కుసుమ వేదన-18

0
3

కుసుమ వేదన-18

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

పంచమాశ్వాసము – మొదటి భాగము

కుసుమ భర్తను వెదుకుట

కం.॥
నారద తుంబుర వరదా
కోరెద నీ చరణ కమల కోరికలలరన్
సారస నేత్రుడ శ్రీహరి
కారణ జన్ముని జేయుము; కరుణన్ గొనుమా. (350)

ఉ.॥
ఆ పెనుగాలి బాల్పడిన అంతట నావయు రాకపోవుటన్
ఓపను లేక బంధుగులు ఓర్పు నశించి పయోనిధంచునన్
రేపను మాపులంచు నడిరేయిని సైతము సైకతంబునే
ఓపిక తోడుతన్ పడియు ఓపిక లేకను నేడ్చుచుండగన్. (351)

తే.గీ.॥
అట్టి దుర్వార్త కుసుమాంబ అతివ జేర
మొదలు విరిగిన తాళమై మోకరిల్లె
యూపిరుండిన శవమోలె యువిద తీరు
చూపరుల కన్నులందున శోకమయ్యె. (352)

తే.గీ.॥
కడగి ఏవురు నెంతగు కాలమంత
వెదకి వేసాగి కన్నుల వేచి చూడ
ఒక్క శవమైన దొరకదే ఓయి దేవ
యనుచు వారాశ వీడక యట్టివేళ. (353)

తే.గీ.॥
ఉస్సురంచును గూల్బడె యుదధి చెంత
అంతనొక్కడు సాగరమందు చూడ
తేలి వచ్చెడి శవములు తేటము గను
కనుల కన్పట్టె యావేళ కడలి యందు. (354)

తే.గీ.॥
ఇదియె మనవారి మృతదేహాలు మృషయు గాదు
అదిగొ చూచుడి గాంచుడి అటను మీరు
నీటి పై భాగమందున మేటిగాను
వచ్చుచున్నదె గాంచుడి వైనముగను. (355)

తే.గీ.॥
దాని గాంచిన జనులెల్ల ధైర్యమంది
అదియె రూఢిగ మనవారి దైన యట్టి
మృత కళేబర సముదాయ మితిని మీరి
కబురు పెట్టగ యూరును గదలివచ్చె. (356)

కం.॥
జలముల దేలెడినన్నియు
ఇలకును జేరగను వచ్చె యింతటి తృటిలో
వలవల నేడ్చిరి జనములు
కలలను నీవింత నెపుడు గానమె ధరలో. (357)

వచనం॥
యా విధంబుగా సముద్రపు నీటిపై తేలియాడుచు ఒడ్డు చేరిన మృతదేహంబులను వారి వారి బంధుమిత్రులు గైకొని గృహంబుల కేగిరి. బాలరాజు పార్థివదేహంబు మాత్రము దరి జేరదయ్యె. బాలరాజు కుటుంబ సభ్యులు యాందోళన యధికమయ్యె. (358)

చం.॥
వెదకిరి నప్పురంబునను వుండెడి జాలర సంఘమందరున్
వెదకిరి బంధుమిత్ర పరివేష్టిత లోకము నంగుళంగుళం
బెదరికి సంద్రతీరమున ఎల్ల జనంబులు కండ్లు గాయలై
వెదకుచు నుండిరా శవము ఎక్కడ దొర్కునొ యంచు తీరమున్. (359)

ఉ.॥
రేయిబగళ్ళు యంచనక రెప్పలు సైతము నార్పకుండగన్
నాలుమగల్ల భేదమిడి నాకలి దప్పులు లెక్క చేయకన్
కాలము చెల్లిపోయినను కన్నుల కాయలు కాయుచుండగన్
తేలిటు రాకపోయె గద తీరము లోనికి ఎంత కాలమున్. (360)

తే.గీ.॥
తీరమందునె రేపవల్తీరు గాను
బసను యుండియు వెదకిరి బాధ తోడ
కండ్ల యందున వత్తులై కాపు గాసి
వెదకి చూసిన వారికి వెలితి దోచె. (361)

తే.గీ.॥
దొరకలేదింక శవమును; దొరలిపోయె
కనుక యెట్టుల జేతుము కరుణ లేని
కఠిన కాలము దొర్లెనే కన్నులార
నతని జూసెడి భాగ్యంబు నయ్యొ లేదె. (362)

ఆ.వె.॥
ఐన గాని వారు ఆశ జావను లేక
ఎంత వేచి జూడ ఏమి ఫలము
ఏమి దైవమంచు ఎన్నిసార్లును వేడ
గవ్వ యంత దయను గాన రాదె. (363)

చం.॥
దినములు దొర్లిపోయినవి దీనములయ్యె ముఖారవిందముల్
మనమున బాలరాజు స్మృతి మానక దల్చెనె గ్రామమంతటిన్
అనయము వాని దల్చుకుని ఆకలి దప్పుల మర్చియందరున్
కనమిక బాలరాజునని కన్నుల యొత్తులు దాల్చి జూడరే. (364)

సీ॥
కుసుమ కోమలి యైన గుసుమాంబ వదనంబు
యా వియోగంబుచే గందెనంత
దరహాస వదనయై దరిజేరు బడతుల
మరిమాట లాడెడు మానినపుడు
చెక్కిళ్ళు ఎరుపెక్కి జీరంచు జారగా
చేతన లేకుండ చెలగె నటుల
యాట పాటల తోటి యలరు నా గృహమంత
గాటి వైరాగ్యంబు గానుపించె

ఆ.వె.॥
గడగి యప్పుడంత కళను దప్పి కుసుమ
ఎటుల జేతు నేను ఎందుబోదు
పాలనంబు జేయు భక్త వరద రావె
వేడినాడ శరణు వేగరావె. (365)

సీ॥
దివిజులార మదిని దీననై బ్రార్థింప
మగడిని జూపరే మాన్యులార
కన్నె కోర్కెలు దీరు మున్నుగా నిట్టుల
కీడు సోకెను గదా కినుక నుంటి
వ్రాత వ్రాసెను గదా పాత యా పరమేష్టి
బెండ్లి జరిగినంత బీడ గలిగె
కనులార ననుగాంచి కరమెత్తి దీవించి
సరగున దయ చూపి శాంతి నిల్పి

ఆ.వె.॥
నాదుపతిని జూప న్యాయమౌ మీకును
దీన నైతి నిపుడు దిక్కు లేక
అంజలించెద మీకు ఆర్తి తోడుత నేడు
నన్ను కరుణ జూపుడన్ని గతుల. (366)

చం.॥
మగని విలాసమై ముదిత మౌనపు ముద్రల నావరించియున్
అగణిత రీతులన్ మదిని యాతని కైదల పోయుచుండగన్
పగతురటంచు జేయగను పాలికలైనటు వంటి వారికిన్
సగము శరీర మాక్రమిత సాధ్విలలామకు జాలి లేదొకో. (367)

సీ॥
చంద్రబింబమునకై చరియించు పక్షిలా
చూపులతో మగన్జూచుచుండె
అయ్యంబు జానన యా సతీశు బొడను
కన్నుల వత్తులన్ గలిగి వెదకె
ఏ దిక్కు నుండె నా యీశుండు దైవమా
యని వేడుచుండె నా యలతి కన్య
మగనికై యా జాణ మంటికి మింటికి
నేక ధారగ కండ్ల నీరు కారె

ఆ.వె.॥
అటుల కాంత యపుడు అలసిసొలసి పోయి
ఎంత వేడినాను ఏమి ఒరిగె
దైవ రూప నన్ను ధర్మంబుగా బ్రోవు
ఇంతి మనసులోన ఇటుల గుందె. (368)

ఊ.॥
చంచలమైన కన్నులను సైతము గాంచను ప్రాణవల్లభున్
ఎంచుచు భామినీ కుసుమ ఏరుల మాదిరి కండ్ల కారగన్
సంచిత రీతి పద సామ్యము గూర్చుచు నాధుకై మది
న్నెంచుకు జూడసాగె నిపుడే విధమైనను శాంతి కూరునే. (369)

కం.॥
పతి కోసము సతి కుసుమయు
మితి మీరిన యాస చేత మేధిని వెదుకన్
పతి తోడిదె లోకమనుచు
సతి యా వేళల రవి శశి సాక్షిగ బెట్టెన్. (370)

కం.॥
పదపదమని యడుగిడుచును
సదమలముగ పతి కొరకును సాగిలపడుచున్
కదలుచు శీఘ్రమె మగనికి
మది గుడి లోపలను గుందె మానిని యపుడున్. (371)

తరలం.॥
మదిని మిక్కిలి దుఃఖపూరితమైన బాధల దాల్చగా
పదము ముందుకు సాగదేమిటో పైనమైనను వింతగా
సదమలంబుగ సాటివారల సంజ్ఞ చేకొని సాగినన్
విధిని మీరుట ఎంత వారల వీలు గల్గునె భూమిలో. (372)

కం.॥
అడుగులు దడబడ కుసుమయు
పుడమిని వారధి తటమున పూనిక తోడన్
వెడలుచు మగని దృక్కుల
దడయక గాలించె నపుడు ధారుణి లోనన్. (373)

కం.॥
అట నా కొమరుడు పాలకు
పటు తరముగ నేడ్చుచుండ పడతియు నపుడున్
ఇట నా మగని శరీరము
ఎటు దాకెనొ తెలియకపుడు యింతియు నేడ్చెన్. (374)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here