చిరుజల్లు-72

0
3

సోపానాలు

[dropcap]రా[/dropcap]త్రి పది గంటలు అయింది.

రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. వైదేహి, శ్రీకాంత్ పక్క పక్కనే నడుస్తున్నారు. కానీ చాలా దూరంగా ఉన్నట్లు ఫీలవుతున్నారు. అతనికి ఆమెను ఏదో అడగాలని ఉంది. ఆమెకూ అతన్ని ఎన్నో ప్రశ్నలు వేయాలని ఉంది. కానీ ఎలాంటి సమాధానం వినాల్సి వస్తుందోనని భయంగానూ ఉంది.

బస్ స్టాప్ దగ్గర ఆటో కనిపించింది. ఇల్లు ఇంకా రెండు మైళ్లు.

“ఆటోలో వెళ్దామా?” అన్నాడు శ్రీకాంత్.

“ఎందుకూ. చల్లగాలి హాయిగా ఉంది. నడిచే వెళ్దాం. ఈ రాత్రి వేళ, ఇలా తీరికగా, చీకట్లో పక్క పక్కన నడుచుకుంటూ వెళ్లే అవకాశం రమ్మనా రాదు..” అన్నది వైదేహి.

ఆటోలో వెళ్లేందుకు డబ్బుల్లేవన్న విషయం ఇద్దరికీ తెల్సు. అసలు విషయాన్ని దాచేసి, గుంభనంగా మాట్లాడుకోవటం వాళ్లకు ఇటీవల బాగా అలవాటైన విద్య.

“ఫంక్షన్లో నువ్వు ఏమన్నా తిన్నావా?” అని శ్రీకాంత్ అడిగాడు.

“ఊఊ, మీరు?” అని అడిగింది వైదేహి.

అక్కడ ఒకరికి తెలియకుండా మరొకరు ఇంటి వాళ్ల చేత తిట్లు తిన్నారు. భరింపరాని అవమానానికి గురైనారు. ఆ విషయం రెండో వాళ్లకు తెలియకూడదని ఎవరి మటుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు.

హోటలు ముందు నుంచి వెళ్తున్నారు.

 “ఏమన్నా తింటావా?” అని అడిగాడు.

“నాకేం వద్దు. మీరేమన్నా తినాలంటే తినండి” అన్నది వైదేహి.

సమాధానం ఏం వస్తుందో ప్రశ్న అడగక ముందే తెల్సినా, కేవలం ప్రేమ వ్యక్తం చేయటానికే అలా అడగటమూ, ఇలా సమాధానం పొందటమూను.

మెయిన్ రోడ్డు నుంచి మలుపు తిరిగారు. ఈ రోడ్డు మరీ నిర్మానుష్యంగా ఉంది. వీధి దీపాల వెలుతురులో వాళ్లిద్దరూ కదులుతున్న నీడల్లా ఉన్నారు.

“అసలీ ఫంక్షన్‌కి వెళ్లకుండా ఉంటే బావుండేది. సాయంత్రం నుంచీ తలనొప్పిగా ఉంది” అన్నది వేదేహి.

“పిల్చిన ప్రతి చోటుకీ పరుగెత్తుకుంటూ వెళ్లకూడదు. నాకో జోక్ గుర్తొస్తోంది. ఒకాయన మరొకాయనతో అన్నాడట. ‘సారీ అండీ, నిన్న మీ ఇంట్లో పెళ్లికి రాలేకపోయాము’ అని అందుకు రెండో ఆయన అన్నాడుట ‘అవునా? మీరు రాలేదా?’ అని..” అన్నాడు శ్రీకాంత్ బలవంతంగా నవ్వుతూ.

“మీరేంటి? హాల్లో ఎక్కడా కనబడలేదు. ఒంటరిగా ఫీలయ్యారా? బయటకొచ్చి నిలబడ్డారు?..” అని అడిగింది వైదేహి.

“అదేం లేదు. చాలా సేపు లోపలే ఉన్నాను. మరీ ఉక్కపోత ఎక్కువగా ఉంటే, బయటకొచ్చాను..” అన్నాడు శ్రీకాంత్.

అసలు అక్కడ జరిగింది వేరు. వీళ్లను ‘వచ్చావా?’ అని ఆదరంగా పలకరించిన వాళ్లు ఎవరూ లేరు.

చాలా సేపు ఒంటరిగా కూర్చున్న అతని దగ్గరకు ఒక ముసలాయన వచ్చి అడిగాడు “మీరు ఎవరి తాలూకు?” అని అతనికేం చెప్పాలో తెలియ లేదు. పెళ్లికూతురు తరఫున అన్నాడు. అయినా ఆయన వదల్లేదు. గుచ్చి గుచ్చి అడిగాడు. తరువాత, ఆయన ఇంకోక ముసలాయనతో అన్నాడు.

“ఈ మధ్య పెళ్లిళ్లకు ఎవరెవరో రావటం.. తినేసి వెళ్లిపోవటం.. అడిగే వాళ్లుండరు గదా మరి..”

“ఆరు నెలల కిందట వాసవీ ఫంక్షన్ హాల్లో మా మేనకోడలు పెళ్లి చేశారు. పక్కనున్న కాలేజీ స్టూడెంట్స్ అంతా వచ్చి తినేసి వెళ్లారు. అసలు వాళ్లు పెళ్లి హడావుడిలో ఉంటారు. సందట్లో సడేమియా అంటూ ఈ బేవార్సు వాళ్లంతా వచ్చి మెక్కేసి పోతుంటారు.. చివరకు అసలు వాళ్లకు ఖాళీ గిన్నెలు మిగులుతయి..”

వాళ్ల సంభాషణ అంతా శ్రీకాంత్ వింటూనే ఉన్నాడు. అతను వినాలనే వాళ్లు అలా అన్నారు.

శ్రీకాంత్‌కు తల కొట్టేసినట్లు అయింది. నెమ్మదిగా లేచి బయటకు వచ్చి నిలబడ్డాడు. వెళ్లిపోదామని అనుకున్నా, వైదేహి లోపలే ఉంది. ఇద్దరు కల్సి వెళ్లాలి.

ఇంతలో ముకుందరావు దంపతులు కారు దిగారు. వాళ్ల కంట పడటం ఇష్టం లేని శ్రీకాంత్, ఆగి ఉన్న మరో కారు వెనక్కి వెళ్లాడు. వైదేహి వస్తే వెళ్లిపోవాలని చూస్తున్నాడు.

లోపల వైదేహికీ ఇలాంటి అనుభవమే ఎదురైంది. వైదేహికి పెళ్లికూతురు ఎక్కడో బజార్లో కనబడి, పెళ్లికి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చింది. పెళ్లికూతురు వాళ్లకు దూరపు చుట్టం. కొంత కాలంగా దూరమైన బంధువులు మళ్లీ కలుస్తారు గదా అన్న ఆశతో వైదేహి, భర్తను తీసుకొని వచ్చింది.

తీరా వచ్చాక అంతా మొహాలు తిప్పుకున్న వాళ్లే గానీ, పలకరించిన దిక్కులేదు. పిల్చిన పెళ్లి కూతురు కూడా తను దగ్గరకు వెళ్లగానే చూడనట్లే దూరంగా వెళ్లిపోయింది.

తెల్సిన వాళ్లు ఇద్దరు తమలో తాము మాట్లాడుకోవటం వినిపిస్తూనే ఉంది.

“ఆ పిల్ల ముకుందరావు కూతురు గదూ..”

“ఆ, అదే, అదే. ఎవడ్నో ఒక తలకు మాసిన వాడిని చూసుకొని లేచిపోయిందని అనుకున్నారు.. ఈ కాలం పిల్లలు ఒకర్ని మించి మరొకరు అడ్వంచర్స్ చేస్తున్నారుగా..”

పెళ్లి కూతురు తల్లి – వైదేహి వినేటట్లుగానే అన్నది “ఆ గదిలో సూట్‌కేసులు తెరిచే ఉన్నాయి. తాళాలు వేయండి.. ఎవరెవరో వస్తున్నారు.”

వైదేహి అక్కడ నుంచి హోల్లోకి వచ్చింది. శ్రీకాంత్ కోసం చూసింది. అతను కనబడలేదు.

పెళ్లికూతురు పినతల్లి వైదేహితో అన్నది “వంట మనుషులు ఇద్దరు రాలేదట. వాళ్లు తన్నుకుంటున్నారు. నువ్వు వెళ్ళి వాళ్లకు కాస్త సాయం చెయ్యి..”

చివరకు తనను వంట మనిషి స్థాయికి దించేసి నందుకు వైదేహికి దుఃఖం ఆగలేదు.

ఇంతలో పెళ్లికూతురు తండ్రి వైదేహితో అన్నాడు “పని మనిషి ఎక్కడ చచ్చిందో కనబడటం లేదు. టైం అయిపోతోంది. ఆ గదిలో ఉన్నయి పళ్లెంలో అక్షింతలు, కొబ్బరి బోండాలు, అరటి పళ్లు – అవన్నీ తీసుకెళ్లి ఆ మంటపంలో పెట్టు..”

ఇందుకా తనకు శుభలేఖ ఇచ్చి రమ్మన్నది. వీళ్లకు తను వంటమనిషిగానూ, పనిమనిషిగానూ కనిపిస్తోందా? ఇంకాసేపు ఇక్కడ ఉంటే, పనిమనిషి కనిపించలేదు, ప్లేట్లు కడగమంటారేమో?

వైదేహికి అక్కడ ఉండబుద్ది కాలేదు.

శ్రీకాంత్‍ను వెతుకుతూ గేటు దాకా వచ్చి చూస్తే అతను రోడ్డు మీద నిలబడి ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు.

“ఏంటి వచ్చేశావా?” అన్నాడు శ్రీకాంత్ దగ్గరగా వస్తూ.

“ఏంటో అనీజీగా ఉంది. వెళ్దాం పదండి” అన్నది వైదేహి.

ఇద్దరూ నడుస్తున్నారు.

“అనవసరంగా వచ్చాం” అన్నది వైదేహి.

“పోన్లే ఇదో ఎక్స్‌పీరియెన్స్” అన్నాడు శ్రీకాంత్.

ఇంటికి వచ్చారు. అతను తలుపు తీసి రెండు కుర్చీలు బయటవేశాడు. ఇద్దరూ వెన్నెల్లో కూర్చున్నారు. చల్లగాలి పరుగుపరుగున వచ్చి ప్రేమగా ఒళ్లంతా నిమిరింది. ప్రకృతి తప్ప తమను ప్రేమగా పలకరించే వాళ్లే కరువయ్యారు – అనుకుంది వైదేహి.

అక్కడంతా హోదా, స్థాయి, డబ్బు, ప్రదర్శించుకోవలని వచ్చినవాళ్లే, ఒకప్పుడు తనూ అందరికన్నా, పైమెట్టు మీదనే ఉండేది. కావాలని తనే రెండు మెట్లు దిగింది.

***

ఆమెది చీకూ చింత లేని కుటుంబం. తల్లీ, తండ్రీ, తనూ, తమ్మూడూ. ఒద్దిక అయిన కుటుంబం. ఆమె తండ్రికి పెద్ద ఉద్యోగం. బంగళా, కారూ, పని వాళ్లూ.. హంగూ, ఆర్భాటం అంతా ఉండేది. ఏది కావాలన్నా కోరుకున్న వెంటనే కాళ్ల దగ్గర వాలిపోయేది. తండ్రికి డబ్బు, పలుకుబడి ఉంటే ఇంక వాళ్ల పిల్లలు నేల మీద నడుస్తారా? కానీ ఎందుకో వైదేహి మాత్రం కొంచెం భిన్నంగా ఉండేది. ఎవరన్నా కష్టాల గురించి చెప్పుకున్నా ‘అయ్యో పాపం’ అని బాధపడిపోయేది. తన క్లాస్‌మేట్స్‌లో బీదవాళ్లకు వాళ్లు అడగకుండానే తన దగ్గరున్నవన్నీ ఇచ్చేది. చివరకు సినిమాలో కారెక్టర్స్ కష్టపడినా కన్నీళ్లు పెట్టుకునేది. అలాంటి జాలిగుండె గల ఇంటికి శ్రీకాంత్ వచ్చాడు.

నిజానికి అతను పరాయి వాడేం కాదు. వైదేహికి మేనత్త కొడుకే. కానీ రెండు కుటుంబాల మధ్యా ఆర్థిక పరిస్థితులు ఆకాశానికీ, భూమికీ ఉన్నంత వ్యత్యాసంలో ఉన్నయి.

ఒక రోజు మేనత్త శ్రీకాంతను వెంట బెట్టుకుని, అన్నగారి దగ్గరకు వచ్చింది.

“వాడికి తెలివి తేటలున్నయి. చదువు కోవాలన్న ఆరాటం ఉంది. నీ చేతి కింద ఎంతో మంది బ్రతుకుతున్నారు. వీడూ వాళ్లల్లో ఒకడు అనుకొని నాలుగు రోజులు ఆశ్రయం ఇస్తే నాలుగు ముక్కలు నేర్చుకుంటాడు. వాడి కింత జీవితాధారం చూపించినవాడివి అవుతావు. ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్లం. నిన్ను నేనేమీ మడులూ, మాన్యాలూ ఇవ్వమని అడగటం లేదు. వాడు తన కాళ్ల మీద నిలబడే దాకా, నాలుగు రోజులు కాస్తంత నీడ నిచ్చి, పట్టెడన్నం పెట్టు చాలు..” అని వేడుకుంది.

ఆమె అభ్యర్థనను ముకుందరావు కాదనలేకపోయాడు. శ్రీకాంత్ అలా కేవలం ఆయన దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు.

మేనల్లుడి పట్ల ఆయనకు పెద్దగా విముఖత లేకపోయినా, ఏమంత సుముఖతా లేదు. కానీ ఆయన భార్యకు మాత్రం ఇతను ఆ ఇంట్లో తిరుగుతుండటం మింగుడు పడటం లేదు. డబ్బు లేని వాళ్లంతా నష్ట జాతకులు, ఈ జన్మలో వాళ్లు పైకి రాలేరని ఆమెకు గట్టి నమ్మకం.

“ఎదిగిన ఆడపిల్లను ఇంట్లో పెట్టుకొని ఇలాంటి దరిద్రల్ని అందర్నీ చేరదీసి, లోపలికి రానిస్తే, రేపు ఏకుమేకు అయి కూర్చుంటారు” అని ఆమె భర్తకు హితబోధ చేసింది.

“అంతదాకా రాదులే. వాడికి అంత ధైర్యం లేదు. ఒక వేళ ఏదన్నా శృతి మించితే అప్పుడే బయటకు పంపించవచ్చు.. పాపం ఇన్నేళ్ల తరువాత అది వచ్చి నాలుగు రోజులు ఇంట్లో ఉండనివ్వమని అడిగితే, వీల్లేదని ముఖాన గుద్దినట్లు ఎలా చెబుతాం?” అన్నాడు ముకుందరావు.

అయినా ఆయన భార్య మాత్రం శ్రీకాంత్‌ను ఒక పనిమనిషిగానే చూసింది తప్ప బంధువుగా భావించలేదు. ఇంటి పనులు అన్నీ అతని చేత చేయించేది. తమతో పాటు భోజనానికి కూర్చోనిచ్చేది కాదు. ఆమె మాటలూ, చర్యలూ అతనొక నౌకరుగానే గుర్తు చేస్తుండేవి. శ్రీకాంత్ కూడా ఎప్పుడూ ఆమె గీసిన గీత దాటేవాడు కాదు.

చదువులో మాత్రం తన తెలివి తేటలు చూపించేవాడు. క్లాస్‌లో తన ఫ్రెండ్స్ కన్నా మార్కులు విషయంలో ముందంజలోనే ఉండేవాడు. ఈ విషయం తెల్సి, అందరికన్నా ఎక్కువగా వైదేహి సంతోషించింది.

అతను మెట్ల మీద కూర్చుని చదువుకుంటున్నాడు. వైదేహి రెండు మెట్లు పైన కూర్చుని అడిగింది “నువ్వు మీ క్లాస్ టాప్ అటగదా..”

శ్రీకాంత్ నవ్వాడు “చెట్లు లేని చోట ఆముదం చెట్టు మహా వృక్షమట. ఏదో ఈ పుస్తకాల్లో చదువుకున్నదే, పరీక్షల్లో రాస్తాను. అది ఏమంత గొప్ప ఘనకార్యం గనుక?” అన్నాడు.

“వినయం మంచిదే గానీ, అతి వినయం అంత మంచిది కాదు. మీ కాలేజీలో అందరూ నీ పేరే జపిస్తున్నారట..”

“నేను ఎవరితోనూ ఏరకమైన గొడవలు పెట్టుకోను. గొడవలు పెట్టుకొని నెగ్గుకు రాగల స్తోమత నాకు లేదు గదా?”

“ఈ ఇంట్లో కూడా నిన్ను లైక్ చేసే వాళ్లున్నారని నీకు తెల్సా?”

“ఎవరూ?”

“నేనే” అన్నది వైదేహి.

“థాంక్స్”

“లైక్ చేయటానికి, లవ్ చేయటానికి మధ్య తేడా ఏమన్నా ఉన్నాదా?”

“తెలీదు.”

“తెల్సుకునే ప్రయత్నం చెయ్యి. తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్లు లైక్ ముదిరితే లవ్ అవుతుంది..”

“నేను నీ కన్నా కొన్ని మెట్లు కింద ఉన్నాను. నా స్థాయి నాకు తెల్సు.”

“ఈ మెట్లు ఎక్కటం ఎంత సేపు? దిగటం ఎంత సేపు? ఈ హోదాలు స్టేటస్‌లూ, మేడలూ, కార్లు, అనుభవిస్తున్న వాళ్లంతా పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతులుగా పుట్టారా? ఇవన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజులు వస్తాయి.” అన్నది వైదేహి.

“రేపు ఏం జరుగుతుందో మనకేం తెల్సు. ఇవాళ ఆలోచించేది ఇవాళ పరిస్థితులను బట్టే కదా..” అన్నాడు శ్రీకాంత్.

రెండు కుటుంబాల మధ్యా గల అంతరాలను అనుక్షణం గుర్తు చేస్తుండేది తల్లి. ఆమె గీసిన అడ్డు గీతలను చెరిపి వెయ్యటానికి ప్రయత్నించేది కూతురు.

అతడిని బయట పెరట్లో కుళాయి దగ్గర స్నానం చేయమంటే, బాత్‌రూంలో వేడి నీళ్లు అతనికి సిద్ధం చేసేది వైదేహి.

తల్లి అతనికి భోజనం అతని గదిలో తినమంటే, కూతురు అతడ్ని అందిరితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర తినమనేది.

అతను తొందరగా నిద్రపోయినా, ఆలస్యంగా నిద్రలేచినా, అతను ఏ పని చేసినా, ఏది చెయ్యకపోయినా, తల్లి పొగపెడుతూనే ఉండేది. ఆమె మాటలు అస్సలు పట్టించుకోవద్దు – అని అనేది కూతురు.

“భగవంతుడు నాకు ఏదీ అవసరమైనంతగా ఇవ్వలేదని బాధ పడేవాడిని. ఇప్పుడు నాకా బాధ లేదు. నన్ను నీడలా వెన్నంటి ఉంటూ నాకు ఎప్పుడేం కావాలో చూస్తూ, ఆడగకుండానే అన్నీ అమర్చి పెట్టే దేవతను నాకు చూపించాడు. అందుచేత నేను దేవుడికీ, నీకూ ఎంతగానో రుణపడి పోయాను” అన్నాడు శ్రీకాంత్.

“దేవుడి సంగతేమో గానీ, నిన్ను వెన్నంటి ఉండటంలో నా స్వార్థం నాకుంది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏం చేస్తావో మరి?”

“విధి ఎప్పుడు నన్ను ఎటు వైపు లాక్కుపోతుందో నాకే తెలియదు. ఇక్కడికి వస్తానని మాత్రం కలగన్నానా?”

“విధి నడిపించినట్లు నడవటం బ్రతకటం చేతకాని వాళ్ల పని. విధిని ఎదిరించి అయినా తమ ఆశయాలను నెరవేర్చుకోవటం ధీరుల పని..” అన్నది వైదేహి.

ఏమైతేనేం వీళ్లిద్దరూ దగ్గరవుతున్నారన్న విషయం గమనించిన ముకుందరావు దంపతులు వాళ్లను విడదీయాలనే నిర్ణయించుకున్నారు.

ఒక రోజు ఆయన శ్రీకాంత్‌ను పిల్చి “ఇంక నీ దోవ నువ్వు చూసుకో” అన్నాడు.

శ్రీకాంత్ ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు. చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. చిన్న ఉద్యోగమూ వెతుక్కున్నాడు.

కొద్ది రోజులకే వైదేహి అతన్ని వెతుక్కుంటూ వచ్చింది.

“ఒకప్పుడు నువ్వు మా ఇంట్లో ఆశ్రయం పొందావు. ఇప్పుడు నేను నీ ఆశ్రయం అర్థిస్తున్నాను” అన్నది వైదేహి.

“నువ్వు స్వర్గమంత ఎత్తున ఉన్నావు. నేను నరకమంత లోతున ఉన్నాను. మనం ఒక చోట ఉండటం ఎలా సాధ్యం?” అని అడిగాడు.

“నిన్ను నేను ఆకాశమంత ఎత్తున ఊహించుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవు. నీ వెనుక నీడలా ఉండి, నీ విజయంలో నేనూ భాగస్వామిని కావాలని నా ఆకాంక్ష..” అన్నదామె.

“చుట్టూ చీకటి కమ్ముకుంటున్న సమయంలో నీ రాక, ఒక చిన్న దీపాన్ని వెలిగించినట్లు ఉంటోంది” అన్నాడు అతను.

అప్పటి నుంచే వాళ్లిద్దరిదీ ఒకే లోకం అయింది.

..అతను పెద్ద ఆఫీసర్ అయినాడు. తల్లి ఫోన్ చేసి మాట్లాడింది. తండ్రి వాళ్ల ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు..

శ్రీకాంత్ ఆమెను నిద్ర లేపాడు.

“పన్నెండు అయింది. నీకు నిద్ర పట్టినట్లుంది. లోపలకు వెళ్దాం, పద” అన్నాడు.

ఆమె లేచి నిద్ర మత్తులో తూలిపడబోయింది.

“జాగ్రత్త, గుమ్మం ముందు మెట్లున్నాయి.”

“అవును మెట్లు ఎక్కాలి కదూ..” అన్నది వైదేహి అరమోడ్పు కన్నులతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here