సరికొత్త ధారావాహిక ‘పూచే పూల లోన’ – ప్రకటన

0
3

[dropcap]ప్ర[/dropcap]సిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి కలం నుంచి జాలువారిన ‘పూచే పూల లోన’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

***

కదంబ వంశీయుల కాలంలో గోవాపురి (ఇప్పటి గోవా) పేరు తారాస్థాయికి చేరింది. గోపక పట్టణం (ఇప్పటి పాత గోవా) ప్రఖ్యాతి గాంచిన వ్యాపార ప్రదేశం. కదంబ రాజులు ఎన్నో శివాలయాలను కట్టించారు. నాలుగు వందల సంవత్సరాల పాలనలో వారు వైదిక సంప్రదాయన్ని ఎలుగెత్తి చాటారు. ఆ రాజులను కొంకణాధిపతులుగా, గోపకపుర నరాధీశ్వరులుగా ప్రజలు ఎరుగుదురు. సంస్కృతం, కన్నడం వీరి భాషలు. సౌరాష్ట్ర రాజ్యంలోని స్త్రీలతో వీరికి వివాహాలు జరిగినట్టు ఆధారాలున్నాయి. గోపక పట్టణంలో బ్రహ్మపురి అనే అగ్రహారం ఉండేది. ఇది వేదాధ్యయనం, జ్యోతిషం, అలాగే వైద్య విద్యకు పెట్టిన పేరు.. సౌరాష్ట్రకు చెందిన సారస్వత బ్రాహ్మణులు కూడా ఇక్కడ అధ్యయనం చేశారు. ఈ ప్రాంతం యావత్తూ శివారాధనకు పెట్టిన పేరు. ఆ తరువాత చరిత్రలో గోవా ఇన్‌క్విసిషన్ పోర్చుగీసు వారి దురాగతాలకు పరాకాష్ఠగా మిగిలిపోయింది. తరాలు మారిపోయాయి. మనమెవరం? ఇలా ఎందుకున్నాం? ఇక్కడ ఇలాగే ఉండాలా? పోతే ఎక్కడికి పోవాలి అనే ప్రశ్నలు వేసుకుంటూనే వారి కొన్ని తరాలు మారిపోయాయి. కేవలం టూరిజమ్, హోటళ్ళు, వేశ్యావృత్తితో కాలయాపన చేసే ఒక ప్రజానీకం మిగిలింది. వీళ్ళల్లో గొప్ప సంస్కృతి కలవారు, కళాకారులు, వైద్యులు, ఎందరో ఈనాటికీ ఉన్నారు..

ఈ నేపథ్యాన్ని ఆవిష్కరించేందుకు గాను ఒక రచయిత ఒక నిర్దిష్టమైన పని మీద గోవా చేరుకుంటాడు. కానీ ఆయన పనిలో భాగంగా – తెలుగు వెండితెర మీద వెలిగిపోతూ ఉన్న సమయంలో హఠాత్తుగా మాయమై పలు రకాల ప్రశ్నలను, సవాళ్ళను పలువురి ముందర ఉంచిన హీరో సమీర్ కుమార్ అక్కడ తటస్థపడతాడు. అతని స్వగతం, అతని చుట్టూ గోవాలో జరిగిన సంఘటనలు, సినీ పరిశ్రమలో అతనికి జరిగిన అన్యాయాలు, ఒక కళాకారునిగా అతని ఎదుగుదల, ప్రేమ వ్యవహారం, గోవా వాసులకు, ఆ కళాకారులకు సామాజికంగా చివరికి ఏమి మిగిలింది.. అనునవి ఈ ధారావాహికం మన ముందుంచుతుంది.

ఒక కళాకారుడు మనిషిలా బ్రతకగలడా?! ఒక మనిషి ఒక కళాకారుని మనిషిలా చూడగలడా?

ఒక ప్రాంతం యొక్క చరిత్రకీ, వాతావారణానికీ, అక్కడున్న సమస్యలకీ అక్కడి కళాకారునితో ఉన్న సంబంధం ఏంటి?

నిజమైన కళాకారుడు విశ్వమానవుడా? తన ప్రాంతాన్ని అభిమానించేవాడా? ఇతర నేపథ్యాలను స్వాగతించేవాడా? కళలలో ఇచ్చిపుచ్చుకునేవాడా లేక మరో ముసుగు తొడుక్కున్న వ్యాపారావేత్తా?

..ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ధారావాహిక ‘పూచే పూల లోన’.

***

ఆసక్తిగా చదివించే ఈ ధారావాహిక వచ్చే వారం నుంచి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here