మలిసంజ కెంజాయ! -8

7
12

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[ఆశ్రమంలో దుర్గమ్మ అక్కడి స్త్రీలకి తన కొడుకు కోడలి గురించి చెబుతుంది. వాళ్ళు దుర్గమ్మని, జానకమ్మతో పోల్చి, ఆమెలా ప్రశాంతంగా ఉండమంటారు. ఆశ్రమ వ్యవస్థాయకులు వెంకటేశ్వరరావు గారిని తలచుకుని అందరూ మౌనంగా ఉండిపోతారు. పార్వతమ్మ చిన్న కొడుకు రాజేష్ భార్య రాణితో వైజాగ్‍లో ఉంటాడు. రాణి, రాజేష్‌లు తమ కూతుర్ని మాజీ మంత్రి శేషాద్రి పెద్ద కొడుక్కిచ్చి పెళ్ళి చేస్తారు. బాగా ధనవంతులైనప్పటికీ, శేషాద్రి భార్య నిరాడంబరంగా ఉంటుంది. వియ్యపురాలి తీరు రాణికి నచ్చదు. కూతురు దగ్గర వాళ్ళ అత్తగారిని వెక్కిరిస్తూ ఉంటుంది. రాణి, రాజేష్‌ల కొడుకు సంతోష్ వైజాగ్‍లో లెక్చరర్‍గా పనిచేస్తాడు. కొడుకి పెళ్ళి చేస్తుంది రాణి. కొన్నాళ్ళకి సంతోష్ వేరు కాపురం పెడతాడు. రాణి కోడల్ని సతాయించడం చూసిన రాజేష్, తన కొడుకే తల్లిని దారిలో పెడతాడని ఊరుకుంటాడు. పార్వతమ్మని తమ ఇంటికి తీసుసువెళ్ళిన రాణి ఆవిడకి ఒక గది చూపించి అందులో ఉండమంటుంది. ఓ రోజు ఇంటి ముందు కారు వచ్చి ఆగితే, ఎవరో అనుకుంటూ వెళ్ళి గేటు తీస్తుంది వసంత. ఆ వచ్చింది భాస్కర్, భానక్క వాళ్ళ కొడుకు. పాత ఇల్లు తీసేసి కొత్తది కట్టామనీ, గృహప్రవేశానికి తప్పక రావాలిని ఆహ్వానించి వెళతాడు భాస్కర్. తమ ఊరిని, అక్కడి తమ ఇంటిని జ్ఞాపకం చేసుకుంటుంది వసంత. తనకిష్టం లేకపోయినా తమ్ముడు ఆ ఇల్లు అమ్మేయడం గుర్తొచ్చి బాధపడుతుంది. భానక్క గురించి తలచుకుని, ఆమెతో ఉన్న జ్ఞాపకాలని కలబోసుకుంటుంది వసంత. గృహప్రవేశం రోజున ఆటో మాట్లాడుకుని ఆ ఊరికి వెడుతుంది. ఇంటి ముందు ఆటో దిగుతుంది. ఇక చదవండి.]

[dropcap]షా[/dropcap]మియానాలోని కుర్చీల్లో చాలా మంది మగవాళ్ళున్నారు. ఎవరూ వసంతని గుర్తు పట్టలేదు. బహుశా అంతా బంధువులై ఉంటారు. ఈ ఊరివాళ్ళు కాదేమో అనుకుంటూ కొత్తింట్లోకి బెరుకుగా నడిచిందామె. ఎదురుగా ఉన్న పెద్ద హాల్ పక్కన ఉన్న పెద్ద దేవుడి గదివైపు నడిచింది. అప్పుడే సత్యనారాయణ వ్రతం పూర్తయినట్టుగా అక్కడున్న పూజాసామాగ్రి చెబుతోంది. దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసుకుని లేచి అక్కడున్న అక్షింతలు తలపై వేసుకుని దేవుడి పాదాల దగ్గరున్న పువ్వొకటి జాగ్రత్తగా తీసి, తలలో పెట్టుకుని గది బైటికి రాబోతూ గుమ్మం వైపు చూసిన వసంతకి ఎదురుగా నవ్వుతూ నిలబడుంది భానక్క.

“భానక్కా!” అంటూ ఆమెను వాటేసుకుంది వసంత. ఆమె వీపు నిమురుతూ “నువ్వొస్తావే! నాకు తెలుసు” అంది కన్నీళ్లు దాచుకుంటూ. “పద పద అంతా అక్కడున్నారు” అంటూ మరో పెద్ద హాల్ లోకి దారితీసింది భానక్క.

భానక్క నలుగురు కూతుళ్ళూ అక్కడున్న దివాన్ కాట్ మీదా, కుర్చీల్లోనూ అలిసినట్టు కూర్చున్నారు. వసంతను చూస్తూనే “పిన్నీ బావున్నారా?” అంటూ చుట్టూ మూగారు. “రిటైర్ అయ్యారంట కదా” అని ఒకరూ, “అలా లేరే” అని ఒకరూ, “అమ్మ ఫేవరేట్ చెల్లి” అంటూ ఒకరూ పలకరిస్తూ ఆమెను నాలుగు పక్కలనుంచీ దగ్గరగా వచ్చి చేతులు కలిపారు. “ఎంత అదృష్టం! మీరంతా కనబడ్డారు” అని వసంత సంబరపడిపోతూ వాళ్లందరినీ వరసగా కౌగలించుకుంది.

“పద, పద ముందు కాస్త కాఫీ తాగు ఎండన పడొచ్చావు” అంటూ వసంతను వెంటబెట్టుకుని వాకిట్లో వంటలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి కుర్చీ వేసి కాఫీ కలిపించి స్వయంగా తెచ్చి ఇచ్చింది భానక్క.

నవ్వుతూ “నువ్వు మారలేదక్కా!” అంటూ కాఫీ కప్ అందుకుంది వసంత.

ఆఫ్ వైట్ పట్టు చీరనిండా చిన్న చిన్న ఆకుపచ్చ పువ్వులున్న చీరలో భానక్క మహారాణీలాగే ఉంది. చిన్న నల్లబొట్టు వల్ల కాస్త చిన్నబోయి ఉన్నా, ఆ ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతూనే ఉంటుంది అనుకుంది ఆమెను చూస్తూ వసంత.

“ఏంటే కొత్తగా చూస్తున్నావ్” అంది భానక్క చిరునవ్వుతో.

“అయిదేళ్ల క్రితం చూడడమే నిన్ను. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను”

“నాకేమో నిన్ను చూడాలని ఉంటుంది. ఎవరు తీసుకొస్తారు నన్ను చెప్పు? భాస్కరేమో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. మనవడేమో కాకినాడ కాలేజీలో చదువుతున్నాడు. వాడు మాకే దొరకడు”

“అవున్లే అక్కా! నిజమే. నేను రిటైర్ అయ్యాను కానీ ఈయన ఒక బట్టల షాప్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తూనే ఉన్నారు. ఏదో ఆయన్ని పంపడం, తర్వాత పని చేసుకోవడం ఇదే సరిపోతోంది”

“అవునట విన్నాను. ఎలా ఉన్నాడు వెంకట్రావు? కష్టజీవి. నువ్వెక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వచ్చి అక్కడే ఉద్యోగం చూసుకుని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాడులే. నీ కూతురు అమలాపురంలోనే కదా! ఎలా ఉంది? వెళ్తూ ఉంటావా?”

“అత్తగారితోనే ఉంటుంది. ఎప్పుడైనా వెళతానంతే”

“మంచి పని. దాని కాపురం దానిది. మనకెందుకు ఊరికే అన్నిట్లోకీ దూరడం. మీ అబ్బాయి బెంగుళూరేమో కదా!”

“అవునక్కా! మీ అమ్మాయిలూ, మనవలూ అంతా బాగే కదా!”

“అంతా వాళ్ల కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అన్నీ సవరించానులే. వాళ్ల పిల్లలే పెళ్లిళ్లకొస్తున్నారు”

“బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్నావన్నమాట”

“అవునే! ఇంక పైకి వెళ్లిపోవచ్చు” అంది భానక్క.

“చాల్లే. పిచ్చి మాటలు” అంది వసంత. అలా ఓ పావుగంట అవీ ఇవీ మాట్లాడుకుంటూ ఉన్నారిద్దరూ. తర్వాత పెద్దమ్మాయి “అమ్మా! వడ్డించేస్తున్నారు. వసంత పిన్నిని తీసుకుని వచ్చెయ్యి” అంటూ వెళ్ళిపోయింది.

“పద వసంతా!” అంటూ లేచింది భానక్క.

భోజనాలు చాలా బాగా ఏర్పాటు చేసాడు భాస్కర్. ఎన్నెన్ని రకాలో! అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అంతా మెచ్చుకుంటున్నారు. తింటుంటే వసంత వయసు వాళ్ళూ, కాస్త పెద్ద వాళ్ళూ వసంతను గుర్తుపట్టి పలకరించారు. “మా ఇంటికి రాకుండా వెళ్ళకు” అన్నారు. “రేపొస్తాను అందరింటికీ” అంది వసంత ఆనందంగా.

భోజనాలయ్యాక ఇల్లంతా తిప్పిచూపించింది భానక్క వసంతకి. పైన రెండు పడక గదులూ, కింద పడక మూడు గదులూ, కిందా పైనా రెండేసి హాళ్ళూ కింద పెద్ద వంటగది, దేవుడి గది ఉన్నాయి.

“ఇల్లు భలే విశాలంగా, రిచ్‌గా కట్టాడు భాస్కర్!” అంది వసంత.

“వాడు ఎప్పటినుంచో బాగా కట్టుకోవాలని అనుకుంటూ ఇన్నాళ్ళకి కట్టుకున్నాడు” అంది భానక్క.

భోజనాలయ్యాక కూతుళ్ళూ, కోడలూ తలో చోటా కూర్చుండిపోయారు అలిసిపోయి. వసంతని ఓ పడక గదిలోకి తీసుకెళ్లింది భానక్క. అక్కడొక సింగల్ కాట్ మీద కూర్చుంటూ “నువ్వు కాసేపు పడుకోవే! ఆటోలో గతుకుల రోడ్ మీద వచ్చావు” అంది. “నువ్వు కూడా పడుకో” అంది వసంత. ఇద్దరూ పక్క పక్కనే నడుం వాల్చారు.

“అక్కా! నువ్వీ రూమ్ తీసేసుకోవే. పక్కనుండి కూడా తలుపుంది వాకిట్లోకి. అలమరాలు కూడా బావున్నాయి. బైటికేమీ కనబడకుండా వుడ్ వర్క్ బావుంది.” భానక్క మౌనంగా ఉండిపోయింది. ఆమెకి చిన్న కునుకు పట్టిందేమో అనుకుంది వసంత. కొన్ని క్షణాల తర్వాత భానక్క లేచి ఒక గోడ మొత్తం ఉన్న కబోర్డ్ తెరిచి అక్కడున్న చీరల కట్ట ఒకటి తీసి మంచంపై పెట్టింది. “గృహప్రవేశానికి వచ్చిన వాళ్లందరికీ పెట్టడానికి చీరలు తెప్పించాం. నీకు నచ్చిన రంగు ఏరుకో” అంది కట్ట విప్పుతూ.

“మీ కోడలు ఇస్తుందేమో ఇవ్వనీ! మనిద్దరమే ఉండి తీసుకుంటే బావుండదేమో అక్కా!” అంది వసంత భానక్క వైపు చూస్తూ .

ఆ మాట వింటూనే భానక్క మొహం చిన్నబోయింది. అది గమనించిన వసంత అర్థం కాక తెల్లబోయింది. “అంటే నువ్వు కూడా నాకీ ఇంట్లో హక్కు లేదని చెప్పేశావన్నమాట!” అంటుంటే భానక్క కళ్ళనుండి నీళ్లు జలజలా రాలాయి. వసంత గబుక్కున మంచం పైనుంచి లేచి భానక్కని పొదివి పట్టుకుంది.

“ఈ ఆస్తంతా నాదేనే! మా నాన్న నాకిచ్చింది” అంటుంటే ఆమెకి దుఃఖం పెల్లుబికింది. బాధతో వెక్కిళ్లు వచ్చాయామెకి. వసంతకి ఆమె మనసు అర్థం అయ్యింది.

“అయ్యో! అక్కా! నీదే మరి. నీది కాక ఇంకెవరిది? ఈ పిల్లలు కూడా నీ వాళ్లే. అలా పసిపిల్లలా ఏడవొచ్చా? కళ్ళ నీళ్లు పెట్టుకోవచ్చా? తప్పుకదూ! ఎంత రాజసంగా ఉండేదానివి? ఇలా బేలగా మారిపోయావేమిటి?” అంటూ దగ్గరికి తీసుకుని జుట్టు సవరించింది వసంత. కొంతసేపటికి తెప్పరిల్లింది భానక్క.

ఇంతలో అందరికీ వేడి వేడి మిర్చి బజ్జీలూ, స్వీట్లూ, గ్లాసుల్లో కూల్ డ్రింక్ లూ వచ్చాయి. “తీసుకో” అంది భానక్క. “నువ్వు కూడా” అంది వసంత. అందరూ తినడం మొదలుపెట్టారు.

“ఏర్పాట్లన్నీ భలే చేసేవక్కా!”

“మన సత్తెమ్మగారి కోడల్లేదూ! ఆ పిల్లే ఈ వంటలన్నీ. ఇద్దరు అసిస్టెంట్లని పెట్టుకుని ఇలాంటివన్నీ బ్రహ్మాండంగా చేస్తుంది. వేరే ఊళ్ళకి కూడా వెళుతుంది. నేను ముందుగానే చెప్పి పెట్టాను. అందుకే దొరికింది” అంది సంతృప్తిగా భానక్క.

“బావున్నాయి బజ్జీలు! గుడ్ గుడ్” అంది వసంత. మరో అరగంటలో అందరికీ టీలు వచ్చేసాయి. ఎండ తగ్గి కాస్త పొద్దు వాటారింది. సాయంత్రం నాలుగయింది. ఆడపిల్లలు నలుగురూ బయలుదేరిపోయారు.

“అదేంటర్రా! అప్పుడే వెళ్ళిపోతారా? నేనే రెండు రోజులుందామనొచ్చాను. మీరంతా ఓ నాలుగు రోజులు ఉండొచ్చుకదా!” అంది వసంత ఆశ్చర్యపోతూ.

“లేదు పిన్నీ! ఇల్లూ, పిల్లలూ కష్టం, మేం లేకుండా” అన్నారు వాళ్ళు.

“మీరుండేది?”

“ఇద్దరం హైదరాబాద్, ఇద్దరం విజయవాడ” అన్నారు వాళ్ళు నవ్వుతూ

భానక్క బిక్కమొహం వేసుకుని చూస్తుండగా బాగ్‌లు తెచ్చి రెడీ అయిపోయారు వాళ్ళు. భాస్కర్ భార్య వాళ్ళకి బొట్టుపెట్టి ఒకో చీర పెట్టి, ఒకో స్వీట్ బాక్స్ చేతిలో పెట్టింది.

నలుగురూ భానక్క కాళ్ళకి నమస్కరించారు.

ఇంతలో భాస్కర్ కారు తీసుకుని రాగా, అంతా అందులో ఎక్కి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నారు.

భానక్క దిగులుగా చూస్తూ ఉండిపోయింది వాళ్ళు వెళ్లిపోతుంటే, కన్నీళ్ళని ఆపుకుంటూ.

“ఎందుకక్కా! అంత దిగులు? నువ్వు వెళ్లి వాళ్ళ దగ్గర ఒకో నెల ఉంటూ ఉండు, అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది” అంది ఆమెను కూర్చోబెడుతూ.

“అలాగే తిరుగుతూనే ఉంటున్నానులే” అందామె కాస్త నవ్వు తెచ్చుకుంటూ. “అదీ అలా ఉండాలి మా భానక్క ఎప్పుడూ” అంది వసంత సంతృప్తిగా.

“అందరినీ బస్సులు ఎక్కించానమ్మా” అంటూ భాస్కర్ ఓ గంట తర్వాత వచ్చి చెప్పి కొంతసేపు వాళ్ళ దగ్గర కూర్చుని వెళ్ళాడు.

భానక్కా, వసంతా చాలా రాత్రయ్యే వరకూ ఊరిలో వారందరి విశేషాలూ మాట్లాడుకున్నారు. బోలెడు జోకులు వేసుకున్నారు. మర్నాడు ఉదయం వసంత బాగా ఎండెక్కి లేచేసరికి భానక్క పక్కన లేదు. మొహం కడుక్కుని రాగానే భాస్కర్ భార్య ఉమ “ఆంటీ” అంటూ టిఫిన్ ఇచ్చి ఆ తర్వాత కాఫీ తెచ్చిచ్చింది. “నిన్నంతా అలిసిపోయావు. థాంక్స్ అమ్మా” అంది వసంత కాఫీ కప్ అందుకుంటూ. తాగాక “మీ అత్తమ్మ ఏదీ?” అనడిగిన వసంతకు వంటశాల వైపు వేలు చూపించింది ఉమ.

‘ఫంక్షన్ ఐపోయింది కదా! ఇంకేమిటీ హడావిడి వంటశాలలో’ అనుకుంటూ అటువైపు దారి తీసింది వసంత.

వంటశాలను బాగా పెంచి కట్టారు. ఒక బెడ్ రూమ్, ఎటాచ్డ్ బాత్రూమూ, వంటగది నానుకుని డైనింగ్ హలూ, పూజ గది ఉన్నాయి. ఇక్కడో పోర్షన్ చేసినట్టున్నారు అనుకుంటూ పరిశీలనగా చూస్తుండగా భానక్క స్నానం చేసి వచ్చింది. “టిఫిన్ తిన్నావా? కాఫీ తాగావా?” అనడిగి “కూర్చో” అని భోజనాల టేబుల్ పక్కనున్న కుర్చీ లాగి వెళ్లి దేవుడికి దీపం పెట్టుకుని వచ్చి జుట్టు విప్పుకుని జడ వేసుకుంటూ పక్క కుర్చీలో కూర్చుంది.

“ఈ వంటిల్లుని పెద్దది చేశారే?” అంది వసంత ఆశ్చర్యపోతూ. భానక్క లేచి తలుపువేసి గొంతు తగ్గించి “అవును నాకోసమే. నేనిక్కడే ఉంటున్నా! ఇదే నా ప్యాలస్” అంది భానక్క నవ్వుతూ. వసంత అర్థం కానట్టు చూసింది.

“అర్థం కాలేదా? పిచ్చిమొహమా! నేను వేరే వండుకుంటున్నానే! మీ బావగారు పోయాక ఒక్క సంవత్సరమే వాళ్లతో ఉన్నాను”

“ఎందుకు? నీ కొడుకూ కోడలూ ఇద్దరేగా! పిల్లలిద్దరూ కాకినాడలో చదువుతున్నారంట కదా!”

“వాళ్ళకి అక్కడ భోజనం సరిగా కుదరట్లేదు. అందుకే మా అబ్బాయీ, కోడలూ అక్కడ మకాం పెట్టి పిల్లల్ని చదివించుకుంటున్నారు. అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటారు కానీ స్థిరంగా ఉండరు. అందుకే నేను వేరుగా ఉండక తప్పలేదు”

“ఇదెక్కడి అన్యాయం! వెళ్ళిపోయిన కొడుకు ఎలాగో వెళ్ళిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు దగ్గరా ఉండడానికి కుదరడం లేదు. చాలా బాధగా ఉందక్కా! ఇంత పెద్ద ఇంట్లో మహారాణీలా బతికిన దానివి”

“అయిపోయాయి, ఆ రోజులన్నీ ఆ మహారాజుతోనే వెళ్లిపోయాయి. కొన్ని కుటుంబాల్లో భర్త పోగానే భార్యల జీవితం అంధకార బంధురంగానే ఉంటుందేమో వసంతా!”

“నీ మనవల చదువు అయ్యాకా వాళ్ళు తిరిగొచ్చేస్తే నీకీ బాధ ఉండదులే అక్కా!”

“వాళ్ళ చదువులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళవి ఉంటాయి. ఈ లోగా ఓ ఏడెనిమిదేళ్లు గడుస్తాయి. ఈ లోగా దేవుడు మేలు చేస్తే నేనే వెళ్ళిపోతాను” అంది భానక్క నవ్వుతూ.

“ఇందుకన్నమాట? నీకీ విరక్తి మాటలు. ఐతే ఒక మాట గుర్తుంచుకో. తెలివైనవాళ్లు, పరిస్థితి ఎలా ఉన్నా ఆనందంగా ఉంటారంట. నువ్వు కూడా అలాగే ఉండు. వంటకి మనిషిని పెట్టుకో”

“ఒక్కదానికీ అవసరమంటావా? నేనే వండుకుంటాను”

“అప్పుడప్పుడూ గుడికి వెళ్ళు. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది”

“ఒక్కదాన్నీ ఎన్నడన్నా గుమ్మం దాటి ఎరుగుదునా వసంతా! నీకు తెలీదా!”

“నిజమే అనుకో!”

“ఏంటో! అంత పెద్ద మండువా లోగిల్లో మా అమ్మా, నాన్నా, మీ బావా. నేనూ పిల్లలతో, పాలేళ్ళతో ఎంత సందడిగా ఉండేదో! పిల్లల అల్లరీ, ఆటలూ. ఎంత పనైనా నవ్వుతూ చేసుకునేదాన్ని రోజంతా. పని వాళ్ళున్నా నా పని నాకుండేది”

“అవునవును. మేమొస్తే మాతో నవ్వుతూ కబుర్లు చెబుతూ ఉండేదానివి”

“అంచేత ఇవాళ నీ భోజనం నా ఇంట్లోనే. ఏం వండమంటావు?”

“నేనొండుతాను. ఒక పని చేద్దాం! నేను స్నానం చేసి వస్తాను. మనిద్దరం అలా ఊర్లోకి వెళ్ళొద్దాం!”

“నువ్వెళ్లు. నేనెందుకు?”

“ఇద్దరం వెళదాం” అంటూ వసంత బలవంతంగా భానక్కని తీసుకుని బాగా దగ్గర బంధువులయిన ఓ నలుగురింటికి తీసుకెళ్లింది. వాళ్ళు నిన్న భానక్క ఇంటికి వచ్చి ఆమెను రమ్మని పిలిచిన వాళ్ళు.

వాళ్లంతా వసంత వచ్చినందుకూ, భానక్కని తీసుకొచ్చినందుకూ ఎంతో ఆనందపడ్డారు.

“మంచి పని చేసావు. ఈవిడ ఇల్లు వదిలి ఎప్పుడూ రాదు” అంటూ అందరూ బోలెడు కబుర్లు చెప్పారు. వద్దన్నా వినకుండా ఇద్దరికీ ఒకరింట్లో భోజనం పెట్టిగానీ వదల్లేదు.

తిరిగి వస్తూ వసంత తండ్రి ఇంటివైపునుండి వచ్చారు. వసంత తల్లితండ్రుల పెద్ద పెంకుటిల్లు కూల్చేసి కాంక్రీట్ భవనం కట్టబడి ఉంది. అది చూసి అక్కడే ఆగిపోయి నిలబడిపోయింది వసంత, కళ్ళలో నీళ్ళు తిరగ్గా. అది చూసి భానక్క ఆమె భుజంపై చెయ్యివేసి “అంతే మరి. ఏం చేస్తాం” అంటూ నడిచింది. చూపు తిప్పకుండా ఆటే చూస్తున్న వసంత “అక్కా ఆ నీలం మావిడిచెట్టు అలాగే ఉంది చూడు, చూడు” అంది ఆనందంగా. “అవును దాన్ని కదపకుండా కట్టార్లే. బోలెడు కాపు కాస్తుందది మరి” అంది భానక్క.

అప్పటికి మధ్యాహ్నం దాటింది. ఇద్దరూ ఇంటికి వచ్చి ఒక గంట పడుకుని లేచారు.

ఇంతలో కోడలొచ్చి “అత్తయ్యా! ఇల్లంతా సర్దేసుకున్నాను. కాకినాడకి బయలుదేరుతున్నాం. వచ్చేవారం ఆఖరికి వస్తాము. వసంత అత్తయ్యకి చీర ఇదిగో” అంటూ బొట్టుపెట్టి వసంతకి ఇచ్చింది కోడలు ఉమ.

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న మనవరాలూ, ఇంటర్ చదువుతున్న మనవడూ ‘నాన్నమ్మా బై’ అంటూ వచ్చి ఆమెను వాటేసుకున్నారు. భానక్క కళ్లనీళ్లు పెట్టుకుంది. పిల్లలు వసంతకి కూడా చెప్పి బయలుదేరారు. వసంతా, భానక్కా వాళ్ళు నలుగురూ కారు ఎక్కేవరకూ నిలబడ్డారు వీధి గేట్‌లో. “జాగ్రత్త అత్తయ్యా ఇల్లు! వెనకవైపు మసలండి. గేట్ తియ్యకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త! పళ్ళు తెప్పించుకోండి! బద్ధకించకండి. పాలు తాగండి” అంటూ అప్పగింతలు పెట్టింది ప్రేమగా.

“పిన్నీ! చాలా థాంక్స్! వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం. రేపటినుంచీ పిల్లలకి పరీక్షలు అందుకే బయలుదేరాం” అంటూ చెప్పాడు భాస్కర్ బయలుదేరుతూ.

“అలాగే నాన్నా! నువ్వుకూడా ఉమని తీసుకుని ఒకసారి రా మా ఇంటికి” అంది వసంత. తలూపాడు భాస్కర్.

కారు వెళ్ళాక, వెనకున్న వంటశాల వైపు నడిచారిద్దరూ.

“అయితే ఒక్కదానివీ బిక్కు బిక్కుమంటూ ఉంటున్నావన్నమాట”అంది వసంత

“ఈ అమ్మాయి నాకు తోడుగా ఉంటుందిలే. మధ్యాన్నం ఒక్క గంట ఇంటికెళ్లి వస్తూ ఉంటుంది” అంది భానక్క పక్కనే ఉన్న పదహారేళ్ళ పిల్లని చూపిస్తూ.

లోపలికి రాగానే ఒక డబ్బా తీసి స్వీట్లూ, మరో డబ్బా తీసి హాటు ఒక ప్లేట్‌లో పెట్టి “తినవే! టీ పెట్టుకుందాం” అంటూ డైనింగ్ టేబుల్ ముంది కూర్చుంది భానక్క.

“ఎంతమంది ఉండే ఇల్లిది! ఆఖరికి అంతా నా కప్పజెప్పారు” అంది నవ్వు తెచ్చుకుంటూ భానక్క.

“పోనిద్దూ! నీ కాలక్షేపం నువ్వు చూసుకో. టీ.వీ. పెట్టుకో. నీకు నచ్చిన పుస్తకాలేమైనా చదువుకో! యోగా చేసుకో! అంతే తప్ప దిగులు పెట్టుకోకు. ఆనందంగా ఉండు.”

“ఆనందంగా ఉండకేం!” అంటూ “నువ్వెళ్ళి రావే! ఇంటికి ఓ గంట. టీ మేం పెట్టుకుంటాంలే” అంటూ ఆ పిల్లని పంపి మొదలు పెట్టింది భానక్క.

“నా కొడుక్కీ, కోడలికీ నా మీద పీకల వరకూ కోపం” అంది ఉపోద్ఘాతంగా.

స్వీట్ తింటున్న వసంత అవాక్కయ్యి చూసింది ఆమె వైపు.

అదీ సంగతి అన్నట్టు నవ్వి, “ఆడపిల్లలకి నేనూ, మీ బావగారూ ఆస్తులూ, బంగారాలూ ఇచ్చేసి ఇల్లంతా దోచిపెట్టేశామని మా మీద నింద” అంది భానక్క.

“అయ్యో! ఆడపిల్లలకైనా ఆస్తి మీద హక్కు వుంటుంది కదా!”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here