నాదొక ఆకాశం-1

9
3

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[dropcap]“క[/dropcap]ట్” అన్నాడు డైరెక్టర్ శ్రీవిక్రమ్.

ఆ మాట వినగానే, అసిస్టెంట్ గొడుగు తెరిచి పట్టుకుని, అప్రమత్తంగా నిలబడ్డాడు. నేను కూడా సంసిద్ధంగా నిలబడ్డాను. డైరెక్టర్ కట్ చెప్పగానే, సంజయ్, హీరోయిన్ కౌగిలిని విడిపించుకుని, తన వ్యానిటీ వ్యాన్ వైపు నడిచాడు. సంజయ్ గొడుగు నీడలో నడుస్తుంటే, నేను వెనుకగా నడిచాను.

సంజయ్ పక్కనే నడుస్తూ వస్తున్న డైరెక్టర్ ఏదో చెప్పబోతుంటే, అతని మాటలు వినిపించుకోకుండా, మొబైల్ ఫోన్ చూసుకుంటూ సంజయ్, డైరెక్టరుకు నా వైపు చూపుడు వేలు చూపించాడు.

అంటే, ఏదైనా విషయం ఉంటే, తన పీఏ నైన నాకు చెప్పమని దాని అర్థం. సంజయ్ వెంట నడుస్తున్న నేను అది గమనించి, ఆగిపోయి,

“సార్!” అంటూ డైరెక్టర్ గారి దగ్గర చేతులు కట్టుకుని వినయంగా, ‘చెప్పండి సార్!’ అన్నట్టుగా నిలబడ్డాను.

అందుకే, తన ఎదురుగా వినయంగా నిలబడిన నన్ను చూసి,

‘అందరూ, ఈ సంజయ్‍తో సహా అలా వినయంగా నా ముందు నిలబడ్డ వాళ్ళే. సంజయ్ వాళ్ళ నాన్న సుధాకర్ నాయుడు గారు తీసుకొచ్చి తన చేతుల్లో పెడుతూ, ‘వీణ్ణి గొప్ప హీరోగా చేయాల్సిన బాధ్యత నీదే విక్రమ్!’ అన్నప్పుడు ఇంతకన్నా ఇంకాస్త ఎక్కువే వంగి వినయంగా నిలబడ్డాడు. ఇప్పుడేమో, సంజయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి బంపర్ హిట్ ఇచ్చి టాలీవుడులో పదిలమైన స్థానాన్ని కల్పించిన తనకే సంజయ్‌తో నేరుగా మాట్లాడడానికే వీలులేదు. అంత ఎత్తుకు ఎదిగిపోయాడు, ప్యాన్ ఇండియా హీరో అయ్యాడు. తనేమైనా చెప్పదలుచుకున్నా, పీఏల ద్వారా, అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారానే మాట్లాడాలి.’ అని అనుకున్నాడేమో, శ్రీవిక్రమ్ గారి ముఖంలో బాధ గోచరించింది. కాబట్టే మనసులోనే బాధగా నవ్వుకున్నట్టుంది.

ఆయన పక్కనే నిలబడి ఉన్న నేను ఆయన ముఖంలోని భావాలను చదవగలిగాను. ఎందుకంటే, ఈ సినిమా ఫీల్డులో, ఎవరైనా పైకి నవ్వినా ఆ విషయం, క్షణాల్లో ఎందరికో చేరిపోతుంది. చాలా మంది ఆ నవ్వును పరిపరి విధాల అర్థం ఏమో గానీ, అపార్థం చేసుకుంటారన్న విషయం కూడా నాకు తెలుసు.

ఆ బాధ కనిపించకుండా, డైరెక్టరుగారు నా భుజం మీద చేయి వేసి,

“సమీర్! ఔట్ డోర్ ప్లాన్ చేయాల్సి ఉంది. ‘కీవ్’ తెలుసుగా? ఉక్రెయిన్ దేశపు రాజధాని. ఈ మధ్యే ఒక హిందీ సినిమా అక్కడ షూట్ చేసారు. లొకేషన్లు అద్భుతంగా ఉన్నాయి. టాలీవుడ్ దృష్టి ఇంకా ఆ లొకేషన్ల మీద పడలేదు. మనమే మొదటిసారి తీయాలని ప్లాన్ చేస్తున్నాం. అక్కడ రెండు పాటలు షూట్ చేస్తే సినిమా దాదాపు పూర్తయినట్టే! ఆ షెడ్యూలు పూర్తి కాగానే, సినిమా తొందరగా రిలీజ్ చేయాలని నిర్మాత ఒత్తిడి చేస్తున్నారు. సమీర్! సంజయ్ బాబుతో చెప్పి నెల తర్వాత ఉండేట్టుగా ఒక వారం రోజుల కాల్ షీట్లు కేటాయించు. రానూ పోనూ రెండ్రోజులు పోయినా ఐదు రోజుల్లో రెండు పాటలు షూట్ చేసుకుని వచ్చేద్దాము. బాబు డేట్స్ కన్ఫర్మ్ చేయగానే వీసా, హోటల్, ట్రావెల్, లొకేషన్, లోకల్ డ్యాన్సర్స్ అరేంజిమెంట్స్ చూసే కోఆర్డినేటర్‌కు చెపుతాను. ప్లీజ్!” అన్నాడు.

“అయ్యో! అదేంటి సార్! మీరు ప్లీజ్ అనడమేంటి? నేను తప్పకుండా రేపటి లోపల మీకు శుభవార్త చెపుతాను. సరేనా సార్!” అన్నాను నేను నవ్వుతూ.

నేను మాట ఇచ్చానంటే, సంజయ్ మాట ఇచ్చినట్టే అని టాలీవుడ్ జనాలకో నమ్మకం. కానీ, ఏ విషయంలోనైనా సంజయ్‌ని కన్విన్స్ చేయడం, ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు.

నేను డైరెక్టరు గారితో ‘రేపు శుభవార్త చెప్తాన’ని ధీమాగా చెప్పడానికి కారణమేమిటంటే, మేం ఉదయమే, ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న సినిమా గురించే చర్చించాము. నాకు ఆ రోజు ఉదయం, షూటింగ్ బయల్దేరే ముందు మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.

***

ఇవ్వాళ్టితో ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తయితే, సంజయ్ ఒక వారం రోజుల పాటు శ్రీశైలం దగ్గరలో ఉన్న నల్లమల అడవుల్లోని మూలికా వైద్య చికిత్సకు వెళ్ళవలసి ఉంది. అందుకే, ఆ రోజు ఉదయం ప్రశాంతంగా కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు,

“బాస్! ఇవ్వాళ్టితో ‘త్రిబుల్ యస్’ వాళ్ళ షూటింగ్ అయిపోతుంది! మరి..?” అని సంజయ్‍ని అడిగాను.

సంజయ్ నా వైపు, ‘ఏమిటి?’ అన్నట్టుగా ఆసక్తిగా చూసాడు, తన అపాయింట్మెంట్సును చూడాల్సిన బాధ్యత నాదే కాబట్టి,

“బాస్! వీళ్ళవే రెండు పాటలు యూరపులో షూట్ చేయాల్సి ఉంది. మనం డేట్స్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు మిగిలిన పనులు చూసుకుంటారు. ఈ లోపల మీరొక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన అపాయింట్మెంట్ ఉంది. మీరొచ్చాక పది రోజులు, ఈ నెల ఆరో తేదీ నుండి పదిహేను వరకు మనం డైమండ్ రాజు గారి సినిమాకు కాల్ షీట్లు ఇచ్చాము. అది పూర్తయ్యేసరికి మీరు ఉక్రెయిన్ వెళ్ళాల్సిన తేదీ దగ్గర పడుతుంది.” అని డైరీ చూసుకుంటూ చెప్పాను.

సంజయ్ ఆలోచిస్తూ,

“నువ్వు కూడా యూరపుకు రారా! ఎంజాయ్ చేద్దాం!” అన్నాడు.

“నేనెందుకు బాస్! ఆ వారం రోజులు నేను అమ్మను చూడ్డానికి ఊరెళ్దామనుకుంటు..” అని అంటుంటే నన్ను మధ్యలోనే ఆపి,

“అరేయ్ సమీర్! ఈ ఒక్క సారికి రారా! నేను స్వామీజి దగ్గరకు శ్రీశైలం వెళ్ళినప్పుడు, నువ్వు మీ ఊరెళ్ళి అమ్మ దగ్గర గడిపి రా!” అన్నాడు.

“మరి స్వామీజీ దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక్కడివే వెళ్తావా?” అని నాలుక కరుచుకున్నాను ‘ఏక వచనం’లో సంబోధించినందుకు. అది గమనించిన సంజయ్,

“అరేయ్! నలుగురున్నప్పుడు నువ్వు నన్ను బాస్‍గా గౌరవిస్తే చాలు. ఇంట్లో అవసరం లేదు. నువ్వు కూడా బాగా నటించడం నేర్చుకున్నావురా? ఎప్పుడో నా ప్లేస్ కొట్టేసేటటేటున్నావ్!” అన్నాడు నవ్వుతూ.

“సంజయ్! ఆ మాట అనకు రా! నా బొందిలో ప్రాణం ఉండగా నీకు నేను ద్రోహం చేయను. నా ప్రాణాలైనా..” అంటూ చెమర్చిన కళ్ళతో అంటున్న నన్ను ఆపి,

“అబ్బబ్బ, షూటింగులోనే ఎమోషనల్ డైలాగులంటే నాకు చిరాకు. ఇంట్లో కూడా ఎందుకురా! సారీ రా, ఓకేనా! ఇంక దాని గురించి మర్చిపో! నేను శ్రీశైలంకు అమ్మను తీసుకు వెళ్దామనుకుంటున్న! తనకు కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువవుతున్నాయి. ఒకసారి గురువు గారికి చూపించాలనుకుంటున్నాను.”

“గుడ్ ఐడియా! ఈ దెబ్బతో అమ్మతో నువ్వు శ్రీశైలం, నేను మా ఊరు, మనిద్దరం నెల తర్వాత ఉక్రెయిన్.. గుడ్.. గుడ్.. అయినా నీ బుర్రే బుర్రరా! అన్నీ నువ్వే ఆలోచిస్తావ్! కానీ అనవసరంగా నన్ను వాగిస్తావ్!” అన్నాను కినుకగా.

“ఆఁ మరి! పీయ్యే అంటే ఆ మాత్రం బుర్ర షార్ప్‌గా ఉండాలి కదరా! అందుకే..” అని నవ్వాడు. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ ముందు నుండి లేచి,

“నేను అమ్మకు ఈ విషయం చెప్పి వస్తా! మనం బయల్దేరుతున్నామని యూనిట్ వాళ్ళకు ఫోన్ చేయి.” అంటూ కింది అంతస్తులో ఉన్న వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళాడు.

***

డైరెక్టర్ గారు భుజం మీద చెయ్యి వేసేసరికి ఉలిక్కి పడిన నేను, నా ఆలోచనల నుండి తేరుకున్నాను.

“థ్యాంక్యూ సమీర్! నువ్వు లేకపోతే..” అని మిగిలిన మాటలను మింగేసి,

“అరగంటలో హీరోయిన్ కాస్ట్యూమ్ ఛేంజ్ చేసుకుంటుంది. ఈ లోపల కెమెరామెన్ లెన్సులు మార్చి, లైటింగ్ సిద్ధం చేస్తాడు. బాబుని కూడా కాస్ట్యూమ్ మార్చుకోమని చెప్పు!” అన్నాడు.

‘‘సరే సార్!” అని సంజయ్ ఉన్న వ్యానిటీ వ్యాన్ వైపు నేను నడుస్తుంటే,

డైరెక్టర్ తన సీటు దగ్గరకు వెళ్తూ వెళ్తూ, అసిస్టెంట్ డైరెక్టరును పిలిచి,

“సమీర్ రమ్మన్నప్పుడు వ్యానులోకి వెళ్ళి, బాబుకు సీన్ వివరించు. జాగ్రత్త! పోయినసారిలా తన్నులు తిని రాకు. లోపల సమీర్ ఉంటాడు కాబట్టి ఫర్వాలేదు. కానీ, అతి చేయకు. లోపల ఇంకెవ్వరున్నా.. అర్థమయిందా.. ఎవ్వరున్నా అటు వైపు చూడొద్దు. ఏంటి?” అనడం వినిపించి,

నేను వినయ్, అసిస్టెంట్ డైరెక్టరు వైపు చూసాను.

ఈ వినయే, అంతకు ముందొక సారి సంజయ్‍కు, హీరోయినుకు సీన్ వివరించడానికి వ్యానులోకి వెళ్ళినప్పుడు, మాటిమాటికీ హీరోయిన్ తొడల వైపు, వక్షం వైపు చూస్తుంటే, సంజయ్ వినయ్ చెంప పగలగొట్టి, ‘గెటౌట్!’ అని బయటకు నెట్టేసాడు.

హీరోయిన్లు ఎటూ షూటింగుల్లో ఎక్స్‌పోజ్ చేసి నటిస్తున్నారని, ప్రైవేటుగా, ఇద్దరు ముగ్గురే ఉన్నప్పుడు కూడా, వాళ్ళ వంక కళ్ళప్పగించుకుని చూడడం మ్యానర్స్ కాదు. కానీ, వీళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. హీరోలతో తన్నులు తింటారు. తర్వాత బయటకెళ్ళి హీరోలను బద్నాం చేస్తారు. నేను కూడా అప్పుడు, ఆ విషయం గురించి డైరెక్టరుకు కంప్లైంట్ చేసాను. అది మనసులో ఉంచుకునే, ఇప్పుడు డైరెక్టర్ గారు వినయ్‍కి ఆ వార్నింగ్ ఇచ్చాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ వినయ్ కళ్ళల్లో భయం కనిపించింది. అయినా,

“సరే!” అన్నట్లుగా తలూపాడం చూసి, జాలిగా నిట్టూర్చి, ‘సంజయ్’ అని మెరూన్ కలర్ అక్షరాలు రాసి ఉన్న వ్యానిటీ వ్యానులోకి అడుగు పెట్టాను. ఆ అక్షరాలలో ‘S’ ‘Joy’ మాత్రమే హైలైట్ గా కనిపిస్తాయి.

సంజయ్ ఆ వ్యానును ఎంతో ఇష్టంగా ఐదారు కోట్లు పెట్టి ముంబయిలో డిజైన్ చేయించుకున్నాడు. షూటింగ్ గ్యాపులో, పదిహేను నిమిషాల వ్యవధి ఉన్నా, వ్యానులోకి వచ్చేస్తాడు.

***

డైరెక్టరుతో మాట్లాడి, నేను లోపలికి వెళ్ళే సరికి, సంజయ్, కాస్ట్యూమ్ విప్పి రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాడు.

అతను కూర్చున్న ‘సిక్సో మాసేజ్ కుర్చీ’ మసాజ్ చేస్తున్నట్టుగా వినిపిస్తున్న సన్నటి ధ్వని తప్ప వ్యానిటీ వ్యాన్ అంతా నిశ్శబ్దంగా ఉంది. నేను లోపలికెళ్ళి, సంజయ్‌కి ఇష్టమైన, పాత తెలుగు పాటలను మినిమం వాల్యూమ్‌లో పెట్టి, నిశ్శబ్దంగా బయటకు నడిచాను.

వ్యానిటీ వ్యాన్ తలుపు దగ్గర, బయట చుట్టుపక్కల యూనిట్ వాళ్ళు గట్టిగా శబ్దాలు చేయకుండా కాపలాగా నిలబడ్డాను. పదిహేను నిమిషాలకు టైమర్ సెట్ చేసాడు. ఇంతలో నా మొబైల్ మోగింది.

హీరోయిన్ ‘త్రక్ష’ ఫోన్ అది.

“మేడమ్?” అన్నాను.

“బాబుని కలవాలి.” అంది ఇంగ్లీషులో.

“పదిహేను నిమిషాల రెసెస్ {విశ్రాంతి} లో ఉన్నారు మేడమ్! నేను ఫోన్ చేయనా తర్వాత?” అని అడిగాను.

ఆమె ‘సరే’ననడంతో, ఫోన్ పెట్టేసాను. దూరం నుండి అసిస్టెంట్ డైరెక్టర్, ఫైల్ ఊపుతూ, ‘రావచ్చా?’ అంటూ సైగ చేస్తుండడం చూసి, అతని భయానికి నవ్వుకుని,

నేను చేతితో మూడు సార్లు ఐదు వేళ్ళు ముడిచి, ‘పదిహేను నిముషాల తర్వాత’ అన్నట్టు సైగ చేసాను.

అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడే, చెట్టు కింద ఉన్న పెద్ద రాయి మీద కూర్చున్నాడు.

నాక్కూడా కొంత సేపు విశ్రాంతే. ప్రొడక్షన్ వాళ్ళకు ఫోన్ చేసి నా కోసం, ఒక స్ట్రాంగ్ కాఫీ తెమ్మని చెప్పాను. నా కోసమంటే మంచి కాఫీ వస్తుంది. సంజయ్ అయితే, అసలు ప్రొడక్షన్ వాళ్ళ ఫుడ్ తీసుకోడు. లంచ్ టైముకు ఇంటి నుండి క్యారేజ్ వస్తుంది.

ప్రొడక్షన్ అబ్బాయి ఇచ్చిన కాఫీ గ్లాసు అందుకుని, ఒక సిప్ చేసే సరికి, స్వర్గం దిగి వచ్చినంత ఆనందంగా ఉంది. కాస్త విశ్రాంతి చిక్కగానే మనోభిరామ్, అదే నా మనసు గారు, ముందుకొచ్చేస్తాడు.

***

సినిమా రంగంలో కొన్ని నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. బయటకు చూడ్డానికి మాత్రం హీరోలు దైవాంశసంభూతులుగా కనిపించినా వాళ్ళకూ సాధారణ మనుష్యులకు ఉండేటువంటి అన్ని బలహీనతలూ ఉంటాయి. కానీ, అవి బయటపడకుండా, చాలా అద్భుతంగా వేదికల మీద కూడా నటిస్తుంటారు. హీరోలు మాత్రమే కాదు, నిర్మాతలు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సంగీత దర్శకులు అందరూ అంతే. హీరయిన్లైతే ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు, తను చేసే సినిమాలోని హీరోనుద్దేశించి,

“బాబు సెట్లో ఉంటే, ఆ ఉత్సాహమే వేరు. బాబు ఫోటో నా మొబైల్లో వాల్ పేపరుగా పెట్టుకున్నాను. నాకెప్పుడైనా డల్‌గా ఉంటే ఆ ఫోటోను చూడగానే నాకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది.” అని వయ్యారాలు పోతుంటారు. అలా, హీరోలకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు బిస్కెట్లు వేస్తుంటారు.

ఆ సదరు హీరోయినుకు పెళ్ళైనా, బాయ్ ఫ్రెండ్ ఉన్నా, ‘హీరోను చూస్తేనే ఎనర్జీ వస్తుంద’ని అంటే ప్రేక్షకులు నవ్వుకోరా అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు.

ఇలా వేదికల మీద, ఇంటర్వ్యూలలో, టాక్ షోలలో చెప్పే మాటలు నమ్మే అభిమానులు కూడా ఉంటారు.

***

నేను కూడా అలా నమ్మిన వాణ్ణే. నేను ‘ఇన్ఫోసిస్’ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, సంవత్సరం క్రింద ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది సంజయ్ దగ్గర నుండే.

సంజయ్, నేనూ బీటెక్‌లో క్లాసుమేట్సుమి. బాగానే పరిచయం ఉండేది. మొదట్లో బిగుసుకుపోయినట్టుండే సంజయ్ తరువాత్తరువాత మా గ్రూపులో యాక్టివ్‌గా తయారయ్యాడు. వాళ్ళు మొదటి నుంచి ధనవంతులే. వాళ్ళ కుటుంబానికి చాలా వ్యాపారాలున్నాయి.

అందులో ఫిల్మ్ ఫైనాన్సింగ్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకటి. సంజయ్ అప్పుడే కాలేజీకి రోజుకో కారులో వచ్చేవాడు. చూడ్డానికి అందంగా ఉండడం, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుండడంతో అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా లేకుండా మా సహ విద్యార్థులు అతని వెంబడి పడేవారు.

నాకు చదువుకుని, క్యాంపస్ రిక్రూట్‌మెంటులో మంచి ఉద్యోగం సంపాదించడం ముఖ్యం కాబట్టి నేను అంటీముట్టనట్టుగా ఉండేవాడిని. నేను చదువుల్లో ఫస్ట్ కాబట్టి నా వెంట కూడా కొంత మంది అమ్మాయిలు పడేవారు. అది సంజయ్‌కి నచ్చేది కాదు. అంత డబ్బున్న తన వెంట కాకుండా, ఒకరిద్దరైనా సరే, నా వెంటపడడం, అతనికి కంటగింపుగా ఉండేది. తన మాటల్లో ఆ నిరసనను వ్యక్తపరిచేవాడు కూడా. తనేదైనా మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారని గ్రహించేవాడు కాదు. మనసు మంచిదే అయినా పొగరు, ఈగో వంటి ధనిక కుటుంబాల పిల్లలకుండే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, చివరకు థర్డ్ ఇయర్లో నాకు క్యాంపస్ సెలక్షన్స్‌లో ‘ఇన్ఫోసిస్’లో ఉద్యోగం వచ్చినప్పుడు మాత్రం, అందరూ కంగ్రాట్యులేట్ చేస్తున్నా, తన కళ్ళల్లో మాత్రం భయం కనిపించింది. మేమిద్దరమే ఒంటరిగా ఉన్నప్పుడు,

“నిజంగానే వెళ్ళిపోతావారా?” అని బేలగా అడిగాడు.

“నేను చదువుతున్నదే ఇందు కోసం కదరా? మా అమ్మ మోస్తున్న భారం కొంతనైనా తగ్గించి, ఆమెను సుఖపెట్టే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను రా!” అన్నాను.

సంజయ్‍కి  కోపం వచ్చి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు.

ఇంజనీరింగ్ అయిపోయిన మూడేళ్ళ తర్వాత, అంటే నేను మూడేళ్ళ పాటు ‘ఇన్ఫోసిస్’లో ఉద్యోగం చేసిన తర్వాత నాకు వాడి దగ్గర నుంచి, ఫోన్ వచ్చింది..

***

అప్పుడే పదిహేను నిముషాలు గడిచినట్టుగా టైమర్ జేబులో వైబ్రేట్ అయింది. నేను ఆలోచనల్లో నుండి తేరుకుని, వ్యానులోకి మెల్లిగా ప్రవేశించి చూసాను. సంజయ్ కూడా లేచి కూర్చుని, ఫోన్ చూసుకుంటున్నాడు. నేను దగ్గరకు వెళ్ళి,

“పదిహేను నిముషాల్లో షాట్ రెడీ అవుతుంది. అసిస్టెంటును పిలవనా సీన్ ఎక్స్‌ప్లైన్ చేయడానికి.” అన్నాను, ఫ్లాస్క్ లోని వేడి నీళ్ళల్లో గురూజీ ఇచ్చిన పౌడర్ కలిపి గ్లాసులో పోసి ఇస్తూ. సంజయ్ సిప్ చేసి తాగిన తర్వాత ‘సరే’ అన్నాడు.

నేను బయటకొచ్చి వినయ్‌ని రమ్మని పిలిచాను. వినయ్ లోపలికొచ్చి,

“సార్! కొన్ని కంటిన్యూటీ షాట్లు ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల డైలాగులు సరిపడా లిప్ లేదు. ఇంకా..” అంటుండగానే, వ్యానిటీ వ్యాన్ తలుపు తెరుచుకుంది.

***

ఇందాకటి సీనులో పచ్చటి కాస్ట్యూములో ముద్దబంతిలా అలరించిన త్రక్ష, ఇప్పుడు తెల్లటి గౌనులో మంచు పువ్వులా కన్పించింది. త్రక్ష తన శరీరాన్ని దాచుకోవడానికి బట్టలు కట్టుకుంటుందో లేక తన శరీరంలోని పసిడి పరువాలు ఎవరికి ఎంత కావాలో అంతలా ప్రదర్శించడానికి కుట్టించుకుంటుందో తెలియదు గానీ, ఆమె ఆ డ్రెస్సులో, మిఠాయి కొట్టు అద్దాల నుండి ఊరిస్తూ కనిపించే, వెండి రేకులో చుట్టి పెట్టిన, కలాకండ మిఠాయిలా ఊరిస్తూ ఉంది. అంత సన్నటి నడుము అంత ఘన వక్ష సౌందర్యాన్ని ఎలా మోస్తుందోనని నాకో అనుమానమొచ్చింది. పాపం, ఆ బాధ నుండి ఆమెకు విముక్తి కల్పించాలనే కోరిక పీడిస్తుంది ఎవరికైనా ఆ క్షణాన.

అట్లా హీరోయిన్లను చూడడం మ్యానర్స్ కాదని అందరికీ చెప్పే నేనే, ఒక్క లిప్తపాటు కాలం, ఆ విషయం మరిచిపోయాను. ఆ హీరోయిన్ పంచుతున్న అందాల విందు ప్రభావం అంతలా ఉంది మరి. అందుకే వెంటనే, నా లోని విజ్ఞత మేల్కొని నేను నా ఆలోచనలను అదుపులో పెట్టుకుని అక్కడి నుండి లేవబోతుండగా వినయ్ కోసం చూసాను. వినయ్ అయితే అప్పటికే వ్యాన్ తలుపు దగ్గర, తలుపు తెరవడానికి తంటాలు పడుతున్నాడు. వినయ్‌కి సంజయ్ అంటే, ఎప్పుడు తంతాడో, ఎప్పుడు పలకరిస్తాడో తెలియక, తెలియని భయం పట్టుకుంది.

హీరోయిన్ రంగ ప్రవేశం చేస్తే, ఎవరైనా, నేను కూడా, అక్కడి నుండి నిష్క్రమించక తప్పదు. అందుకే నేను వెళ్ళబోతుంటే, సంజయ్,

“వన్ మినట్! మీరు కూర్చోండి” అని మాకు చెప్పి పక్కనే ఉన్న మరొక బెడ్రూంలోకి త్రక్షతో కలిసి వెళ్ళాడు. తలుపులు తీసే ఉంచాడు.

***

మా అందరికీ అదొక సిగ్నల్. తన చర్యలో ఎటువంటి పుకార్లకు తావులేదని చెప్పడానికి అది సంకేతం. ఎందుకంటే, సంజయ్ ముందు ఇంతగా భయపడే వినయ్ అనే అసిస్టెంట్ డైరెక్టర్, రాత్రికి ఫ్రెండ్సుతో కలిసి మందు తాగి, ఇప్పుడు గనుక సంజయ్ తలుపులు మూస్తే, దాని గురించి నానా ఛండాలంగా వాగుతాడు. సెట్లో అమాయకంగా బెరుకుబెరుకుగా ఉన్నవాడు అన్ని వేళలా అలాగే ఉంటాడని మనం అనుకోలేము. ఇటువంటి వాళ్ళు బయట తన స్నేహితుల ముందు కాలగెగరేస్తూ, నానా చెత్తా వాగుతారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here