మధ్య తరగతి జీవితాలకు దర్పణం ‘పురాణం శ్రీనివాసశాస్త్రి కథలు’

0
3

[dropcap]సా[/dropcap]హితీలోకంలో శ్రీ.శా.గా సుపరిచితులైన ప్రముఖ రచయిత శ్రీ పురాణం శ్రీనివాసశాస్త్రి రచించిన 19 కథలతో ఆయన మరణానంతరం వెలువడిన పుస్తకం ‘పురాణం శ్రీనివాసశాస్త్రి కథలు’. పురాణం సుబ్రహణ్యశర్మ, పురాణం సీత గార్ల కుమారుడైన శ్రీ.శా. పలు పత్రికలలో వివిధ హోదాలలో పని చేశారు.

కథానిక ఎత్తుగడ నుంచి కథనం, సన్నివేశ కల్పన, సంఘటనల కదలిక, ముగింపు వంటి శిల్ప విషయమైన విశేషాలన్నిటా శ్రీ.శా. కథల్లో మెరుపులుంటాయి. మనుషుల స్వరూప స్వభావాల వర్ణనలో నేపథ్య చిత్రణలో సంభావ్యత ఆ మెరుపులకి మరింత శోభని చేకూరుస్తాయి.” అని వ్యాఖ్యానించారు శ్రీ విహారి తమ ముందుమాట ‘కీర్తిశేషుని మాసిపోని కథాక్షరాలు’ లో.

శ్రీనివాసశాస్త్రిగారికి దేని గురించి రాయాలో తెలిసినట్టుగానే ఏది రాయనక్కరలేదో తెలుసు. అందువల్లనే ఆయన ఎంతో సాఫీగా, హాయిగా, చక్కగా చదువుకోగలిగే కథలు వ్రాయగలిగారు” అని వ్యాఖ్యానించారు శ్రీ. కె.ఎన్.వై. పతంజలి.

***

హింస’ కథలో పశు పక్ష్యాదులకు లేనిదీ, మనుషులకి ఉన్నదీ ఆలోచన అని కథ మొదట్లో చెప్తారు. ఉద్యోగం చేసి, కుటుంబ బాధ్యతలన్నీ తీర్చుకుని, ఉద్యోగం నుంచి రిటైర్ ఇంట్లో విశ్రాంతిగా ఉంటున్న భర్త చక్రవర్తి – ఏమీ తోచక బుర్ర పాడుచేసుకుంటున్నారని పార్వతమ్మ అభిప్రాయం. ఆహారాన్ని మోసుకుపోతున్న చిన్న చీమని చూసి తెగ జాలిపడిన చక్రవర్తి తన పొలాన్ని కౌలుకి తీసుకున్న సన్నకారు రైతుపై మాత్రం కనికరం చూపించడు. కథ చివర్లో ఆ చిన్న చీమ ఆయన పాదాల కింద పడి నలిగిపోతుంది. ప్రతీకాత్మకమైన కథ. ఆధిపత్యపు భావజాలాన్ని సున్నితత్వపు ముసుగులో దాచడానికి ప్రయత్నించేవారికి స్వభావానికి ప్రతీక ఈ కథ.

ఇద్దరు యాచకుల కథ ‘ఎటు చూస్తే అటు చీకటి’. అంధులైన లక్ష్మణ్, చందనలు యాచించుకుంటూ జీవితాలని వెళ్ళదీస్తుంటారు. చందన పాటలు పాడుతుంది, లక్ష్మణ్ చిడతలు వాయిస్తాడు. ఆమె గొంతు విని ఆమె పట్ల అభిమానం పెరుగుతుంది అతనికి. ఆమె ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు. ఓసారి ఇద్దరూ ఒకేచోట ఉన్నప్పుడు మాటల సందర్భంగా ఆమె కూడా అంధురాలేనని అతనికి తెలుస్తుంది. ఆమెతో కలిసి ఉందామని భావిస్తాడతను. “నువ్వు చాలా అందంగా ఉన్నావు” అని అంటాడు, ఆమె చెపిన జవాబు విని నీరుగారిపోతాడు. చదువరులు ఊహించని ముగింపునిస్తారు రచయిత.

అభిమానాన్ని, ఆకల్ని చంపుకొని పరిస్థితులు ఆడించినట్టల్లా మరబొమ్మల్లా ఆడలేని మనుషులు, ముఖ్యంగా ఆడవాళ్లయితే, జీవితంలో చాలా కష్టాల పాలవుతారని ‘ఎన్నెన్నో ఆత్మహత్యలు’ కథలో తల్లి పాత్రతో అనిపిస్తారు రచయిత. 1976లో ఆంధ్రప్రభ వారపత్రిక నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందిందీ కథ. దుర్భరమైన పేదరికాన్ని పంటి బిగువన భరిస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చే వ్యక్తుల నిస్సహాయతని ఈ కథ ప్రతిబింబిస్తుంది. ఈ కథ రాసి 47 ఏళ్ళయినా, పేద, దిగువ మధ్య తరగతి వర్గాల పరిస్థితిలో మార్పు లేకపోవడం బాధ కల్గిస్తుంది. ఆత్మవంచన ఆత్మహత్యలాంటిదే అని ఈ కథ సూచిస్తుంది,

ఆకలికి తట్టుకోలేక జేబుదొంగగా మారతాడు సత్తిపండు. ఓసారి పోలీసులకి దొరికిపోయి తన్నులు తిని, ఆర్నెల్లు జైల్లో గడిపి బయటకు వస్తాడు. దొంగతనం చేయద్దని అనుకున్నా, ఆకలిని తట్టుకోలేక బస్సులో ఒకతని పర్సు కొట్టేస్తాడు. పోలీసు వెంబడిస్తుండగా, పారిపోయి, ఓ ఇంట్లో దూరతాడు. తనని పట్టించద్దని బ్రతిమాలుకుంటాడు. పోలీసులను పంపించేసి, సత్తిపండుని కొట్టి బయటకు తోసేసి ఆ దొంగ సొమ్ముని అతను కాజేస్తాడు మరో ఆకలి తీర్చుకోడం కోసం. పరపీడన పరాయణత్వాన్ని గుర్తు చేస్తుంది ‘కష్టార్జితం’ కథ.

1978లో ‘జ్యోతి’ మాసపత్రిక నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి గెల్చుకున్న కథ ‘గూడు చాలని సుఖం’. పేద కుటుంబానికి చెందిన సత్తెమ్మ, వీరయ్యలు – కొడుకు కాసులు ఓ చిన్న పూరిపాకలో ఉంటుంటారు. తమ పాకని కాస్త విశాలం చేసుకుని, కాస్త పెద్దదిగా చేసుకుంటేనే కాని కాసులుకి పెళ్ళి చేయకూడదని అంటాడు వీరయ్య. అయినా కాసులు రత్తాలుని పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళయి కోడలొస్తే, తన సారకి ఇచ్చే డబ్బులు రావేమో అతని భయం. వీరయ్య చనిపోయాకా, రత్తాలుని తీసుకొచ్చి కాపురం పెడతాడు కాసులు. ఆ చిన్ని పాకలో వృద్ధురాలైన తల్లి తమతో ఉంటుందగా దాంపత్యసుఖం అనుభవించడానికి అవస్థలు పడతాడు. కొడుకు బాధని గ్రహించిన తల్లి బయట పడుకోడం మొదలుపెడుతుంది. చలికాలంలో ఓ రోజు చలిని తట్టుకోలేక తల్లి కప్పుకునే కంబళి తీసుకుని, ఆమెకో పల్చటి దుప్పటి కప్పి వస్తాడు కాసులు. మర్నాడు ఉదయం బయట చూసేసరికి తల్లి చలివి వణుకుతూ, ఆయాసపడుతూ కనిపిస్తుంది. ఆమెను ఓ చవక డాక్టర్ వద్దకి తీసుకెళ్తాడు. డాక్టర్ ఇంజక్షన్ చేసి, మందులు రాసిచ్చి, “ఆరుబయట పడుకోనివ్వద్దు” అని చెప్తాడు. దాంతో కాసులు పడక బయటకి మారుతుంది. కొన్నాళ్లు గడిచేసరికి సత్తెమ్మ ఆస్మాతో కన్నుమూస్తుంది. పాక కాసులదవుతుంది. కానీ పాక మాత్రం ఇరుగ్గానే ఉంటుంది. ఎందుకో కథ చివర్లో తెలుస్తుంది.

డబ్బు అవసరం మనిషితో ఏమైనా చేయిస్తుంది. కానీ తనది కాని సొమ్మును చేజిక్కించుకోవాలనుకునేవారు కాస్త తటపటాయిస్తారు. అవకాశాన్ని బట్టి నడుచుకుంటారు. ‘చిల్లర రాళ్ళు’ కథలో విఠల్ రిటైర్మెంట్‍కి దగ్గరలో ఉన్న అవినీతి, మతిమరుపు అడ్వకేట్. ఓ కేసులో నిందితుడు ఇచ్చిన వంద రూపాయల నోటుకి చిల్లర తెమ్మని పనిమనిషి నరసమ్మకి ఇచ్చి పంపుతాడు. దగ్గరలో కొట్లు మూసేసి ఉండడంతో, దూరంగా ఉన్న కొట్టుకి వెళ్తుందామె. ఈ క్రమంలో ఆ వంద రూపాయల్ని సొంతం చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలు ఆమెలో కలుగుతాయి. ఆలస్యమవడం వల్ల నరసమ్మ ఆ వంద రూపాయలతో పారిపోయిందేమోనని విఠల్, ఆయన భార్య అనుకుంటారు. కాసేపటికి తిరిగొచ్చిన నరసమ్మ చిల్లర ఆయనకిచ్చేస్తుంది. ఆమె కళ్ళల్లో నిజాయితీ కనబడలేదు, ఆయన చిల్లర లెక్కించకుండా తీసుకోలేదు అని ముగిస్తారు కథని.

డబ్బు ఆదా చేసే అలవాటు రాంబాబుది. భార్య సుబ్బలక్ష్మి ఏం కొనమన్నా ఏదో ఒక సాకుతో దాటవేస్తాడు. భర్త ఏ రకంగా ఆదా చేస్తున్నాడో గ్రహించిన సుబ్బలక్ష్మికి నవ్వాగదు. ‘నిధి చాల సుఖమా’ కథ మధ్య తరగతి నిస్సహాయతలపై మందహాసాన్ని వెలయిస్తుంది.

ఎండుపుల్లు ఏరుకోవడానికి తమ తోటలోకి వచ్చిన పేద బాలిక బతకమ్మ నిస్సహాయతని అలుసుగా తీసుకుని తన కోరిక తీర్చుకుంటాడు మోతుబరి కొడుకు. తను ఎండుపుల్లలు ఏరుకుంటే తనని దొంగ అన్న అతన్ని, తన యవ్వన్నాన్ని దోచుకున్నందుకు తాను కూడా దొంగ అనచ్చు గదా అనుకుంటుంది కానీ, పేదరికం, ఇంట్లో తన తెచ్చే ఎండుపుల్లల కోసం ఎదురుచూసే తల్లి గుర్తొచ్చి, మౌనంగా ఉండిపోతుంది. అయినా ఆమెకి కూడా అతనంటే ఆకర్షణ ఉంటుంది. తనకి ఇష్టం లేని సింహాద్రితోనే ఆమె పెళ్ళవుతుంది. పెద మోతుబరి చనిపోతాడు, చిన మోతుబరి యజమాని అవుతాడు. సింహాద్రి వాళ్ళింట్లో పాలేరవుతాడు. పేదరికం శాపంలా ఒక తరం నుంచి మరో తరానికి ఎలా కొనసాగుతుందో ‘దడి’ కథ చెబుతుంది.

తాగుడుకి బానిసైన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిసినదే. బాగా తాగి ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లల మీద కలిగే ప్రేమని భరించడం కష్టం. పిల్లల ఇబ్బందిని గ్రహించలేరు వారు. ఇలాంటి వ్యక్తే రామారావు. బాగా తాగి ఉన్నప్పుడు తమ్ముడి పిల్లలు గుర్తొచ్చి వాళ్ళింటికి వెళ్ళి పిల్లల్ని నిద్ర లేపి మరీ తనకి తోచిన విధంగా ముద్దు చేస్తాడు ‘పసివాడు’. కథలో. తాగుడు మానేయాలని డాక్టర్లు చెప్పినా, ఆరోగ్యం పాడయినా తాగడం మానడు. ఒకసారి అర్ధరాత్రి తమ్ముడింటికి వచ్చి పిల్లల్ని లేపమని అడిగితే, వీల్లేదంటాడు తమ్ముడు. కోపం తెచ్చుకుని అరుస్తాడు రామారావు. ఎవరినైనా పెంచుకోమని బంధువులు సలహా ఇస్తారు. రామారావు దగ్గర జవాబుండదు.

కాలంతో పాటు మనుషులే కాదు, ఊర్లూ మారుతాయి. కొన్ని ఎదిగిపోతే, కొన్ని దిగజారుతాయి. మరికొన్ని ఎదుగుబొదుగూ లేక అలాగే ఉండిపోతాయి. భౌతికంగా తమ ఊర్లో వస్తున్న మార్పులని తెలుసుకోకుండా, ఒక మధుర స్మృతిగా ఆ ఊరి పాత జ్ఞాపకాలను మనసులో నింపుకుని ఊరెళ్ళాలని కోరుకున్న వ్యక్తికి ఆ ఊరు మునుపటిలా లేదన్న వాస్తవం తెలిసి తానిక ఆ ఊరు వెళ్ళలేననుకుంటాడతను ‘మా ఊరెళ్ళాలి!’ కథలో.

“ఉన్నదల్లా ఆకలి, లేనిదల్లా కూలి” అంటూ ముత్యాలు పరిస్థితిని వివరిస్తారు రచయిత ‘వానల్లు కురవాలి’ కథలో. వానలు కురవక, సాగునీరు లభ్యమవక పంటలు పండవు. ముత్యాలు లాంటి వాళ్ళెందరికో ఉపాధి కరువవుతుంది. ఒకసారి విపరీతంగా వాన కురుస్తుంది. పొలానికి పరిగెత్తి గెంతులు వేస్తాడు ముత్యాలు. కానీ కాసేపటికి – కొంతమంది తోటి రైతులు వచ్చి మీ ఇల్లు కూలిపోయిందంటూ అతన్ని ఇంటికి తీసుకెడతారు. ప్రెసిడెంటు గారి గొడ్లసావిడిలో కుటుంబంతో సహా తలదాచుకున్న ముత్యాలు – వానలు కురిస్తే అమ్మోరికి కోడిని ఇస్తానన్న మొక్కు చెల్లించుకోడానికి కోడిని కొనడానికి బయల్దేరుతాడు.

దేముడి లడ్డూ’ కథ సంచిక వెబ్ పత్రికలో 22 ఆగస్టు 2020 నాడు ప్రచురితమైంది. ఇది వ్యంగ్యాత్మక కథ. వినాయక చవితి ఉత్సవాలలో పందిరిలో దేవుడి చేతిలో పెద్ద లడ్డుని ఉంచుతారు. దాన్ని తినాలని ఆశ పడిన గౌరిగాడనే పిల్లాడు కొద్దిగా చిదిమి తింటాడు. మర్నాడు అది గమనించిన పూజారి, అపవిత్రం జరిగిపోయిందంటూ పంచాయితీ పెడతాడు. కలలో వినాయకుడు పూజారికి కనిపించి, “నాకు నైవేద్యం పెట్టింది, నేను తింటానని నమ్మవా?” అంటూ పూజారిని కాలితో తంతాడు. గభాలున మెలకువ వచ్చిన పూజారికి పందిట్లో వినాయకుడు ఎవరినీ ఆశీర్వదిస్తున్నట్లు కనబడతాడు.

జవాబుదారీ’ కథ ఓ మహిళ చిత్రమైన స్థితిని వెల్లడిస్తుంది. భర్త సంపాదిస్తున్నప్పుడు డబ్బు వృథా చేయడం నాన్నకి నచ్చదంటూ కొడుకుని కట్టడి చేస్తుంది. అదే కొడుకు పెద్దవాడై, తండ్రి దుబారా చేస్తున్నాడు, కట్టడి చేయమేమని తల్లిని నిలదీస్తాడు. ఈ కథ సంచికలో ‘జవాబునారీ’ పేరిట 23 డిసెంబరు 2018 నాడు ప్రచురితమైంది.

దురలవాటులో కూరుకుపోతున్న భర్తని మార్చాలని ప్రయత్నించి విఫలమైన భార్య కథ ‘జీవఫలం’. మగాడినన్న అహంతో భార్యపైన జులుం చేస్తాడు ప్రకాశ్. కొన్నాళ్ళు సహించిన శ్రీవల్లి, ఆర్థికంగా తనకో ఆసరా ఉండాలని కోరుకుని – తమ ఎదురింట్లో ఉండే చిత్రకారుడు రామం వద్ద మోడల్‍గా చేసి ఇరవై వేలు సంపాదిస్తుంది. ఆ డబ్బు తీసుకోకూడదంటాడు ప్రకాశ్. భావజాలల ఆట ఇదని అనుకుంటాడు ప్రకాశ్. కథ చదివాకా పాఠకులకి కూడా అదేననిపిస్తుంది.

ఓ బాల కార్మికుడి కథ ‘అనల్ప స్వల్పం’. పదేళ్ళ వయసున్న లచ్చిగాడిని చదువు మాన్పించి ఓ మెకానిక్ షెడ్‍లో పనికి పెడతాడు వాళ్ళ నాన్న. పనిలో చేరిన కొద్ది రోజులకే లచ్చిగాడికి రూపాయి విలువ తెలుస్తుంది. తన జీతం ఎంతో తండ్రిని అడిగితే అతను కసురుకుంటాడు. కానీ షెడ్‍లో తోటిపనివారిని అడిగి తెలుసుకుంటాడు. తను ఆడుకోకుండా పని చేయడం దేనికి అనే ప్రశ్నకి వాడికి సమాధానం దొరకదు. వాడి ఆదాయం స్వల్పమే అయినా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అది అనల్పం కని కథ చెబుతుంది.

కదిలే రాయి అని పిలవబడే ధనవంతురాలైన రేణుకను వివాహం చేసుకోడానికి తిరస్కరిస్తాడు భార్గవ. ధనవంతుడైన శ్రీవాత్సవ తన మిత్రబృందంతో కలిసి భార్గవని పరిశీలిస్తూ ఉంటాడు. శ్రీవాత్సవ భార్గవని స్టడీ చేయడానికి వాళ్ళ ఇంటికి వెడుతుంటే, భర్త అక్కడికి తరచూ వెళ్ళి భార్గవ సోదరి శారదని స్టడీ చేస్తున్నాడని గ్రహిస్తుంది శ్రీవాత్సవ భార్య అలివేణి. రేణుక ఎవరినో పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. భార్గవ పట్టించుకోకపోవడం వల్ల అతని ఇంట్లో అనర్థాలు సంభవిస్తాయి. భార్గవని స్టడీ చేయడం తగ్గిస్తాడు శ్రీవాత్సవ. కొన్నాళ్ళకి భార్గవ ఎవరికీ కనబడకుండా పోతాడు. శ్రీవాత్సవకి ఉద్యోగం ఇచ్చి బెజవాడకి పంపుతారు. ఓ రోజు అక్కడ ఎదురుపడతాడు బార్గవ. తర్వాత ఏమైందో తెలియాలంటే ‘కదలిక’ కథ చదవాలి.

తన తాత నుండి తండ్రికి, తండ్రి నుంచి తనకి వారసత్వంగా వచ్చిన ఆ సైకిల్ అంటే ఆంధ్ర శక్తి పత్రిక ఎడిటర్ శర్మగారికి అభిమానం ఎక్కువ. దాన్ని డొక్కు సైకిల్ అని ఎవరైనా అంటే ఊర్కోడాయన. ఆయన భార్యకి ఆ సైకిల్ అంటే చెడ్డ చిరాకు. దాన్ని ఊరవతలతో ఎక్కడో వదిలేసి రమ్మని సుబ్బన్న అనేవాడికి డబ్బులిచ్చి పంపుతుంది. తీరా శర్మగారు ఆఫీసుకెళ్ళేటప్పటికి వీరన్న అనేవాడొచ్చి ఆ సైకిల్ ఫలానా చోట కనబడిందని, శర్మగారిదని గుర్తించి తెచ్చానని చెప్పి సైకిల్‍ని అప్పగించి వెళ్తాడు. మరోసారి కొడుకు నితేష్‍తో కలిసి ఆ సైకిల్‍ని మాయం చేయడానికి ప్లాన్ వేస్తుంది, కానీ అదీ విఫలమవుతుంది. చివరగా శర్మగారే స్వయంగా ఆ సైకిల్‍కి వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. ‘సైకిల్ సరస్వతి’ కథ ఆసక్తిగా చదివిస్తుంది.

దిగువ మధ్య తరగతి వెతల కథ ‘పర్సులో పులి’. ఆదాయం తక్కువ, ఖర్చులు అధికంగా ఉండే చిరుద్యోగులు జీవితాలకి దర్పణం ఈ కథ. ఒక చిరుద్యోగి పర్సు పోగొట్టుకుంటే, అది దొరికిన మరో చిరుద్యోగి ఆ డబ్బుతో తనకున్న బాకీల్లో ఒకదాన్ని చెల్లిస్తాడు. ఆ దొరికిన పర్సు తన్ మిత్రుడిదే అని తెలిసి గుంభనంగా ఉండిపోతాడు.

కవిగారమ్మాయి అని ముద్రపడిన లక్ష్మి – తన తండ్రి కవి అవడం వలన బడిలో ఇబ్బందులు పడుతుంది. ఆమె ఊహల్లో ఓ ‘అతను’ ఉంటాడు. ఆమె పెరుగుతున్న కొద్దీ అతనూ పెద్దవాడవుతాడు. తండ్రి బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేస్తూ, నువ్వు బాగా చదుకుని ఉద్యోగం తెచ్చుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చెప్తుంటాడు. కొన్నాళ్ళకి లక్ష్మికి అతను ఊహల్లో కనబడడం మానేస్తాడు. లక్ష్మికి పెళ్ళయి, ఓ కొడుకు పుడతాడు. జీవితం ఓ రొటీన్‍లో పడిపోతుండగా, మళ్ళీ అతను లక్ష్మికి కనబడతాడు. మార్మికమైన కథ ఇది.

***

అయితే ఈ కథలు తొలిసారి ఎప్పుడు, ఎక్కడ ప్రచురితమయ్యాయో కథల చివర ఇచ్చి ఉంటే పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేది. ముందుమాటల్లో బహుమతి పొందిన కథలుగా ప్రస్తావించడం వలన రెండు కథలు ఒకటి 1976లో, మరొకటి 1978లో తొలిసారి ప్రచురితమయ్యాయని తెలిసింది. మరో  రెండు కథలు సంచికలోనే ప్రచురితమయ్యాయి కాబట్టి తేదీలు తెలిసాయి. కథలు ప్రచురితమయిన తేదీలు ఇవ్వటం వల్ల పాఠకుడికి ఆ కథాకాలం తెలుస్తుంది. తద్వారా కథలో ప్రస్తావించిన అంశాలను సరిగ్గా అవగాహన చేసుకోగలుగుతాడు. కథలు ప్రచురితమయిన తేదీల ద్వారా విశ్లేషకులు రచయిత మానసిక పరిణతి  పరిణామక్రమాన్ని అంచనా వేయగలుగుతారు.  కాలాన్ని బట్టి  మారుతున్న రచయిత దృక్కోణం తెలుస్తుంది.

లోపం అని అనలేము కానీ, విషయసూచికలో చివరి రెండు కథల పేర్లు లేవు. కొన్ని కథలకు – బహుశా తొలిసారి పత్రికలలో ప్రచురితమైనప్పుడు చిత్రకారులు గీసిన చిత్రాలను ఉపయోగించడం బావుంది.

ఈ కథలన్నీ చదివిస్తాయి, ఆలోచింపచేస్తాయి, కళ్ళు చెమరింప చేస్తాయి. కొన్ని దశాబ్దాల క్రితం నాటి సమాజాన్ని కళ్లకు కడతాయి. ఈ కథలు చదివాకా, “తాను ఎన్నుకున్న వస్తువుని సహజమనిపింపజేస్తూ దానికి రక్తమాంసాలే గాక ప్రాణం పోయడం కూడా శాస్త్రికి తెలుసు” అన్న విహారి గారి మాటలు అక్షరసత్యాలనిపిస్తాయి.

***

పురాణం శ్రీనివాసశాస్త్రి కథలు (కథాసంపుటి)
రచన: పురాణం శ్రీనివాసశాస్త్రి
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పుటలు: 184
వెల: ₹ 150/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643, 8121098500
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=984&BrandId=299&Name=Puranam-Srinivasa-Sastry-Kathalu
https://www.amazon.in/Puranam-Srinivasa-Sastry-Kathalu-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF/dp/B0B3J7H14Z

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here