్లో, చేతుల్లో ఎంతో తేడా ఉంటుంది. ఆయన భావాలకి అనుకూలంగా మెలగాలంటే ఎలా?” వాళ్ళ అమ్మ దగ్గర ఓ పర్యాయం అన్నాడు.

“మీ నాన్నగారు నీ మంచి కోరే చెప్తున్నారురా అబ్బాయ్! నీ భవిష్యత్తు బాగుండాలనేదే కదా మా పెద్దవాళ్ళ బాదంతా. మా తాపత్రయం. ఇంతదానికే నీవిలా పెద్దవాళ్ళని ఎదిరించడం నాకు నచ్చలేదు” ఇలా అంటూ సుమతి కూడా చిన్న కొడుకుని సున్నితంగా మందలించింది.

ఇదీ మా కుటుంబం తీరుతెన్నులు. ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డ నేను నా భాషలో విశ్లేషించకుంటున్నాను. కొందరికి నిద్ర పట్టదు. మరి కొందరికి అతి నిద్ర. ఆ నిద్రలోనే ఉలికిపాటు. అన్ని సమస్యలూ నిద్రలోనే ముడిపడి ఉంటాయి. ఇవన్నీ మానసిక సమస్యలు.

నేను ఓ పర్యాయం ఓ వ్యాసం చదివాను. నిద్ర లేకపోతే దాని చెడు ప్రభావం గుండె, మొదడు మీద పడుతుందట. టెక్నాలజీ పెరగడం వలన ఇప్పటి వరకూ పగలు పని చేసిన మనిషి విశ్రాంతి తీసుకోవల్సిన రాత్రి సమయంలో పని చేస్తున్నాడు. ఆన్‌లైన్ కబుర్లు, సెల్ ఫోను సంభాషణలు ఇవన్నీ రాత్రి సమయం లోనే. అంతే కాదు, భోజనాల దగ్గర నుండి, షాపింగ్‍ల వరకూ అన్ని యాంత్రిక యుగంలో రాత్రి సమయం లోనే. సినిమాలు, వినోదం రాత్రి సమయం లోనే. అర్ధరాత్రి దాటాకా నిద్రపోతారు. అదీ కొద్దిగంటల నిద్ర మాత్రమే.

తెల్లారగానే తిరిగి ఆదరా బాదరా జీవితం. తగినంత నిద్ర లేకపోతే మొదడు సరిగా పని చేయదు. మంచి చెడ్డలు, విచక్షణ సన్నగిల్లుతాయి. నిద్ర మనిషి జీవనానికి అవసరమయిన జీవన ప్రక్రియ. దానికి కేటాయించవల్సిన సమయాన్ని దానికే వదలి పెట్టాలి. లేకపోతే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.

రోడ్డు ప్రమాదాలకి, కారణం ఈ నిద్రలేమే. నిద్ర లేమి అల్జీమర్సుకి దారి తీస్తుంది. డిప్రెషన్‍కి దారి తీస్తుంది. నాకు నిద్ర పట్టడం లేదంటే వయస్సు ప్రభావం ఉంది.

“మీరు పడుకోరా ఏంటి? ఇలా అయితే ఆరోగ్యం చెడుతుంది” అప్పుడే నిద్ర నుండి మెలుకువ వచ్చిన సుమతి అంది.

ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డ నేను “పడుకుంటాను.. పడుకుంటాను” అంటూ నిద్రకు ఉపక్రమించాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here