సంగీత సురధార-28

0
3

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 21

సంగీత రచనల పరిణామములు – విభజన – లక్షణములు:

సంగీతము రెండు విధములు – కల్పిత సంగీతము – మనోధర్మ సంగీతము.

కల్పిత సంగీతము:

కల్పిత సంగీతము అనగా సంగీతమును కల్పించి పెట్టుట. అనగా అనేక రకములైన పద్యములు, గేయములు, వచనలు – అనేక రకములైన కల్పితమును ఆయా రకమునకు తగు రీతి గణములతో ఆయా రకమును సిద్ధపరిచి వ్రాసి చిరకాలము స్థిరముగా యుండునట్లు చేయడం. అదే రీతి సంగీతమునకు కూడా చాలా రకాలైన రచనలు గొప్ప గొప్ప వాగ్గేయకారులు రచించి యున్నారు. ఈ రచనలు కల్పింపబడి జనులకు అందజేయబడుతున్నవి. వీటికి కల్పిత సంగీతము అని పేరు.

మనోధర్మ సంగీతము:

కవిత్వంలో ఆశుకవిత్వము వలె యుండేది. ఈ భాగములో రచన్లు కొన్ని తాళబద్ధములు కావు. రాగాలాపన, తాళము, కల్పన స్వరములు ఈ కోవకు చెందినవి. రచన అనగా సంగీతమును కాలపరిమితితో ఇముడ్చుట. ఇది సాంకేతిక (టెక్నికల్), మధుర (మెలోడిక్) అని రెండు రకాలు. తాళ, రాగ స్వర స్థానమును అవలీలగా పాడుటకు ఈ రచనలు ఉపయోగపడతాయి. హెచ్చు, మంద్ర, మధ్య స్థాయిలలో శ్రుతి తప్పకుండా పాడుట; సరళీ వరుసలు, స్వర స్థానములను శ్రుతిలో కల్పి పాడుటకు వ్యాయామములు. జంట వరుసలు రెండు, మూడు స్వరములు ఒకే గుక్కతో వేరు వేరుగా పలుకుటకు క్రమముగా గమకములకు ఉపయోగములు. అలంకారములు తాళమును స్థిరపరిచి 7, 35 తాళముల పరిచయము కల్గించు ఉపకరణములు. రాయి, రప్ప, మన్ను మొదలుగా గల వస్తువులు సౌధముకెట్లు ఉపయోగకరమో అట్లే పై రచనలన్నియు సంగీత కళాసౌధమునకు పరికరములు. సాంకేతిక రచనలను అభ్యాస గానమని చెప్పుట కలదు. ఈ శాఖలో చేరిన రచనలు, సరళీ వరుసలు, హెచ్చు స్థాయి వరుసలు, జంట వరుసలు, గీతములు, కటకములు (చిట్ట తానములు), స్వర జతులు, జతి స్వరములు (లేక స్వర పల్లవులు) వర్ణములు.

గీతము:

సంగీత రచనలో చాలా ముఖ్యమైనది. సంగీత ప్రపంచమున ‘గీతము’ అను పదముకు వేరు స్థానము కలదు. సంగీత విద్యార్థులు సంగీత కళను ప్రారంభించి కొంత శిక్షణ పొందిన వెనుక నేర్చుకొనదగినది. మధుర రచనలన్నింటికి సాంకేతికమైన ఈ గీతమనునది పునాదిగా ఏర్పడుచున్నది.

గీతము లోని సంగీతము చాలా ఇంపుగాను, సాధారణముగాను, సులభముగాను ఉండును. రాగ భావము ఉట్టిపడుచుండును. లయ ఒకే రీతి నడుచును. గీతమునకు పల్లవి, అనుపల్లవి, చరణము అను భాగములు లేవు. సంగతులు ఉండవు. చాలా కష్టమైన సంచారములుండవు. కాని రాగస్వరూపము బాగుగా చెవులగట్టును. లయ సామాన్యము. స్వర భాగములలోనే ప్రతి స్వరమునకు సరియైన అక్షరము సాధారముగా సాహిత్య భాగములో ఉండును. సాహిత్య భావము దైవభక్తి. గీతమును ఆపక మొదటి నుండి చివరి వరకు నిలుపక పాడుటయే గీతమును పాడు పద్ధతి. అర్థము లేని పదములు – అయ్య, తియ్య, అయ్యం, వయ్యం మొదలగు పదములు కొన్ని గీతములందు పాడబడినవి. వీటి వల్ల ఉపయోగము లేవియు లేవు కాని గీత రచయితలు వీటిని తమ తమ గీతములలో వాడిన – గీతము శోభించునను తలంపుతో వాడిరి. వీనిని ‘గీతాలంకారములు’ అని అనుటయు కలదు. కొన్ని ప్రసిద్ధ సంస్కృత శ్లోకములను గీతములుగా పరివర్తనము చేసి సంగీతములో వాడుకొనుట కలదు. ఉదాహరణ: భైరవి రాగములో ‘శ్రీరామచంద్రా’యును, నాట రాగములో ‘అమిరీ కబరీ’యును.

గీతముల భాష సాధారణముగా సంస్కృతము, కన్నడము, భాండీర భాష. వాగ్గేయకారులు సంస్కృతము నందే రచనలు రచించుచుండిరి. కాని కొంత కాలము తరువాత ప్రాకృతములో ఒక భేదమైన భాండీర భాషలో రచించుట మొదలు పెట్టిరి. ఇంకా కొద్ది కాలము పిమ్మట ఇతర భాషలలో రచనలు రచింపబడినవి. ఇతర భాషలలో రచనలు ప్రారంభమైన వెనుక భాండీర భాషలో తగ్గిపోయినవి.

స్వరావళులు జంట వరుసలు మొదలగుగా గల రచనలు అలంకారముల వరకు చేర్చుకొనిన తరువాత, నేర్చుకొనదగినవి గీతములు.

గీతములు, సప్త తాళములు, వాని వ్యాప్త రూపములలో కూడా రచింపబడినవి.

గీతములు 2 తెగలు: (1) సామాన్య గీతములు (2) లక్షణ గీతములు.

ఏ తెగకు చెందిన గీతమైనను పైన చెప్పబడిన లక్షణములనే కల్గియుండును. సామాన్య, లక్షణ గీతములకును సాహిత్య భాగములో మాత్రము తేడాలుండును. సామాన్య గీతముల యొక్క సాహిత్యము ఏదో ఒక దైవమును ప్రార్థించుచు, వర్ణించుచూ ఉండును. కాని లక్షణ గీతములోని సాహిత్యము ఆ గీతము ఏ రాగములో రచించబడినదో ఆ రాగము యొక్క లక్షణమును తెలుపును. అనగా ఆ గీతము యొక్క రాగము మేళకర్త రాగమా (లేక) జన్య రాగమా, దాని పేరు, జన్య రాగమైనచో అది జనించిన మేళకర్త పేరు, ఉపాంగమా, భాషాంగమా, భాషాంగమైతే అన్యస్వరమెద్ది, వక్రమా, వర్జమా, న్యాస స్వరమెద్ది, జీవస్వరమెద్ది, ఔఢవమా, షాఢవమా, లేక సంపూర్ణమా అను మొదలగు ప్రతీ అంశమును సాహిత్యమునందు కాననగును.

లక్షణ గీతములు చాలా రాగములలో రచింపబడినవి. ప్రసిద్ధ రాగములలో చాలా కలవు. అప్రసిద్ధ రాగములలో కొన్నింటిలో మాత్రము లక్షణ గీతములు రచించబడినవి. ప్రాచీన కాలమందు గురుకులాశ్రమమున శిష్యుడు విద్యనభ్యసించుచుండెను.

తాళపత్రములలో కొంత విషయములు వ్రాసియున్నప్పటికీ ఇప్పటి వలె వేలకు వేల గ్రంథములు తయారగుటకు ఇప్పటి అచ్చు వసతులు అప్పుడు లేవు. కనుకనే గణితము నందు ఎక్కములు, సంస్కృతం ప్రారంభించుటకు శబ్దములు, అమరము మొదలగునవి గురువు శిష్యునకు మౌఖికంగా లక్ష్య లక్షణములు నేర్పుచూ వచ్చెను. అదే రీతిన సంగీతమునందును రాగ లక్షణములు సంగీత విద్యార్థులకు లక్షణ గీతముల ద్వారా నేర్పబడినవి.

72 మేళకర్త రాగాలు, వాటి చట్టము తయారుచేసిన మహాశయుడు 72 రాగములలో లక్షణ గీతములు రచించి యున్నాడు. ఇది సంగీత ప్రపంచమున అఖండసేవ. కాని ఇవి ప్రస్తుతం విలువ కోల్పోయినవి.

పైన 72 రాగాంగ రాగ లక్షణ గీత మొక్కొక్క దానిని 3 భాగములుగా భాగించి వాటికి సూత్రఖండమనియు, ఉపాంగ ఖండమనియు, భాషాంగ ఖండమనియు వ్రాసెను. సూత్ర ఖండములోని సాహిత్యము ఆ రాగాంగ రాగము యొక్క స్వరములు, వాటి వికృతి భేదములు, ఏ చక్రమునకు చెందినది, దాని వరుస సంఖ్య మొదలగు విషయములు మాత్రమే చర్చింపబడినవి. ఉపాంగ ఖండములో పై రాగాంగ రాగములో జన్మించు ఉపాంగ రాగముల పట్టిక వ్రాయబడింది. భాషాంగ ఖండమందు భాషాంగ రాగముల పట్టిక వ్రాయబడును. పై గీతములలో వ్రాయబడిన ఉపాంగ రాగములలో కొన్ని ఇప్పుడు భాషాంగములైనవి. కొన్ని రాగములు ఇపుడు ఉపయోగమునందు లేవు.

గీతములను రచించుట, గీతములు పాడుట ఒకప్పుడు చాల గొప్ప విద్వత్తుగా నెంచబడుచుండెను. పైడాల గురుమూర్తి శాస్త్రి అను వాగ్గేయకారులు 1000 గీతములు రచించినందున ‘వెయ్యి గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి’ అను బిరుదును పొందెను. గీవింద దీక్షితులు, వెంకటముఖి, గోవిందాచార్యులు, రామామాత్యుడు, పురందరదాసు మున్నగు వారు గీతముల రచించిన మహాశయులు.

పురందరదాసుల వారు ప్రారంభములో నేర్చుకొను పిళ్ళారి గీతములు రచించిరి. ఈ గీతములు విఘ్నేశ్వరునీ, మహేశ్వరునీ, విష్ణువును కొలుచు గీతములు. ఘన రాగ గీతములు అను నాట, గౌళ, ఆరభి, శ్రీ, వరాళి అను రాగములలో గీతములు రచింపబడినవి.

రాగమాల గీతమని కొన్ని రాగములలో రాగమాలికను పోలిన ఒక గీతమున్నది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here