హాస్య తరంగిణి-7

2
3

[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.

ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.

61. సీజన్

బామ్మ: ఏం సినిమా వస్తోందిరా మన టివిలో?

బన్నీ: ఇది సినిమా కాదు, దీనిని సీజన్ అంటారు! అయినా నీకు అర్థం కాదులే!

బామ్మ: ఒరేయ్ బన్నూ! నాకు సీజన్ అంటే తెలుసు కానీ ఇంతకీ ఇది సమ్మర్ సీజన్ సినిమానా! వానా కాలం సీజనా లేక చలికాలం సీజన్ సినిమానా!!

62. చౌదరీ కా చాంద్

అప్పన్న: నువ్వు హిందీ సినిమాలు చాలానే చూశావని గొప్పలు చెపుతున్నావు కదా? ఏదీ ఒక సినిమా పేరు చెప్పు చూద్దాం!

పిచ్చయ్య: చౌదరీ కా చాంద్.

63. రచ్చ రచ్చ

బూతయ్య: మీ ఛానల్లో రచ్చ రచ్చ డిబేట్‌కి అసలు నన్ను పిలవటం లేదు ఎందుకని?

యాంకర్: అసలు మీకు బూతులు మాట్లాడటమే రాదు కదా! అందుకని.

64. చెత్త సామాన్లు

భార్య: మన అమ్మాయికి ఈ సంబంధమే సరియైనది అని అంటున్నారు ఎందుకని?

భర్త: మన కాబోయే అల్లుడు ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్నాడు తెలుసుకోవే పిచ్చిదానా!

భార్య: నాకు అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్పండి.

భర్త: మనింట్లో చెత్త సామాన్లు టన్నులకొద్దీ వున్నాయి కదా!

65. టీకా తాత్పర్యము

టీచర్: ఒరేయ్ నానీ! టీకా తాత్పర్యము అంటే ఏమిటో చెప్పరా?

నానీ: టీనీ కాఫీని కలిపి తాగినచో టీకా తాత్పర్యము ఆశువుగా వచ్చును సార్!

66. ఆకాశ పన్ను

ఆకాశపతి: ఇదేమిటండీ ఆకాశ పన్ను కట్టమంటున్నారు? అసలు ఇది దేనికి?

అధికారి: మరి మీరు అడ్డూ అదుపూ లేకుండా ఆకాశ హార్మ్యాలు ఆకాశంలో కట్టుకున్నారు కదా? అందుకే.

67. టానిక్

పేషంట్: డాక్టరుగారు! నాకు ఆకలి తగ్గటానికి ఒక మంచి టానిక్ రాసి ఇవ్వండి సార్!

డాక్టర్: అదేమిటయ్యా! ఆకలి అయితే మంచిదే కదా! ఇంకా టానిక్ దేనికి?

పేషంట్: నేను పనీ పాటాలేనివాణ్ణి? ఇక ఆకలేస్తే ఎలాగ?

68. ఉత్తుత్తి మాటలు

అమాయక్: ఈ ఎన్నికలలో నాకు టికెట్ ఇవ్వండి సార్!

నాయకుడు: టికెట్ కావాలంటే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఇస్తావా?

అమాయక్: సార్! నా దగ్గర జెండా, ఎజెండా వున్నాయి సార్.

నాయకుడు: అవి అన్నీ మీటింగులో చెప్పే ఉత్తుత్తి మాటలు. నువ్వెళ్లి డబ్బులు తెచ్చుకో, నెక్స్ట్!

69. గొప్ప ఆర్టిస్ట్

శంకర్: నువ్వు గొప్ప పెయింటింగ్ ఆర్టిస్ట్‌వి అని ఎలా చెప్పగలవ్?

చిత్రవర్మ: నేను వేసిన చిత్రాలన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయనీ, అడ్డదిడ్డంగా ఎవరికీ అర్థం కావటం లేదనీ జనం చెపుతున్నారుగా! అందుకని!

70. ఓన్ బిజినెస్

అధికారి: అదేమిటయ్య! ఆఫీసులో సంతకం చేసి రోజూ బయటకెళ్లి పోతున్నావ్?

కొండప్ప: మొన్న మీరే కద సార్! మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పారు!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here