మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-1

0
4

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

శ్లో.

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే

[dropcap]ఆ[/dropcap]ధునిక సమాజంలో వ్యక్తిత్వ వికాసం అనే అంశం ఒక హాట్ టాపిక్‍గా మారింది. దాన్ని వ్యాపారంగా మార్చి, సెషన్‍కింత అని వసూలు చేస్తూ, పాశ్చాత్య వ్యక్తిత్వ వికాస సిద్ధాంతాలను abstract గా, theoretical గా నూరిపోస్తున్నారు. కొందరు ప్రముఖ రచయితలు ఐతే పుస్తకాలు రాసి, వాటిని బెస్ట్ సెల్లర్స్‌గా, సొమ్ము చేసుకుంటున్నారు. వ్యక్తిత్వమంటే ఏమిటి? దాన్ని వికసింప చేసుకోవడం ఎలా? అనేది అర్థం కాక యువతరం అయోమయానికి లోనవుతున్నారు. అందుకే ‘నిజమైన వ్యక్తిత్వ వికాసం’ అంటే ఏమిటో, దాన్ని సాధించడం ఎలాగో, విశదం చేయడమే ఈ వ్యాసకర్త ఉద్దేశం.

వ్యక్తిత్వ వికాసమునకు ప్రయోగశాల సాహిత్యమే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. పురాతన, ఆధునిక సాహిత్యాన్ని బాగా చదివితే, జీవితం మీద అవగాహన కలుగుతుంది. సాహిత్యం జీవితాన్ని ప్రతిఫలిస్తుంది. సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. జీవితం, సమాజాల సమాహారమే వ్యక్తిత్వం.

వినయం:

ఉత్తమ వ్యక్తిత్వానికి శిరోమణి ‘వినయం’. ‘విద్యాదదాతి వినయం’ అని ఆర్యోక్తి. వినయశీలుడైన వ్యక్తి తనకు తెలియని విషయాలను తెలుసుకోడానికి సంకోచించడు. వినయానికి ప్రతిరూపాలైన కొందరు గొప్ప వ్యక్తులను ఇక్కడ ప్రస్తావించడం అవసరం. దీనిని ఇంగ్లీషులు humility అనవచ్చు. విధేయత (Obedience)కు, దీనికి చాలా తేడా ఉంది.

డా. దివాకర్ల వెంకటావధాని మహాపండితుడు. తెలుగు భాషలో తొలి పి.హెచ్.డి. ఆయనదే. ‘ప్రాజ్ఞన్నయ యుగము’ అనే అంశం మీద ఆయన పరిశోధన చేశారు. నన్నయ్య ఆదికవి. ఆయనకు ముందున్న కవిత్వం శిలాశాసనాల్లో, తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తమై ఉండేది. దాన్ని వెలికి తీసిన మహానుభావుడాయన. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధిపతిగా సేవలందించారు. యన్.టి.రామారావు గారు కూడా తన పౌరాణిక చిత్రాల ప్రివ్యూలను ఆయనకు ప్రదర్శించి చూపి, ఆయన సలహాలు తీసుకునేవారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఆప్షనల్‍గా తెలుగు సాహిత్యం ఎంచుకోవడం ఆయన స్ఫూర్తితోనే సాధ్యమైంది. హైదరాబాద్ స్టడీ సర్కిల్ వారు ఆయనను అభ్యర్థించి ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. లాంటి పరీక్షలకు తెలుగు సాహిత్యాన్ని అభ్యర్థులకు నేర్పవలసిందిగా ఏర్పాటు చేశారు. ఆయన ఇచ్చిన శిక్షణతో కొందరు సివిల్స్ విజేతలయ్యారు. వారు మా తండ్రిగారు, శతావధాని, పౌరాణిక రత్న, బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి గారికి స్నేహితులు.

ఒకసారి నేను బర్కత్‍పురా లోని వారి ఇంటికి, వారిని దర్శించుకుందామని వెళ్ళాను. అప్పుడు డిగ్రీ చదువుతున్నాను. చేయెత్తు మనిషాయన. నుదుట చాదుచుక్క ధరించి, పుంభావ సరస్వతిలా ఉన్నారు. నన్ను చూసి, గబుక్కున లేచి, “రండి, దయ చేయండి” అని ముకుళిత హస్తాలతో ఆహ్వానించారు. నాకు కాళ్ళూచేతులూ ఆడలేదు. నేను కూర్చునేంతవరకూ ఆయన కూర్చోలేదు. నన్ను ఆదరంగా కుశల ప్రశ్నలడిగి, ఏం చదువుతున్నారని ప్రశ్నించారు. ఎమ్.ఎ. (సంస్కృతం) కట్టాలని అనుకుంటున్నానని చెబితే, “అది తర్వాత చేద్దురు గాని, ముందు ఎమ్.ఎ. (ఇంగ్లీష్) చేయండి, ఉద్యోగావకాశాలు ఎక్కువ” అని చెప్పారు. ఆయన సలహా ప్రకారమే నేను ఇంగ్లీషు లెక్చరర్‍గా, ప్రిన్సిపల్‍గా రాణించాను. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన చలవే. హోదాతో సంబంధం లేకుండా, వచ్చిన వారిని గౌరవించి, ఆదరించడం ‘వినయం’. దానికి సజీవ ఉదాహరణ దివాకర్ల వారు.

మాకు ఇంటర్ బోర్డులో బలరామయ్య గారని కమీషనర్ ఉండేవారు. ఆయన ఐ.ఎ.ఎస్. అధికారి. సంగీత, సాహిత్యాలలో చక్కని అభినివేశం ఉన్నవారు. మంచి నటుడు. నేను ఇంటర్వ్యూ బోర్డులో రీడర్‍గా, డిప్యూటీ సెక్రటరీగా ఆయన వద్ద రెండేళ్ళు పనిచేశాను. చిరునవ్వు ఆయన ఆభరణం. ఫైలు తీసుకుని ఆయన ఛాంబర్ లోకి వెళితే, “ముందు కూర్చోండి” అనేవారు. చాలామంది ఐ.ఎ.ఎస్.లు తమ క్రింది అధికారులను నిల్చోబెట్టి మాట్లాడుతారు. మా సమస్యలకు సానుకూలంగా స్పందించేవారు బలరామయ్య గారు. వినయ భూషణుడా మనీషి.

యన్.టి.ఆర్., కవిసమ్రట్ విశ్వనాథ శిష్యుడనే విషయం విదితమే. ఒక సభలో (గుడివాడ అనుకుంటాను) ఇద్దరికీ సన్మానం జరిగింది. యన్.టి.ఆర్. వినమ్రంగా “నేనింతవాడిని కావడానికి గురువుగారే కారణం” అని చెప్పుకున్నారు. విశ్వనాథ వారు “నేనేం చేశాను? స్ఫురద్రూపం అతనిది. స్వయంకృషితో గొప్ప నటుడైనాడు. మహా అయితే కొంచెం తెలుగు నేర్పించానంతే” అన్నారట. వినయానికి ప్రతీకలు వారిద్దరు.

కాళిదాసు మహాకవి, తన రఘువంశ మహాకావ్యానికి అవతారికలో

“క్వ సూర్యప్రభవో వంశః క్వ చాల్ప విషయామతిః

తితీర్షుః దుస్తరం మోహాత్, ఉడుపేనాస్మి సాగరమ్”

“ప్రాంశులభ్యే ఫలే లోభాత్, ఉద్బాహురివ వామనః”

అని చెప్పుకున్నారు. తాను అల్పమతి యట. రఘువంశమనే సముద్రాన్ని, చిన్న దోనెతో దాటడానికి ప్రయత్నిస్తున్నాడట. ఎత్తైనవాడికి మాత్రమే అందే ఫలాల కోసం ఎగురుతున్న పొట్టివాడట. ఇదంతా వినయావిష్కరణే.

జాన్ మిల్టన్ తన Paradise Lost అవతారికలో ‘Divine Muse’ (గ్రీకులకు జ్ఞానానికి అధిష్ఠాన దేవత) ను ఆవహింప చేసుకుంటాడు. అలా ఐతే గాని ఆ మహా కావ్యాన్ని రాయలేనంటాడు. పోతన “పలికించెడి వాడు రామభద్రుండట” అని, అన్నమయ్య “నాహం కర్తా, హరిః కర్తా” అని, తమ వినయశీలాన్ని చాటుకున్నారు.

“ధీలక్ష్మీ కృపాపాత్రులీ

వసుధన్ గర్వము నొందనేరరు కదా ప్రఖ్యాతులై

యొప్పినన్” అంటాను నేను.

ఆత్మగౌరవం – స్వతంత్ర దృక్పథం

వ్యక్తిత్వానికి ఈ రెండు లక్షణాలు ముఖ్యమైనవి. ఆత్మగౌరవం లేని నాడు మన వ్యక్తిత్వం నిరర్ధకమవుతుంది. మనకంటూ ఒక సొంత దృక్పథం (independent attitude) ఉండాలి. దాన్ని అనుసరించడంలో మనం ఎటువంటి రాజీ పడకూడదు. దీనివల్ల మనకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వాటికి తలవంచకూడదు. ‘నిరంకుశాః కవయః’ అంటే కవులు నియంతలు అని కాదు. అంకుశం అంటే అదుపు చేసేది. ఎవరి అదుపులో లేని వారుగా సృజనశీలురు ఉండాలి. రాజాశ్రయం కోఅం, రాజానుగ్రహం కోసం పాకులాడితే, కళ మసకబారుతుంది. భజనపరులుగా మారుతారు. రాజులకు (నాయకులకు) ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేం.

పోతనామాత్యుడు వ్యవసాయం చేసి పొట్ట పోసుకున్నాడు. ఆత్మగౌరవ శోభితమైన పేదరికాన్నే ఆయన అక్కున చేర్చుకున్నాడు. శ్రీనాథుడిలా రాజుల ప్రాపకం కోసం తపించి, చివర్లో ఎన్ని ఇడుములకు లోనయినాడో మనకు తెలుసు. అందుకే పోతనకున్న గౌరవం శ్రీనాథునికి లేదు.

“ఇమ్మను జేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు

సొమ్ములు కొన్ని పుచ్చుకొని..”

“యప్పడుపుకూడు భుజించుటకన్న సత్కవుల్

హాలికులైననేమి గహనాంతరసీమల కందమూలకౌ

ద్దాలికులైన నేమి”

అన్నాడు పోతన. ఎంత ఆత్మగౌరవం.

“రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయంబు” అన్నాడు ధూర్జటి.

ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ‘జానకి విముక్తి’ అన్న గొప్ప నవల వ్రాశారు. స్త్రీవాదాన్ని (feminism) కమ్యూనిస్టు దృక్పథంతో వ్రాశారు. అది ‘ఆంధ్రజ్యోతి’లో సీరియల్‍గా వచ్చేది. అప్పుడు ఆ పత్రికకు ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. “అమ్మా! కథలో కమ్యూనిస్టు విశ్లేషణలు ఎక్కువై, కథనం ముందుకు సాగడం లేదు. పాఠకులకు విసుగు కలిగించేలా ఉంటూంది. దాన్ని బాగా తగ్గించి, కథనాన్ని పెంచండి” అని ఆయన రచయిత్రిని కోరారట. దానికి ఒప్పుకుంటే ఆమె రంగనాయకమ్మ ఎలా అవుతుంది? “అలా కుదరదు” అని తెగేసి చెప్పారట ఆమె. “అయితే సీరియల్ ఆపేస్తాం”. “ఐ డోంట్ కేర్!” అదీ ఆత్మగౌరవమంటే.

విజయాలకు, లాభాలకు అతీతంగా సినిమాలు తీస్తుంటారు కొందరు. కమల్ హాసన్, రామ్ గోపాల్ వర్మ, అలాంటి స్వతంత్ర దృక్పథం కలవారిలో ఉంటారు. వారి భావజాలాన్ని మనం అంగీకరించలేకపోవచ్చు. కానీ, వారి attitude లో ఒక రాజీ పడని ధోరణి ఉంటుంది. దానినే మనం కొంత నిర్మాణాత్మకంగా అనుసరిస్తే, అది మన వ్యక్తిత్వాన్ని వికసింప చేస్తుంది.

సాహిత్యం, సంగీతం, ఆస్వాదన

మనకు నచ్చిన లలిత కళనేదైనా, దాన్ని సాధన చేయలేకపోయినా, కనీసం ఆస్వాదించగలిగితే, మన వ్యక్తిత్వం పరిమళభరితం అవుతుంది. “టివీలో వార్తలు తప్ప మరేమీ చూడనండీ!”, “పేపరు తప్ప మరే పుస్తకాలు చదివే అలవాటు నాకు లేదండీ” అని గొప్పగా చెబుతుంటారు కొందరు. వారిని చూస్తే జాలేస్తుంది. అసమగ్ర వ్యక్తిత్వాని అసలైన ఉదాహరణలు వాళ్ళు. చిత్రలేఖనం, శిల్పకళ లాంటి వాటి వరకు అక్కర్లేదు, కనీసం సంగీతం విని ఆస్వాదించవచ్చు. దాని వలన మనసు పరిఫుల్లమవుతుంది. ఉల్లాసం కలుగుతుంది. సంగీతానికి భాషతో లేదు. ఏ భాషలో పాటలనయినా విని ఆస్వాదించవచ్చు. “Music has no language” అన్నారు! ఒకసారి నేను ఊబర్ ఆటోలో వెళుతున్నాను. ఆటో డ్రైవరు ఏవో పాటలు పెట్టాడు. శ్రుతి, లయ, శ్రావ్యత అన్నీ కుదిరాయి ఆ పాటల్లో. కానీ భాష ఏదో అర్థం కాలేదు. అతన్నడిగితే, “అది బంజారా భాష” అని చెప్పాడు.

ఇక సాహిత్యం. సాహిత్యం మన జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది.  ‘సంగీతంచ సాహిత్యంచ సరస్వత్యాః స్తనద్వయం’ అన్నారు. ఎంత మనోహరమన భావన! దాంట్లో కూడా అశ్లీలతను వెతికే వారికి జోహారు! నా జీవితాన్ని మలుపు తిప్పిన నవల కొమ్మూరి వేణుగోపాలరావు గారు వ్రాసిన ‘వ్యక్తిత్వం లేని మనిషి’. Personality Development ను ఆ కాలంలోనే fiction గా మలచిన మేధావి ఆయన. ఆ నవల చదివి మన వ్యక్తిత్వం ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను. “Reading maketh a full man” అన్నాడు ఫ్రాన్సిస్ బేకన్.

ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్‍ఫోన్ ఉంటుంది. అది ఒక అదనపు అవయవమైంది. కాని ‘పుస్తకం హస్త భూషణం’ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్‍లలో కూడా కావలసినంత ఉత్తమ సాహిత్యం పి.డి.ఎఫ్‍.ల రూపంలో దొరుకుతుంది. చదవాలనే అభిరుచి ఉండాలంతే. “కవితయాద్యస్తి రాజ్యేన కిమ్?” అని ప్రశ్నించాడు భోజ మహారాజు. కవిత్వముంటే రాజ్యంతో పనియేమని దానికర్థం. ఫేస్‍బుక్, వాట్సప్‍లలో కూడా చక్కని సమీక్షలు, పుస్తక పరిచయాలు వస్తాయి. ఆంగ్ల సాహిత్యం కూడా గొప్పదే. దాన్ని చదివి మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవచ్చు.

మంచి సినిమాలు చూడడం, వాటిని విశ్లేషించడం కూడా వ్యక్తిత్వ వికాసంలో భాగమే. O.T.T. ప్లాట్‍ఫారాలు వచ్చిన తర్వాత విస్తృతి పెరిగింది. వివిధ భాషల్లోని ఉత్తమ చిత్రాలను సబ్-టైటిల్స్ సహాయంతో చూసి అవగాహన పెంచుకోవచ్చు.  స్టార్ హీరోల, మల్టీస్టారర్ల, పాన్ ఇండియా సినిమాలు చూస్తే, ఉన్న వ్యక్తిత్వం కూడా పోయే ప్రమాదం ఉంది, వికాసం సంగతి దేవుడెరుగు. ఎంత అసహజంగా ఉంటే అంత గొప్ప సినిమా! వందల కోట్ల కలెక్షన్లు రావచ్చేమో గాని, నేల విడిచి సాము చేసే, down to earth కాని అలాంటి సినిమాలను కేవలం వినోదం కోసమే చూడాలి. అంతేగాని, అర్థం పర్థం లేని బిరుదులు తగిలించుకుని, వాళ్ళు మాత్రం వేల కోట్లు సంపాదించుకొంటారు గాని, సమాజానికి ప్రయోజనం పూజ్యం. వినోదం మాత్రం పుష్కలం. వారిపై వీరాభిమానం వారి వారి వ్యక్తిగతం. అది శ్రుతి మించి వారి వల్ల ప్రభావితమైతే మటుకు, అది వ్యక్తిత్వ వికాసానికి హానికరం!

వృద్ధాప్యం, వ్యక్తిత్వం

“Old age hat its own honour and toil” అన్నాడు ఆల్‍ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. అనటమే కాదు తన ‘Ulysses’ అనే కావ్యంలో దాన్ని ఋజువు చేసి చూపాడు. “వృద్ధాప్యానికి, దాని గౌరవం, దాని శ్రమ దానికున్నాయి” అని దానర్థం. వృద్ధాప్యం శరీరానికే గాని మనసుకు కాదు. రిటైరైపోవడమంటే అస్త్ర సన్యాసం చేసి ఇంట్లో కూర్చోడం కాదు. నచ్చిన వ్యాపకం కల్పించుకోవాలి. చేతనయినంత వ్యాయామం చేయాలి. మితాహారం తీసుకోవలి. అప్పుడు వృద్ధాప్యం బాధించదు. పైగా జీవించ తగ్గదిగా మారుతుంది. అపారమైన అనుభవాన్ని తర్వాతి తరాలకు ఇవ్వవచ్చు. ఆ క్రమంలో పిల్లల విషయంలో అతి జోక్యాన్ని పరిహరించి balanced గా ఉంటే సరి.

Non-attachment/Detachment

వ్యక్తిత్వ వికాసంలో ఈ రెండు అంశాలను పరిగణించాల్సిన అవసరం ఉంది. రెండింటికీ చాలా తేడా ఉంది. మొదటిది వైరాగ్యం. అంటే అన్ని విషయాల్లో involve అవుతూనే వాటి ప్రభావం మన మనసు మీద లేకుండా ఉండడం. ఇదే వివేకానంద స్వామి చెప్పిన కర్మయోగం/రాజయోగం. ‘అతీత స్థితి’ అని కూడా దానిని అనవచ్చు. దీనినే భగవద్గీతలో

“దుఃఖేషు అనుద్విగ్న మనాః

సుఖేషు విగత స్పృహః

వీతరాగభయక్రోధాః”

అన్నాడు భగవానుడు. దుఃఖములు వచ్చినప్పుడు క్రుంగక, సుఖములు వచ్చినప్పుడు పొంగక, రాగము, భయ్యము, కోపములను వదిలినవాడే స్థితప్రజ్ఞుడు! ఈ ‘స్థితప్రజ్ఞత’ను సాధిస్తే వ్యక్తిత్వ వికాసానికి అది పరాకాష్ఠ అవుతుంది. దానికు సులభ మార్గం ఒకటుంది. అది మన భావోద్వేగాలను అదుపు చేసుకోవడం! ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం మానుకోవాలి. అది మంచిదైనా చెడుదైనా. అలాంటి non-attachment కు ఉదాహరణగా, శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి ఒక కథ చెప్పారు. క్లుప్తంగా దాని సారాశం ఇది.

“ఒక ఊర్లో ఒక సత్రంలో ఒక సన్యాసి ఉన్నాడు. ఎవరైనా పెడితే తింటాదు. నిరంతరం జపధ్యానాల్లో గడుపుతుంటాడు. ఆ ఊరి భూస్వామి కుమారుడు, ఒక బీదింటి అమ్మాయికి కల్లబొల్లి కబుర్లు చెప్పి మోసం చేసి గర్భవతిని చేశాడు. ఓ విషయం ఎవరికైనా చెబితే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించాడు. చివరకు తల్లిదండ్రులకు తెలిసింది. ఎవరు అని అడిగితే, “సత్రంలో సన్యాసి” అని చెప్పిందట. వాళ్ళు, వాళ్ళ బంధువులు వెళ్ళి ఆయనను బాగా కొట్టి, ఆ అమ్మాయిని ఆయన దగ్గర వదిలేసి వెళ్ళారు. నన్నెందుకు కొడుతున్నారని గాని, నా తప్పేమిటని గాని ఆయన అడగలేదు. దెబ్బలను నిర్వికారంగా భరించాడు. ఆ అమ్మాయిని వెంటబెట్టుకుని వేరే ఊరు చేరుకున్నాడు. నాలుగిళ్ళు యాచించి, ఆమెను పోషిస్తూ, కంటికి రెప్పలా కాపాడాడు. “ఎందుకమ్మా ఇలా చేశావు?” అని కూడా ఆమెను అడగలేదు. ఆమెకు కనువిప్పు కలిగింది. వెళ్ళి తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పింది. వారు ఎంతో పశ్చాత్తాపపడి, పూలూ, పళ్ళు తీసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి క్షమించమని పాదాల మీద పడ్డారు. అప్పుడు కూడా ఆయన ఏమీ అనలేదు. అదే నిర్వికారం! స్థితప్రజ్ఞత అంటే అది!”

ఇక Detachment అంటే అనాసక్తి. దీనినే apathy అని కూడా అనవచ్చు. ఇదొక రకమన స్పందనారాహిత్యం. ఇదొక దుర్గుణం. అలసత్వం, దీనికి కారణం. సోమరితనం కూడా! కాబట్టి, మనం non-attached గా ఉండాలి కాని, detached గా ఉండకూడదు.

హాస్య ప్రవృత్తి – Pleasant Manners

ఇది వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది. భగవంతుని సృష్టిలో నవ్వగలిగిన, sense of humour ఉన్న ఒకే జీవి మనిషి. జంతువులు, పక్షులు నవ్వలేవు. “నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం” అన్నాడు హాస్య శిఖామణి జంధ్యాల. ఒకసారి మనసారా నవ్వితే, నెర్వస్ సిస్టమ్ అంతా చక్కగా యాక్టివేట్ అవుతుందట. అనుకూలమైన హార్మోన్లు విడుదలవుతాయట. నవ్వాలి, నవ్వించాలి, అంతే కాని నవ్వులపాలు కాకూడదు. ఈ వ్యాస రచయిత ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ఎడిటోరియల్ పేజీలో ‘దత్తవాక్కు’ అనే కాలమ్ వ్రాస్తున్నాడు. అందులో విషయాన్ని వ్యంగ్యంగా, హాస్యస్ఫోరకంగా, lighter vein లో present చేయమని ఎడిటర్ శ్రీ వై.ఎస్.ఆర్. శర్మ గారు కోరారు. దానికి చాలా మంచి ఆదరణ పాఠకుల నుంచి లభిస్తూంది.

పి.వి. నరసింహారావు అంతటి గంభీరుడు తన చికాకులను తొలగించుకోవడానికి రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తానని చెప్పారు. కన్యాశుల్కం, చిలకమర్తి వారి ‘గణపతి’, మొక్కపాటి వారి ‘బారిస్టర్ పార్వతీశం’, కందుకూరి వారి ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’, పానుగంటి వారి ‘సాక్షి ఉపన్యాసాలు’ చదివితే మనలో హాస్య సౌరభాలు వెల్లివిరుస్తాయి. మన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంటుంది. హాస్యనటులు కూడా కథలో ముఖ్యపాత్రలుగా ఉంటారు. అంతే గాని, ‘కామెడీ ట్రాక్’ అని ఒకదాన్ని ప్రత్యేకంగా పెట్టి, హాస్యాన్ని అపహాస్యంగా మారిస్తే రసభంగమవుతుంది. టివీల్లో ఈ మధ్య వచ్చ్చే ‘హాస్య లైవ్ షో’ లను చూస్తుంటే, నవ్వు కాదు, అపహాస్యం కలుగుతుంది. అలాంటి వాటిని కూడా అభిమానించేవారు చాలా మంది. వారి వ్యక్తిత్వం అలగ్ హై!

కాబట్టి హాస్య ప్రవృత్తిని కలిగి ఉండడం కూడా ఉత్తమ వ్యక్తిత్వ లక్షణమే. ఇక pleasant manners. ఆహ్లాదకరమైన ప్రవర్తన. ఇది ఉన్నవాడు చల్లని గాలి లాంటి వాడు. తన చుట్టూ ఉన్నవారిని కూడా good spirits లో ఉంచగలడు. ఇది ఉత్తమ నాయకత్వ లక్షణం కూడా. దీనికి కోపాన్ని జయించడం మొదటి మెట్టు. అది చెప్పినంత తేలిక కాదు.

సామాజిక అవగాహన (Social Awareness)

మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతోంది? సమకాలీన రాజకీయాలెలా ఉన్నాయి? అంతర్జాతీయ పరిణామాలేమిటి? ఇలా ఎన్నో విషయాల పట్ల మనకి అవగాహన ఉండాలి. జాన్‍డాన్ అన్నట్లు “No man is an island”. మనిషి ఒక ద్వీపం కాదు. దేనితోనూ సంబంధం లేకుండా ఉండలేడు. వార్తాపత్రికలు చదవడం, టివీలలో విశ్లేషణలు వినడం, మిత్రులతో చర్చలు సామాజిక అవగాహనకు తోడ్పడతాయి. అది లేకుండా వ్యక్తిత్వ వికాసం అసంపూర్ణమవుతుంది.

దురదృష్టవశాత్తు, పత్రికలు, టివీ ఛానళ్లు, ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంటున్నాయి. అవి పక్షపాత వైఖరితో ఉంటాయి. వాటి వల్ల మన వ్యక్తిత్వం ప్రభావితం కాకూడదు. Unbiased గా ఉండేవే మనం అనుసరించాలి. అప్పుడే సమాజం మీద, రాజకీయాల మీద, మానవ సంబంధాల మీద ఒక objective approach మనకు ఏర్పడుతుంది. దాని వల్ల మన వ్యక్తిత్వం పదును తేలుతుంది. సాధికారికంగా మన అభిప్రాయాలను వెల్లడించగలుగుతాము. సామాజిక అవగాహనా శూన్యుడు, హితోపదేశకారుడన్నట్లు,
“న శోభతే సభామధ్యే హంసమధ్యే బకో యథా”  – అంటే, సభలో (పదిమందిలో) హంసల మధ్య కొంగ వలె శోభించడు!

మహాభారతం చదివితే –

“బహుభాషల బహువిధముల

బహుజనముల వినుచు భారతబద్ధ

స్పృహులగువారికి నెప్పుడు

బహుయాగంబుల ఫలంబు పరమార్థమిలన్” అని చెప్పారు.

‘Interaction with men and matters’ అని దీనిని చెప్పవచ్చు.

నన్నయ్య గారు ‘వార్త’ ఎంత ముఖ్యమైనదో చెప్పనే చెప్పారు.

“వార్తయందు జగము వర్తిల్లు చున్నది,

యదియు లేనినాడ యఖిలజనులు

నంధకారమగ్ను లగుదురు గావున,

వార్త నిర్వహింప వలయు..”

Media యొక్క ప్రాధాన్యతను ఆయన ఆనాడే గ్రహించాడు. పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషియరీ.. ఈ మూడింటి తర్వాత, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం (fourth estate) మీడియానే. హంస పాలను నీళ్ళను వేరు చేసిన విధంగా మనం వార్తలలో మంచివాటిని, చెడ్డవాటిని (Subjective and objective) విడదీసి చూడగలిగితే, మన వ్యక్తిత్వం కాంతులీనుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here