‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -7

5
4

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

కాలేజికి వెళ్ళలేదు

[dropcap]జై[/dropcap]లునుండి విడుదలై వచ్చే సమయానికి దేశపు పరిస్థితి కొంత ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ కొన్ని ప్రతిఘటనలు, లాఠీచార్జీలు జరుగుతున్నాయి. విద్యార్థులు దాదాపు అందరూ కాలేజీలకు వెళ్ళసాగారు. ఇంకా నాయకుల విడుదల కానీ, చర్చలు కానీ జరగలేదు. అందువల్ల నేను కాలేజీకి వెళ్ళడం సబబు కాదని నిర్ణయించుకున్నాను. సభలలో వీరావేశంతో ప్రసంగించిన, జైలులో ఆర్భాటం చేసిన విద్యార్థినాయకులు చప్పుడు చేయకుండా కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులలోను నేను సంయమనాన్ని కోల్పోలేదు. భావావేశంతో ప్రసంగించలేదు. అసంబద్ధమైన మాటలను ఉపయోగించలేదు. రాళ్ళను విసరలేదు. నా బలం తర్కం. గాఢంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకొనేవాడిని.

సహజంగానే శ్రీరామకృష్ణ స్టూడెంట్స్ హోమ్‌లో ఉండటానికి సాధ్యం కాలేదు. నేను నేషనల్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు పాఠశాల పేద పిల్లల విద్యార్థి నిలయంలో ఉచిత భోజన వసతి సౌకర్యం లభించింది. ఆ అవకాశం వల్లనే నేను ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షను విజయవంతంగా పూర్తిచేశాను. ఇంటర్మీడియట్, ఆనర్స్‌లో చదువుతున్నప్పుడు కూడా నాకు హైస్కూలుతోను, ఉపాధ్యాయులతోను, విద్యార్థి నిలయంతోనూ సంబంధం పెట్టుకున్నాను. దానిని ఉపయోగించుకుని విద్యార్థి నిలయంలో ఉండటానికి సంబంధించిన ఉపాధ్యాయుల అనుమతి వేడుకున్నాను. వారు సంతోషంతో నన్ను చేర్చుకున్నారు. అయితే భోజన వసతి కోసం డబ్బు చెల్లించాల్సి వచ్చింది. పల్లెలో కూలీనాలీ చేస్తున్న నా చెల్లెలు కానీ తల్లి కానీ నాకు ఒక్క రూపాయి కూడా పంపడానికి వీలుకాదు. అందువల్ల ట్యూషన్లు చెప్పి డబ్బులు సంపాదించాలని అనుకున్నాను. రెండు ఇళ్ళలో ట్యూషన్ చెప్పడానికి అవకాశం దొరికింది.

మొదటిది శ్రీ టి.ఎస్.రాఘవన్ గారి ఇల్లు. శ్రీ రాఘవన్ గారు పేరుపొందిన ధారీవాల్ ఉన్నిదుస్తులకు దక్షిణ భారతదేశం మొత్తానికి డిస్ట్రిబ్యూటరు. వారి తమ్ముడు శ్రీ టి.ఎస్.కస్తూరి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతున్నారు. వారి మరొక తమ్ముడు శ్రీ టి.ఎస్.నరసింహన్ నేషనల్ హైస్కూలులో చదువుతున్నారు. వారిద్దరికీ ట్యూషన్లు చెప్పేవాడిని. రెండు నెలలు గడిచాయి.

మళ్ళీ ఉద్యమానికి

ప్రభుత్వపు అమానుష దౌర్జన్యాలను ప్రతిఘటిస్తూ 1943 ఫిబ్రవరి తొమ్మిదతేదీ నుండి గాంధీజీ 21 రోజులపాటు పూనాలోని ఆగాఖాన్ జైలులో ఉపవాసం మొదలు పెట్టారు. ప్రభుత్వపు దుష్టనిర్ణయాలను ఖండించడానికి, గాంధీ గారికి మద్దతు తెలియజేయడానినికి దేశమంతటా సత్యాగ్రహపు రెండవ కెరటం ప్రారంభమయ్యింది. అజ్ఞాతవాసంలో ఉన్న నాయకులు పూనాకు తమ సత్యాగ్రహులను పంపి అక్కడ జారీలో ఉన్న 144వ సెక్షన్‌ను ఉల్లంఘించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అజ్ఞాతవాసం చేస్తున్న వారిలో శ్రీ జయప్రకాశ్ నారాయణ గారు అగ్రగణ్యులు. వారిని బీహార్ ప్రాంతంలోని హజారిబాగ్ జైలులో ఉంచారు. ఆ జైలు ఎత్తైన గోడలను ఎక్కి అక్కడినుండి దుమికి తప్పించుకుని అండర్‌గ్రౌండ్ లోనికి వెళ్ళారు. వారి ఆచూకీని చెప్పినవారికి 10000 రూపాయల పారితోషికాన్ని ప్రభుత్వం ప్రకటించింది. నేను ఒకసారి జైలుకు వెళ్ళినా స్వాంతంత్ర్య సంగ్రామంలో పాలుపంచుకునే నిబద్ధతను, ఉత్సాహాన్నీ కోల్పోలేదు. పూనాకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. బెంగళూరులో అజ్ఞాతంలో ఉన్న శ్రీ కె. ఎ. వెంకటరామయ్య గారిని కలుసుకున్నాను. పూనాకు రావడానికి ఒప్పుకున్న ఆరుగురు విద్యార్థులను కూడగట్టుకున్నాను. నాయకుల నుండి పూనాకు వెళ్ళిరావడానికి కావలసిన రైలు ప్రయాణపు ఖర్చును స్వీకరించాను.

పూనాకు వెళ్ళే రోజు తెల్లవారు ఝాము సుమారు నాలుగు గంటలకు బసవనగుడి బసవణ్ణ దేవస్థానం వీధికి, మా సంస్థలకు అతి సమీపంలో ఉన్న రాఘవన్ గారి ఇంటికి వెళ్ళి లోపల ఉన్నవారిని పిలిచాను. వారి తల్లిగారు బయటకు వచ్చారు. నేను ఆ సమయంలో రావడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. పొద్దున ఏడు గంటలకు రైలులో పూనా వెళ్ళే విషయం వారికి తెలిపాను. “అయ్యో ఏమప్పా మొన్ననే కదా జైలు నుండి వచ్చింది. మళ్ళీ దూరపు జైలుకు వెళుతున్నారే” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. “నేను వెళ్ళే తీరాలి. అందువల్ల కస్తూరి, నరసింహన్‌లకు పరీక్ష సమయంలో అనానుకూలమవుతుంది. కర్తవ్య లోపం చేస్తున్నందుకు మనసు నొప్పిస్తోంది” అని చెప్పాను. “అయ్యో. ఫరవాలేదు. మీరు అన్నీ వదులుకుని మళ్ళీ జైలుకు వెళ్ళడం పెద్దపని. మా పిల్లలు ఎలాగైనా చదువుకుంటారు. వెళ్ళిరండి. మంచిది అవుతుంది” అంటూ వీడ్కోలు పలికారు.

ఇంకొక ట్యూషన్ శంకరపురలో ఉన్న డా.సి.నారాయణరావు గారి ఇంటిలో. వారి కూతురుకీ, కొడుకుకూ పాఠం చెప్పేవాడిని. వాళ్ళూ హైస్కూలు, కాలేజీలో చదివేవారు. వారి ఇంటికి కూడా వెళ్ళి వీడ్కోలు చెప్పి ప్రొద్దుటి రైలులో గుంతకల్ మార్గంగుండా పూనా వైపు బయలుదేరాము.

పూనాలో దిగి రద్దీగా ఉన్న ఒక మార్గంలో ‘గాంధీజీని విడుదల చేయండి’, ‘సర్కారుకు ధిక్కారం’ అని ఇంగ్లీషులో వ్రాసిన ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేసుకుంటూ ఊరేగింపు వెళ్ళాము. కొన్ని గజాల దూరం నడించినంతలోనే పోలీస్ వ్యాన్ వచ్చింది. ఇన్‌స్పెక్టరు మమ్మల్ని అరెస్టు చేసి వ్యానులో కూర్చోపెట్టారు. మేము వచ్చిన పని అయ్యింది. 144 సెక్షన్‌ను ఉల్లంఘించాము. అరెస్ట్ అయ్యాము. వ్యానులో సంతోషంగా మాట్లాడుకొంటున్నాము. “మీరు కన్నడిగులా? ఎక్కడి నుండి వచ్చారు?” అంటూ ఇన్‌స్పెక్టర్ కన్నడ భాషలో అడిగారు. వారు ధార్వాడకు చెందినవారని తరువాత తెలిసింది. “బెంగళూరు నుండి వచ్చాము. మేమంతా విద్యార్థులము” అని బదులిచ్చాము. “క్షమాపణ పత్రం ఇవ్వండి. మిమ్మల్నందరినీ విడిచిపెడతాను” అన్నారు. “సాధ్యం కాదు” అని అన్నాము.

యరవాడ జైలు

కొంచెం సేపటికి మా వ్యాన్ ఒక పెద్ద కట్టడం ముందుభాగాన నిలిచింది. దాని పైన ‘యరవాడ సెంట్రల్ జైల్’ అని వ్రాసివుంది. దాన్ని చూసి మాకందరికీ చాలా సంతోషం వేసింది. యరవాడ జైలు ఒక రకంగా గాంధీజీ ‘రెండవ ఇల్లు’. పలుసార్లు కారాగారవాసం వారు అందులోనే గడిపారు. అది భారతదేశపు అత్యంత పెద్ద కారాగారం. సుమారు 3000 మంది అక్కడ ఉండే అవకాశం ఉంది. పూనాకు దేశం వివిధ ప్రాంతాలనుండి తండోపతండాలుగా వచ్చి నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జైలులో చేరేవారు. అప్పుడు బొంబాయి మేయర్‌గా ఉన్న మినూ మసాని గారి మొదటి గుంపులో ఉన్నవారు 80 మంది. మేము వెళ్ళే సమయానికి జైలు నిండిపోయింది. జైలు బయట మైదానంలో డేరాలను వేసి గట్టి పోలీసు పహారాలో బందీలను ఉంచారు.

మేము ఈ డేరాలలో సుమారు ఒకటిన్నర నెలలు అండర్ ట్రయల్స్‌గా ఉన్నాము. అప్పుడు మా మామూలు దుస్తులను ధరించవచ్చు. జైలుకు వెళ్ళిన కొత్తలో గడ్డం గీయించుకొనడానికి జైలుకు చెందిన ఒక క్షురకుని ముందు కూర్చున్నాను. అతడిచ్చిన మసకమసక అద్దం సహాయంతో నా ముఖం ఎలా వుంటుందో ఊహించుకున్నాను. గిన్నెలో నీళ్ళు ఉన్నాయి. ‘క్యా దేఖతా హై. పాని లగాలే’ (ఏమి చూస్తున్నావ్. నీళ్ళు తడుపుకో) అన్న అతని ఆజ్ఞను పాలించి నా గడ్డాన్ని నేనే తడుపుకోవాల్సి వచ్చింది. ‘సోప్ కహా హై (సబ్బు ఎక్కడుంది)’ అన్నాను. ‘యే తేరా బాప్‌కా ఘర్ నహీ హై’ (ఇది మీ అయ్య ఇల్లు కాదు) అన్నాడు. ఆపైన ఏ రీతిగా క్షురకర్మ జరిగిందో ఊహించుకోవచ్చు. మొండి కత్తితో బరబరా గీకడం మొదలు పెట్టాడు. ఆ కర్మ ముగిసే సమయానికి నా ముఖం పైనున్న ముప్పావు భాగం వెంట్రుకలు పోయాయి. వాటిలో కొన్ని వేరు సహితంగా ఊడిపోయాయి. అక్కడక్కడా ఎర్రని గాట్లు తేలాయి. జైలులో అదే నా చివరి కర్మ అని నిర్ధారించుకున్నాను.

సుమారు ఒకటిన్నర నెలల తరువాత జైలులోనే ఉన్న కోర్టు జడ్జి ముందు నిలిపి మేము నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లు పోలీసులు చెప్పారు. మేము దానిని అంగీకరించాము. క్షమాపణ పత్రం వ్రాసి ఇస్తే విడుదల చేస్తామని న్యాయాధిపతి సూచించారు. మేము నిరాకరించిన తరువాత మూడు నెలల కఠిన కారాగారశిక్ష విధించారు.

జైలులో దినచర్య

యరవాడ జైలులో జీవనం చాలా కష్టంగా ఉండేది. కఠిన శిక్ష అనుభవిస్తున్నవారికి నిబంధనలు ఎక్కువ. శిక్ష విధించిన వెంటనే మా దుస్తులను మార్చారు. మా దుస్తులు జైలు ఖైదీలు వేసుకునే ఒక నిక్కర్, అరచేతుల షర్టు., తలపై ఒక రకమైన గుండ్రటి టోపీ. ఇలాంటి ఒక జత దుస్తులు. దానితోపాటు ఖైదీ నెంబర్. పేరుకన్నా ఆ నంబరుకే ఎక్కువ ప్రాముఖ్యం. ఎప్పుడూ ఆ నంబరుతోనే మమ్మల్ని గుర్తించేవారు. భోజనం చేయడానికి ఇనుప జల్లెడ (దానికి రంధ్రాలు లేవు) లాంటి ఒక కంచం. కొలిచే పావు మాదిరిగా ఉన్న ఒక ఇనుప లోటా. నీళ్ళు త్రాగడం మొదలుకొని, స్నానం చేయడం వంటి అన్ని పనులకూ ఆ లోటానే ఉపయోగించాల్సి వచ్చేది. తినే కంచం తుప్పు వదిలించడమే ఒక నిత్యకృత్యంగా ఉండేది. ఇక భోజనమైతే చెప్పనలవి కాదు. తగినన్ని రాళ్ళు ఉన్న (కొన్ని సార్లు ముక్కిపోయిన) జొన్న భాక్రి (రొట్టె), పచ్చగా ఉన్న అన్నిరకాల ఆకులను వేసి సగంసగం ఉడికిన ఒకరకమైన పులుసు, ప్రొద్దున ఫలహారంగా కొంచెం జొన్న గంజి ఇచ్చేవారు. మొదట్లో రెండు రోజులు మాకు గంజి వద్దని చెప్పాము. ఐతే ఆకలి తట్టుకోలేక పొద్దున గంజి వస్తే చాలు అని దానికోసం నిరీక్షిస్తూ ఉండేవాళ్ళం. ప్రతి ఆదివారం సాయంత్రం స్పెషల్ మీల్స్. అంటే జొన్న రొట్టె బదులు ఒక గోధుమ చపాతీ, ఒక బెల్లపు వుండ, చిన్న ఉద్దరణిలో పట్టేంత వేరుసెనగ నూనె. దాని వల్ల మా ఆకలేమీ తగ్గలేదు. ఆ అమూల్యమైన బెల్లపువుండను కొద్ది కొద్దిగా తింటూ రెండు రోజుల వరకూ జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళం. చివరకు మాకు దక్కిందంతా పరమాన్నంగా భావించ సాగాము!

రాజకీయ నాయకులకు మూడు స్థాయిలు ఉండేవి. నెహ్రూ వంటి పెద్ద నాయకులకు ‘ఎ’ క్లాసు, మధ్యమ వర్గ నాయకులకు ‘బి’ క్లాసు, మావంటి వారికి ‘సి’ క్లాసు. ఖైదీల స్థాయిని బట్టి సౌకర్యాలు ఉండేవి. కఠిన శిక్ష అనుభవిస్తున్న సి క్లాస్ ఖైదీలు రోజుకు 8 గంటలు వడ్రంగం పనో, కుట్టు పనో, లేదా వారు చెప్పిన పనో చేయాలి. నేను కుట్టుపని చేసేవాడిని.

సుమారు 40-50 మంది ఒక పెద్ద హాలులో నివసించేవారం. సాయంత్రం 6.30 గంటలకు మమ్ములనందరినీ లోపల వేసి తాళం వేసేవారు. పొద్దున సుమారు అదే సమయానికి తాళం తీసేవారు. ప్రతిరోజు రాత్రి హాజరు తీసుకునేవారు. మాకు ఇన్‌ఛార్జి అక్కడే దీర్ఘకాలంగా శిక్షను అనుభవిస్తున్న ఒక ఖూనీకోరు. అతడికి జైలు స్వంత ఇల్లు ఉన్నట్లే. “ఈ గాంధీ ప్రజలు ఈరోజు వస్తారు రేపు వెళ్ళిపోతారు” అంటూ మమ్మల్ని గేలిచేసేవాడు.

ప్రతిరోజూ ప్రొద్దునే గాంధీ ఆశ్రమపు ప్రార్థన చేసేవాళ్ళం. వారానికి ఆరు రోజులు పనిదినాలు. మిగిలిన సమయంలో పుస్తకాలను చదివేవాళ్ళం. అక్కడ చాలా హిందీ పుస్తకాలను చదివాను.

జైలులో ఖూనీ

జైలులో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక రోజు మధ్యాహ్నం పని ముగించుకుని భోజనం చసి మా విశాలమైన గది వరండాలో కూర్చున్నాము. అది విరామ సమయం. మా ముందున్న చిన్న మైదానంలో పాత పగలున్న ఒక పఠాన్ ఖైదీకి, ఒక సింధీ ఖైదీకి తీవ్రమైన పోట్లాట జరిగి సింధీ ఖైదీని పఠాన్ ఖైదీ బాకుతో పొడిచి చంపివేశాడు. ఆ భయంకర దృశ్యం ఇంకా నా కళ్ళముందు కదలాడుతోంది. ఒక హత్యను అంతవరకు నా జీవితంలో చూసింది అది ఒక్కటే. దాన్ని చూసినవారంతా సహజమైన భయంతో వారి వారి గదులకు వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్నారు. ఖూనీ జరిగిన వెంటనే జైలు అధికారులు అలారం బెల్లును మ్రోగించారు. వెంటనే 40-50 మంది పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. పఠాన్ ఖైదీ రక్తసిక్తమైన బాకును చేతిలో పట్టుకుని దగ్గరికి వస్తే పొడిచేస్తాను అనే భంగిమలో నిలబడి ఉన్నాడు. పోలీసులు కొంత ధైర్యంతో వాడిని పట్టుకోవడానికి ముందుకు వస్తే అతడు పులిలా వారివైపు లంఘించేవాడు. అప్పుడు ఆ పోలీసులు భయంతో వెనకడుగు వేసేవారు. ఆ పోలీసుల చేతిలో పొడవైన లాఠీలు, తుపాకులు ఉన్నాయి. ఈ పోరాటం 10-15 నిముషాలు నడిచింది. ఆ పైన ఆ ఖూనీకోరు నీరసించి క్రిందకు పడిపోయాడు. అప్పుడు పోలీసులందరూ అతడిని చితకబాదారు. తనివితీరా ఆ ఖైదీని కొట్టి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడైన సింధీ ఖైదీ అక్కడే మృతి చెందాడు.

ఇంకొక మరపురాని సంఘటన. ఒకసారి నాకు ఆసుపత్రిలో చేరే అంత ఎక్కువ జ్వరం వచ్చింది. జైలులోనే ఆసుపత్రి. నేలమీదే పడకలు. నాకు కుడివైపు, ఎడమవైపు ఇద్దరూ హత్యచేసి ఆజన్మకారాగార శిక్షను అనుభవిస్తున్న పఠాన్లు. ఆజానుబాహులు. వారి ఆకారాలను చూస్తేనే నా ప్రాణాలు పైకి పోయాయి. రోజుకు నాలుగైదు సార్లు నా పక్కనే మోకాళ్ళపై నిలుచుని నమాజ్ చేసేవారు. నాకు రాత్రి నిద్ర రాలేదు. జ్వరమూ రాలేదు. పొద్దున డాక్టర్ వచ్చి జ్వరం లేకపోవడం చూసి, మధ్యాహ్నం మరోసారి నిర్ధారించుకుని, జ్వరం లేకపోయినా ఉత్తినే ఇక్కడకు ఎందుకు వచ్చావని చిన్నగా మందలించి నన్ను వాపసు పంపారు. ఆ పఠానుల భయం డాక్టరు ఇచ్చే మందులకన్నా నాపై ఎక్కువగా పనిచేసింది!

విడుదల

జూన్ నెల చివరకు మా శిక్షాకాలం ముగిసింది. మా ఖైదీ దుస్తులను జైలు అధికారులకు వాపసు చేస్తూ, మా మామూలు బట్టలను ధరించి, వారివద్ద ఉంచుకున్న డబ్బును వాపసు తీసుకుని జైలు నుండి బయటకు వచ్చాము. చెట్టూచేమలను చూసి ఐదు నెలలయ్యింది. స్వేచ్ఛా వాతావరణం. సహజంగానే చాలా సంతోషమయ్యింది. మా ఆ స్వాతంత్ర్యానికే అంత సంతోషమైతే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనకు ఎంత సంతోషం కలగవచ్చు అనే ఆలోచనలతో హోటల్ వైపుకు నడిచాము. ఐదు నెలల తర్వాత మామూలు భోజనం కడుపు నిండా తిన్నాము. ఆకలిగొన్న పులుల్లా భోజనం చేస్తున్న మమ్ములను చూసి, మా గడ్డాలను చూసి హోటల్ వారు మేము జైలు నుండి వచ్చినట్లు నిర్ధారించుకున్నారు.

బెంగళూరుకు వాపసు వచ్చాము. మళ్ళీ మా విద్యార్థి నిలయం నన్ను స్వాగతించింది. ఆశ్రయమిచ్చింది. ఉద్యమం ముగిసే దాకా కాలేజీకి వెళ్ళనని నిర్ధారించుకున్నాను. ఉద్యమం ముగియలేదు. కాబట్టి నా విద్యాభ్యాసాన్ని కొనసాగించే ప్రశ్నే తలెత్తలేదు. నా భోజన వసతుల ఖర్చుకోసం మునుపటి లాగానే ట్యూషన్ల నుండి సంపాదించడం ప్రారంభించాను. శ్రీ టి.ఎస్.నరసింహన్ ఎస్.ఎస్.ఎల్.సి.పరీక్ష ముగించి ఇంటర్‌మీడియట్ తరగతిలో చదువుతున్నారు. వారి అన్నయ్య శ్రీ కస్తూరి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. నరసింహన్‌కు మళ్ళీ పాఠాలు చెప్పడం ప్రారంభించాను. కేసరి ఇప్పుడు మద్రాసులో ఛీఫ్ ఇంజనీరుగా రిటైరయ్యారు. నరసింహన్ ‘మాల్గుడి డేస్’ వంటి మంచి సినిమాలు నిర్మించి సినిమారంగంలో పేరుపొందారు. వారి అన్నగారైన శ్రీ టి.ఎస్.రాఘవన్ గారు చాలా సంవత్సరాలు మా నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ గౌరవ కార్యదర్శిగా పనిచేశారు. యాభై ఏళ్ళయినా వారి కుటుంబానికి నాపై ఉన్న విశ్వాసం ఇంకా అలాగే కొనసాగుతూ వుంది.

చివరగా ఒకటి రెండు విషయాలను ప్రస్తావించడం అవసరమని భావిస్తున్నాను. చివరి ఉద్యమమైన క్విట్ ఇండియా ఉద్యమం, దాని ముందు జరిగిన అనేక ఉద్యమాలలో వేలాది మంది భాగం వహించి జైలుకు వెళ్ళారు. కష్టనష్టాలను అనుభవించారు. ప్రాణత్యాగం చేసిన వారి సంఖ్యా తక్కువేమీ కాదు. అయితే దీనిలో విచారకరమైన సంగతి ఏమిటంటే లాఠీచార్జి చేసినవారు, కాల్పులు జరిపినవారు, శిక్ష విధించిన న్యాయాధీశులు అందరూ మనవారే – భారతీయులే. వివిధ క్షేత్రాల బుద్ధిజీవుల నుండి ఆశించినంత సహకారం లభించలేదు. పోలీసులు, న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులు, కాలేజీ అధ్యాపకులు, సాహిత్యకారులు ఇంకా ఇతర మేధావుల నుండి కనీసం 5 శాతం సరైన సహకారం లభించి ఉన్నట్లయితే ఉద్యమం ఎనిమిది రోజుల్లోనే ముగిసిపోయేది. మొత్తం మీద మన జాతీయత గురించి, దేశభక్తి గురించి ఎంత గొంతు చించుకున్నా అదంతా పైపై మాటలే అవుతాయి. ఎక్కువమంది భారతీయులలో గులాంగిరీ రక్తమే ఇంకా పారుతోంది. దానివల్లే మనం రాజకీయంగా స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుంది. స్వాభిమానం, దేశాభిమానం గణనీయమైన పరిమాణంలో ఉండివుంటే మనం ఖచ్చితంగా ఇంగ్లీషు వారికి కానీ మరే ఇతర పరదేశీయులకు గానీ గులాములు అయ్యే అవసరం లేకపోయేది.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆర్థిక, సామాజిక సమస్యలు తక్కువై, స్వాభిమానంతో, సుసంబద్ధమైన విద్యావిధానంతో, మన సంస్కృతిని పోషించుకునివచ్చే దేశమవుతుందని భావించాము. అయితే ఆ కలలు, కల్పనలు ఎక్కువగా మట్టి పాలయ్యాయి. అడుగునుండి పైవరకూ భ్రష్టాచారం సమాజంలో వ్యాపించింది. ధనానికి ఎక్కడాలేని ప్రాముఖ్యత వచ్చి మౌలిక విలువలు కృంగిపోయాయి. ఈ జాడ్యం స్వాతంత్ర్య సమరయోధులలోనూ, దేశాభిమానులలోనూ చొచ్చుకుపోయింది. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికన్నా ముందు నడిచిన ఒక సత్యాగ్రహంలో పాల్గొన్న ఒక స్వాతంత్ర్య సమరయోధుడు ఆ తర్వాత నాలుగైదు ఇళ్ళను, ఆస్తిని, సమాజంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. (వారు ప్రస్తుతం లేరు.) వారు నాకు కొన్ని దశాబ్దాల నుండీ తెలుసు. వారు నాతో ఒక రోజు మాట్లాడుతూ “మీరు స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ తీసుకుంటున్నారా?” అని అడిగారు. లేదని చెప్పాను. “నేను తీసుకుంటున్నాను. మీరూ తీసుకోండి” అన్నారు. దానికి నేను “నాకు తినడానికి సరిపోయేంత డబ్బు నా వద్ద ఉంది. అంతేకాకుండా మనమంతా అప్పుడు స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్నది కర్తవ్య పాలన కోసం. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నెలవారీ పెన్షన్ లేదా ఇంకేదో సౌకర్యం పొందడంకోసం కాదు. జైలుకు వెళ్ళింది ఒక వడ్డీ వ్యాపారం కారాదు. స్వాతంత్ర్యయోధుల పెన్షన్ ఏర్పాటు నిరుపేదవారి కోసం చేసింది” అని బదులిచ్చాను. వారికి మొఖం మీద కొట్టినట్టయ్యింది. మొఖం పాలిపోయింది. ఇలాంటి దృష్టాంతాలకేమీ కొదవ లేదు. జైలుకు పోవడాన్ని, పోకపోవడాన్ని చాలా మంది దుర్వినియోగం చేశారు. ఎంతవరకూ మనము కర్తవ్యదీక్షకు, విలువలకు, గాంధీజీ మూలసూత్రాలకు ప్రాధాన్యతను ఇవ్వమో అంతవరకూ మన దేశానికి మనుగడ లేదు.

శ్రీ రామకృష్ణాశ్రమంలో

ఊహించని సహాయం

1944 మే 5వ తేదీ వరకు ఉద్యమం నడిచింది. తరువాత ప్రభుత్వం మరియు గాంధీజీల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఒప్పందం కుదిరంది. గాంధీజీతో సహా అందరు నాయకులను విడుదల చేశారు. కాబట్టి నేను కాలేజీ వెళ్ళడానికి ఏ అడ్డంకమూ లేకపోయింది. అందువల్ల 1944 జూన్ నెలలో నేను మూడవ సంవత్సరం బి.ఎస్.సి. (ఆనర్స్) తరగతిలో చేరడానికి నిర్ధారించుకున్నాను. ఐతే ఉచిత భోజన వసతి సౌకర్యం లేకపోతే చదువును కొనసాగించడం అసాధ్యం. కాలేజీ విద్యార్థిగా నేషనల్ హైస్కూలు విద్యార్థి నిలయంలో ఉండటానికి అవకాశం లేదు. ఒకవేళ అవకాశం కల్పించుకున్నా భోజనానికి చెల్లించడానికి డబ్బులు లేవు. ట్యూషన్లు చెప్పడానికి సమయం లేదు. ఇలా ఉచితభోజన వసతి సదుపాయాలను గురించిన ఆలోచన నన్ను తీవ్రంగా బాధిస్తూ ఉండేది.

ఒక రోజు నా స్నేహితుడు ఒకడు బసవనగుడిలోని శ్రీరామకృష్ణాశ్రమం అధ్యక్షులైన స్వామీ త్యాగీశానందజీ గారిని నేను కలుసుకోవలసిందిగా కోరాడు. హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆశ్రమానికి అప్పుడప్పుడూ వెళ్ళేవాణ్ణి. ఐతే అప్పుడు స్వామీ త్యాగీశానందగారు లేరు. స్వామీ రంగనాథానందగారు ఉన్నారు. నేను కాలేజీలో చదివినప్పుడు ఒకటి రెండు సార్లు మాత్రం దూరం నుండి స్వామీ త్యాగీశానందగారిని చూశాను. వారితో ఎన్నడూ మాట్లాడలేదు. స్వామీజీగారు నన్ను పిలిపించారు అన్నప్పుడు ఆశ్చర్యమయ్యింది. అంతకన్నా ఎక్కువ కుతూహలం కలిగింది. ఆశ్రమం చేరేవరకూ దేనికోసం పిలిపించి ఉంటారనే విషయమై ఊహించడానికి ఏ సంకేతమూ దొరకలేదు. స్వామీజీగారిని కలిసి చేతులు జోడించి నమస్కారం చేశాను. “Narasimhaiah, I learnt that you are in trouble. You can stay in the Ashrama and continue your studies.” (నరసింహయ్యా, నీవు కష్టంలో ఉన్నావని తెలిసింది. ఆశ్రమంలోనే ఉండి నీవు నీ చదువును కొనసాగించవచ్చు.) అని ఇంగ్లీషులో చెప్పారు. అది విని కొన్ని క్షణాలు దిగ్భ్రాంతుడినైనాను. మాట్లాడాలని తోచనేలేదు. మహా ఆశ్చర్యం కలిగింది. సంతోషం కలిగిందని వేరే చెప్పనవసరం లేదు. నేను కృతజ్ఞతాపూర్వకంగా “Thank you Swamiji. I am greatful to you” అని చెప్పాను. వారిని నమస్కరించి అక్కడి నుండి వాపసు వచ్చి తాత్కాలికంగా నాకు ఆశ్రయమిచ్చిన నేషనల్ హైస్కూల్ పేద విద్యార్థుల నిలయంలో మౌనంగా కూర్చొని స్వామీజిగారు చెప్పింది నిజమేనా అంటూ ఆలోచించసాగాను.

స్వామీ త్యాగీశానందజీ

సాధారణంగా ఉచిత విద్యార్థి నిలయాలలో ప్రవేశం లభించాలంటే ఒక నియమావళిని అనుసరించాలి. మొదట అర్జీ పెట్టుకోవాలి. తరువాత ఇంటర్వ్యూ. చివరకు వారిలో కొందరిని ఎంపిక చేయడం. నాకు ఇవేవీ లేదు. అందులోనూ శ్రీరామకృష్ణాశ్రమం వంటి గొప్ప సంస్థలో. నా కష్టాన్ని దగ్గరనుండి చూసినవారు ఎవరో పుణ్యాత్ములు స్వామీజీకి నా విషయం చెప్పివుండాలి. ఇలా నా జీవితంలో నాకు తెలిసో, తెలియకుండానో సహాయం చేసినవారు ఎంతో మంది ఉన్నారు.

శ్రీ రామకృష్ణాశ్రమం స్వామీ వివేకానంద స్థాపించిన ఒక పేరెన్నికగన్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక, సేవా సంస్థ. దీని ధర్మం మానవ ధర్మం. సిద్ధాంతం అద్వైతం. దీనికి జాతిమతాల పట్ల ఎంతమాత్రం నమ్మకం లేదు. దానిని ఆచరించటమూ లేదు. అద్వైతాన్ని ప్రతిపాదించే అన్ని ఆశ్రమాలు కానీ, మఠాలు కానీ మతాతీత సంస్థలు అని చెప్పడానికి కుదరదు. అలాంటి అనేక మఠాలు మతవైఖరితో, ఆచరణలతో కుళ్ళిపోయాయి. మతమున్న చోట ధర్మం ఉండదు. అలాగే ఎక్కడైతే ధనానికి ప్రాధాన్యముంటుందో అక్కడా ధర్మం ఉండదు.

శ్రీరామకృష్ణాశ్రమం భారత దేశంలో వైద్యశాలలను, విద్యార్థి నిలయాలను, పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఉంది. అమెరికా, ఇంగ్లాండ్ మొదలైన దేశాలలోనూ ఆశ్రమం శాఖలు ఉన్నాయి. బెంగళూరు రామకృష్ణాశ్రమం 1943లో ఒక రామకృష్ణా విద్యార్థి మందిరాన్ని స్థాపించింది. ఈ విషయం నాకు తెలియదు. ఆ సమయంలో నేను జైలు వెలుపలో, లోపలో ఉండివుంటాను. ఆ సంవత్సరం కొందరే విద్యార్థులున్నారు. వారిలో ఒకరికో, ఇద్దరికో ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పించారు. మిగిలిన నలుగురైదుగురు విద్యార్థులు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. మొత్తము ఐదారు మంది విద్యార్థులకు భోజనము, వసతి ఆశ్రమంలోనే. తరువాతి సంవత్సరం అంటే 1944లో నేను విద్యార్థి మందిరానికి చేరినప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్య 15. వారిలో ఇద్దరు ముగ్గురికి ఉచిత భోజనం, వసతి సౌకర్యం. నలుగురైదుగురు విద్యార్థులకు ఆశ్రమంలోనే నివాసం. మిగిలిన విద్యార్థులు అదే బసవన గుడి వీధి (Bull Temple Road)లో ఆశ్రమానికి చాలా సమీపంలో ఒక ఇంటిలో వసతి. ఆ ఇంటిని విద్యార్థి మందిరానికి ఆశ్రమపు భక్తులైన డా. బి.నారాయణరావు గారు ఇచ్చారు. ఐతే అందరు విద్యార్థులకూ ఆశ్రమంలోనే భోజనం.

స్వామీ త్యాగీశానందగారు

స్వామి త్యాగీశానంద గారి గురించి కొన్ని మాటలు చెప్పాలి. వారు అప్పటి తిరువాంకూర్-కొచ్చిన్ (ఇప్పటి కేరళ) రాజ్యానికి చెందిన విద్యావంతులు, సంస్కారవంతులైన కుటుంబానికి చెందిన మలయాళీ. పూర్వాశ్రమంలో వారి పేరు శ్రీ వి.కె.కృష్ణమేనన్. వారు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. సంస్కృత పరీక్షలలో మొదటి స్థానం గెలుచుకున్నవారు. వారి బాబాయి మద్రాసు హైకోర్టులో న్యాయాధికారి. స్వామీజిగారిని న్యాయవాదిగా చేయాలని వారికి గట్టి కోరిక. దానికోసం త్యాగీశానంద గారిని న్యాయ విద్య నేర్చుకోవడానికి ప్రేరేపించారు. త్యాగీశానంద గారు బి.ఎల్. డిగ్రీలోనూ మొదటి ర్యాంకును సాధించారు. వకీలుగా పనిచేయడం ప్రారంభించారు. కొన్ని రోజులలోనే వారి భ్రమలు తొలిగిపోయాయి. గాంధీ గారు వకీలు వృత్తి మొదలు పెట్టిన తరువాత కొన్ని రోజులలోనే ఏ ధర్మసంకటాలను అనుభవించి ఆ వృత్తిని వదలిపెట్టాల్సి వచ్చిందో, అవే ధర్మ సంకటాలను వీరూ అనుభవించి ఆ వృత్తిని త్యజించారు. వారికి అధ్యాపకులు కావాలని కోరిక కలిగింది. బి.టి. పరీక్షకు చదువుకుని అక్కడా మొదటి ర్యాంకును పొందారు. త్రిచూర్ అనే ఊరిలో ఎక్కువగా హరిజనులుండే ప్రాంతంలో ఒక పాఠశాలను ప్రారంభించి క్రమ క్రమంగా అభివృద్ధి చేసి ఆ హైస్కూలుకు ప్రధానోపాధ్యాయులయ్యారు. మొదటి నుండీ వీరు ఖద్దరు వస్త్రధారులు. స్వాములయ్యాక ఖాదీ దుస్తుల రంగు కాషాయంగా మారింది అంతే. వారికి గాంధీజీ నిర్మాణాత్మక పనులలో అచంచలమైన నమ్మకం.

స్వామి త్యాగీశానంద గారి వ్యక్తిత్వం అమోఘమైనది. వారి చూడగానే అందరికీ గౌరవం కలిగేది. లోతైన పాండిత్యం. పైకి చూడడానికి గంభీరంగా ఉంటారు. కానీ వారి లోపల మంచి హాస్యప్రవృత్తి ఉంది. పైగా వారు మృదు స్వభావులు. ఆశ్రమంలోని విద్యార్థులకు తల్లి లాంటివారు.

రామకృష్ణాశ్రమపు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో చెట్టుచేమలతో కూడిన విశాలమైన ప్రదేశం. ఆశ్రమం మధ్యవున్న ముఖ్యకట్టడంలో స్వామీజి, బ్రహ్మచారులు ఉంటారు. ఆ కట్టడం మధ్యభాగంలో రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివకానందల చిత్రపటాలు. వాటికి ప్రతి నిత్యం తెల్లవారు ఝామున, సాయంత్రం పూజలు. ఆ చిత్రపటాల ముందుభాగంలో సుమారు 20-30 మంది కూర్చునేంత ఖాళీ స్థలం. ఆ భవనం వరండాలో సుమారు 70-80 మంది కూర్చోవచ్చు. అక్కడే ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్వామీజి గారు ఉపన్యాసం ఇచ్చేవారు.

ఆ ముఖ్య భవనం ఎడమవైపు సుమారు 150 అడుగుల దూరంలో ఒక పెంకుల షెడ్డు. మధ్య గోడ కట్టి రెండు భాగాలు చేశారు. ఒక భాగంలో ఆశ్రమపు పశువులు. పక్కభాగంలో నలుగురు విద్యార్థులకు వసతి సౌకర్యం. వారిలో నేనూ ఒకడిని. మిగిలిన విద్యార్థులు, బ్రహ్మచారులు, స్వామీజీగారు మమ్మల్ని cow shed people అని పిలిచేవారు. పక్క గదిలో మూడు నాలుగు పశువులు. ఒక్కదాన్నైతే మరచిపోవడం అసాధ్యం. దాని పేరు త్యాగి. బలమైన శరీరాకృతి, ఏనుగులాంటి గంభీరమైన నడక. ఆ పశువులకు గడ్డి, తవుడు మొదలైన పౌష్టికాహారానికి ఏ కొరతా లేదు. త్యాగి రోజుకు 7-8 లీటర్ల పాలు ఇచ్చేది. వాటిని చూచినప్పుడు అవి అన్నీ సంతృప్తిగా జీవిస్తున్నట్టు మాకు అనిపించేది. వచ్చే జన్మలో ఆశ్రమపు పశువుగా పుట్టాలని అక్కడి కొందరు కోరుకునేవారు.

ఆశ్రమం కుడివైపు వాలీబాల్, ఫుట్‌బాల్ కోర్టులున్నాయి. సాయంకాలం విద్యార్థి మందిరపు విద్యార్థులను, బయటి విద్యార్థులను కలుపుకుని ఆశ్రమపు ప్రోత్సాహంతో ఏర్పడిన వివేకానంద యువసంఘం సభ్యులు ఆటలాడేవారు. ఇంకా ఈ సంఘం ఆశ్రమ సేవాకార్యక్రమాలలో పాలుపంచుకునేది.

ప్రొద్దున ఐదు గంటలకు జరిగే ప్రార్థనలో ఆశ్రమంలోని విద్యార్థులు, బ్రహ్మచారులు, స్వామీజీగారు పాల్గొనేవారు. ఇంకొక భవనంలో ఉన్న విద్యార్థులు అక్కడే ఉదయపు ప్రార్థన చేసుకునేవారు. సాయంత్రం 7 గంటలకు అందరు విద్యార్థులకూ ఆశ్రమంలోనే ప్రార్థన ఉండేది. ఉదయం 9 గంటలకు, సాయంత్రం 7.30 గంటలకు ఆశ్రమంలోనే అందరికీ భోజనం పెట్టేవారు.

ముందుకు సాగిన చదువు

అప్పటి నియమాల ప్రకారం విద్యార్థులు మూడు సంవత్సరాల ఆనర్స్ కోర్సును గరిష్టంగా ఐదేళ్ళలోపల పూర్తీచేయాలి. నేను 1940లో మొదటి సంవత్సరం ఆనర్స్ క్లాసులో చేరాను. రెండు సంవత్సరాలు ఆనర్స్ చదివి క్విట్ ఇండియా ఉద్యమం కోసం రెండు సంవత్సరాలు కాలేజీ వదిలిపెట్టి ఐదవ యేడు అంటే 1944లో మళ్ళీ ఆనర్స్ మూడవ సంవత్సరంలో చేరాను. అంటే నాకు అది చివరి అవకాశం. ఆ యేడు అనారోగ్యం వంటి ఏకారణాల వల్లనైనా పరీక్షలకు వెళ్ళకపోతే నాకు బి.ఎస్.సి.(ఆనర్స్) డిగ్రీ పొందడం సాధ్యం కాదు. పైగా మూడవ సంవత్సరం పరీక్షలో మొదటి రెండు సంవత్సరాల పాఠాలు కలిపి చదువుకోవాలి. అంటే 3, 4 ఏండ్ల క్రితం చదివిన పాఠాలు చివరి పరీక్షల కోసం మళ్ళీ చదవాలన్నమాట. ఈమధ్య కాలంలో నా రెండేళ్ళ విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడినందువల్ల ఆ పాఠాలు పూర్తిగా మరచిపోయాను. నాకు మామూలు అంటే మూడవ క్లాసులో లేదా రెండవ క్లాసులో పాసు కావడం సుతరామూ ఇష్టం లేదు. నేను ఇంతవరకూ వ్రాసిన పరీక్షలన్నీ హై ఫస్టు క్లాసులో పాసయ్యాను. బి.ఎస్.సి. ఆనర్స్ కూడా ఫస్టు క్లాసులోనే పాసుకావాలని పంతం. ఈ విషయాలన్నీ నా మనస్సుపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకువచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పెట్టి చదివాను. సాయంత్రాలు, సెలవు రోజులు అన్నీ నాకు చదువుకునే సమయాలే. రాత్రి సుమారు ఒంటి గంట, రెండు గంటల వరకూ చదువుకునేవాడిని. సాధారణంగా నాలుగైదు గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవాడిని కాను. సెలవు రోజులలో రోజుకు 12 గంటలు చదివే వాడిని.

ఇదంతా ఈ కాలం విద్యార్థులు నమ్మకపోయినా ఆశ్చర్యమేమీ లేదు. నాకు మంచి అలవాట్లు, దృఢచిత్తం, ఆరోగ్యం ఉన్న కారణంగా ఇంత కష్టపడటం సాధ్యమయ్యింది.

ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఆశ్రమంలో భోజనము. దాన్ని ముగించి సుమారు 9.30 గంటలకు నాలుగు కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరమున్న సెంట్రల్ కాలేజీకి నడుచుకుని వెళ్ళేవాణ్ణి. కాళ్ళకు చెప్పులు లేవు. తరగతులు పదిన్నర గంటల నుండి సాయంత్రం నాలుగున్నర, ఐదు గంటలవరకూ జరిగేవి. మధ్యాహ్నం తిండి లేదు. యథేచ్ఛగా నీళ్ళు త్రాగేవాడిని. సాయంత్రం ఆశ్రమానికి వచ్చే సరికి ఐదు, ఐదున్నర గంటలయ్యేది. కొంచెం అలసిపోయినా వాలీబాల్, బాస్కెట్‌బాల్ ఆడేవాడిని. ఒక్కొక్క రోజు కాలేజీలో నిపుణులతో ప్రత్యేక ఉపన్యాసాలు ఉండేవి. వాటికి తప్పనిసరిగా హాజరయ్యేవాడిని. అలాంటి రోజులలో ఆశ్రమం చేరేసరికి సుమారు 7 గంటలయ్యేది. రోజూ రెండుసార్లు భోజనం తప్పితే ఇంకేమీ లేదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి అర్ధణాను ఖర్చుపెట్టి రెండు సాదా దోసెలను తినేవాణ్ణి. కాఫీ తాగేవాడిని కాదు. ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. అర్ధణా పెట్టి ఆకలి తీరని ఆ వేడి నీళ్ళను తాగే బదులు రెండు సాదా దోశలను తినవచ్చనే లెక్కాచారం అంతే!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here