మార్పు మన(సు)తోనే మొదలు-19

0
3

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ఆ రోజు మధ్యాహ్నం ప్రభాత్ కుటుంబాన్ని కూడా భోజనానికి పిలిచి, నిర్విషని తన కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికీ పరిచయం చేస్తాడు గగన్. ఆ సాయంత్రానికి ప్రభాత్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది నిర్విష. కొద్ది రోజులకే అనామిక, నిర్విష స్నేహితులైపోతారు. అందరికీ వీడ్కోలు పలికి, తనకి అందించిన సహాయసహకారాలు నిర్విషకి కూడా అందించమని కోరుతాడు గగన్. కొద్దిపాటి సామాన్లతో కొత్త ఊరికి బయల్దేరుతారు గగన్, పూర్ణిమ. ఊరంతా వీడ్కోలు పలకడానికి రైల్వే స్టేషన్‍కి వస్తుంది. తమ జీవితాలని గగన్ ఎలా బాగుచేశాడో దాన్ని ఓ నవలగా రాయమని మల్లిక పూర్ణిమని అడుగుతుంది. నిరూప్ కూడా రాయమని అడుగుతాడు. ప్రభాత్ కూడా అడుగుతాడు. కొత్త ఊరికి చేరాకా, నవల రాయడం మొదలుపెడ్తుంది పూర్ణిమ. కొత్త ఇంట్లో ఎంత సర్దుకున్నా ఇంకా సర్దుకోవాల్సిన మిగిలే ఉంటాయి. ఒకరోజు అలా సర్దుతూ, శశిని తలచుకుంటారు వాళ్ళిద్దరూ. అదే సమయంలో దివిజ్ గురించి కూడా అనుకుంటారు. అప్పుడే తలుపు తట్టి దివిజ్, అనామిక లోపలికి వస్తారు. వాళ్ళకి మజ్జిగ తెచ్చిస్తుంది పూర్ణిమ. చిత్రకళకి సంబంధించి శశికి హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం వచ్చిందని, ఆ విషయం స్వయంగా చెప్పేందుకే వచ్చామని అంటాడు దివిజ్. ఆ ఊరిలో తన పయనాన్ని టూకీగా గుర్తు చేసుకుంటాడు గగన్. – ఇక చదవండి.]

[dropcap]గ[/dropcap]గన్ కొత్త ఊళ్ళో, కొత్త మనుషుల మధ్య అదే డి‌ఎం‌హెచ్‌పిలో కొత్త ఉద్యోగం ప్రారంభించాడు. త్వరలోనే, తన టీమ్ సభ్యుల మద్దతునీ, ప్రజల నమ్మకాన్నీ పొందాడు. ఇది ఎప్పుడు ఊరు మారినా చేయాల్సిన ప్రక్రియే. ఆ పాత ఊళ్ళో కూడా మొదట ఇదే చేశాడు. అక్కడ అన్నేళ్ళు ఉండిపోవడం వల్ల కొంత పరగడుపుగా అనిపించింది, అంతే!

తను వెళ్ళిన రెండు వారాలకే ఒక అబ్బాయి, బడి పిల్లాడు, తన తల్లిని తీసుకు వచ్చి, “డాక్టర్ గారూ, మా అమ్మ అత్త మీది కోపం దుత్త మీద చూపిస్తా ఉంటాదండి. మా నాన్న తాగొస్తే, ఆ కోపంతో నన్ను కొట్టేస్తా ఉంటాదండి. కాస్త చూసి మందులివ్వండి”, అని అడిగాడు.

“తనకి మానసిక వైద్యం అవసరమౌతుందని నీకెలా తెలుసు?” ఆశ్చర్యపోతూ అడిగాడు గగన్.

“మా బడిలో మీ ఊరినుంచి వచ్చిన పిల్లోడు ఉన్నాడండి. వాడి అమ్మానాన్నలు కట్టడాల కూలీలు. ఆడి బళ్ళో ‘మార్పు మనతోనే మొదలు’ అనే సంస్థ వాళ్ళు మానసిక ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెప్పరంటండీ. మా అమ్మలో కావలసిన మార్పు నాతోనే మొదలెడదామని ఇక్కడికి తెచ్చానండీ”, అన్నాడు ఆ పిల్లాడు.

గగన్ వెంటనే మనసులో, ‘ఓయీ డింభకా, దివిజా! జూనియర్ శ్రేయోభిలాషీ! నన్ను మించిపోయినందుకు అభినందనలు. గగనం ఎప్పుడూ ఉండేదే! సప్తాశ్వ రథమారూఢుడు, దివిజుడు వస్తేనే వెలుగు ఉంటుంది కదా!’ అని మనసారా మెచ్చుకున్నాడు.

***

“ఇంతకీ ఎన్‌జి‌ఓలో పని ఎలా నడుస్తోంది? కొత్తగా వచ్చే మార్పులు ఏమైనా ఉన్నాయా?” అడిగాడు గగన్.

“పని జోరుగా, భేషుగ్గా సాగుతోంది. ఇదివరలో మనం స్కూళ్ళు, కాలేజీల వెంట తిరిగేవాళ్ళం. ఇప్పుడు మన సెషన్ కోసం వాళ్ళే మనల్ని అడుగుతున్నారు. మన ఉనికికి గుర్తింపు లభించినట్లే కదా!

ఇంకా, విద్యాశాఖ సహాయ మంత్రితో అపాయింట్మెంట్ దొరికింది. ఈలోగా నైన్త్ క్లాస్ నుండి స్కూల్ పాఠ్యాంశాల్లో ఎటువంటి సమాచారాన్ని అందించాలన్న విషయంపై నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నాను. అందుకే ఇటొచ్చాను”, అన్నది దివిజ్.

అంతవరకూ మౌనం వహించి, ఏకాగ్రతతో దివిజ్ చెప్పే విషయాలు వింటున్న పూర్ణిమ, “కొంపదీసి హార్వర్డ్ చూశాక మన వాడికి అమెరికాలో సెటిల్ అయిపోవాలన్న దురాలోచన రాదుకదా!” అంది తల్లి మనసుని దాచుకోలేక.

సాధారణంగా ‘మౌనమే శరణం’ అన్నట్టుండే అనామిక, “మీకా బెంగ అక్కరలేదు. శశి ప్రేమలో పడ్డాడని నా గట్టి అనుమానం. ఆ అమ్మాయి కోసమైనా ఇండియా వచ్చేస్తాడు లెండి. ఊఁ, స్పార్క్స్ ఆర్ ఫ్లైయింగ్..” అంది.

“ఎవరితో తిరుగుతున్నాడు? కంగ్రాట్స్ చెప్పెయ్యమా?” అంది పూర్ణిమ.

దివిజ్ అందుకుని, “మన వాడు ప్రకృతి చిత్రకారుడు కదా! అందుకని తను చూసే ప్రకృతి అందం చూపించడానికి ఆమెని తీసుకెళ్తూ ఉంటాడు. ఆమెకి కూడా చిన్నప్పుడు పెయింటింగ్‌లో ప్రవేశముందట! అందుకని ఇద్దరూ తెగ చర్చించేస్తుంటారు.

ఒక విషయం – ఇద్దరూ బుద్ధిమంతులు. వాళ్ళు ప్రేమించుకోకపోయినా, పెళ్ళిచేసుకోకపోయినా, ఎవరికీ అప్రతిష్ఠ తెచ్చే పనులు చేయరు. మీరు రిలాక్స్ అయిపోండి..” అని ఏదో చెప్పబోయాడు దివిజ్.

“ఆ అమ్మాయి గాని నిర్విష కాదు కదా!” అన్నాడు గగన్.

“అంకుల్ మీకు అన్నీ తెలుసు”, అన్నాడు దివిజ్.

“ఆమె అయితే నా మీద ఉండే ఆరాధనా భావం వాడిమీద ప్రయోగించడం లేదు కదా అని వేచి చూడాలి. ఇద్దరూ పెద్ద పిల్లలే కనుక వాళ్ళ టైమ్ వాళ్ళు తీసుకుని నిర్ణయాన్ని చెప్పనిద్దాం! ఇంకేమిటి, సంగతులు?” అన్నాడు గగన్.

“మన కాల్స్ జోరుగా సాగుతున్నాయ్. ఆంటీకి తెలుసు. మనం పంపే ‘గుడ్ మార్నింగ్, గుడ్ నైట్’ మెసేజెస్‌కి మంచి గుర్తింపు వస్తోంది.

మరో ముఖ్యమైన విషయం. మన ఎన్‌జి‌ఓ యొక్క సి‌ఈ‌ఓకి ఆశ్రమ పరివర్తన రాబోతోంది. అతను గృహస్థుగా మరబోతున్నాడు”, అన్నాడు నవ్వుతూ.

పూర్ణిమ ఉత్సాహంగా, “ఆశ్రమ పరివర్తన.. మంచి ప్రయోగం.. కొత్త ప్రయోగం.. భేష్, తెలుగులో ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగిపోయావ్! నీ గృహిణి కాబోయే ఆ అమ్మణ్ణి ఎవరు? ఆమెను నీవు ఎచ్చట కలసికొంటివి? ప్రణయ పరిణయమా లేక పెద్దలు కన్యను ఎంపిక చేసినారా? ఆమె నామధేయమేమి?” అని గ్రాంథికంగా దంచి పారేసింది.

“నేనున్న చోట ప్రణయ పరిణయము గాక వేరు పరిణయమగునా? ఆమె నామధేయము కడు అబ్బురపరచును. ‘నామధేయము లేని స్త్రీ’ అని దాని యర్థము”, అన్నాడు దివిజ్.

“హాయ్.. మన అనామికే! ఆహా.. లెస్సగా చెప్పితివి”, అని పూర్ణిమ పొంగిపోతూ ఉంటే, “అమ్మాయిని లోపలికి తీసుకు వెళ్ళు పూర్ణిమా”, అని సీరియస్‌గా అన్నాడు గగన్. దివిజ్, అనామికలు మొహామోహాలు చూసుకున్నారు.

ఏమీ ఫరవాలేదన్నట్టు మొహం పెట్టి, పూర్ణిమ అనామికని లోపలికి తీసుకు వెళ్ళి ఏదో గుసగుసలాడింది. గగన్ దివిజ్‌తో, “ఆమె తండ్రికి స్కిజోఫ్రేనియా, తల్లికి క్రానిక్ డిప్రెషన్. వంశ పారంపర్యంగా అవి ఎప్పుడైనా ఆమెకు సోకవచ్చు”, అన్నాడు.

“ఓస్.. దీనికేనా ఇంత సీన్ క్రియేట్ చేశారు? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. అయినా, ‘మార్పు మనతోనే మొదలు’, అని బోర్డు పెట్టుకుని కూర్చుంటే చాలా? మనతోనే మొదలెట్టద్దూ? పైగా, వాళ్ళ నాన్నగారు ఆంటీకి విడాకులిచ్చినప్పుడు ఆవిడ క్రుంగిపోతే, తాతయ్య గారి మనోబలంతో ఇంచుమించు ఒంటరి పోరాటం చేసి ఆవిణ్ణి దక్కించుకుంది ఆమే కదా!” అని కుండ బద్దలుకొట్టినట్టు జవాబిచ్చాడు దివిజ్.

లోపలి నుంచి బయటికి వస్తూ, “అనామికా, నేను చెప్పలేదూ, మీ అంకుల్ దివిజ్ నిబద్ధతని పరీక్షించారు అంతే! శుభస్య శీఘ్రం”, అంది పూర్ణిమ.

“దివిజ్, నువ్వు చెప్పినవన్నీ కరెక్టే గాని, నేనిచ్చిన మందుల మాట మరచిపోయావురోయ్”, నవ్వుతూ అన్నాడు గగన్.

ఇన్ని మార్పులనీ మొదలుపెట్టిన గగన్ సరదాకి అన్నాడే కానీ, గుర్తింపుకి ఆశపడే రకం కాదని అందరికీ ఎప్పుడో తెలుసు కదా! అందరూ కిలకిల నవ్వులలో మునిగిపోయారు!

“పిల్లలూ, నా నవలకి ఏ పేరు పెట్టను? ‘డి‌ఎం‌హెచ్‌పి డాక్టర్’ అని పెడదామా?’” అని అడిగింది పూర్ణిమ. వెంటనే పెదవి విరిచేసి, “మరీ డెబ్భై-ఎనభై-తొంభైయ్యో దశకపు పేరులా ఉంది-‘లాయర్ సుహాసిని’, ‘కలెక్టర్ గారు’, ‘ప్రెసిడెంట్ పేరమ్మ’, ‘ఇన్స్‌పెక్టర్ ప్రతాప్’, ‘కలెక్టర్ జానకి’. ఊహూఁ, బొత్తిగా లాభం  లేదు. ఇంకేమైనా..” అన్నాడు దివిజ్.

పూర్ణిమ కొంచెం సేపు దీర్ఘాలోచన చేసింది. దివిజ్ పెన్ అందిస్తూ, “పాళీతో బుర్ర గోక్కుంటారా? లేకపోతే, క్యాప్‌ని నోట్లో పెట్టుకుంటారా?” అని నవ్వుతూ అడిగాడు.

ఇంతలోనే ఏదో గుర్తు వచ్చిన దానిలా, ‘మనసు గతి ఇంతే’?” అని అడిగింది. “ఆ ‘ఇంతే’ని తీసేసి, రెండో, మూడో చుక్కలు పెట్టండి. అప్పుడు బాగానే ఉంటుంది. ఎటొచ్చీ, చదవబోయే జనాలు తాగుబోతు కథని, ప్రేమ కథనీ ఆశిస్తారు.. తప్పులో కాలేస్తారు. అయినా బాగానే ఉంది”, అన్నాడు దివిజ్.

“పోనీవయ్యా, ‘మార్పు మనతోనే మొదలు’ అనే మన ఎన్‌జి‌ఓ పేరు పెడతాను. ఎలా వుంది టైటిల్?” అడిగింది పూర్ణిమ.

“పేరు బాగుందాంటీ. కానీ, చిన్న సవరణ చెయ్యొచ్చా?” అడిగాడు దివిజ్.

“తప్పకుండా”, అంది పూర్ణిమ.

“‘మన’ అనే అక్షరాలకీ, ‘తోనే’ అనే అక్షరాలకీ మధ్య బ్రాకెట్లో ‘సు’ అనే అక్షరం పెట్టండి. అంటే, ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అన్నమాట. మనసు మారనిదే మనిషి మారడు కదా!” విడమార్చాడు దివిజ్.

“వావ్ బ్రహ్మాండం! ఇక కంటెంట్ విషయానికొస్తే, మా పెళ్ళితో మొదలు పెట్టి, మీ పెళ్ళితో శుభం కార్డు వేద్దామా?” అంది పూర్ణిమ.

“నిక్షేపంగా మొదలు పెట్టండి కానీ ముగింపు వ్రాసే ముందు కొన్నాళ్ళు ఆగండి. ఒక పెళ్ళితో మొదలు పెట్టి, రెండు పెళ్ళిళ్ళతో ముగించొచ్చు. శశి గాడి బ్రహ్మచర్యానికి ఇంక ఎక్కువ రోజులు మిగల్లేదనిపిస్తోంది”, అన్నాడు దివిజ్.

***సమాప్తం***

గమనిక: ఈ నవల మానసిక అనారోగ్యంపై అవగాహన పెంచేందుకు, కొన్ని నిజ జీవిత ఘట్టాలకి బోలెడంత కల్పన జోడించి వ్రాయబడింది. ఎవరికైనా మానసిక అనారోగ్యపు లక్షణాలు కనిపిస్తే, అవి లేనట్టు భ్రమపడో, సొంత వైద్యానికి పాల్పడో, ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా, మానసిక వైద్యులని సంప్రదించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. – రచయిత్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here