1.
తోచనప్పుడు నిశ్శబ్దాన్ని వెంబడిస్తావ్.
తోకముడుచుకుని చీకటిలో పడున్న రాత్రికి తోడవుతావ్.
ఊరికే వీచే గాలి శబ్దానికి నీలోకొచ్చిన నిశ్శబ్దం ఊకొడుతుంటుంది.
నువ్వు మరెప్పుడూ ఒంటరివి కావూ అన్న నిజం తెలిసిపోతుంది.
2.
దాహపు పెదవులు పాడుతూ ఉంటాయ్.
పువ్వులు రెక్కలు తెంపుకుని మౌనం పాటిస్తాయ్.
గుక్కెడు నీళ్ళు దొరకని మొక్క గొంతుక ఎండిపోతుంది.
ఆకుల గలగలల్లో నువ్వు వాడిపోయిన దేహం దరించడం నీకు గుర్తుంటుంది.
3.
ఎవరో నీ పగటినిద్రని దొంగిలించారని
రెక్కలుతెంపుకున్న సీతాకోకవలె నేలకొరుగుతావ్.
అలకని ఎవరూ మొయ్యరు.
రెప్పలు మూతబడేఉంటాయ్.
మెలకువకి నిషాని ఎక్కించేవేమీ ఉండవని తెలిసి మిన్నకుంటావ్.
4.
ఏ సాయంత్రమో కొన్ని పాదచప్పుళ్ళ గలగలలకి
దూదిమనసుని చేరుస్తావ్.
పక్షుల కిలకిలల్లో ఉండీలేని హృదయాన్ని జోకొట్టి గూటికెళ్ళాలనేది మస్తిష్కం తపన.
5.
నగ్నసత్యాలన్నీ ఒక్కోటీ సందర్భంలో వచ్చేసి
వరుసలు కట్టి కొలువుంటాయ్.
అన్ని ముడులూ విప్పబడ్డాక
ఇక తెలుసుకునేదేమీ ఉండనప్పుడు
నిర్వికారచూపు ఒక్కటే నీ తోడు.