కాజాల్లాంటి బాజాలు-124: భలే వదిన

8
3

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]“ఆ[/dropcap]వకాయ పెట్టుకుందాం.. ఆదివారం పొద్దున్నే వచ్చెయ్యి.. కాయ తెచ్చుకుందాం” అని నిన్న వదిన అన్న మాటలను పట్టుకుని ఆదివారం పొద్దున్న ఏడుగంటలకల్లా అన్నయ్య ఇంటికొచ్చేసేను నేను.

నాకూ, అన్నయ్యకీ రెండోసారి కాఫీ ఇచ్చి, తనూ తాగుతూ పక్కనే ఉన్న పేపర్ చూసిన వదిన ఒక్కసారి కెవ్వుమని కేక పెట్టింది. హడిలిపోయాం అన్నయ్యా, నేనూను.

“ఏవైంది వదినా! ఎవరైనా పోయారా!”

అటువంటి వార్తలకే అలా కెవ్వుమంటారనే అభిప్రాయంలో ఉన్న నేను అడిగేను.

“ఇది చూడూ” అంటూ పేపర్‌లో ఓ మూల బాక్స్ కట్టి ఉన్న చిన్న ప్రకటన చూపించింది వదిన.

సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళిచ్చిన ప్రకటన అది.

ఆ రోజు అంటే ఆదివారం ఉదయం పదిగంటల నుండీ మాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాలేజీలో సీనియర్ సిటిజన్లను ప్రోత్సహించడానికి వారికి వివిధ రకాలైన పోటీలు పెట్టి బహుమతులు ఇస్తున్నారుట.

ఆ బహుమతులు కూడా మామూలుగా లేవు. ప్రతి పోటీ విజేతకీ ఒక్కొక్కరికీ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా వరసగా అయిదువేలూ, మూడువేలూ, రెండువేలూ ఇస్తారుట.

ఆ అంకెలు చూడగానే వదిన కళ్ళు మెరిసేయి. అది కనిపెట్టిన అన్నయ్య అంతంత డబ్బులు ఇస్తున్నారంటే అప్పటికే ఎవరికివ్వాలో వాళ్ళు నిర్ణయించేసుకుంటారనీ, ఒట్టి కంటితుడుపు చర్య కోసమే ఈ హడావిడంతా చేస్తుంటారని తన అభిప్రాయంగా చెప్పేడు. వదిన కోరగా చూసింది అన్నయ్య వైపు.

మరింక అన్నయ్యతో వాదించకుండా ఆ ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి, మా ముగ్గురి పేర్లూ రిజిస్టర్ చేయించేసింది.

నేను ఖంగారుగా “అదేంటి వదినా.. ఆవకాయ పెట్టుకుందామన్నావుగా..” అన్నాను.

“ఈ పోటీల్లో గెలిస్తే ఆవకాయ పెట్టుకునే ఖర్మెందుకు మనకీ.. ఏకంగా అయిదు సంవత్సరాలకి సరిపడ ఆవకాయే కొనేసుకోవచ్చు..” అంది స్థిరంగా.

“అయినా పోటీలంటే సాధారణంగా ఆటలూ, పాటలూ, డాన్సులూ లాంటివి ఉంటాయి. మనకా పాటలూ, డాన్సులూ రావాయె.. ఇంక ఆటలంటావా అసలే రావు.. మరి మనకి బహుమతి వస్తుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవూ!” అన్నాను.

“ఆటలంటే… బోల్డు రకాలైన ఆటలు ఉన్నాయి.. పాటలంటే క్లాసికలా.. లైటా.. సినిమా పాటలా.. ఏదైనా వెళ్ళి చూస్తే కదా తెల్సేది.. ఇక్కడే రాదనుకుంటే ఎలా!” అంటూ నన్ను నిలదీసింది.

అన్నయ్య ససేమిరా రానంటే రానన్నాడు. నాకేమీ రావూ, నేనూ రానన్నాను. వదిన అన్నయ్యని బతిమాలింది. బెదిరించింది. గొడవ పెట్టుకుంది.

“అందరు మొగుళ్ళూ పెళ్ళాల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తారూ.. మీరే నాకేమీ చెయ్యరూ..” అంటూ బ్లాక్‌మెయిలు కూడా చేసింది.

ఆఖరికి వదిన గొడవ భరించలేక “వస్తాను కానీ.. అక్కడ దేన్లోనూ పార్టిసిపేట్ చెయ్యమనకూడదు. ఉట్టిగా నీకు సాయం వస్తానంతే. నీక్కావల్సింది నువ్వు చేసుకోవచ్చు. అందుకు ఇష్టమైతే వస్తాను..” అంటూ అన్నయ్య కండిషన్ పెట్టేడు.

దానికి వదిన ఒప్పుకుంది.

వెంటనే బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీతోపాటే కాస్త పులిహార కూడా కలిపేసింది వదిన. దానిని పాక్ చేసేసి, మంచినీళ్ళ సీసాలు రెండు నింపేసి, ఒక బేగ్‌లో సర్దేసి, తొమ్మిదవకుండా నన్నూ, అన్నయ్యనీ బయల్దేరదీసింది.

వదినని చిన్నబుచ్చలేక కాస్త గునుస్తూనే బయల్దేరేం నేనూ అన్నయ్యా కూడా..

తీరా ఆ కాలేజీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి చూద్దుము కదా.. ఎంతమంది జనాలో అప్పటికే వచ్చేసి ఉన్నారు. సిటీలో ఇంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోతున్న నన్ను చూసి వదిన

“ఇంతకు మూడు రెట్లుంటారు. ఉన్నవాళ్లలో ఏ కొంతమందో మాత్రమే వచ్చుంటారు..” అంది.

“వీళ్ళంతా ఇప్పుడు పరుగులు పెట్టేద్దామనే..!” అన్న అన్నయ్య మాటలకి, “ఏవో.. నాలాంటి భార్యలు మీలాంటి భర్తలని బలవంతంగా తీసుకొచ్చి ఉండొచ్చు కదా!” అంటూ నిజాన్ని ఎంత అందంగానో చెప్పింది వదిన. ఉన్నమాట ఉన్నట్టు చెప్పే వదినంటే అందుకే నాకంత ఇష్టం.

ఆ గుంపులో జొరబడి, స్టేజి దగ్గర ఉన్న నిర్వాహకుల దాకా వెళ్ళి అసలు ఏమేం పోటీలున్నాయో ఉన్న పాంఫ్లెట్ తీసుకుని వచ్చింది వదిన.

అన్నీ.. పరుగుపందాలూ, మ్యూజికల్ చైర్సూ, పాటలూ, డాన్సులూ కనిపించేయి అందులో. పరుగుపందాలకీ, మ్యూజికల్ చైర్స్‌కీ ఈ వయసులో మా శరీరాలు సహకరించవయ్యె. ఇంక పాటలంటే అస్సలు కూనిరాగాలే రావయ్యె. డాన్సులు అసలే పడవాయె.. అనవసరంగా ఇంత దూరం వచ్చాం అనుకుంటున్న నాకు.. “మనం దీనికి పేరివ్వచ్చు..” అంది పేజీ చివర ఉన్నదానిని చూపిస్తూ.

అదేవిటా అని వదిన చేతిలో కాగితంలోకి కుతూహలంగా తొంగిచూసేను.

చిట్టచివర్న ఉంది ఆ పోటీ.. దాని పేరు ‘స్టాండప్ కామెడీ..’

“అంటే ఏంటీ..” అర్థం కాక అడిగేడు అన్నయ్య..

“అదే అన్నయ్యా.. ఈ మధ్య చాలాచోట్ల ఇది చేస్తున్నారు. ఒక మనిషి తన అనుభవాల్లాంటి దానిని రెండు మూడూ నిమిషాలు చెప్పి ఆడియన్స్‌ని నవ్వించడం.. అదేదో సినిమాలో హీరో చేస్తాడు.. ఇంకేదో సినిమాలో హీరోయిన్ కూడా చేస్తుంది..” ఆ సినిమా పేర్లు గుర్తు చేసుకుందుకు ప్రయత్నిస్తున్నాను.

“మనిద్దరి పేర్లూ దీనికి ఇచ్చెయ్యనా!” అంది వదిన ఉత్సాహంగా నాతో..

“నా పేరా.. అమ్మో.. స్టేజి ఎక్కితేనే నాకు కాళ్ళు ఒణుకుతాయి. అందులోనూ మనం అనుకున్నది కాదుట.. పది నిమిషాలముందు టాపిక్ వాళ్ళిస్తారుట.. దాని మీద చెప్పాలిట.. నన్నొదిలెయ్ తల్లోయ్..” చేతులెత్తి వదినకి దండం పెట్టేసేను.

పనికిరానిదాన్ని చూసినట్టు నా వైపు చూస్తూ తన పేరివ్వడానికి స్టేజి వైపు వెళ్ళింది వదిన.

“అంటే ఏంటి చెల్లాయ్..” అసలు అదేం పోటీయో అర్థం కాక అన్నయ్య నన్ను మళ్ళీ అడిగేడు.

నాకు సరిగ్గా తెలిస్తే కదా అన్నయ్యకి చెప్పడానికి. అందుకే “వదిన పేరిచ్చింది కదా.. చూద్దాం ఏవిటో..” అన్నాను నేను మొహంలోకి ఉత్సాహం తెచ్చి పెట్టుకుంటూ..

వదిన పరుగు పరుగున వచ్చింది మా దగ్గరికి.

“స్టేజి మీద జరిగే పోటీలన్నీ లోపల ఆడిటోరియంలో జరుగుతున్నాయిట. ఈ గ్రౌండ్‌లో ఆటలు మాత్రమే.. రండి లోపలికి వెడదాం..” అంటూ మమ్మల్ని లోపలికి లాక్కెళ్ళింది. మేము వెళ్ళేసరికే వదిన పేరిచ్చిన పోటీలో వాళ్ల పేర్లు పిలుస్తున్నారు. వదిన పేరు వినపడగానే మమ్మల్ని అక్కడ కుర్చీల్లో కూర్చోబెట్టి వదిన స్టేజి మీదకి వెళ్లిపోయింది.

పోటీలో పాల్గొనే వాళ్లందరినీ వరసగా స్టేజి మీద కూర్చోబెట్టారు. ఒక పెద్దాయన ఎవరో మైకు ముందుకొచ్చి మాట్లాడ్దం మొదలెట్టేరు. మేము శ్రధ్ధగా వినసాగాం.

“ఇక్కడ కలిసిన మనమందరం ఒక్క వయసులోనే పండిపోలేదు. అనుభవాలలోనూ, అనుభూతులలోనూ, అభిమానాలలోనూ, ఆప్యాయతలలోనూ అన్నింటిలోనూ పండిపోయి ఒక పరిణిత దశకు వచ్చినవాళ్లం. ఇప్పుడు జరిగిపోయిన మన గతం గురించి ఆలోచిస్తుంటే మన హృదయాన్ని ఇప్పటికీ తడిగా ఉంచే జ్ఞాపకాలు కొన్ని మనకి గుర్తొస్తాయి. అందులో ముఖ్యమైనది మనందరికీ కలిగే మొదటి ప్రేమానుభవం.. సరిగ్గా చెప్పాలంటే ఇంగ్లీషులో దానిని ‘ఫస్ట్ క్రష్’ అంటారు. తెలిసీ తెలీని వయసులో మనకి కలిగిన ఆ ఫస్ట్ క్రష్ అనుభవాలని ఈ పండిన వయసులో మరోసారి గుర్తు చేసుకుని, మనలో అప్పటి హుషారుని నింపుకునేలా, కాస్త హాస్యం జోడించి ఎవరి ఫస్ట్ క్రష్ గురించి వారు అయిదు నిమిషాలు మించకుండా చెప్పాలి. ఒక పది నిమిషాల తర్వాత పోటీ మొదలవుతుంది.. కానీ మిగిలిన పోటీలలోలా కాకుండా ఈ పోటీకి మటుకు అయిదువేల రూపాయిల బహుమతి ఒక్కటే ఉంటుంది.. అందుకని ఈ పదినిమిషాలలో మీ ఫస్ట్ క్రష్‌ని జ్ఞాపకాలలోంచి వెలికితీసి, హాయిగా నవ్వుకునేలా మాకందిస్తారని పోటీలో పాల్గొనబోతున్న ఈ పదిమందికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అన్నట్టు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పోటీలో పాల్గొంటున్నవారిలో తొమ్మిదిమంది మగవారే.. ఒక్కరే మహిళ.. దీనిని బట్టి మన మహిళలు ఎంత పురోగమించారో మనకి తెలుస్తోంది..” అంటూ ఒక నమస్కారం పెట్టి స్టేజి దిగిపోయారు.

నాకూ, అన్నయ్యకూ ఆ టాపిక్ విన్న తర్వాత నోట మాట రాలేదు. అన్నయ్యయితే అలా బిగుసుకుపోయి కూర్చుండిపోయేడు. స్టేజి మీద ఉన్నవాళ్లలో కొంతమంది మగవాళ్ళు ఒకరితో ఒకరు చిన్నగా మాట్లాడుకుని నవ్వేసుకుంటున్నారు. వదిన వైపు చూసేను. చిన్నగా నవ్వుతూ, నావైపు చూసి థమ్సప్ లోలా బొటనవేలెత్తి చూపించింది. కనీసం ఈ టాపిక్ విన్న తర్వాతైనా వదిన పోటీనుంచి విరమించి వచ్చేస్తుందనుకున్న నాకు, చిరునవ్వు నవ్వుతూ అక్కడే కూర్చున్న వదినని చూస్తుంటే ఎంత ధైర్యవంతురాలో అనిపించింది. భయపడుతూ అన్నయ్య మొహంలోకి చూసేను. అలాగే బిగుసుకుపోయి కూర్చున్నాడు.

పదినిమిషాలు పది యుగాల్లా గడిచేయి. ఒక్కొక్కరూ వారి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏదో చెపుతున్నారు. అన్నీ చిన్నపిల్లల ఆటల్లా అనిపించేయి.

వదిన వంతు వచ్చింది. వచ్చి స్థిరంగా మైకు ముందు నిలబడింది. ఒకసారి అన్నయ్యవైపు చూసింది. నెమ్మదిగా మొదలుపెట్టింది. అన్నయ్య సీట్లో కాస్త ముందుకు జరిగేడు.

“కార్యక్రమ నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకూ నమస్కారాలు. అవి నేను హైస్కూల్లో చదువుకునే రోజులు. మా స్కూల్‌కి వెళ్ళడానికి మధ్యలో చిన్న వంతెనలా ఒకటుండేది. అది దాటి వెళ్ళాలి. మా ఊళ్ళో కాలేజీకి కూడా ఆ వంతెనే దాటి వెళ్ళాలి. ఆ వంతెనకి అటూ ఇటూ ఉన్న పిట్టగోడల్లాంటి వాటి మీద కాలేజీ కుర్రాళ్ళు కూర్చుని, మేము స్కూల్‌కి వెడుతూ వస్తూ ఉంటే కామెంట్లు చేసేవారు. కానీ ఒకబ్బాయి మటుకు ఎప్పుడూ అసలు మావైపే చూసేవాడు కాదు.

ఆ అబ్బాయి నాకు చిన్నప్పట్నించీ తెలుసు. మా ఇంటి పక్కనే వాళ్ళిల్లు. పెద్ద పెద్ద చదువులు చదివి పాపం వాళ్ళబ్బాయికి తలనెప్పి వచ్చేస్తుందని పొద్దున్నే వాళ్లమ్మ ఆ అబ్బాయి తలకి చెంపల్లోంచి జారిపోయేలా బోల్డు కొబ్బరినూని రాసి కాలేజీకి పంపించేది. అలా కాలేజీకి రావడం ఆ అబ్బాయికి సిగ్గు. అందుకని మధ్యదారిలో ఎవరూ చూడకుండా చూసి తన చేతిరుమాలుతో ఆ తలని గట్టిగా తుడిచేసుకునేవాడు. ఎప్పుడైనా అటు వెడుతున్న మేం చూసినట్టు అనిపిస్తే సిగ్గుతో తలొంచేసుకునేవాడు. నాకు భలే నవ్వొచ్చేది. ఆ అబ్బాయిని పట్టుకుని ఏడిపించాలనిపించేది. అమ్మని కాదనలేని అతని మంచితనం నాకు ఎంతో నచ్చేసింది.

ఆ అబ్బాయి ఎప్పుడైనా నావైపు చూడకపోతాడా.. కళ్ళు కలిపి, చిన్న నవ్వు నవ్వుదామని చాలాసార్లు అనిపించేది. కానీ నా స్కూలు చదువూ, అతని కాలేజీ చదువూ పూర్తయిపోయినా కూడా నాకా అవకాశం రాలేదు. ఏం చేస్తాం. అదే నా ఫస్ట్ క్రష్.. ఎందుకంటే అలా నేను కోరుకున్న ప్రియుడే నాకు మొగుడైపోయేడు కదా!..” అంటూ నమస్కారం పెడుతూ ముగించింది.. ఆఖర్న అన్నయ్య వైపు ఓ చూపు విసురుతూ..

శ్రధ్ధగా వింటున్న అన్నయ్య ముఖం వదిన ఆఖరి మాటలకి మందారంలా విచ్చుకుంది. వదిన మాటలు పూర్తయిన నిమిషానికి కానీ వదిన ఆఖరిమాట అర్థం అవని ఆహూతులు నవ్వుతూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టేరు.

ఇంక వేరే చెప్పడం ఎందుకూ! అప్పటికే అందరికీ అర్థమైపోయింది ఫస్ట్ ప్రైజ్ వదినకే నని.

దర్జాగా అయిదువేల రూపాయిల చెక్కు పట్టుకొస్తున్న వదినని చూసి నాకూ, అన్నయ్యకీ ఎంత గర్వంగా అనిపించిందో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here