[dropcap]మా[/dropcap]నవ సమాజం ఎప్పుడూ ఏక వర్ణమయం కాదు, సప్తవర్ణ సమ్మిశ్రితం అంటూ ఒక అద్భుతమైన సంకలనానికి శ్రీకారం చుట్టి, అమృత బిందువుల్లాంటి కథలు తెలుగు పాఠకలోకానికి అందించారు శ్రీ కస్తూరి మురళీకృష్ణ. సప్త వర్ణాలు శ్రీరామాయణ మహాకావ్యం లోనివే కావడం విశేషం.
ఇందులో శ్రీరాముని చింతన, సీతాకల్యాణం, సీత పాదాభివందనం, ఊర్మిళ, మండవి, లక్షణ గడ్డ, రేగుపళ్ళ రుచి, భ్రాతృప్రేమ, కౌగిలి, విభీషణుని భక్తి, లోహజంగుడు, సీత చెప్పిన సత్యం, ప్రేమాగ్ని పరీక్ష, కరుణించవా శివా, న్యాసము, రామరాజ్యం, హనుమంతుని స్వప్నం, ఘటన, రామాయణంలో రజని – మొదలైన రామాయణ ఆధారిత కథలే కాక, వందే దాశరథాత్మజం, ఒక కథ, ఔనౌను, వారాది రాముడు, రామ మాడ, రామలీల, యతోధర్మస్తతోజయః, రాముడు కట్టిన వంతెన, రామ కథాసుధ మొదలైన సామాజిక రామాయణం కథలు కూడా ఉన్నాయి. అయితే, రెండు కథల సారాంశం మాత్రం ఒకటే అదే రామనామమే సర్వజనులకు ముక్తిప్రదాయం అన్న వాస్తవం. కాకపొతే రెండుగా ఎందుకు విడదీసారు అనేది ఒక సందేహం.
వ్యాసభారతం, వాల్మీకి రామాయణం భారతీయులకే కాదు సమస్త మానవజాతికి ఆ మహానుభావులు అందించిన వరం. ఇదే రాజ్యాంగం ఇదే, జీవనవేదం.. ఇదే మానవాళికి మూలసూత్రం.
ఆ రామాయణంలోని పాత్రలను, సంఘటనలను, స్వభావాలను ఒక్కొక్కరు వారి, వారి దృక్కోణంలో చూసి, పరిశీలించి, పరిశోధించి రాసిన కథలు ఈ సంకలనంలో ఉన్న వచన కావ్యాలు. ఏ కథ కా కథే అపురూపం. రామాయణం ఆద్యంతం కూలంకషంగా చదివి జీర్ణం చేసుకున్న రచయితలు వారు అర్థం చేసుకున్న విషయాలను ఎంతో అందంగా, తాత్వికంగా చెప్పారు. రామాయణం అంటే సీతారాములు, రావణుడు, లక్ష్మణుడు ప్రధానంగా కనిపించేవి.. సీత అడవుల్లో ఉన్నా, పర్ణశాలలో ఉన్నా రాముడికి దగ్గరగా ఉంది.. రాముడితో ప్రయాణించింది. రావణుడి చెరలో ఉన్న సీత జాడ తెలుసుకున్న రాముడు ఆమెని తిరిగి పొందాడు. రామ నామంతో సీత నామం కూడా రామాయణంలో మొదటినుంచి చివరివరకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అదే రామాయణం. కానీ, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తిల గురించి రామాయణంలో పెద్దగా ప్రస్తావన ఉండదు.
భర్త దగ్గరే ఉన్నా, దూరంగా ఉంటూ మానసికంగా చిత్రవధ అనుభవించిన మాండవి కథ హృదయాన్ని తాకింది. అలాగే భ్రాతృప్రేమ.. సంపాతి, జటాయువుల సోదరప్రేమ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. కలిసిన శుభాక్షణం ఎలాంటిదో తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి సీతాన్వేషణలో గొప్ప పరాక్రమం చూపించిన హనుమంతుడికి ప్రతిగా ఒక ఆలింగనం తప్ప మరేమీ ఇవ్వలేను అంటూ ప్రేమానురాగాల పరిష్వంగం కానుకగా అందించిన రాముడి ప్రేమ.. ఇక అలాంటిదే విభీషణుడి భక్తీ.. రామాయణంలో రాముడిని ప్రేమించి, భక్తితో కొలిచి జన్మ తరింపచేసుకున్న హనుమ, విభీషణుడు, శబరి, జటాయువు వంటి పాత్రలు అనేకం. వాటిలో విభీషణుడు ప్రత్యేకం.
మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి ‘ఔనౌను’ ఎంత మధురం ఈ కావ్యం! అనిపించింది. ఈ కథ చదివే అదృష్టం కలిగించిన సంపాదక వర్గానికి కృతజ్ఞతలు.
ఇక నంద్యాల సుధామణి గారి ‘వారాది రాముడు’.. చదువుతున్నంత సేపు ఒక కొత్త ప్రపంచంలో విహరించాను. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళు.. బహుశా ఆనందాశ్రువులు అయి ఉంటాయి. నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇలాంటి ఊరిలో, ఇలాంటి మనుషుల మధ్య కొంతకాలం అన్నా జీవించే వరం ప్రసాదించు రామా అని ప్రార్థించుకున్నాను.
ఆది నుంచి ప్రతి కథా అమృతమయమే.. ‘రామ కథాసుధ’ కథలో చెప్పినట్టు రామాయణంలో అన్ని పాత్రలూ తెలిసినట్టే ఉంటాయి కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అన్నీ కొత్తగానే ఉంటాయి.
ఈ ‘రామకథాసుధ’ అభినవ రామాయణం. కస్తూరి మురళీకృష్ణ గారికి, కోడిహళ్లి మురళీ మోహన్ గారికి, శ్రీ కొల్లూరి సోమశంకర్‌కి మనసారా అభినందనలు.
***
రామకథాసుధ (కథా సంకలనం)
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్, కొల్లూరి సోమ శంకర్
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 215
వెల: 175/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha