[dropcap]శ్రీ [/dropcap]రమణ మహర్షి 1910వ సంవత్సరంలో విరూపాక్ష గుహలో ధ్యానం చేసుకునే రోజులలో ఒక సంఘటన జరిగింది.
గుహలో పైభాగాన వున్న ఒక గూడు నుండి ఒకరోజు ఒక ఉడుత పిల్ల జారి కిందపడింది. అప్పుడు మహర్షి లేచి దానిని జాగ్రత్తగా తన చేతులలో తీసుకొని కాస్తపాటి సపర్యలు చేసి తిరిగి భద్రంగా దానిని గూడులో వుంచారు. కొంతసేపటి తర్వాత ఆ ఉడుత పిల్ల తిరిగి కింద పడింది. తిరిగి భగవానులు దానిని తీసి సురక్షితంగా యథాస్థానంలో వుంచారు. ఈ సంఘటన సుమారుగా అయిదారు సార్లు జరిగింది. అన్నిసార్లు ఆయన దానిని జాగ్రత్తగా దాని స్థానంలో వుంచుతునే వస్తున్నారు. తర్వాత ఆ ఉడుత స్థిరపడి తన స్థానంలో సురక్షితంగా వుండసాగింది.
ఈ ఘటనపై భగవానులు స్పందిస్తూ “మానవ మనస్సుల ప్రవర్తన కుడా ఈ ఉడుతతో పోలివుంటుంది. కాస్తపాటి కలత చెందినా ఉడుతలాగే జారిపోతూ ఊర్ధ్వముఖం నుండి అధోబాటకు పయనిస్తూ వుంటుంది. జీవితంలో ఒక సద్గురువును త్రికరణశుద్ధిగా ఆశ్రయిస్తే ఆయనే సురక్షితంగా యధాస్థానానికి చేరుస్తాడు. అయితే చిత్తశుద్ధి, అచంచల విశ్వాసం, పవిత్రమైన ప్రేమలతో మనస్సును ప్రయత్నపూర్వకంగా సద్గురువు పాదాల చెంత నిలపడమే మన కర్తవ్యం” అన్నారు.
మన మనసును నియంత్రించడం అంటే మన మనస్సును మనం సంపూర్ణంగా జయించడమే అని అర్థం. అప్పుడు ఈ ప్రపంచంలో మనం అంటూ సాధించవలసినవి అంటూ ఏమి ఉండవు. అన్నీ కేవలం జరిగిపోవడం అన్నవి మాత్రమే ఉంటాయి. పైగా మనస్సును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయించినవాడి కంటే గొప్పవాడు అని మన పెద్దలు చెప్పిన మాట. ఎందుకంటే మన హృదయంలో భగవంతుని దివ్య దర్శనం అనే ఒక మహోన్నత లక్ష్యాన్ని దూరం చేసే మొదటి శత్రువు ఇదే కనుక. కాబట్టి మనస్సును జయిస్తే అదే మనకు మిత్రువు అవుతుంది. అదే మనసు అప్పుడు నీకు భగవంతుని దివ్య దర్శనానికి సహకరిస్తుంది. దీనిని బట్టి ఆలోచిస్తే మన లక్ష్య దిశగా ఆలోచిస్తే జయించడం మాత్రమే ఉత్తమోత్తమమైనది.
భగదవద్గీతలో మనస్సుకు సంబంధించిన ఒక చక్కని శ్లోకం వుంది.
‘యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరమ్
తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్!!’
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశిస్తూ “చంచల స్వభావం, నిలకడలేనిదైన మనస్సు ఎక్కడెక్కడ తిరుగుతుందో, అక్కడ నుండి తీసుకువచ్చి, ఆత్మ యందే స్థిరం చేయాలి” అని వివరించారు.
మనస్సును నియంత్రించడానికి పతంజలి మహర్షి అనేక సాధనలకు తన యోగసూత్రాలలో వివరించారు. వాటిలో ముఖ్యమైనవి ఏకాగ్రతతో ధ్యానం చేయడం, సాత్వికాహారాన్నే మితంగానే భుజించడం, భక్తి- వైరాగ్య భావనలను అలవరచుకోవడం, ఆధ్యాత్మిక చింతన కలిగి వుండడం, కోరికలను త్యజించడం మరియు ఇంద్రియ నిగ్రహం క్రమ క్రమంగా సాధించడం.