[వర్తమాన ఆఫ్రికన్ కవయిత్రుల కవితలను పాఠకులకు పరిచయం చేసే క్రమంలో దక్షిణాఫ్రికా లోని కేప్‍టౌన్‍కి చెందిన Koleka Putuma రచించిన ‘Water’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. రేసిజంకు సంబంధించి ఇది చాలా గొప్ప కవిత. సముద్రం white skinned Americans కి, black skinned Africans కి ఒక్కటి కాదు అని సముద్రాన్ని చూసే రెండు దృక్పథాలను చెప్పారు కోలేక పుటుమా ఈ కవితలో.]
[dropcap]ప్ర[/dropcap]తీ కొత్త సంవత్సర పండగ రోజున.,
బీచ్‌కి వెళ్లే జ్ఞాపకాన్ని తరచూ నా బంధువులందరితో పంచుకుంటూ ఉంటాను.
వాళ్లంతా నా లానే నల్లని చర్మంతో పెరిగిన వాళ్ళు.
అప్పట్లో మా పెద్ద వాళ్ళు మమ్మల్ని
సముద్రపు లోతుల్లోకి వెళ్ళధ్ధు అని వారిస్తూ ఉండేవారు.
కేరింతలతో మా నల్లని లో చడ్డీలతో, సాఫ్రాయిట్ ప్లాస్టిక్ సంచులలోని
కొత్త అల్లికల బట్టలని పట్టుకుని ఉండే మమ్మల్ని
అలల మీదెక్కి కొట్టుకు పోకుండా వారించేవారు.
అలలు మా నల్లని ముద్దల్లాంటి దేహాలను ఎటో పడేస్తాయని..
మేము ఒడ్డున చేరే చెత్తలా కూడా మరిక తిరిగి రామన్న భయంతో..
ఇంకా.. సముద్రంలో విషం కలిసిందేమో అన్న అనుమానంతో మమ్మల్ని ఆపేస్తారు.
ఇక., నేను సముద్రాన్ని చూసినప్పుడల్లా మునిగిపోతున్నట్లు..
నేను నమ్మలేనంత మరుగుజ్జునై పోతున్నట్లు
ఎందుకు అనిపిస్తుంది అని ఎప్పుడూ ఆశ్చర్యమే నాకు!
“ఈ నల్ల వాళ్ళకి నీళ్ళంటే బోలెడంత భయం..
సముద్రాన్ని వారెప్పటికీ ఈదలేరని” తెల్లవాళ్లు వెక్కిరిస్తూ ఉంటారు.
మేము కూడా సముద్రం నుంచి బయటపడ్డప్పుడల్లా మొఖాలు తుడుచుకుంటూ..
అచ్చంగా ఎలాగైతే వాళ్ళు మమ్మల్ని కాపాడేవాళ్ళ లాగా
ఫోజులు కొడతారో లేదా మమ్మల్ని ఉత్సాహంగా తిరుగుబాటు చేస్తూ..
పై పైకి దూసుకు పోయేవాళ్ళలా అసహజ భంగిమలతో మమ్మల్ని చూస్తారో అని
మాలో మేమే వాళ్ళని వెక్కిరించుకుంటూ ఉంటాము.
కానీ ప్రతీసారి మా చర్మం సముద్రపు కిందికి వెళ్ళినప్పుడల్లా.,
రెల్లు గడ్డితో తేలుతున్న సముద్రం.,
మేమంతా ఒకప్పుడు శృంఖలాలతో బంధించబడ్డ బానిసలమని.. గ్రహింపు ఉన్నట్లే.,
అసహనమైన.. ఆగ్రహపు అలలతో ఒక్క సారిగా మమ్మల్ని తెల్లవాళ్ళ వ్యాపారానికి
రవాణా చేసిన ఓడలతో సహా ఒడ్డు మీదికి తుపుక్కున ఉమ్మేయాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది.
ఎంతలా అంటే బానిసలంతా కనపడనంత దూరం స్వేచ్ఛగా వెళ్లిపోయే దాకా,.
మునిగిన వాళ్ళు పైకి తేలిపోయే దాకా.. లేదా తిరిగి పూర్తిగా మునిగిపోయే దాకా!
మరి ఆ బానిసల కన్నీళ్లే కదా., సముద్రపు నీటిని ఉప్పగా మార్చాయి?
అందుకే సముద్రపు అడుక్కి పోయే కొద్దీ మా కళ్ళు మండిపోతుంటాయి.
ప్రతీ డిసెంబర్ నెల 16, 24,31 రోజుల్లో మా చర్మం
సముద్రాన్ని పచ్చి పుండులా గాయపరుస్తుంది.
మేము అమలు చేయలేనిదాన్ని., అంతం చేయలేనిదాన్ని..
గుర్తు చేస్తూ.. వాళ్ళు మమ్మల్ని వెటకరిస్తూ ఉంటారు.
మీకు.. సముద్రం అంటే ఉల్లాసపరిచే ఒక సర్ఫ్ బోర్డ్, పడవ లేదా
మీ తెల్లని చర్మాన్ని కాస్త గోధుమ రంగులోకి మార్చేది కావచ్చు.
మీ స్నానపు సూట్లలో., కళ్లధ్ధాలలో.. ఆ నీళ్ల కింద మీ తెల్లని చర్మాల్ని
చల్లపరుచుకుంటూ.. ఉల్లాసపరుచుకుంటూ ఉంటారు.
సముద్రం మీకో విహార స్థలం!
కానీ మేము నల్లవాళ్ళం సముద్రం దగ్గరికి
ఎందుకు వస్తామో తెలుసా.. బాప్టిజం తీసుకోడానికి.!
మేం ఇక్కడ మరో లోకంలో సంచలనం సృష్టించడానికి వస్తాము.
మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని మా జీవితాలను
పూర్వీకుల ఆత్మలతో ముడి వేయడానికి వస్తాము.
వాళ్ళతో మాకష్టాలు, బాధలూ.. వలపోసుకోవడానికి వస్తాం!
సముద్రం ఎన్నటికీ., మీకూ.. మాకూ ఒక్కటి కాదు.. కాలేదు!
నీళ్లంటే మాకున్న గౌరవాన్ని నువ్వు భయం అన్నావు.
మమ్మల్ని చంపి,. నీటిపై వ్యాపారం చేసే దుస్సాహసం చేస్తూ సిగ్గులేకుండా..
నీళ్ళంటే మాకు భయం అని ప్రచారం చేస్తావు!
వినండి., ఈ నేల నిజంగా మీదే అయితే.. వలసవాదులను
వాళ్ళ ఎముకలతో పునరుత్థానం చేసి వాళ్ళని దిక్సూచిలాగా వాడుకోండి.
ఆ తరువాత..
మా నల్లని ఆఫ్రికన్ దేహాలను మీ యాత్రా నిర్దేశితాలుగా
మీ ఆఫ్రికా యాత్రానుభవ తృప్తి కోసం వాడుకోండి.
ఏం.. మేం మీ కోసం నృత్యం చేసీ.. చేసీ అలిసిపోలేదా?
మీ ఇషారాలపైన గిరా గిరా తిరుగుతూ.. పాడుతూ వెర్రోళ్ళం కాలేదా?
ముద్దలు.. ముద్దలుగా నల్లని పదార్థం లాగా ఒక చోట
మీకోసం వినయంగా గుమిగూడడంలో విసిగి వేసారి పోలేదనుకున్నారా?
మీ ముందు అక్కడ నిలబడినందుకే.. ప్రాయిశ్చితంతో కుమిలిపోవడం లేదనుకున్నారా?
మీ కోసం ఇంత చేసే మా వునికే మీకు అసహనం కలిగిస్తే..
ధిక్కరించడానికి మేము తిరగబడమని ఎలా అనుకుంటారు అసలు?
మేం మీ ముందు చేతులు ఎత్తి ఎందుకు నిలబడతామో తెలుసా..
మీతో కాల్చబడకుండా ఉండడానికి.
చర్చ్‌లో కూడా చేతులెత్తి నిలబడేది మా రక్షణ కోసం మాత్రమే!
కానీ మీరేం చేస్తారు? ప్రార్థన కోసం మా చేతులు లేస్తుండగానే
చర్చ్ లోనే మమ్మల్ని క్రూరంగా కాల్చేస్తారు!
మా భూమిని దురాక్రమించడం అనేది మీ సహజ గుణం!
మీరు మా చర్చ్ లను దోపిడీ చేస్తారు.
జైళ్లల్లో కూడా మమ్మల్ని చంపేస్తారు.
మాకు ఇదేం కొత్త కాదు.
ఎందుకంటే ఇక్కడ చాలామంది తెల్ల వాళ్ళు దేవుళ్ళలాగా నటిస్తూ..
దేవుని పని కూడా వాళ్లే చేస్తుంటారు.
ఇక వాళ్ళ దేవుళ్ళ దేహాల్లోనే ఆకలితో
ఉండలు ఉండలుగా చుట్టుకున్న మా పొట్ట ఉంటుంది.
వాళ్ళ దేవుడికీ.. మాకూ ఎప్పుడూ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
ఎందుకంటే.. చిన్నప్పుడు.. నేను వెళ్లిన ఆదివారపు బడిలో.,
నీలి రంగు కళ్ళు., తెల్లని వంకీల జుట్టున్న జీసస్.. అచ్చం నేను నిలబడ్డట్లే..
పురుష పెత్తనం ఉండే స్వర్గంలో తెల్లవాళ్ళ ముందు తల వంచి నిలబడ్డట్లుగా అనిపిస్తాడు.
క్రీస్తుకి.. అతని కొడుకుకి.. మిగతా పన్నెండు మంది శిష్యులకు
వొంగి నమస్కరించడం.. దుర్భరం!
మెల్లిగా మాకు అర్థం అయిందేంటంటే..
ఆ శిష్యులంతా విచిత్రమైన వాళ్ళు..
ముక్కోణపు ప్రేమ కథ ఉన్న త్రిమూర్తుల్లాంటి వాళ్ళు.
ఇంకా పవిత్రమైన ట్రాన్సజెండర్లు కూడా అయి ఉండచ్చు.
కానీ నువ్వు మాత్రం తెలివిగా నీ అజెండాకి తగ్గట్లుగా
అల్లబడ్డ కథల్ని మాత్రమే అర్థం చేసుకుంటావు!
ఎందుకంటే.. దేవుడన్న భావనకు కూడా
వలసవాదం అంటించ కల స్వేచ్ఛ నీకుంది మరి!
దేవుడ్ని స్త్రీగా.. పురుషుడిగా నీక్కావాల్సినట్లు తయారు చేసుకోగలవు!
ఆ దేవుడికి రంగునీ నువ్వే ఇచ్చి..
మా నోర్లు పలకడానికి కూడా కష్టపడే పేరు పెట్టుకున్నావు!
స్వేచ్ఛ అని నువ్వు దేన్నైతే అంటున్నావో
అది గాస్పెల్‍లో బానిసత్వపు పొరలతో చుట్టబడి ఉంది..
ఏలీయా ప్రవక్త కాలం నుంచీ..
మేం తెల్లవాళ్ల ముందు మోకాళ్ళపై ప్రణమిల్లుతూనే ఉన్నాము.
అసలు ఏలీయా అనే ప్రవక్త చరిత్రలో నిజంగా ఉన్నాడా లేడా అన్నది కూడా తెలీదు.
ఎందుకంటే..బైబిల్ రాసిన వాడు మమ్మల్ని దానిలో చేర్చలేదు!
కానీ.. నేను ఎప్పటికైనా దేవుడే లేని చారిత్రిక గ్రంథాలలో ఉండాలని కోరుకుంటున్నాను.
ఏ పుస్తకాలైతే మా గురించి.. మా కోసం., మా వైపు నిలబడి
నిజాలు చెప్పలేదో..
ఆ పుస్తకాలలోనే నేను ఉండి తీరాలని ఆశ పడుతున్నాను.
మీరేమైనా నిజంగా మా గురించి పుస్తకాల్లో రాయాలనుకుంటున్నారా..?
అయితే.. మీరు మాకు చెందని కొత్త భాషని మాతో పలికించడానికి..
ఏ నాలుకల నైతే కోసేయాలని చూసారో..
ఆ మా తల్లుల నాలుకల మీదనే రాయండి మా చరిత్రని!
అణిచివేతదారులతో కలిసి భోజనం చేస్తున్నా..
మేము ఎప్పటికీ వాళ్ళని అంగీకరించము గుర్తు పెట్టుకోండి!
మా దగ్గర ఉన్నదంతా దుఖం.. విషాదం..
తిరుగుబాటూ అయినప్పుడు.. మేమెలా వారిని క్షమిస్తాం?
ఇప్పుడు చూడండి.. నాలాగే ఉండే మరో నల్లవాడు
ఈ రోజు చనిపోయాడు., లేదా హత్య చేయబడ్డాడు!
బహుశా., ఆ వార్త టేబుల్ చుట్టూ కూర్చుని భోజనం చేస్తూ,.
మీరు ఎప్పటిలా మాట్లాడుకునే నిరాసక్తమైన..
అంతగా ప్రాముఖ్యత లేని సంభాషణగా మారిపోవచ్చు!
బహుశా.. మనం అంతా ఈ హత్యా వార్తలతో చేదెక్కిన
భోజనపు టేబిల్‌ని మతిమరుపు అనే గుడ్డతో తుడిచేస్తాము కావొచ్చు!
తరువాత హాయిగా ఈత కొట్టటానికి వెళ్లిపోతామేమో..?
వొట్టి ఉల్లాసం కోసం..
అవును.. వొట్టి ఉల్లాసం కోసమే!!
~
మూలం: కోలేకా పుటుమా
అనువాదం: గీతాంజలి
కోలేకా పుటుమా పోర్ట్ ఎలిజెబెత్, సౌత్ ఆఫ్రికాలో 1993 మార్చ్ లో పుట్టారు.
కోలేకా థియేటర్ ఆర్టిస్ట్ కూడా. ‘వాటర్’ అనే కవితకు PEN స్టూడెంట్ రైటింగ్ అవార్డ్ వచ్చింది. బడి పాఠ్యాంశాల్లో చేర్చబడింది. వాటర్ కవితలో నీళ్ళల్లో ప్రవేశం అనేది ఒక రాజకీయ, చారిత్రిక, రేసిస్ట్ అంశాల మీద ఆధారపడి ఉంది అన్న భావనతో రాయబడింది. ప్రేమ.. queerness, వలసవాదం, నిర్వాసితత్వం, రేసిజం.. రక రకాల భావాలు, ఆలోచనల కూడలిగా ఉండే స్త్రీవాద అస్తిత్వం పుటుమ తరచూ ఎన్నుకునే కవితా వస్తువులు.
కోలేక పుటుమా రచనలు: స్పానిష్, డేనిష్ భాషల్లో అనువదించబడి, రెండు యూనివర్సిటీల్లో సిలబస్‌గా ఉన్న ‘కలెక్టివ్ ఆమ్నీషియా’. ఈ పుస్తకంలో పుటుమా ‘womxn’ అనే పదాన్ని నాన్-వైట్, ట్రాన్సజెండర్ స్రీలని ఉద్దేశించి వాడడం చాలా సంచలనాన్ని సృష్టించింది. పుటుమా తను రచించిన చాలా నాటకాల్లో నటించారు. పుటుమా నాటకాలు స్కూప్, ఎఖాయ, UHM, ఓజా సరఫీనా, నో ఈస్టర్ సండే ఫర్ ఖ్వీర్స్.
కవిత్వం – ఇంబెవు ఎసిని. కలెక్టివ్ ఆమ్నెసియా.
ఫోర్బ్స్ ఆఫ్రికా 30 అండర్ 30 హానరరీ అవార్డుతో పాటు అనేక అవార్డులు తీసుకున్నారు.