అలనాటి అపురూపాలు- 170

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

జెమినీ గణేశన్:

జెమినీ గణేశన్ పలు భాషలలో దాదాపు 200కి పైగా సినిమాలలో నటించారు. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో హిట్ సినిమాలలో ఆయన ఓ భాగం. ఆయన నటించిన హిందీ చిత్రాలు కూడా పెద్ద హిట్‍లు అయ్యాయి. ఆయనని అభిమానులు ‘కాదల్ మన్నన్’ (కింగ్ ఆఫ్ రోమాన్స్) అని పిలుచుకునేవారు. రొమాంటిక్ సినిమాలు ఆయన బలం. పరిశ్రమలోని ఆయన సమకాలికులు ఆయనని ‘సాంబార్’ అని పిలిచేవారట. ఆయన తన జీవితమంతా ఆడవారిని ప్రేమిస్తూనే ఉన్నారు, వాళ్ళూ ఆయన్ని ప్రేమించారు. వేర్వేరు పెళ్ళిళ్ళు, ఎనిమిది మంది పిల్లలతో – జెమినీ గణేశన్‍ ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు.

19 నవంబర్ 1920న పుదుక్కొట్టాయ్‍లో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుబంలో జన్మించారు జెమినీ గణేశన్. చిన్నప్పుడు పదేళ్ళ వయసు వరకు, కాలేజ్ ప్రిన్సిపల్ అయిన తాతయ్య వద్ద ఉండేవారు. ఆ తరువాత మేనత్త దగ్గరకు మద్రాస్ వచ్చారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి డిగ్రీ చదివారు. ఆయన గొప్ప నటుడు కావచ్చు, కానీ మొదట అసలు ఆయన నటుడవ్వాలని అనుకోలేదట, డాక్టర్ అవ్వాలని అనుకున్నారట. అయితే ఆయన మావగారు చనిపోవడంతో డాక్టర్ అవ్వాలన్న కోరిక తీరలేదట. తన కుమార్తె టి. ఆర్. అలమేలుని పెళ్ళి చేసుకుంటే, మెడికల్ కాలేజీ సీట్ ఇప్పిస్తానని ఆయన పెళ్ళికి ముందు గణేశన్‍కి మాట ఇచ్చారట. మొదటి వివాహం నాటికి జెమినీ గణేశన్‍కి 19 ఏళ్ళు. ఈ దంపతులకి రేవతి, కమల, జయలక్ష్మి, నారాయణి అనే నలుగురు కుమార్తెలు కలిగారు.

గణేశన్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్‍లో కెమిస్ట్రీ లెక్చరర్‍గా పనిచేశారు. కెమెరామాన్ కె. రామ్‌నాథ్ గారితో పరిచయం అయ్యాకా, జెమినీ స్టూడియోలో కాస్టింగ్ డిపార్ట్‌మెంట్‍లో ఉద్యోగిగా చేరారు. జెమినీ స్టూడియోస్‍లో పని చేస్తుండడం వల్ల ఆయన పేరు ముందు ‘జెమినీ’ చేరింది. కాస్టింగ్ విభాగం పనులు చూస్తూ, చూస్తూ ఆయనకి కూడా నటించాలనే కోరిక కలిగింది. జెమినీ గణేశన్ మొదటి సినిమా ‘మిస్ మాలిని’ (1947). ఇందులో పుష్పవల్లి హీరోయిన్. ఆవిడతో ప్రేమలో పడ్డారాయన. అయితే, ‘దక్షిణాది మీనా కుమారి’ సావిత్రితో నటించిన ‘మనం పోల మాంగల్యం’ (1953) సినిమాతో ఆయన ఓ స్టార్ అయిపోయారు. ‘కళ్యాణ పరిసు’ (1953) ఆయన కెరీర్‍లో అతి పెద్ద హిట్ సినిమా. ‘మనం పోల మాంగల్యం’ (1953) షూటింగ్ సమయంలో సావిత్రితో ప్రేమలో పడి మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో ఆవిడని రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు జెమినీ గణేశన్. అప్పటికే ఆయనకి అలమేలుతో పెళ్ళయింది, నటి పుష్పవల్లితో ప్రేమాయణం సాగుతోంది.

ఈ రెండు కారణాల వల్ల తమ వివాహం జరిగిన విషయాన్ని సావిత్రి, జెమినీ గణేశన్ రహస్యంగానే ఉంచారు. తరువాత కొన్నాళ్ళ పాటు ఈ జోడీ వెండితెర మీద గొప్పగా రాణించింది. ఈ దంపతులకి విజయ చాముండేశ్వరి అనే కుమార్తె, సతీష్ కుమార్ అనే కుమారుడు జన్మించారు. కొద్ది కాలానికి జెమినీ గణేశన్ సినిమాలు ఫ్లాప్ అవడం, సావిత్రి సినిమాలు హిట్ అవడం మొదలయింది. ఫలితంగా ఈ దంపతుల మధ్య గొడవలు చెలరేగాయి. అయితే సావిత్రి విజయాలు కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆవిడ సినిమాలు పరాజయం చెందసాగాయి. అదే సమయంలో జెమీనీ గణేశన్ ఎఫైర్స్ గురించి తెలుసుకున్న సావిత్రి ఆయనని దూరం పెట్టారు.

జెమినీ గణేశన్ తొలి హిందీ సినిమా ‘మిస్సమ్మ’కి రీమేక్ అయిన ‘మిస్ మేరీ’ (1957), ఆ ఏడాది విడుదలయిన హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. తమిళంలో తాను నటించిన ‘కణవనే కణ్‍కండ దైవం’ (1955) సినిమాని హిందీలో ‘దేవత’ పేరిట రీమేక్ చేయగా, అందులో హీరోగా నటించారు. ‘రాజ్ తిలక్’ (1958) అనే హిందీ సినిమాలో నటించగా, వారం రోజుల్లోపే అది పరాజయం పాలయ్యింది. అయితే 1961లో ‘నజ్‌రానా’ అనే హిందీ సినిమాలో అతిథి పాత్రలో కన్పించారు. ఆయన కెరీర్‍లో సినిమా విజయాల కంటే, ఆయన ఎఫైర్ల గురించే వార్తలు వినవచ్చేవి.

ఆయన ఎన్నో సూపర్ హిట్ తమిళ చిత్రాలలో నటించారు. వాటిల్లో మాయాబజార్ (1957), వంజికోట్టయ్ వాలిబన్ (1958), తెన్ నిలవు (1961), నాన్ అవన్ ఇల్లై (1974), అవ్వై షణ్ముగి (1996) ముఖ్యమైనవి. తమిళ చలనచిత్ర రంగంలో ముగ్గురు అతి పెద్ద హీరోలలో ఆయన ఒకరు. మిగతా ఇద్దరు – ఎం.జి. రామచంద్రన్, శివాజీ గణేశన్.

జెమినీ గణేశన్‍కు హాస్య చతురత ఎక్కువనీ, అందరూ గంభీరంగా పరిగణించే అంశాలలోనూ ఆయన హస్యాన్ని చూడగలరనీ ఆయన కుమార్తె నారాయణి చెప్పారు. ఆయన తన చుట్టూ ఉన్న వారికి ప్రేరణ కల్పించేవారని చెప్పారు. కీర్తి ప్రతిష్ఠల వెంటపడకుండా దేంట్లోనైనా నైపుణ్యం సాధించి స్వతంత్రంగా బ్రతకాలని ఆయన చెప్పేవారు. ఆయన ఓ రొమాంటిక్ హీరోగానే గుర్తుండిపోయినా, తాను నటించిన పాత్రలలో భావోద్వేగాలను నింపిన నటుడాయన. ఆయన గొప్ప పాఠకుడు కూడా. ప్రతీ వారాంతం మద్రాస్ లోని మూర్ మార్కెట్‍ లోని సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే కొట్లకి వెళ్ళి పుస్తకాలు కొనేవారు. ఆయన వద్ద సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్స్, బయోగ్రఫీ, ఫిలాసఫీలకు సంబంధించిన పుస్తకాలు అధికంగా ఉండేవి. అయితే ఒక్క రొమాంటిక్ నవల కూడా లేకపోవడం విశేషం. మంచి చదువరే కాకుండా అయన చక్కని ఆటగాడు కూడా. ఎన్నో రకాల క్రీడలలో పాల్గొనేవారు, పడవ పోటీలలో పాల్గొనేవారు.

ఆయనకు 1971లో పద్మశ్రీ పురస్కారం లభించింది. కలైమామణి అవార్డు, ఎంజిఆర్ గోల్డ్ మెడల్, ‘కావ్య తలైవి’ (1970) చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి పురస్కారం, ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ ఎచీవ్‍మెంట్ పురస్కారం, ‘నాన్ అవన్ ఇల్లై’ చిత్రానికి ఫిలింఫేర్, తమిళ సినీ రంగానికి చేసిన సేవలకు గాను స్క్రీన్ లైఫ్‌టైమ్ అవార్డు లభించాయి.

నటి పుష్పవల్లితో సంబంధం ద్వారా భానురేఖ, రాధ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. భానురేఖ తరువాతి కాలంలో ‘రేఖ’గా హిందీ చిత్రసీమలో హీరోయిన్‍గా రాణించారు. తన చిన్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోయారనీ, తన తండ్రి తనని చూడలేదని రేఖ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

78 ఏళ్ళ వయసులో జెమినీ గణేశన్ 36 ఏళ్ళ జులియాన ఆండ్రూని వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. సుదీర్ఘ కాలం కొనసాగిన అనారోగ్యం వల్ల, శరీరాంగాలు పని చేయకపోవడం వల్ల జెమినీ గణేశన్ 84 ఏళ్ళ వయసులో 22 మార్చ్, 2005 నాడు మృతి చెందారు. ఆ సమయంలో ఆయన మొదటి భార్య అలమేలు ఆయన పక్కనే ఉన్నారు.

తమిళనాడు ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపించింది.

***

చెన్నయికి చెందిన రచయిత, చరిత్రకారుడు శ్రీరామ్ 2020 నవంబరులో ‘ది హిందూ’ దినపత్రికలో ‘Gemini Ganesan – a nice man to know’ అనే శీర్షికతో జెమినీ గణేశన్ గురించి ఇలా రాశారు:

అది నా పెళ్ళికి ముందురోజు సాయంత్రం. చాలా కార్యక్రమాలు పూర్తయ్యాయి, మా రెండు కుటుంబాల సభ్యులు పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చక్కని గాయకుడైన మా బంధువొకాయన జెమినీ గణేశన్ సినిమాలోని పాట అందుకున్నారు. అప్పుడు నా కాబోయే భార్య బంధువు ఒకావిడ – జెమినీ గణేశన్ తమకి బంధువని, మర్నాడు పెళ్ళికి వస్తారని అంది. ఇది 1993 నాటి సంగతి. అప్పటికి వెండితెర మీద ఆయన ప్రభ మసకబారింది. అయినా ఈ వార్త మా అందరికీ ఉత్సాహాన్నిచ్చింది. అనుకున్నట్టుగానే మర్నాడు జెమినీ గణేశన్ వచ్చారు. ఆయన ఓ గొప్ప స్టార్. అందుకని రాగానే, “ఫోటోగ్రాఫర్ ఎక్కడ?” అని అడిగారు. ఫోటోగ్రాఫర్ ముందుకొచ్చాడు. ఆయన నాకు, నా భార్యకు మధ్యలో నిలబడి ఫోటో దిగారు. ఫోటోల కార్యక్రమం ముగిసి ఆయన వేదిక దిగగానే ఆయన చెప్పులు కనబడలేదు. ఆయన అభిమాని ఎవరో పట్టుకుపోయారు. చెప్పుల్లేకుండానే ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. నా భార్యకి తాతగారైన ఆర్. నారాయణస్వామి అయ్యర్, జెమినీ గణేశన్‍కి మామయ్య వరుస. ఆయన సివిల్ సర్వెంట్. చాలా కాలం ఢిల్లీలో పనిచేశారు. ఆయన జెమినీ గణేశన్‍కి తొలినాళ్ళల్లో ఎంతో ప్రేరణనిచ్చారట. తరువాతి కాలంలో జెమినీ ఓ టివీ ఇంటర్య్వూలో కూడా ఈ విషయం చెప్పారు. అందుకని ఆయన రోయాపేటలోని మా అత్తగారింటికి జెమినీ తరచూ వస్తుండేవారు. అలా వచ్చినప్పుడు నేను ఒక్కసారి మాత్రమే ఆయనని కలవగలిగాను. అప్పుడాయన తన సినిమాల గురించి ఎన్నో విషయాలు చెప్పినట్టు గుర్తు. ఆ సమావేశంలో ఆయన చక్కగా నేల మీద కూర్చున్నారు. కాళ్ళు ముడుచుకుని కూర్చున్నారు. బయల్దేరే సమయం కాగానే, స్ప్రింగులా లేచి నిలబడ్డారు. జీవితకాలం పాటు యోగాభ్యాసం చేసిన ఆయన, బరువు బాగా పెరిగినా, శరీరం ఎటు వంచితే అటు వంగేది.

తన కాలపు సినీ పరిశ్రమ లోని చాలామంది కంటే, ఎన్నో విధాలుగా అసాధారణమైన వ్యక్తి జెమినీ. మొదటగా ఆయనో గ్రాడ్యుయేట్. నేటికీ ఆయన ఇంటి ముందు, జెమినీ గణేశన్, బి.ఎస్.సి అన్న రాతిఫలకం ఉంది. తన మొదటి భార్య ద్వారా నలుగురు కుమార్తెలు చక్కగా చదువుకుని బాగా వృద్ధి లోకి వచ్చేలా చూశారు. ఆయన కాలంలో నటీనటులు పెద్దగా చదువుకున్నవారు కాదు, కాలేజీ మాట అటుంచితే, స్కూలుకి కూడా సరిగ్గా వెళ్ళని వారున్నారు. ఆయన గొప్ప పాఠకుడు, చక్కని క్రీడాకారుడు, నిపుణుడైన rower కూడా. కొడైకైనాల్‍లో తన అందమైన బంగ్లాలో తన ప్రావీణ్యం ప్రదర్శించేవారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుని – తన తోటివారిలాగా సినిమాలలోనే పెట్టకుండా – రియల్ ఎస్టేట్‍లో పెట్టి చివరి వరకు ఆర్థిక భద్రతతో జీవించారాయన. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది నటీనటుల తమ సంబంధాలను గుట్టుగా ఉంచితే, జెమినీ మాత్రం సంకోచం లేకుండా బహిర్గతం చేశారు.

నా లైబ్రరీలో – నేను మళ్ళీ మళ్ళీ చదివే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ‘Vazhkaipadagu – Gemini Ganesan in Vazhkai Varalaru ‘. ఇది జెమినీ గణేశన్ ఆత్మకథ. జయశ్రీ విశ్వనాథ్ గారికి ఆయన స్వయంగా చెప్పగా రాసిన పుస్తకం. ఈ పుస్తకం ఒక ప్రతిలో సంతకం చేసి మా మామగారు ఎన్. కృష్ణన్‍కి పంపారు జెమినీ గణేశన్. ఇదొక భిన్నమైన జీవితచరిత్ర. తన జీవితం గురించి – విజయాల గురించి, కష్టాల గురించి, స్త్రీల పట్ల ఉన్న బలహీనతల గురించి ఆయన ఏదీ దాచుకోకుండా చాలా విషయాలు చెప్పారు. ఈ పుస్తకానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే – ఆయన మొదటి భార్య అలమేలు, కుమార్తెలందరూ (పుష్పవల్లి కుమార్తె రేఖ, సావిత్రి కుమార్తెతో సహా) నిజాయితీతో కూడిన వ్యాసాలు అందించారు. జీవితకథలో ఇటువంటివి పొందుపరిచి ముద్రించడానికి ఎంతో విశాల హృదయం ఉండాలి.

ఒక నటుడిగా జెమినీ – ఎంజిఆర్, శివాజీ గణేషన్ స్థాయిలో లేకపోవచ్చు, కానీ ఆనాటి త్రిమూర్తులలో ఒకరిగా ఆయన తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. తాను ప్రధాన పాత్రలే పోషించాలన్న అహం ఏదీ లేదు ఆయనకి. ఎన్నో సినిమాల్లో సెకండ రోల్ వేసిన దృష్టాంతాలు ఉన్నాయి. వీర పాండియ కట్టబొమ్మన్, కావ్య తలైవి వంటివి ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన చివరి సినిమాల్లో ఒకటైన ‘అవ్వై షణ్ముగి’ షూటింగ్ సందర్భంగా ఆయనపై ఎన్నో జోకులు వేసేవారట. అయినా ఆయన వాటిని హుందాగా తీసుకుని నటించారు.

“మీరు పైజామాలలో బావున్నారు” అని కమల్ హాసన్ అంటే, “ఒకప్పుడు నేను పైజామాలు ఎక్కువగా వేసుకునేవాడిని” అన్నారట జెమినీ. చాలా సినిమాలలో ఆయన లూజ్ పైజామాలు ధరించి కనబడేవారు. తన మీద ఎన్ని జోకులు వేసుకున్నా, ఆయన పట్టించుకునేవారు కాదు, వాటిని ఆస్వాదించారు కూడా. మారుతున్న కాలానికి తగ్గట్టు మారటం, విషయాలను మరీ గంభీరంగా తీసుకోకుండా సరదా ఉండడం – బహుశా – యోగా – వల్లే ఆయనకు అలవడిందేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here