[dropcap]ఉ[/dropcap]త్సాహంతో ఉరకలు వేసే
ఓ సీతాకోకచిలుకా
పురుగును నుండి పుట్టిన పుష్పానివి నీవు
కొత్త రూపంతో, పునర్జన్మతో పునీతమై
అందాన్ని పొందిన ఆనందంతో
రకరకాల రంగుల రెక్కలతో
పరిమళించే పూలపై గర్వంగా వ్రాలి
వాటిని పులకరించేవు
ఈ ప్రపంచమంతా నీదిగా విహరించేవు
ఈ లోకానికే సొగసునందిచే చందాన
హొయలు పోతూ హోరు లేకుండా
జోరుగా హుషారుగా విహరించేవు
విశ్వానికి కావలసిన నిండుతనాన్ని యిచ్చేవు
నీవే కదా అందానికి ఆదర్శం
అందంలో పందెం కాసేవారెవరూ
నిన్ను గెలువలేరు
చెంగు చెంగున ఎగిరే ఆడపిల్లకు
ప్రత్యేక స్ఫూర్తివి నీవే కదా
రమ్య హర్మ్యాల కుడ్యాల చిత్రాలకు
రమణీయతనిచ్చేది నీవే కదా
పలు వ్యాపార సంస్థలకు
ముచ్చటగొలిపేది నీ నామమే కదా!
నీపై గల ఆకర్షణతో నీ రూపాన్ని
తలచి తలచి
నీ మధుర నామ స్మరణ
ముగించుటకు మది కనుమతి లేదు