అన్నమయ్య పద శృంగారం-4

0
3

[‘అన్నమయ్య శృంగార సంకీర్తనలు-18వ సంపుటి’ లోని 600 కీర్తనలకు భావాలను ధారావాహికంగా సమర్పిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

ఆహిరి

ఆపలేక కొసరితి నంతియకాక
పైపై నిన్నింత వొడబరచగవలెనా ॥ పల్లవి ॥
తలపులో తమకము దాచ నలవిగాక
చెలరేగి విన్నపము చేసితిగాక
మలసి నీయంత నీవు మన్నించవా నన్ను
నెలకొన్న నావలపు నీ వెరగనిదా ॥ ఆప ॥
తనువుపై జవ్వనమదము వారించగరాక
వొనర నాచన్నుల నిన్నొత్తి తిగాక
ననుపుతో చనవులు నాడే నాకియ్యవా
నిను పైననావునికి నీవు చూడనిదా ॥ ఆప ॥
వెస గాగిటిలో రతివేడుక వసముగాక
పసలుగా నిన్ను గూడి పైకొంటిగాక
పొసగ శ్రీ వేంకటేశ భోగము నాకియ్యవా
యెసగ నాగుణము నీవిటు సోదించనిదా ॥ ఆప ॥ (23)

భావము: శ్రీవేంకటేశా! నీ పై మోహాన్ని ఆపుకోలేక నిన్ను కొసరికొసరి అడిగాను గానీ, మీదు మిక్కిలి నిన్ను అంగీకరింప జేయవలెనా? నా మనసులో మోహాన్ని దాచుకోలేక విజృంభించి విన్నపాలు చేశాను, నా ప్రేమ నీకు తెలియనిదా స్వామీ! నీ యంత నీవే నన్ను మన్నించవా? నా శరీరంపై వున్న యౌవన మదాన్ని వారించలేక నా చనుదోయితో నిన్ను వొత్తానుగానీ అభిమానంతో ఆనాడే నీవు నాకు చనవులిచ్చావు.

నీ కౌగిటిలో రతి వేడుక నావశముగాక కోరికతో నిన్ను కూడి పైకొన్నాను. నా గుణగణాలు మున్ను నీవు పరిశోధించలేదా స్వామీ! భోగాన్ని నా కియ్యవా – అంటున్నది సతి బ్రతిమాలే ధోరణిలో. యౌవనంలోని ఉద్రేకము, పతిపై మోహము, దాచలేని ప్రేమ ఇందులో వ్యక్తమయ్యాయి.

గౌళ

ఎందరి బెండ్లాడినా నీకేమాయను
అందుకుగా నే నిన్ను నౌగాదనేనా ॥ పల్లవి ॥
వలచి వచ్చితినని వనిత వేడుకొనగా
చెలిమిసేయక యేల సిగ్గుపడేవు
సొలపుజూపుల నిన్ను జూచిచూచి కొసరగా
తలవంచుకొని యేల తప్పించుకొనేవు ॥ ఎంద ॥
కాపురము సేయవచ్చి కాచుకొని యాపె వుండగా
యేపున నీవు సెలవి నేల నవ్వేవు
పైపై నీతమ్ములనకు భామ చేయిచాచగాను
రాపుజాణతనా లేల రచ్చలో నాడేవు ॥ ఎంద ॥
వేడుకతో నాపె నీకు వెస బాదాలొత్తరాగా
కూడుదువు గాక యేల గుట్టుచూపేవు
యీడనె శ్రీ వేంకటేశ యిటు నన్ను గూడితివి
వీడెమిచ్చేసతి నేల వింత సేసేవు ॥ ఎంద॥ (24)

భావము: దక్షిణ నాయకుడైన వేంకటేశ్వరునితో ఒక సతి మరొక సతిని గూర్చి సిఫారసు చేస్తున్నది.

శ్రీ వేంకటేశ్వరా! ఎందరినో పెండ్లాడిన మగధీరుడవు నీకేమాయెను? అందుకనే నీతో నేను ఔను, కాదు – అనలేదుగా. తనంతతానే ప్రేమించి వచ్చానని నిన్ను వేడుకోగా ఆమెతో స్నేహం చేయక సిగ్గుపడతావెందుకు? ఆమె ప్రేమపు చూపులతో చూస్తూ కొసరికొసరి వేడుకోగా నీవేల తలవంచుకొని తప్పించుకొంటున్నావు? నీతో సంసారం చేయాలని వచ్చి ఆమె కాచుకొని వుండగా నీవు పెదాల చివర అలా నవ్వుతావెందుకు? నీ తాంబూలం కోసం మాటిమాటికీ చేయిచాచి అడుగగా బింకంతో కూడిన జాణవై రచ్చలో మాట్లాడుతున్నావు, ఎంతో వేడ్కతో ఆమె నీ పాదాలొత్తుతానని రాగా అంగీకరించక ఏలా రహస్యంగా వుంటావు? ఇక్కడనే ఈ విధంగా నాపొందునందిన నీవు తాంబూలాన్ని అందించే ఆమె పట్ల అలా వింతగా ప్రవర్తించడమేమి?

రేకు 805

భైరవి

చెలులము మాచేత జెప్పించరాదు
వెలయ నాతడు నీవు విచారించుకొనవే ॥ పల్లవి ॥
సిగ్గువడ నేమిటికి చిత్తములోని వేడుక
యెగ్గుగాదు రమణుని కెరిగించవే
తగ్గించి దాచవచ్చునా తలపులోని వలపు
వొగ్గి యాకతానకు నీవు వొనరిక (క?) దీయవే ॥ చెలు ॥
ముసిముసినవ్వులేల ముంచిననీకోరికలు
వెస నాతడు చెల్లించీ వేడుకొనవే
వసగాని చన్నులజవ్వన మొద్దంటే బోవునా
కొసరి చూపుదుగాని కూడి తెరవేయవే ॥ చెలు ॥
సన్నలు జాయలు నేల చలమున నీయాస
పన్ని యిత డీడేరిచీ విన్నవించవే
నిన్ననే తా గూడినాడు నీవేల మొరగేవు
యెన్నిక శ్రీ వేంకటేశు నింకా గాగిలించవే ॥ చెలు ॥ (25)

భావము: చెలికత్తెలు సఖితో విభుని గూర్చి మేలమాడుతున్నారు. ఓ సఖీ! చెలులమైన మాచేత ఇలా చెప్పించరాదు. మీ యిద్దరూ ఒకరికొకరు ఆలోచించుకోవాలి. నీవు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీ మనసులోని వేడుకను విభునికి తెలియజేయడం దోషం కాదు. నీ మనసులోని ప్రేమను తగ్గించుకొని దాచిపెట్టవలెనా? ఆ ఆకతాయితనానికి నీవు వొనరిక కల్పించాలి. నీ కోరికలు నిన్ను చుట్టుముట్టగా ముసిముసి నవ్వులేల? ఆతడు చెల్లించేలా వేడుకో! నీ వశముగాని చనుదోయి ఉన్నతితో కూడిన యౌవనాన్ని నీవు వొద్దు అంటే పోతుందా? ఆ యౌవ్వనాన్ని అతనికి కొసరి చూపుదువుగాని అడ్డు తెరవేయవే! ఈ సంజ్ఞలు, ఆనవాళ్లు అవసరం లేదు. పంతంతో నీవు ఆశ కొలిపి యితడు తీర్చబోతున్నాడు. నీ విన్నపాలు చెప్పుకో! నిన్ననేగదా నిన్ను కూడినాడు. నీవింకా గొణగనేల కోరికతో వెంకటేశుని కౌగిలించవమ్మా – అని చెలి హెచ్చరిస్తోంది.

విభుని వశపరచుకొనే మార్గాలు చెబుతోంది చెలి.

శ్రీరాగం

ఎంత సింగారించుకొంటి విప్పుడు నీవు
చింతించ జక్కదనమే సింగారము గాదా ॥ పల్లవి ॥
కాంత నీవు నిమ్మపండ్లు గాను కియ్యవలెనా
బంతి నీచన్నులే నిమ్మపండ్లుగావా
పొంత నందుకు దామరపూవులు వేయవలెనా
చెంతజూచే నీకన్నులే చెందామరలు గావా ॥ ఎంత ॥
కలికి నీవప్పటిని కప్ర మంపవలెనా
కలగొన్న నవ్వులే కష్టాలు గావా
తెలిసి నీమాటల తీపులు చల్లవలెనా
తిలకింప మోవితేనే తీపులు గావా ॥ ఎంత ॥
వనిత యింటికి బిలువగ నింతవలెనా
యెనసితే నీపయ్యదే యిల్లుగాదా
చెనకి యలమేల్మంగ శ్రీ వేంకటేశుడ దాను
కని మొక్కవలెనా నీకాగిలే మొక్కు గాదా ॥ ఎంత ॥ (26)

భావము: వివిధ రకాలైన కవి సమయాలలో అన్నమయ్య చమత్కరించారు. ఓయమ్మా! నీవు చక్కదనాల చుక్కవు. అదే నీకు ఆలంకారమైనప్పుడు ఇప్పుడు ప్రత్యేకించి నీవు సింగారించుకోవాలని ఆలోచించనక్కరలేదు. బంతులవలె వున్న నీ చన్నులే నిమ్మ పండ్లుకాగా, ప్రత్యేకించి నీవు నిమ్మ పండ్లు కానుకగా నివ్వనవసరం లేదు. నీ కనులే ఎర్ర తామరలైనపుడు మళ్లీ ప్రియునిపై తామరపూలు విసరవలెనా? నీ నవ్వులే కలబోసిన కర్పూరాలు కాగా మళ్లీ ఓ కలికీ! ప్రత్యేకంగా ఆతనికి కప్పురం పంపాలా? చూడగా నీ పెదవుల తేనె తియ్యదనం నీకుండగా నీ తియ్యని మాటల చల్లవలెనా? అంటున్నది సఖి.

ఆ వనిత తనంత తాను ఇంటికి పిలువగా ఇంత బెట్టు చేయాలా? ఉత్సాహం చూపితే తన పైట ఇల్లుగా మారదా? అలమేలుమంగ నిన్ను చూచి మొక్కవలెనా? నీ కౌగిలియే మొక్కు కాదా?

ముగ్ధమోహన సౌందర్యం గల కాంతను అన్నమయ్య ఇలా కవి సమయాలతో పోల్చి వర్ణించడం విశేషం.

పళపంజరం

వింటిరటే చెలులాల వేడుక సంతోసవార్త
యింట నింట వూరనెల్ల యిదే సుద్ది ॥ పల్లవి ॥
కోమలి దేవకిదేవి కొడుకు గంటే రేపల్లె
ప్రేమతో వసుదేవుడు పెంచబెట్టి వచ్చేనట
గామిడై యశోదకూతు గంసునికి జూపెనట
ఆమగువ కంసుని నద్దలించినదట ॥ వింటి ॥
శ్రావణబహుళాష్టమి సవరేతిరికాడను
ఆవేళ రోహిణి మంచిదైనపొద్దూనట
కావింప మేనమామకు గండమట యీతడే
దేవరట బాపలెల్లా దిక్కుల జెప్పిరి ॥ వింటి ॥
యిటమీఁద రాకాసులు నిందరి గొట్టెనట
ఘటన సాధులనెల్లా గరుణ రక్షించెనట
పటుగతి వీడు శ్రీవేంకటగిరికృష్ణుడట
నటించునలమేల్మంగనాయకుడు దానట ॥ వింటి ॥ (27)

భావము: శ్రీ కృష్ణ జననాన్ని, తరువాతి పరిణామాలను సఖులు ఒకరికొకరు తలపోసుకుంటున్నారు. శ్రీకృష్ణుడే ఈనాటి శ్రీవేంకటగిరి నాయకుడని సమర్థిస్తున్నారు.

ఓ సఖులారా! విన్నారమ్మా! ఈ సంతోషకర వార్త. ఊరూవాడ అంతటా ఈ సుద్దులే పలుకుతున్నారు. కోమలియైన దేవకీదేవి కొడుకును కంటే, అతనిని ప్రేమతో వసుదేవుడు తీసుకెళ్లి నందయశోదల యింట పెంచడానికి రేపల్లెలో పెట్టి వచ్చాడట! యశోద తాను కనిన కూతురిని కంసునకు చూపించింది. ఆ బిడ్డ ఆకాశమార్గంలో నిలిచి కంసుని బెదిరించింది. రోహిణీ నక్షత్రశుభ లగ్నంలో అర్ధరాత్రి వేళ శ్రావణ బహుళాష్టమినాడు శ్రీకృష్ణుడు జన్మించాడట! ఇతడు మేనమామకు గండంగా జన్మించాడనీ ఇతడే దేవుడనీ నానాదిక్కుల బ్రాహ్మణులు ఘోషించారు. ఆపైన రాక్షసులనందరినీ చంపెనట! సాధువులందరినీ కరుణతో రక్షించాడు (దుష్టశిక్షణ, శిష్టరక్షణ) ఇతడే వేంకటేశుని రూపంలో వున్న కృష్ణుడు, అలమేలుమంగా విభుడునట! – జానపదులు వాడుక భాషలో ఒకరికొకరు వింతలు చెప్పుకొన్న రీతిలో ఈ కీర్తన మలచబడింది.

సామంతం

సందుసుడికత్తెలజాణతనా లిట్టివౌనె
పొందులేని పొందులేల పొదువ వచ్చేవే ॥ పల్లవి ॥
బట్టబయలాతడు నీబావంటా నందరితో
చుట్టరికా లెంతేసి చూపి చెప్పేవే
మెట్టిపట్టు కప్పటి నీమేనత్త కొడుకంటాను
జట్టిగొని యాతనితో సరసాలాడేవే ॥ సందు ॥
బెరసి యాతడు నీ పెండ్లికొడు కవునంటా
సొరిది గంకణ మెట్టు చూపవచ్చేవే
గరిమ నాతడు నీకాలు దొక్కినాడంటా
పరుపుపై నింటిలోన బవళించేవే ॥ సందు ॥
వూరకె యిప్పుడు నీవొడినట్టె నీతడంటా
నోరిమాటలాడి చన్నుల నొత్తేవే
యీరీతి శ్రీ వేంకటేశుడే నలమేలుమంగను
నారమణుడేలె నన్ను నవ్వులేల నవ్వేవే ॥ సందు ॥ (28)

భావము: శ్రీవేంకటేశుడు తన ప్రియుడంటూ వచ్చిన ఒక వనిత తొందరపాటును ఈ కీర్తన వర్ణిస్తోంది.

సందు చూసుకొని దూరే జాణల పనితనాలు ఇలానే వుంటాయే! సఖ్యత లేని పొందుల గూర్చి ఆరోపించడానికి వచ్చావే! ఆతడు నీ బావయని బహిరంగంగా చుట్టరికం కలిపి చూపడానికి వచ్చావేమమ్మా! అతడు నీ మేనత్త కొడుకని చెప్పి అతనితో జట్టుకట్టి సరసాలాడుతున్నావు గదే! ఆతడు నీ పెళ్లి కొడుకని చెప్పి ఎంత ధైర్యంగా కంకణం చూపడానికి వచ్చావే? అతడు పెళ్లిలో నీ కాలు తొక్కాడని నీవు శయన మందిరంలో దర్జాగా ఇంటిలో పడుకున్నావే! అతడు నీ వొడిని వూరకే పట్టుకొన్నాడని నయగారాలు పలుకుతూ చనుదోయితో వొత్తేవే! ఈ విధంగా వేంకటేశుడు అలమేలుమంగను ఏలుకొనగా, నన్ను చూచి నవ్వనేల?

ముఖారి

కాగిలించి పట్టుకోరే కల్లరి వీడు
మాగినమోవి చూపి మరిగించి వీడు ॥ పల్లవి ॥
కోడెకాండ్లు దాను కోలలెత్తుకొని
వాడవాడల నుట్లు వడి గొట్టీని
వేడుకకాడమ్మ వెస గృష్ణు డిటువంటి
జాడలు వద్దంటేను చన్నులంటీని ॥ కాగి ॥
వీధివీధి బాలువెన్న వెస గొల్లలాడినాడు
ఆదెస జాడెలు నిండి అట్టెవున్నవి
పాడుకొని చక్కిలాలచాన విడువుమని
పాదాలకు మొక్కితేను పయ్యద దెరచీని ॥ కాగి ॥
వోసరించక యిదివో వుట్ల పండగ సేసి
వేసరక పెక్కిండ్లవిందైనాడు
సేసవెట్టె నిందరిపై శ్రీ వేంకటాద్రిమీద
బాసతో నలమేల్మంగపతియైన కృష్ణుడు ॥ కాగి ॥ (29)

భావము: వేంకటేశ్వర కృష్ణుని బాల్య చేష్టలను సఖులు పలురకాలుగా ముచ్చటించు కొంటూ ఉట్టి కొట్టడాన్ని (గోకులాష్టమినాడు) ప్రస్తావించాడు. ఈ పంచకుని (అబద్ధాలమారిని) కౌగిలించి పట్టుకోండి! పండిన పెదవిచూపి స్త్రీలను వీడు మరిగిస్తాడు. తన జట్టుకాండ్రతో కలిసి చెలకోలలు పట్టుకొని వీధివీధినా వుట్లు వేగంగా కొడుతున్నాడు. ఈ కృష్ణుదిటువంటి కొంటెగాడు. ఆ పనులు వద్దంటే చన్నులు పట్టుకొంటున్నాడు. అతడు వీధి వీధి తిరిగి పాలు, వెన్నలు దొంగిలించాడు. ఈ కొంటె పనుల జాడలన్నీ యింకా నిండి వున్నాయి. చక్కిలాలకుండను వదలిపెట్టమని వేడుకుంటూ పాదాలంటితే పైటచెంగు ఊడదీశాడు. అది తప్పు అని తెలియక ఇదిగో! ఉట్ల పండగ చేసి ఎందరి ఇళ్లలోనో ప్రీతిపాత్రుడైనాడు. వెంకటాద్రిపై నెలకొన్న అలమేలు మంగాపతియైన వెంకటకృష్ణుడు అందరి మీద సేసలు చల్లాడు.

రామక్రియ

చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేటికి
బత్తిసేసీ నాకె నీపై భావించవయ్యా ॥ పల్లవి ॥
సెలవుల నవ్వుతాను చేరి మాటలాడుతాను
పలువరుసలు చూపీ బడతి నీకు
నిలుగునివ్వెరుగుతో నిండుసింగారములెల్లా
బలుమారు నీముందర బచరించీని ॥ చిత్త ॥
కొప్పు చక్కబెట్టుకొంటా కొలువులు నేసుకొంటా
నెప్పున జన్నుల నొత్తీ నెలత నిన్ను
వుప్పతిల్లుగళలతో నుడివోనిజవ్వనాన
కుప్పళించి వలపులు గురిసీ నీయెదుట ॥ చిత్త ॥
సరులు దిద్దుకొనుచు చవులెల్లా మోవి జూపి
మరిగించీ నలమేలుమంగ నిన్నును
ఇరవె శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి
వురముపై నుండి యాపె వుబ్బించీ నీమనసు ॥ చిత్త ॥ (30)

భావము: పరకీయ అయిన ఒక నాయిక నాయకుని మీద ప్రేమను వివిధ రకాలుగా వొలకబోస్తోంది.

ఓ వేంకటేశా! నీవు సిగ్గుపడనేలకె చిత్తగించ చూడవయ్యా! ఆమె నీపట్ల భక్తిభావంతో వుండటం గమనించవయ్యా! ఆమె నీకు పలువరసలు చూపుతూ పెదవుల చివర నవ్వుతూ సరసాలాడుతోంది. తన నిండు సౌందర్యాన్ని ఆశ్చర్యకరంగా అనేకమార్లు నీ ముందర చూపుతూ తిరుగుతోంది. తలకొప్పు సవరించుకొంటు, సేవలు చేసుకొంటూ చమత్కారంగా ఆ భామ నిన్ను చనుదోయితో హత్తుకొంటోంది. మోహభారంతో నిండైన యవ్వన భారమంతా ఒకేచోట కుప్పలుగా పోసి నీ ముందు ప్రేమ కురిపిస్తోంది.

తలపై పూలు సవరించుకొంటూ పెదవిపై తీపులను చవి చూపి నిన్ను మోహపరవశుణ్ణి చేసింది అలమేలుమంగ. ఈ విధంగా నన్ను ఏలుకొన్నావు. ఆమె నీ ఎద పై నిలిచి నీ మనసు ఉవ్విళూరింపజేస్తోంది.

శంకరాభరణం

అలమేలుమంగను నేనైతేనయితిగాక
నిలుచుండి నన్ను జూచి నీకేల లోగను ॥ పల్లవి ॥
చేరి విన్న వించవే సిగ్గువడ నీకేటికి
చీరుమూరుగా వలచినదానవు
వేరులే కప్పటనుండి వేళగాచుకుందానవు
నేరుపుతో నన్ను జూచి నీవేల లోగేపు ॥ అల ॥
గట్టిగాను నవ్వవే కడుదాచనేటికి
తొట్టినట్టితమకముతోడి దానవు
నట్టున నందుకుగానే కోరి లాచివుందానవు
నెట్టన నేనుండగాను నీవేల లోగేవు ॥ అల ॥
యెససి కాగిలించవే యేకరగ నీకేటికి
పనివడి యట్టె యాసపడదానవు
మునుపే నన్ను గూడె నిమ్ముల శ్రీ వేంకటేశుడు
నిను నాతడే కూడీ నీవేల లోగేవు ॥ అల ॥ (31)

భావము: అలమేలుమంగ శ్రీవేంకటేశుని కోరి వచ్చిన మరొక వనితతో మాట్లాడిన తీరు వర్ణించబడినది.

నేను అలమేలుమంగను. అయితే అవును గాక (స్వాధీనపతిక) నా ఎదుట నిలబడి నన్ను చూచి వెనకడుగు వేయనేల? స్వామిని గాఢంగా ప్రేమించుదానవు – దగ్గరగా చేరి విన్నపాలు చేయ సిగ్గుపడనేల? ఆనాటి నుండి వేరుగా వుండక సమయానికై వేచియున్నదానవు గదా, నన్ను చూచి నేర్పుగా వెనుకడుగు వేయనేల? నిండైన మోహం కలిగిన దానవుగదా బిగ్గరగా నవ్వక దాచుకోనేల? అందుకునా ఇంట్లోనే కోరివున్న దానిని గాబోలు. పక్కన నేనుండగా నీవేల వెనకకి మరలిపోయేవు? దగ్గరగా వెళ్లి కౌగిలించుకో! దానికి మోహం వాచిపోనేల? అది పనిగా వచ్చి ఆశపడ్డావుగదా! శ్రీవేంకటేశుడు ఎన్నడో నన్ను కూడియున్నాడు. నిన్ను కూడా పొందగలడు. నీవు వెనుదిరగవద్దు.

దక్షిణనాయకుడైన విభుని కోసం పరితాపంతో వచ్చిన వనితతో అలమేలు మంగ మాటాడిన తీరిది.

రామక్రియ

విచారించవలె నాకు వేడుకకత్తెవు నీవు
పచారించి యతని జేపట్టవు గదా ॥ పల్లవి ॥
చెక్కులవెంట నేలే చెమట గారీ
తెక్కుల గన్నుల నేలే తేటలు వారీ
యెక్కడనుండి వచ్చేవే యింతిరో నీవు
మక్కువ నామగనితో మాటాడవు గదా ॥ విచా ॥
యెన్నగ నీపోకముడి యేల వీడీ
వన్నెలగెమ్మోవి యాల వసివాడీ
చెన్ను మీర రతి యెందు జేసి వచ్చేవే
అన్నిటా నారమణుని నంటవుగదా ॥ విచా॥
చాలై మేన బులకససులు నిండీ
మేలు నీమేనివలపు మిక్కిలి పండీ
ఆలకించి యెవ్వరి బెండ్లాడి వచ్చేవే
యేలిననా శ్రీ వేంకటేశు గూడవుగదా ॥ విచా॥ (32)

భావము: దక్షిణ నాయకుడైన శ్రీ వేంకటేశుని కోరి వచ్చిన వనితతో అలమేలుమంగ హెచ్చరికగా మాట్లాడినది. మోహపరవశురాలి శరీర వర్ణన.

నేను ఆలోచించి చూడగా నీవు జారిణీ స్త్రీవలె కన్పిస్తున్నావు. అటూ ఇటూ ఇంట్లో నడచి వచ్చి నా విభుని కైవసం చేసుకోవు గదా! దొంగచూపులు స్పష్టంగా కన్పించగా, చెక్కుల మీద చెమటలు కారుతున్నాయి. నీవు ఎక్కడి నుండి వచ్చావే, నా మగనితో ముచ్చటలాడ లేదు గదా ! చూడగా నీ పోకముడి ఎందుకు వీడిపోయింది. అందమైన నీ పెదవి ఎందుకు వసివాడిపోయింది. ఎక్కడైనా అందంగా రతిక్రీడ సలిపివచ్చావా? నా అనుమానమేమి – అంటే నా నారాయణుని అంటుకోలేదు గదా నీవు? నీ శరీరం పైన పులకల మొలకలు నిండి ఉన్నాయి. నీ శరీరమంతా వలపు పంట పండి వుంది. చూడగా నీవు ఎవరిని పెండ్లాడి వచ్చావో నిజం దాచక చెప్పు. ఒకవేళ నా స్వామి వేంకటేశుని కదియ లేదుగదా! అని అలమేలు ఆరాలు తీసింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here