అరుదైన నటవహ్ని- బల్‌రాజ్ సహ్ని – 6 జవాబ్

0
4

[dropcap]బ[/dropcap]ల్‌రాజ్ సహ్ని ఎంత మంచి నటుడో అంతే మంచి రచయిత మరియు వక్త కూడా. హిందీ, ఇంగ్లీషు, పంజాబీ భాషలపై ఆయనకు గట్టి పట్టు ఉంది. మేధావులుగా పరిగణించబడే నటులలో బల్‌రాజ్ సహ్ని మొదటివారని ఆ సమయంలో సినిమా ప్రపంచంతో అనుబంధం ఉన్న వ్యక్తులు చెబుతారు. 1972లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరిగినప్పుడు బల్‌రాజ్ సహ్నిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. బల్‌రాజ్ అప్పుడు చేసిన ప్రసంగం JNU చరిత్రలోనే ఓ గొప్ప సందేశంగా ఇప్పటికీ ప్రస్తావిస్తారు. అందుకే 2007లో ఈ ప్రసంగాన్ని మళ్ళీ వెలికి తీసి JNU వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగింది. భారతీయ సినీనటులలో ఎవరికీ దక్కని గౌరవం ఇది.

1972లో JNUలో ప్రసంగానికి వెళుతూ యూనివర్సిటిలో బల్‌రాజ్ సహ్ని

తన ప్రసంగంలో, బల్‌రాజ్ సహ్ని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఈ సినిమా ప్రపంచంలో, నటుడి జీవితంలో అతివృష్టి లేదా అనావృష్టి లాంటి స్థితి ఉంటుంది. అతనికి చాలా పని వస్తుంది, లేదా అతని పోరాటం నిరంతరం కొనసాగుతుంది. పని రావడం ప్రారంభించిన తర్వాత, అతనికి బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధం తెగిపోతుంది. తన ప్రజా జీవితాన్ని వదులుకోవడమే కాదు, చాలా సందర్భాలలో అతని కుటుంబంతో వ్యక్తిగత జీవితాన్ని కూడా అతను కోల్పోతాడు. తన మేధో మరియు ఆధ్యాత్మిక అవసరాలను కూడా అతను విస్మరించవలసి ఉంటుంది” అన్నారు.

తన సినీ జీవితం గురించి చెబుతూ సహ్ని ఇలా అన్నారు, “నేను గత ఇరవై ఐదేళ్లలో 125 సినిమాలకు పనిచేశాను. ఈ కాలంలో, ఏ యూరోపియన్ లేదా అమెరికన్ నటుడు 35 చిత్రాలను మించి నటించలేదు. ఈ సెల్యులాయిడ్ స్ట్రిప్ వెనుక నా జీవితంలో చాలా భాగం గడిచిపోయిందని మీరు దీన్ని బట్టి ఊహించవచ్చు. ఈ సమయంలో నేను ఎన్ని పుస్తకాలో చదివి ఉండవచ్చు. కానీ నేను ఏమీ చదవలేకపోయాను. ఎన్ని వందల ఫంక్షన్లను నేను అటెండ్ అయ్యానో తెలియదు కానీ అవన్నీ నా కళ్ల ముందే గడిచిపోయాయి. కొన్నిసార్లు నేను ఎంత మిస్ అయ్యానో అనిపిస్తుంది. ఈ 125 చిత్రాలలో గొప్పవి ఎన్ని ఉన్నాయి, అందులో చెప్పుకోదగ్గ విషయం ఏముంది అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నా నిరుత్సాహం మరింత పెరుగుతుంది. బహుశా కొన్ని చిత్రాలను మాత్రమే, నేను నా చేతి వేళ్లపై లెక్కించి ఇవి గొప్పవి అని చెప్పగలను. మిగతా చిత్రాలన్నిచరిత్రలో మరుగునపడిపోయేవే.”

“స్వాతంత్ర్యం తరువాత, భారతదేశం కళలోని ప్రతి శాఖలో అద్భుతమైన పునరుద్ధరణను సాధించింది. ఫిలిం మేకింగ్ రంగంలో సత్యజిత్ రే, బిమల్ రాయ్ వంటి పేర్లు అంతర్జాతీయ స్థాయిలో నిలిచాయి. మా కళాకారులు, కెమెరామెన్లు మరియు సాంకేతిక నిపుణులు ప్రపంచంలో ఎక్కడైనా అత్యుత్తమమైన వారితో పోల్చబడతారు. స్వాతంత్య్రానికి ముందు మనం పేరుకు తగ్గ పది, పదిహేను సినిమాలు తీయలేదు. నేడు మనది ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలను నిర్మిస్తున్న దేశం. మన సినిమాలకు మన దేశంలోనే కాకుండా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సోవియట్ యూనియన్ తూర్పు రిపబ్లిక్‌లలో కూడా ప్రజల ఆదరణ ఎక్కువగా ఉంది. ఈజిప్ట్, మరియు ఇతర అరబ్ దేశాలు, మరియు అనేక ఆఫ్రికన్ దేశాలు మన సినిమాను ఆదరిస్తున్నారు. మేము ఈ రంగంలో హాలీవుడ్ గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేసాము అని నిస్సందేహంగా చెప్పగలను.”

“సామాజిక బాధ్యత విషయంలో కూడా కొన్ని పాశ్చాత్య దేశాలు దిగజారిన స్థాయికి మన భారతీయ సినిమాలు ఇంకా దిగజారలేదు. భారతదేశంలోని చలనచిత్ర నిర్మాత తన అమెరికన్ సహచరుడులా అర్ధిక లాభం కోసం సెక్స్ మరియు నేరాలను సినిమాకు ఉపయోగించుకోలేదు. అలాంటి చిత్రాల వల్లే ఆ దేశం తీవ్రమైన సామాజిక సమస్యను ఎదుర్కుంటుంది. ఇంత నిబద్దత చూపుతూ కూడా మన సినీ ప్రరిశ్రమ ఒక భారీ తప్పుతో నవ్వులపాలవుతుంది. అది అనుకరణ. పాశ్చాత్య సినిమా ఫార్ములాలను కాపీ చేసే మనస్తత్వం. ఈ ఒక్క తప్పు మనల్ని ప్రతిచోటా మేధావుల ముందు నవ్వులపాలు చేస్తుంది. అరువు తెచ్చుకున్న, కాలం చెల్లిన ఫార్ములాల ప్రకారం మనం ఇప్పుడు సినిమాలు తీస్తున్నాం. మన మాతృ దేశం యొక్క వాస్తవిక పరిస్థితులపై పట్టు సాధించడానికి, మన స్వంత మేధావి వర్గాన్ని ఒప్పించేలా, ఆ వాస్తవ జీవితాన్ని తెరపై ప్రదర్శించే ధైర్యం మనకు లేదు. నేను ఈ విషయాన్ని మామూలు హిందీ లేదా తమిళ బాక్సాఫీస్ చిత్రాల గురించి మాత్రమే చెప్పటం లేదు. మన బెంగాలీ, హిందీ లేదా మలయాళ ప్రగతిశీల మరియు ప్రయోగాత్మక చిత్రాలపై కూడా ఈ విషయంగా నేను ఫిర్యాదు చేస్తున్నాను. ఈ విషయంలో మనం వెనుకబడి ఉన్నామన్నదే నా అభిప్రాయం. సత్యజిత్‌ రే, మృణాల్‌ సేన్‌, సుఖ్‌దేవ్‌, బసు భట్టాచార్జీ లేదా రాజిందర్‌ సింగ్‌ బేడీల పనిని మెచ్చుకోవడంలో నేను ఎప్పుడూ వెనుకంజ వేయను. వారు తమ స్వీయ అర్హతతోనే గౌరవించబడ్డారని నాకు తెలుసు; కానీ వారి పై కూడా, ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్, పోలాండ్ లేదా చెకోస్లోవేకియాలోని ఫ్యాషన్ గాలులు ప్రభావం చూపుతున్నాయన్నది వాస్తవం. వారు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కాని ఆ దారిలో వారు మొదటి వారయి ఉండటం లేదు. ఎవరో నడిచిన బాటలో వీరు నడుస్తున్నారు తప్ప కొత్త బాటని నిర్మించి మార్గనిర్దేశం చేసే వారుగా వీరు సైతం ఉండలేకపోతున్నారు.”

పై వాక్యలన్నీ చదువుతుంటే బల్‌రాజ్ సహ్ని దూరదృష్టి నిశిత పరిశీలిన అర్థం అవుతుంది. వారు సినిమాను అంగీకరించి, పోషించిన కొన్ని పాత్రలను గమనిస్తే, అవి ఆర్థికంగా అంతగా సక్సెస్ కావని తెలిసినా ఆ పాత్రలను పోషించడం తన భాద్యతగా అనిపించి చేశారనిపిస్తుంది. అందుకే చాలా పాత్రల సబ్జెక్ట్ వీరు మొదటివారిగా స్వీకరించారు. అంతకు ముందు ఎవరూ చేయడానికి సాహసం చూపని పాత్రలను వీరు కోరి స్వీకరించి తన కర్తవ్యంగా వారు పోషించారు.

అలాంటి ఓ పాత్ర 1955లో ‘జవాబ్’ అన్న సినిమాలో మనం చూడవచ్చు. ఈ సినిమాను మరణించిన పీ.సీ బావువాకు అంకితం ఇవ్వడం జరిగింది. భారతీయ సినిమాలో వాస్తవిక దృక్పథం దిశగా ఆయన పని చేశారని చెబుతారు. 1931లో బారువా తీసిన “అపరాధీ” అన్న సినిమా ఆర్టిఫిషియల్ లైట్ల మధ్య మన దేశంలో నిర్మించిన మొదటి సినిమా అని చెబుతారు. ‘దేవదాస్’ సినిమాతో ఈయన గొప్ప దర్శకులుగా ఆ పాత్ర పోషించిన ‘సైగల్’ గొప్ప నటుడిగా సినీ చరిత్రలోనే నిలిచిపోయారు. ఇప్పటికీ దేవదాసుగా సైగల్‌కే నూరు శాతం మర్కులు ఇచ్చే సినీ విశ్లేషకులు ఉన్నారు. బిమల్ రాయ్ బారువా దగ్గరే కెమెరా మెళుకవలు నేర్చుకున్నారు.

జవాబ్ సినిమాకు ఇస్మైల్ మెమొన్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కథను కూడా వీరే అందించారని చెబుతారు. బల్‌రాజ్ సహ్ని, అచలా సచదేవ్, నాసిర్ ఖాన్, గీతాబాలీలు నటించారు. నౌషాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తలత్ మెహమూద్, ఆశా భోస్లే ప్లేబాక్ అందించారు. ఒకే ఒక పాత రఫీ పాడారు. అది ‘ఆజ్ గమ్ కల్ ఖుషీ’. ఇది రఫీ పాడిన గొప్ప పాటలలో ఒకటిగా నిలిచిపోయింది.

ఇందులో బల్‌రాజ్ సహ్ని దయాల్ అనే ఒక రిక్షా కార్మికుడి పాత్రను పోషించారు. బండి మీద సరుకులు వేసుకుని లాక్కుంటూ ఒక చోటి నుండి మరో చోటకు బండిపి చేర్చడం అతని వృత్తి. దానితోనే ఇల్లు గడవాలి. అతనికి ఒక్కడే కొడుకు అమర్. అమర్‌ని చదివించాలని అతనికి కోరిక. దానికోసం విపరీతంగా కష్టపడతాడు. చదువుతోనే మనిషి జీవితం అర్థవంతం అవుతుందని నమ్ముతాడు దయాల్. ఇంటికి వచ్చిన డబ్బు మొత్తం కొడుకు చదువుకు వెళ్ళిపోతుంటే సగం రోజులు ముగ్గురు పస్తులుండడం దయాల్ భార్యకు నచ్చదు. అంత పేదరికంలో కూడా కొడుకుకి ఏ లోటు రాకుండా, చదువు ఆగకుండా ఉండడం కోసం తన కండలు కరిగిస్తుంటాడు దయాల్. అమర్ కూడా బాగ చదువుతాడు. తన చిన్న నాటి స్నేహితురాలు గీతను అతను ప్రేమిస్తాడు.

కాని పేదవానికి ఒక ఆశయం ఉండి దాన్ని నెరవేర్చుకోవాలంటే ఎన్నో కష్టాలను అధిగమించాలో ఈ సినిమాలో సున్నితంగా చూపిస్తారు. కొన్నిసార్లు ప్రాధ్యాన్యతల నడుమ కొన్ని తప్పులు కూడా జరిగిపోతూ ఉంటాయి. అమర్ లాయర్ అయే క్రమంలో ఆ ఖర్చు భరించలేని స్థితిలో దయాల్ ఉంటే ఓ ధనికుడు తన కూతురుని అమర్ వివాహం చేసుకుంటే ఆ ఖర్చు తాను పెట్టుకుంటానంటాడు. కొడుకు చదువు తప్ప మరో కోరిక లేని దయాల్ దీనికి అంగీకరిస్తాడు. అమర్ గీతల మధ్య ప్రేమ విషయం అతనికి తెలిసినా కొడుకు చదువు, డిగ్రీ కన్నా మరొకటి ముఖ్యం అని అతనికి అనిపించదు. అందుకే గీతను కూడా అమర్ జీవితం నుండి తప్పుకొమ్మని కోరతాడు. దానికి గీత అంగీకరిస్తుంది కూడా. కాని వాడలోని అందరూ ఒకటై డబ్బు సమకూర్చి అమర్‌ని ఆదుకుంటారు. దీనితో సమస్య పరిష్కారమవుతుంది.

సినిమాలో కథ కన్నా పేదరికంలో మనిషి ఎదురుగా నిలిచే సవాళ్లను దర్శకులు చూపించే ప్రయత్నం చేశారు. డబ్బు కూడబెట్టాలంటే ఎన్నో కోరికలను, అవసరాలను పేదవాడు వెనకకు నెట్టేసుకోవడం, దానికి తనను తాను నిరంతరం సిద్ధం చేసుకోవడం, ప్రలోభాల నుండి దూరంగా తనను తాను కాపాడుకుంటూ నడుచుకోవడం, ఇవన్నీ పేదవానికి అగ్నిపరీక్షలే. అందుకే పేదరికంలోని చిన్న విజయం వెనుక కూడా అమితమైన త్యాగం ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. ఇది అర్థం చేసుకుని ఒక పేదవాడు మరొకరికి తోడుగా నిలవడం తప్ప మరో దారి ఉండదు. అయితే ఆ స్థితిలో విజయం సాధించిన వ్యక్తి కూడా తన సమూహం కోసం నిలబడినప్పుడే ఆ పేదవారికి నిజమైన విజయం లభించినట్లు అని చెప్పడం కూడా ఈ సినిమా ఉద్దేశం.

సినిమాలో బల్‌రాజ్ పాత్రను గమనించాలి. చదువు విలువ తెలియని భార్యకు నచ్చచెప్పుకుంటూ కొడుకుని తల్లిగా లాలిస్తూ బిడ్డ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే ఓ శ్రమజీవి పాత్రలో ఆయన సమర్థవంతంగా దిగిపోయారు. బిడ్డను వడిలోకి తీసుకుని జోలపాడి లాలిస్తూ, పేదరికం నుండి, కష్టాలనుండి ఆ బిడ్డను రక్షించడానికి నిరంతరం తన చేయి అడ్డుపెట్టే ఓ తండ్రి కనిపిస్తాడు అతనిలో. ‘సోజా తో సోజా’ అనే పాటలో బల్‌రాజ్ మొహంపై పలికే భావలలో ఎక్కడా నాటకీయత ఉండదు. తాను రోజూ నడిపే తోపుడుబండిపై దుప్పటి కప్పి దానిపై బిడ్డను పడుకోబెట్టి జోల పాడే ఆ తండ్రిలో ఉన్నంతలో గొప్పగా బిడ్డను పెంచుకోవాలనే ఓ పేద తండ్రి హృదయం కనిపిస్తుంది.

ఈ సినిమాలో చూపించే తోపుడు బండ్లు నా చిన్నతనంలో ఉండేవి. వాటిని పరుగుబెడుతూ నడిపించుకుంటూ వెళ్ళే కార్మికవర్గాన్ని చూసినందువలన ఈ సినిమాలో బల్‌రాజ్ పోషించిన ఆ కార్మికుని పాత్రలో వాస్తవికత ఆ నాటి రోజులను గుర్తుకు తెస్తుంది. ఆయన నిజంగా బండిని లాగిన తీరు గమనిస్తే అయన కొంత కాలం ఆ పని చేసారేమో అనిపిస్తుంది కూడా.

చదువు అవసరం లేదంటూ తన బిడ్డని గాలికి వదిలేసి అతను చెడుదారిలో తిరుగుతుంటే నిస్సహాయంగా చూసే మరో తండ్రి కూడా ఈ సినిమాలో కనిపిస్తాడు. చివరికి చదువు విలువ తెలుసుకుని దయాల్ లాగా ముందు చూపుతో బిడ్డని పెంచుకోలేనందుకు బాధపడతాడు. బిడ్డ చదువు కోసం శక్తికి మించి కష్టపడే దయాల్ పాత్రలో భవిష్యత్తు పట్ల అంతులేని నమ్మకం ఉంటుంది. అదే అతన్ని ఎన్నో కష్టాలను దాటుకునే శక్తిని ఇస్తుంది. జీవితం అంటే కష్టాలతో పోరాటమే కదా అని తేల్చిపడేసే దయాల్ వ్యక్తిత్వంలో శ్రమను నమ్ముకున్న ఓ సామాన్య కూలివాని ఆశ కనిపిస్తుంది. ‘ఆజ్ గమ్ కల్ ఖుషి హై యహీ జిందగీ సున్ లే ప్యారే, ఆద్మీ వో జో హిమ్మత్ న హారే’ అంటూ ఈ సందర్భంలో వచ్చే పాటలో బల్‌రాజ్ సహ్ని నటనను చూసి తీరవలసిందే. వంద మంది మధ్య కూడా మెరుస్తూ కనిపించే మన సినీ హీరోల స్క్రీన్ ప్రెజెన్స్‌కి అలవాటు పడి, తోపుడు బండ్ల కార్మికుల మధ్య బల్‌రాజ్ నడిచి వచ్చే సీన్‌లో అతన్ని వెతుక్కుంటారు ప్రేక్షకులు. అంటే ఆ పాత్ర కోసం అంతగా సామాన్యీకరించుకున్నారు బల్‌రాజ్ సహ్ని. అతన్ని ఆ తోపుడు బండ్ల వాళ్ళ మధ్య గుర్తుపట్టలేనంతగా ఆ పాత్రతో మమేకం అయిపోతారు ఆయన. ఖుమార్ బారాబాన్క్వి రాసిన ఈ గీతం, రఫీ గొంతులోంచి వస్తుంటే బల్‌రాజ్ సహ్ని నటన వాస్తవిక సినిమాను ప్రేమించిన వారికి గుర్తుండి పోతుంది. పైగా పైన పేర్కొన్న ప్రసంగంలో ఎటువంటి సినిమాను బల్‌రాజ్ సహ్ని ఆశించారో దానికి నిదర్శనంగా ఈ సీన్ నిలిచిపోతుంది.

ముక్రీ, జానీ వాకర్‌ల పాత్రలు కూడా గొప్పవే. చదువుకోకుండా చిల్లరగా తిరిగి పేదరికాన్ని ఒంకగా చూపించి చెడు వ్యసనాలను అలవాటు చేసుకునే యువకుని పాత్రలో జానీ వాకర్ కనిపిస్తే, ఈ రెండు వర్గపు ఆలోచనల మంచి చెడులను విశ్లేషిస్తూ కనిపిస్తారు ముక్రీ. కొడుకు తండ్రికి పనిలో సహాయం చేస్తానంటే, అతను చదువుకెక్కడ దూరం అవుతాడేమో అని తపించిపోతూ కొడుకు చేతికి పుస్తకం ఇస్తూ, నీ చేతిలో ఉండవలసింది పుస్తకమే అని ఆవేశంగా దయాల్ చెప్పే సీన్‌లో బల్రారాజ్ సహ్నిలా ఎవరూ నటించలేరేమో. బిడ్డ మొదటి సారి తాగి వచ్చినప్పుడు తన కలలు కళ్ల ముందే కూలిపోతున్నప్పుడు ఆ తండ్రి పడే వేదనను బల్‌రాజ్ ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్ళు చెమరుస్తాయి. ఒకే సీన్‌లో కోపం, ఆక్రోశం, ఓడిపోయిన నిస్సహాయత వీటన్నిటి మధ్య కొడుకుపై ప్రేమను బల్‌రాజ్ పలికించిన తీరును గమనిస్తే ఆయన నటనలోని గొప్పతనం అర్థం అవుతుంది. చచ్చి బతికిన కొడుకుని మళ్ళీ మామూలు మనిషిని చేసుకుని లాయర్‌గా అతని ప్రయాణంలో తోడు నిలిచిన అ ఆర్భకపు తండ్రిలో బాలివుడ్ హీరో కనిపించడు, ప్రతి పేద ఇంట్లో బిడ్డల భవిష్యత్తు కోసం పరితపిస్తున్న తల్లి తండ్రులు కనిపిస్తారు.

అమర్ పాత్ర పోషించిన నసీర్ ఖాన్ – దిలీప్ కుమార్ సోదరులు. గీతగా గీతా బాలి తన అమాకత్వపు నటనతో ఆకట్టుకుంటుంది. చదువు విలువ తెలియని అమాయకురాలు, కడుపు నింపుకోవడమే ఓ గొప్ప విజయం అని, అది తప్ప అంతకు మించి భవిష్యత్తు చూడలేని ఓ పేద తల్లిగా అచలా సచదేవ్ నటన కూడా బావుంటుంది.

మళ్ళీ 1972లో JNU లో బల్‌రాజ్ ఇచ్చిన ప్రసంగం దగ్గరకు వద్దాం. సోషలిజం మన దేశంలో రావాలని కోరుకుంటూ శ్రమకు నైపుణ్యానికి మెప్పుదల ఉండాలని, అటువంటి రోజులలోకి మన దేశం నడవాలనే ఓ అందమైన తన కలను ప్రస్తవిస్తూ బల్‌రాజ్ అప్పుడు విద్యార్థులతో ఇలా అన్నారు “మన దేశంలో సోషలిజం రావాలంటే, ముందుగా మన ప్రజల మనస్సుల నుండి డబ్బు, పదవి మరియు అధికారం పై భయాన్ని తరిమికొట్టాలి. ఆ దిశగా మనం ఏమైనా చేస్తున్నామా? నేటి మన సమాజంలో ఎవరిని ఎక్కువగా గౌరవిస్తున్నారు? ప్రతిభ ఉన్న వ్యక్తినా లేదా డబ్బు ఉన్న వ్యక్తినా? ఎవరిని ఎక్కువగా మెచ్చుకుంటున్నాం? ప్రతిభ ఉన్న వ్యక్తినా లేదా శక్తి ఉన్న వ్యక్తినా? మరి ఇటువంటి పరిస్థితులలో సోషలిజాన్ని సాధించగలం అని మనం ఆశించగలమా? సోషలిజం రావాలంటే ముందు సంపదలను ప్రేమించడం మానుకోవాలి. సంపదలు కలిగి ఉండటం గౌరవం కాదని అది అగౌరవమని అలోచించగలిగే వాతావరణాన్నిమనం సృష్టించగలగాలి. శారీరకమైనా, మానసికమైనా శ్రమకు అత్యున్నత గౌరవం ఇచ్చే వాతావరణాన్ని మనం సృష్టించాలి. ప్రతిభకు, నైపుణ్యానికి, కళకు మరియు ఆవిష్కరణకు గౌరవం పెరగాలి. దీనికి కొత్త ఆలోచనలను ఆహ్వానిస్తూ, పాత ఆలోచనా విధానాలను విస్మరించే ధైర్యం మన సొంతం అవాలి.”

ఈ భావాలని బల్‌రాజ్ జీవితాంతం నమ్మి ఆచరించారు కాబట్టే విభిన్నమైన పాత్రలను, అప్పటి సమాజానికి అవసరం అని భావించి స్వీకరించారు. ఒక కళాకారుడిగా సోషలిజాన్ని ప్రజలకు దగ్గర చేయాలని తపించారు. దాని కోసమే జీవించారు. నటుడిగా సినిమాలలో కనిపించారు. తాను నమ్మిన ఆదర్శాలను అనుగుణంగా జీవించిన నటులలో ముందు వరుసలో గర్వంగా నిలిచి ఉంటారు బల్‌రాజ్.

అదే ప్రసంగంలో “యూనివర్శిటీ అంటే మానవతావాదం. సహనం కోసం, రీజన్ కోసం, ఆలోచనల కోసం, సాహసం కోసం మరియు సత్యాన్వేషణ కోసం నిలిచి ఉండే ఓ ఆలయం అది. మానవ జాతి ఎప్పటికీ ఉన్నతమైన లక్ష్యాల వైపు సాగిపోవడాన్ని సూచించే ప్రతీక యూనివర్సిటి. విశ్వవిద్యాలయాలు తమ విధులను తగినంతగా నిర్వర్తిస్తే, దేశానికి మరియు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది”.

తన సినిమాలు యూనివర్సిటీ పాఠాలకు నిదర్శనాలుగా ఉండాలనే కోరిక కూడా ఆయనకు ఉండేది. అందుకే సామాజిక స్పృహ కోసం ఉపయోగపడే పాత్రలని ఎన్నుకుని వేసారాయన. వాటి వలన మాస్ అప్పీల్ రాదని తెలిసినా, హీరోయిక్ చరిష్మతో తనను జనం చూడరని అర్థం అయినా, జీవితాన్ని స్క్రీన్ పై చూపగలిగే అవకాశంగా ఆయన భావించి ఆ పాత్రలకు న్యాయం చేశారు. అందుకే బాలీవుడ్‌లో నటించిన నిజమైన హీరోగా, నిజాయితీగల నటుడిగా బల్‌రాజ్ సహ్నిని మన తరం గుర్తించాలి. దీనికి నిదర్శనంగా ‘జవాబ్’ సినిమా నిలుస్తుంది. ఇది కమర్షియల్ హిట్ కాదు. కాని కామర్స్ కన్నా జీవితంలో మేనర్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారిని అలరించే సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here