మరుగునపడ్డ మాణిక్యాలు – 47: డెసిషన్ టు లీవ్

6
3

[dropcap]2[/dropcap]022లో విడుదలైన కొరియన్ చిత్రం ‘డెసిషన్ టు లీవ్’ కాన్ చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడి అవార్డు గెలుచుకుంది. ఆస్కార్ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నామినేట్ అవుతుందని ఆస్కార్ పండితులు అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. దాంతో ఈ చిత్రం కాస్త మరుగునపడిందనే చెప్పాలి. మూబీలో అందుబాటులో ఉంది. హిచ్‌కాక్ చిత్రాలను ప్రేమించేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. హిచ్‌కాక్ చిత్రాలలో ఏదో ఒక ముఖ్యపాత్రలో ఒక అబ్సెషన్ ఉంటుంది. ఎవరినో ఇష్టపడి పొందలేక వారి ఆలోచనల్తో సతమతమవటం, లేక ఏదో చూసి అర్థం కాక అదేమిటో తెలుసుకోవాలని తహతహలాడటం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ చిత్రంలో అలాంటి ధోరణి విపరీతం అయితే ఎలా ఉంటుందో చూపించారు. ఈ కథ ఇంతకు ముందు చూసినట్టే ఉంటుంది కానీ చివరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దర్శకుడు పార్క్ చాన్-వుక్ ‘ఓల్డ్ బాయ్’, ‘ద హ్యాండ్ మెయిడెన్’ చిత్రాల ద్వారా ఖ్యాతి గడించాడు. ఈ చిత్రం అతనికి మరింత పేరు తెచ్చింది. ‘డెసిషన్ టు లీవ్’ అంటే ఇక్కడ ‘విడిపోవాలని’ అనే అర్థం వస్తుంది. తెలుగులో ‘కలుసుకోవాలని’ అనే చిత్రం వచ్చింది. కొరియన్ చిత్రాల సరళికి తగ్గట్టే ఈ చిత్రం పేరు ‘విడిపోవాలని’. కలుసుకోవటం ఎంత కష్టమో ఒక్కోసారి విడిపోవటం, విడిపించుకోవటం కూడా అంతే కష్టం.

హే-జున్ బుసాన్ నగరంలో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్. అతని భార్య ఇపో అనే పట్నంలో పని చేస్తూ ఉంటుంది. వారు వారానికి ఒకసారి మాత్రమే కలుస్తారు. అతను పరిష్కారం కాని కేసుల గురించి ఆలోచిస్తూ ఉండటంతో నిద్రలేమితో బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు కొత్త కేసు వస్తుంది. ఒక రిటైర్డ్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒక కొండ మీద నుంచి పడి మరణించిన కేసు అది. హే-జున్, అతని సహచరుడు మృతుడి భార్య సియో-రే ని ప్రశ్నిస్తారు. ఆమెది చిన్న వయసే. అందమైనది. చైనా నుంచి కొరియాకి వచ్చింది. వృధ్ధులకి సేవలందించటం ఆమె ఉద్యోగం. ఆమెకి భర్త చనిపోయాడనే బాధ ఉండదు. అతను తనని కొట్టేవాడని అంటుంది. అతను చనిపోయాడంటే ఆశ్చర్యం లేదని, అతనికి కొండలెక్కటం ఇష్టమని, అతను కొండలెక్కటానికి వెళ్ళినప్పుడల్లా తాను భయపడేదానినని అంటుంది. హే-జున్ సహచరుడికి ఆమె మీదే అనుమానం. ఆమె విచారణ సమయంలో అప్పుడప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ ఉంటుంది. తనకి కొరియన్ భాష సరిగా రాదని అంటుంది. గ్రాంథికంగా మాట్లాడితే వీళ్ళు వింతగా చూస్తారు. అది చూసి అమె ఇబ్బందిగా నవ్వుతుంది. భర్త పోయినా అలా నవ్వుతోందని హే-జున్ సహచరుడు ఆమే భర్తని కొండ పై నుంచి తోసి ఉంటుందని అంటాడు. కానీ ఆమె భర్త మరణించే సమయానికి ఒక వృధ్ధురాలి ఇంటిలో పని చేస్తున్నట్టు తేలుతుంది. ఆమె ఏజెన్సీ వాళ్ళు తమ ఉద్యోగులు పనికి వెళ్ళారో లేదో అని రోజూ ఉదయం వారు సేవలందించే వృధ్దులకి ఫోన్ చేస్తారు. ఈమె భర్త మరణించే సమయానికి కొంచెం ముందు ఈమె సేవలందించే వృధ్ధురాలి ఫోన్‌కి కాల్ చేస్తే ఈమే తీసింది. పైగా తనకి ఎత్తైన ప్రదేశాలంటే భయమని అంటుంది.

సియో-రే ని చూడగానే హే-జున్ ని ఆమె అందం ఆకర్షించింది. ఆమె నవ్వుతూ ఉంటే అతనికి అమాయకత్వంలా కనిపిస్తుంది. “నేను చచ్చిపోతే నా భార్య కూడా ఆశ్చర్యపడదేమో. పోలీసుని పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది అంటుంది” అంటాడు తన సహచరుడితో. సియో-రే పనిచేసే వృద్ధురాలి ఇంటి దగ్గర మాటువేసి బైనాక్యులర్స్ ద్వారా కిటికీ లోనుంచి ఆమెని గమనిస్తారు. ఆమె నవ్వుతూ వృద్ధురాలికి సేవ చేస్తూ ఉంటుంది. ఆమె భర్తకి శవపరీక్ష చేశాక అతని గోళ్ళ కింద ఆమె చర్మం ఆనవాళ్ళు ఉన్నాయని తెలుస్తుంది. ఆమెని ప్రశ్నిస్తే అతను కోపంతో తనను గోళ్ళతో గీరాడని చెబుతుంది. ఆమె గతం తవ్వితే ఆమె అక్రమంగా కొరియాలో ప్రవేశించిందని, అయితే ఆమెని వెనక్కి పంపలేదని తెలుస్తుంది. ఆమె తాత మంచూరియాలో కొరియన్ విముక్తి సైన్యంలో పని చేయటం వల్ల తనకి ప్రత్యేక ప్రవేశం లభించించదని, తనకి సాయం చేసిన అధికారినే పెళ్ళి చేసుకున్నానని చెబుతుంది. తన కథ విని కన్నీళ్ళు పెట్టుకున్న ఏకైక కొరియన్ వ్యక్తి అతనేనని అంటుంది.

హత్య కేసులో అనుమానితుల పట్ల ఆకర్షితులైన పోలీసులు, లాయర్ల కథలు హాలీవుడ్‌లో ఇంతకు ముందే వచ్చాయి. ‘బేసిక్ ఇన్స్టింక్ట్’ లో పోలీసు అనుమానితురాలి ఆకర్షణలో పడతాడు. ‘జాగెడ్ ఎడ్జ్’ లో మహిళా లాయరు తన క్లయింటు ఆకర్షణలో పడుతుంది. ఈ చిత్రంలో సియో-రే ఆకర్షణలో హే-జున్ పడతాడు. పెళ్ళయినవాడు ఇలా ఆకర్షణలో పడితే ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది తాత్కాలికమైన ఆకర్షణే, నేనేమీ హద్దులు దాటటం లేదు కదా అంటే అంతకంటే పెద్ద ఆత్మవంచన ఉండదు. మళ్ళీ మళ్ళీ కలవటం వల్ల ఆ ఆకర్షణే పెద్దదవుతుంది. భార్య దూరంగా ఉంది కదా అని సమర్థించుకోవచ్చు. భార్య దూరంగా ఉంటే ఆమెకి అన్యాయం చేసే అనుమతి దొరికినట్టేనా? అసలు భార్యాభర్తలు దూరంగా ఉండటం ఏమిటి? ఆధునిక సమాజంలో ఇదొక జాడ్యం అయిపోయింది. ఎవరి ఉద్యోగాలు వారివి, ఎవరి పంతాలు వారివి. బదిలీ అవకాశాలు చూసుకోవాలి. లేదా వేరే ఉద్యోగాలు చూసుకోవాలి. అవసరమైతే ఉద్యోగం మానేయాలి. భార్యే మానేయాలి అని ఎక్కడా లేదు. భర్త కూడా మానేయవచ్చు. అసలు విషయం ఏమిటంటే ఈ భార్య మీద వ్యామోహం తగ్గింది. రేపు ఆ రెండో స్త్రీ మీద కూడా వ్యామోహం తగ్గవచ్చు. దీనికి అంతు ఎక్కడ? సర్దుకుపోవటం నేర్చుకోవాలి. అసలు హే-జున్ ఈ కేసుని వేరేవారికి అప్పగించేస్తే సమస్య ఉండదు. కానీ మనిషి అలా ఆలోచించడు. మనసుకి లొంగిపోతాడు. ఈ చిత్రంలో ఆకర్షణ అనుకోని విధంగా పరిణామం చెందుతుంది.

అతని సహచరుడు “ఆమె అందంగా ఉంది కాబట్టి అమెని అరెస్టు చేయకుండా వదిలేశావు” అంటాడు. “అందంగా ఉందని, పరాయి దేశం నుంచి వచ్చిందని ఆమె నేరస్థురాలు అయిపోతుందా? సీసీ టీవీలో ఆమె వృద్ధురాలి ఇంటికి వెళ్ళటం, రావటం రికార్డయింది” అంటాడు హే-జున్. “ఆమె మీద నిఘా పెట్టొచ్చుగా. నీకు నిఘా చేయటం అలవాటేగా” అంటాడు సహచరుడు. హే-జున్ స్వయంగా నిఘా చేస్తాడు. రాత్రి వేళ పక్కనున్న భవంతి పైనుంచి ఆమె అపార్ట్మెంట్ లోకి చూస్తాడు. ఆమె టీవీ చూస్తుంది. కేవలం ఐస్ క్రీమ్ మాత్రమే తింటుంది. టీవీ చూస్తూ పక్కకి ఒరిగి పడుకుంటుంది. ఆమెని చూసి అతను జాలిపడతాడు. అతను ఆమెకి పూర్తిగా ఆకర్షితుడయ్యాడని చెప్పటానికి దర్శకుడు వాడిన పద్ధతి ఏమిటంటే ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నా, దూరం నుంచి నిఘా చేస్తున్నా అతను ఆమె దగ్గరే ఉన్నట్టు చూపించటం. ఆమె వంక ఆరాధనగా చూడటం. నిఘా చేసినపుడు ఆమె పడుకున్నాక అతను ఆమె బిల్డింగ్ బయటే కారులో పడుకుంటాడు. మామూలుగా నిద్రపట్టక బాధపడే అతను ఆమె ఆలోచనలతో ఆదమరచి నిద్రపోతాడు. ఆమె ఒకరోజు ఉదయం ఉద్యోగానికి వెళుతూ అతన్ని కారులో పడుకుని ఉండగా చూస్తుంది. ఫోటో తీసుకుంటుంది. ఫ్లాష్ వెలుగుకి అతను లేస్తాడు. ఆమె నవ్వుతూ పలకరిస్తుంది. ఆ రోజంతా అతనికి గాలిలో తేలినట్టుంటుంది. ఆమె రోజూ ఒక పిల్లికి తిండి పెడుతూ ఉంటుంది. ఆ పిల్లి కాకులని చంపుతుంది. ఆమె పిల్లితో చైనీస్ భాషలో ఏదో అంటుంది. అతను చాటుగా తన స్మార్ట్ వాచ్‌లో రికార్డ్ చేసుకుని అనువాదం వింటాడు. “కాకులని పట్టుకోవటం మానేసి ఆ ఇన్‌స్పెక్టర్ తల పట్టుకు రా” అని ఆ మాట అర్థం. విని నవ్వుకుంటాడు. ఆమె అలా అనటంలో ఉద్దేశం ఏమిటి? అతను చనిపోవాలని అమె కోరుకుంటోందా? అంటే ఆమె నేరం చేసిందా? అతను ఇలా ఆలోచించడు. ఆమె మోజులో తలమునకలై ఉంటాడు.

పరిశోధనలో ఇంకో విషయం తెలుస్తుంది. ఆమె చైనాలో తన తల్లిని చంపేసింది. తిరిగి చైనా వెళితే ఆమెకి మరణశిక్ష అమలు చేయాలని ఆదేశించిన ఒక పత్రం దొరుకుతుంది. హే-జున్ కి మతిపోయినట్టుంటుంది. ఆ పత్రం ఆమెకి ఫోన్‌లో పంపించి వివరణ అడుగుతాడు. ఆమె అతన్ని ఇంటికి రమ్మంటుంది. అతను వారాంతంలో ఇంటికి వచ్చిన తన భార్యని కూడా వదిలేసి హుటాహుటిన ఆమె ఇంటికి వెళతాడు. దారిలోనే ఎలెక్ట్రిక్ షేవర్‌తో గడ్డం గీసుకుంటాడు. ఆమెకి అందంగా కనపడాలని అతని ప్రయత్నం. ఒకవైపు ఆమెపై అనుమానం, ఇంకో వైపు ఆకర్షణ. ఇదే అబ్సెషన్. ఒకరకమైన పిచ్చి. అదే అతను తొలిసారి ఆమె ఇంటిలోకి ప్రవేశించటం. ఆమె అతనికి తన కథ చెబుతుంది. తన తల్లి అనారోగ్యంతో మంచంలో ఉండటంతో ఆమెని చూసుకోవటానికి నర్సు శిక్షణ పొందానని చెబుతుంది. తల్లి బాధ చూడలేక ఆమె కోరిక మీద ఆమెని ఫెంటనిల్ మాత్రలతో చంపేశానని అంటుంది. చనిపోయేముందు ఆమె తల్లి “మీ తాత సొంత ఊరు కొరియాలో ఉంది. అక్కడ ఒక కొండ మీ తాతదే. అక్కడికి వెళ్ళి మీ తాత చితాభస్మం అక్కడ వెదజల్లు” అంటుంది. అందుకని సియో-రే కొరియాకి వచ్చింది. ఆమె ఇంకో విషయం కూడా చెబుతుంది. తన భర్తకి బ్లాక్‌మెయిల్ ఉత్తరాలు వచ్చాయని ఆ ఉత్తరాలు చూపిస్తుంది. అతను అక్రమంగా పౌరసత్వం ఇవ్వటానికి చాలామంది దగ్గర లంచాలు తీసుకున్నాడని, ఆ సంగతి బయటపెడతానని ఆ ఉత్తరాల సారాంశం. అతను అప్పటికే పదవీవిరమణ చేశాడు. కానీ అప్పుడప్పుడూ ఇమిగ్రేషన్ విభాగానికి ఇంటర్వ్యూలలో సహాయం చేస్తూ ఉండేవాడు. హే-జున్ ఇమిగ్రేషన్ విభాగానికి వెళ్ళి అక్కడి అధికారిని ప్రశ్నిస్తాడు. అతని దగ్గర అప్పటికే సియో-రే భర్త రాసిన ఉత్తరం ఉంటుంది. అందులో “నా మీద తప్పుడు ఆరోపణలు వచ్చాయి. నేను నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని నా ప్రతిష్ఠని కాపాడుకుంటాను” అని ఉంటుంది. ఇది ఆత్మహత్య చేసుకునే వ్యక్తి రాసిన ఉత్తరంలా ఉంటుంది. ఆ అధికారి “ఆయన ఒకప్పుడు నా పై అధికారి. ఆయన పేరు బురదలోకి లాగటమెందుకని నేను ఈ ఉత్తరం బయటపెట్టలేదు. క్షమించండి” అంటాడు. ఆత్మహత్య అని నిర్ధారణ చేసి కేసు మూసేస్తారు.

హే-జున్ సహచరుడు అది ఆత్యహత్య అంటే నమ్మడు. “నువ్వే ఒకసారి అన్నావు కదా.. చంపటమంటే సిగరెట్లు కాల్చటం లాంటిది. మొదటిసారే కష్టం. ఆ తర్వాత సులువైపోతుంది” అంటాడు. అంటే ఆమె తన తల్లిని చంపింది కాబట్టి మరో హత్య చేయటం ఆమెకి కష్టం కాదని అతని అభిప్రాయం. ఆమె భర్త ఆమెని కొట్టేవాడు. మరి ఆమె పోలీసుల దగ్గరకి ఎందుకు వెళ్ళలేదు? పోలీసుల దగ్గరికి వెళితే ఆమెని తిరిగి చైనా పంపేస్తారని ఆమె భర్త ఆమెని భయపెట్టాడు. ఆమే హత్య చేసిందని ఆ సహచరుడి గట్టి నమ్మకం. తాగి ఆమె ఇంటికి వెళ్ళి ఆమెని బెదిరిస్తాడు. “మా ఇన్‌స్పెక్టర్ అమాయకుడనుకుంటున్నావా? ఈసారి తప్పించుకున్నావు. నీ తర్వాతి మొగుడ్ని చంపినప్పుడు తప్పకుండా పట్టుకుంటాడు. జాగ్రత్త” అంటాడు. హే-జున్ ఆమెని సముదాయిస్తాడు. ఇప్పుడు ఆమె మీద అనుమానం లేదు కాబట్టి ఆమెకి చేరువ కావచ్చని అతని ఆలోచన. అనుకున్నట్టే ఇద్దరూ చేరువవుతారు. అతను “పిల్లిని నా తల పట్టుకు రమ్మని ఎందుకు అన్నావు?” అని అడుగుతాడు. “నేను తల అనలేదు, గుండె అన్నాను” అంటుందామె. అతను సంతోషిస్తాడు. అయితే కథ మలుపులు తిరిగి ఆమె తర్వాత ఇంకో పెళ్ళి చేసుకుంటుంది. ఆ భర్త హత్యకు గురవుతాడు! అదే ఈ చిత్రంలోని ఊహించని పరిణామం. వారిద్దరూ ఎందుకు విడిపోయారు? ఆమె అతన్ని ప్రేమించలేదా? హే-జున్ పిచ్చి ప్రేమ ఎక్కడికి దారి తీసింది?

 

చిత్రంలో కొన్ని దృశ్యాలు, కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి. అతను ప్రశ్నిస్తున్నప్పుడు ఒకసారి “మీరు ఎవరింటిలోకో చూస్తూ ఉంటారని మీ భార్యకి తెలుసా?” అని సియో-రే అంటుంది. తర్వాత ఒకసారి వేరే కేసు గురించి మాట్లాడుతున్నపుడు “కొరియాలో ఒకవేళ ప్రేమించిన మనిషికి ఇంకొకరితో పెళ్ళి అయిపోతే ప్రేమ అంతమయిపోతుందా?” అంటుంది. ఇలా అతన్ని కవ్విస్తూ ఉంటుంది. ఒకసారి అతను శవాలని పురుగులు ఎలా తింటాయో ఆమెకి చెబుతూ ఉంటాడు. ఓపక్క వంట చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను వండే పదార్థాన్ని చూపిస్తాడు దర్శకుడు. ఇది కొంచెం వింతగా ఉంటుంది కానీ ‘అన్నం మనం తింటాము, అన్నం మనల్ని తింటుంది’ అనే శాస్త్రవాక్యం గుర్తొస్తుంది. మనం తినే అన్నమే మన శరీరపు వృధ్ధికి, క్షయానికీ కూడా కారణం. మరణించిన తర్వాత ఈ శరీరం పురుగులకి ఆహారమైపోతుంది. ఈ విషయాలు మననం చేసుకుంటూ ఉంటే శరీరం మీద వ్యామోహం తగ్గుతుంది. ఇంకో సందర్భంలో హే-జున్ తాబేళ్ళ అక్రమ రవాణా ఆపటానికి ప్రయత్నించినపుడు ఒక తాబేలు అతని చేతి వేలు కరిచిపట్టుకుని వేలాడుతుంది. ఎంతకీ వదలదు. అతను బాధతో ఆరుస్తాడు. అతను ఎంత మానసిక హింసకి గురవుతున్నాడో ఇలా చూపించాడు దర్శకుడు. చిత్రమంతా ఇలాంటి సన్నివేశాలతో ఆలోచనలు రేకెత్తిస్తుంది. హే-జున్ గా పార్క్ హే-ఇల్, సియో-రే గా ట్యాంగ్ వే నటించారు. ఇద్దరూ అద్భుతంగా నటించారు. ప్రేమ, ఆకర్షణ, దు:ఖం ఇద్దరి ముఖాల్లో అద్భుతంగా పలికాయి.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూసే అవకాశం ఉన్నవారు చిత్రం చూడమని గట్టిగా కోరుతున్నాను. అబ్సెషన్ అంటే ఎలా ఉంటుందో కొత్త కోణంలో చూపించాడు దర్శకుడు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

హే-జున్ ఇంట్లో అతని కేసులకి సంబంధించిన ఫోటోలు ఒక గోడ మీడ అతికించి ఉంటాయి. వాటి వల్లే అతనికి సరిగా నిద్ర రావట్లేదని సియో-రే అంటుంది. మూసేసిన కేసుల ఫోటోలు తీసేస్తే మంచిదని అంటుంది. అప్పుడే ముగిసిన కేసుతో పాటు తన కేసు ఫోటోలు కూడా తీసి తగలబెట్టేస్తుంది. అతని ఫోన్లో తన కేసుకి సంబంధించి అతను రికార్డు చేసుకున్న మాటలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఆమె తొలగిస్తుంది. అతను తన భయాలు ఆమెతో పంచుకుంటాడు. హత్య జరిగిన చోట రక్తం ఎక్కువ ఉంటే తాను ఆ వాసన భరించలేనని అంటాడు.

అతని భార్య ఇంట్లో ఉన్నప్పుడు అతనికి నిద్రపట్టదు. ఒకరోజు అతను తెల్లవారుజామునే బయటకు వచ్చి సియో-రేతో ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఆమె హాస్పిటల్లో ఒక పేషెంటు దగ్గర ఉంటుంది. ఆరోజు వెళ్ళవలసిన వృధ్ధురాలి దగ్గరకి వెళ్ళే వీలుండదు ఆమెకి. అతను ఆమె బదులు ఆ వృధ్ధురాలి దగ్గరకి వెళతాడు. ఆమె దగ్గర ఉన్న ఫోన్ సియో-రే ఫోన్ లాగే ఉంటుంది. ఆమెకి ఏమీ సరిగా గుర్తుండదు. ఫోన్లో పాట రావట్లేదని ఆమె అంటే అతను చూస్తాడు. చాలా యాప్‌లు తెరిచి ఉంటాయి. అన్ని యాప్లు తెరిచి ఉండకూడదని అతను ఒక్కొక్కటి మూసేస్తాడు. ఒక యాప్ ఎంత దూరం నడిచామో, ఎంత పైకి ఎక్కామో చూపిస్తుంది. అందులో ఒకరోజు ఆమె 138 అంతస్తులు ఎక్కినట్టు చూపిస్తుంది. ఆ ముసలావిడ కదలలేని స్థితిలో ఉంటుంది. హే-జున్ కి అనుమానం వస్తుంది. అతను సియో-రే భర్త చనిపోయిన కొండకి వెళతాడు. పైకి ఎక్కుతాడు. అది 138 అంతస్తులు ఉన్నట్టు అతని ఫోన్లో యాప్ చూపిస్తుంది! సియో-రే తన ఫోన్ వృద్ధురాలి ఇంట్లో పెట్టి ఆమె ఫోన్ తీసుకుని ఇంటి వెనక నుంచి (సీసీ టీవీలో పడకుండా) వెళ్ళి కొండ ఎక్కి తన భర్తని తోసేసింది అని అతనికి అర్థమవుతుంది. వృద్ధురాలి ఫోన్ సియో-రే దగ్గర ఉంది కాబట్టి ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేసినపుడు తాను వృధ్ధురాలి ఇంట్లోనే ఉన్నట్టు చెప్పిందన్నమాట. హే-జున్ కొండ ఎక్కిన దృశ్యాలు, సియో-రే కొండ ఎక్కిన దృశ్యాలు కలిపి దర్శకుడు తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక్కడ సంగీతం, ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంటాయి. బ్లాక్‌మెయిల్ ఉత్తరాలు కూడా ఆమే రాసింది. అయితే తన భర్త లంచాలు తీసుకున్న విషయం మాత్రం నిజమే అంటుంది. ఇమిగ్రేషన్ ఆఫీసుకి రాసిన ఉత్తరం కూడా ఆమె రాసింది. ఇదంతా అర్థమై అతను హతాశుడవుతాడు.

“కేసుకి సంబంధించిన ఫోటోలు తగలబెట్టి, మాటలు ఫోన్లో నుంచి తొలగించి నాకేదో ఉపకారం చేసినట్టు నటించావు. ఏ సాక్ష్యాలు లేకుండా చేశావు. ఒక ఆడదాని వ్యామోహంలో పడి దర్యాప్తుని పాడు చేశాను. నా పనితీరు పట్ల నాకు ఎంతో గర్వంగా ఉండేది. నీవల్ల నేను పూర్తిగా ధ్వంసమయ్యాను. ముసలావిడకి నేను కొత్త ఫోన్ కొన్నాను. ఆమె పాత ఫోన్ ఇదిగో. సముద్రంలో పారేయ్. ఎవరికీ దొరక్కుండా” అని వెళ్ళిపోతాడు. ఆమె నేరం చేసిందని తెలిసి కూడా ఆమెని అరెస్టు చేయకుండా వదిలేస్తాడు. అతని మాటలన్నీ ఆమె రికార్డు చేసుకుంటుంది. ఆమె స్వార్థంతో సాక్ష్యాలు లేకుండా చేసిందని అతను అన్నప్పుడు ఆమె తమ బంధం గురించి అలా అనవద్దని అంటుంది. చివరికి కన్నీరు పెట్టుకుంటూ ఉండిపోతుంది. తర్వాత ఆమె ఒక సందర్భంలో “నువ్వు నన్ను ప్రేమించానని చెప్పినపుడే నీ ప్రేమ ముగిసింది. నా ప్రేమ మొదలయింది” అంటుంది. “నేనెప్పుడు నిన్ను ప్రేమించానని చెప్పాను?” అంటాడతను. ఆమె నేరం చేసినట్టు ఆధారం ఉన్న ఫోన్ అతను పారేయమనటం అతని ప్రేమకి పరాకాష్ఠ అని ఆమె ఉద్దేశం. ఆ క్షణమే ఆమె అతన్ని నిజంగా ప్రేమించటం మొదలుపెట్టింది. ఇక ఆమె అబ్సెషన్ మొదలవుతుంది. ఆమె కొత్త భర్తని ఆమే చంపిందా? లేక ఇద్దరూ కలిసి చంపేశారా? ఏం జరిగిందనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

హే-జున్ తన భార్య ఉద్యోగం చేసే పట్నానికి బదిలీ అయి వెళ్ళిపోతాడు. ఆ బదిలీ ఏదో ముందే చేయించుకుని ఉంటే బావుండేవాడేమో. ఇప్పుడు కుంగుబాటులో ఉంటాడు. రకరకాల చికిత్సలు తీసుకుంటూ ఉంటాడు. ఒక ఏడాది గడిచిపోతుంది. ఒకరోజు భార్యతో బజారులో ఉండగా సియో-రే తన కొత్త భర్తతో అక్కడికి వస్తుంది. ఆమెని చూసి హే-జున్ నిర్ఘాంతపోతాడు. “నేను ఈ ఊరికి వచ్చేశాను” అని ఆమె అంటే అతను పుసుక్కున “ఎందుకు?” అంటాడు. అతని భార్య, ఆమె భర్త అతన్ని వింతగా చూస్తారు. చిత్రంలో అక్కడక్కడా హాస్యం ఉన్నా ఈ సన్నివేశంలో పుట్టిన హాస్యం గుర్తుండిపోతుంది. “ఈ నగరంలో ఏముంది అనే నా ఉద్దేశం” అంటాడతను. అందరూ కాసేపు మాట్లాడుకుంటారు. సియో-రే భర్త తన బిజినెస్ కార్డు ఇస్తాడు. అతను స్టాక్ మార్కెట్ అనలిస్ట్. అతని ద్వారా చాలామంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. తర్వాత అతను హత్యకి గురవుతాడు. ఆ కేసు హే-జున్ కే వస్తుంది. అతను ఆమె దగ్గరకి వెళ్ళి “ఇందుకేనా ఈ ఊరికి వచ్చావు? నేను అంత మెతకగా కనిపిస్తున్నానా?” అని కోపంగా అడుగుతాడు. “నేనంత రాక్షసిలా కనిపిస్తున్నానా?” అని ఆమె అంటుంది. “ఈసారి నీ ఎలిబీ పకడ్బందీగా లేకపోతే నీ పని అయిపోయినట్టే” అని అతను వెళ్ళిపోతాడు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

సియో-రే బజారులో హే-జున్ ని కలిసే ముందే సా అనే అతను సియో-రే ఇంటికొచ్చి ఆమె మీద దాడి చేస్తాడు. ఆమె భర్త సా తల్లి దగ్గరున్న వేలకొలదీ డాలర్లు పెట్టుబడి పెట్టి అంతా పోగొట్టాడు. సా తల్లి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. సరైన వైద్యం చేయించటానికి డబ్బులు లేవు. అందుకని సా కి సియో-రే భర్త మీద కోపం. “మా అమ్మ చనిపోతే నీ భర్తని చంపేస్తాను” అంటాడు. హత్య జరిగిన తర్వాత సియో-రే ని ప్రశ్నిస్తాడు హే-జున్. ఆమె భర్త “సంపాదించాలంటే సంపన్నంగా కనిపించాలి” అని ఒక పెద్ద ఇంట్లో నివసించేవాడని చెబుతుంది. ఇతరుల డబ్బు పెట్టుబడి పెట్టేవాడని అంటుంది. “అలాంటి వాడిని ఎందుకు పెళ్ళి చేసుకున్నావు?” అంటాడతను. “ఇంకొకతనితో విడిపోవాలని ఇతన్ని పెళ్ళి చేసుకున్నాను” అంటుంది. ఆమె తన గురించే మాట్లాడుతోందని అతనికి అర్థమవుతుంది. “ప్రేమ లేకుండా అతన్ని పెళ్ళి చేసుకున్నావు. అతనికి బెదిరింపులు వచ్చాయి. చివరికి చనిపోయాడు. అంతా నిరుడు జరిగినట్టే ఉంది” అంటాడతను. “అది ఆత్మహత్య. ఇది హత్య” అంటుంది ఆమె గడుసుగా. నిజానికి అదీ హత్యే. హే-జున్ వల్లే అది ఆత్మహత్యగా మిగిలిపోయింది. “అప్పుడూ నేనే ఇన్‌స్పెక్టర్‌ని, ఇప్పుడూ నేనే ఇన్‌స్పెక్టర్‌ని. ఊరు మాత్రం వేరు. ఇదంతా ఎవరన్నా వింటే ఏమంటారు? ఎంత వింత అంటారు. నువ్వేమంటావు?” అంటాడతను. “నేనైతే ఎంత నిర్భాగ్యురాలు అంటాను” అంటుందామె.

హత్య జరిగినపుడు పోలీసులు వచ్చేసరికి సియ్-రే భర్త శవం స్విమింగ్ పూల్ మెట్ల మీద ఉంటుంది. తర్వాత పరిశోధనలో అతను స్విమింగ్ పూల్ లో రక్తపు మడుగులో ఉన్నాడని, అతని శవాన్ని పక్కకి చేర్చి ఆమె పూల్ లోని నీటిని తోడేసి శుభ్రం చేసిందని తెలుస్తుంది. ఆమె సాక్ష్యాలని లేకుండా చేసిందని ఆమెని అరెస్టు చేస్తారు. ఆమె తాను హత్య చేయలేదని, పోలీసులు తన భర్త రక్తం తొక్కటం ఇష్టం లేక శుభ్రం చేశానని అంటుంది. తర్వాత ఆమె హే-జున్ కి నిజం చెబుతుంది. హే-జున్ కి రక్తపు వాసన పడదు కాబట్టి ఆమె రక్తాన్ని శుభ్రం చేసింది! ఈ విషయం తెలిసి అతను ఉక్కిరిబిక్కిరి అవుతాడు. తర్వాత పరిశోధనలో సా గురించి తెలుస్తుంది. అతని తల్లి చనిపోయిందని తెలుస్తుంది. సా ని విచారిస్తే తానే సియో-రే భర్తని చంపేశానని అంటాడు. అతన్ని అరెస్టు చేస్తారు. అయినా హే-జున్ కి సియో-రే మీద అనుమానం పోదు.

హత్య జరిగిన ముందు రోజు రాత్రి సియో-రే భర్త హే-జున్ భార్యకి ఫోన్ చేస్తాడు. ఆమె అప్పుడు చూసుకోదు. తర్వాత చూసుకున్నా అది తెలియని నంబరు కావటంతో పట్టించుకోదు. అతని హత్య జరిగాక ఆమె అతని బిజినెస్ కార్డ్ చూస్తుంది. అతను తనకి ఫోన్ ఎందుకు చేశాడో ఆమెకి అర్థం కాదు. ఆమెకి హే-జున్ మీద అనుమానం వస్తుంది. “మీరిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారా? అతన్ని చంపేశారా?” అని హే-జున్ ని నిలదీస్తుంది. హే-జున్ హతాశుడై ఉండిపోతాడు. తర్వాత మృతుడి ఫోన్ లొకేషన్లు చూస్తే అతను చనిపోయినపుడు సముద్రం ఒడ్డున అతని ఫోన్ ఉన్నట్టు తెలుస్తుంది. సియో-రే అతని ఫోన్ సముద్రంలోకి విసిరేసిందని తెలుస్తుంది. హంతకుడు పట్టుబడ్డా హే-జున్ ఇంకా పరిశోధన చేస్తుండటంతో అతని తోటి పోలీసు అసహనంగా ఉంటుంది. హే-జున్ సియో-రే కి ఫోన్ చేస్తాడు. ఆమె భర్త ఫోన్ ఎందుకు పారేసిందని అడుగుతాడు. ఆమె తాను తన తల్లి చెప్పిన కొండకి వచ్చానని అంటుంది. అతను అక్కడికి వెళతాడు. అక్కడ ఆమె “నన్ను వదిలి వెళ్ళిన తర్వాత నీకు నిద్ర పట్టేది కాదు కదా. నన్ను బజార్లో చూసినపుడు నీ ప్రాణం లేచొచ్చింది కదా” అంటుంది. అతను ఔననలేక, కాదనలేక ఉండిపోతాడు. తనకు ఎత్తైన ప్రదేశాలంటే భయం కాబట్టి అతన్ని కొండ అంచుకి వెళ్ళి తన తాత, తల్లి చితాభస్మాలను వెదజల్లమని అంటుంది. అతను అలాగే చేస్తాడు. ఆమె వెనక నుంచి వచ్చి అతన్ని వాటేసుకుంటుంది. ఇక్కడ ప్రేక్షకులకే కాదు, అతనికి కూడా ఆమె అతన్ని తోసేస్తుందేమో అనిపిస్తుంది. కథలో ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో ఇక్కడే అర్థమవుతుంది. ఆమె “ముసలావిడ ఫోన్ నేను పారేయలేదు. కావాలంటే మళ్ళీ కేసు విచారణ చెయ్యి” అంటుంది. ఇద్దరూ గాఢంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటారు.

హే-జున్ ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. తర్వాత సా తల్లి మరణించిన రోజున సియో-రే ఆమెని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళిందని తెలుస్తుంది. ఆమె ఫెంటనిల్ మాత్రలతో సా తల్లిని చంపేసిందని హే-జున్ కి అర్థమవుతుంది! ఇంతకీ ఏం జరిగిందంటే ఆమె రికార్డు చేసుకున్న హే-జున్ మాటలు ఆమె తరచు వింటూ ఉండేది. అందులో ఆమె హత్య చేసిందని తెలిసినా అతను ఆమెని వదిలేసినప్పటి మాటలు ఉంటాయి. ఆ రికార్డింగ్ ఆమె భర్త విన్నాడు. దాన్ని తన ఫోన్లో పెట్టుకున్నాడు. సా తల్లి చచ్చిపోతే సా తనని చంపేస్తాడని, ఈ లోపలే తాను ఆ రికార్డింగ్ ఇంటర్నెట్లో పెట్టేస్తానని సియో-రేని బెదిరించాడు. అందుకే హే-జున్ భార్యకి చెప్పటానికి ఆమెకి ఫోన్ చేశాడు. హే-జున్ కి అప్రతిష్ఠ రాకూడదని సియో-రే ఏం చేయాలని ఆలోచించింది. సా తల్లిని చంపేస్తే సా తన భర్తని చంపేస్తాడని తెలుసు. అందుకని ఆ పనే చేసింది. భర్త ఫోన్ నుంచి రికార్డింగ్ తీసేసి ఫోన్ సముద్రంలో పారేసింది. ఇదంతా హే-జున్ కి అర్థమవుతుంది. ఆమెకి ఫోన్ చేసి “సా తల్లి, నీ భర్త చనిపోవటానికి కారణం నేనే కదా” అంటాడు. అతను తనను క్షమించడని తెలిసి ఆమె చివరికి ఆత్మహత్య చేసుకుంటుంది.

మనిషికి అబ్సెషన్ ఒక శాపం. కొందరు ఏం చేస్తున్నామో తెలియని స్థితికి చేరుకుంటారు. చివరికి సియో-రే ఏం సాధించింది? హే-జున్ ని కాపాడాలని ప్రయత్నించి ఇద్దరు మనుషుల చావుకి కారణమయింది. హే-జున్ కి జీవితాంతం వేదన తప్పదు. ఇక్కడ ప్రేమతో విపరీతంగా ప్రవర్తించి ఇద్దరూ తప్పులు చేశారు. అతను ఆమె తనని వాడుకుందని అనుకుని ఆమెకి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ ఆమెని చట్టానికి పట్టించలేదు. ఇది అతని ప్రేమ. దగ్గరా ఉండలేక, దూరంగా ఉండలేక సతమతమయ్యాడు. ఆమె అతని కోసం అతని ఊరికి వచ్చి ఉండవచ్చు. దూరం నుంచే అతన్ని చూస్తూ ఆరాధించవచ్చు అనుకుని ఉండవచ్చు. కానీ ఆమె అబ్సెషన్ కారణంగా అతనికి అప్రతిష్ఠ కలిగే ప్రమాదం వచ్చిపడింది. అందువల్ల మళ్ళీ నేరం చేసింది. విధి ఆడిన నాటకంలో ఇద్దరి జీవితాలూ నాశనమయ్యాయి.

సమాజంలో కొందరు ఒక మనిషి మీద వ్యామోహంతో నేరాలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. తల్లినీ, తండ్రినీ చంపినవాళ్ళు కూడా ఉన్నారు. ఇక వేరేవాళ్ళ సంగతి చెప్పేదేముంది? నేరం చేసి తప్పించుకోవచ్చని భ్రమలో ఉంటారు. జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇందులో చిన్న వయసు వాళ్ళే కాదు, నడివయసు వాళ్ళూ ఉన్నారు. చిన్నవాళ్ళకి తలిదండ్రులు శాంతంగా చెప్పాలి. కోప్పడితే మొదటికే మోసం రావచ్చు. ఆత్మహత్యలే కాదు, హత్యలకి కూడా వెనకాడని రోజులు వచ్చాయి. ఒక వయసు దాటాక చెప్పిన మాట వినకపోతే బంధం తెంచుకునేందుకు సిద్ధపడాలి. పరువు హత్యలు లాంటివి అనవసరం. నీ దారి నువ్వు చూసుకో అని వదిలేయటమే. వయసులో పెద్దవాళ్ళు వ్యామోహంలో పడితే ఎవరికి వారే ఆలోచించుకోవాలి. తమ వ్యామోహం కోసం హత్యలు చేస్తే చివరికి జైలే గతి. లేదా ఆత్మహత్య. తప్పించుకోవచ్చనుకోవటం మూర్ఖత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here