నాదొక ఆకాశం-2

0
3

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[ప్రముఖ హీరో సంజయ్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. డైరక్టర్ కట్ చెప్తాడు. సంజయ్ వ్యానిటీ వ్యాన్ వైపు నడుస్తుంటే డైరక్టర్ ఏదో చెప్పబోతాడు. తన మిత్రుడు, పి.ఎ. అయిన సమీర్‍కి చెప్పమని సంజ్ఞ చేస్తాడు. కీవ్‍లో రెండు పాటల షూటింగ్ చేయాలనీ, సంజయ్‍తో డేట్స్ ఇప్పించమని సమీర్‍ని అడుగుతాడు డైరక్టర్. సరేనంటాడు సమీర్. ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తయితే సమీర్ మూలికా వైద్య చికిత్స కోసం ఒక వారం రోజుల పాటు శ్రీశైలం దగ్గర నల్లమల అడవులల్లో ఓ స్వామీజీ వద్దకి వెళ్ళాలి. ఈ సినిమా షూటింగ్‌కి కీవ్ వెళ్ళాల్సిన అవసరం గురించి సమీర్ – సంజయ్‍కి చెప్తాడు. సమీర్‍ని కూడా యూరప్‍కి రమ్మంటాడు సంజయ్. సంజయ్‍ని వెళ్ళమని, తాను అమ్మ దగ్గరికి వెళ్తానని అంటాడు సమీర్. కాదు రమ్మంటాడు సంజయ్. ఇద్దరూ ప్లాన్ చేసుకుంటారు. శ్రీశైలం స్వామీజీ వద్దకు తన తల్లిని కూడా తీసుకువెళ్తానని చెప్తాడు సంజయ్. షూటింగ్‍లో చిన్న బ్రేక్ వస్తే సంజయ్ వెళ్ళి తన వ్యానిటీ వ్యాన్‍లో కూర్చుంటాడు. తర్వాతి సీన్ చెప్పడానికి అసిస్టెంట్ డైరక్టర్ వినయ్ సిద్ధంగా ఉంటాడు. కానీ సమీర్‍ని కనుక్కుని అప్పుడు లోపలికి వెళ్ళమని డైరక్టర్ వినయ్‍కి చెప్తాడు. ఈలోపు హీరోయిన్ త్రక్ష సమీర్‍కి ఫోన్ చేసి, సంజయ్‍తో మాట్లాడాలి అని అంటుంది. పదిహేను నిముషాల తర్వాత అని చెప్తాడు సమీర్. సంజయ్ విశ్రాంతి తీసుకుంటుండగా సమీర్ తన గతం గుర్తు చేసుకుంటాడు. 15 నిమిషాల విశ్రాంతి పూర్తి కాగానే, సమీర్ సైగనందుకుని వినయ్ వ్యాన్ లోపలికి వచ్చి, సంజయ్‍కి తర్వాతి సీన్ చెప్పబోతుండగా, సంజయ్ వ్యాన్ లోకి వస్తుంది త్రక్ష. వినయ్‍ని, సమీర్‍ని అక్కడే కూర్చోమని వ్యాన్ లోని మరో రూమ్ లోకి వెళ్తారు సంజయ్, త్రక్ష. ఆ రూమ్ తలుపు తీసే ఉంచుతాడు సంజయ్ – పుకార్లు రేగకుండా ఉండడానికి. – ఇక చదవండి.]

[dropcap]త్ర[/dropcap]క్ష ఒక్కత్తే అని కాదు, ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాలు చేసే హీరోయిన్లలో చాలా మంది తమ శరీరాన్నే పెట్టుబడిగా భావిస్తున్నారు. అసలు, టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లే లేరు. అందుకే, ముంబయి, ఢిల్లీ, పంజాబ్, బెంగుళూరు, మంగుళూరు, చెన్నై, కేరళ ఎక్కడి నుంచి వచ్చిన హీరోయిన్లైనా విచ్చలవిడిగా స్కిన్ షోతో రెచ్చిపోతున్నారు.

అంతెందుకు, ఇప్పుడైతే ఆడియో ఫంక్షన్లు జరగడం లేదు గానీ, వాటి స్థానంలో ప్రీ రిలీజు, టీజర్ రిలీజ్ వంటి ఫంక్షన్లలోనే హీరోయిన్లు అర్ధ, ముప్పావు నగ్నంగా అంగప్రదర్శన చేస్తున్నారు.

వాళ్ళ డ్రెస్సులు ఎంత పొట్టిగా ఉంటాయంటే, కుర్చీలో కూర్చొని, ఏ కొంచెం కదిలినా ఆ డ్రస్సులు మాల్ ఫంక్షన్ అవుతుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి, వాళ్ళను టీవీ తెర మీద చూడ్డానికే మనకు ఇబ్బందిగా ఉంటుంది. అటువంటిది వేలాది మంది ముందు, మొదటి వరుసలో కూర్చునే వాళ్ళ డ్రెస్సులు ఎంతమందిని కలవరపరుస్తుంటాయో ఊహించలేము. అదే హీరోయిన్లు ఇంక అప్పుడప్పుడు డ్రెస్ సర్దుకుంటున్నట్టూ, నానా ఇబ్బందులు పడుతున్నట్టు నటించడమూ, ‘ఓ షిట్’ అని అతి వయ్యారాలు పోవడమూ చూస్తుంటే, నాకైతే, అరికాలి మంట తలకెక్కుతుంది. అసలు అంత పొట్టి డ్రస్సులు వేసుకుని రావడమెందుకూ? తర్వాత ఆ నంగనాచి వేషాలు వేయడం ఎందుకూ?

ఈ మధ్య సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు, ఒక నటి గురించి, ‘ఆ అమ్మాయి బాగానే నటిస్తుంది కానీ, పెళ్ళై ఎదిగిన పిల్లలున్నప్పుడు అటువంటి డ్రెస్సులు ఎందుకు వేసుకోవాలి?’ అని ప్రశ్నించింది, ఇటువంటి వారిని చూసే.

***

‘ఇప్పుడు పెళ్ళి కావడం, పిల్లలకు తల్లి కావడం వంటి విషయాలు నటీమణుల బహిరంగ అర్ధ నగ్న ప్రదర్శనకు అడ్డంకిగా, ఏమీ లేవు. ఆ మొగుళ్ళకు మాత్రం..’ అని నేననుకుంటుండగానే, త్రక్ష కన్నీళ్ళతో బయటకొచ్చింది. సంజయ్ ఆమె భుజం మీద చేయి వేసి,

“డోంట్ వర్రీ! ఐ విల్ టాక్ టూ హిమ్. కళ్ళు తుడుచుకో! ఎవరైనా చూస్తే బాగుండదు.” అన్నాడు. త్రక్ష కళ్ళు తుడుచుకుని, మా వైపు చూస్తూ, చిరునవ్వుతో,

“యా! ఐ కెన్ అండర్‌స్టాండ్! థ్యాంక్స్ బాబూ!” అని చెప్పి వెళ్ళి పోయింది.

ఇది కూడా ఒక సిగ్నలే. ఆ హీరోయిన్, సంజయ్ వ్యానిటీ వ్యాను లోపలి నుండి, ఏడుస్తూ వెళితే, వినయ్ లేదా యూనిట్ లోని ఇతరులు పుట్టించే పుకార్లకు అంతే ఉండదు. అంతెందుకు ఏడుస్తూ బయటికొచ్చిన త్రక్షను చూసి, ఒక్క క్షణం, నేనే సంజయ్‌ని అనుమానించాను.

ఈ వినయ్ అనే కాదు అట్లాంటి వాళ్ళు టాలీవుడ్‌లో చాలా మందే ఉంటారు. వీళ్ళందించే పుకార్లకు మాస్ మసాలా జోడించి, చిలువలు పలువలు చేసి, తెల్లారేసరికి గరం గరం పుకార్లు వడ్డించేందుకు కొన్ని బూతు వెబ్ సైటులు సిద్ధంగా ఉంటాయి.

సంజయ్ గనుక తలుపు వేయకపోతే, తర్వాత ఆ అమ్మాయిని కళ్ళు తుడుచుకోమని గనుక అనకపోతే, తెల్లారేసరికి,

“లొకేషన్ లోనే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హీరో వ్యానిటీ వ్యాను నుండి ఏడుస్తూ బయటకొచ్చిన ఆ హీరోయిన్ ఎవరు? వివరాలకై మా ఛానెల్‌నే చూస్తూ ఉండండి.” అని కొన్ని వెబ్ సైట్లలో పుకార్లు ప్రత్యక్షమౌతాయి.

ఇవన్నీ అనుభవం మీద తెలుసుకున్న వాడే కాబట్టి సంజయ్, హీరోయిన్ల విషయంలో, చాలా జాగ్రత్తగా నడుచుకుంటాడు. అయినా పుకార్లు పుడుతూనే ఉంటాయి.

***

త్రక్ష వెళ్ళిన తర్వాత, పదిహేను నిముషాల్లో రెడీ అయి సంజయ్ బయటకొచ్చాడు. వెంటనే గొడుగు పట్టుకుని బాయ్ సిద్ధమయ్యాడు.

నిజానికి హీరో, హీరోయిన్లకు గొడుగు పట్టుకోవడం చూసి సాధారణ ప్రజలు, అదేదో గొప్ప కోసం చేసే పని అని అపోహపడతారు. కానీ, షూటింగ్ సమయంలో నటీనటుల ముఖం మీద పడే ఎండ తీక్షణతకు మేకప్ పగిలిపోతుంది. అప్పుడు ఆ విషయం లేటెస్ట్ డిజిటల్ కెమెరాలలో స్పష్టంగా కనపడుతుంది. ఎండలో గంటల కొద్దీ షూటింగ్ చేస్తుంటే మనుషులు కమిలిపోతారు. సంవత్సరానికి ఐదారు నెలలు ఔట్ డోరులో పనిచేసే నటీనటులు వాళ్ళ చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవలసిన అవసరం ఉంటుంది కాబట్టి రకరకాల సన్ లోషన్లు వాడతారు. విదేశాలకు వెళ్ళి డీటాక్సిఫై, డీట్యానింగ్ చేసుకుంటారు. గొడుగు నీడలో నడవడం కూడా అందులో ఒక భాగమే.

***

సంజయ్, షూటింగ్ ప్రారంభించిన తర్వాత నాకు చాలా వరకు రెస్టే. అందుకే, ‘మనోభిరామ్’ ముందుకొచ్చాడు.

‘నేను ‘ఇన్ఫోసిస్’లో చేరిన తర్వాత, సంజయ్ నటించిన మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందన్న వార్తలు చూసి మనసులోనే ఒక నవ్వు నవ్వి ఊర్కున్నాను. హీరో సంజయ్ నా మిత్రుడని కూడా నేను ఎవరికీ చెప్పలేదు. నేనతన్ని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే, ఇంతా చేసి వెళ్తే, సరిగ్గా పలకరించకపోతే.. అన్న సంకోచంతోనే సంజయ్‌ని కలిసే ప్రయత్నం చేయలేదు.

అదీ కాకుండా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం బయటి నుండి చూసేవాళ్ళకు ఆకర్షణీయంగానే కనిపిస్తుంది. కానీ, మా జీవితాలు అమెరికాలోని ప్రాజెక్టు మేనేజర్ల చేతుల్లో ఉంటాయనీ, మా ఉద్యోగ టైమింగ్స్, మా జీవన విధానం – టార్గెట్లు, డెడ్‌లైన్లు – అనే చక్రబంధంలో ఉంటాయని మాకే తెలుసు. ఏ ఉద్యోగంలోనైనా ఎన్నో కొన్ని బాధలు తప్పవు. కాలక్రమేణా వాటికనుగుణంగా మనమే సర్దుకుపోవాలి. నేనలా సర్దుకుపోబోతున్న సమయంలో, సంజయ్ నుండి ఫోన్ వచ్చింది.

ఆ రోజు ఫోన్ చేసి సంజయ్ నన్ను తనతో పాటు సినీఫీల్డుకు రమ్మన్నాడు. నాకు మతి పోయింది. ‘నాకు ‘ఇన్ఫోసిస్’లో నెలకు లక్ష రూపాయల జీతం వస్తుంది. ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంది. ఆ స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి రావడానికి నేనేమీ పిచ్చివాణ్ణి కాదు’ అని సంజయ్‌కి చెప్పాను.

కానీ, ఆ తర్వాత సంజయ్ అన్న మాట విన్న నా చెవుల్లో తేనె పోసినట్టయ్యింది.

‘నీకు నెలకు రెండు లక్షల జీతం, సంవత్సరానికి పది లక్షల బోనస్, ఒక కారు ఇస్తాను. ఒక సంవత్సరం తరువాత నిన్ను కూడా నాలా సినిమా హీరోను చేస్తాను. ఈ సంవత్సర కాలం నన్ను గమనిస్తూ నటించడం నేర్చుకో!

ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ పెంచుకో. ఆ తర్వాత నీ సినిమాను నేనే నిర్మిస్తాను. కానీ, ఇప్పుడు మాత్రం నీలాంటి మంచి స్నేహితుడి అవసరం నాకు చాలా ఉంది రా! ప్లీజ్!’ అన్న మాటలు నాకు అమృతతుల్యంగా తోచాయి.

‘నిన్ను సినిమా హీరోను చేస్తానంటే కాదనే వాడు ఈ భూప్రపంచంలో ఉంటాడా? నాకు తెలిసి ఏ తెలుగు వాడూ అలా అస్సలుండలేడు’ నాకు కూడా ఆ ఆశ మనసులో ఉందేమో కానీ పరిస్థితుల దృష్ట్యా, అసంభవాల గురించి ఆశపడకూడదనే మధ్యతరగతి మనస్తత్వం కాబట్టి, నేనసలు ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. కానీ, సంజయ్ మాటలను విశ్వసించి నేను వెంటనే ‘ఇన్ఫోసిస్’ ఉద్యోగానికి రాజీనామా చేసి, సంజయ్ పీయ్యేగా చేరి సంవత్సరమౌతుంది. అంతా బాగానే ఉంది.

తెలుగు సినిమారంగం నిత్యనూత్న చైతన్యస్రవంతి. అనూహ్య సంఘటనలెన్నో జరుగుతుంటాయి. అది ఒక రకంగా నాకు థ్రిల్ ఇస్తుంది. ఇవ్వాళ ఉదయమే, సంజయ్ తనతో పాటు యూరప్‌కు రమ్మన్నాడు. ఈ సంవత్సరంలో ఇది మూడో ఫారిన్ ట్రిప్. నేను, మధ్య తరగతి వాణ్ణి, కలలో కూడా ఊహించని సౌకర్యాలన్నీ చవి చూసాను.

నిర్మాతలకు కూడా నేను సంజయ్ వెంట ఉండడం చాలా ఆవశ్యకం. ఎందుకంటే, సంజయ్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. నేనుంటేనే, సంజయ్‌ను కంట్రోల్ చేయగలనని, ఈ సంవత్సరంలోనే సినీ ఫీల్డ్ అర్థం చేసుకుంది..’ ఆలోచనల్లో మునిగిపోయి నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు.

***

సంజయ్ పిలిచేసరికి నేను లేచి అయోమయంగా చూసాను.

“ఏంట్రా? ఏదైనా హీరోయిన్ ఒడిలో పడుకుని డ్యూయెట్ పాడుతున్నట్టుగా కలలు కంటున్నావా ఏంటి?” అన్నాడు సంజయ్ నా ముఖంలో ముఖం పెట్టి చూస్తూ. నేను కంగారుగా,

“సారీ బాస్!” అని లేచి నిలబడ్డాను.

అప్పటికే సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి.

“ప్యాకప్ అయిందా?” అని అడిగాను.

“లేదురా! ప్యాచ్ వర్క్ కదా ప్రతీ షాట్‌కు, కాస్ట్యూమ్స్, లైట్లు, లెన్సులూ, యాంగిల్సూ మార్చాల్సి ఉంటుంది కదా! ఓర్చుకోవాలి. పద! అమ్మ స్నాక్స్ పంపింది.” అంటూ నా భుజం మీద చెయ్యి వేసాడు.

సంజయ్ నా భుజం మీద, బహిరంగంగా, అందరూ చూస్తుండగా, చెయ్యి వేయడమనే ఆ చర్య నాకు బాగా నచ్చింది. నేను సంజయ్ దగ్గర కేవలం ఉద్యోగిని మాత్రమే కాదు మంచి మిత్రుణ్ణని కూడా, ఆ క్షణాన, నా మనసుకు తోస్తుంది.

ఇటువంటి దృశ్యాలు చూసే, ఇండస్ట్రీ మా ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉందని నమ్ముతుంది.

ఆ రోజు ప్యాకప్ అయ్యేసరికి రాత్రి పదయింది. సంజయ్ పొగరుగా ఉంటాడని డైరెక్టర్లు, నిర్మాతలు భయపడ్డాగానీ, పని విషయంలో రాక్షసుడేనని వాళ్ళందరికీ తెలుసు. అతన్ని కన్విన్స్ చేసే విధంగా చెప్తే ఎంత పనయినా చేస్తాడు. డబ్బుల విషయంలో కూడా ఇంత కావాలని పట్టు పట్టడు. నేనొచ్చిన తర్వాతనే రెమ్యునరేషన్ ఖచ్ఛితంగా వసూలు చేస్తూ, ఆ డబ్బును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. మధ్య మధ్యలో ఒక పదిహేను నిముషాల రెస్టు తీసుకుంటూ, అర్ధరాత్రి వరకు కూడా యాక్టివ్‌గా షూటింగులో పాల్గొంటాడు.

***

ఇంటికి వెళ్ళి అమ్మానాన్నలకు కనపడ్డ తర్వాత, చెరొక బీర్ తీసుకుని రూఫ్ గార్డెనులో కూర్చున్నాము. సంజయ్ మంచి గిటార్ ప్లేయర్. తను గిటారుతో వాయిస్తుంటే చాలా హాయిగా అనిపించింది ఆ ప్రశాంత వాతావరణంలో.

ఆకాశం కూడా నిర్మలంగా ఉంది. తారలు మిణుకుమిణుకుమంటున్నాయి. చల్లగాలి మెల్లిగా వీస్తుంది. ఆ సమయంలో వీనులవిందైన గిటారు సంగీతం వింటుంటే, రోజంతా పడిన శ్రమ మరిచిపోయి, తేలిపోతున్నట్టనిపిస్తుంది.

ఆకాశాన్ని ఎప్పుడు చూసినా, నాకు వింతగానే తోస్తుంది. ఇదే సమయంలో, ప్రపంచంలోని ఎన్నో దేశాలలోని కోట్లాది మంది ప్రజలు, ఆకాశపు వివిధ దశలను చూస్తూ ఉంటారన్న ఆలోచన థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

అది నిజం కాకపోయినా, ఆ సమయంలో, నాకు ఆకాశం అందుకో తగ్గ ఒక గమ్యం అనిపిస్తుంది.

సంజయ్ కూడా గిటార్ వాయిస్తూ తన ఆలోచనల్లో తను మునిగి ఉన్నాడు. మా ఇద్దరి మధ్య ఎక్కువ మాటలు లేకపోయినా, ఒక అవ్యక్త స్నేహబంధంలోని అనుభూతిని ఇద్దరమూ అనుభవిస్తూ ఉంటాము.

రోజంతా షూటింగ్ చేసిన తర్వాత సంజయ్ చాలా సేపు మౌనంగా ఉంటాడు. ఆ మౌనంలో కూడా నేను పక్కనే ఉండాలని కోరుకుంటాడు. అందుకే, సంజయ్ మనస్తత్వమేమిటో, అప్పుడప్పుడు నాక్కూడా అర్థం కాదు.

అరగంట తర్వాత కింది నుండి అమ్మ భోజనానికి పిలవడంతో తను డైనింగ్ రూములోకి వెళ్ళగానే, నేను నా రూముకు బయల్దేరాను. సంజయ్, తన ఇంటికి దగ్గర్లోనే, నాకొక టూ బీహెచ్ కే ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు.

***

టాలీవుడ్ నివ్వెరపోయింది.

ఆ వార్త గుప్పుమనగానే, టాలీవుడ్ నిశ్చేష్టయై, స్తబ్దుగా, నిలబడిపోయింది.

షూటింగులన్నీ క్యాన్సిలయ్యాయి!

సుమారు లక్ష మంది పని చేసే తెలుగు సినిమా రంగం భయం గుప్పిట్లో చిక్కుకుంది.

***

నేను వేగంగా సంజయ్ ఇంటికి వెళ్తున్నాను.

ఒక లోకల్ టీవీ ఛానెల్లో ప్రసారమయిన వార్త కార్చిచ్చులా మిగిలిన మెయిన్ స్ట్రీమ్ టీవీలకు పాకి, కొన్ని రోజుల నుండి డల్లుగా ఉన్న టీవీలు కొత్త వార్త – అదీ మాస్ మసాలా వంటి టాలీవుడ్ వార్త – దొరకడంతో జూలు విదుల్చుకున్న సింహాల్లా ఛానెల్స్ రంగంలోకి దూకాయి. గడ్డకట్టే చలికాలంలో ముసుగుతన్ని పడుకున్న పాపులర్ యాంకర్లను, ప్రోగ్రాం ప్రొడ్యూసర్లను, అనలిస్టులను, గ్రాఫిక్ డిజైనర్లను, లోకల్ రిపోర్టర్లను, డ్రైవర్లను, నిద్రలో నుండి లేపి తరిమి తరిమి పనిలోకి దించడంతో, రిపోర్టర్లు, ఛానెళ్ళలో పనిచేసే నా మిత్రులైన వాళ్ళే ఫోన్లు చేస్తున్నట్టుంది. నేను ఇప్పుడే ఫోన్ ఎత్తదలుచుకోలేదు.

ఇంత వరకు తెలుగు సినిమా రంగంలో ఎప్పుడూ జరగని, కనీవిని ఎరగని అటువంటి సంఘటన జరిగింది మరి.

సంజయ్ శ్రీశైలం వెళ్ళిన రెండో రోజు ఉదయం నాలుగ్గంటలకే, నాకు మొదటి ఫోను రాగానే నేను దుఃఖ సాగరంలో మునిగిపోయాను. తక్షణ కర్తవ్యం గుర్తొచ్చి ఆఘమేఘాల మీద సంజయ్ ఇంటికి పరిగెత్తుతున్నాను కానీ నన్ను కూడా ఎవరైనా ఓదారిస్తే బాగుండుననే దీనావస్థలో కూడా ఉన్నాను.

నేను బైక్ మీద వస్తుండగానే నా ఫోన్ నిర్విరామంగా మోగసాగింది. వాట్సప్ మెసేజులు వస్తూనే ఉన్నాయి.

దూరం నుండే, దేదీప్యమానమైన లైట్లతో ధగద్ధగాయమానంగా, రాత్రిపువ్వులా వెలిగే సంజయ్ ఇల్లు, మిణుకుమిణుకుమంటూ వెలిగే ఒక చిన్న ట్యూబులైట్ వెలుతురులో, తను కూడా విషాదగీతం ఆలపిస్తున్నట్టుగా ఉంది.

అప్పటికే, ఇంటి సందు ముందరే పది పదిహేను మంది రిపోర్టర్లు, మైకులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ప్రధాన వీధి నిండా ఓబీ వ్యాన్లు ఉన్నాయి. ఇంటికి వంద గజాల దూరంలో బారికేడ్లు కట్టి పోలీసులు ప్రెస్ రిపోర్టర్లను, అతి కష్టం మీద నిలవరిస్తున్నారు.

నేను వాళ్ళను తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళడం అసాధ్యం కాబట్టి, పక్క సందులోనున్న వెనుక ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశించి, చకచకా సుధాకర్ నాయుడి గారి గదిలోకి వెళ్ళాను.

ఆయన మూర్తీభవించిన దుఃఖమూర్తిలా ఉన్నాడు. నన్ను చూడగానే, నన్ను పట్టుకుని భోరుమన్నాడు.

నేను అతన్ని ఓదారుస్తూనే చుట్టూ చూసాను. పక్క ఇంట్లోనే ఉంటూ, మాకు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ నిలబడి ఉన్నాడు. నేను నాయుడుగారిని పట్టుకునే, ‘ఎలా ఉంది?’ అని కళ్ళతోనే ప్రశ్నించాను. ఆయన ‘ఫర్వాలేదు, బీపీ, గుండె నార్మల్ గానే ఉన్నాయి.’ అన్నట్టుగా ఈసీజీ, బీపీ మిషిన్లు చూపిస్తూ చెప్పాడు.

నేను నాయుడుగారిని ఓదారుస్తూనే కుర్చీలో కూర్చోబెట్టి,

“అసలేమయింది అంకుల్?” అని ప్రశ్నించాను.

ఆయన చెప్పిన సమాధానం విని నా కళ్ళు, కన్నీటి చెలమలయ్యాయి.

నా ప్రియమిత్రుడు, బాంధవుడు, టాలీవుడ్ సెన్సేషన్, హీరో సంజయ్ రాత్రి, శ్రీశైలం అడవుల్లో కిడ్నాప్ అయ్యాడన్న వార్త వినగానే నా నవనాడులూ కృంగిపోయాయి. ఒక బ్లాంక్‌నెస్, ఒక నీరవ నిశ్శబ్దం నన్నావహించాయి.

***

‘సంజయ్ కిడ్నాప్!’

టాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ స్టార్, గత రెండేళ్ళలోనే మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సంజయ్, ఈ రోజున ‘టాక్ ఆఫ్ ది టౌన్’. ఎక్కడ చూసినా సంజయ్ పేరే వినబడేది. దానికి సంజయ్ తండ్రి సుధాకర్ నాయుడు గారు పెద్ద డిస్ట్రిబ్యూటర్ కావడం, ఈ మధ్యనే ‘దృశ్యం’ అనే ఒక ఓటీటీ ఛానెల్ ప్రారంభించడం వంటి కారణాలు కూడా సంజయిని నెంబర్ వన్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నిలిపాయి.

అందుకే, ‘సంజయ్ కిడ్నాప్’ వార్తతో టాలీవుడ్ నివ్వెరపోయింది.

ఈ వార్త ఇంకా ప్రజల్లోకి, అభిమానుల్లోకి పాకలేదు. కేవలం ఇండస్ట్రీ పెద్దలకు, టీవీ ఛానెళ్ళకు మాత్రమే తెలిసింది.

అప్పటికి ఇంకా ఉదయం ఐదు కూడా కాలేదు. హైదరాబాద్ నగరం మంచు దుప్పటి కప్పుకునే ఉంది. ఈశాన్య భారతం నుండి వీస్తున్న చలిగాలుల వల్ల ఎనిమిది తొమ్మిదింటి వరకు కూడా సూర్యుడు కనిపించడం లేదు.

నేను మొత్తం పరిస్థితిని ఆకళింపు చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్రైసిస్‌ను, ఈ క్లిష్ట పరిస్థితిని డీల్ చేయవలసింది నేనే.

ఏదైనా అనూహ్యా కారణాల వల్ల ఎదురయ్యే ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవాలని డిజాస్టర్ మేనేజిమెంటు విద్యార్థులకు నేర్పుతారు.

ఇది మా ఇంట గొప్ప డిజాస్టరే. మాకు వ్యక్తిగతంగానే కాకుండా టాలీవుడ్‌కి కూడా విషాదమే. ఇంత వరకు తెలుగు సినీరంగంలో జరగని సంఘటన. చాలా ఏళ్ళ క్రితం, కన్నడ సినిమా రంగంలో అగ్ర నటుడైన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన తర్వాత, భారతదేశంలోనే ఇటువంటి సంఘటన జరగలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here