మహాభారత కథలు-6: ఉదంక మహర్షి

0
4

[dropcap]ఉ[/dropcap]దంకుడు బ్రహ్మతో సమానమైనవాడు, భయంలేనివాడు, గొప్ప తపస్సంపన్నుడు, పైలుడికి శిష్యుడు. అతడు గురుకులంలో గురువుకి సేవలు చేసి ఎనిమిది సిద్ధుల్లో (అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశిత్వం, వశిత్వం, కామావసాయిత అనేవి ఎనిమిది సిద్ధులు) ఉన్న జ్ఞానాన్ని పొందాడు.

ఉదంక మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆయన గురించి పూర్తిగా కాకుండా మహాభారత కథలో ఉన్నంత వరకే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఆయన చదువు పూర్తి చేసి గురువుగారికి గురుదక్షిణ ఇస్తానన్నాడు. తీసుకోడానికి గురువుగారు ఒప్పుకోలేదు. గురువుగారి భార్య ఉదంకుడితో తనకి ‘పౌష్యమహారాజు’ భార్య దగ్గర ఉన్న కుండలాలు కావాలని చెప్పింది. గురువుగారి అనుమతి తీసుకుని వాటికోసం బయలుదేరాడు ఉదంకుడు.

అడవిలో ఒంటరిగా వెడుతున్న సమయంలో ఒక దేవతాపురుషుడు ఎద్దునెక్కి ఎదురుగా వచ్చాడు. పౌష్య మహారాజుని కలుసుకోడానికి ఆటంకాలు రావని చెప్పి ఉదంకుడికి ఎద్దు పేడ ఇచ్చి తినమన్నాడు. ఉదంకుడు ఎద్దుపేడ తిని పౌష్య మహారాజుని కలుసుకున్నాడు.

మహారాజుని ఆశీర్వదించి ఆయనిచ్చిన అర్ఘ్యపాద్యాలు అందుకుని తను గురువుగారి పనిమీద మహారాణి చెవులకి పెట్టుకునే కుండలాల కోసం యాచకుడిగా వచ్చానని చెప్పాడు. ఉదంకుడి మాటలు విని రాజు “మహానుభావా! సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్లి అడిగి తీసుకో!” అన్నాడు.

ఉదంకుడు అంతఃపురమంతా తిరిగాడు కాని, మహారాణి కనిపించలేదు. రాజుకి విషయం చెప్పాడు. రాజు ఉదంకుడితో “మహాత్మా! నువ్వు ఏ దోషాలు లేనివాడివి. నిన్ను అపవిత్రుడవని నేను అనలేను. కాని, నా భార్య మహాపతివ్రత. ఆమె అపవిత్రులకి మాత్రం కనిపించదు” అని చెప్పాడు.

అది విని ఉదంకుడు “తను ఇక్కడికి వచ్చేటప్పుడు దివ్యపురుషుడు ఇచ్చిన ఎద్దు పేడని తిని నోరు శుద్ధి చేసుకోలేదు. అతడు చెప్పినా తను పట్టించుకోలేదు. అదే మహాపతివ్రతని చూడలేక పోడానికి కారణమై ఉంటుంది” అనుకున్నాడు. వెంటనే తూర్పు దిక్కుకి తిరిగి పరిశుభ్రమైన నీళ్లతో పాదాలు, చేతులు, ముఖం, నోరు కడుక్కుని మళ్లీ మహారాణి దగ్గరికి వెళ్లాడు.

ఆమె ఉదంకుడికి నమస్కారం చేసి కుండలాలు ఇచ్చి “ఉదంకమహర్షీ! ఈ కుండలాల్ని ఎత్తుకుపోవాలని తక్షకుడు అనే సర్పరాజు కాచుకుని ఉంటాడు. జాగ్రత్తగా తీసుకుని వెళ్లు” అని చెప్పింది. ఉదంకుడు కుండలాలు తీసుకుని మహారాజు దగ్గరికి వచ్చాడు. మహారాజు ఉదంకుణ్ని భోజనం చేసి వెళ్ళమన్నాడు.

ఉదంకుడు రాజు మాటని తీసివెయ్యలేక భోజనం చెయ్యడానికి కూర్చున్నాడు. భోజనం చేస్తుండగా అన్నంలో వెంట్రుక వచ్చింది. దాన్ని చూసి ఉదంకుడు “చూడకుండా నాకు అపవిత్రమైన అన్నాన్ని పెట్టావు. నువ్వు గుడ్డివాడివి అయిపోతావు” అని రాజుని శపించాడు. పౌష్యమహారాజు బాధతో “నేను చేసిన చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశావు. నువ్వు సంతానం ఉండకుండా అయిపోతావు” అని ఉదంకుణ్ని శపించాడు.

ఉదంకుడు తన వంశం వృద్ధి కోసం శాపాన్ని ఉపసంహరించమని మహారాజుని అడిగాడు. పౌష్యరాజు “ఉదంక మహర్షీ! బ్రాహ్మణుల మనస్సు అప్పుడే తీసిన వెన్నతో సమానంగా మృదువుగా ఉంటుంది. మాట మాత్రం పరుషంగా ఇంద్రుడి వజ్రాయుధంలా ఉంటుంది. రాజుల్లో ఈ రెండూ విరుద్ధంగా ఉంటాయి. అందువల్ల బ్రాహ్మణుడు తను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోగలడు. రాజు మాత్రం తను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోలేడు. కనుక, నేను ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేను. నువ్వు నాకు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించు” అన్నాడు.

ఉదంకుడు “రాజా! నీకు త్వరలోనే శాప విముక్తి కలుగుతుంది. నేను గురుపత్నికోసం కుండలాలు తీసుకుని వెడుతున్నాను” అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరాడు. దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది. తన చేతిలో ఉన్న కుండలాల్ని ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టి, సరస్సులోకి దిగి ఆచమనం చేస్తుండగా తక్షకుడు వచ్చి కుండలాలు తీసుకుని పరుగెత్తాడు.

ఉదంకుడు కూడ తక్షకుడి వెంట పరుగెత్తాడు. సర్పరూపంలో వచ్చిన తక్షకుడు కుండలాలతో సహా భూమికి ఉన్న రంధ్రం నుంచి తన నాగలోకానికి వెళ్లిపోయాడు. ఉదంకుడు కూడా తక్షకుడి వెనుక నాగలోకానికి వెళ్లి “అనేక అడవులు, చెట్లు, సముద్రాలు, కులపర్వతాలు, నిండుగా ప్రవహిస్తున్న సరస్సులు, నదులు కలిగిన బరువైన భూమిని తన వెయ్యి పడగలతో మోస్తూ; నారాయణుడికి శయ్యగా ఉంటూ అన్ని పాపాల్నీ నాశనం చెయ్యగల శక్తి కలిగిన అనంతుడు అనే నాగరాజు మా యందు దయ కలిగి ఉండుగాక! గొప్ప తపశ్శక్తితో రాక్షసులు పెట్టే బాధల నుంచి నాగులందర్నీ రక్షించినవాడు; వినయంగా నమస్కరించే రాక్షసుల, దేవతల కిరీటాల మీద మణుల కాంతితో ప్రకాశించే పడగలతో, పార్వతీ పతి శివుడికి అలంకారమైన సర్పరాజు వాసుకికి మా యందు దయ కలుగుగాక!

దేవ, మనుష్య లోకాల్లో తిరుగుతూ గొప్ప తేజస్సుతో అందరితో పూజలూ అందుకుంటూ గొప్ప పరాక్రమము, విషము, కోపము కలిగి మహాత్ములైన ఐరావత నాగవంశంలో ఉన్న సర్పరాజులందరూ మా యందు దయ కలిగి ఉందురుగాక! పెద్ద పెద్ద కులపర్వతాల పొదరిళ్లలోను, అడవుల్లోను, కురుక్షేత్రంలోను స్వేచ్ఛగా తిరిగేవాడు; తన కుమారుడైన అశ్వసేనుడితో కలిసి భూమి మీద తిరిగేవాడు; బలంలోను, గర్వంలోను, శౌర్యంలోను సమర్థుడైనవాడు, పరాక్రమవంతుడు పాములకి రాజు అయిన తక్షకుడు మా యందు దయ కలిగి ఉండు గాక!” అని నాగరాజులందర్నీ స్తుతించాడు.

పాతాళ లోకంలో తెల్లని నల్లని దారాలతో కలిసిన వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలని, పన్నెండు ఆకులతో ఉన్న చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకుల్ని, ఎత్తైన గుర్రాన్ని ఎక్కి తేజస్సుతో ఉన్న ఒక దివ్య పురుషుణ్ని చూశాడు. వాళ్లని కూడా భక్తితో మంత్రాలతో స్తుతించాడు.

ఆ దివ్య పురుషుడు ఉదంకుణ్ని చూసి “నిర్మలమైన నడవడిక కలిగిన ఉదంక మహర్షీ! నీకు ఏం కావాలో చెప్పు, నేను తీరుస్తాను!” అన్నాడు. ఉదంకుడు “ఈ పాముల వంశం అంతా నాకు అధీనమై ఉండేట్టు అనుగ్రహించు” అని అడిగాడు. దివ్యపురుషుడు గుర్రం చూపిస్తూ గుర్రం చెవికి ఉన్న రంధ్రంలో ఊదమన్నాడు. ఉదంకుడు దివ్య పురుషుడు చెప్పినట్టే చేశాడు. దాని ఇంద్రియాల నుంచి భయంకరమైన అగ్ని జ్వాలలు పాతాళలోకంలో వ్యాపించాయి. అది చూసి పాములన్నీ భయపడ్డాయి.

అగ్ని జ్వాలలు చూసి అవి ఆ బ్రాహ్మణుడి కోపం అనుకుని తక్షకుడు భయపడుతూ కుండలాల్ని తీసుకొచ్చి ఇచ్చేశాడు. ముందు ఈ నాగలోకం నుంచి ఎలాగయినా బయట పడి సాయంత్రానికి తను గురుపత్ని దగ్గరికి చేరుకోవాలి. ఈ రోజు తను అక్కడికి చేరలేకపోతే ఇప్పటి వరకు పడ్డ శ్రమంతా వ్యర్థమవుతుందని బాధ పడుతున్నాడు.

దివ్యపురుషుడు ఉదంకుడికి తన గుర్రాన్ని ఇచ్చి “దీని మీద వెడితే నువ్వు గాలి కంటే, మనస్సు కంటే కూడా వేగంగా వెళ్లగలవు” అని చెప్పాడు. దివ్యపురుషుడు ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి ఉదంకుడు అదే రోజు గురువుగారి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ గురువుగారి భార్య పవిత్ర స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని కర్ణాభరణాలు ధరించాలని ఉదంకుడి కోసం ఎదురు చూస్తోంది. కుండలాల్ని ధరించి, బ్రాహ్మణుల్ని పూజించి తను తలపెట్టిన వ్రతాన్ని పూర్తి చేసుకుంది.

వచ్చిన ఉదంకుణ్ని చూసి గురువు పైలుడు “నాయనా! పౌష్య మహారాజు పట్టణం ఇక్కడికి దగ్గరగానే ఉంది కదా? అక్కడికి వెళ్లి రావడానికి నీకు నాలుగు రోజులు ఎందుకు పట్టింది?” అని ఆడిగాడు. ఉదంకుడు “గురువర్యా! కాని, దుష్టుడైన నాగరాజు తక్షకుడు అడ్డుపడ్డం వల్ల ఆలస్యమైంది. మీ దగ్గర్నుంచి వెడుతున్నప్పుడు ఒక దివ్య పురుషుడు ఎదురయ్యాడు. అతడిచ్చిన ఎద్దు పేడ తిని వెళ్లి పౌష్య మహారాజుని అడిగి కుండలాలు తీసుకుని వస్తున్నాను. మధ్యలో తక్షకుడు నా దగ్గరున్న కుండలాల్ని ఎత్తుకుని పోయాడు. నేను తక్షకుడి వెనకాలే నాగలోకానికి వెళ్లి సర్పరాజుల్ని పొగిడాను.

పాతాళ లోకంలో తెలుపు, నలుపు రంగుల దారాలతో వస్త్రాలు నేస్తున్న ఇద్దరు స్త్రీలని, పన్నెండు అకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకుల్ని, ఎత్తైన గుర్రాన్నిఎక్కిన ఒక దివ్యపురుషుణ్ని చూశాను. అతడు అనుగ్రహించి ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి కుండలాలు తీసుకుని సమయానికి రాగలిగాను. అసలు ఇంతవరకూ జరిగినదేమిటో నాకు అర్థం కాలేదు” అని చెప్పాడు.

పైలుడు “ఉదంకా! ఎద్దుని ఎక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుడు. అతడు ఎక్కిన ఎద్దు దేవతల ఏనుగు ఐరావతం. పేడ అమృతం. ఇద్దరు స్త్రీలు ధాత, విధాత. వాళ్లు నేస్తున్న తెలుపు, నలుపు దారాల మగ్గం దినరాత్రులకి రూపం. పన్నెండు ఆకులు గల చక్రం నెలల రూపమైన సంవత్సరం. దాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులు ఆరు ఋతువులు (వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం). గుర్రం అగ్ని; దాన్ని ఎక్కిన దివ్య పురుషుడు ఇంద్రుడి స్నేహితుడు పర్జన్యుడు. మొదట ఇంద్రుణ్ని చూసి అమృతం తిన్నావు కనుక, నువ్వు కోరుకున్నది దొరికింది. నువ్వు చెయ్యాలనుకున్న పని నెరవేరింది. నీకు కుండలాలు దొరికాయి. గురువుగారి పని నెరవేర్చి గురువు ఋణం తీర్చుకున్నావు. ఇంక నువ్వు నీ ఇష్టం ప్రకారం జీవించు!” అని దీవించి పంపించాడు.

ఉదంకుడు గురువుగారి అనుమతి తీసుకుని అక్కడ నుంచి వెళ్లి చాలాకాలం తపస్సు చేశాడు. తక్షకుడు తనకి చేసిన అపకారానికి బదులు తీర్చుకోవాలని ఉదంకుడు జనమేజయమహారాజు దగ్గరికి వెళ్లాడు.

జనమేజయ మహారాజుని కలిసిన ఉదంకుడు “భూమి మీద ఉన్న ప్రజలందరితో కీర్తింపబడేవాడా! జనమేజయుడా! నేను నా గురువుగారి పని మీద వెడుతుంటే సర్పరాజు తక్షకుడు అజ్ఞానంతో నాకు హాని చేశాడు. దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరత వంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ నిగ్రహం కలిగిన నీ తండ్రి పరీక్షిత్తు మహారాజుని క్రూరుడైన తక్షకుడు తన భయంకరమైన విషంతో చంపేశాడు.

తక్షకుడు నీకు ఇంత కీడు చెయ్యడానికి కారణం శమీకుడి కుమారుడు శృంగి అనే ఒక బ్రాహ్మణుడు. అందుకు ప్రతీకారంగా నువ్వు కూడా బ్రాహ్మణులతో సర్పయాగాన్ని నిర్వహించి, భయంకరమైన అగ్నిజ్వాలల్లో తక్షకుడు మొదలైన పాములన్నింటినీ నాశనం చెయ్యి. బ్రాహ్మణుల అనుమతి తీసుకుని సర్పయాగం చెయ్యి” అని చెప్పి జనమేజయుడికి సర్పయాగం చెయ్యాలనే బుద్ధి కలిగేలా మాట్లాడాడు. పరీషిత్తుమహారాజు కొడుకు జనమేజయ మహారాజు సర్పయాగం చెయ్యడానికి ఉదంకుడు కారకుడయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here