[dropcap]రా[/dropcap]త్రంతా ఆకాశాన్ని
కాపలా కాసిన నక్షత్రాలు కనబడటం లేదు
వెలుగు ఎలుగు దాడి చేసినట్టుంది
పారిపోయి ఎక్కడెక్కడ దాక్కున్నాయో
కోడి గొంతులో ఏదో ఇరుక్కునట్లుంది
కొక్కొరొక్కో అంటూ పొద్దు పొద్దున్నే
గొంతులోది కక్కేందుకు ప్రయత్నం చేస్తోంది
గోడెక్కి.. ఇల్లెక్కి
గూడు విసిరిన వలలో
నిన్నటి సాయంత్రం చిక్కుకున్న పక్షులు
రాత్రంతా కష్టపడి కట్లు తెంచుకున్నట్టున్నాయి
కాళ్ళను తాటించి.. రెక్కలు అల్లార్చుకుని
కొత్త రోజును వెతుకుతూ వెళుతున్నాయి
అలసట అంగట్లో నలిగి మలినమైన
నిన్నటి శరీరాన్ని.. మనసునీ
రాత్రంతా ఉత్సాహం పెట్టి ఉతికి
ఉదయపు పెరట్లో ఎవరో ఆరవేసినట్టున్నారు
బాధ్యతల దండెం మీద మెరిసిపోతోంది
కొత్త బిచ్చగత్తెలాగుంది వెలుతురు
పొద్దెరకుండానే ఇళ్ళముందుకొచ్చి
లేవండి లేవండని, ఆపకుండా అరుస్తోంది
కళ్ళమూతలకు వేసిన తాళాలు
ఇంకా తీయలేదని అంటున్నా వినకుండా
తూరుపు తెర తొలగించుకుని
మెల్లమెల్లగా అడుగులేసే ఉదయపు దృశ్యం
ఇలాగే ఉంటుంది కదా..! నీకైనా, నాకైనా..?
అది, నీకాడైనా..? నాకాడైనా..?