[dropcap]‘కా[/dropcap]లం విలువైనది కానీ జీవితం అంతకంటే విలువైనది.’
***
నేను ఆఫీస్‌కి వెళ్ళేసరికి అటెండెన్స్ రిజిస్టర్ మేనేజర్ గారి క్యాబిన్ లోకి వెళ్ళింది.
అటెండర్ ఆ విషయాన్ని కాస్త విచార వదనంతో చెప్పాడు.
‘భగవంతుడా.. ఏ కష్టం ఎదురుకానుందో..’ అని మనస్సు ఒకింత అలజడికి లోనవుతుంటే మెల్లగా బాస్ కరుణాసాగర్ గారి గది లోకి నడిచాను.
ఆయన ఉగ్రరూపంలో ఉంటారని తెలుసు.
“రేపు ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నరకే ఇన్స్పెక్షన్ ప్రారంభమవుతుంది. ఆలశ్యం అవకుండా అందరు తొమ్మిది గంటలకే డ్యూటీకి రావాలి..” నిన్న సాయంత్రం అందరం ఇంటికి బయలుదేరుతున్న సమయంలో కరుణాసాగర్ గారు చెప్పిన మాటలు మళ్ళొక్క సారి నా మదిలో ప్రతిధ్వనించాయి.
వాల్ క్లాక్ వైపు చూసాను. అప్పుడు సమయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు.
బాస్ ఆడిటర్స్ తో కూర్చున్నారని అటెండర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
కానీ తప్పదు. అటెండెన్స్ రిజిస్టర్‌లో సైన్ చేస్తేనే హాజరు పడుతుంది.
మెల్లగా డోర్ తీసి “మే ఐ కమిన్ సార్!” అడిగాను.
నా వైపు ఉరిమురిమి చూస్తూ.. కాస్త విసురుగానే నా వైపు రిజిస్టర్ నెట్టారు కరుణాసాగర్ గారు.
సైన్ చేసి ‘బ్రతుకు జీవుడా..’ అనుకుంటూ సీట్‍లో కూర్చున్నాను.
ఉదయం ఇంటి దగ్గర సీన్ కళ్ళముందు కదిలింది కొద్ది క్షణాలపాటు.
***
అజయ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం. ఎనిమిది గంటలకే కాలేజ్‌కి బయలుదేరి వెళతాడు. సృజన మాత్రం ఎనిమిదిన్నరకు స్కూల్‍కి వెళుతుంది. రెండు కిలోమీటర్ల దూరంలో వున్న స్కూల్‍కి తన ఫ్రెండ్స్‌తో కలిసి సైకిల్ పై వెళుతుంది. గత సంవత్సరం వరకు అన్నా, చెల్లెలు కలిసి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు వాడు కాలేజ్‍కి వెళ్తుండటంతో సృజన ఒక్కతే వెళుతుంది. కానీ ఫ్రెండ్స్ తోడుంటారు!
ఉదయం ఎనిమిది వరకు లేవలేదు సృజన.
‘నా చిన్ని గారాలు కూతురు స్కూల్ కి వెళ్ళడం లేదు కాబోలు’ అనుకున్నాను.
అక్కడే తేడా పడింది.
“యావండి..” జానకి పిలుస్తుంది.
“ఆ! చెప్పాలి.. అవతల ఆఫీస్ టైం అవుతుంది.”
“ఎప్పుడు ఉండే ఆఫీసే కాని ఓ మాట..”
“అబ్బా! ఏంటి త్వరగా చెప్పండి మేడం..” అంటూ చకచకా టిఫిన్ తినే పనిలో లీనం అయ్యాను.
నాకు ఆఫీస్ టైం అవుతుంది. రోజూ సరిగ్గా ఎనిమిది నలభైకి బయలుదేరుతాను. ఐదు కిలోమీటర్ల దూరం, ట్రాఫిక్‍లో సరిగ్గా ఇరవై నిమిషాల్లో చేరుతాను.
సృజన నా దగ్గరికి వచ్చింది.
స్కూల్ బ్యాగ్ తో ప్రత్యక్షమైన తన వైపు చూస్తూ.. “ఏంటి స్కూల్‌కి వెళ్ళనని ఉదయం అమ్మకి చెప్పావంట? మరి ఇప్పుడు రెడీ అయ్యావు?” ప్రశ్నించాను.
“డాడీ! కం ఫాస్ట్. మర్చిపోయాను.. ఈ రోజు స్కూల్‍లో ఇంగ్లీష్ టెస్ట్ వుంది. నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి” అంటూ తొందర పెడుతుంది సృజన.
“మొన్ననే హాఫ్ ఎర్లీ పరీక్షలు పూర్తయ్యాయి కదా సృజనా?” అడిగాను.
“అవును డాడీ. ఇది ఓన్లీ గ్రామర్ టెస్ట్. నాకు చాలా ఇంట్రెస్ట్. తప్పకుండా ఈ పరీక్షలో క్లాస్ ఫస్ట్ వస్తాను.. దా దా.. “ అంటూ బైక్ దగ్గరకి కదిలింది.
నేను ఆఫీస్‍కి నేరుగా వెళితే ఇరవై నిమిషాల్లో ఐదు కిలోమీటర్లు వెళ్ళగలను. సృజనని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలంటే.. మరో పది నిమిషాలు పడుతుంది. అదనంగా రెండు కిలోమీటర్లు ప్రయాణించాలి.
నాలో నేనే మాట్లాడుకుంటున్నట్టుగా అనుకుంటుంటే..
“డాడీ.. పదండి..” సృజన అల్లరి చేస్తుంది.
శ్రీమతి వైపు చూస్తూ.. “ఆఫీస్‍లో ఇన్ఫెక్షన్ ఉంది. ఎలా?” అడిగాను.
‘మరి త్వరగా రడీ అవ్వచ్చు కదా.. ఆ దిక్కుమాలిన ఫోన్ చూస్తూ టైం పాస్ చేసే బదులు’ ఫేస్ ఫీలింగ్స్ అర్థమవుతుంటే.. తప్పదనుకుంటూ స్కూల్ వైపు పయనమయ్యాను.
యాక్టివా ఎంత స్పీడ్‍గా వెళ్ళినా టైం కవర్ అవడం కష్టం.
***
కరుణాసాగర్ గారు ఆడిటర్స్‌తో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆయన కోపాన్ని ప్రదర్శించలేకపోయారు. అది తుఫాను ముందు ప్రశాంతత అనే మాట అరగంట తర్వాత అర్థమయ్యింది. తనెంత చెబుతున్నా వినకుండా కోప్పడ్డం ఆయన హక్కు అయింది ఆ సమయంలో!
కందిపోయిన మొహంతో.. తనువంతా విలవిలలాడుతుంటే నిరాశగా బయటకు వచ్చాను. అప్పుడు సమయం పది గంటలు.
ఆడిటర్స్ లో సీనియర్‍లా వున్న వ్యక్తి నా టేబుల్ ముందు కూర్చుని వున్నాడు.
“నమస్తే సార్!” అంటూ వినయంగా నమస్కరించాను.
“వణక్కం..” అన్నాడు.
అతడు తమిళియన్ అని మాటల్లో అర్థమవుతుంది. కానీ తెలుగు పర్లేదన్నట్లుగా మాట్లాడుతుంటే.. రికార్డ్స్ ఆయన ముందుంచాను. మిగిలిన డాక్యుమెంట్స్ కంప్యూటర్‍లో చూపిస్తానని చెప్పాను. అటుగా వచ్చిన కరుణాసాగర్ గారు అదేనండి మా బాస్ నా వైపు ఉరిమి చూస్తూ వెళ్ళడం అర్థమవుతుంది.
నేను రికార్డ్స్ చూస్తుంటే నా సెల్ ఫోన్ మ్రోగింది. నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ రింగ్ అయ్యింది.
వెంటనే కాల్ చేసిందేవరో అన్నట్లుగా చూసుకుని.. సైలెంట్ మోడ్‍లో పెట్టాను.
మురుగన్ గారి వైపు చూశాను. ఆయన వదనం ప్రసన్నంగా వుంది. రెండు క్షణాలు నా వైపు చూసి పనిలో లీనం అయ్యారు మురుగన్ గారు.
మళ్ళీ ఫోన్ రింగ్ అయినట్లుగా వెలుగుతుంది.
“పర్లేదు మాట్లాడండి శైలేంద్ర గారు” అంటున్న పెద్దాయన వైపు చూస్తూ.. కరుణాసాగర్ గారి కంట పడకుండా మెల్లగా బయటకు నడిచాను.
“సార్! మీ అమ్మాయి ఫీవర్‍తో బాధపడుతున్నట్లుంది.. వెంటనే వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళండి. కళ్ళు తిరుగుతున్నాయంటుంది..”
నేనేమి మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాను కొద్ది క్షణాలు.
“మళ్ళీ కాల్ చేస్తాను..” అంటూ కాల్ కట్ చేశాను.
నేను అలా ఆందోళనగా ఉండటం గమనించిన మురుగన్ గారు..
“ఎనీ ప్రాబ్లం?”
అడుగుతుంటే ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాక అయోమయంగా వుండిపోయాను.
కరుణాసాగర్ గారు కూడా అప్పుడే అక్కడికి వచ్చారు. ఆయన ముక్కోపి.
నేను నా కష్టం చెబితే.. నా కష్టాన్ని అర్థం చేసుకోవడం కంటే కోప్పడేదే ఎక్కువ!
ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనుకుంటూ.. ఫైల్స్ చూపించే పనిలో నిమగ్నమయ్యాను. ఓ పది నిమిషాల తరువాత మళ్ళీ ఫోన్ వచ్చింది.
మురుగన్ గారు “సార్! ఏంటి ప్రాబ్లం?” అనునయంగా అడిగారు.
వెంటనే జరిగింది చెప్పాను.
“సార్! మీరు ముందు స్కూల్‍కి వెళ్ళి అమ్మాయిని ఇంటి దగ్గర దిగబెట్టి రండి..” అన్నారు మురుగన్ గారు.
“సార్.. అదీ.. ఇన్‍స్పెక్షన్ మధ్యలో.. కరుణా సాగర్ గారు ఏమంటారో..!?”
“రికార్డ్స్ పర్ఫెక్ట్‌గా వున్నాయి. నీ వర్క్ చాలా బాగుంది. నేను సార్‍కి చెబుతాను లే..”
ఆయన అన్న ఆ చిన్న మాటకే ఎంతో ధైర్యం వచ్చింది.
వెంటనే మా బాస్ గారి నుండి అనుమతి తీసుకుని సరిగ్గా పదినిమిషాల్లో స్కూల్‌కి చేరుకుని.. సృజనని సురక్షితంగా ఇంటికి చేర్చాను.
తిరిగి ఆఫీస్‌కి బయలుదేరుతుంటే.. “ఏవండీ! ఎండ వేళప్పుడు ఇంటికి వచ్చారు. ఓ గంట రెస్ట్ తీసుకుని వెళ్ళవచ్చు కదా. ఎప్పుడూ ఉండే ఆఫీస్ పనులే కదా?” అంది జానకి.
నిజానికి అంత ఎండలో బయటకు రావడం నాకు కూడా నీరసంగానే ఉంది.. కానీ ఆఫీస్‍లో సీన్ కళ్ళముందు కదిలి.. హడావుడిగా బయలుదేరాను.
ఏదైతేనేం ఆ రోజు ఆడిట్ విజయవంతంగా పూర్తయింది. మా బాస్ కూడా సంతోషంగా ఉన్నారు.
మురుగన్ గారు వెళుతూ చక్కని స్పీచ్ ఇచ్చి మాలో ఉత్సాహాన్ని నింపారు.
“డియర్ ఫ్రెండ్స్! ఆఫీస్‍లో మీరందరు చక్కని వర్క్ చేస్తున్నారు. మీ రికార్డ్స్, డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్‌గా వున్నాయి. ఏ సంస్థ అయినా ప్రగతి పథంలో పయనించాలంటే.. ఆ సంస్థ లోని ఉద్యోగులు పట్టుదలతో, అంకిత భావంతో పని చేయాలి. మీరు చేసే నేటి కృషి సంస్థ మరియు మీ భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. తప్పకుండా మీ సంస్థ మరియు మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని.. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించాలని అభిలషిస్తున్నాను. ఆడిట్ కోసం శ్రమించిన మీ అందరి శ్రమకి అభినందనలు. అలాగే ఆడిట్ విజయవంతమైంది.. త్వరలో మీకు ISO: 9001 సర్టిఫికెట్ అందజేస్తాము” అంటూ ఉద్యోగుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు ఆడిట్ టీం లీడ్ మురుగన్ గారు.
‘హడావుడి తప్పించుకోవాలంటే సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి.’ నిర్ణయించుకున్నాను.
సమాప్తం
(ఎప్పుడైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటామో అప్పుడు జీవితం సార్థకమవుతుంది. అప్పుడే అనుకున్న, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతాము. – రచయిత)