[సంచిక కోసం ప్రముఖ రచయిత్రి, బాలసాహితీవేత్త డా. కందేపి రాణీప్రసాద్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
బహుముఖ ప్రజ్ఞాశాలి డా. కందేపి రాణీప్రసాద్..!!
[dropcap]మ[/dropcap]హిళ వంటింటికి మాత్రమే పరిమితం అనీ, కేవలం పిల్లలని కనిపెంచే మానవయంత్రం మాత్రమే అనుకునే రోజులు పొయాయి, అవి పాతరోజులు. నేటి ఆధునిక స్త్రీ చిత్రం పుర్తిగా భిన్నమైనది. చదువులో, విభిన్న వృత్తుల్లో, ప్రవృత్తుల్లో, అవకాశం రావాలే గాని మహిళ తన స్వంత కాళ్ల మీద తాను నిలబడగలుగుతున్నది. పురుషులతో సమానంగా తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నది. ఇంట్లో ఉండే గృహిణులు సయితం, తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, తమకిష్టమైన పనులలో సేదతీరుతున్నారు. తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతున్నారు. ఇంచుమించు ఇలాంటి మహిళల గురించి చెప్పుకోవలసి వచ్చినపుడు, తప్పకుండా, డా (శ్రీమతి) కందేపి రాణీప్రసాద్ గారిని, గుర్తుచేసుకోవాలి.
శ్రీమతి కందేపి గారి భర్త పిల్లల వైద్య నిపుణులు కావడంతో, వారు నిర్వహిస్తున్న ఆసుపత్రికి అడ్మినిస్ట్రేటర్‌గా, గృహిణిగా, రచయిత్రిగా, చిత్రకారిణిగా, ఇలా అనేక రంగాలతో తన విశ్వరూపం చూపిస్తున్నారు డా. రాణీప్రసాద్. తను చేపడుతున్న కార్యక్రమాలను, మరిన్ని విశేషాలను ఆవిడ మాటల్లోనే చదువుదాం.
~
* డా. రాణీప్రసాద్ గారూ, సంచిక అంతర్జాల మాస పత్రికపక్షాన మీకు స్వాగతం.
** నమస్కారం డాక్టరుగారూ..
ప్రశ్న: మీరు రెండు పీజీ డిగ్రీలు, ఒక పి.హెచ్.డి, చేసి కూడా, ఉద్యోగినిగా కాకుండా, సాధారణ గృహిణిగా స్థిరపడిపోయారు. ఎందుచేత?
జవాబు: నాకు చిన్నతనం నుండి ఉద్యోగం చేయడం మీద ఆసక్తి లేదు. బహుశా కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, బొమ్మలు చెయ్యడం ఇంటిని అందంగా అలంకరించుకోవడం వంటి వాటిపై అమితాసక్తి వలన కావచ్చు. మా నాన్నగారి కల నేను డాక్టరు చదవడం అప్పుడు కూడా “నేను చదుతాను గానీ ఉద్యోగం చెయ్యను నాన్నా” అంటే “సరేనమ్మా చదువుకుని జ్ఞానం పెంచుకోవడం ముఖ్యం గానీ సంపాదించాల్సిన అవసరం లేదమ్మా” అని ఒప్పేసుకున్నాడు. సరే చివరకు. అలాగే వివాహం సమయంలోను జరిగింది. మా అత్తగారు వాళ్ళు “మాకు ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు. మీకేమైనా అభ్యంతరమా” అని అడిగారు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు, తంతే గారెల బుట్టలో పడ్డట్టు అయ్యింది మా పరిస్థితి. “మా అమ్మాయికి ఉద్యోగమంటే అస్సలు ఇష్టం లేదు. పెళ్లి తర్వాత మీరేమైనా చెయ్యమంటరేమోనని భయపడ్డాం. ఇప్పుడు సంతోషం” అంటూ శుభం కార్డు వేశారు. రోగి పాలే కోరాడు. వైద్యుడు పాలే తాగమన్నాడు. అన్న చందాన మా ఉద్యోగ గోల సమిసి పోయింది.
మరో విషయం ఏంటంటే సాధారణ గృహిణిని కాదు. పది సంవత్సరాల పాటు డిగ్రీ పిల్లలకు కాకతీయ విశ్వ విద్యాలయం వారి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లెక్చరర్‍గా సేవ చేశాను. మా ఊరిలో అప్పటికి మహిళా లెక్చెరర్ లేరు. ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి మహిళగా మీరు పాఠాలు చెబితే మిమ్మల్ని చూసి మరి కొంత మంది ముందుకు వస్తారని యూనివర్సిటీ అధికారులు అనడంతో లెక్చరర్‌గా క్లాసులు (వారానికి రెండు మాత్రమే) తీసుకున్నాను.
మా హాస్పిటల్లో మా వారికి అసిస్టెంట్‌గా ప్రిస్కిప్షన్ రాస్తూ మేనేజిమెంట్ నేర్చుకున్నాను. ఈనాటి వరకూ హాస్పిటల్ మేనేజిమెంట్ చేస్తూనే ఉన్నాను. అప్పటికి నాన్ మెడికల్ మహిళలెవరూ హాస్పిటల్ మేనేజిమెంట్ చెయ్యలేదు. మా జిల్లాలో నేనే మొదటి మహిళా హాస్పిటల్ నిర్వాహకురాలిని. ఇప్పుడు చాలా మంది ఈ రంగంలోకి ప్రవేశించారు. నా దగ్గరే చాలా మంది ఉద్యోగం చేస్తున్నారు. నేను ఉద్యోగం చెయ్యడం కాదు ఉద్యోగం ఇచ్చే స్థానంలో ఉన్నాను.
ప్రశ్న: మీరు ముందు ఎం.ఎస్.సి. చేసి, మళ్ళీ తెలుగులో, ఎం.ఎ. చేశారు. ఎందుచేత? దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జవాబు: నేను సైన్స్ విద్యార్థిని. జంతుశాస్త్రం ప్రత్యేక సబ్జెక్టుగా ఎంఎస్.సి. నాగార్జున విశ్వ విద్యాలయంలో చదివాను. పెళ్లి తర్వాత రచనలు చెయ్యడం మొదలు పెట్టాక తెలుగు సాహిత్యంలో ఎమ్.ఏ. చదవాలనుకున్నాను. ఇక్కడ మా పుట్టింటి నేపథ్యం కొద్దిగా చెప్పాలి. మా నాన్నగారు సాహితీ ప్రియులు, సాహితీ పోషకులు. ఆయనకు నేను డాక్టరు చదవడం ఎంతా ముఖ్యమో కవిని కావడం కూడా అంతే ముఖ్యం. చిన్నతనం నుంచీ నా చేత రాయించేవారు. స్కూలు స్థాయి లోనూ కాలేజి లోనూ రచనలు, బొమ్మలు పోటీలలో ఎన్నో ప్రైజులు తెచ్చుకున్నాను. నాన్నగారి కవి పండిత సభలలో నాలుగైదేళ్ళ వయసులోనే సంస్కృత శ్లోకాలు చదివించేవారు. నా అక్షరాభ్యాసానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ గారు, రావూరి భరద్వాజ గారు ఇతర కవులతో పాటూ విచ్చేశారు. ఇలాంటి సాహితీ వాతావరణంలో పెరిగిన దాన్ని. మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఆపరేషన్ తర్వాత రెస్ట్ తీసుకోమనడంతో ఆ ఖాళీలో రచనలు చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ. చదువుకుని 4వ ర్యాంక్ తెచ్చుకున్నాను. PhD లో సైన్స్‌ను కలిపి తీసుకున్నాను.
ప్రశ్న: తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు రచనా వ్యాసంగంపై మక్కువ ఏర్పడటానికి గల ముఖ్య కారణం చెప్పండి?
జవాబు: తెలుగు భాష పై మక్కువ ఏర్పడటానికి నా ఇంటి సాహితీ వాతవరణమే కారణం. చిన్నతనాన మా ఇల్లు వచ్చే పోయే కవులతో మినీ రవీంద్ర భారతిలా ఉండేది. నాన్నకు పద్యాలు చదివి వినిపిస్తూ చుట్టూ కవులుండేవారు. నా చేత వారూ రాసిన పద్యాలు చదివించేవారు. మూడేళ్ళ వయసు నుంచే నాన్న సంస్కృత శ్లోకాలు, మంత్రపుష్పం, వేదాలు చదివించేవారు. నా ఉచ్చారణ బాగుండడంతో అందరూ మెచ్చుకునేవారు. నాన్న పేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ఇచ్చేవారు. శ్రీ అంగులకుదిటి సుందరాచారి ఛారిటీస్ అనే సంస్థను 1972 లో స్థాపించి కవులకు పండితులకు పురస్కారాలనిచ్చేవారు. నేను కూడా ఈ పనులన్నిటిలో నాన్నకు సహాయం చేసేదాన్ని. సాహిత్యం అంటే చెవి కోసుకునే అమ్మా నాన్నలున్న ఇంటిలో పుట్టిన నాకు సాహిత్యం పై ఇష్టం, విషయ పరిజ్ఞానం కోరుకోకుండగానే వచ్చాయి.
ప్రశ్న: రచనా వ్యాసంగంలో, కథ, కవిత, నవల, వ్యాసం వంటి ప్రక్రియలలో, మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది? ఎందుచేత?
జవాబు: రచనా వ్యాసంగంలో ఇష్టమైన ప్రక్రియ అంటే చెప్పలేను. అన్నీ ప్రక్రియల్లో రాస్తున్నాను. నేను బాల సాహిత్యాన్ని, కథ, కవిత, నవల, వ్యాసం, మినీ కవితలు, గేయ కథలు, సైన్స్ వ్యాసాలు, పొడుపు కథలు, నాటికలు, స్కెచ్‌లు, జీవిత చరిత్రలు, స్మృతి కవితలు, వంటి అనేక ప్రక్రియలో రాశాను. నేను ప్రత్యేకంగా చిత్రాలు వేసి వాటికి కవితలు కూడా రాశాను. సైన్స్ ముగ్గుల్ని తయారుచేసి వాటికి కవితలు రాశాను. మనం అనుకున్న విషయాన్ని చెప్పటానికి వీలయ్యే ఏ ప్రక్రియ అయినా ఇష్టమే.
ప్రశ్న: మీరు బాలసాహిత్యానికి అధిక ప్రాధాన్యత నిస్తారని చెబుతారు. దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా? వివరించండి.
జవాబు: మా వారు పిల్లల డాక్టరు కావటం మూలంగా ప్రతిరోజూ పిల్లల్ని చూస్తూ ఉండటం వలన నాకు రాయాలని అన్పించింది. అది కూడా మొదట్లో పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాలపై ఎక్కువగా రాశాను. మా వారి దగ్గర ప్రిస్కిప్షన్ రాయడం మూలంగా పేషెంట్లు డాక్టరుకు చెప్పే సమస్యలు వినడం వల్ల ఆ సమస్యలకు స్పందించి రాయడం మొదలు పెట్టాను. స్కూళ్ళలో కొట్టారనీ, హాస్టళ్ళలో అంటురోగాలు వచ్చాయాని హాస్పిటల్‌కు తీసుకొచ్చేవారు. నా మొదటి పుస్తకం పూలతోటను స్కూళ్లలోని సమస్యలతోనే రాశాను. ఆ తర్వాత రెండు మూడు పుస్తకాలు కూడా పిల్లలు, స్కూళ్ళు, తల్లిదండ్రుల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలు, అవగాహనా రాహిత్యాల సబ్జెక్ట్ తోనే రాశాను. మానసిక సమస్యలున్న పిల్లలకు ఎలా బోధించాలి, మరియు బోధనా అనుభవం లేని టీచర్ల వలన వచ్చే మానసిక సమస్యల గురించి ఎక్కువగా రాశాను.
ప్రశ్న: మీ శ్రీవారు పిల్లల వైద్యనిపుణులైతే, మీరు ఆసుపత్రి నిర్వహణలో తలమునకలై ఉండి కూడా, తెలుగు రచనావ్యాసంగానికి అనువైన సమయాన్ని ఎలా సమకూర్చుకోగలగుతున్నారు? వివరంగా చెప్పండి.
జవాబు: మా వారూ పిల్లల డాక్టరుగా పేషెంట్ల పనుల్లో బిజీగా ఉంటారు. వారికి సమయానికి అందించవలసిన పనులు ఎన్నో ఉంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా బిజీగా ఉంటుంది. అయితే మనసుంటే మార్గముంటుంది అన్నట్లుగా ఉదయం ఎవరూ లేవక ముందే లేచి రాసుకోవడం, లేదంటే అందరూ పడుకున్నాక రాత్రి పూట కూర్చొని రాసుకోవడం చేస్తాను. ఇదేకాక పుస్తకం, పుస్తకం పెన్ను పక్కనే పెట్టుకొని ప్రయాణాలు చేస్తుంటాం. ఆ సమయాన్ని కూడా వినియోగించుకుంటాను. వంటలు చేస్తూ ఆఫీసు రూంలో కూర్చునీ మధ్యలో మిగిలే అరగంటో, పది నిమిషాలో కూడా వృథా చేయకుండా రాసుకుంటే ఎంతో చేయవచ్చు. నేనైతే ఇలాంటి వృథాలను అరికట్టి రాసుకుంటాను.
ప్రశ్న: బాలపత్రికలపై మీ అభిప్రాయం ఏమిటి? ఈనాటి బాలపత్రికలు ఎలావుంటే బావుంటుందని మీరు అనుకుంటున్నారు?
జవాబు: మా చిన్నతనంలో వచ్చిన చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బుజ్జాయి వంటి పత్రికలు ఆనాటి పిల్లలకు ఆనందాన్నిచ్చాయి. అయితే ఆనాడు పిల్లలు నేర్చుకోవాల్సిన మంచి చెడులకు కేవలం పత్రికల మీద ఆధారపడలేదు. ఇంట్లో అమ్మానాన్న నాన్నమ్మ, తాతయ్య వంటి కుటుంబ సభ్యులు పిల్లలకు ఎన్నో నేర్పించేవారు. కాబట్టి పత్రికలకు ఎక్కువ బాధ్యత ఉండకపోయి ఉండవచ్చు. ఈనాడు పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. నాన్నమ్మ తాతయ్య ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడో పోయాయి. కనీసం అమ్మానాన్నా కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇంకా తెలుగు చదవటం చాలా తక్కువ అయిపోయింది. హాస్టళ్ళలో ఉంటూ ఎవరి అదుపాజ్ఞలు లేకుండా పెరిగుతున్నాను. ఫోన్లు అర చేతుల్లోనే ఉంటున్నాయి. బాలలు పాడుకోవటానికి అంటూ పాటలు గేయాలు ప్రచురిస్తున్నారు. పిల్లలు ఖాళీగా లేరు వాటిని ఆస్వాదించడానికి. స్కూళ్ళలో సాహిత్యానికో పీరియడ్ కేటాయించటమో, తల్లిదండ్రుల దగ్గరే పెరగడమో చేస్తే పత్రికలు చదివే అవకాశముంది. మొదటగా వారి సమస్యల్ని పరిష్కరించి అప్పుడు ఆటవిడుపు కోసం పత్రికలు చదవచ్చు. వాళ్ళని ర్యాంకులనే బాంబు మీద కూర్చోబెట్టి ఆడండి పాడండి చదవండి నవ్వండి అని మనమెన్ని చూపించినా ఫలితం లేదు.
ప్రశ్న: అప్పుడు చిన్నపిల్లల పత్రికలలోని కథలు, రాక్షసుల గురించి, మహిమలు, మాయామంత్రాలతో నిండి ఉండేవి. ఈ తరం పిల్లలకు ఇటువంటి కథలు సమర్థనియమని మీరు బావిస్తున్నారా? ఎందుచేత?
జవాబు: రాక్షసులు, దేవతలు మాయలు మంత్రాల వంటి కథలు ఒకనాటి సాహిత్యమని చెప్పవచ్చు. అయితే ఈ కాలానికి సంబందించిన విషయాలు, తెలుసుకోవాల్సిన, పాటించాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉండగా మళ్ళీ పాత తరం సాహిత్యం వైపే చూపు ఎందుకు.. ఇతర గ్రహాల గురించి నేడు పెరుగుతున్న టెక్నాలజీ గురించి, మారుతున్న జీవన విధానం గురించి, చదువులో చదువులో ఉన్న ఒత్తిళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ ప్రవర్తన వలన బాధపడే వారి గురించి, ఆరోగ్యం కోసం చేయాల్సిన వ్యాయామాల గురించి, పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండటం గురించి ఎన్నో తెలియని విషయాలను కథలుగా మలచవచ్చు. స్కూళ్లలోని ఒత్తిళ్ళ వల్ల పిల్లల్లో వచ్చే మానసిక సమస్యల గురించి నేను రాస్తున్నాను. ఆసుపత్రి పరంగా పిల్లలకు చెప్పాల్సినవన్నీ రాస్తున్నాను. వ్యాపార విధానాలు కొనుగోళ్ళు అమ్మకాలు అన్నీ ఆన్‌లైన్‍లో జరగటం, ఫోన్లు, కంప్యూటర్లలో రకరకాల యాప్‌ల గురించీ ఎన్నో నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలను రకరకాల సాహిత్య ప్రక్రియల్లో పిల్లలకు అందిస్తే బాగుంటుంది. మంత్రాలు మాయలకు సంబందించిన సైన్స్‌ను చెప్పవచ్చు. ఆర్థిక నేరాలు, సైబర్ క్రైములు, హైటెక్ మోసాలు, కిడ్నాపులు, వంటి జాగ్రత్త పడవలసిన అంశాలతో కథలు రావాలి. పసిపాపల్ని సైతం ఇబ్బంది పెడుతున్న మానవ మృగాల గురించి అవగాహన కలిగించే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కథలు రావాలి.
ప్రశ్న: పిల్లల రచనలు పిల్లల చేత చేయంచాలా? లేక పిల్లల కోసం పెద్దలచేత రాయించాలా? ఎందుచేత? పత్రికల గురించి మాట్లాడాలంటే, బాలల పత్రికల శాతం బహు తక్కువగా ఉంటున్నది? ఎందుచేత? మీరు పిల్లల కోసం రాసిన పుస్తకాల గురించి వివరించండి.
జవాబు : పిల్లల చేత రచనలు చేయించటం అంటే వాళ్ళకి రాయడం నేర్పించడం కోసమే గానీ వాళ్ళకి మంచి చెడులు చెప్పాలంటే పెద్ద వాళ్ళు రాయాల్సిందే. పెద్దల అనుభవ పాఠాలే పిల్లలకు తెలియాల్సిన జీవిత సత్యాలు. పత్రికలు తక్కువ ఉన్నాయి అని ఆలోచించే బదులు అమ్మానాన్నలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చదివించడం ఎంతో మేలు. హాస్టళ్ళలో చదివించకుండా దగ్గర పెట్టుకొని చదివించడం వల్ల పిల్లల్లో మంచితనం, విలువలు బంధాలు తెలుస్తాయి.
నేను దాదాపు 50 పుస్తకాలు రచించాను. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు వార్త దిన పత్రికలో కాలమ్ రాశాను. మిగతా వార, దిన మాస పత్రికలలో సంవత్సరాల తరబడి బొమ్మల వ్యాసాలు రాశాను. నా మొట్ట మొదటి పుస్తకం పూలతోటను బాలల కన్నీళ్ళలో ముంచి రాశాను. ఆ పుస్తకం నిండా కందిన బుగ్గలు, ఉబ్బిన కళ్ళు చెంపల మీద కన్నీటి చారికలతో బోలెడు పిల్లలు కనిపిస్తారు. ఆ తర్వాత వచ్చిన హరివిల్లు, నెలవంక, ఉషస్సు పుస్తకాలు కూడా పిల్లలు స్కూళ్ళలో పడుతున్న ఇబ్బందులే రాశాను. నంది వర్ధనాలు నానీలు, బాల్యమా ఎక్కడ నీ చిరునామా అనే వ్యాసాల పుస్తకం నిండా కూడా ర్యాంకులు మార్కుల వత్తిడిలో నలిగిపోతూ మానసిక శారీరక సమస్యలు తెచ్చుకుంటున్న పిల్లల గురించే రాశాను. సీతాకోక చిలుక, ద్రాక్షగుత్తులు అనే రెండు బాలల గేయాల పుస్తకాలు రచించాను. ఈ రెండింటిలో దాదాపు వంద జంతువుల గేయాలు రాశాను. సాధారణంగా పిల్లలకు చెప్పాల్సిన అన్ని విషయాలు ఉన్నాయి. ఆరు పుస్తకాలు బాలల గేయాలతో రాశాను.
ఐదు పుస్తకాలకు సంపాదకత్వం వహించాను. మా అమ్మ రాసిన భక్తి పాటల పుస్తకం, బాలల జానపద కథల పుస్తకం మరియు మా పిల్లలు రాసిన మూడు పుస్తకాలకు సంపాదకత్వం వహించాను.
సైన్స్ పాయింట్, సైన్స్ వరల్డ్, సైన్స్ కార్నర్, సైన్స్ ప్లానెట్ అని నాలుగు పుస్తకాలు సైన్స్ వ్యాసాలు రాశాను. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, వ్యాసాలు, పొడుపు కథలు రాశాను. పిల్లల కోసం పొడుపు కథలు రాసిన వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ఈ రెండు పుస్తకాలలోనూ సైన్స్ పొడుపు కథలు ఎక్కువగా రాశాను. ఇంకా రెండు పుస్తకాలు వచ్చేవి ఉన్నాయి. అవన్నీ మా హాస్పిటల్ గోడలపై ఉన్నాయి.
బాలల కోసం కథలు కూడా రాశాను. స్వీటీ మిల్కీ ఓ చిలుక, టిక్ టాంబుర్ర డాక్టర్ చెప్పిన కథలు రాశాను. ఇంకా ప్రస్తుతం ముద్రణలో రాణిప్రసాద్ కథలు, క్లాస్ రూం కథలు, సైన్స్ కథలు అనే మూడు పుస్తకాలున్నాయి. క్లాస్ రూమ్‌లో ఉన్న సమస్యల్ని ప్రతిబింబిస్తూ రాసినవి. అలాగే అమ్మాయిని వస్తువుగా తీసుకుని కథలు రాస్తున్నాను. ఆన్‌లైన్ పత్రికల్లో కాలమ్‌గా వస్తున్నాయి. ఈ కథల్లో మానసిక సమస్యలున్న పిల్లల్ని చూపిస్తూ రాశాను.
మూడు యాత్రా కధనాల పుస్తకాలు రాశాను. విహారం, కనుచూపుమేర, యాత్ర అనే పుస్తకాలలో పిల్లలకు పనికొచ్చే ఆర్ట్ గాలరీలు, సైన్స్ మ్యూజియంలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన యూనివర్సిటీలు, ప్రసిద్ధ ఆసుపత్రులు, సైన్స సెంటర్‌ల గురించి ఎక్కువగా రాశాను. అందువలన వీటిని బాలల యాత్రా కథనాలు అనవచ్చు. వీటితో పాటు ఒక నవల కూడా రాశాను. కస్తూరిబా గాంధీ జీవిత చరిత్రను నవలగా రాశాను.
సరదా సరదా బొమ్మలు, బొటనికల్ జూ అనే రెండు బొమ్మల తయారీ వ్యాసాల పుస్తకాలు రాశాను. సరదా సరదా బొమ్మలు వ్యర్థ పదార్థాలతో తయారైన బొమ్మల వ్యాసాల పుస్తకం ‘బొటనికల్ జూ’ అనే పుస్తకం వెజిటబుల్ కార్వింగ్‌తో తయారైన జంతువుల ఆకృతుల తయారీ వ్యాసాల పుస్తకం. లిఫి జూ అనే ఆకులతో తయారైన జంతువుల పుస్తకం ముద్రణలో ఉన్నది.
బాల సాహిత్య వ్యాసాలు కొన్నింటిని ‘సౌరభం’ అనే పుస్తకం వెలువరించాను. పత్రికల్లో శీర్షికలకు రాసిన నా బాల్యం లోని జ్ఞాపకాలు ‘పూలజడ’ అన్న పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చాను. పిల్లల అల్లరి వ్యాసాలను హోం థియేటర్ పేరుతో పుస్తకం తెచ్చాము.
వ్యాస ప్రక్రియల్లో పుస్తకాలు రాశాను. దీంట్లో పిల్లల గురించి టీచర్లు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు వ్యాసాలుగా రాసిన పుస్తకం ‘బాల్యమా ఎక్కడ నీ చిరునామా?’ వ్యాస ప్రక్రియలో చదువుకు సంబంధించిన వ్యాసాలు, యాత్రా వ్యాసాలు, విజ్ఞాన వ్యాసాలు, బొమ్మల తయారీ వ్యాసాలు, వెజిటబుల్ కార్వింగ్ వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, సైన్స్ వ్యాసాలు ఎన్నో రాశాను. బొమ్మల తయారీ వ్యాసాలు దాదాపు వెయ్యి దాకా రాశాను. మిగతావన్నీ కూడా 500 దాకా ఉండవచ్చు.
కవిత్వ ప్రక్రియలో ‘హౌస్ వైఫ్’, ‘క్వారంటైన్’ అనే రెండు పుస్తకాలు వేశాను. ఒక కవితా పుస్తకానికి ‘హౌస్ వైఫ్’ అనే పేరు ఇంత వరకూ ఎవరూ పెట్టలేదు. మహిళల ఇంటి పనికి సముచిత గౌరవమిచ్చారు అని ప్రశంసలు లభించాయి. అలాగే కరోనా సమయంలో రాసిన కవితలు, చిత్రాలు, ఆటల వ్యాసాలు, కథలు అన్ని కలిపి ‘క్వారంటైన్’ పుస్తకంగా తీసుకువచ్చాను. ఇందులో డాక్టర్లు, పోలీసులు చేసిన సేవల్ని వివరించాను.
నేషనల్ బుక్ ట్రస్ట్ వారి పుస్తకాలు పదింటిని తెలుగులోకి అనువాదం చేశాను. ఇందులో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన శెలవును అనువాదం చేయటం ఆనందాన్నిచ్చిన విషయం చక్రాల కథ, మంగు బొంగరం, పర్వతాలపై ప్రయాణం, మనసు పక్షి వంటివి అనువాదాలు.
నేను రాసిన పుస్తకాలు కూడా వేరే భాషలోకి అనువాదమయ్యాయి. పూలతోట ఇంగ్లీషులోకి హిందీలోకి 25 సం.ల క్రితమే అనువాదమయ్యింది. సీతాకోకచిలుక, నంది వర్తనలు పుస్తకాలు హిందీలోకి అనువాదమయ్యాయి.
ప్రశ్న: మీరు గెలుచుకున్న అవార్డులూ, పొందిన సన్మానాల గురించి చెప్పండి.
జవాబు: రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం కింద లక్ష రూపాయల బహుమతిని 2023 మార్చి నెలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారి చేతుల మీదుగా అందుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్తమ జిల్లా సాహితీవేత్తగా 50,000 రూపాయలను మున్సిపల్, ఐటి శాఖా మంత్రి కే.టీ.ఆర్. గారి నుంచి అందుకున్నాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని 2017 వ సంవత్సరంలో తీసుకున్నాను. ఇవి కాక రెండు తెలుగు రాష్ట్రాల లోనూ దాదాపుగా వంద పురస్కారాల పైగానే వచ్చాయి. సాహితి సంస్థల నుండి కళ భారతీ, కవిత వాణి, చిత్రకళా రాణి, బాల సాహిత్య కౌముది, బాల సాహితీ పూర్ణిమ వంటి బిరుదుల్ని పొందాను. బొంబాయి, భువనేశ్వర్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల లోనూ, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో పుస్తక ఆవిష్కరణలూ మరియు సన్మానాలు పొందాను.
ప్రశ్న: పిల్లల కోసం మీరు చేసిన ఇతర కార్యక్రమాల గురించి వివరించండి.
జవాబు: పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. వ్యక్తిగతంగానూ, ఆసుపత్రి పరంగానూ విద్య, ఆరోగ్య, విజ్ఞాన విషయాలను అవగాహన కల్పించడం ద్వారా చైతన్యం తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. ముప్పై సంవత్సరాల నుంచీ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆసుపత్రి ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద 23 సం.ల నుంచీ తెలుగు గేయం, బొమ్మ ముద్రిస్తున్నాం. తెలుగు భాషకు పట్టం కడుతున్నామని ఈ టివి, జెమిని టివి, ఎన్ టివి, టివి 9, టివి 5, వంటి చానల్స్ అన్ని ఈ విషయాన్నీ ప్రసారం చేశాయి. సిరిసిల్ల, కరీంనగర్ చుట్టూ పక్కల ఉన్న చాలా స్కూళ్ళలో పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి అన్న విషయంలో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాము. స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు అవగాహనా తరగతులు నిర్వహించాను. మానసిక, శారీరక లోపాలున్న పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, పడవ తరగతి పాసయి కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు ఎలా ఉండాలి అన్న విషయాలపై సైతం స్కూళ్ళలో ఉపన్యాసాలిచ్చాం. 1989 నుంచి 2005 దాకా ఈ కార్యక్రమాలు చేశాను. ఆసుపత్రిలో చిల్డ్రన్స్ డే, ఇండిపెండేన్స్ డే, సైన్స్ డే వంటి కొన్ని ప్రత్యేక దినాలలో ఉత్సవాలు చేసి పిల్లలను భాగస్వాములుగా చేస్తున్నాం. తల్లి పాల వారోత్సవాలు వారం రోజులూ ఎదో ఒక కార్యక్రమం చేస్తూ తల్లుల్ని భాగస్వాములుగా చేస్తున్నాం. కరోనా సమయంలో బొమ్మలు, చిత్రాలతో రోగుల్ని ఎంతో చైతన్యపరచాము.
ఆసుపత్రిలో సైన్స్, చరిత్ర, రాజులు రాజ్యాలూ, శాస్త్రవేత్తలు, ముప్పై జాతులు, అంతరించి పోయే దశలో ఉన్న జంతువులు, మొక్కలూ వంటి విషయాలతో తయారైన చార్టుల్ని గోడలకు అతికించాం. భారతదేశం లోని ప్రఖ్యాత కోతలు, భారతీయ నృత్యాలు, విశిష్ట మహిళా మణులు వంటి అనేక అంశాలతో తయారు చేసిన వెయ్యి చార్టులను ఆసుపత్రికి వచ్చే పిల్లల కోసం ఆసుపత్రి గోడలకు అతికించాము. పిల్లల కోసం మిల్కీ మ్యూజియంనూ, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీని పెట్టి సేవ చేస్తున్నాం. ఆసుపత్రి వ్యర్థాలతో తయారైన నాలుగు వేల బొమ్మలతో మిల్కీ మ్యూజియంనూ, సహచర బాల సాహితీవేత్తల గ్రంథాలు మరియు బాలల పత్రికలతో స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీని నిర్వహిస్తున్నాము.
పిల్లల కోసం మేము చాలా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 200 పై చిలుకు నేను తయారు చేసిన చిత్రాలతో ఎగ్జిబిషన్లు నిర్వహించాము. రవీంద్ర భారతిలో వారం రోజుల పాటు ఎగ్జిబిషన్‌ను నిర్వహించాము.
ప్రశ్న: వీలు చిక్కడం లేదు.. అనే మహిళామణుల కోసం మీ సమయ పాలనా గురించి వివరించండి.
జవాబు: మహిళల పురుషులు అన్న ప్రశ్న కాదు. ఎవరైనా ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలేయాలి. దానికి సరైన ప్లానింగ్ అవసరం. రోజు వారి కార్యక్రమాలలో ఎక్కడ అనవసరంగా సమయం వృథా అవుతుందో గుర్తించి నివారిస్తే చాలా సమయం మిగులుతుంది. నేనైతే ప్రయాణంలో వృథా అయ్యే సమయాన్ని చదవటానికి, రాయటానికి వినియోగిస్తాను. అలాగే ఆఫీసు పనిలోనూ, వంట పనిలోనూ, మధ్య మధ్యలో మిగిలే నిమిషాల సమయాన్ని కూడా వాడుకోవాలి. నేనైతే అలాగే చేశాను. సమయాన్ని ఆదా చేయడం కోసమే గత ముప్పై ఏళ్ళ నుంచి కేవలం ప్లైట్ జర్నిలనే వినియోగించుకుంటున్నాం. ఇలా అలోచేస్తే ఎన్నో రకాల ఐడియాలు వస్తాయి. ఎవరూ లేవని ఉదయాల్లోనూ అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రుల్లోనూ నేను రాసుకుంటాను.
ప్రశ్న: మీరు చేసే కార్యక్రమాలపై మీ కుటుంబ సభ్యుల స్పందన ఎట్లా వుంటుంది?
జవాబు: ఏ కార్యక్రమం చెయ్యాలన్నా అందరం కలిసే నిర్ణయిస్తాం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా తిన్న చాక్లెట్ రేపర్లు కూడా పారేయకుండా “మా అమ్మా బొమ్మకు కావాలి” అంటూ ఇంటికి తెచ్చేవారు. హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద పిల్లల కోసం పాటలు బొమ్మలు పెడతానన్నపుడు పిల్లలకు బాగుంటుందని చెబితే వెంటనే మావారు ఒప్పుకున్నారు. వారికీ పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఈ కోర్సు చదివారు. కాబట్టి పిల్లల కోసం ఏం చేద్దామన్నా, డబ్బు ఖర్చు పెట్టినా ఒప్పుకుంటారు. నవజాత శిశువుల కోసం మా హాస్పిటల్ తరుపు నుంచి పిల్లల పేర్ల పుస్తకం వేసి బహుమతిగా ఇస్తున్నాం. హస్పిటలంతా బొమ్మల మయం చేసిన, ఇది వైద్యలయమా, విద్యలయమా అని పత్రికలు శీర్షికలు పెట్టి రాసిన పిల్లల కోసం అన్ని ఆనందంగా చేస్తారు. సైన్స్‌కు సంబంధించిన కథలు, పొడుపు కథలు, వ్యాధుల గురించిన కవితలు, కథలు ఎన్నో రాసి ప్రజలకు అందుబాటులో పుస్తకాల రూపంలో ఉంచటమే కాక ఒక యూట్యూబ్ చానల్ ద్వారా ప్రసారం కూడా చేస్తున్నాం. నా కథలకు యానిమేషన్ చేయించి మా హాస్పిటల్‌లో ప్రసారం చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నాం.
ప్రశ్న: బాలసాహిత్యం కేటగిరీలో, మీకు ఈ సంవత్సరం కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు వుహించావచ్చా?
జవాబు: అవార్డు విషయం పాఠకులే చెప్పాలి. నేను చేసిన సేవను మీ ముందుంచాను. నాకు కేంద్ర సాహిత్య అవార్డు రావచ్చో రాకూడదో మీకే అర్థమవుతుంది. నేనైతే పిల్లల కోసం రాస్తూనే ఉంటాను.
** చాలా చక్కని సమాచారం అందించారు డా. రాణీ ప్రసాద్ గారు, సంచిక పక్షాన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
**ధన్యవాదాలు ప్రసాద్ గారు.