[Hansda Sowendra Shekhar వ్రాసిన ‘Sons’ అనే కథను అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఉపోద్ఘాతం: ఈ కథ మొదట “Northeast Review” అన్న పత్రికలో వచ్చింది. తరువాత 2015లో “Adivasi will not Dance” కథాసంపుటిలో తిరిగి ప్రచురితమైంది. తెలుగు అనువాదానికి అనుమతినిచ్చిన రచయిత Hansda Sowendra Shekhar కు, ప్రచురణకర్తలు Speaking Tiger Books వారికి ధన్యవాదాలు. కథలో ఉన్న కొన్ని సంతాలీ భాష పదాలు అలాగే ఉంచి బ్రాకెట్లలో వివరణ ఇచ్చాను – అనువాదకుడు.
~
కొడుకులు
[dropcap]ఒ[/dropcap]క కొంగపిల్ల మా పెరడులో సిమెంటు చేసిన గచ్చు మీద పడింది, మెలికలు తిరిగింది, బాధతో కొన్ని సెకండ్ల పాటు అటూ ఇటూ దొర్లింది. చచ్చిపోయింది.
ఝీ (మేనత్త) కోపంతో గట్టిగా అరిచింది, “బాహూ (మరదలా)! ఎక్కడున్నావు? చూడు నీకెంతో ఇష్టమైన నీ మామిడి చెట్టు మరో ప్రాణిని బలి తీసుకుంది. దానికి రోజూ ఒక బలి కావాలి”.
ఝీ ఆ విసురు విసిరింది ‘యో’ (అమ్మ) పైకి. ఆ మామిడి చెట్టును ‘యో’ 19 ఏళ్ళ క్రితం నాటింది, ఆ చెట్టు మామిడిపళ్ళు తిన్నప్పుడల్లా, తన మనవలు తనని తలచుకుంటారన్న ఆశతో. ఆమె అలా ఆశపడడంలో తప్పులేదు. ఈ మామిడి చెట్టు విత్తనాన్ని (టెంకని) కిశోరీపూర్ (ఘార్ఖండ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని ఒక గ్రామం) లోని ఉత్తమమైన మామిడిచెట్టు నుంచి తెచ్చారు. కానీ ఏవో జన్యుపరమైన లోపాల వల్లో, వాతావరణంలోని మార్పు వల్లో, లేదా తోటపనికి సంబంధించిన కారణాల వల్లో ఈ మామిడి చెట్లు పండ్లు తియ్యగా ఉండడం లేదు. అయినా ఈ చెట్టు మా పెరడులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించింది, చలికాలంలో ఒక్క సూర్యకిరణాన్ని కూడా మా పెరడుపై పడనివ్వదు. ఈ చెట్టు కాకులకి, మైనాలకి, కొంగలకి, ఊసరవెల్లులకి, చీమలకి ఆవాసమైంది, అందువల్ల మేము దాన్ని కొట్టేయించలేకపోతున్నాం.
మా ఇంటికి కాస్త ముందుగా, రోడ్డు పక్కగా, మా పెరడంత సురక్షితం కాని స్థలంలో మరో మామిడి చెట్టు ఉంది. అది సుమారుగా మా వరండాలో ఉన్న మామిడి చెట్టంతే ఉంటుంది. దీన్ని నాటింది కూడా ‘యో’ నే, కానీ దాని తల్లి చెట్టు మామూలు చెట్టు కావడంతో ఎటువంటి ప్రత్యేకమైన శ్రద్ధా తీసుకోలేదు. అయినా, ఈ రోడ్డు మీది మామిడి చెట్టు పట్టణంలోకెల్లా తియ్యని మామిడిపండ్లని అందిస్తుంది. ప్రతి వేసవిలోనూ, మా రోడ్డు మీద మామిడిచెట్టుకు కాసే పండ్లను దొంగిలించడానికి వచ్చే అల్లరి పిల్లల్ని తరమడం మాకెంతో కష్టంగా ఉండేది. టెంకల కోసం ఎందరో అడిగినా, వాళ్ళని మర్యాదగా తిప్పి పంపేశాం, ఏవో పిచ్చి సాకులు చెప్పేవాళ్ళం, చనిపోయిన మా పూర్వీకులకి సంబంధించిన కారణాలు చెప్పేవాళ్ళం.
***
కొంగపిల్ల చచ్చిపోయిన రోజు సాయంత్రం మా ఇంటికి కల్పన-దీ (కల్పనక్క) – మా నాన్న మేనకోడలు (తనని అక్కా అనే అంటాం) వచ్చింది. అప్పటికి కొంగపిల్ల చనిపోయిన సంగతి అందరం మర్చిపోయారు, యో, ఝీ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. దూరం నుంచి చూస్తే కల్పనక్కది ఏ స్త్రీ అయినా అసూయపడే జీవితం – ఆమెకి మంచి భర్త ఉన్నాడు; చక్కని కుటుంబం, బోలెడంత డబ్బు ఉన్నాయి. అయినా, ఆమెకి సంతోషం కరువైంది, తరచూ మా ఇంటికి వచ్చి తన సమస్యల గురించి చెప్పుకుంటుంది.
తన 19 ఏళ్ళ కొడుకు, సూరజ్, పారిపోయాడని చెప్పడానికి వచ్చింది కల్పనక్క. ఆమె ఆ విషయం చెప్పనక్కర్లేదు. మా అందరికీ తెలుసు. నిజానికి మొత్తం ఊరంతా తెలుసు. సూరజ్, వాడి మిత్రులు కలిసి దొంగతనం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ ప్రయత్నానికి ఒక రోజు ముందు, వాళ్ళ నాన్నని కొంత డబ్బు అడిగాడట, కానీ ఆయన ఇవ్వలేదట, కల్పనక్క చెప్పింది. అందుకని దొంగతనం.
కల్పనక్క ఇలా రావడం, ముఖ్యంగా కొడుకు పారిపోయాడన్న వార్తతో రావడం మాకు వింతగా అనిపించింది. మాకు కల్పనక్క గురించి, ఆమె భర్త గురించి బాగా తెలుసు – వాళ్ళకి సాంఘిక మర్యాదలు అంతగా తెలియవు. ఇటువంటి వార్తతో ఆమె వెళ్ళగలిగేది కొద్ది మంది దగ్గరకే. అయితే ఒక విషయం మాకు కాస్త సంతోషం కలిగించింది. అదేంటంటే, కొడుకు ఇంట్లోంచి పారిపోయాడని, ఆ పెద్దింట్లో ఒక్కర్తీ ఓ మూల కూర్చుని ఏడవకుండా, చక్కగా ముస్తాబై, కారులో వచ్చి మాకీ వార్త చెప్పింది. అయితే ఆమె కొడుకు పారిపోయాడన్న వార్త మాలో జాలి కలిగించలేదు. పైగా, ఆ కుటుంబం పట్ల మాకు కాస్తో కూస్తో ఉన్న సానుభూతి కూడా పోతోంది.
“వాడు నీ కొడుకు కల్పనా!” అని యో, ఝీ – ఇద్దరూ చెప్పాలనుకున్నారు. “వాడు ఎలాంటివాడో తెలియదంటున్నావా? మీ వాడేం చేస్తున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో మీ అయన గ్రహించలేదా? లేదా మా దగ్గర ఏదైనా దాస్తున్నావా? నువ్వు వచ్చి విచారంగా, దిగులుగా ఉన్నట్టు నటించడానికి బహుశా, మొత్తం ప్రపంచంలో, మా ఇల్లే సరైనా చోటు అని అనుకున్నావు కదూ?”
కల్పనక్కని ఇలా మాటలతో కడిగేయాలని లోపల్లోపల యో కి, ఝీ కి గట్టి కోరిక ఉందని నాకు అర్థమవుతోంది. పదునైన మాటలతో ఆమెని చీల్చి చెండాడాలనీ, ఆమె ఓ బాధ్యతారహితమైన భార్య అనీ, పనికిరాని తల్లి అనీ ఆమెకి చెప్పాలని వాళ్ళిద్దరూ తహతహలాడుతున్నారని నాకనిపించింది. కానీ ఇద్దరూ సంయమనం పాటించారు, ఆమెకి ఊరట కలిగేలా మాట్లాడారు. అయితే ఆమె వెళ్ళిపోయాకా, కల్పనక్క కథలో ఎంత నిజాయితీ ఉందో ఒకరికొకరు చెప్పుకుంటారు.
***
కల్పనక్క వాళ్ళ ఆయన ఓ బ్యాంకు మేనేజర్. ఈ మధ్య ఆయన అవినీతి, అక్రమార్జన కేసులో చిక్కుకున్నాడు. ఈ కుంభకోణం చాలా ఏళ్ళ నుండి నడుస్తోందట, కల్పనక్క వాళ్ళాయన, జోనల్ ఆఫీసులోని ఇద్దరు కొలీగ్స్, ఇంకా మరో ఇద్దరు ఉద్యోగులు కలిసి ఈ కుట్ర చేశారట. ఇవేవీ కల్పనక్కకి తెలియవనుకోనక్కరలేదు, ఆమె విలాసవంతంగా జీవించేది. వాళ్ళుండే ఓ పెద్ద రెండంతస్తుల భవనం గురించి ఘాట్‍శిలా (ఝార్ఖండ్‍లోని ఓ ఊరు) లో అందరూ మాట్లాడుకుంటారు. కళ్ళు చెదిరే తెలుపు రంగులో ఉండే ఆ ఇంటికి – చుట్టూ పెద్ద పెద్ద గోడలు, వాటిపైన ఇనుప శలాకలు రక్షణగా ఉంటాయి. కిటికీలు ఉన్నా అవి ఎప్పుడూ తెరుచుకోవు, వాటికి నల్ల అద్దాలు తలుపులు బిగించి ఉంటాయి. దాదాపుగా ప్రతి గదికి ఎసిలు ఉన్నాయి.
కల్పనక్క మా ఇంటికి డ్రైవరు ఉన్న కారులో వస్తుంది. చక్కటి పట్టు లేదా కాటన్ చీరలు ధరించి వస్తుంది, ప్రతీ నెలా కొత్త రకం సెంటు పూసుకుని వస్తుంది. ఆమె భుజానికి ఉండే లెదర్ హ్యాండ్ బ్యాగ్‍లో వంద రూపాయల నోట్లూ, ఐదు వందల రూపాయల నోట్లూ చాలా ఉంటాయి. గ్రామంలో ఉంటున్న కల్పనక్క వాళ్ళ ముసలి అమ్మకి తన అల్లుడు చేసే పనులు తెలుసో లేదో మాకు తెలియదు. అది చాలా సున్నితమైన విషయం. ఈ విషయంలో తన బంధులమ్మాయితో మా సంబంధాలు చెడిపోకూడని నాన్న కోరుకున్నారు. అయితే, కల్పనక్క వాళ్ళ ఆయనతో ఏకాంతంలో మాట్లాడాలని ప్రయత్నించారు.
“జవాయ్ (అల్లుడూ), నీ భార్య గురించి ఆలోచించు. తను నా బిడ్డ లాంటిది. మీరు మా కుటుంబంలో భాగం.”
“నా భార్యకి కావల్సినవన్నీ నేను అందిస్తున్నాను. ఆ విషయంలో ఎవరూ ఆమె గురించి దిగులు పడక్కరలేదు.”
“మీకు పిల్లలున్నారు..”
“ఇదంతా వాళ్ళ కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే.”
“మీరే వాళ్ళ భవిష్యత్తు.. మీకేదైనా జరిగితే..”
“నాకేమవుతుంది? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.”
సంభాషణ ప్రారంభించినప్పుడు నాన్న ఎంతో ఓపిగ్గా ఉన్నారు. కానీ, ఆయనకి అల్లుడి వైపు నుంచి మొండి పట్టు, అమర్యాద ఎదురువడంతో, డొంక తిరుగుడు లేకుండా నేరుగా విషయంలోకి వచ్చారు.
“చూడు అల్లుడూ, మర్చిపోవద్దు. మన ఆదివాసీలలకు దొంగతనం చేతకాదు. అవినీతి మన రక్తంలో లేదు. ఒక వేళ మనం నేరం చేసినా, దాన్ని గుట్టుగా ఉంచలేం. మధు కోడా విషయంలో ఏమైందో తెలుసుగా? దికుస్ (బయటివాళ్ళు) అతన్ని వాడుకున్నారు, చివరికి ఒంటరిగా జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అది మనందరికి ఒక గుణపాఠం కావాలి”
నాన్న వాదన, ముఖ్యంగా, మైనింగ్ స్కామ్‍లో ఓ ముఖ్యమంత్రినే జైలుకు పంపడం ఉదాహరణగా చెప్పడం కల్పనక్క వాళ్ళ ఆయనలో కాస్త బెరుకు కలిగించింది. కాస్త అసౌకర్యంగా కనిపించాడు. నాన్న కొనసాగించారు.
“సరే, నువ్వు దొంగతనం చేసినా, తెలివైనవాడివి, ఉన్నత హోదాలో ఉన్నవాడివి కాబట్టి, నువ్వేం చేస్తున్నావో నీకు బాగా తెలుసు. నీ నేరం మరీ స్పష్టంగా తెలిసిపోయేట్టుగా లేకుండా చూసుకో. నీవు బాగా సంపాదించావు, పెద్ద ఇల్లు కట్టుకున్నావు. కానీ మీ ఇల్లు జనాల్లో ఎంతో కుతూహలం కలిగించిందో నీకు తెలుసా? నీ సంపద పట్ల నాకేం అసూయ లేదు. కానీ ఈ ప్రదర్శన ఎందుకు? నీతో పనిచేస్తున్న వారెవరూ ఇంటి చుట్టూ అంత పెద్ద పెద్ద గోడలు కట్టుకోలేదు. ఇప్పటికీ చిన్న చిన్న ఇళ్ళల్లోనే ఉంటున్నారు, స్ప్లెండర్ బైకుల మీదే తిరుగుతున్నారు. మరి నువ్వు మాత్రం ఎందుకిలా డాబు చూపిస్తున్నావ్? ఎందుకు అల్లుడూ?”
ఈ మాటలకి నొచ్చుకున్న అల్లుడు మా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కల్పనక్కని మా ఇంటికి వెళ్ళకూడదంటూ ఆదేశించాడు.
పిల్లలు సూరజ్, వాడి చెల్లి సరోజిని మీద మాకు జాలేసింది. వాళ్ళమ్మ ఓ రాణిలా జీవిస్తుంటే, వాళ్ళు యువరాజు, యువరాణుల్లా ఉంటారు. సరోజినికి 14 ఏళ్ళు. ఓ కప్పు టీ పెట్డడం కానీ, ఒక చపాతీ సరిగ్గా చేయడం కాని రాదు. హైస్కూలుకి వచ్చేసరికే సూరజ్ సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాడు. ఓ తరగతిలో వార్షిక పరీక్షలో తప్పి, మళ్ళీ అదే తరగతిలో కూర్చున్నాడు. 10వ తరగతి బోర్డ్ పరీక్షలు కూడా రెండు సార్లు రాశాడు. మొదటి సారి తను చదువుతున్న ఇంగ్లీషు మీడియం స్కూలు విద్యార్థిగా, రెండోసారి ప్రైవేటు అభ్యర్థిగా. స్నేహితులతో కలిసి, సువర్ణరేఖ నది వంతెన మీద సిగరెట్లు తాగుతుండగా, ఒకసారి నేను వాడిని పట్టుకున్నాను. వాడు తన స్నేహితులకి నన్ను ‘ప్రియమైన మామయ్య’గా పరిచయం చేశాడు. అప్పుడు వాడు తాగి ఉన్నాడు, మాటలు ముద్దగా వస్తున్నాయి. ఆ తర్వాతే మాకు తెలిసింది – వాడు చేసిన నేరంలో వీళ్లంతా భాగస్వాములని.
అయితే, కొడుక్కి డబ్బు ఇవ్వడానికి కమలక్క వాళ్ళాయన నిరాకరించాడన్న విషయం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే వాడేం అడిగినా ఆయన కాదనేవాడు కాదు, జీవితంలో ఎప్పుడూ వాడిని మందలించినది లేదు. ఆయన చేసే అవినీతి పనులన్నీ పిల్లల మీద ప్రేమ వల్లేనా, వాళ్ళకి ఓ గొప్ప హోదా కల్పించాలన్న కోరిక వల్లేనా అని అప్పుడప్పుడూ మేము అనుకుంటాం. వీటన్నింటి గురించి మేం ఎంతగా ఊహించినా – కల్పనక్క, వాళ్ళాయన పరిస్థితి చివరికి ఏమవుతుంది – అనే ఒక్క విషయంలో మాత్రం – మేం ఏదీ ఊహించలేకపోయాం.
సూరజ్ విషయంలో కల్పనక్క వాళ్ళాయన ఒక నిర్ణయం తీసుకునే సమయానికి ఆయన బ్యాంకులో చేసిన మోసం బయటపడింది. ఇన్వెస్టిగేషన్ జరిగింది, పాత లెడ్జర్లు బయటకి తీశారు, అరెస్టులు మొదలయ్యాయి. కల్పనక్క వాళ్ళాయనే ముఖ్య అనుమానితుడు, ఇదంతా ఆయన ఆడంబరం వల్లే – పైగా జరుగుతున్న సంఘటనల బట్టి చూస్తే, ఆయనకి మద్దతుగా మాట్లాడేవారెవరూ లేరని స్పష్టంగా తెలుస్తోంది. సెర్చ్ టీమ్ బ్యాంకుకి వచ్చింది, ఆయన ‘భవంతి’పై రెయిడ్ చెయ్యడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఏదైనా జరగవచ్చు. జైలు, ఆస్తుల జప్తు, ఏదైనా. అప్పుడాయన ఎక్కడికి వెళ్తాడు? కల్పనక్క పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలో?
కొన్నాళ్ళ నుండి కల్పనక్క మా ఇంటికి రావడం మానేసింది. అయితే, ఇన్వెస్టిగేషన్ మొదలై, కల్పనక్క వాళ్ళాయన బయటకు రాకుండా, జనాలకి దూరంగా ఉంటుండడంతో, అక్క మా ఇంటికి మళ్ళీ రావడం మొదలుపెట్టింది. ఏదో అనారోగ్యంతో ఉన్నట్టు అనిపించింది. అయినా ఆమె అంతా బావున్నట్టు కనిపించడానికి, గొప్పగా బతుకుతున్నట్లు కనిపించడానికి చేసే ప్రయత్నం – మాకు తెలిసిపోతోంది.
ఒంట్లో బాలేదా అని అడిగితే, “తలనొప్పి, నీరసం” అంది.
“తలనొప్పా? ఎందుకు?” అడిగాం.
“హై బిపి వల్ల అని రఘు చెప్తున్నాడు”
“ఓ, రఘు ఎలా ఉన్నాడు?”
“బావున్నాడు. నేను బతికి ఉన్నానంటే కారణం వాడే. నాకు హై బిపి ఉందని గ్రహించినది వాడే. వాడే నన్ను కాలేజ్ రోడ్‍లో ఉన్న తుడు-డాక్టర్ గారి క్లినిక్‍కి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. రఘు చాలా మంచి పిల్లాడు” అంది.
***
రఘు వాళ్ళమ్మ – విద్యా దీ (విద్యక్క) – కూడా కల్పనక్క లానే మాకు బంధువు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరి చుట్టాలు. వాళ్ళ తాతలు స్వయానా అన్నదమ్ములు. కల్పనక్క వాళ్ళ తాతయ్య పెద్ద. వయసులో పెద్దవడం వల్ల వచ్చే ప్రయోజనాలని పొందారు కల్పనక్క వాళ్ళ తాతయ్య. కుటుంబం పొలంలోనూ, కుటుంబం ఇంటిలోనూ పెద్ద వాటా దక్కిందాయనకి. విద్యక్క వాళ్ళ తాతగారికి పొలంలోనూ, ఇంటిలోనూ చిన్న వాటానే దక్కింది. కానీ పరిస్థితులను గ్రహించిన మనిషి కావడం వల్ల విద్యక్క వాళ్ళ తాతయ్య ఆ ఇంటిలో తన వాటాగా వచ్చిన గదులను అన్నయ్యకే వదిలేసి, ఆ పెద్దింటి వెనుకే తనకి, తన భార్యాపిల్లల కోసం ఓ చిన్న ఇంటిని కట్టుకున్నారు. చదువు, పట్నవాసం – పెద్దాయన పిల్లలకి కలిసొచ్చాయి. కల్పనక్క వాళ్ళ నాన్న, బాబాయిలు కాలేజీ చదువులు పూర్తి చేసి, వేర్వేరు పట్టణాల్లో వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. విద్యక్క వాళ్ళ నాన్న, బాబాయిలు చదువుకున్నా, గ్రామంలోనే ఉండిపోయారు. అయితే ఎవరూ ఏ రకమైన ఫిర్యాదులూ చేయలేదు. కజిన్ల మధ్య గొప్ప అవగాహన ఉండేది. విద్యక్క వాళ్ళ కుటుంబమే, కల్పనక్క వాళ్ళ కుటుంబం విషయాలు చూసేది. రిటైరయ్యాకా, కల్పనక్క వాళ్ళ నాన్న గ్రామానికి వచ్చేశారు. అప్పటికి కల్పనక్కకి పెళ్ళయింది, సూరజ్ పుట్టాడు. తన కూతురు జీవితంలో సంభవించబోయే కష్టాలను చూసి బాధపడాల్సిన అవసరం లేకుండానే ఆ ముసలాయన, సొంతూరులో ప్రశాంతంగా కన్నుమూశారు.
కల్పనక్క, విద్యక్కల అదృష్టాలలోని తేడాని పట్టించుకోకుండా ఉండలేం. కల్పనక్క వాళ్ళ ఆయన బ్యాంకులో పనిచేస్తే, విద్యక్క వాళ్ళ ఆయన టీచరు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రమైన వృత్తే అయినా – బ్యాంక్ ఆఫీసర్‍తో పోలిస్తే హోదాలో దిగువన ఉన్నట్టే. అక్కలిద్దరికీ ఇలాంటి వేర్వేరు హోదాల సంబంధాలు వచ్చినప్పుడు కొందరి నోళ్లు కదిలాయి, కానీ ఆ వాగుడంతా సమయానికి ఆగిపోయింది. అంటే, కొడుకులు పుట్టిన సమయానికి అన్నమాట.
యాదృచ్ఛికం అనండి, దైవ ఘటన అనండి, కల్పనక్క, విద్యక్క, తొలి సంతానంగా ఒకే రోజు, దాదాపు ఒకే సమయంలో కొడుకులని కన్నారు. కల్పనక్క ఘాట్‍శిలా లోని ఓ నర్సింగ్ హోమ్‍లో సూరజ్‌కి జన్మనిచ్చింది, ఆ కాలంలో ఆ నర్సింగ్ హోమ్‍లో ప్రసవం చేయించుకోవాలంటే ధనవంతులకే సాధ్యం. సూరజ్ పుట్టిన నాలుగు లేదా ఆరు నిమిషాల తరువాత, విద్యక్కకి రఘు పుట్టాడు. తమ గ్రామంలో విద్యక్క వాళ్ళ నాన్న కట్టుకున్న చిన్న ఇంట్లో ఓ గదిలో ధాయ్-బుధి (మంత్రసాని) సాయం చేయగా విద్యక్క ప్రసవం జరిగింది.
మళ్ళీ నోర్లు ఆడడం మొదలైంది. కల్పనక్క, విద్యక్క భర్తల మధ్య తేడాల విషయంలో లేచిన నోళ్ళు – వాళ్ళ కొడుకుల విషయంలోనూ తిరిగి తెరుచుకున్నాయి. ఒకే రోజు? ఒకే సమయం? ఎలా? దీంట్లో ఏదో మర్మం ఉంది.
వాళ్ళు పెరుగుతున్న కొద్దీ, సూరజ్, రఘు పెంపకంలోని తేడా స్పష్టంగా తెలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, ఆ పెంపకం మా ఇంట్లోని రెండు మామిడి చెట్ల ఎదుగుదలని పోలి ఉంది.
ప్రతి ఒక్కరూ సూరజ్ గురించి గొప్పగా అనుకున్నారు. డబ్బున్న తండ్రి, గొప్ప పెంపకం. డబ్బైనా, సైకిల్ అయినా, మోటర్ సైకిల్ అయినా, కారైనా – అవసరం ఉందా లేదా అని నిర్ధారించుకోకుండానే – కోరినదల్లా వాడికి లభించింది. మరోవైపు రఘుకి, ఏది ఎంత అవసరమో, అంతే లభించింది.
మామూలుగా అయితే అందరూ సూరజ్ జీవితంలో పైకొస్తాడని ఆశించారు. వాడు అదృష్టవంతుడు, మంచి ఇల్లుంది, డబ్బుంది, సైగ చేస్తే చాలు ఏదైనా చేతికందుతుంది. మంచి స్కూల్లో చదివించారు, చేతికి గొప్ప వాచీలు, ఖరీదైన పెన్నులు! రఘు మామూలు బట్టలు వేసుకునేవాడు. వాడు రోజూవారీ వేసుకునే దుస్తులు – సూరజ్ విసిరిపారేసే వాటికి సమానం. అంతేకాదు, సూరజ్ పాత స్కూలు డైరీలను నోట్ బుక్స్ లాగా, సూరజ్ వాడని డ్రాయింగ్ బుక్స్‌ని రఘు వాడుకున్నాడు. సూరజ్ వాడి వదిలేసిన పెన్నులు, పెన్సిళ్ళు, జ్యామెట్రీ బాక్సులు అన్నీ రఘు బల్లలోకి వచ్చాయి. రఘు మొదటి వాచీ – సూరజ్ రెండేళ్ళు వాడి వదిలేసిన కేసియో డిజిటల్. ఇలా సూరజ్ ఉదారత్వపు నీడలో పెరిగాడు రఘు.
కాలం గడిచింది. ఓ మామూలు స్కూలు టీచర్‌కీ, ఓ సంతాల్ గ్రామంలో గృహిణికి పుట్టిన కొడుకు, రఘు, ఇతరులు చేసిన సాయాలతో పెరిగాడు, తనకున్న వనరులతోనే అన్నీ పరీక్షలు సకాలంలో పాసయ్యాడు, ఎంట్రన్స్ టెస్ట్ పాసయ్యి, ఝార్ఖండ్‍లో కెల్లా పెద్దదయిన రాంచీ మెడికల్ కాలేజీలో సీట్ సాధించాడు. ఆరేళ్ళ చదువు పూర్తయితే, వాడి పేరు ముందు డాక్టర్ అనే పదం చేరుతుంది.
మరో వైపు సూరజ్, తాగుబోతు అయ్యాడు, వ్యసనాలకు బానిస అయ్యాడు. చేతికి డబ్బు అందకపోయేసరికి దొంగతనానికి ప్రయత్నించాడు. చివరికి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. నిజానికి తండ్రీ కొడుకులిద్దరికీ ఒకటే గతి ఎదురయింది.
***
ఝీ, యో – కల్పనక్క, విద్యక్క గురించి మాట్లాడుకుంటున్నారు.
“అసలు విద్యా వాళ్ళ కుటుంబం – తమ ఇంటి పిల్లాడు డాక్టరవుతాడని ఊహించారంటావా?” ఝీ అడిగింది ‘యో’ ని.
“ఊహూ! ఏ మాత్రం ఊహించి ఉండరు! వాళ్ళెంతో నిరాడంబరమైన మనుషులు! నాకు బాగా గుర్తు – తమకి ఉద్యోగం చేసే అల్లుడు దొరికాడని విద్యా వాళ్ళమ్మ అప్పట్లో ఎంత పొంగిపోయిందో. కల్పన మొగుడు బ్యాంకులో ఉద్యోగం చేసేవాడన్న సంగతి వాళ్ళ దృష్టిలో ఉందో లేదో” అంది యో.
“పాపం కల్పన! ఆమె పరిస్థితి ఏమవుతుందో?”
“నిజంగా, ఆమె తప్పేం లేదు. అయినా కల్పన మొగుడు అంత మూర్ఖంగా ఎలా ఉన్నాడో?”
“ఓ, మరి సూరజ్ సంగతేంటి? వాడి వార్తలేమైనా తెలిసాయా?”
“చాందో-బొంగా (ఆదివాసీ దైవం) కే తెలియాలి. కానీ వాడ్ని పట్టుకుంటారు.”
“కల్పన నిద్రని పోగొట్టుకుంది, ఆకలిని పోగొట్టుకుంది – అన్నీ పోగొట్టుకుంది. ఈమధ్య ఎలా ఉంటోందో గమనించావా?”
“అవును. తనకి హై బిపి ఉందని రఘు చెప్పాడుగా”
“రఘు డాక్టరవడం చాలా బావుంది. తనని చూడడానికి కనీసం ఒకరున్నారు. సూరజ్ చేయలేని పనిని రఘు చేస్తున్నాడు.”
“ఏది ఎలా జరుగుతుందో, ఎవరు ఏం అవుతారో, ఎవరు చెప్పగలరు?”
“అచ్చం పెరట్లోని నీ మామిడి చెట్టు లానే..”
“ఇప్పుడు నన్ను నిందించద్దు. దాని గురించి నాకెలా తెలుస్తుంది?”
“నువ్వే అన్నావు గుర్తుందా. ‘నేను పోయాకా, నా మనవలు దీని తియ్యని పళ్లు తిని నన్ను తలచుకుంటారు’ అని. ఇప్పుడు వాళ్ళు నిన్ను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. చెదిరిన గూళ్ళు, పగిలిన గుడ్లు, చచ్చిన కొంగపిల్లలు..”
“కానీ ఇంటి బయట, వీధిలో ఉన్న మామిడి చెట్టు విషయంలో నన్ను గుర్తుంచుకుంటారు.”
“అవును మరి! దాన్ని నువ్వే పెంచావు. దానికి ఎవరి సంరక్షణా అవసరం లేకపోయింది, దానంతట అదే పెరిగింది. నీకు మాత్రం ఎప్పుడూ పెరట్లోని ఆ పెద్ద మామిడి చెట్టు మీదే ధ్యాస.”
ఇలా వాళ్ళ వాదులాట కొనసాగుతూనే ఉంది.
ఆంగ్ల మూలం: హన్స్దా సొవేంద్ర శేఖర్
అనువాదం: కొల్లూరి సోమ శంకర్