పల్లెకు పోదాం

1
3

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ నెల చివరి భాగం. ఎండలు చాల తీవ్రంగా వున్నాయి. హైదరాబాద్‌లో ముందే వచ్చేస్తుంది ఎండాకాలం. మే నెల పదిహేను దాటితే కొంచెం చల్లబడుతుంది.

అదొక ధనిక వర్గం నివసించే ప్రాంతం. అక్కడ కూడా ఏడు, ఎనిమిది అంతస్తుల అపార్టుమెంట్లు వున్నాయి. అవి బాగా విశాలమైనవి. రెండు మూడు అంతస్తుల మేడలు కూడ వున్నాయి. ప్రతి ఇంటి నుండి ఎ.సి.ల హోరు వినిపిస్తోంది. వేడి గాలులు బయిట తీవ్రంగా వున్నాయి.  బయట వున్న వెంటిలేటర్లు తిరుగుతున్నాయి. పైపుల ద్వారా నిరంతరం ఎ.సి.ల నీళ్లు కురుస్తున్నాయి. ఫాన్స్,  ఎ.సి.లు పని చేస్తూనే వున్నాయి. తాపం మాత్రం తగ్గటం లేదు. కోస్తా జిల్లాల వలె ఇక్కడ చమట పట్టదు.

మధ్యాహ్నం రెండున్నరయి పోయింది. రాఘవ, రమ అలసిపోయి ఇల్లు చేరుకున్నారు. ఇద్దరూ డాక్టర్లే. వంటమనిషి వంట చేసి, అన్నీ డైనింగ్ టేబుల్ పై సర్ది వెళ్లింది. రాఘవ, రమ – కొంచెం ఫ్రెష్ అయి భోజనం ముగించేరు. కాస్సేపు విశ్రమించడానికి పడక గది చేరుకున్నారు. ఉక్కపోత – తపన తీరటం లేదు. అటూ ఇటూ మంచం మీద దొర్లినా ఒక్కో రోజు నిద్ర రాదు. పది నిముషాలు కునుకు పడితే పండగే మరి! హాయిగా అనిపిస్తుంది.

సాయంత్రం ఆరుగంటలకు మళ్లీ హాస్పిటల్ చేరుకున్నారు. స్వంత హాస్పిటల్ అది, ప్రక్క వీధిలో వుంది. రాత్రి తొమ్మిది గంటలకు బయటకు రాగలిగేరు. కేసులు, రేపటి పని, అన్నీ ప్లాన్ చేసుకోవాలి. అటెండర్స్‌తో, వాచ్‌మాన్‌తో, ఆయాలతో – తగిన జాగ్రత్తలు, సూచనలు చెప్పాలి కదా!!!

రాఘవ ఇంటికి రెండిళ్ల అవతల డాక్టరు రవీంద్ర, అతని భార్య విభావరి వుంటున్నారు. వాళ్లిద్దరూ కూడ డాక్టర్లే కనుక వారి జీవన విధానం కూడ రమారమి ఇలాగే ఉంటుంది.

రాఘవ, రవీంద్ర పదో తరగతి నుండి క్లాస్‌మేట్స్, మంచి స్నేహితులు. ఇద్దరూ మెడిసిన్ ఒకే చోట చదివేరు. పై డిగ్రీలు కూడా పొందేరు. ప్రభుత్వ డాక్టర్లుగా కొన్ని సంవత్సరాలు పని చేసేరు. తరచుగా బదిలీలు, అదే రొటీన్ – వారికి నచ్చలేదు. పైగా వాళ్లకున్న నైపుణ్యాలు, వృత్తి పట్ల లక్ష్యాలు వలన ఆ ఉద్యోగ విధుల చట్రంలో కొనసాగడం కష్టమనిపించింది. పేషెంట్లను చూసి, వ్యాధులు తగ్గించి, సేవలందించి తృప్తి పొందే అవకాశాలు అంతగా లేకుండాపోయినవి. ఇద్దరూ వివాహాలు చేసికొన్నారు. పిల్లలు కలిగేరు. వాళ్ల విద్యాభ్యాసం, నాణ్యమైన పాఠశాలల్లో చేర్చడము, ఇవన్నీ గాడిలో పడుతున్నాయి – అనుకునేసరికి మూడేళ్లు గిర్రున తిరిగిపోయేవి. వెంటనే మరోచోటికి ట్రాన్సఫర్. ఈ చికాకులు భరించలేక వాళ్లు రాజీనామా సమర్పించి, హైదరాబాద్ మహా నగరం చేరుకున్నారు. అప్పటికి వాళ్ళు నలభయిల్లో వున్నారు – వయసు రీత్యా.

హైద్రాబాదుకు ఒక ప్రత్యేకత వుంది – పీఠభూమి, చక్కని అనుకూలమైన వాతావరణం. నగరం నాలుగు చెరగులా వ్యాపిస్తూనే వున్నది. సిరి తాండవించే నగరం. అక్కడి ప్రజల ప్రత్యేకత ఏమంటే అందరినీ స్వాగతించి అక్కున చేర్చుకొనగలిగే స్వభావం. జన జీవనం ప్రశాంతంగా ఉంటుంది. అందుచేత ఆంధ్రులే కాక ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు (తమిళులు, బెంగాలీలు, మరాఠీలు, వగైరా..) కూడా ఎందరో ఈ నగరంలో స్థిరపడతారు. జీవన స్థాయి కూడా చవక – శ్రీమంతులూ, అతి పేదలూ కూడ జీవనం సాగించవచ్చు.

అలా ఓ ప్రాంతంలో రాఘవ, రవీంద్ర ఇళ్లు నిర్మించుకున్నారు. అంచెలంచెలుగా వృద్ధి చెంది, మంచి హస్తవాసి గల వైద్యులు  గాను, రోగులను ప్రేమతో, దయతో చూసేవారిగాను పలుకుబడి సంపాదించుకున్నారు – ఆ దంపతులు. నలుగురికీ వృత్తి పట్ల కల నిబద్ధత వారికి శ్రీరామ రక్ష!

కాలగర్భంలో దశాబ్దాలు గల గల సాగిపోయేయి. ప్రస్తుతం స్నేహితులిద్దరూ అరవై ఏళ్ల వయస్సుకు చేరుకున్నారు. పిల్లల చదువులు పూర్తయి, వారుకూడా ఉద్యోగాల్లో స్థిరపడినారు. కొందరు విదేశాలకూ వెళ్లేరు. ప్రస్తుతం దంపతులిద్దరే వుంటున్నారు. రమ, విభావరి మంచి స్నేహితులయ్యేరు. తరచు రాక పోకలతో వాళ్ల రెండు కుటుంబాలవారు అక్క చెల్లెళ్లు/అన్నదమ్ముల వలె అరమరికలు లేని స్నేహ బంధంతో వున్నారు. ఒక్కో ఆదివారం ఒకరింటికి మరొకరు వెళ్తారు. అలా ఈ సారి రాఘవ ఇంటికి రవీంద్ర, విభ వచ్చేరు. ఉదయం అల్పాహారం అయి కబుర్లలో పడ్డారు.

ఇటీవల చదివిన పుస్తకాలు, మేగజైన్లు – అందలి విశేషాలు, నలుగురూ పంచుకుంటారు. జపాన్‌లో నివేశన స్థలం అతి తక్కువ, ఇక నగరాలలో జీవనస్థాయి సామాన్యులు భరించలేరు. టోక్యో నగరం ప్రపంచంలోకెల్లా అతి ఖరీదైన జీవన ప్రమాణం కలదిగా చెప్తారు కదా! కొన్ని సంవత్సరాలుగా మార్పులు వస్తున్నాయి. కొందరు వయోజనులు, ఇతరులూ కూడ దూరంగా గ్రామ ప్రాంతం చేరి, చిన్న కుటీరం వేసికొని, కనీసపు అవసరాలతో శాంతీయుత జీవనం గడుపుతున్నట్లు – విశేషాలన్నీ చర్చించుకున్నారు.

అంతెందుకు, మన కర్ణాటకలో బెంగుళూరు సంగతి? భారతదేశపు ‘సిలికాన్ వేలీ’గా సాఫ్ట్‌వేరు పరిశ్రమకు కేంద్రం కద. నిత్యం సిటీ – జనంతో, వాహనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. రహదారుల రద్దీ – ట్రాఫిక్ సిగ్నల్స్ ఆంక్షలు ఖచ్చితంగా పాటిస్తారు. దూర ప్రాంతాలు చేరుకోవాలంటే, కొన్ని గంటల ముందు బయల్దేరిన గమ్యం సకాలానికి చేరగలమో లేదో నమ్మకం లేదు. ప్రయాణాలు చేసే వారు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలో చేరుకోడానికి పడే యాతన, ఒత్తిడి – వర్ణించనలవి కావు. చాలా సార్లు ఆ రైలు వెళ్లి పోతుంది. ఆ విమానాలకు గేటు మూసేస్తారు. ఇవన్నీ ప్రయాణీకులకు అనుభవం వున్నవే!

విసిగి పోయిన జనం గ్రామాలకు తరలి వెళ్తున్నారు. అలాంటి కుటుంబాల గురించి ఓ ప్రముఖ వార్తా పత్రిక మేగజైన్ సెక్షన్‌లో గొప్ప వ్యాసం ప్రచురించింది.

అరవై సంవత్సరాలు నిండి, బాధ్యతలు తీరి, ఇంకా నగరం పట్టుకొనే వెళ్లాడకుండా, గ్రామాలకు చేరుకొని కొంత పొలం కొనుక్కున్నారు. ప్రక్క ప్రక్కన ఇళ్లు  నిర్మించుకున్నారు. చిన్న కుటీరాల వలె; సోలార్ పానల్స్ వేసికొని, కొన్ని ఆధునిక సదుపాయాలు, రక్షణ సమకూర్చుకున్నారు. సేంద్రీయ పద్ధతిలో ఆర్గానిక్ కూరగాయలు, చిరుధాన్యాల పెంపకం చేపట్టారు. సిటీల్లోను, పట్టణాలాల్లోను కూరగాయలకు, ఆకుకూరలకు రంగు పూసి ఆకర్షణీయంగా కన్పించేలా చేస్తారు. తీరా కడిగితే తెలుస్తుంది. పైన చెప్పిన విధంగా పండించిన కూరగాయల రుచే వేరు. ఆరోగ్యంతో పాటు చిన్న రుగ్మతలన్నీ దూరం. ఈ విషయాలు నలుగురూ చర్చించారు.

సడన్‌గా రవీంద్ర అన్నాడు “రాఘవా, మనం కూడా ఆ పని చేద్దామా, మీరు, మేము – పల్లెకు పోదాం. మన స్నేహితులతో కూడా ఈ ఐడియా షేర్ చేద్దాం. శాంతిగా, ప్రకృతి ఒడిలో జీవించవచ్చు. నలుగురికి ఉపాధి సమకూర్చవచ్చు. స్థానికులకు అవసరమైన వైద్యం కూడా సమకూర్చవచ్చు. ఇంతకాలం, బాల్యం, యవ్వనం, చదువు కోసం, తర్వాత సంపాదన, సంసారం – ఇలా సాగిపోయింది జీవితం. ఇప్పుడు వయస్సు పైబడుతోంది. ఎంతకాలం రొటీన్ అంటూ పరుగులు తీస్తాం? అయినా నగరాల్లో వుండి ఇంకా సంపాదించి ఏం చెయ్యాలి. మన పిల్లలు చక్కగా సెటిల్ అయేరు. మనకన్న ఎక్కువే సంపాదించుకుంటున్నారు. మనం వాళ్లకు ఏదైనా ఇస్తే నవ్వుతున్నారు ‘ఎందుకు డాడీ – ఎందుకు మమ్మీ’ అంటున్నారు. వాళ్లు మనం ఎక్కడ ఉంటే అక్కడికే వస్తారు. ఏమంటావు రాఘవా, రమ గారూ మీ అభిప్రాయం చెప్పండి. విభా, నీకు సమ్మతమేనా?”

అందరూ కరతాళ ధ్వనులు చేసేరు. “గుడ్ ఐడియా – దీన్నే ‘మినిమలిజం’ అని నేడు అంటున్నారు. పూర్వం వానప్రస్థ జీవితాలను పెద్దలెందరో గడిపేరు. ఆధునిక యుగంలో ప్రకృతికి దగ్గరగా, కాలుష్యానికి దూరంగా, వత్తిడి లేకుండా, స్వచ్ఛమైన గాలి, నీరు, అనుభవించి సుఖపడడం – అవసరాలు తగ్గించుకోవడం” – ఇలా ఆ నలుగురూ ఆనందంతో పులకరించేరు. చిన్న పిల్లలుగా మారిపోయి, కాసేపు గెంతులు వేసేరు.

నాలుగైదు నెలల్లో తమ ప్రణాలికను అమలు జరిపే చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామంలో పొలం కొన్నారు. తరలి వెళ్లేరు. రాఘవ, రవీంద్ర గ్రామ పెద్దలను కలిసేరు. పోలీసు, పోస్టు మాస్టరు మొదలగు కీలక వ్యవస్థల పెద్దలతో పరిచయం ఏర్పరచుకొని,  సహకరించమని కోరేరు.

చిన్న డాబా ఇళ్లు నిర్మించుకున్నారు. ముందు వరండా, తర్వాత పెద్ద హాలు, అందులనే ఓ పక్క స్టడీ కోసం, వచ్చిన అతిథులతో మాట్లాడ్డానికి ఏర్పాట్లు; మరో ప్రక్క పుస్తకాల కోసం గాజు తలపులతో అలమార్లు నిర్మించుకున్నారు. అది గ్రంథాలయం. రెండు పడక గదులు, వంట గది, స్టోర్ రూమ్. ఇలా మోడరన్ ప్లాన్ ఆర్కిటెక్ట్‌తో వేయించారు. రాఘవ, రవీంద్రల ఇళ్లు పక్క పక్కనే – ఒకే కాంపౌండ్, ఒకరింట్లోంచి మరొకరి ఇంటికి వెళ్లేందుకు భద్రమైన ఏర్పాట్లు. సహజమైన గాలి, వెలుతురు లభించేలా నిర్మాణం, వాచ్‌మేన్‌కు చిన్న ఇల్లు..

పల్లె జనం వీళ్లను  స్వాగతించారు. సహాయం చేసేరు. ఆత్మీయంగా “మేమున్నాం మీకు తోడుగా” అని చెప్పి వెళ్లేరు. గ్రామంలోని పెద్దలను సంప్రదించి వాచ్‌మాన్‌ను, పనివారిని నమ్మకస్తులను నియమించుకున్నారు. వారి దినచర్య ఉదయం ఆరు గంటలకు ప్రారంభం. నేరుగా తోటలోనికి నలుగురూ వెళ్తారు. మొక్కలు, పాదులు, గమనిస్తారు. కలుపు మొక్కలు ఉంటే తీసేస్తారు. బోదె సరి చేస్తారు. ఎదిగిన కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు కోసి తెచ్చుకుంటారు. మొక్కలకు పైపుల ద్వారా, స్ప్రింకలర్స్ ద్వారా నీళ్లు అందిస్తారు.

అరటి, మామిడి, సపోటా వంటి ఫలాలినిచ్చే మొక్కలు, వేప, కొబ్బరి – ఇలా అనేక రకాల మొక్కలు నాటేరు. చూస్తూండగా తొమ్మిదవుతుంది. ఇళ్లలోకి వెళ్లి, దినచర్యలో లీనమవుతారు. వార్తా  పత్రికలు, మేగజైన్లు వస్తాయి.

కాలాన్ని బట్టి ఆరుబయట స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి లభించే ప్రదేశంలో కూర్చుంటారు. వైద్యం కోసం పల్లెవాసులు వస్తున్నారు. గ్రామ పెద్దల సలహా మేరకు గ్రామంలో ఒక క్లినిక్ తెరిచేరు. నలుగురిలో ఒకరిద్దరు చొప్పున వెళ్తారు. వైద్యం, మందులు, ఉచితం. ప్రజలతో మైత్రీ బంధం పెరుగుతున్నది. వాళ్లు కూడా – పాలు, పెరుగు, పళ్లు, అటుకులు, వగైరా తెచ్చి ఇస్తూంటారు.

సంవత్సరకాలం గిర్రున తిరిగింది. రాఘవ కుమారుడు శరత్ కుటుంబ సమేతంగా అమెరికా నుండి వచ్చేడు. “డాడీ, మీరు లైఫ్ ఎంత హాయిగా గడుపుతున్నారో, చూస్తూంటే ముచ్చటగా వుంది. నేను కూడా, త్వరలో ఇండియా వచ్చేస్తాను” అన్నాడు.

రవీంద్ర కుమార్తెలు వచ్చేరు. ఆ జీవితాన్ని ఎంతగానో ఆస్వాదించేరు. ఒక నెల రోజులు తనివి తీర ఎంజాయ్ చేసేరు.

“జాన్ రస్కిన్ చెప్పినట్లు – ‘There is no wealth but life’ (సంపద అంటూ వేరే ఏమీ లేదు. ఉన్నది కేవలం జీవితం మాత్రమే) అంటే ఇదే కదా అనుకున్నారు.

మహాత్మా గాంధీ ఏనాడో చెప్పేరు ‘ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది. కాని అత్యాశలను కాదు’. Consumption (వినియోగం) కాదు Conservation (పరిరక్షణ)కు ప్రాధాన్యం ఇవ్వాలి. ‘Small is beautiful’ అని ‘Sustainable development’ అని కొత్త పదాలు పాశ్చత్య శాస్త్రజ్ఞులు గాంధీజీ స్ఫూర్తి తోనే వక్కాణించేరు.

ఒకరితో  ఒకరు పోటీపడి ఆర్ధిక వ్యవస్థలను, మారణాయుధాలను పెంచుకుని, ధనిక దేశాలుగా ఎదిగిన దేశాలు వాతావారణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. జర్మనీ వంటి దేశాల్లో గాలి, నీరు కలుషితమయి ‘acid rains’ కురిసేయి కదా. సహజ వనరులను లెక్కచేయని నాడు ప్రకృతి ప్రకోపిస్తుంది. తానున్నాని తెలియ చేస్తుంది. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అమ్మా” అంటూ విభావరి పిల్లలు శాంత, శారద మురిసి పోయేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here