ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-34

0
3

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

అహం చ రఘువంశశ్చ లక్ష్మణశ్చ మహాబలః।

వైదేహ్యా దర్శనేనాద్య ధర్మతః పరిరక్షితాః॥

ఇదం తు మమ దీనస్య మనో భూయః ప్రకర్షతి।

యదిహాస్య ప్రియాఖ్యాతుః న కుర్మి సదృశం ప్రియమ్॥

ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనూమతః।

మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః॥

(యుద్ధ కాండ, 1. 11, 12, 13)

శ్రీరాముడు: వైదేహి జాడ తెలియుటచే నేడు నేనును, లక్ష్మణుడును, రఘువంశము, అంతే గాదు మనమందరమూ ధర్మమార్గమున రక్షింపబడితిమి.

సీతాదేవి కుశల వార్తలను దెలిపి, మహోపకారమొనర్చిన ఈ మారుతికి తగిన ప్రత్యుపకారమును చేయలేక దీనుడనైయున్నను. అందువలన నా మనస్సు మిక్కిలి పరితపించుచున్నది.

ఈ సందర్భమున మహాత్ముడైన ఈ హనుమంతునకు గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఇయ్యగలను. ఇదియే అతనికి పరమ సుఖానుభవములను కల్పింపగలదు.

ప్రస్తుతము నేను ఈయగల్గిన నా సర్వస్వమిదియే!

ఇక్కడ సుందరకాండ లోని ఒక శ్లోకం గుర్తుకు వస్తుంది. ఆంజనేయుడు సీతాదేవికి శ్రీరాముని గురించి చెబుతూ ‘రక్షితా స్వస్య ధర్మస్య..’ అంటూ అందరి ధర్మాన్నీ కాపాడుకుంటూ వస్తున్న ‘పరంతపుడు’ అన్నాడు. రఘువంశము యావత్తు ధర్మమార్గమున రక్షింపబడినది అంటున్నాడు. ఇక్కడ శ్రీరాముడు, ఈ ‘ధర్మమ’నేది అంత గొప్పది.

అందుచేత ఆ ఇరువురి ఆలింగనము ‘ధర్మానుబంధమైనది!’

శ్లో:

కిం త్వం సంతప్యసే వీర! యథాన్యః ప్రాకృతస్తథా।

మైవం భూస్త్యజ సంతాపం కృతఘ్న ఇవసౌహృదమ్॥

(యుద్ధ కాండ, 2. 2)

సుగ్రీవుడు శ్రీరామునితో: ఓ మహావీరా! ఒక సామాన్య పామరుని వలె ఇలా విలపించుట తగదు. కృతఘ్నుడు తన మిత్రుని విడిచిపెట్టినట్లు నీవు ఈ శోకమును పరిత్యజించుము.

శ్లో:

యత్తు కార్యం మనుష్యేణ శౌండీర్యమ్ అవలంబతా।

అస్మిన్ కాలే మహాప్రాజ్ఞ! సత్త్వమాతిష్ఠ తేజసా॥

(యుద్ధ కాండ, 2. 16)

పురుషుడు తన శౌర్య పరాక్రమములను ప్రకటించుటయే కర్తవ్యము. కనుక ఓ మహాప్రాజ్ఞా! ఈ సమయమున నీ శక్తి సామర్థ్యములను, ధైర్య సాహసములను కూడగట్టుకొనుము!

శ్లో:

బలైకదేశః క్షపితో రాక్షసానాం మహాత్మనామ్।

(యుద్ధ కాండ, 3. 30)

ఆంజనేయుడు: రాక్షస యోధుల యొక్క సైన్యంలో నాల్గవ భాగమును నాశనమొనర్చితిని!

శ్లో:

ఉత్తరా ఫల్గునీ హ్యద్య శ్వస్తు హస్తేన యోక్ష్యతే।

అభిప్రాయామ సుగ్రీవ సర్వానీక సమావృతాః॥

నిమిత్తాని చ ధన్యాని యాని ప్రాదుర్భవంతి చ।

నిహత్య రావణం సీతామ్ అనయిష్యామి జానకీమ్॥

ఉపరిష్టాద్ధి నయనం స్ఫురమాణమిదం మమ।

విజయం సమనుప్రాప్తం శంసతీవ మనోరథమ్॥

(యుద్ధ కాండ, 4. 6, 7, 8)

శ్రీరాముడు: ఓ సుగ్రీవా! నేడు ‘ఉత్తర ఫల్గునీ’ నక్షత్రం. రేపు ‘హస్త’. ఇవి మన ప్రయాణమునకు తగిన రోజులు. కనుక సైన్యమును వెంట నిడుకుని బయలుదేరుదము. దానికి తోడు అన్నియు శుభ శకునములే కనిపిస్తున్నాయి. ఇక రావణుని హతమార్చి సీతాదేవిని తీసుకుని వద్దాము.

అంతే గాక నా కుడి కన్ను అదురుచున్నది. ఈ శకునము మన సంకల్ప సిద్ధికి, విజయమునకు సూచకము.

..కొందరు రామాయణంలో లేని ఉదంతాన్ని చెబుతూ యుద్ధానికి శ్రీరాముడు రావణుని వద్ద ముహూర్తం అడిగాడని చెబుతాడు. రావణుడు ముహూర్తం నిర్ణయించి గెలుపు నీదేనని కూడా చెప్పాడుట! ఈ పై శ్లోకాలను చదువుకుంటే ఈ పిచ్చి మాటలు ఎంత హాస్యాస్పదమో అర్థమవుతుంది!

శ్లో:

రామస్య శాసనం జ్ఞాత్వా భీమకోపస్య భీతవత్।

వర్జయన్ నగరాభ్యాశాన్ తథా జనపదానపి॥

(యుద్ధ కాండ, 4. 39)

శ్రీరాముడు: ‘మనము వెళ్ళునప్పుడు సమీపంలో నగరములు గాని, జనపదములు గాని ఉన్నచో వాటిలో ప్రవేశింపరాదు’ అనునది శ్రీరాముని తిరుగులేని ఆజ్ఞ.

శ్లో:

త్రిశంకుర్విమలో భాతి రాజర్షిః సపురోహితః।

పితామహవరోస్మాకమ్ ఇక్ష్వాకూణాం మహాత్మనామ్॥

విమలే చ ప్రకాశ్యతే విశాఖే నిరుపద్రవే।

నక్షత్ర వరమస్మాకమ్ ఇక్ష్వాకూణాం మహాత్మనామ్॥

నైరృతం నైరృతానాం చ నక్షత్రమ్ అభిపీడ్యతే।

మూలో మూలవతా స్పృష్టో ధూప్యతే ధూమకేతునా॥

సర్వం చైతద్వినాశాయ రాక్షసానామ్ ఉపస్థితమ్।

కాలే కాలగృహీతానామ్ నక్షత్ర గ్రహపీడితమ్॥

(యుద్ధ కాండ, 4. 50, 51, 52, 53)

అంగదుని భుజములపై కూర్చున్న లక్ష్మణుడు (యుద్ధానికి అందరూ బయలుదేరారు) శ్రీరామునితో:

మన ఇక్ష్వాకు వంశములోని మహాపురుషులలో శ్రేష్ఠుడు, రాజర్షి అయిన త్రిశంకువు తన పురోహితునితో గూడి విరాజిల్లుతున్నాడు. ఇక్ష్వాకు వంశజులకు శుభ సూచకమైన విశాఖ నక్షత్ర ద్వయము క్రూర గ్రహములు లేక నిర్మలంగా ప్రకాశిస్తున్నది.

రాక్షసులకు మూలా నక్షత్రం మౌలికమైనది. దానిని ధూమకేతువు తోక స్పృశించుచుండటం చేత ఆ నక్షత్రం మిక్కిలి పీడించబడుతున్నది. ఇది రాక్షసులకు అశుభ సూచకం. ఇదంతా రాక్షసుల వినాశనానికే దారి తీయుచున్నది. ఆయువు మూడిన వారి నక్షత్రం గ్రహబాధలకు లోనగును!

..ఈ మాట వలన మూలా నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకు వివాహాలు జరుగటం కష్టమైనది! 27 నక్షత్ర మండలములలో రాక్షసులకు కేటాయించిన నక్షత్రం అన్న మాత్రాన పూర్తిగా అది చెడ్డది అనుకోవటం పొరపాటు. మూలా నక్షత్రంలో సరస్వతీ పూజతో నవరాత్రులలో మనం పూజా విధానం ప్రారంభిస్తాం. రాక్షసులలో కూడా వేదాధ్యయనం చేసేవారున్నారని రామాయణంలోనే మనం చూసాం. రాక్షసులందరూ ‘రాక్షసులు’ కారు!

శ్లో:

అప్రమత్తం కథం తం తు విజిగీషుం బలేస్థితమ్।

జితరోషం దురాధర్షతం ప్రధర్షయితు మిచ్ఛథ॥

త్వజస్వ కోపం సుఖధర్మనాశనం

భజస్వ ధర్మం రతికీర్తివర్ధనమ్।

ప్రసీద జీవేమ సపుత్రబాంధవాః

ప్రదీయతాం దాశరథాయ మైథిలీ॥

(యుద్ధ కాండ, 9. 10, 23)

విభీషణుడు రావణునితో: శ్రీరాముడు కామక్రోధాదులను జయించినవాడు. అజేయుడు. అట్టివానిపై దండెత్తుటకు ఎందుకు తొందరపడుతున్నావు? క్రోధము ధర్మాచరణకు అవరోధకరము, సుఖమును దూరము చేయును. కనుక దానికి విడిచిపెట్టుము. ఆనందమును గూర్చుచు కీర్తి ప్రతిష్ఠలను పెంచునట్టి ధర్మమును అనుసరింపుము. శ్రీరామునకు సీతను ఇచ్చివేయుట ఎంతయో యుక్తము. ఆ విధంగా నీ కుమారులను, బంధువులను, మమ్ములను అనుగ్రహించి హాయిగా ఉండనిమ్ము!

శ్లో:

భయం న పశ్యామి కుతశ్చిదప్యహం

న రాఘవః ప్రాప్స్యతి జాతు మైథిలీమ్।

సురైః సహేంద్రరపి సంగతః కథం

మమాగ్రతః స్థాస్యతి లక్ష్మణాగ్రజః॥

(యుద్ధ కాండ, 10. 29)

రావణుడు: ఇప్పుడు నేను ఏ మాత్రము భయపడుట లేదు. ఎట్టి పరిస్థితులలోనూ శ్రీరాముడు మైథిలిని తీసుకోనిపోజాలడు. ఎందుకనగా ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినను అతడు నా ముందు నిలవజాలడు సుమా!

శ్లో:

హుతాగ్నేరర్చి సంకాశామ్ ఏనాం సౌరీమివ ప్రభామ్।

ఉన్నసం వదనం వల్గు విపులం చారులోచనమ్।

పశ్యంస్తధావశస్తస్యాః కామస్య వశమేయివాన్॥

సాతు సంవత్సరం కాలం మామయాచత భామినీ।

ప్రతీక్షమాణా భర్తారం రామమ్ ఆయతలోచనా॥

(యుద్ధ కాండ, 12. 16, 17, 19)

రావణుడు: అగ్ని జ్వాల వలె, సూర్యకాంతి వలె, వెలుగొందుచున్న విశాలాక్షి యగు ఆ సీతాదేవిని చూచి కామ పరవశుడనైనాను. ఆమె ముఖము ఉన్నతమైన నాశికతో, విశాలమై మనోహరముగా యున్న నేత్రములతో అందాలను చిందించుచున్నది. నేను క్రోధముతో నున్నను, మన్మథుడు నన్ను సమానముగానే పీడించుచున్నాడు.

ఆ సుందరి ఒక సంవత్సర కాలము నన్ను గడువు కోరినది. ప్రస్తుతము ఆ విశాలనేత్ర తన భర్తయగు శ్రీరాముని కొరకు నిరీక్షించుచున్నది.

..అరణ్యకాండ 56 వ సర్గ లో 24, 25 శ్లోకాలలో రావణుడు సీతాదేవికి 12 మాసముల గడువు ఇచ్చినట్లు మనం చూస్తాం. ఇక్కడ సభలో ఆమెయే ఏడాది గడువు కోరినట్లు సూటిగా అబద్ధం చెబుతున్నాడు. (మరి ఈ పాత్ర ఎందరికో ప్రతినాయకుడిగా గాక గొప్ప నాయకునిలా మారిన సందర్భాలను మనం చూస్తున్నాం కదా?! ఏమి సమాధానం చెబుతారు?)

శ్లో:

యదా తు రామస్య సలక్ష్మణస్య

ప్రసహ్య సీతా ఖలుసా ఇహాహృతా।

సకృత్ సమీక్ష్యైవ సునిశ్చితం తదా

భజేత చిత్తం యమునేవ యామునమ్॥

(యుద్ధ కాండ, 12. 28)

కుంభకర్ణుడు: ప్రభూ! రామలక్ష్మణులను వంచించి, వారి ఆశ్రమము నుండి సీతాదేవిని అపహరించుకొని వచ్చునప్పుడే మాతో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకొనిన బాగుండేది. యమునా నది భూమి మీదకి చేరక ముందే తన జన్మస్థానమైన యమునోత్రి యందు గల గుండమును నింపి ముందుకు సాగినట్లు సకాలమున నీవు మాతో చర్చించి యున్నచో సముచితముగా ఉండేది!

శ్లో:

త్వయేదం మహాదారబ్ధం కార్యమ్ అప్రతిచింతితమ్।

దిష్ట్యా త్వాం నావధీద్రామో విషమిశ్రమివామిషమ్॥

తస్మాత్ త్వయా సమారబ్ధం కర్మహ్య ప్రతిమం పరైః।

అహం సమీకరిష్యామి హత్వా శత్రూం స్తవానఘ।

అహముత్సాదయిష్యామి శత్రూం స్తవ నిశాపతే॥

(యుద్ధ కాండ, 12. 34, 35)

కుంభకర్ణుడు: అనాలోచితముగా నీవు చేసిన ఈ సీతాపహరణ కార్యము విషమిశ్రితమైన మాంసము వలె ప్రాణాపాయకరమైనది. ఇంతవరకును శ్రీరాముడు నిన్ను చంపకుండుట నీ అదృష్టముగా భావింపుము. నీవు శత్రువుల పట్ల వ్యవహరించిన తీరు అనాలోచితమైనది. ఐనను నీవు దుఃఖింపకుము. నేను వారిని సంహరించి దానిని సరి చేయగలను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here